Friday, 31 October 2014

అడ్డమైన చాకిరి

                                                     వేణి పట్టణానికి దగ్గరలో ఉండటం వలన చిన్నాన్నపిల్లలు,మేనమామ పిల్లలు చదువుకోవటానికి ఊరునుండి  వచ్చి వేణి ఇంట్లోనుండి కళాశాలకు వెళ్ళి వస్తుండేవారు.పిల్లలు ఉంటున్నారు కనుక పెద్దవాళ్ళు వేణికి ఊరునుండి కూరగాయలు పప్పులు,బియ్యంతో సహా అన్నీపంపిస్తుండేవారు.అయినా వేణి మగ
పిల్లలు,ఆడపిల్లలని తేడా లేకుండా అందరితో ఇంట్లో అడ్డమైన చాకిరి చేయించుకునేది.ఆఖరికి వాకిలి,మెట్లు కూడా
కడిగించేది.చిన్నాన్నకొడుకు కొంచెం అమాయకంగా ఉంటాడు కనుక బట్టలు మడతపెట్టించుకుంటుందని,వాకిలి కడిగిస్తుందని అందరూ అనుకునేవాళ్లు.కానీ మేనమామ కొడుకు ఇంజనీరింగు చదివే అబ్బాయితో కూడా అదే పని చేయిస్తుంది.హతవిధీ!దీనికేమైంది?ఎవరుంటే వాళ్ళతో ఆరకంగా అడ్డమైన చాకిరి చేయించుకోకపోతే ఏం పోతుంది?
పనివాళ్ళను పెట్టుకునేదానికి,చదువుకోటానికి వచ్చిన పిల్లలను ఇబ్బంది పెట్టకపోతే అని చుట్టుప్రక్కల వాళ్ళు
అనుకోవటం మామూలైపోయింది.కానీ ఆమెలో మాత్రం మార్పురాదు.పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం
 వాళ్ళతో పూచిక పుల్లంత పనికూడా చేయించటంలేదని తనే పనంతా కష్టపడి చేసుకుంటున్నట్లు చెపుతుంటుంది.
 వాళ్ళేమో అదంతా నిజమని నమ్ముతుంటారు.పిల్లలు చదువే లోకంగా చదువుకుంటున్నారు కాబోలు అని
సంతోషపడుతుంటారు.

అదృష్టవంతుడు

                              జానకిరామయ్య గారికి తొంభైఆరు సంవత్సరాలు.అయినా పూర్తి ఆరోగ్యంతో తనపనులు తాను చేసుకుంటూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాయంత్రం పార్కువరకు వెళ్ళి అక్కడ పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి వారి ఆటలు చూస్తూ సరదాగా వారితో కాలక్షేపం చేసి ఇంటికి రావటం అలవాటు.ఆయనకు ఒక్కతే కూతురు.ప్రతిరోజూ పార్కు నుండి వచ్చిన తర్వాత కూతురితో మనుమరాలు,మునిమనుమళ్ళ ముచ్చట్లు చెప్పటం ఆయనకు అలవాటు.మాటల మధ్యలో అమ్మాయ్!ఈరోజు బుధవారం.నేను పుట్టినరోజు కూడా బుధవారమే.ఏరోజు పుడితే అదే రోజు చనిపోతారని మా తాతలు చెప్పేవాళ్ళు నేను కూడా అంతే చనిపోతానని అనిపిస్తుంది అన్నారు.అలా ఏమీ కాదులే నాన్నా!లోపలకు రండి అంటూ ఆమె లోపలకు వెళ్ళింది.ఆయన ఎంతసేపటికీ లోపలకు రాకపోయేసరికి మళ్ళీబయటకు వచ్చి నాన్నాఅంటూ చెయ్యి పట్టుకునేసరికి ప్రక్కకు వాలిపోయారు.ఆమెకు ఏమీ అర్ధంకాక వైద్యునికి ఫోను చేసింది.ఆయన వచ్చిమీనాన్నగారు  చనిపోయరనేసరికి ఒక్కసారిగా గొల్లుమంది.చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఆయన ఎంతో అదృష్టవంతుడు తిరుగుతూ తిరుగుతూ ఎవరితో చాకిరీ చేయించుకోకుండా పోయాడు అని కూతుర్ని ఓదార్చారు.ఈలోపు మనుమరాలికి ఫోనుచేస్తే విదేశానుండి హుటాహుటీన కుటుంబంతో వచ్చింది.అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అంత్యక్రియలు పూర్తిచేశారు.

