Saturday, 31 May 2014

పీచాయ్

             కాంతమ్మకు పెళ్ళయి ఎన్నిసంవత్సరాలయినా పిల్లలు లేరు.ఒకవేళ గర్భం దాల్చినా నిలబడేది కాదు.
ఎప్పుడైనా పిల్లలు పుట్టినా పురిట్లోనే చనిపోయేవారు.ఎట్టకేలకు పదకొండు సంవత్సరాల తర్వాత ఒక మగబిడ్డ
పుట్టాడు.చాలా బలహీనంగా పుట్టాడు.వీడు కూడా చనిపోతాడేమోనని చాలా కంగారుపడ్డారు.కొద్దికాలం క్రితం
పిల్లలు బ్రతకకుండా చనిపోతుంటే ఏదో ఒక పిచ్చిపేరుతోనో లేక వింతపేరుతోనో పిలిచేవాళ్ళు.అందుకని కాంతమ్మ
కొడుకును సన్నగా ఉన్నాడనే వంకతో పీచు,పీచాయ్ అంటూ పిలిచేవాళ్ళు.అతనికి పెళ్ళయి అమ్మాయిపుట్టి ఆపిల్లకు  పెళ్ళయినా కూడా ఆ ఊరివాళ్ళు,స్నేహితులు కూడా పీచాయ్ అనే పెట్టుడు పేరుతో పిలుస్తుంటారు. చిన్నప్పటినుండి అందరికీ సన్నగా,రివటలాగా ఉన్నట్లుగానే తెలుసు.మూడనమ్మకంతో తనమంచికే  పిలిచారని
ఆ పిలుపు అలవాటయిపోవటం వలన అతను కూడా ఏమీ భాదపడడు.ఇప్పుడు అతను కూడా అందరిలానే  సరిపడా లావుగా ఉండి, చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటున్నాఊరు వచ్చినప్పుడు అతని ఎదురుగానే  పీచాయ్ అనే మాట్లాడతారు.

Friday, 30 May 2014

హరి ఓం

                 మాణిక్ తాతలనాడు వెళ్ళి విదేశాలలో స్థిరపడ్డారు.అతను వైద్యుడే అయినా ఆధ్యాత్మిక భావాలు  ఎక్కువ.హరి ఓం అంటూ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.హరి ఓం అనేవాళ్ళకు ఈర్ష్య,అసూయలు
ఉండకూడదు కదా అయినా కొద్దిపాటి ఈర్ష్య అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటుంది.తన సహచర వైద్యుల
కన్నా తానే ఎక్కువ గొప్పగా ఉండాలని పోటీపడేవాడు.అలాంటప్పుడు కొన్ని తప్పులు చేస్తుండేవాడు.తనపై అధికారితో తిట్లు తినవలసి వచ్చేది.తను పనిచేసేచోట ఒత్తిడి తట్టుకోలేక వేరే ఊరిలో ఉన్న ఆసుపత్రికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు.అప్పుడు తన సహచారునికి ఫోను చేసి నీతో కొంచెం మాట్లాడాలని చెప్పాడు.సారీ,నేను
నీతో పోటీపడాలని అనుకున్నానుకానీ పోటీ పడలేకపోయాను.ఎప్పుడూ నీకన్నాఎక్కువమంది పేషెంట్లను
చుద్దామనుకునుకొనేవాడిని కానీ చివరకు నువ్వేఎక్కువమందిని చూసేవాడివి.ఏది ఏమయినా నేను  నీతో కలిసిపనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది.భవిష్యత్తులో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు.మాణిక్ ముందునుండి తన శాంత స్వభావాన్ని కనపరచకపోయినా చివరలో వెళ్ళిపోయే ముందు
తన ఆధ్యాత్మిక భావాలకు తగినట్లుగా మాట్లాడాడని సహచరులందరూ అనుకున్నారు.`   

ఏమి ఉపయోగం?

           కార్తీక్ కన్నడ వైద్యుడు.అతనికి తన మాతృభాష తప్ప విదేశాలలో ఉన్నాఇంగ్లిష్,మరే ఇతరభాషలోను అంతగా పట్టులేదు.ఏఒక్క ఉద్యోగంలోనూ నిలకడగా ఉండడు.అందువల్ల దేనిలోనూ ప్రావీణ్యం సంపాయించలేక
పోయాడు.దీనివల్ల తనకన్నా చిన్నవాళ్ళ క్రింద పనిచేయాల్సి వచ్చింది.అది అతనికి నామోషీగా అనిపించింది.
దానికితోడు వాళ్ళ పైఅధికారిణి ఇతనికి సరైన పరిజ్ఞానంలేదని అతనికన్నా చాలా చిన్న వయసులో ఉన్నసౌమ్య
వద్ద శిక్షణ తీసుకోమంది.సౌమ్య కు తనపని వేగంగా,సక్రమంగా పూర్తిచేసుకోవటం అలవాటు.ఇతనికి అన్నీ నేర్పించటం ఇబ్బందిగాఉన్నా పోనీలే నేర్పిద్దామనుకున్నాఅతనికి సౌమ్య దగ్గర శిక్షణ తీసుకోవటం కక్కలేక మింగలేక అన్న పరిస్థితిగా ఉంది.ఏమి చేయాలో తెలియక పై అధికారిణితో చెప్పుకోలేక సౌమ్య అంటే ఉన్నఈర్ష్యతో
నువ్వు అందరిదగ్గర మంచి అనిపించుకుని,అందరి మెప్పుపొంది" ఏమి ఉపయోగం?"అని కార్తీక్ అడిగాడు.అంటే  ఏమిటి అంటే సమాధానం లేదు.వాడి ఇంగ్లిష్ కూడా అందరికీ అర్ధం కాదు.నువ్వు గొప్ప అయితే నేను దద్దమ్మనా?
అన్నాడు.నువ్వు దద్దమ్మ అనికాదు.ఎవరి మెప్పో పొందాలని పనిచేయకూడదు ఎవరికీ వాళ్ళే తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎవరి వృత్తికి వాళ్ళు సరయిన న్యాయం చేయాలి.అప్పుడే దేనిలోనయినా రాణించగలరు.అందరి మీద ఈర్ష్య పడటంఆపి ముందు నిన్ను నువ్వు సరిచేసుకో అని సౌమ్య కార్తీక్ తో చెప్పింది.    

Thursday, 29 May 2014

జెన్నిఫర్ ఫోబియా

              జెన్నిఫర్ ఒక వైద్యురాలు.ఒక పెద్దఆసుపత్రికి సూపరిండెంట్.పనిరాక్షసి.పెద్దపదవిలో ఉన్నాననుకోకుండా తను కష్టపడుతుంది.ఎదుటివాళ్ళను కూడా అలాగే కష్టపడి పనిచేయమంటుంది.ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోదు.
ఆసుపత్రిలో అందరికీ ఆమె అంటే భయం.వ్యక్తిత్వం మంచిదే కానీ డ్యూటీ సక్రమంగా చేయకపోతే ఆరోజు వాళ్ళపని
అయిపోయినట్లే.ఆడవాళ్లనయితే ఒక్కొక్కసారి వదిలేసినా మగవాళ్ళను మాత్రం మొత్తం పేషెంట్లను ఆమెతోపాటు
రౌండ్స్ కివెళ్ళి చూసేవరకు ఎంతటైమయినా వదలదు.అందరూ తిట్టుకుంటూ ఉంటారు.ఆమె వస్తుందంటే చాలు ఎప్పటికి వదులుతుందో ఏమిటోనని అందరికీ భయం పట్టుకుంది.అభయంతో అందరూఒకటి చేయబోయి ఇంకొకటి చేయటం మొదలుపెట్టారు.ఇంకా ఎక్కువ తిట్లు తినవలసి వచ్చేది.ఎందఱో పేషెంట్లని రకరకాల ఫోబియాలతో మన
దగ్గరకు వస్తుంటే డాక్టర్లుగా వైద్యంచేసి పంపిస్తున్నాము కానీ మనకి ఈ జెన్నిఫర్ ఫోబియా పట్టుకుందేమిటబ్బా!
అని ఆశ్చర్యపోవటం డాక్టర్ల వంతయింది.  

Wednesday, 28 May 2014

పిలవను-రాను

               అమృత,పీయూష్ విదేశీ భార్యాభర్తలు.ఇద్దరూ వైద్యులు.వాళ్లకు ఇద్దరు పిల్లలు.ఒక అమ్మాయి,ఒక అబ్బాయి.అబ్బాయి పెద్దవాడు.చక్కగా చెప్పినమాట వింటూ తనపని తను చేసుకుంటూ బాగా చదువుకుంటాడు. అమ్మాయి అల్లరిచేస్తూ అన్నింటికి అలుగుతుంటుంది.ఒకసారి అమృత కూతుర్నిలెక్కలు సరిగ్గా చేయలేదని కోప్పడింది.నువ్వు నన్ను కోప్పడటమేమిటి?నాన్న మంచివాడు నన్ను కోప్పడరు.పెద్దయిన తర్వాత నేను నిన్ను నాపెళ్ళికి పిలవను.నాన్నను పిలుస్తాను అని అమృతతో అంది.నువ్వు నాపెళ్ళికి వస్తావు కదూ అని నాన్నతో అంది.
పీయూష్ కూతురుతో నేను నాభార్య లేనిదే నీపెళ్ళికి ఒంటరిగా రాలేను అని చెప్పాడు.కూతురు మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది.అమృతకు మాత్రం కూతురు అలా మాట్లాడటం విడ్డురంగా తోచింది.దీన్నిబట్టి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ సమానమేనని ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువకాదని అర్ధం చేసుకోవాలి.

చచ్చిపోయిన తర్వాత వెళ్తారా?

