Saturday, 30 November 2013

నాటీ బాయ్

                                                            సంయుక్తవాళ్ళ బాబుపేరు  షానోజ్. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు.
 ఐదు నెలలకే అత్త,తాత అంటూ చిన్నచిన్నమాటలు చెప్పేవాడు.కూర్చోవటం వచ్చినప్పటినుండి అందరూ  భోజనం చేసేటప్పుడు బాబుని డైనింగ్ టేబుల్ మీదకూర్చోపెట్టి తినటం అలవాటు అవుతుందని ప్లేట్ లోకొంచెంపెట్టి ఇచ్చేవాళ్ళు.అన్నప్రాశన అయిన దగ్గరనుండి కూడా టొమాటోచారు కొత్తిమీరతో ఘుమఘుమలాడితేనే  తినేవాడు.నడకవచ్చిన దగ్గరనుండి కుర్చీలకు ఉన్ననట్టులు,బోల్టులు ఎక్కడ కనపడితే అక్కడ చేత్తోనే ఊడతీసి ఎక్కడో ఒకచోట పడేసేవాడు.సంయుక్తవాళ్ళు మొదటిఅంతస్తులో ఉండేవాళ్ళు.ఇంటితాళాలు  క్రింద మొక్కల్లో పైనుండి క్రిందికి పడేస్తుండేవాడు.ఒకసారి రెండురోజులు వెతుక్కుంటే కానీ ఆవిషయం   అర్ధంకాలేదు.ఒకరోజు సంయుక్త లోపలఉండగా మెట్లుదిగి రోడ్డుమీదకు వెళ్ళాడు.
                           బంగారు మొలత్రాడు, చేతులకు వత్తులు,గొలుసులు ఉండేవి.వాళ్ళఇంటికి రెండిళ్ళఅవతల వాళ్ళు ఎవరి బాబో నగలు ఉన్నాయి అని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేశారు.లేకపోతే మెయిన్ రోడ్ కు వెళ్ళిపోయేవాడు.ఎవరోఒకరు బాబును ఎత్తుకెళ్ళిపోయేవారు.ఎక్కడ పంపు కనిపిస్తే అక్కడ పంపు వదిలేసి నీళ్ళతో ఆటలాడి బట్టలు తడుపుకోనేవాడు.
                                   కొంచెం పెద్దయినతర్వాత  వేరేవాళ్ళఇంటికి వెళ్లి అల్లరి చేసి తిట్టించుకోవడం ఎందుకు?అదీకాక వాళ్ళకు ఇబ్బందికదా!అందరూ మనింట్లోనే ఆడుకోండి అని సంయుక్త చెప్పటంతో పొలోమంటూ ఆ వీధిలోఉన్నపిల్లలు,ప్రక్కవీధిలో పిల్లలు అందరూ వచ్చి ఆటలాడి బాగా అల్లరిచేసేవాళ్ళు.బాట్ తో ఆటలాడి పిల్లర్లు,పువ్వులకుండీలు అన్నిపగులకొట్టేవాళ్ళు.వాళ్ళనాన్న ఓపికగా మరల కట్టిస్తుండేవారు.అలాఏడోతరగతి వరకూ బాగా అల్లరి చేసేవాడు .తర్వాత కాస్త తగ్గింది.చిన్నప్పుడు పిల్లలు చేసిన అల్లరిపనులు పెద్దయిన తర్వాత
వాళ్ళకు,మనకు కూడా మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి.   

క్యూట్ గర్ల్

                                                                 సృజన వాళ్ళ పాప క్యూట్ గా ఉండేది.పాప పుట్టినప్పుడు సృజనకు సిజేరియన్ చేసారు.పాపను బయటకు తీయగానే డాక్టర్ సృజనా!పాపను చూడు చాలా బావుంది అని బుగ్గ మీద తట్టి చెప్పారు.పాప తెల్లగా నల్లటి జుట్టుతో బొద్దుగా,ముద్దుగా ఉంది.సృజన బావుంది అని తలాడించింది.సృజన వాళ్ళ అమ్మ,అమ్మమ్మ పాపను చాలా నీట్ గా రకరకాల గౌనులు వేసి,అందమైన పిల్లల దుప్పట్లు వేసి పడుకోపెట్టేవారు. రోజూ డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ముద్దుగా ఉన్న పాపను ఒకసారిఎత్తుకుని ఉయ్యాలలో పడుకోపెట్టేవారు.పాప పేరు రేష్మ అని పెట్టారు.సృజన అమ్మమ్మ మొదటి నెల దాటిన దగ్గర నుండే అత్త,తాత అని చెప్పటంతో పాటు ఎన్నో రకరకాల కబుర్లు చెపుతూ ఉండేది.ముందుగా పిల్లలు అమ్మ అనకూడదు అని అంటే అమ్మ దూరమవుతుందని పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు కాదు.అలా పాపకు పదేపదే చెప్పటం వలన ఐదు నెలలకే అత్త,తాత అనేది.అన్ని మాటలు త్వరగా వచ్చాయి.అమ్మమ్మ,తాతయ్య ,జేజమ్మ,తాతయ్య,మేనమామ,నాయనమ్మ,తాతయ్య ,మేనత్త,అందరూ క్రింద దించేవాళ్ళు కాదు.రేష్మ నాన్న అసలు క్రింద దించేవాళ్ళు కాదు.చిన్నప్పటి నుండి తనకు ఇష్టమయిన బట్టలు బూట్లు,చెప్పులు తనే సెలెక్ట్ చేసుకొనేది.రేష్మ అమ్మమ్మ పట్టులంగాలు ఎక్కువగా కుట్టిస్తుండేది.రేష్మకు చిన్నతనం నుండి పట్టుపరికిణీలు అంటే చాలాఇష్టం.రోజుకొకటి చొప్పున వేసుకుని తనకు ఇష్టమైన అరవంకీలు,పాపిట బిళ్ళ గాజులు,ఉంగరాలు,కాలికి బంగారు పట్టీలు అన్నీరోజు కొంచెంసేపు పెట్టేవరకు ఊరుకునేది కాదు.పప్పి,జిమ్మీఅనే కుక్కపిల్లలు వెంట తిరుగుతూ ఉండేవి.నాన్నరకరకాల బొమ్మలు తెచ్చిస్తే వాటితోను,కుక్కపిల్లలతోను హాయిగా ఆడుకొంటూ ఉండేది.