Thursday, 30 October 2014

బొప్పాయి వేపుడు

పచ్చి బొప్పాయి కాయ -1 చిన్నది
కంది పప్పు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
వేపుడు కారం - 2 స్పూనులు
 వెల్లుల్లి - 6 రెబ్బలు
                              బొప్పాయి చెక్కుతీసి గింజలు,తెల్లటి పొర తీసేసి సన్నటి ముక్కలు కోసి మెత్తగా కాకుండా ఉడికించాలి.ముక్కలు నీరు లేకుండా పిండి ప్రక్కన పెట్టుకోవాలి.కందిపప్పు కొంచెం ఉడికించాలి.నీరు వంచేయాలి.
బాండీలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులు,కరివేపాకు వేసి బొప్పాయి ముక్కలు వేసి కొంచెం వేగాక,ఉప్పు,
కందిపప్పు వేసి వేయించాలి.వెల్లుల్లి కొట్టి వేసి,వేపుడుకారం వేసి,మంచి వాసన వచ్చిన తర్వాత దించేయాలి.ఇది
వేడివేడి అన్నంతో చాలా రుచిగా బాగుంటుంది.ఎప్పుడూ ఒకే కూరలు చేసే కన్నా వెరైటీగా చేస్తే బాగుంటుంది.మరి
మీరూ ప్రయత్నించండి.

బొప్పాయి కోఫ్తా

పచ్చి బొప్పాయి కాయ - 1(మీడియం సైజుది)
కారం - 3/4 స్పూను
 శనగ పిండి - 2 స్పూనులు
ధనియాలపొడి - 2 స్పూనులు
జీరా - 1/2 స్పూను
టొమాటోలు - 4
పసుపు - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె -వేయించడానికి  సరిపడా
       మసాలా
ఉల్లిపాయలు - 3
వెల్లుల్లి - 10
గసాలు - 1 స్పూను
లవంగాలు - 3
దాల్చిన చెక్క - కొంచెం  (ఇవన్నీ కలిపి మెత్తగా చేసుకోవాలి)
                                       బొప్పాయికాయ కోసి గింజలు తీసి సన్నగా తురిమి నీరు పిండి శనగపిండి,ఉప్పు వేసి బాగా కలపాలి.కొంచెం నూనెలో ఈకోరుని పకోడీల మాదిరిగా వేయించాలి.ఒకగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి జీరా,
రుబ్బిన మసాలా,ఉప్పు,కారం,పసుపు,ధనియాల పొడి,టమోటా ముక్కలు వేసి వేయించి 1 కప్పు నీళ్ళుపోసి 10ని.లు మరగనివ్వాలి.తర్వాత పకోడీని అందులో వేసి మూతపెట్టి 10 ని.లు సిమ్ లో ఉడకనిచ్చి కొత్తిమీర చల్లి దించాలి.ఇది చపాతీ,పూరీ,రైస్ తో చాలా బాగుంటుంది.

కూరగాయలు,గ్రుడ్డుతో విభిన్నంగా ......

బంగాళదుంపలు  - 400 గ్రా.
సేమ్యా - 50 గ్రా.
కాప్సికం - 1
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
కోడిగ్రుడ్డు - 1
కొత్తిమీర - కొంచెం
నిమ్మరసం - 1 స్పూను
బఠాణీ - 100 గ్రా.
కాబేజీ ఆకులు - కొన్ని
నూనె - వేయించడానికి సరిపడా
                                                       కొంచెం నూనెలో తరిగిన ఉల్లిపాయలు,కాప్సికం వేయించుకోవాలి.కొత్తిమీర,
ఉప్పు వేసి,ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంపలు కలిపి,నిమ్మరసం పిండి గుండ్రంగా చేసి వాటి మధ్య ఉడికించిన బఠాణీలు పెట్టి కోడిగ్రుడ్డు ఆకారంలో చేయాలి.వీటిని గిలకొట్టిన కోడిగ్రుడ్డులోముంచి,సేమ్యాలో దొర్లించి, నూనెలో వేయించి,కాబేజి ఆకుల్లో ఉంచి సర్వ్ చేయాలి.