                  శామ్యూల్ బంధువు ఒకాయన చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఉన్నాడు.అతని దగ్గరకు ఎక్కువమంది రాకూడదు అని,ఒక్కళ్ళు,ఇద్దరు వెళ్ళినా స్టెరైల్ గా వెళ్ళాలని వైద్యులు సూచించారు.ఆయనభార్య మాత్రమే దగ్గర ఉంటుంది.భార్యకు కూడా ఎవరూ రావటం ఇష్టంలేదు.అందుకని దగ్గరి బంధువు అదే ఊరు వెళ్ళినా ఆసుపత్రికి వెళ్ళలేదు.ఇంకొక బంధువు ఫోనుచేసి మరీ ఆసుపత్రిలో ఉన్నబంధువుని చచ్చిపోయిన తర్వాత చూడటానికి వెళ్తారా ఏమిటి?అని శామ్యూల్ ని అడిగాడు.శామ్యూల్ అక్కడకు ఎవరినీ రానివ్వటంలేదు.వెళ్ళటం మనకూ
మంచిదికాదు వాళ్ళకు మంచిదికాదు సీరియస్ కండిషన్ కనుక మనం చేయగలిగింది ఏమీలేదు చనిపోయిన
తర్వాత వెళ్ళడమే అని చెప్పాడు. 

Tuesday, 27 May 2014

విమర్శ

                 పంకజ్ ఎప్పుడూ ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటాడు.ఎదుటివారు తెలివి తక్కువవాళ్లు,తిక్కవాళ్ళు తానొక్కడే తెలివిగలవాడిని,మంచివాడిని మిగతావాళ్ళందరూ దేనికీ పనికిరారు అనుకుంటాడు.తనసంసారం ఒకటి తిన్నగా లేదు.భార్య,పిల్లలు అతనిమాట వినరు.అతను ముందు మాట్లాడితే వెనుక వాళ్ళు పిచ్చితిట్లు  తిడుతూ ఉంటారు.అయినా తనకు అసలు ఆవిషయమే తెలియనట్లు నటిస్తాడు.ఎక్కడ ఆవిషయం బయటపడితే తనకు వెనుక తాటాకులు కడతారోనని అంటే తనను ఎవరు లెక్కచేయరేమోనని  భయం.అది బయటపడకుండా
అందరినీ అరుస్తూ విమర్శిస్తాడు.ఎదుటివారిని విమర్శించే ముందు మనం సరిగ్గా ఉన్నామా, లేదా? అని ఆలోచించుకోవాలి.

Monday, 26 May 2014

తస్మాత్ జాగ్రత్త

               ధార్మిక ఇంట్లో పనిమనిషి ఒక రెండునెలలు ఊరు వెళ్ళింది.వేరేఅమ్మాయిని పెట్టుకుందామనుకున్నారు.
కానీ సరయిన మనిషి దొరకలేదు.ధార్మికకు తెలిసిన పనిమనిషి తనకు బాగా తెలుసని ఒకఅమ్మాయిని వెంట తీసుకొచ్చింది.ధార్మిక మంచిఅమ్మాయేనా? అని అడిగితే చాలామంచిదని చెప్పింది.బంధువులు వస్తే వాళ్ళ బట్టలు ఉతకమంటే సరేనని బట్టలు ధార్మిక ఎదుటే నానబెట్టింది.ధార్మిక తమ్ముడు చూడకుండా సీక్రెట్ పోకెట్లో పెట్టిన పదివేల రూపాయలతో సహా ప్యాంటుఉతకటానికి వేశాడు.ఆవిషయం ఎవరూ గమనించలేదు.దొంగది గమనించి
వద్దన్నా వినకుండా మిగాతా బట్టలు ఉతుకుతానని బలవంతాన బట్టలు తీసుకుని రమ్మంది.ధార్మిక లోపలకు వెళ్ళగానే క్రొత్తపదివేలరుపాయల కాగితాలు పది తీసేసింది.ధార్మిక వచ్చేసరికి బట్టలు ఉతుకుతున్నట్లునటించింది.
దొంగది వెంట భర్తని,కూతుర్నికూడా తీసుకొచ్చింది.ధార్మిక తమ్ముడికి నాలుగైదుగంటల తర్వాత డబ్బు విషయం గుర్తొచ్చింది.వెంటనే పిలిపించి అడిగితే నాకుతెలియదు,నేను తీయలేదు అంటుంది కానీ భయపడుతూ బిక్కచచ్చిపోయింది.ఆడదానిమీద కేసుపెట్టి,కొట్టించడం ఎందుకులే అదే తీసుకుందని,ఆమెకుతప్ప ఎవరికీ అవకాశం లేదని,అది డబ్బు తిరిగి ఇవ్వ్దదల్చుకోలేదు కనుక ఇక అనవసరమని వదిలేశారు.తర్వాతరోజువెరేఇంట్లో   పనికి వెళ్ళి బంగారపు చెవి పోగులు తీసుకుంది.వాళ్లుకేసు పెట్టి అరెస్ట్ చేయించారు.వాళ్ళు నాలుగు వేసేసరికి మాయరోగం వదిలింది.అయినామళ్ళీనేను తీయలేదనే మాటచెప్తుంది."పరులసొమ్ము పాము వంటిది" అనే జ్ఞానం లేకుండా దొంగతనం చేయటం మొదలెట్టింది.ఇన్నాళ్ళకు దీని పాపం పండింది దీనివల్ల మనల్నికూడా నమ్మటంలేదు అని తోటి  పనిమనుషులుఅనుకున్నారు. ఈరోజుల్లో ఎవర్నీ నమ్మలేము "తస్మాత్ జాగ్రత్త ".

వసుధైకకుటుంబం

            పరంధామయ్యగారికి పదిమంది సంతానం.వారిలో ఆరుగురు కొడుకులు,నలుగురు కూతుళ్ళు.ఇంతకు
ముందురోజుల్లో ఎక్కువమందికి అధిక సంతానం ఉండేది.కూతుళ్ళ పెళ్ళిళ్ళయిన తర్వాత కొడుకుల పెళ్ళిళ్ళు
వరుసనేచేశారు.కొడుకులు,కోడళ్ళు,పరంధామయ్యగారు,ఆయనభార్య అందరూ ఒకేఇంటిలో కలిసిమెలిసి
ఐకమత్యంతో ఉండేవారు.ఇంటిపెద్దలు పరంధామయ్యగారు,ఆయనభార్య మాటలు ఇంట్లో అందరికీ వేదవాక్కు.
కోడళ్ళందరూ ఒక్కొక్క పనిచేస్తూ ఎవరిపనివాళ్ళు చేసుకుంటూ అందరూ సరదాగా,సంతోషంగా ఇంటిని
చక్కదిద్దేవారు.మనుమలు,మనుమరాళ్ళు పెద్దయ్యి,వాళ్ళచదువులు,పెళ్ళిళ్ళయ్యేవరకు కూడా కలిసే ఉన్నారు.
ఊరిలో అందరూ పరంధామయ్యగారి వసుధైకకుటుంబాన్నిచూచి ముచ్చటపడి కుటుంబమంటే అలాఉండాలని
అనుకునేవారు.ఇన్ని సంవత్సరాలు ఏపొరపొచ్చాలు లేకుండా చక్కగా ఉన్నారు.నాకూఓపిక తగ్గిందికనుక ఆస్తి
పంపకాలు చేస్తాను.మీకు ఇష్టమైతే కలిసి ఉండొచ్చు లేకపోతే ఎవరికివాళ్ళు వేరుగా ఉండండి అని కొడుకులకు పరంధామయ్యగారు చెప్పారు.తర్వాతికాలంలో కూడా కొంతమంది కలిసిఉన్నారు.అన్నిరోజులు కలిసి ఉండటం
అందరి గొప్పతనం.    

Sunday, 25 May 2014

మధురానుభూతి

        మృదుల కుటుంబం షిర్డీ సాయినాధుని దర్శనార్ధం షిర్డీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా మనము          మాత్రమే వెళ్ళేకన్నా కుటుంబం మొత్తం కలిసివెళ్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా అత్తింటివారికి,పుట్టింటివారికి ఫోన్లుచేసి ప్రయాణంసంగతి చెప్పగానే ఒకరిద్దరు మినహాయించి అందరూ
వస్తామని ఎగిరి గంతేశారు.ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువరోజులు అక్కడ ఉండటం కష్టం కనుక
మొత్తం చూడకుండానే మూడురోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేశారు.అయినాకూడా షిర్డీ సాయినాధుని దర్శనభాగ్యంతో
కలిగిన దివ్యానుభూతితోపాటు,కుటుంబసభ్యులందరితో కలిసి చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఉన్నముచ్చట్లన్నీ
చెప్పుకుంటూ ప్రయాణించటం,అందరూ కలిసి బాబాను దర్శించుకోవటం వలన మృదుల కుటుంబం ఎంతో సంతోషంతో ఎన్నో మధురానుభూతుల్ని ప్రోగుచేసుకున్నట్లయింది.

Monday, 19 May 2014

స్వంతింటి కల

     మిధులకళాశాలోచదువుకునేరోజుల్లోఒకసారిస్నేహితురాళ్ళందరూకూర్చునిఉండగాస్వంతఇల్లు ఎవరిఅభిరుచికితగినట్లువాళ్ళుకట్టుకుంటారు.ఒక్కొక్కళ్ళకుఒక్కొక్కఅభిప్రాయం ఉంటుంది.ఎవరి" స్వంతింటికల", అభిరుచులు వాళ్ళని చెప్పమన్నారు.అందరూ ఎవరి అభిప్రాయలు వాళ్ళు చెప్పారు.మిధుల వంతు వచ్చింది.
మిధుల తనకు పెద్దస్థలంలో గాలి,వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా,చుట్టూ అందమైనతోటను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.ఆఅందమైనతోటలోఇంట్లోనుండి బయటకువెళ్ళి కొనుక్కోవాల్సినఅవసరం లేకుండా చిన్నవి,పెద్దవి,ఆకుకూరలు, పూలమొక్కలు,పండ్లచెట్లు,కూరగాయల మొక్కలు  వేటికవి చక్కగా పద్ధతిప్రకారం పెంచాలని ఉందని తన మనసులో మాట చెప్పింది.కాలక్రమేణా మిధులకు,స్నేహితురాళ్లకు పెళ్ళిళ్ళయి స్థిరపడ్డారు.మిధుల కళాశాలరోజుల్లో చెప్పినట్లుగా పెద్దస్థలంలో గాలి,వెలుతురు,మొక్కలు అందంగా
పెట్టింది కానీ చుట్టూ అందమైనతోటను తన అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోలేకపోయింది.సిటీల్లో ఉండేవాళ్లకు ప్రస్తుతం సాధ్యంకానిపని.అప్పటి స్నేహితురాలు అప్పుడప్పుడు ఫోనుచేసి మరీనువ్వుఅప్పుడు
చెప్పినట్లుగా"స్వంతింటి కల"నేరవేర్చుకోలేకపోయావు అని సతాయించుతూ ఉంటుంది.మిధుల ప్రతిదీ తేలిగ్గా   సానుకూలదృక్పధంతో అలోచిస్తుంటుంది.ఆమెతో ఇంకాసమయం ఉందికదా!నా"స్వంతింటి కల"నేరవేర్చుకోగలనని ఆశిస్తున్నాను నువ్వు దానిగురించి కంగారుపడాల్సిన అవసరంలేదు అని చెప్పింది.
  