                                               


పింకీ సోనీ

                                                   సుష్మిత వాళ్ళింట్లో రెండు పమేరియన్ కుక్కపిల్లలు ఉండేవి.వాటిని పింకీ,సోనీ అనిపిలిచేవాళ్ళు.అవంటే వాళ్ళింట్లో అందరికీ చాలాఇష్టం.ముద్దుగా ఉండేవి.మొదట సుష్మిత తమ్ముడు శ్రీకర్ పింకీని తీసుకొచ్చాడు.కొన్నిరోజులకు పింకీకి సోనీ పుట్టింది.సోనీ పుట్టినప్పుడు సుష్మిత ఉదయం,సాయంత్రం పనివాళ్ళు ఉన్నాసరే తనే స్వయంగా తుడిచి తెల్లటి వస్త్రంపై పడుకోపెట్టేది.అలాకళ్ళుతెరిచేవరకు చేసేది.వాక్సిన్ వేయించటానికి శ్రీకర్ బుల్లి ప్లాస్టిక్ బుట్టలో పెట్టుకునివెళ్ళేవాడు.పింకీ అయితే ఎగిరి జంట మంచం పైకి  ఎక్కి సుష్మిత వాళ్ళ ప్రక్కన నిద్రపోయేది.సోనీ,పింకీ చుట్టుప్రక్కల వాళ్ళను గేటుదాటి లోపలకు రానిచ్చేవికాదు.కనీసం రోడ్డుమీద కూడా ఎవరినీ నడవనిచ్చేవి కాదు.బాగా అరుస్తుంటే అందరూ భయపడేవాళ్ళు.చాలా ప్రేమగా ఉండేవి.సుష్మితకు పాప పుడితే సోనీ ఎవరినీ దగ్గరకు రానీయకుండా బెడ్ దగ్గరేపడుకోనేది.ఒకసారి ప్రక్కింటావిడ పాపను చూడటానికి వచ్చింది.పాపను  చూద్దామని ముందుకు వంగింది.అంతే సోనీ ఒక్కసారి ఆవిడ మీదపడింది.ఆవిడ చాలా భయపడింది.అప్పటినుండి పాపనుఎత్తుకోవటానికి కూడా ఎవరూ సాహసించేవారుకాదు.పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత తన ప్రక్కన అటు పింకీ ఇటు సోని పడుకునేవి.ఎక్కడకువెళ్తే అక్కడకు పాప వెంటే వెళ్ళేవి.పాప కూడా పింకీ,సోనీ అంటూ వాటితో చక్కగా ఆడుకొనేది.ఇంతకీ పాప పేరు స్వీటీ అని చెప్పలేదు కదూ!స్వీటీ అని సుష్మిత పిలవగానే స్వీటీతోపాటు  ఒకవైపు  పింకీ మరోవైపు సోనీ ప్రేమగా,బాధ్యతాయుతంగా పాపకు రక్షణగా వస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది.


Friday, 29 November 2013

పంచారామక్షీత్రములు

             పంచారామములు అంటే అయిదుప్రశాంతతనుకలిగించే ఆలయములుఅని అర్ధం.అవి ఏమిటంటే
అమరారామం (అమరావతి),కుమారారామం(కోటిపల్లి),క్షీరారామం(పాలకొల్లు),భీమారామం(భీమవరం),
ద్రాక్షారామం(ద్రాక్షరం).
            అమరారామంలో అమరేశ్వరుడుగానూ,కుమారారామంలో కుమరేస్వరుడుగాను,క్షీరారామంలో
క్షీరారామేస్వరుడుగాను,భీమారామంలో భీమేస్వరునిగాను,మరియు ద్రాక్షారామంలో ద్రాక్షారామేశ్వర
స్వామిగాను శివుని రకరకాల పేర్లతో పిలుస్తారు.
           ఈఅయిదుక్షేత్రాలు తూర్పు,పశ్చిమగోదావరిజిల్లాలలోనూ,గుంటూరుజిల్లాలలో నెలకొనివున్నాయి.
కార్తీకమాసంలో ఈఐదింటిని ఒకేరోజులో చుట్టిరాగాలిగితే పంచారామయాత్ర సఫలీకృతం అవుతుంది.      

శీర్షాసనం వేసిన శివుడు

         యనమదుర్రుగ్రామం శివాలయంలో శివుడు శీర్షాసనంవేసినట్లుగాఉంటాడు.శివుడుశీర్షాసనంవేసి తపస్సు


చేసుకొంటూఉండగా సూర్యోదయం అయిపోయిందట.అందుకని స్వామిఅలా ఉండిపోయారని స్థానికుల కథనం.

స్వామి ఈ భంగిమలో ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.ఈగ్రామం పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం
 
దగ్గర ఉంది.కార్తీకమాసంలో స్వామిని దర్శించుకోవటం చాలా మంచిది.
  

తెల్లగా మారే శివలింగం

             పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం దగ్గర గునిపూడిలోసోమారామం సోమేశ్వరస్వామిఆలయంఉంది.
ఈక్షేత్రం పంచారామాలలో ఒకటి.ఈఆలయం ప్రత్యేకత ఏమిటంటే శివలింగం పౌర్ణమికి తెల్లగాను,అమావాస్యకు
నల్లగానూ మారుతుంది.అమ్మవారిని అన్నపూర్ణమాత అంటారు.
             కార్తీకమాసంలో ఈస్వామిని దర్శనం చేసుకోవటం చాలామంచిదనిచెపుతుంటారు.అలాగేదిరుసుమర్రు
అనేఊరిలోకూడాశివలింగం ఇలాగేరంగులు మారుతుంటుందిఅని అక్కడివాళ్లు చెపుతుంటారు.కార్తీకమాసంలో
పంచారామాలను ఒకేరోజు దర్శనం చేసుకోవటం మంచిదని,చాలా పుణ్యమని పెద్దల ఉవాచ. 