బ్రెడ్ పుడ్డింగ్

బ్రెడ్ స్లైసెస్  - 6
పాలు - 1 కప్పు
పంచదార -75 గ్రా.
చెర్రీస్  - 6
 వెనీలా ఎసెన్స్ - 1 స్పూను
 కోడిగ్రుడ్లు - 2                                                                                                                                                                                                           బ్రెడ్ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో ఇవివేసి వీటిపై పాలుపోసి ప్రక్కన పెట్టాలి.కోడిగ్రుడ్లు,పంచదార,వెనీలా ఎసెన్స్ బాగా కలిపి బ్రెడ్ పైన
పోసి టిష్యూ పేపరుతో కవర్ చెయ్యాలి.కుక్కర్లో ఈ గిన్నె పెట్టి సిమ్ లో 20 ని.లు ఉడికించాలి.దించి ఒక ప్లేటులో
వేసి చెర్రీస్ తో అలంకరిస్తే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ.                         

అరటిపండ్లతో స్వీటు

అరటిపండ్ల గుజ్జు - 2 కప్పులు
మీగడ - 1/2 కప్పు
పంచదార - 2 స్పూన్లు
సన్నగా తరిగిన జీడిపప్పు - 3 స్పూన్లు
వెన్న - 2 స్పూన్లు
యాలకులపొడి - కొంచెం
వెనీలా ఎసెన్స్ - 1/4 స్పూను
                                               వెన్న వేడిచేసి దానిలో అరటిపండ్ల గుజ్జు,మీగడ,పంచదార,యాలకులపొడి వేసి
అంటుకోకుండా ఉండేటట్లు త్రిప్పుతూ  వెనీలా ఎసెన్స్ కలిపి ప్లేటుకి నెయ్యిరాసి దానిపై వేసి జీడిపప్పు చల్లి ఆరిన తర్వాత నచ్చిన షేప్ లో ముక్కలు కట్ చేసుకోవాలి.

Wednesday, 29 October 2014

మకరోని పాయసం

    మకరోని - 200 గ్రా.
    పాలు - 1 లీ.
    పంచదార - 1/4 కే.జి.
    జీడిపప్పు - 50 గ్రా.
    కిస్ మిస్ -  25 గ్రా.
    యాలకులు - 4
    నెయ్యి - 50 గ్రా.
    కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
                                                                    ఒక గిన్నెలో 4గ్లాసుల నీళ్ళుపోసి మరిగించి మకరోని 10 ని.లు ఉడికించి వార్చి 1స్పూను నెయ్యి వేసి కలిపితే మకరోనీ అంటుకోదు.పాన్ లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు,కిస్ మిస్ వేయించి దానిలో పాలుపోసి మరుగుతుండగా మకరోనీ వేసి ఉడికిస్తే పాయసం చిక్కబడుతుండి.దించి పంచదార కలిపి,యాలకుల పొడి,తురిమిన కొబ్బరి వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.

బుద్ధా లాకెట్

                                                               యోషిత కొడుకు చరణ్ అల్లరి పిడుగు.ఒకరోజు వాళ్ళింటికి యోషిత బంధువులు వచ్చారు.చరణ్ ఇల్లంతా హడావిడిగా తిరుగుతూ వచ్చీరాని మాటలతో ఎవరైనా ఏమైనా అడిగితే గడసరి సమాధానాలు చెప్తున్నాడు.వీడు పెద్ద ముదురు అయ్యేట్లున్నాడు అని ఒకామె ఒకసారి ఇక్కడకురా నాన్నా!అని పిలిచింది.వచ్చిన తర్వాత వాడి మెడలో గొలుసుకి గౌతమ బుద్దుని లాకెట్ వేలాడుతుంది .బుద్ధా లాకెట్ బాగుంది నాకిస్తావా?అంది.నేను ఇవ్వను కానీ ఏంటో?మా అమ్మఈ బుద్ధా లాకెట్ ని అందరికీ కనపడేట్లుగా షర్ట్ పైకి పెట్టింది లోపలకు అన్నా పెట్టలేదు అన్నాడు.వాడి మాటలకు ముద్దు వచ్చి వాళ్ళ అమ్మమ్మ చంకనెత్తుకుంది.  