వెక్కిరింత

           మృణాళిని రకరకాలభాషలు నేర్చుకుందామని వెళ్ళింది.అక్కడ నేర్పించేదానికన్నావెక్కిరింతలు ఎక్కువ.
ఒక్కొక్కరిది ఒక్కో భాష.అందరి మాటతీరు ఒకేరకంగా ఉండదుకదా.ఒక్కో ప్రాంతీయభాష ఒక్కొక్కరిది.మృణాళిని
వెనుకబడిన ప్రాంతంనుండి వచ్చింది.మృణాళిని భాష అందరికీ అర్దంకాదు.భాషలు నేర్పుతానన్న గురువు ఈమె
భాషను అనుకరించి అలా మాట్లాడుతుంది,ఇలా మాట్లాడుతుందని వెక్కిరించేది.మృణాళిని అసలే కంగారు మనిషి.
గురువు స్థానంలో ఆమె అలా వెక్కిరిస్తుంటే బుర్ర పనిచేసేదికాదు.ఒకటి అడిగితే ఒకటి చెప్పేది.ఎప్పుడూ ఏదోఒకటి
ఆలోచిస్తావేమిటి?అని గదమాయించేది.ఎవరిభాష వారిది అలా వెక్కిరించటం ఏమి పద్ధతి? నాకు చాలాబాధగాఉంది
అంటూ మిగతావాళ్ళ దగ్గర బాధపడేది.ఆబాధ అనుభవించేవాళ్లకుమాత్రమే తెలుసు. ఎవరుమాత్రం ఏమి సలహా చెప్పగలరు.మాట్లాడేఆమెకు ఉండాలి.మనం ఒకళ్ళను వెక్కిరిస్తే మనల్ని ఇంకొకళ్ళు వెక్కిరిస్తారు.అన్నీమనకే తెలుసు అనుకోవటం పొరపాటు."తాడిని తన్నేవాడు ఒకడుంటే దాని తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు."

Sunday, 18 May 2014

డబ్బుపోయి శనివదిలింది

                     కార్తీక్ 2014 ఎన్నికలలో తప్పనిపరిస్థితులలో ఒకపార్టీ తరఫున పోటీచేయవలసి వచ్చింది.జనం
ఇంటికివచ్చి మీటింగులు పెట్టి పొద్దుపోయేవరకు సోదిచెప్పి ఇళ్ళకు వెళ్ళేవాళ్ళు.వాళ్ళకు టీ,టిఫిన్లు,కూల్ డ్రింకులు
సప్లయిచేయటంతో డబ్బుఖర్చవటమే కాక సమయం వృధాఅయ్యేది.ఆపార్టీ అంటే ఇష్టంలేకపోయినా కార్తీక్ అంటే ఉన్నఅభిమానంతో చాలామంది ఓటు వేశారు.అయినా కొద్దిపాటి తేడాతో ఓడిపోయాడు.ఈలోపు కార్తీక్ దగ్గర చాలా  డబ్బు మంచినీళ్ళప్రాయంలా ఖర్చయింది.అయినా కార్తీక్ బాధపడలేదు.ఇంతటితోనే పోయింది లేకపోతే ఈఐదు సంవత్సరాలు సమయం వృధా అవటమేకాక నానాఇబ్బంది పడవలసి వచ్చేది అని కార్తీక్ సంతోషించాడు.ఇంతకు
ముందు "డబ్బుపోయి శనిపట్టింది" అని శాస్త్రం.ఇప్పుడు కార్తీక్ క్రొత్తగా"డబ్బుపోయి శనివదిలింది"అనుకున్నాడు.

ముగ్గు కర్ర

              లక్ష్మమ్మ అన్నవరం దగ్గర ఒకచిన్నఅందమైన పల్లెటూరులో వుంటుంది.ఆఊరిలో దాదాపుగా అందరికీ    చక్కగా,అందంగా ముగ్గులు వెయ్యటంవచ్చు.పెద్దపెద్దముగ్గులు అందంగా వేయటమనేది ఒకకళ.అదికూడా  అందరికీ వంటబట్టదు.లక్ష్మమ్మ,పిల్లలు రోజు తెల్లవారుజామున ఆవుపేడతో కళ్ళాపుకొట్టి,పెద్దపెద్దముగ్గులు వేస్తారు.వీళ్ళవాకిలి పచ్చగా తెల్లటిముగ్గుతో చూపరులను ఆకట్టుకుంటుంది.లక్ష్మమ్మ ఇంటిప్రక్క వాళ్ళఅమ్మాయి
రోజాకి అన్నిపనులు వచ్చుకానీ "ముగ్గుకర్ర" వెయ్యటం కూడా రాదు.అంటే తిన్నగా ముగ్గుతో గీతగీయటం కూడారాదు.రోజాకి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించారు.ఆఊరిలో కోడలికి వాకిట్లో ముగ్గులు వెయ్యడం రాకపోతే చాలాతప్పు.ఆవిషయం వీళ్ళకు తెలియదు.ఒకరోజు వాళ్ళఅత్తగారు రోజా వాకిట్లో ముగ్గువేసిరా అంది.నాకు ముగ్గువెయ్యటంరాదని రోజా అందివ్వ ముగ్గువెయ్యటం రాకపొవడమేమిటి?అని కొడుకు,భర్త ఇంటికి వచ్చినతర్వాత చెప్పి నానారాద్దాంతంచేసి ముగ్గులు నేర్చుకుని,వెయ్యటం వచ్చినతర్వాత కాపురానికిరా అప్పటివరకు పుట్టింట్లో ఉండమని పంపించేశారు.మాఅమ్మాయికి ముగ్గులురావని నేర్చుకున్నతర్వాత అత్తారింటికి రమ్మని పుట్టింటికి పంపారు.నువ్వు మాఅమ్మాయికి ముగ్గులు నేర్పమని లక్ష్మమ్మను అడిగింది.ఇదేమి చోద్యం ఈరోజుల్లో పిల్లను ముగ్గులకోసం పుట్టింటికి పంపటంఏమిటి?అని ముగ్గులు నేర్పి రోజాని కాపురానికి పంపారు.  
  

Saturday, 17 May 2014

వజ్రాయుధం

               2014 ఎన్నికలు ఒక నిశ్శబ్దసమరం.నోటితో మాట్లాడకుండా ఓటుఅనే వజ్రాయుధంతో వేటువేసి విజ్ఞతతో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు.ముందే ఊహించినా ఫలితాలువచ్చేవరకూ ఉత్కంటే.ఎవరికి ఎక్కడ పట్టం కట్టాలో
అక్కడ బ్రహ్మరథం పట్టారు.ఎప్పటిలా అదేమాపార్టీ అని ఒకదానికి పరిమితమవ్వకుండా ఆలోచించి ఎన్నిక చేశారు.
కొన్నిచోట్ల ప్రలోభాలకు లొంగిపోయినాఎక్కువమంది విచక్షణతో, సమర్థవంతంగా నాయకులను ఎన్నుకున్నారు.
అలాగే నాయకులు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎన్నికల ముందు చెప్పినమాటలు
నిలబెట్టుకుని,అవినీతికి స్వస్తిపలికి,నీచరాజకీయలను అంతమొందించి,ప్రజోపయోగమైన పనులు చేపడుతూ సమర్ధతతో రాష్ట్రాలను,దేశాన్నిప్రతిభావంతంగా ముందుకు నడిపించాలని ఆశిద్దాం.   

Friday, 16 May 2014

వేసవిలో చల్లచల్లగా .....

1)సబ్జాగింజలను నీళ్ళల్లో వేయాలి.బాగా నానినతర్వాత చల్లటినీటిలో పంచదార కలుపుకుని త్రాగాలి.
2)పుదీనా ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చాలి.ఇష్టమైన వాళ్ళు పచ్చిఆకులు వేసుకోవచ్చు.దీనిలో తేనే,నిమ్మరసం కలిపి త్రాగాలి.
3)జాల్జీర నీరు త్రాగాలి.ఇంట్లో చేసుకోలేకపోతే జాల్జీరపౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది.
4)రాగిజావ తయారుచేసి పాలుకానీ,మజ్జిగ కానీ కలిపి త్రాగాలి.
5 )లస్సీ,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
6)నీటిశాతం ఎక్కువగా ఉన్నపండ్లు అంటే పుచ్చకాయ,తర్బుజ తినాలి.రసం రూపంలోనయినా త్రాగొచ్చు.
7)కొబ్బరి నీరు త్రాగటం వేసవిలో చాలామంచిది.
8)తాటి ముంజెలు వేసవిలోనే దొరుకుతాయి కనుక తినటంవలన చాలా ఉపయోగాలున్నాయి.కోలెస్టరాల్ ని నియంత్రిస్తుంది.శరీరానికి చలువ చేస్తుంది.
9)టీకోలా అంటే కొంచెం నీళ్ళల్లో టీపొడి వేసి మరిగించి వడకట్టి దానిలో చల్లటినీరుపోసి పంచదార వేసి కలిపితే లైట్
పొగాకు,నారింజరంగు కాకుండా మంచి రంగులో పానీయము తయారౌతుంది అదే టీకోలా.మనం వేసే పొడిని బట్టి రంగు వస్తుంది.
10)వేసవిలో మామిడికాయలు ప్రత్యేకం కనుక మరీ ఎక్కువగా తినకూడదు. వేడి కనుక మితంగా తీసుకోవాలి. 