జాలీగా స్కూలుకు

               శ్రుతి ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది.ఆరు,ఏడు తరగతులు చదవాలంటే వేరే ఊరు
నడిచి వెళ్ళాల్సి వచ్చేది.ఒక పదిమంది పిల్లలు కలిసి వెళ్ళేవారు.దారిలో కబుర్లు చెప్పుకుంటూ,ఆడుకుంటూ
మధ్యమధ్యలో పరుగులు పెడుతూ వెళ్తూఉండేవారు.
                  దారిలో రకరకాల మొక్కలు,చెట్లు ఉండేవి.తంగేడుపువ్వులు కనిపించినప్పుడు పెట్టుకోకపోతే
మొక్కతిడుతుందని అందరూ అనేవారు.అందుకని ఆడపిల్లలు ఒకపువ్వు కోసి పెట్టుకోనేవాళ్ళు.జమ్మిచెట్టు
కనిపిస్తే ఆకుకోసి పుస్తకాలలోపెడితే టీచర్ తిట్టదని అందకపోయినా కష్టపడిమరీ కోసేవాళ్ళు.
                బలుసుకాయలు,బుడందోసకాయలు,చిన్నకామంచి,పెద్దకామంచి మొదలైన రకరకాలకాయలు
దొరికేవి.వాటికోసం అందరూ పరుగెత్తుకుంటూవెళ్లి ఎవరూ ముందువెళ్తే వాళ్ళు గొప్పగా ఫీలయ్యేవాళ్ళు.వాళ్ళే
కోసి కొన్నితీసుకుని మిగిలినవి అందరికీ ఇచ్చేవారు.అవి తినటానికి బావుండేవి.
                కొంచెం ముందుకు వెళ్తే పంటపొలాలు వచ్చేవి.ఒకఅమ్మాయి బెండకాయలు కోసుకుని తినేది.
కొంతదూరం వెళ్లినతర్వాత తుమ్మచెట్లు వచ్చేవి.తుమ్మలలో ఏదో వుందని భయపెట్టేవాళ్ళు.అందరూ కలిసి
ఒకటే పరుగు.తర్వాత పెద్ద చెరువు వచ్చేది.వర్షాకాలంలో రోడ్డుమీదకు నీళ్ళు వచ్చేవి.ఆనీళ్ళల్లోఆడుకుంటూ
జాలీగా స్కూలుకు వెళ్ళేవాళ్ళు.
               వచ్చేటప్పుడు చెరువులోచేపపిల్లలు ఉండేవి.వాటికి ఏదయినా వేస్తేఅన్నీ ఒక్కచోటకు వచ్చేవి.
వాటితో కాసేపు ఆడుకోనేవాళ్ళు.చెరువులో తామరపువ్వులు ఉండేవి.తామరపువ్వులంటే శ్రుతికి చాలా ఇష్టం.
అందరికన్నా శ్రుతి చిన్నపిల్ల.అందుకని ఏదయినా అడగగానే చేసేవాళ్ళు.శ్రుతికి వరుసకు అన్నయ్య చెరువులో
దిగి కోసిచ్చేవాడు.తుమ్మలదగ్గరకు రాగానే ఒకటే పరుగు.చెరకుతోట దగ్గరకు రాగానే మగపిల్లలు చెరుకులుతీసి
ఇచ్చేవాళ్ళు.అందరూ తినేవాళ్ళు.కందితోట దగ్గరకు రాగానేకందికాయలు కోసుకుని తినేవాళ్ళు.అలా ఆడుకుంటూ
సాయంత్రం ఇంటికి వెళ్ళేవాళ్ళు.Tuesday, 26 November 2013

పిచ్చుక గూడు

             సౌజన్య ,ధాత్రి ,సుధీర కాలేజీలోఉండగా మంచి ఫ్రెండ్స్.చాలా సరదాగా అందరితో స్నేహంగా ఉండేవారు.
కాలేజిలో క్లాసులు లేనప్పుడు గ్రౌండ్ లో కొబ్బరిచెట్ల క్రింద కూర్చుని నిక్నేమ్స్ పెడుతూ కామెంట్స్ చేస్తూ ఉండేవారు.వాళ్లక్లాస్ లో ఒక అమ్మాయికి గిరజాలజుట్టు పొట్టిగా గుబురులాగా ఉండేది.అందుకని ఆ అమ్మాయిని
''పిచ్చుక గూడు "అని పిలిచేవాళ్ళు.చివరికి ఆ అమ్మాయి అసలుపేరు కూడా మర్చిపోయారు.
             పొట్టిగా బొద్దుగా ఉంటే గుమ్మడికాయఅని,పొడవుగా సన్నగా ఉంటే వాసం అంటే పొడవుకర్ర అని అర్ధం
అమాయకంగా ఉంటే పిస్క్వేర్  అంటే పిచ్చిపిల్ల అనిపిలిచేవాళ్ళు.అలా రకరకాల పేర్లు పెట్టి సరదాగా అల్లరి చేస్తుండేవాళ్ళు.అలా అని చదువుని అశ్రద్ధ చేసేవారు కాదు.కాలేజీ లైఫ్ అన్న తర్వాత చిన్నచిన్నచిలిపిపనులు
చేస్తుంటే సరదాగా ఉంటుంది.వాళ్ళను ఎవరినీ ఏడిపించేవారు కాదు.వీళ్ళు ముగ్గురూ మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు.
          ఎవరినీ హర్ట్ చేయకుండా  అల్లరి శ్రుతి మించకుండా ఉన్నంతవరకు మనకు అందరికీ మంచిదని
నా మనవి. 

సుందరాంగి

            సంజన ఇంటి ప్రక్కన ఒక భార్యాభర్తలు ఉంటారు.వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు.మంచివాళ్ళే ఎదుటి
వారికి అవసరమయితే సహాయం చేస్తారు.వాళ్ళ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.అది ఎలా అంటే భార్య ఎవరితో
అయినా మాట్లాడుతుంటే హాయ్ అంటూ చేతులు ఊపుతూ వచ్చేస్తాడు.చిన్నపిల్లలకు చెప్పినా అదొకరకం.అది ఎదుటివారికి ఇబ్బంది అని ఆలోచించడు.అలా చెయ్యటం వాళ్ళావిడకు కూడా ఇష్టం ఉండదు.ఆవిడే చెప్పుకోవాలి.
అలా ఆడవాళ్లు మాట్లాడుకొంటూ వుండగా రావటం పద్దతిగా ఉండదు కనుక రావద్దు అని చెప్పాలి.
           వాళ్లపిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు.వాళ్ళు విదేశాలకు వెళ్లి వచ్చినరోజు ఉదయమే సంజనను పిలిచి మీ
సుందరాంగిని చూశానుఅని చెప్పాడు.సంజన అయోమయంగా చూసి అంటే ఎవరు అని అడిగింది.మీ పనిమనిషి
అని చెప్పాడు.వాళ్ళు సంజనవాళ్ళ ప్రక్కింటి పనిమనిషిని మాట్లాడుకున్నారు.
          వాళ్ళావిడ ఊరు వెళ్ళినప్పుడు రొజూ  సంజన ఏ పనిలోవున్నాసరే పిలిచిమరీ మాసుందరాంగి  వచ్చినదేమో
కనుక్కోండి అనేవాడు.సంజన ప్రక్కనవాళ్ళను పిలిచిమరీ అడిగి మళ్ళీ ఆయనకు చెప్పాలన్నమాట.సంజన ఇబ్బందిపడి ప్రక్కనవాళ్ళను ఇబ్బందిపెట్టి అడగటం అంత అవసరమా?అది ఎంతవరకూ సమంజసం?
         ఉదయం అందరూ హడావిడిగా ఉంటారు.ఆయనకు పనిలేదని అందరినీ ఇబ్బందిపెట్టటం పద్ధతేనా?
ఆడవాళ్లయినా మగవాళ్లయినాఎదుటివారు బిజీగా ఉన్నప్పుడు పిలిచిమరీ చిన్నచిన్న విషయాలకు ఇబ్బందికి
గురిచేయటం సరికాదు కదా.ఆలోచిస్తే అలా చేయరుకాని కాలక్షేపానికి కూడా కొంతమంది చేస్తారు.ఇది చదివిన
తర్వాత కొంతమందిలో అయినా మార్పు వస్తే బావుంటుందని నా ఆశ.

