Thursday, 6 December 2018

అరటి ఆకులో భోజనం

                                                          ఇంతకు ముందు రోజుల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు తప్పనిసరిగా నదీస్నానానికి వెళ్ళి అటునుండి అటే శివాలయానికి వెళ్ళి వత్తులు వెలిగించుకుని శివదర్శనం అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి సాయంత్రం మరల స్నానం చేసి శుచిగా వంట చేసుకుని పూజానంతరం నక్షత్ర,చంద్ర దర్శనం చేసుకుని తర్వాత తప్పనిసరిగా అరటి ఆకులో భోజనం చేసేవారు.రోజువారీ తినే పళ్ళేలలో రకరకాల ఆహారపదార్ధాలు తింటూ ఉంటారు కనుక ఉపవాసం ఉన్నప్పుడు అరటి ఆకులో భోజనం చేయడం మంచిదని పెద్దలు చెప్పేవారు.మాములుగా కూడా అరటి ఆకులో భోజనం చేయడం వలన ఆహారపదార్ధాల వేడికి ఆకులోని ఔషధ గుణాలు పదార్ధాలలో కలిసి ఆహారం మరింత రుచిగా ఉండడమే కాక జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని,ఆకలి కూడా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతుంది.అంతేకాక ప్రేగులలో ఉన్న చెడు క్రిములు నశిస్తాయని తద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమని పెద్దల ఉవాచ.

Friday, 23 November 2018

కార్తీక పున్నమి

                                                                          ఏ పౌర్ణమి ప్రత్యేకత ఆ పౌర్ణమికే ఉన్నా అన్నింటిలో  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతే వేరు.తెల్లవారుఝామునే నిద్ర లేచి నదీస్నానానికి వెళ్లి అభిషేకాలు,పూజలు దానితోపాటు రోజంతా ఉపవాసం ఉండి నేతిబీరకాయ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని ఎలాగైనా సంపాదించి నేతి బీరకాయ పచ్చడి చేసి దానితోపాటు  రకరకాల వంటలు చేసుకుని చలిమిడి,వడపప్పు,జామ కాయలతో గుడికి వెళ్లి ఆవునేతితో 366 వత్తులు వెలిగించి మారేడు,ఉసిరి,జమ్మి వృక్షాలను పూజించి ఇంటికి వచ్చి తులసికోట వద్ద దీపాలు పెట్టడం,ప్రత్యేకంగా ఈరోజున చంద్రుడిని వరిపిండితో ముగ్గు రూపంలో వేసి పసుపు,కుంకుమ,గంధం,పూలు అలంకరించి దీపాలు  వెలిగించి వెండి గిన్నెలో పాయసం నివేదన పెట్టి పూజచేసే పద్ధతి,ఆ హడావిడి ఆ సంతోషం చెప్పనలవి కానిది.చంద్రుడు మంచి భర్తను మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు.అందుకే అందరూ నిండు మనసుతో,నిండు పున్నమిలో నిండుగా దీపాలు పెట్టి నిండు నూరేళ్ళు కార్తీక పున్నమి చంద్రుని దయవల్ల చల్లగా,ప్రశాంతంగా,సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు.

Wednesday, 21 November 2018

366 వత్తులు

                                                 పౌర్ణమి తిధి రెండు రోజులు రావడంతో 366 వత్తులు ఎప్పుడు వెలిగించాలి అనే సందిగ్ధత చాలామందిలో నెలకొంది.వత్తులు వెలిగించాలి అంటే ఉపవాసం ఉండి రాత్రి గల పౌర్ణమి అంటే గురువారం నాడు వెలిగించాలి.అభిషేకాలు చేయించుకోవాలి అంటే సూర్యోదయం పౌర్ణమి తిధి ఉన్నప్పుడు అంటే శుక్రవారం తెల్లవారుఝాము నుండి చేయించుకోవాలి అని పండితుల ఉవాచ.