Thursday, 15 May 2014

కల్లు తాగిన కోతి

            సౌగంధిని ఒక ఉన్నత కార్యనిర్వహణాధికారి.తనవృత్తిని దైవంగా భావించి పక్కాప్రణాళికతో పనులు చేస్తుంది.ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా తనబృందంలోని నాయకులను అస్సలు ఊరుకోదు.అందరికన్నా
తనబృందం ముందంజలో ఉండాలనుకుంటుంది.ఈక్రమంలో అందరిమీద "కల్లు తాగిన కోతి"లా అరుస్తుంటుంది.
ఈమెలోఇంకొక చెడ్డగుణం ఏమిటంటే తనకు ఇంటాబయటా ఏమైనా చిరాకు వచ్చినా అదేవిధంగా అరుస్తుంది.
ఇంటివిషయాలు ఇంట్లో వదిలేయాలి.కార్యాలయం విషయాలు కార్యాలయంలో వదిలేయాలి.అప్పుడు ఎవరికీ
ఇబ్బంది ఉండదు.ఎవరి మనసు నొచ్చుకోదు.అందరూ గౌరవభావంతో ఉంటారు.ఇంట్లో ప్రేమగా ఉంటారు.మనకు
చిరాకుగా ఉందని ఎదుటివాళ్ళమీద అరిస్తే ఎంతమంచివాళ్లకయినా,ఎంతఉన్నతపదవిలోఉన్నా విలువ,గౌరవం ఉండదు.పైకి నవ్వు పులుముకున్నామనసులో తేలికభావం ఉంటుంది. 

స్పూర్తి

              ప్రణీత పిల్లలను వైద్యశాస్త్రం చదివించటానికి స్పూర్తి ప్రణీత అమ్మమ్మ.ఆరోజుల్లోనే తనకొడుకును వైద్యవిద్య చదువుకోమని ప్రోత్సహించింది.వైద్యవృత్తి పవిత్రమైనది.ఎంతోమందికి  సేవచేసి ప్రాణదానం చేసేభాగ్యంకలుగుతుంది.
కస్టపడి చదివి మంచివైద్యుడుగా పేరు తెచ్చుకోవాలి అనిచెప్పేది.అలాగే చక్కగా చదివి మంచివైద్యుడుగా పేరుతెచ్చుకుని అమ్మమాట విని అమ్మసంతోషపడేలా చేశాడు.ఈవిషయం చిన్నప్పటినుండి వినటం వలన ప్రణీతకు కూడా వైద్యవిద్య అంటే ఆసక్తి.దానికి తోడు పిల్లలకు కూడా అదే ఇష్టం.అందుకని తన ఇద్దరు పిల్లలను వైద్యవిద్యను అభ్యసించమని చెప్పింది.చదవాలంటే చాలాకష్టమైనప్పటికి,జీవితంలో నిలదొక్కుకోవటానికి ఎక్కువ
సమయం పట్టినప్పటికీ పదవీవిరమణలేకుండా ఓపికఉన్నన్నిరోజులు ప్రజలకుసేవచేసే అవకాశంఉంటుంది.పైగా
వైద్యవిద్య ఎంతో విలువైనది,గౌరవప్రదమైనది.ఇటీవలి కాలంలో త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపటం వలన వైద్యుల కొరత ఏర్పడనుంది.ప్రణీత అమ్మమ్మ స్పూర్తి వలన ప్రణీత కూడా తనపిల్లలను మంచి వైద్యులుగా తీర్చిదిద్దుతుంది.   

Monday, 12 May 2014

నవ్విన నాపచేను

                జయేష్ చిన్నప్పుడు సన్నగా గాలివీస్తే పడిపోయేటట్లుండేవాడు.జయేష్ పెద్దమ్మకొడుకు సుభాష్ బలంగా ఉండేవాడు.ఇద్దరు దాదాపు ఒకే వయస్సు.జయేష్ తాతగారు జయేష్ కన్నా సుభాష్ ప్రయోజకుడు
అవుతాడు వీడు పుష్టిగా ఉన్నాడు చదువుకోవటానికి శక్తి ఉంటుంది.జయేష్ పీలగా ఉండటంవలన చదవగలిగే
శక్తి లేక ప్రయోజకుడవటం కష్టం అని జోస్యం చెప్పేవారు.సుభాష్ గొప్పగా ఫీలయ్యేవాడు.చివరకు సుభాష్
పదోతరగతి పాసవ్వలేకపోయాడు.చదువు ఆపేసి చిన్నఉద్యోగంలో స్థిరపడ్డాడు.జయేష్ పట్టుదలగా చదివి
వైద్యవృత్తిలో స్థిరపడి పెద్దఆసుపత్రి కట్టించి మంచివైద్యుడుగా పేరుతెచ్చుకున్నాడు."నవ్విన నాపచేనుపండింది"
అని శాస్త్రం.అలాగే చిన్నప్పుడు చదుకోవటం కష్టం అన్నవాళ్ళే జయేష్ ప్రయోజకత్వాన్ని మెచ్చుకుంటున్నారు.

జగమంతకుటుంబం

          సతీష్ కుటుంబం చాలాపెద్దది.ఐదుగురు అక్కచెల్లెళ్ళు,ఐదుగురు అన్నదమ్ములు.సతీష్ అందరికన్నా చిన్నవాడు.సతీష్ చిన్నప్పటినుండి అల్లరిచిల్లరిగానే ఉండేవాడు.పెద్దవాడై,పెళ్ళైనతర్వాతకూడా అతనుమారలేదు.
ఇద్దరుబిడ్డల తండ్రి అయ్యాడు.వాళ్లపోషణార్ధం ఎన్నోఅబద్దాలు చెప్పిడబ్బు సంపాదించేవాడు.అతనుచెప్పే అబద్దాలు
ఎవరు నమ్మటంలేదు కనుక క్రొత్తఅవతారం ఎత్తాడు.బంగారపుబిస్కట్లు తక్కువధరకు ఇప్పిస్తానని అందరిదగ్గర
డబ్బు తీసుకోవటం మొదలుపెట్టాడు.ఇతనిమోసానికి ఎంతోమంది బలయ్యారు.కొంతమంది వదిలేసినా అందరూ ఊరుకోరుకదా.పట్టుకుని ఒకసారి కొట్టారు.మీడబ్బుమీకు ఇస్తాను అనిచెప్పి ఎవరికీ కన్పించకుండా కుటుంబంతో
సహా పారిపోయాడు.ఇతని ఆచూకీకోసం సతీష్ కుటుంబాన్నినానాప్రశ్నలతో,ఎన్నోరకాలుగా  ఇబ్బందులు పెట్టేవాళ్ళు.చాలాసంవత్సరలతర్వాత అందరూ మర్చిపోయుంటారని స్వంత ఊరురావటం మొదలుపెడితే వాళ్ళ
కుటుంబంలోని వాళ్ళు వాళ్ళింటికి రానీయలేదు."జగమంతకుటుంబం నాది ఏకాకి జీవితం నాది"అనిపాడుకుంటూ
ఆపాటను ఫోను కి రింగుటోనుగా పెట్టుకున్నాడు.అంతకన్నా గత్యంతరంలేదు కనుక అలాచేసాడు.పిచ్చిపనులు చేయటంవలన కుటుంబానికి,అందరకీ దూరమయ్యాడు.

Friday, 9 May 2014

అతి సర్వత్ర వర్జయేత్

               రమణి చిన్నప్పటినుండి బొద్దుగా ఉండేది.పెళ్ళయి పిల్లలు పుట్టినతర్వాత ఇంకా బొద్దుగా తయారయింది.
పిల్లలు స్కూలుకి, భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పనీపాటా లేక టి.వి.పెట్టుకుని చిప్స్ తింటూ,చల్లని పానీయాలు త్రాగుతూ నూటయాభై కిలోలు బరువు పెరిగింది.అసలే ఎత్తు తక్కువ.చూడటానికి గున్నేనుగు లాగా తయారైంది.అక్కా నేను గున్న ఏనుగులాగా ఉన్నానా?లేక పిప్పళ్ళబస్తా లాగా ఉన్నానా?అని తనమీద తనే జోకులేసుకునేది.తిండిమాత్రం తగ్గించేదికాదు.నడవటానికి కూడా ఇబ్బందిపడేది.కొలెస్టరాల్,రక్తపోటు రావటంవలన బరువుతగ్గాలని వైద్యులు సూచించారు.ఆకలికి తట్టుకోలేదు,తినకుండా ఉండలేదు కనుక ఇలాఅయితే ముందు ముందు ప్రాణానికే ప్రమాదమని వైద్యులు బేరియాటిక్ సర్జరీ చేయాలని చెప్పారు.రమణికి ఆసుపత్రికి వెళ్ళటం ఇష్టం ఉండదు.ఆపరేషన్ అంటే విపరీతమైన భయం.ఆధునిక తరహాలో ఆపరేషన్లు చేస్తున్నారు.ఇంటికి తొందరగావెళ్ళొచ్చు.నువ్వు అందరిలాగా మాములుగా తిరగొచ్చు.నీభయం ప్రాణంకన్నాఎక్కువ కాదుకదా!గుండెకు కూడా మంచిది కాదు బ్రతుక్కికూడా ప్రమాదం అన్నారు కనుక చేయక తప్పదు.ఏమీ భయంలేదు అని అందరూ నచ్చచెప్తే సరేనంది.అలా మూడుసార్లు ఆపరేషన్లు చేశారు.సర్జరీ చేయటంవల్లఎక్కువ తినలేదు.తిన్నావాంతులవుతాయి.అతిగా తినకపోతే ఈతిప్పలు వచ్చేవి కాదు కదా!అయినా రమణి తినగలిగినంత ఎప్పటికప్పుడు గంట గంటకీ తింటూ ఉండటం వలన ఏమాత్రం బరువు తగ్గలేదు.అన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఉపయోగంలేదు.ముందే జాగ్రత్తగా బరువు పెరగకుండా ఉంటే ఈసమస్య వచ్చేదికాదు.అనారోగ్యం వచ్చిన తర్వాత భాధపడేకన్నా రాకముందే జాగ్రత్తపడాలి.అందుకే పెద్దలు "అతి సర్వత్ర వర్జయేత్"అన్నారు.