                       
     
                                         
 

నారదమ్మ

       శ్యామల వాళ్ళ బంధువులలో ఒక పెద్దావిడ ఉండేది.ఆవిడ ఉన్నవి లేనివి ఒకళ్ళమీద ఒకళ్ళకి చెప్తుండేది.
ఆవిడకు ఆరుగురు పిల్లలు.అందుకని ఎప్పుడూవాళ్ళ కోసం పిండివంటలు చేసేది.వాళ్ళు ఎప్పుడూఏదో ఒకటి
పెట్టమని అడిగేవాళ్ళు.పిండివంటలు వండటం అంటే ఇద్ధరోముగ్గురో ఉండాలికదా.
          అలా వాళ్ళతో చాకిరి చేయించుకుంటూ వాళ్లకాలక్షేపం కోసం ఎవరో ఒకరి గురించి చెప్తుండేది.ఒకసారి ఆ
సమయంలో శ్యామల వెళ్ళింది.సరిగ్గా ఆ సమయంలో శ్యామల వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతుంది.
శ్యామల చిన్నపిల్లే అయినా కానీ ఇంటికివచ్చి అన్నీ ఇంట్లో చెప్పేసింది.అలా రెండుమూడు సార్లు జరిగింది.
ఈ విషయం పెద్దావిడకు అర్థమయింది.ఇక అప్పటినుండి శ్యామల వచ్చిందంటే భయం.చెప్పేదికూడా ఆపేస్తుంది.
ఎక్కడ ఇంటికి వెళ్లి చేప్తుందోనని.ముసలితనం వచ్చింది అయినా ఆవిడమాత్రం మారలేదు.అందుకని తనను  "నారదమ్మ"అంటారు. అంటే తగువులు పెడుతుందని శ్యామల ఆ పేరు పెట్టింది.
          నారదుడు లోకకల్యాణం కోసం తగువులు పెడితే ఈవిడ కాలక్షేపం కోసం లేనిపోయినవి సృష్టిస్తుంది.
అందుకని నారదమ్మ అయింది. 

కోటి దీపోత్సవం

         శ్రేష్ట వాళ్ళఊరిలో  ఒక శివాలయం ఉంది.ఆ శివాలయంలో 28సంవత్సరాల క్రితమే లక్ష దీపాలు వెలిగించారు.
అప్పటినుండి దాదాపుగా ప్రతిసంవత్సరము లక్షదీపోత్సవం చేస్తారు.ఆ ఊరివాళ్ళు కానీ ప్రక్కఊరివాళ్ళుకానీ ఎవరో
ఒకళ్ళు కార్తీకమాసంలో వెలిగిస్తారు.ఈసారి కోటి దీపాలు వెలిగించారు.
        అంతకుముందు365వత్తులు ఒక్కొక్కదానిలో వేసి వెలిగించేవారు.ఇప్పుడు పెద్దప్రమిదలలోలక్ష చొప్పున
వెలిగిస్తున్నారు.ఊరిలో ఒకతనికి బొమ్మలువేయటం వచ్చు.అతను గుడిలో బయట ధ్వజస్తంభం ప్రక్కన గుడిచుట్టు ప్రక్కల శివలింగం,ఓంకారము రకరకాల బొమ్మలు వేశాడు.ఆ ఆకారాలలో దీపాలు వెలిగించారు.చూడటానికి కన్నులపండుగగా ఉంది. 

Monday, 25 November 2013

ముడి వేయటం -ముడి తీయటం

                చేతన వాళ్ళ ఊరిలో రామకృష్ణ అని ఒకతను ఉండేవాడు.అతను అందరితో ఏమి  చెప్పేవాడంటే
తెల్లవారితే లేచిన దగ్గరనుండి నా పని ఏమిటంటే ఇద్దరికి ముడి వేయటం అంటే తగువు పెట్టటం ఇద్దరికి 
వేసిన ముడి తీయటం అంటే ఇద్దరి మధ్య పెట్టిన తగువు తీర్చటం అని అర్ధం.ఇలాగే డబ్భు సంపాదించేవాడు.

               తన స్వార్ధం ఎంత మంచి స్నేహితులమధ్య అయినా బంధువులమధ్య అయినా తగువు పెట్టేవాడు.
అతని సంగతి తెలిసి కూడా మాటల మాయాజాలంలోపడిపోయేవారు.అలా సంపాదించిన డబ్బుతో కుటుంబం
సంతోషంగా ఉంటుందని అనుకొనేవాడు.కానీ అలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి సంపాదించటం వలన డబ్బు
వచ్చినా కూడా సుఖపదలేరు కనుక వాళ్ళ కుటుంబంలో ప్రశాంతత లేదు.అయినా అతనికి అర్ధం కాదు.చేసే
పనులు మానడు.అతను బాధ పడుతున్నాడు అయినా ఎదుటివాళ్ళదగ్గర ప్రేమగా నాన్నా,నాన్నాఅంటూ
డబ్బు తీసుకునే వరకూ నటిస్తాడు .
              డబ్బు ఇచ్చేవాళ్ళు ఆ మాయాజాలంలో పడి ఇస్తారు.అతను ఎంత వినొద్దు అనుకున్న వాళ్ళనయినా
తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.ఎంతోమందిని నష్టపెట్టాడు.వీళ్ళు ఎప్పుడు మారతారో అతను ఎప్పుడు
మారతాడో వేచి చూడాలి.ఇలాటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.Sunday, 24 November 2013