Tuesday, 6 November 2018

దీపావళి శుభాకాంక్షలు

                                            నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు ఈ దీపావళి దివ్య కాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి దయవల్ల మీకు,మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, సిరిసంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.Tuesday, 30 October 2018

దొండ .....అండ

                                                           బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని,దొండకాయ తింటే మందబుద్ది వస్తుందని ఒకప్పుడు ప్రచారం జరిగింది.ఏ కూరగాయ అయినా దేనికుండే ప్రయోజనం దానికి వుంటుంది.దొండ రెండు రకాలు.ఒకటి చేదు,ఒకటి తియ్యనిది.చేదు దొండని కాకి దొండ అంటారు.కానీ దీని ఆకులు కామెర్ల వ్యాధి నివారణకు వాడతారు.తియ్య దొండ మనం కూరగాయగా వాడతాము.దొండకాయలోను,ఆకుల్లోను ఉన్న ఔషధ విలువలు తెలియక,వేపుడు చాలా సమయం పడుతుంది కనుక చాలామంది ఉపయోగించరు.పులుసు కూరల్లో ఇది చాలా బాగుంటుంది.దొండకాయలో పీచు ఎక్కువ.జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది.ఇనుము శాతము ఎక్కువ.దొండకాయలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు వల్ల నాడీ సంబంధ వ్యాధులు,మతిమరుపు,శ్వాసకోశ వ్యాధులు,క్యాన్సర్లు రావని నిపుణులు అంటున్నారు.రోజుకి ఒక పెద్ద చెంచా దొండకాయల రసాన్నితాగినట్లయితే  మధుమేహం అదుపులో ఉంటుందట.పచ్చి దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయట.దొండకాయలు ఎక్కువ తినేవాళ్లల్లో మూత్రపిండాల్లో  రాళ్ళు కూడా ఏర్పడవట.ఇన్ని ప్రయోజనాలున్న దొండ మన ఆరోగ్యానికి ఎంతో అండగా ఉంటుంది.కనుక మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Thursday, 25 October 2018

బద్దకంగా ....

                                                               పనీ పాటా లేకుండా బద్దకంగా పొద్దస్తమానము నిద్రపోయే వాళ్ళల్లోను,కాసేపటికొకసారి నిద్రపోతూ లేస్తూ ఉండే వాళ్ళల్లోను కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా మూడురెట్లు అధికంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.రాత్రివేళ ప్రశాంతంగా కంటి నిండా సరిపడా నిద్రపోయే వాళ్ళకి మతిమరుపు వచ్చే అవకాశం చాలా తక్కువని ఎన్నో ఏళ్ళు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.అందుకే సాధ్యమైనంత వరకు రాత్రిపూట ఎక్కువ సమయం మేలుకుని ఉండకుండా నిద్రపోవటం ఉత్తమం. 

Tuesday, 23 October 2018

పుట్ట మట్టితో.....

                                                       నాగుల చవితికో,సుబ్రమణ్య షష్టికో పుట్టలో పాలు పోసి పుట్ట మట్టిని చెవులకి,కళ్ళపైన రాసుకుంటారని తెలుసు కానీ తలకు కూడా రాసుకుంటారని ఇప్పుడే తెలిసి రక్షిత ఆశ్చర్యపోయింది రక్షిత. రజని,రక్షిత మంచి స్నేహితులే కాక ఇరుగు పొరుగు. పక్కపక్క ఇళ్ళల్లో ఉండడంతో పనులు త్వరగా పూర్తి చేసుకుని గంటల తరబడి లోకాభిరామాయణం చెప్పుకుంటారు.ఒకరోజు మాటల సందర్భంలో రజని వాళ్ళమ్మ పుట్టమట్టి తెచ్చి తలక పోసుకునేదని,అందుకే ఆమె జుట్టు తెల్లబడలేదని చెప్పింది.మా అమ్మకు  అరవై ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటికీ జుట్టు వత్తుగా నల్లగా నిగనిగ లాడుతుంది.మనకు ఇప్పటికే దాదాపు తలంతా తెల్ల వెంట్రుకలే కదా!అంది.ఆరోజుల్లో మా ఊరిలో ఎక్కువ మంది పుట్ట మట్టిలో సరిపడా నీళ్ళు కలిపి పలుచగా చేసి దానితో తల రుద్దుకునేవాళ్లట.అందుకే తెల్ల వెంట్రుకలు లేవని అమ్మ చెప్పింది అంది.