గిజిగాళ్ళు

          ప్రీతిక సిటీలోఉన్నా పల్లెలోఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది.వాళ్ళకాలనీ చుట్టుప్రక్కల రెండు,మూడు కిలోమీటర్లవరకు పచ్చదనంతో ఉంటుంది.ఎక్కడా వర్షం లేకపోయినప్పటికి వీళ్ళకు వర్షం పడుతూ ఉంటుంది.
ఆవాతావరణానికి ఎక్కడెక్కడి పిట్టలు,గిజిగాళ్ళు అంటే పిచ్చుకలు వస్తూఉంటాయి.ఊరపిచ్చుకలు పల్లెల్లోనే
ఎక్కువగా కనిపించటంలేదు.ఇక్కడ తలుపు తీసిఉంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి.ప్రీతిక ఖాళీగా వున్నప్పుడల్లా వీటిని చూడటంతోనే కాలక్షేపం సరిపోతుంది.ఎన్నోరంగులవి చిన్నచిన్న పిట్టలు,పెద్దవి, పసుపు,నలుపు,పొగాకురంగు,పెసరపట్టురంగు,పైనగోధుమరంగు క్రిందపసుపురంగు,నలుపుఎరుపుచుక్కలతో
ఉన్నవి వస్తూవుంటాయి.ఒకరకంపిట్ట అయితే సన్నగావున్న ముక్కుతో పువ్వును చీల్చిపువ్వులోని
మకరంద్రాన్ని గ్రోలుతుంటుంది.తెల్లవారుజామున ఐదుగంటలనుండి సాయంత్రం ఆరుగంటలవరకు అనేకరకాల
అరుపులు వినిపిస్తుంటాయి.ప్రీతిక వాటికి గింజలు వెయ్యటం,నీళ్ళు పెట్టటం చేస్తుంటుంది.గిజిగాళ్ళు అంతరించిపోతున్న నేపధ్యంలో వాటిని కాపాడవలసిందిగా పర్యావరణవేత్తలు కోరుతున్నారు.మనంకూడా
శ్రమపడాల్సినపనేమీ కాదుకనుక వాటికి కొంచెంగింజలు,నీళ్ళు పెడితే కొన్నిరోజులకు అలవాటుపడతాయి.  

శంఖిణి

         మంజుల కుటుంబం ఎప్పుడు ఇండిపెండెంట్ ఇంట్లోనే ఉండేవాళ్ళు.మంజుల భర్తకి,పిల్లలకు కూడా
అపార్ట్ మెంట్ అంటే ఇష్టం ఉండేదికాదు.దేనిలోనయినా మంచి,చెడు రెండు ఉంటాయి.అందరూ కలిసికట్టుగా
ఉంటే ఆసంతోషం వేరు.లేదంటే చాలా ఇబ్బంది.అనుకోకుండా వాళ్ళ అబ్బాయి కోసం ఒకసారి అపార్ట్ మెంట్
తీసుకోవలసి వచ్చింది.ఒక్కో అంతస్తుకు నాలుగు ఏఫ్లాట్ కాఫ్లాట్ సంబంధం లేదుఅని తీసుకున్నారు.బహుశా
జీవితంలో మొదటిసారి చివరిసారి కూడా అదే కావచ్చు.మరిచిపోలేని అనుభవం.వీళ్ళ ఎదురు ఫ్లాట్ లో ఒక విచిత్ర కుటుంబం ఉండేది.ఉండేది ముగ్గురేకానీ ముగ్గురూముగ్గురే.వచ్చి గంటలుగంటలు గొప్పలు చెప్తుండేది.
నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను.నాది పడవంత కారు అనేది.ఆవస్తువు ఉందా?ఈవస్తువు ఉందా?
అంటూ తీసుకుని ఇచ్చేదికాదు.ఇచ్చినా అది పనిచేసేదికాదు.ఇనార్బిట్ కెల్దాం,నోవాటెల్ లో ఉమెన్ ఎక్స్పో ఉంది
వెళ్దామా?అంటూ కారుకీస్ తెచ్చి చివరకు మంజులకారులో బయల్దేరేది.వాళ్ళఅమ్మాయి అబ్బాయిలతో
తిరుగుతుండేది.ఈవిడలేనప్పుడు ఆయనతోపాటు వేరే వాళ్ళు గంటలుగంటలు ఉండేవాళ్ళు.ఆయనలేనప్పుడు
ఈవిడకోసం అర్థరాత్రి,అపరాత్రని లేకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు.ఈవ్యవహారం మంజులకుటుంబానికి ఇబ్బందికరంగాఉంది.ప్రక్కఫ్లాట్లో ఏమిజరుగుతుందో కూడా పట్టించుకోని పరిస్థితి.ఎప్పుడంటే అప్పుడు
శంఖిణిలా ఈమె మనింటికి వచ్చికూర్చుంటుంది.మనకెందుకొచ్చిన అపార్ట్ మెంట్ గోల ఖాళీ చేసేద్దామని
ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయారు.

ఆర్దిక సలహాదారు

            వినమ్రకు అమ్మే సలహాదారు.వినమ్ర అమ్మవిమలాదేవి చాలాతెలివితేటలుకలది.ఏవిషయంలోనయినా
 వినమ్ర అమ్మ సలహాలేనిదే ఏపనీ చేయదు.రోజు రెండు,మూడుసార్లు ఫోనుచేసి అమ్మా ఆవిషయం అలా చేశాను ఈవిషయం ఇలా అనిచెప్పనిదే నిద్రపట్టదు.పొదుపుమంత్రం,ఆర్ధికలావాదేవీలు విమలమ్మగారికి వెన్నతో పెట్టిన  విద్య.వినమ్ర కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనానిర్ణయం తీసుకున్నాచివరగా అది మంచి నిర్ణయమా,కాదా? ఆపని లాభమా?నష్టమా?ఆపని చేసినందువలన ఏమైనా సమస్యలుంటాయా?ఇంకా
ఏమైనా మార్పులు చేయాలా అనేది విమలదేవిగారు చెప్పాల్సిందే.ఆమెమాట ఇంట్లో అందరికీ వేదవాక్కు.
'పెద్దల మాట చద్ది మూట' అన్నట్లు విమలదేవిగారి పిల్లలు,చుట్టుప్రక్కలవాళ్ళు కూడా ఆమె సలహాకోసం వస్తుంటారు.

మాతృదేవోభవ

         మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.అమ్మ అన్న మాటే ఎంతో పవిత్రమైనది.ఆప్యాయతకు,మమతానురాగాలకు మారుపేరు అమ్మ.ఎక్కడఉన్నా ప్రతిక్షణం మన గురించి ఆలోచించేది అమ్మ.తొలిఅడుగునుండి మనవెన్నంటి ఉండేది అమ్మ.మాతృదేవోభవ,పితృదేవోభవ,గురుదేవోభవ
అనితొలిపాఠం నేర్చుకున్నాబిడ్డలకు ఆదిగురువు అమ్మ.అమ్మ గురించి ఎంత వ్రాసినా తక్కువే.బిడ్డలకు ఏకష్టం  కలగకుండా కొంత వయస్సు వచ్చేవరకు అమ్మ చూస్తుంది.తర్వాత అమ్మకు ఏకష్టం కలగకుండా చూడాల్సిన
 బాధ్యత బిడ్డలది.ప్రతిఅమ్మ తనబిడ్డలు బాగోగుల తర్వాతే తనఆరోగ్యం కూడా అనుకుంటుంది.అందుకని కొంత
వయస్సు వచ్చినతర్వాత ఎన్నిపనులున్నాసరే ఎప్పటికప్పుడు అమ్మఆరోగ్యంగురించి ప్రత్యేకశ్రద్ద తీసుకోవాల్సిన బాధ్యత బిడ్డలది.

Thursday, 8 May 2014

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

         రంజితాదేవిగారిది సాంప్రదాయ కుటుంబం.బోజనసమయంలోఇంటికి ఎవరువచ్చినా భోజనంపెట్టటం ఆనవాయితీ.టీ,కాఫీ,టిఫిన్ మామూలే.వ్యవసాయకుటుంబం కనుక పనివాళ్ళకు,వచ్చినవాళ్ళకు టీ ఇవ్వటం
సంగతి చెప్పనక్కరలేదు.వీరికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి.అమ్మాయి పెళ్లయింది పిల్లలు.వాళ్ళతో ఏసమస్య లేదు.అబ్బాయి పెళ్ళిచేస్తే కోడలు చేదోడువాదోడుగా ఉంటుందని, పద్దతులు తేడాఉన్నా మారుతుందని
డబ్బుదేముందిలే చదువుకున్నఅమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారు.సరే ఈడుజోడు బాగానే
ఉందని పెళ్ళి చేసారు.అప్పటినుండి సమస్యలు మొదలయ్యాయి.ఇంటికి ఎవరన్నావచ్చినా పలకరించేదికాదు.
భువినుండి స్వర్గానికి వచ్చాననుకునేదో ఏమో ఏ.సి.గదిలోనుండి బయటకు వచ్చేదికాదు.మాఇంటికి ఎవరన్నా
వచ్చినా టీ,కాఫీ ఇవ్వము.పన్నెండున్నర్ర దాటితే భోజనంచేయమనము అనిచెప్పింది.అక్కడవేరు ఇక్కడవేరు
ఇక్కడి పద్ధతులకు నువ్వు అలవాటు పడాలి అంటే నేను మారలేనండీ అనేది.మా ఇంటికి ఎవరు వచ్చినామేము మాట్లాడము.వాళ్ళే వచ్చివెళ్ళిపోతారు అనేది.కోడలు చేదోడుగా ఉంటుందనుకుంటే కొడుకుతోపాటు కోడలికి
అత్తగారు వండి వార్చాల్సోచ్చింది.పెళ్ళయి ఇద్దరుబిడ్డల్ని కన్నా ఇప్పటికీ పూర్తిగా మారలేదు.ఆమె పద్దతికి ఎవరయినా మారాల్సిందే.ఇంకో విచిత్రమేమిటంటే కొడుకుల పెళ్ళిళ్ళయిన తర్వాత కూతుళ్ళు కన్నవారింటికి
రాకూడదు అనేది.తనపిల్లలను ఆడపిల్లలు లేకుండా ఒక్కడే కొడుకు ఉన్న ఇంటికి కోడళ్ళుగా పంపిస్తానని
చెపుతుంది.పాతిక సంవత్సరాలయినా ఇంటిభాద్యత పూర్తిగా తీసుకోదు.పెద్దవయసైనా రంజితదేవిగారికే
తప్పటంలేదు.     