ఊర్వశి

        శర్వాణి చాలా అందంగా ఉండేది.వాళ్ళ ఇంటి ప్రక్కన నందిని అని బంధువులు ఉండేవారు.ఆమె చాలా నల్లగా ఉండేది.పోలికలు బానే ఉండేవి .కళ్ళు మాత్రమే తెల్లగా ఉండేవి .తల్లిదండ్రులను పోలి పిల్లలు ఉంటారు.దేముడు
ఇచ్చిన రూపాన్ని ఎవరూ ఏమీ  చేయలేరు.ఈ రోజులలో అంటే ప్లాస్టిక్ స ర్జరీలతో  రూపాన్ని   మార్చేస్తున్నారు.
          అందరితో తెల్లగా ఉంటే సరిపోయిందా నల్లగా ఉన్నాపోలికలు బాగా ఉన్న వాళ్ళే అందగత్తెలు అని చెప్పేది.నేనే అందగత్తెను అని ఆమె మా అమ్మాయి అందంగా ఉంటుందని వాళ్ళ నాన్న మాట్లాడేవారు .వాళ్ళ ఆయన కూడా వాళ్ళు  బావుండలేదు వీళ్ళు బావుండలేదని అందరినీ  విమర్శించేవాడు .
           అందుకని ఆమెను అందరూ ఊర్వశి అంత అందగత్తె లాగావాళ్ళు  ఊహించు కుంటున్నారని " ఊర్వశి"
అని పిలిచేవాళ్ళు.ఇంతకీ ఎవరూ ఆమెను విమర్శించక పోయినా చిన్న పిల్లల దగ్గరకు ఎత్తుకుంటానికి వెళ్తే
మాత్రం పిల్లలు పెద్దగా ఏడ్చేవాళ్ళు. ఫై గా పిల్లల ధగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు పెద్దగా చేసి భయపెట్టేది.
శర్వాణి కూతురు దగ్గరకు వెళ్లి కూడా అలాగే చూస్తే ఆ పాప భయపడి ఏడ్చింది .కొంచెం పెద్ద అయ్యే వరకూ 
కూడా అలాగే ఏడ్చేది.

           Saturday, 23 November 2013

చిట్టి చిట్కాలు


1)మందార నూనె తలకు రాస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది .
 2)   కొంచెం కుంకుడు కాయలు కొట్టకుండా ఉడికించి దానిలో కొంచెం  మందార ఆకులు వేసి చిక్కగా రసం తీసి
తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా వత్తుగా పెరుగుతుంది.
3)ఒక రేఖ వున్న ఎర్ర మందార పువ్వుతో తల మీద వెంట్రుకలు లేని చోట రుద్దితే వెంట్రుకలు వస్తాయి.
4)మెంతులు రాత్రిపూట నానపెట్టి ఉదయం మెత్తగా మిక్సీ లో వేసి రుబ్బి తలకు పట్టించి అరగంట తర్వాత
  తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
5)అలోవేరా జెల్ తినగలిగితే నున్నగా ఉంటారు.తెల్లగా ఉన్నవాళ్ళయితే ఇంకా చాలా బావుంటారు.
6)ఎక్కడయినా కట్ అయితే అక్కడ అలోవేరా జెల్ పెట్టి రుద్దితే రక్తం రావటం ఆగిపోతుంది.ఇది అందరి ఇళ్ళల్లో
ఉండదగిన మొక్క .
7)మిరియాలపొడి కొంచెం పాలల్లో వేసుకుని తాగితే జలుబు చేసినప్పుడు తగ్గిపోతుంది .
8)తులసిఆకులు రోజు తొమ్మిది తింటే బి.పి.కంట్రోల్ లో ఉంటుంది.
9)భోజనం చేసిన తర్వాత గ్రీన్ టీ ఒక పెద్ద కప్ త్రాగినట్లయితే బరువు తగ్గుతారు .
10)పుదీనా ఆకులు పేస్ట్ లాగాచేసి మొటిమలు వున్నా చోట రాస్తే తగ్గుతాయి .

శ్వేత గులాబీ

              శ్వేత చిన్నప్పుడు  చాలా అందంగా ఉండేది .పట్టుకుంటే మాసిపోయేటట్లుగా ఉండేది.అందుకే వాళ్ళ
అమ్మమ్మ గ్లాస్కో క్లాత్ తో పోల్చేది .గ్లాస్కో క్లాత్ అంటే ఒకప్పుడు బాగా ఇష్టపడేవారు .నల్లటి వత్తయిన జుట్టు
తెల్లగా హుషారుగా ఉండడం వలన అందరూ ఎత్తుకోవటానికి పోటీ పడేవారు .
            వాళ్ళ అమ్మ అయితే అమూల్ బేబీ లాగా ఉండేదానివి అనేది .ఎందుకంటే అమూల్ పాలతో ముద్దుగా
బొద్దుగా అందంగా ఉండేదని అలా అనేది .కొంచెం పెద్దయిన తర్వాత అంటే సంవత్సరం దాటినడక వచ్చేటప్పటికి
లల్లీ -పప్పీ క్రాఫ్  వేసేది .వాళ్ళ అమ్మే స్వయంగా అందంగా కట్ చేసేది .
          శ్వేతకు వాళ్ళ ప్రక్క ఇంటి అమ్మాయి అపర్ణకు ఒక మాస్టర్ ని పెట్టి ఇంట్లోనే చదివించేవారు.ఇద్దరూ కూడా
బాగా చదవటం వలన ఒక సంవత్సరంలోనే రెండు తరగతులలో  నేర్చుకునే అంత నేర్చుకున్నారు .మాస్టారు
కూడా అలాగే పిల్లలు బాగా చదువుతున్నారని అన్నీ చక్కగా నేర్పించారు .
         అలా మూడవ తరగతిలో స్కూల్లో చేర్చారు .తొమ్మిదో సంవత్సరానికి ఆరవ తరగతికి వచ్చేసింది .
పదమూడుకి టెన్త్ అయిపోయింది .పద్దెనిమిది వచ్చేటప్పటికి డిగ్రీ అయిపోయింది .ఈలోపు పెద్దగా వత్తుగా
ఉండటం వలన వాళ్ళ అమ్మకు స్కూల్ కి రెండు జడలు ,కాలేజి కి ఒక జడ వేయటానికి చాలా టైం పట్టేది.
         తెల్ల గులాబీ పువ్వంటే శ్వేతకు బాగా ఇష్టం. అందుకని ఫ్రెండ్స్ శ్వేతగులాబీ అని పిలిచేవారు .

Thursday, 21 November 2013

ఆడండి -ఆకలి తీర్చండి

                    మీ ఖాళీ సమయాలలో ఆన్ లైన్లో ఒక్క పది నిమిషాలు నేను చెప్పేదాని కోసం కేటాయించండి .
అది ఏమిటంటే ఒక ఆన్ లైన్ గేమ్.దీన్ని ఆడితే  మీకు పిల్లలకు కూడా మంచి కాలక్షే పము మరియు
ఆకలితో ఉన్నవాళ్ళకు ఆహారం పెట్టినట్లుగానూ ఉంటుంది.
                అదెలాగంటే www.free rice.com కు వెళ్ళండి .అక్కడ ఒక ఇంగ్లీష్ పదము ఇస్తాడు .క్రింద 4 ఇంగ్లీష్
పదాలు ఇస్తాడు .వాటిలో మనకు కరెక్ట్ అనిపించిన పదాన్ని ప్రక్కన వున్న సర్కిల్లో క్లిక్ చేయాలి .అది కరెక్ట్
అయితే 10 బియ్యపు గింజలు ఇస్తాడు .అలా మనకు వీలయినంత సమయము చేయవచ్చు.ఒకవేళ తప్పు
అయితే కొంచెముసేపు తర్వాత మళ్ళీ వస్తుంది .
                  దీని వలన మనము ఆకలి తీర్చిన వాళ్లము అవుతాము .కొత్త కొత్తవి నేర్చుకున్న వాళ్లము అవుతాము.మనము చేసేదాన్ని బట్టి మన లెవెల్ పెంచుకోవచ్చు .ఒకవేళ మనకు కొత్త పదము లాగా
అనిపిస్తే ఎలా పలకాలో కూడాప్రక్కన నొక్కితే వస్తుంది.మనము ఇలాచేసేదంతా కూడాWFP ద్వారా
అంటే ప్రపంచ ఆహార పధకం ద్వారావాళ్లకు ఇస్తారు .
                 దీని కోసం మనం ఏమీ ఖర్చు పెట్టనక్కరలేదు .కొంచెము సమయము కేటాయిస్తే సరిపోతుంది.
మరీ చేస్తారు కదా .ప్రయత్నించండి. 