Monday, 27 October 2014

ఖర్జూరాల హల్వా

గోధుమ పిండి - 200 గ్రా.
ఖర్జూరాలు - 200 గ్రా.
నెయ్యి - 200 గ్రా.
పంచదార - తగినంత
 రోజ్ వాటర్ -  100 ml.
 యాలకుల పొడి -  కొంచెం
కుంకుమ పువ్వు - చిటికెడు
పాలు - 1 స్పూను
                                     గోధుమ పిండిని బాండీలో వేసికొద్దిగా వేయించి నెయ్యివేసి ఉండలు కట్టకుండా మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.ఖర్జూరం ముక్కలు,రోజ్ వాటర్,పంచదార వేసి బాగాకలిపి నెయ్యి పైకి తేలేవరకు
కలుపుతూ ఉడికించాలి.పాలల్లో కలిపియా కుంకుమపువ్వు,యాలకులపొడి వేసి బాగా కలిపి 5 ని.లు ఉంచి దించాలి.  

వేరుశనగ బర్ఫీ

పచ్చి వేరుశనగ పప్పు - 1 కప్పు
జీడిపప్పు - 50 గ్రా.
కిస్ మిస్  - 50 గ్రా.
పంచదార - 1/2 కే.జి
కొబ్బరి తురుము  - 1 గుప్పెడు
యాలకుల పొడి - కొంచెం
నెయ్యి - 1/2 కప్పు
కేసరి పౌడర్ -కొంచెం (ఇష్టమైతే )
                                                          వేరుశనగ గుళ్ళు 2,3 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి.జీడిపప్పు నేతిలో వేయించాలి.రెండు కలిపి మెత్తగా రుబ్బాలి.ఒక పాత్రలో పంచదార,కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి లేత తీగపాకం వచ్చినతర్వాత రుబ్బినముద్దను వేయాలి.గరిటెతో బాగా కలియబెడుతూ ఉండాలి.కొబ్బరితురుము కూడా వెయ్యాలి.మధ్యమధ్యలో నెయ్యివేస్తూ కలపాలి.కొంచెం దగ్గరపడిన తర్వాత యాలకులపొడి,కొంచెం వేయించిన జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలిపి చివర్లో కేసరి పౌడర్ వేసి దించి నెయ్యి రాసిన ప్లేటులో పోసి ముక్కలుగా కట్ చేయాలి.అంతే నోరూరించే వేరుశనగ బర్ఫీ రెడీ.  

పాల్వతీ నిన్ను చంపేత్తా

                                                     గవీష్ ఇల్లంతా బొమ్మలు,కార్లు పరిచి ఆటలడుతున్నాడు.వాడికి నాలుగు సంవత్సరాలు.పనిమనిషి పార్వతి ఇల్లు తుడవటానికి వచ్చింది.బాబూ! కొంచెంసేపు బొమ్మలు ప్రక్కకు పెట్టాలని అక్కడ నుండి లేవమని చెప్పింది.బొమ్మలు తియ్యొద్దు.పాల్వతీ నిన్ను చంపెత్తా!అని వచ్చీరాని మాటలతో అన్నాడు.వాడికి పూర్తిగా మాటలు రాలేదు.నన్ను చంపేత్తే నాపిల్లలను ఎవరూ చూత్తారు బాబూ అని పార్వతి అనగానే ఠపీమని నీపిల్లలను నేను పెంచుకుంటా పాల్వతీ అన్నాడు.అక్కడే ఉన్న గవీష్ జేజమ్మ వీడికి సరిగ్గా మాటలే రాలేదు.వీడినే ఒకళ్ళు పెంచాలి వీడువల్ల పిల్లలను పెంచుతాడంట అంది.కలికాలపు పిల్లలు కాకపోతే దాన్ని చంపెత్తా అనడమేమితో?దాని పిల్లలను వీడు పెంచుకుంటాననటమేమిటో?అని బుగ్గలు నొక్కుకుంది.