Wednesday, 7 May 2014

డిమాండ్

      ఎన్నికలకోసం పనివాళ్ళందరూ స్వంతఊళ్ళు వెళ్ళటంవలన మిగిలినవాళ్లకు డిమాండ్ పెరిగింది.నీరజ
ఊరునుండి వచ్చేవరకు నాబదులు పనిచేయమని స్నేహితురాలిని అడిగితే సరేనంది.ఆఅమ్మాయివెళ్ళగానే
రోజుకు వందరుపాయలు ఇస్తేనే పనిచేస్తాను.ఇప్పటికి మూడు ఇళ్ళు రోజుకు వందచొప్పున ఒప్పుకున్నాను.
మీకూ ఇష్టమైతే చేస్తాను అంది.యాభై రూపాయల పనికి వంద డిమాండ్ చేస్తున్నావా?అంటే అవునమ్మా
ఇటువంటప్పుడేగా మేము సంపాదించుకునేది అంది.నీకోసం ఎదురుచూచి నీఇళ్ళన్నీ అయ్యేవరకు కూర్చుని
నీకు వందరుపాయలు ఇచ్చేబదులు ఆడబ్బు ఇంకొకఆమెకు ఇచ్చిచేయించుకుంటే ఆమె సంతోషపడుతుంది.
అదీకాక నువ్వు చేస్తానని మాటిచ్చి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నావు.వద్దులే నేను వేరేఅమ్మాయితో పని  చేయించుకుంటాను అని నీరజ యజమానురాలు చెప్పేసింది.'అత్యాశకుపోతే ఉన్నది ఊడిపోతుంది'అనిశాస్త్రం.
అలాగే డిమాండ్ చేస్తే అసలు పనేలేకుండా పోయింది.

బంగారునగలు మెరవాలంటే

  1)బంగారునగలు మెరుగు పోకుండా ఉండాలంటే ఆభరణాలపెట్టెలో సీమసున్నం అంటే చాక్ పీస్ ముక్క
    చిన్నది ఉంచితే సరిపోతుంది.
2)రోజు ధరించేనగలు వారానికి ఒకసారి కొంచెం కుంకుడుకాయల రసంతో రుద్దితే క్రొత్తగా మెరుగు పెట్టినట్లవుతాయి.
3)చిటికెడు సర్ఫు,కొంచెం పంచదార వేసి ఆనీటిలో మురికిగా ఉన్న గొలుసులు పదినిమిషాలు ఉంచితే మురికి
పోతుంది.మనకు తెలియకుండానే చెమటకు మురికి పట్టినట్లవుతుంది.
4)ఒక్కో సెట్ ఒక్కో పెట్టేలోపెట్టి లాకర్ లోపెట్టటానికి కుదరదుకదా అందుకని రాళ్ళనగలు రాళ్ళు ఊడకుండా ఉండాలంటే దూదితో చుట్టి టిష్యూ పేపరులో పెట్టాలి.ఒకపెట్టెలో ఇలా పెడితే ఒకదానిపై ఒక సెట్ పెట్టినా ఏమీకాదు.
5)ముత్యాలనగలు మెరుపు పోకుండా ఉండాలంటే ఎరుపు పట్టుక్లాత్ చుట్టి పెట్టాలి.

గన్నేరుకాయలు

           సుజని స్వంత ఊరిలో శివాలయంలో గన్నేరుమొక్కలున్నాయి.వాటికి ఆకుపచ్చటి అందమైనకాయలు వేళ్ళాడుతున్నాయి.అసలువిషయం ఏమిటంటే ఆకాయలుతింటే చనిపోతారని తెలిసి ఒకతను బెదిరించటానికి
తినటానికి వెళ్తున్నానని స్నేహితులకు చెప్పాడు.వాళ్ళు యజమానికిచెప్తే వాడినిపిలిచి నాలుగు చివాట్లుపెట్టి
పిచ్చివేషాలువెయ్యకు దేనికైనా చావు పరిష్కారము కాదనిచెప్పి పెద్దవాళ్ళను పిలిపించి ఇంటికి పంపించారు.
రెండురోజులు ఊరుకుని మూడోరోజు గన్నేరుకాయలు తిన్నానని అందుకని గొంతులోఏదోఅయిపోతుందని చెప్తే
ఆసుపత్రికి పంపించారు.పొట్టఅంతా శుద్ధిచేసి నలభైవేలు తీసుకుని రెండురోజులవరకు బ్రతుకుతాడని నమ్మకం చెప్పలేదు.ఆప్రభావం కొన్నిరోజులవరకు ఉంటుందని వైద్యులుచెప్పారు.చావు తప్పి కన్నులొట్ట పోయినట్లయింది వాడి పరిస్థితి.ఒకడు ఫలానాకాయను తింటే చనిపోతారని కనిపెట్టాడుకదా అందుకని ఎన్నికలప్పుడు తాగి పోట్లాడుకుని అర్ధరాత్రి,అపరాత్రనిలేకుండా గన్నేరుకాయలు తింటామని బెదిరించటానికి ఎవరికి వాళ్ళు పరుగెత్తుకొస్తున్నారు.చెట్లు కొట్టిద్దామనుకొంటే దేవగన్నేరు,వాటిని కొట్టేస్తే పాపం,అదీకాక శివుడికి ఇష్టమైనపువ్వు
గుళ్ళోశివుడికి ఇష్టమైన మొక్క నరికేయకూడదు అన్నారు.ఇంకొకడు స్నేహితులమాటవిని నావాటాఇస్తే
వ్యాపారం చేసుకుంటానని పెద్దవాళ్ళతో పోట్లాడి గన్నేరుకాయలు తిన్నానని,తప్పుచేశానని మళ్ళీఇంటికెళ్ళి తల్లిదండ్రులతోచెప్పి క్రిందపడిపోయాడు.దగ్గరలోఉన్న వైద్యుడు వచ్చేసరికే చనిపోయాడు.వీళ్ళందరూ 15-25
సంవత్సరాలవయస్సువాళ్ళే.తెలిసీతెలియక పిచ్చిపనులు చేస్తున్నారని గన్నేరుమొక్కలకు మొదలుమాత్రం ఉంచి  కొమ్మలు కొట్టేశారు. 

ప్రేమవివాహం

       ప్రవీణ కళాశాలలో చదువుకునే రోజుల్లో ఒకసారి స్నేహితురాళ్ళందరూ చెట్లక్రింద కూర్చుని ఉండగా
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ ఎవరికి ఇష్టమైనది వాళ్ళు మాట్లాడాలని అనుకున్నారు.ఎవరికివాళ్ళు ఒక
టాపిక్ తీసుకుని రకరకాలఅభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ప్రవీణ వంతురాగానే తనుప్రేమవివాహం అనేదానిపై మాట్లడతానంది.అందరూ సరేనన్నారు.ప్రేమవివాహాలలో25% సఫలీకృతమౌతాయని మిగిలిన75%
సఫలీకృతం కావనీ తన అభిప్రాయము చెప్పింది.ఆవయస్సులోఆకర్షణనే ప్రేమ అనుకుని పెళ్ళిళ్ళు చేసుకుని
ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి కలవక పోట్లాడుకుంటూ ఇబ్బందులు పడటము,మనసుకు ప్రశాంతతలేకుండా
కొన్నిరోజులతర్వాత విడాకులు తీసుకోవటము అంత అవసరమా?ఈలోపు పిల్లలుపుడితే వాళ్ళ చిన్నిమనసులను బాధపెట్టటం ఎంతవరకు సమంజసము?తల్లిదండ్రులు ఎప్పుడూ పోట్లాడుకున్నాపిల్లలు బాధపడతారు.
విడాకులు తీసుకున్నాకొన్నిరోజులు ఒకళ్లదగ్గర,కొన్నిరోజులు ఒకళ్లదగ్గరఉన్నా తల్లిదండ్రులు ఇద్దరిదగ్గరవున్న
పిల్లల్లా ప్రశాంతంగా,సంతోషంగా ఉండగలరా?వాళ్ళు పెద్దయింతర్వాత ఎలా తయారవుతారు?ఇన్ని అలోచించి
ప్రేమించరనుకోండి.అయినా చేసుకునేముందు తప్పనిసరిగా ఆలోచించాల్సినవి కొన్నిఉన్నాయి.అటుపెద్ద
వాళ్ళకు,ఇటుపెద్దవాళ్ళకు ఇష్టమేనా?ఒకవేళ ఇష్టమయితే సరే.ఇష్టంలేకపోతే పెద్దవాళ్ళను ఎదిరించి,బాధపెట్టి
చేసుకుంటే సుఖంగా ఉండగలమా?మనది జీవితాంతము నిలిచే ప్రేమేనా?అని తెలుసుకోవాలి.ముక్తాయింపుగా
తనకు ప్రేమవివాహలకంటే పెద్దలు కుదిర్చిన వివాహాలే 95% సఫలీకృతమౌతాయని ఎందుకంటే పెద్దలు ఎన్నో
ఆలోచించి తమకు,తమపిల్లలకు సరితూగే వాళ్లనే ఎంపిక చేస్తారని ప్రవీణ తనఅభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ఇదిజరిగిన కొన్నిసంవత్సరాల తర్వాత ప్రవీణ స్నేహితురాలు కనిపించి ఏంటి ప్రవీణా?చదువుకునేరోజుల్లో
ప్రేమవివాహమంటే ఇష్టముండదని చెప్పావు.నువ్వు ప్రేమించి పెళ్ళిచేసుకున్నావా?అని అడిగింది.నేను ప్రేమ
వివాహంచేసుకోవటమేమిటి?మాపెద్దవాళ్ళు ఎన్నో సంబంధాలనువెతికి,వడపోసిమరీ పెళ్ళి కుదిర్చారని ప్రవీణ చెప్పింది.నేనుకూడా నువ్వు అలాచేసుకోవుఅని వాదిస్తే ఇంకొకామె నిజంగానే ప్రవీణ చేసుకుంది అనిచెప్పింది.
సారీ ఏమీఅనుకోకు అడిగానని అంది.ఫర్వాలేదులే నీడౌట్ తీరిపోయింది కదా!సంతోషం అని ప్రవీణ అంది.