శివాలయం

                 అమ్మమ్మ వాళ్ళ వీధి చివర ఒక పెద్ద శివాలయం ఉండేది .వినాయకుడు ,శివుడు ,పార్వతీదేవి
     విగ్రహములు ఉండేవి .ఒక ప్రక్కన నాగేంద్రుని పుట్ట ఉండేవి.పుట్టలో పాలు పోసి ఆడపిల్లలకు చెవులకు
      పోగులు   కుట్టిచ్చేవారు .

                  ఇప్పుడు ఆంజనేయస్వామి ,నాగేంద్రస్వామి నవగ్రహ మండపము కట్టారు .చాలా ప్రశాంతముగా
     ఉంటుంది .అక్కడ పూజారి గారు కూడా చాలా బాగా   పూజ చేస్తారు .పూజారి గారి భార్య కూడా చాలా
     బాగా వండి నివేదనలు పెట్టడానికి ఇచ్చేవారు.మా ఇంటి ప్రక్కనే ఉండేవారు.
                   నవరాత్రులప్పుడు ఏ రోజు ఏ నివేదన పెట్టాలో వాళ్ళు చెప్పేవారు.ఎవరు ఏ రోజు చేయించుకోవాలి
      అనుకుంటే ఆ రోజు అన్నీ పంపిస్తే బాగా చేసేవారు.అమ్మవారికి చీర జాకెట్టు ముక్క ఇస్తే చక్కగా కట్టి
    అలంకరించేవారు .మేము వెళ్ళి అక్కడ కూర్చుని పూజ చే పించుకునేవారము.
               
                   ఇంతకీ ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే  రాత్రిపూట నాగేంద్రస్వామి శివలింగానికి చుట్టుకుని ఉండటం.
దేవతా  సర్పమని మంచి సువాసన వస్తూ ఉండేదని పూజరిగారికి కనిపించేదని చెప్పేవారు .అందుకనే రాత్రి
గుడికి  వెళ్ళాలంటే గంట మ్రోగించి మరీ లోపలకు వెళ్ళేవారు.

           ఎవరయినా ఈ గుడికి వెళ్ళి ఏదయినా మొక్కుకుంటే ఆ పని తప్పకుండా పూర్తి అవుతుంది.ఇది మా
అందరి నమ్మకము .నిజము .ఈ గుడి విజయవాడకు 10-12 కి .మీ దూరంలోఉంటుంది.

   

Wednesday, 20 November 2013

సుడిగుండం

               నాకు ఐదు సంవత్సరములు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు  వెళ్ళాము. చాలా అందమైన ఊరు .
అమ్మమ్మ వాళ్ళ రోడ్డులో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ప్రక్కన వాళ్ళ అమ్మ ,నాన్న ఉండేవారు. కొంచెం అవతల అన్నయ్య ,తమ్ముడు వాళ్ళ ఇళ్ళు ఉండేవి .ఇరుగు పొరుగూ అందరూ కూడా చుట్టాలే .చాలా సరదాగా సందడిగా
ఉండేవారు.
               ఊరికి ఇంకొక ప్రక్కన అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉంది .వాళ్ళ ఇంటి వెనుక చిన్న కట్ట ఉంది
.దాని ప్రక్కన ఒక కాలువ ఉంటుంది .అప్పట్లో బల్లకట్టు ఎక్కి ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వెళ్ళేవాళ్ళం.కాలువ
దాటగానే పెద్ద కట్ట ఉంది.పెద్ద కట్ట నుండి క్రిందకు దిగి కొంత దూరం పొలాలు ఉండేవి .అవి దాటిన తర్వాత
కొంతదూరం ఇసుకలో నడిచి వెళ్తే కృష్ణానది వస్తుంది .
              ఏటికి స్నానానికి వెళ్తున్నాం అనేవాళ్ళం. ఆ రోజు రధసప్తమి .ఊరిలో అందరూ చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళతో సహా చాలా మంది వెళ్ళాము .అప్పట్లో మగవాళ్ళు కూడా కొంతమంది రక్షణగా వెళ్ళేవాళ్ళు .ఏటిలో దిగి సూర్యునికి
నమస్కరించి ఆడవాళ్లు పసుపు సూత్రానికి మొహానికి రాసుకుని మూడుసార్లునీళ్ళల్లో మునిగి తర్వాత ఈత
వచ్చినవాళ్లు ఈత కొట్టేవాళ్ళు.
                తర్వాత ఒడ్డుకి వచ్చి ఇసుకతో గౌరీ దేవిని చేసి బియ్యపు పిండి,పసుపు ,కుంకుమ ,పువ్వులు పెట్టి
 సాంబ్రాణి కడ్డిలు వెలిగించి అరటి పళ్ళు నివేదన పెట్టి హారతి వెలిగించి శివుని మేడలో నాగరాజా .....అనే పాట
పాడేవాళ్ళు.బొట్టు పెట్టుకొని తలా ఒక పువ్వు తలలో పెట్టుకొని కొంచెం ప్రసాదం తీసుకొని చేతులు కడిగి
గౌరీదేవిని అందరూ పట్టుకొని నీళ్ళల్లో వదిలేవారు .
               వీళ్ళు ఇలా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండగానే నలుగురు పిల్లలు కనిపించలేదని గమనించారు.
వాళ్ళు అందరూ పదిహేను సంవత్సరములు వయస్సు వాళ్ళే .వాళ్ళు రేగుపండ్ల కోసం  వెళ్లి ఉంటారని అనుకొని
వెతకడానికి మగవాళ్ళు వెళ్లారు .లంకలో రేగుపండ్లు చాలా బావుండేవి.అక్కడ కూడా పిల్లలు లేకపోయేసరికి
అందరూ ఏడవడం మొదలు పెట్టారు.
             కొంచం సేపటికి నీళ్ళల్లో కొంచెం దూరంలోగులాబీ రంగు కనిపించింది.ఈత వచ్చినవాళ్లు అక్కడకు
వెళ్లి చూస్తే అది ఒక సుడిగుండమనీ అందులో వాళ్ళు పడిపోయారని తెలిసింది.నలుగురిలో ఫై న వున్న
అమ్మాయి మాత్రమే బ్రతికింది .మిగతా ముగ్గురూ చనిపోయారు.అందరూ ఏడుస్తుంటే నేను తమ్ముడు
భయపడతామని అమ్మమ్మ మమ్మల్ని  తీసుకుని ఇంటికి వెళ్ళింది .ఇది  ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన.
  