Tuesday, 6 May 2014

పాలేరు

          నరేన్ తండ్రి వ్యవసాయదారుడు.కష్టపడి వ్యవసాయంచేస్తూ కొడుకుని చదివించాడు.తనలాగా ఎండనక,
వాననక కష్టపడాల్సిన అవసరంలేకుండా ఉద్యోగం చేసుకుంటాడు అనుకున్నాడు.ఉద్యోగం వచ్చినతర్వాత పెళ్ళి
చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు.ఒకరోజు ఆడపిల్ల తరపువాళ్ళు మాట్లాడుకుందామని వీళ్ళ
ఇంటికి వచ్చారు.నరేన్ ఆసమయానికి ఇంట్లోనే ఉన్నాడు.తండ్రి పొలంవెళ్ళి వస్తూవస్తూ గడ్డిమోపు తలపై
పెట్టుకునివచ్చాడు.పొలంలో కష్టపడి పనిచేసి బరువుగాఉన్న గడ్డిమోపు తెచ్చేసరికి ఒళ్ళంతా చెమటతో అచ్చు పాలేరులాగా ఉన్నాడు.వ్యవసాయకుటుంబమని ఆడపెళ్ళివాళ్లకు తెలిసేవచ్చారు కదా!మానాన్నగారు అని
చెప్పకుండా నరేన్ చదువుకుని కూడా అజ్ఞానంతో అతను మాపాలేరుఅని,ఈచుట్టుప్రక్కలఉన్నపొలాలన్నీమావే
అని అబద్దం చెప్పాడు.ఈవిషయం వాళ్ళనాన్నకు తెలియదుకదా!స్నానంచేసి వీళ్ళతో మాట్లాడటానికి కూర్చున్నాడు.నరేన్ మాఅబ్బాయి.ఫలానా చదువు చదివి ఉద్యోగం చేస్తున్నాడు.మాకున్నపొలంఇదిఅని
నిజం చెప్పాడు.పెళ్ళిళ్ళు మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి.అబద్దాలకు తావుండకూడదు.అందుకు
ఇష్టమైనవాళ్ళేవస్తారు.తర్వాత గొడవలు రాకుండా ఉంటాయి.ఆడపెళ్ళి వాళ్ళు మీరేమీఅనుకోనంటే ఒకమాట
చెప్తాము మీఅబ్బాయి' స్వంతతండ్రినే పాలేరు'అనిచెప్పాడు.ఈపొలాలన్నీ మావేనన్నాడు.ఇప్పుడే ఇలావుంటే
పెళ్ళైనతర్వాత మాఅమ్మాయిని సరిగ్గాచూస్తాడని నమ్మకమేమిటి? మీరు మంచివారే కానీ మేము పిల్లని ఇవ్వలేము ఏమీ అనుకోవద్దు అని నమస్కారంచేసి వెళ్ళిపోయారు.ఏరా?కష్టపడకుండా ఉద్యోగం చేసుకుని
బ్రతుకుతావులే అనుకుంటే నన్నేపాలేరుఅని చెప్తావా?చదువుకుంటే తెలివితేటలు పెరగాల్సిందిపోయి ఇలా తయరయ్యావేంట్రా? అనగానే నరేన్ 'నన్నుక్షమించు నాన్నా' అన్నాడు.ఆతర్వాత చాలాసంవత్సరాలు నరేన్
తండ్రిని పాలేరు అన్నాడని ఊళ్ళు ఊళ్ళు తెలిసి,కథలుగా చెప్పుకుని పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు.ఎలాగయితే చివరికి చాలా ఆలస్యంగా పెళ్ళయ్యింది.

నాకళ్ళతో చూడండి

      జస్వంత్ చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.మంచి అందగాడు,పొడుగరి.పెళ్ళి చేద్దామని
తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు.ఎన్నిచూసినా అమ్మాయి అందంగా ఉన్నాసరే నచ్చలేదంటాడు. చివరకు విసుగొచ్చి మావల్ల కాదు నీకుమేము పెళ్ళి ఎప్పటికిచేయగలమో ఏమిటో?అనితల్లిదండ్రులు బాధపడ్డారు.  
మీస్నేహితునికి ఏ అమ్మాయి నచ్చటంలేదు.మంచి అమ్మాయిని చూడమని చెప్పారు.ఫలానా ఊరిలో అమ్మాయిని నీస్నేహితునితో కలిసి వెళ్ళిచూడు అని చెప్పారు.అక్కడికి వెళ్ళి వచ్చినతర్వాత అమ్మాయి నచ్చిందని చెప్పాడు.ఇంతకీ ఆఅమ్మాయి ఎలాఉందంటే అబ్బాయి అందంగా అమ్మాయి ఒకమాదిరిగా
పొట్టిగా,నల్లగా,లావుగా ఉంది.అదేమిటి?ఎంతో అందమైన అమ్మాయిలను నచ్చలేదన్నావు ఈ  అమ్మాయిని
చేసుకోవటమేమిటి?అని స్నేహితులు,చుట్టాలు,చివరకు తల్లిదండ్రులు కూడా అన్నారు.జస్వంత్ అందరికీ నాకు ఆఅమ్మాయి చాలానచ్చింది.'చాలాఅందంగా ఉంది నాకళ్ళతో చూడండి' అన్నాడు.ఇకఎవరూ నోరెత్తి ఒక్కమాట
కూడా మాట్లాడలేదు.తనకు నచ్చినప్పుడు మిగతావాళ్ళకు నచ్చేదేముంది?అనుకున్నారు.

చెడ్డఅలవాటు

         పూర్ణిమ కూతురు మాధురికి చిన్నప్పటినుండి అతిగారాభంతో  బడినుండిరాగానే కాళ్ళు నొప్పులు ఉండకుండా కాళ్ళు నొక్కటం అలవాటు చేసింది.అదే ఆపిల్లకు చెడ్డఅలవాటుగా మారింది.పధ్నాలుగుఏళ్ళు
వచ్చినా చెల్లితో  కాళ్ళుపట్టించుకుంటుంది.తాతగారు ఊరునుండివస్తే కాళ్ళు ఒడిలోపెట్టేసి కాళ్ళువత్తమంటుంది.
వాళ్లనానమ్మ తప్పు అలాకాళ్ళు ఒడిలోపెట్టకూడదు.పెద్దదానివయ్యావుఇంకా ఆపిచ్చిఅలవాట్లు ఏమిటి?అని కోప్పడింది.అమ్మమ్మ పెళ్ళయిన తర్వాత కొంపదీసి మొగుడితోకూడా నొక్కించుకుంటావా ఏంటే?అని మేలమాడింది.అవును అని మాధురి సిగ్గుపడుతుంది.చిన్నప్పుడు పెద్దవాళ్ళు గారాభంతో చేసినపనులు
పిల్లలు మానుకోలేని చెడ్డఅలవాట్లవుతాయి. 

ఆరంభ సూరత్వం

            అర్పిత్ అన్నిపనులు తానే ఎవరి సహాయము లేకుండా చేయగలననే ధీమాగా ఆరంభసూరత్వంతో మొదలుపెడతాడు.మొదట ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండదు.అందువలన అన్నిపనులు మధ్యలోనే వదిలేస్తుంటాడు.మళ్ళీ ఇంకొకపని మొదలెడతాడు.
వాళ్ళ టీచరు రెండు,మూడుసార్లు చూసి అర్పిత్ ని పిలిచి నువ్వు ఒక పని పూర్తికాకుండానే ఇంకొకపనిమొదలు
పెడుతున్నావు.అలా చేయకూడదు.ఏపనీ పూర్తికాదు.ఒకపని పూర్తయినతర్వాత ఇంకొకపని మొదలుపెడితే చక్కగా పూర్తి చేయగలుగుతావు అనిచెప్పింది.నీకు కావాల్సింది ఆరంభసూరత్వంకాదు.ఏపనైనా సకాలంలో సక్రమంగా సంపూర్తిగా చేయగలిగినవాడే గొప్ప.అవసరమయినప్పుడు ఎవరిసహాయం తీసుకున్న తప్పులేదు.ఈవిషయం జీవితాంతం గుర్తుపెట్టుకో వృద్దిలోకి వస్తావు అని టీచరు కోప్పడకుండా సౌమ్యంగా
అర్పిత్ కి చెప్పింది.సరే టీచర్ అని కృతజ్ఞతలు తెలిపి తనతప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నాడు.     

Monday, 5 May 2014

రాళ్ళు,రప్పలు

    రాజేంద్ర,రవీంద్ర అన్నదమ్ములు.దైవదర్శనానికి వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులను,అక్కను తీసుకుని
కుటుంబసమేతంగా వెళ్ళేవాళ్ళు.పదహారు సంవత్సరాలక్రితం ఒకసారి షిర్డీవెళ్లారు.బాబాదర్శనం అయినతర్వాత నాసిక్,త్రయంబక్,శనిసింగణాపూర్,రాముడు,సీత అరణ్యవాసం చేసినప్పుడు నివసించినగుహ చూశారు.
అక్కడనుండి ఎల్లోరా,ఔరంగాబాద్ ,ఘ్రుష్నేస్వర్ వెళ్లారు.తిరిగి హైదరాబాదు వచ్చినతర్వాత యాదగిరిగుట్ట,బాసర వెళ్లారు.హైదరాబాదులో చూడవలసినవి తల్లిదండ్రులకు చూపెట్టారు.వీటన్నిటికి పదిరోజులు పట్టింది.ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలుచేసి అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా మాటలసందర్భంలోజ్యోతిర్లింగాలకు అభిషేకాలతో సహా అన్నీచక్కగాచేశాము. అజంతా చాలాదూరం కనుక సమయంలేకపోవటంవలన వెళ్ళలేకపోయాము అనుకున్నారు.
  రాజేంద్ర,రవీంద్రల నాన్నగారు ఉన్నట్టుండి' చూపించారులే రాళ్ళు,రప్పలు'అన్నారు. అన్నదమ్ములిద్దరూ ఏమి మాట్లాడాలో తెలియక ఒకరి ముఖం ఒకరు  చూసుకున్నారు. కొడుకులు ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టిమరీ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే' భలే మాట్లాడారులే' అని తోడుకోడళ్ళు నవ్వుకున్నారు.Sunday, 4 May 2014

నవ్వు దివ్యఔషధం

      ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం.ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు అందరూ హాయిగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.ఎన్నో భాషలు,ఎన్నోరకాల పలకరింపులు  ఉన్నా చూడచక్కని చిరునవ్వే అన్నింటినీ మించినది.ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉంటే
అందంగా కనిపించటమేకాక,గంభీరంగా ఉండేవాళ్ళకన్నాఎంతో ప్రశాంతంగా,ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉంటారు.నవ్వు శరీరానికి ఎంతో తేలికైన మంచి వ్యాయామం.నవ్వటానికి మన శరీరంలోని కండరాలు పెద్దగా శ్రమ పడనక్కరలేదు.అదే కోపం తెచ్చుకోవటానికయితే శరీరకండరాలు ఎక్కువ శ్రమపడాలి.కోపం తగ్గించుకుని నవ్వుతూ ఉండాలి.అలాగని అనవసరంగా నవ్వకూడదనుకోండి.నవ్వు శరీరంలో ఆక్సిజన్ శాతాన్నిపెంచి,ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లను విడుదల చేయటంవలన రోగనిరోధకశక్తి పెరిగిఅనారోగ్యాలు దరిచేరకుండా చేస్తుంది.
నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఇంతకు ముందు మాట.నవ్వు ఎన్నో విధాల మేలు అనేది ఇప్పటి మాట.అందుకే నవ్వొక దివ్యౌషధం.'నవ్వటం ఒక భోగం ..నవ్వకపోవటం ఒక రోగం'అనేది నిజం.హాయిగా
నవ్వండి అందరినీ నవ్వించండి.

Saturday, 3 May 2014

సైగల భాష

         కుముదిని కూతురుతో కలిసి పెళ్ళికి బెంగుళూరు వెళ్ళింది. పెళ్ళి అయినతర్వాత వచ్చేటప్పుడు రైలు బయలుదేరిన తర్వాత కొంచెంసేపటికి ఒక  స్టేషన్లో గుంపుగా కొంతమంది విద్యార్ధులు ఎక్కారు.ట్రైనింగ్ నిమిత్తం
వేరే ఊరు వెళ్తున్నామని చెప్పారు.ఎక్కిన దగ్గరనుండి వాళ్ళల్లో ఒకతను కుముదిని కూతుర్ని తొంగి తొంగి
చూస్తున్నాడు.కుముదిని కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకుని వాడి దగ్గరకు వెళ్ళి ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నావు?అని గదమాయించి అడిగింది.ఏభాషలో మాట్లాడినా నాకు అర్ధం కావట్లేదు అంటున్నాడు.
చివరకు ఒరియా తప్ప ఏమీ రాదు అన్నాడు.సరే సైగలకు ఏ లంగ్వాజ్ తో పనిలేదు కదా!అని నా కూతురు
వైపు చూస్తే ఊరుకోను అని సైగ చేసి  తర్జని తో బెదిరించింది.దాంతో వాడు మళ్ళీ చూడలేదు.  

Friday, 2 May 2014

ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు

        ఉషశ్రీ బంధువుల్లో సావిత్రి అనే పెద్దావిడ ఉంది.వాళ్ళింటి దగ్గర కానీ,బంధువుల్లోకానీపెద్ద ముత్తయిదువ అని పూజలకు,పారాయణాలకు,పెళ్లిళ్లకు,పేరంటాళ్ళకు ఎవరు పిలిచినా తరతమ భేదం లేకుండా హాజరవుతూ ఉండేది.ఒక పెళ్ళిలో అందరూ కూర్చునిఉన్నప్పుడు ఏమిటండీ ఈమధ్య ఎక్కడా కనిపించటం లేదు అని అందరూ అడిగారు.ఏమిచెప్పమంటారండీ ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్లుంది నాపని అంది.అదేమిటండీ అలా మాట్లాడుతున్నారు అన్నారు అందరూ.ఈమధ్య మా ఆయన క్రొత్త వ్యాపారం మొదలుపెట్టారు.ఆయన ఊళ్ళు తిరుగుతూ నన్నుమా అమ్మాయి ఇంట్లో వదిలి వెళ్తున్నారు.అందుకని రాలేకపోతున్నాను అని చెప్పింది.కృష్ణా,రామా అంటూ ఇక్కడ కాలక్షేపం వేరు,అక్కడి కాలక్షేపం వేరు అయినా తప్పని పరిస్థితి అని వాపోయింది.

రైల్లో ధీర వనిత

        లోచన కొడుకు పెళ్ళయి రెండునెలలు అయింది.ఉద్యోగరీత్యా చెన్నయ్ లో ఉంటాడు.కాపురం పెట్టిద్దామని లోచన కోడల్ని,కోడలు చెల్లెల్ని,వియ్యపురాలిని తీసుకుని రైల్లో చెన్నయికి బయల్దేరింది.మగవాళ్ళు బిజీగా
ఉండటంవలన ఆడవాళ్ళు బయల్దేరారు.మిగతావాళ్ళు భయపడుతుంటే లోచన ధైర్యం చెప్పి నాకు నిద్రపట్టదు
అందుకని నేను చూస్తూఉంటానులే మీరు నిద్రపొండి అనిచెప్పింది.లలిత అందరినీ గమనిస్తూ ఉంది.ఒకతను
సీటులో కుర్చోలేనట్లుగా కదలటము సెల్ ఫోనులో ఏదోచూస్తున్నట్లు నటిస్తున్నాడు.లోచనగమనించగా
అర్ధమయినది ఏమిటంటే వాడు అందరూ నిద్రపోతున్నారో లేదోనని సెల్ కెమేరాతో చూస్తున్నాడు.రైలు ఒంగోలు దగ్గరకు వస్తుందనగా నిద్రపోతున్నలోచన కోడలిమెడలోనుండి గొలుసు లాగటానికి పట్టుకున్నాడు.లోచన
మెలుకువగా ఉందనివాడు ఊహించలేదు.లోచన భద్రకాళిలా ఒరేయ్ అంటూ అరిచేసరికి కోడలులేచి దొంగ
దొంగ అనిఅరవటం మొదలెట్టింది.వాడు కంగారుపడి రైలు ఆగుతుండగానే స్టేషన్లో దిగేశాడు.గుర్తుపట్టరనుకొని
రైలు బయల్దేరగానే వేరే భోగీలోనుండి వచ్చి అదే సీటులో కూర్చున్నాడు.ఇదుగోవీడే దొంగ అనిచెప్తే అందరూ తలా ఒకదెబ్బ వేసి టి.సి వస్తే కంప్లైయింట్ రాసుకుని రైల్వే పోలీసులకు అప్పచెప్పమంటే చేస్తాను,చెప్తాను అంటున్నాడు కానీ కదలటంలేదు.మీరు కోర్టుకు వెళ్ళాల్సొస్తుంది అంటూ ఎదోఒకటి చెప్తున్నాడు.ఫిర్యాదు చెయ్యాల్సిందే అంటే ప్రక్క స్టేషన్లో దిగి ఫిర్యాదు చేసి  తర్వాత రైల్లో రండి అంటున్నాడు.
                లోచనకు ఫోటోలు తీయటం హాబీ.దొంగని,దొంగకూర్చున్నసీటుని,టి.సినిసాక్ష్యానికి  చుట్టుప్రక్కలవాళ్ళను ఫోటోలు తీసింది.అప్పుడు టి.సి వచ్చి మీరు తర్వాతయినా ఫిర్యాదు చేసేట్లున్నారు.
 దయచేసి డిలీట్ చేయండి మేడమ్ అన్నాడు. పోలీసులకు వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకునేవరకు డిలీట్ చెయ్యను అని చెప్పింది.అప్పుడు పోలీసులను తీసుకొచ్చి వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకున్నారు.అదికాదు మేడమ్ ఫోటోలు డిలీట్ చెయ్యమంటే లోచన అదే మీ కుటుంబానికి ఇదే పరిస్థితి వస్తే
బాద్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తారా? రెండు గంటల తర్వాత మేము దిగిపోతాము మీరెవరో,మేమెవరో మీ డ్యూటీ మీరు సక్రమంగా చెయ్యండి ఆడవాళ్ళు ఏమిచేస్తారులే అని నిమ్మకునీరెత్తినట్లు కూర్చుంటే మీఉద్యోగాలు
ఊడిపోతాయి అంది.మిగిలిన వాళ్ళు కూడా వంతపాడారు.అప్పుడు టి.సి నాది ఈ భోగీలో పని కాదు మీకో నమస్కారం అని వెళ్ళిపోయాడు.

Thursday, 1 May 2014

మందారమొక్కకు పిచ్చుకగూడు

          చైత్ర ఇంటిప్రక్కన జానకమ్మగారిల్లు.ఇంటిముందు ఖాళీస్థలంలోమొక్కలు నాటారు.మందారమొక్క కాస్త   ఏపుగా పెరిగింది.జానకమ్మ దంపతులు కొడుకుల దగ్గరకు విదేశాలకు వెళ్ళి వచ్చేటప్పటికి మందార ఆకుల్లో
బయటకు కనిపించకుండా ఒక చిన్ని పిచ్చుకగూడు అల్లింది.జానకమ్మ రోజు గమనిస్తుండేది.వీళ్ళు లేచేటప్పటికి ఏమీ కనిపించేవికాదు.సాయంత్రము ఆరుగంటలకు జానకమ్మ దూరంనుండి గమనించగా
రెండు చిన్నచిన్నఅందమైన పిచ్చుకలు గూటిలో ఉన్నాయి.రెండురోజులతర్వాత మూడు చిన్నగుడ్లు పెట్టాయి.
కొన్నిరోజులకు పొదిగి పిల్లలను చేసినాయి.భలే ముద్దుగా ఉన్న పిల్లలు బయటకు వచ్చాయి.పెద్దవి పిల్లలకు
ఆహారం తెచ్చి పెట్టటం వాటిఆలనపాలన చూచేవిధానం మురిపెంగా చూడటంతోనే జానకమ్మకు పొద్దుగడిచి పోయేది.సిటీలో మందార మొక్కకు గూడు అల్లి పిల్లలను పెట్టిన పిచ్చుకలజంటను,పిల్లలను చూడటానికి
అందరూ వచ్చేవాళ్ళు.సిటీలో పిల్లలకు నిజమైన పిచ్చుకగూడు తెలియదుకదా అందుకని పిల్లలను తీసుకొచ్చి
తల్లిదండ్రులు చూయించేవారు.