Tuesday, 19 November 2013

ఒక్క క్షణం ఆలోచిస్తే.....

                    వార్తాపత్రికలో ఒక వార్త చదివాను.నాకు చాలా భాధ కలిగింది.అందుకే ఇలా మీ అందరితో
పంచుకోవాలనిపించింది.అది ఏమిటంటే ఒక వైధ్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకోన్నాడనే వార్త.విద్య పూర్తి
చేసుకొని ఎంతోమందికి ప్రాణ భిక్ష పెట్టవలసినవాడు అలా ప్రాణం తీసుకోవటం చాలా భాదాకరంగాఉంది .

                   కారణంఏదయినా కానివ్వండి అలా చేయాల్సింది కాదు.ఎన్నో ఆశలతో కొడుకు డాక్టరు
అయితే బాగుంటుందని తల్లిదండ్రులు అనుకోని ఉంటారు .ఏదయినా సమస్య వుంటే తల్లిదండ్రులతో
కానీ స్నేహితులతో కానీ పంచుకోవాల్సింది.
                                
               పేపరులో ఫోటో వేసారు .చక్కగా ఉన్నాడు.తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే వాళ్లకు
ఒక్కడే పిల్లవాడనిచెప్పారు.నేను ఇలా చేస్తే తల్లిదండ్రులు ఎంత భాద పడతారు ఇలా చేయడం
ఎంతవరకు సమంజసం అని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బావుండేది.ఇలా జరిగివుండేది
కాదు .విన్న నాకే ఇంత భాధగా వుంటే తల్లిదండ్రులకు ఎంత భాధగా వుండి ఉంటుంది .

          ఏదయినా సమస్య వస్తే చిన్నప్పటినుండే అన్నికోణముల నుండి ఆలోచించి  సరిఅయిన నిర్ణయం
తీ సుకోగ లిగేటట్లు ధయిర్యంగా సమస్యను   ఎదుర్కోగలిగే టట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శిక్షణ
ఇవ్వాలి.
            ఇంతకు ముందు రోజులలో తాతయ్యలు ,అమ్మమ్మలు ,నానమ్మలు ,మేనమామలు,అత్తలు
వాళ్ళ పిల్లలు అందరూ కలసి మెలసి ఉండడం వలన చిన్న చిన్న వాటికి సర్దుబాటు తత్వం అలవడేది.
           
        సూచన:తల్లిదండ్రులుగా మనమందరమూ, ఉపాధ్యాయులుగా కోప్పడకుండా భాధ్యతగా
పిల్లలను ,విధ్యార్ధులను   తీర్చిదిద్దుదామనినా సూచన.  

సంపెంగ పువ్వులు

                                        నాకు చిన్నప్పుడు  సంపెంగ పువ్వులంటే చాలా ఇష్టం.మా చిన్న తాతయ్య గారింట్లో
     ఒక సంపెంగ  చెట్టు ఉండేది. మిగిలినవాటిలాగా ఎక్కువ పూసేది కాదు.అప్పుడప్పుడు పువ్వులు పూసేది.
    ఆకుపచ్చగా ఉన్నప్పుడు వాసన రావు.పసుపుపచ్చగా  అయినా తర్వాత మాత్రమే మంచి వాసన వస్తాయి.
    అవే నాకిష్టం .నా కోసం ఎవ్వరినీ కోసుకోనీయకుండా పసుపుపచ్చగా అయ్యేవరకూ చెట్టునే ఉంచేవాళ్ళు.
    చెట్టున రంగు వచ్చి పండితేనే పువ్వు మంచి వాసన వస్తుంది.మా తాతగారు నాకిష్టమని వాళ్ళ ఇంటికి వెళ్లి
    తెచ్చేవారు .నే  ను మన ఇంట్లో కూడా ఒక చెట్టు పె డదామని గొడవ చేసేదాన్ని.సంపెంగ చెట్టు వుంటే  పాములు
వస్తాయి.అందుకని మనింట్లో వద్దు అని అమ్మ ,అమ్మమ్మ చెప్పారు .వాళ్ళింటికి కూడా అప్పుడప్పుడు వస్తాయట.
కానీ నాకిష్టమని వాళ్ళు ఆ చెట్టుని కొట్టేయకుండా అలాగే వుంచి నా కోసం పువ్వులు ఇచ్చేవారు.మా తాతగారు
ప్రత్యేకించి ఆ ఊరు వెళ్లి పువ్వులు తెచ్చి నాకు ఇచ్చేవారు.కొన్ని సంవత్సరాల క్రితం అంత ప్రేమగా ఉండేవారు.


 
      
              

చేపలకు ఆహారం

                                                       చేపల అక్వేరియం ఇంట్లో పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు.ఎవరి
   అభిరుచికి తగినట్లు వారు రకరకముల రంగురంగుల చేపలు పెంచుకోవచ్చు.రోజు వాటికి ఆహారం అందించటం
   ఒక కాలక్షేపం.అక్కడక్కడ వాటికి ఆహారం వేస్తుంటే అవి పరుగెత్తుతుంటే చూడటానికి చాలా సరదాగా
ఉంటుంది.అప్పుడప్పుడు అక్వేరియం కడగటం కష్టమే అనుకోండి. అయినా అభిరుచి ఉన్నప్పుడు కష్టంగా
 అనిపించదు కదా.అందుకనే మీకు ఇబ్బంది కలగకుండా నా  బ్లాగ్ కి వచ్చినప్పుడు మీకు బోర్ కొట్టకుండా
చదువుతూ  అప్పుడప్పుడు క్లిక్ చేస్తూ చేపలకు ఆహారం అందించటానికి ఏర్పాటు చేశాను.తప్పకుండా
వేయండి. 
Monday, 18 November 2013

అమ్మో నీళ్ళు పడిపోతానేమో

                                              మేము    అలహాబాద్ లో ఉన్నప్పుడు  ఒకసారి త్రివేణి సంగమం చూడడానికి
వెళ్ళాము. అప్పుడు నాకు మూడు సంవత్సరములు.త్రివేణిసంగమము అంటే మూడు నదుల కలయిక .గంగ
యమున,సరస్వతి నదులు కలిసిన  ప్రదేశాన్నే త్రివేణిసంగమం అంటారు. సరస్వతీనది అంతర్వాహిని.గంగానది,
యమునానది మామూలుగా ప్రవహిస్తాయి. అమ్మ,నాన్నగారు,నేను రావు మామయ్య అందరము కలసి పడవ
ఎక్కడానికి వెళ్ళాము.రావు మామయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా ఎత్తుకొనే వెళ్ళేవాడు.పడవలో ఎక్కి
మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు భయం  వేసింది .ఒకటే ఏడుస్తూ నేను నీళ్ళల్లోపడిపోతానేమో వెళ్ళిపోదాముఅని గొడవ చేస్తుంటే అలా అనకూడదు అని చెప్పారు .ఒక అరవై సంవత్సరాల క్రితం నీళ్ళల్లో ప్రయాణం చే స్తూ అలా అంటే ఎక్కడో నిజంగానే పడవ మునిగిపోయిందట .అందుకని అలా చిన్నపిల్లలు మాట్లాడకూడదు అని చెప్పారు.కానీ  
వాళ్లకి కుడా భయం వేసింది. పడవను వెనక్కి తీసుకునివెళ్ళమని చెప్పారు. ఒడ్డుకు వచ్చేవరకూ ఒకటే నమస్కారములు చేసుకొన్నారు. చల్లగా ఒడ్డుకుచేర్చండి  అమ్మా మమ్మల్ని అంటూనమస్కరిస్తూనే ఉన్నారు.
ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తిరిగి మరల కృతజ్ఞతతో నమస్కరించి ఇంటికివచ్చారు.
కానీ నాకు మాత్రం అంత ఎక్కువగావున్నా పెద్ద ప్రవాహాలను చూస్తే ఒక్క క్షణం ఒళ్ళుజలధరించినట్లు అవుతుంది.
చాలా సంవత్సరాల వరకూ  ఆ భయం పోలేదు.తర్వాత మామూలైపోయింది.కానీ ఇప్పటికీ సముద్రం కానీ ,పెద్ద నదులను కానీ చూడగానే అలాగే అనిపిస్తుంది .అంతగా మనసులో ముద్ర పడిపోయింది. 


Sunday, 17 November 2013

నా ఊహ-శునకం అపోహ

                                                  మా చిన్నప్పుడు మేము అలహాబాద్ లో ఉండేవాళ్ళము .అప్పుడు నాకు రెండున్నర సంవత్సరములు.మా ప్రక్కన వున్న ఇంటిలో ఒక పెద్ద కుక్క వుండేది .ఒక రోజు నేను దానికి బ్రెడ్ పెడదామని  వెళ్ళాను . కొంచం పెడితే తినేసింది .ఇంకా కొంచెం వేసాను.అది దానికి అందలేదు .దానికి అందేలా వేద్దామని ముందుకు వెళ్ళాను.నేను మరల తిసేసుకోవటానికి వచ్చానని అపోహతో నన్ను కరిచింది. అప్పుడు బాగా  రక్తం వచ్చింది .బాగా ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళు వచ్చి చూచి  డాక్టర్ దగ్గరకితీసుకునివెళ్ళి ఇంజక్షన్ చేయించారు.ఇంకెప్పుడు అలా చేయొద్దు అని మందలించారు. దాని పన్నుగుర్తు ఇప్పటికీ వుంది.Thursday, 7 November 2013

నాగులచవితి

                                                                నాగులచవితి
                               
                                     
                       నాగులచవితి శుభాకాంక్షలు.నాగులచవితి సందర్భంగా ఈ యదార్ధసంఘటనను మీతో పంచుకోవాలని అనిపించింది.విజయవాడకు15-20కి.మీ దూరంలో చోడవరం అనే గ్రామం ఉంది.అక్కడ
నాగేంద్రస్వామి ఆలయం ఉంది.అక్కడ ఈ రోజు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి.ఈరోజు ఉదయం నుండి
చుట్టుప్రక్కల ఊరిప్రజలందరూ పుట్టలో పాలు పోయడానికి వెళ్తారు.పుట్టలోబియ్యప్పిండి కొర్రలపిండి నువ్వులు
బెల్లం అరటిపండు అన్నీ కలిపి ఆవుపాలతో పుట్టలోని కలుగులో వేస్తారు.ముందుగా పుట్ట దగ్గరికి వెళ్లికలుగు
చుట్టూ నీళ్ళు చల్లి బియ్యప్పిండి చల్లి వరుసగా పసుపు,కుంకుమ వేసి పువ్వులు అలంకరించి సాంబ్రాణికడ్డిలు
వెలిగించి హారతి ఇస్తారు.తర్వాత పుట్టలోఫైన చెప్పినవన్నీమూడుసార్లు ఇంట్లోఅందరి పేర్లు,అటు ఏడు తరాలు
ఇటు ఏడు తరాలవాళ్ళవిఅని చెప్పి పాలు పోస్తారు.
                  ఉదయం12 గం.లకు నాగేంద్రస్వామి ఆలయం ఫైకి వచ్చిఅందరికీ దర్శనం ఇస్తారు.ఈ సమయం
కోసం భక్తులందరూ ఎంతో ఎదురు చూస్తారు.స్వామి ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఒకే సైజులోపడగ విప్పి
భక్తులందరినీఆశీర్వదిస్తారు.ఇది  అద్భుతం.మేము అందరమూ ఒక సంవత్సరము వెళ్లి దర్శనం చేసుకొన్నాము.
అప్పుడు ప్రక్కన ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము ఇలాగే12గం.లకు దర్శనం ఇస్తారు అని చెప్పారు.
                     ఈరోజు ఉదయం నుండిసాయంత్రం వరకూ ఎంతమంది వచ్చినాకూడా ఉచితంగా ఆవు పాలు
కావాల్సిన వాళ్ళకు ఇస్తారు.అక్కడ అందరూ స్వచ్ఛందసేవ చేయడానికి పోటీ పడతారు.ఆ ఊరివారందరూ
 కూడా బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తారు. స్పెషల్  బస్సులు ఆర్.టి.సి వాళ్ళువేస్తారు.సాంస్కృతిక
కార్యక్రమాలు జరుగుతాయి.నాగులచవితి రోజున కొన్ని వేల మంది స్వామి దర్సనానికి వస్తారు.అయినా కూడా
చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఈ విషయాన్నిమీ అందరితో  పంచుకోవాలన్పించింది.

.
.

Wednesday, 6 November 2013

స్వాగత సుమాంజలి

                                                           సుస్వాగతం
                                             

                                                 
,


                                 తెలుగు వారి బ్లాగ్ దర్శించ వచ్చినవారందరికీ స్వాగతం -సుస్వాగతం.

      ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన తెలుగువారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో

                           ప్రశాంతంగా ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

.                                                         ధన్యవాదములు