శొంటిక్కలు

                           ప్రణవ్ మూడు సంవత్సరముల పిల్లవాడు.అల్లరి చెయ్యడంలో దిట్ట.పనివాళ్ళను కూడా చేతిలో  ఏది ఉంటే దానితో కొడుతూ ఉంటాడు.పనిఅమ్మాయిని గట్టిగా కొట్టాడు.ప్రణవ్ అమ్మకు కొడుతున్నాడని చెబితే  నువ్వే ఏదోచేసి ఉంటావు?లేకపోతే ఎందుకు కొడతాడు?అనేస్తుంది.వాడికి కోపం వచ్చినప్పుడు,ఏదైనా అడిగితే  ఇవ్వకపోతే వాళ్ళఅమ్మను కూడా కొట్టేస్తాడు.ఒకరోజు చేతిలో కర్ర ఉంటే కర్రతో గట్టిగా వాళ్ళ అమ్మను చేతిమీద  కొట్టాడు.ఎవరినైనా అయితే ఏమీ పట్టించుకోదు.కానీ తనను కొట్టేసరికి కోపం వచ్చి శొంటిక్కలు పెట్టేసింది.అంటే  బుగ్గలు పట్టుకుని మెలితిప్పేసింది.తర్వాత చేతి మీది చర్మం పట్టుకుని మెలి తిప్పింది.వాడు ఏడుస్తూ మళ్ళీ  కొట్టటానికి అమ్మమీదికి వస్తున్నాడు.ఎప్పుడైతే వేరేవాళ్ళను కొడుతున్నాడో అప్పుడే కొట్టకూడదు అని చెప్పి  కంట్రోల్ చేస్తే బాగుండేది కదా!ఇప్పుడు కొట్టడం ఎందుకు?అయినా వాడికి అర్ధం కాదు.అమ్మ కొట్టింది అనుకుంటాడు  కానీ ఎందుకు కొట్టిందో అర్ధమయ్యేట్లు చెప్పాలి.ఒకటికి రెండుసార్లు చెబితే పిల్లలు అర్ధం చేసుకుంటారు.చాలామంది  తల్లులు చేసే పొరపాటు ఇదే.కొట్టటం వల్ల,విసుక్కోవటం వల్ల ఉపయోగం ఉండకపోగా మొండితనంగా,మూర్ఖంగా  తయారవుతారు.అప్పుడు ఏమి ప్రయోజనం?తలనొప్పితప్ప.అందుకే ముందే జాగ్రత్తపడి ఓర్పుతో అర్ధమయ్యేలా  తప్పును తప్పని చిన్నప్పటినుండే చెప్పాలి.మనకైతే ఒకటి ఎదుటి వాళ్ళకయితే ఒకటిగా ఉండకూడదు.   

Sunday, 26 October 2014

సగ్గుబియ్యం వడ

సగ్గుబియ్యం -1 కప్పు
మజ్జిగ - 1 1/2కప్పు
బంగాళదుంపలు - 1/4 కే.జి
ఉల్లిపాయ - 1
 పచ్చి మిర్చి - 4
ఉప్పు - తగినంత
కారం - 2 స్పూనులు
బ్రెడ్ పౌడర్ -చారెడు
నూనె - సరిపడా
 కొత్తిమీర - కొంచెం
                                  సగ్గుబియ్యం రాత్రిపూట మజ్జిగలో నానబెట్టాలి.బంగాళదుంప ఉడికించి సగ్గుబియ్యంలో కలపాలి.పచ్చి మిర్చి సన్నగా కోసి ఉప్పు,కారం,బ్రెడ్ పౌడర్(బ్రెడ్ ఎండలోపెట్టి మిక్సీలో వేస్తే బ్రెడ్ పొడి వస్తుంది) కొత్తిమీర కలిపి వడల్లాగా చేసి ప్రక్కన పెటుకుని నూనెలో వేయించాలి.

చెగో(కో)డీలు

బియ్యప్పిండి  - 2 కప్పులు
మైదా - 1 కప్పు
వాము - 1/2 స్పూను
పసుపు - 1/4 స్పూను
కారం - 1/2 స్పూను
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
 నెయ్యి - 50 గ్రా.                                                                                                                                                                                       ఒక గిన్నెలో 4 కప్పులనీళ్ళుపోసి మరిగించాలి దానిలో తగినంత ఉప్పు వేసి దించి వాము,పసుపు,కారంవేసి వెంటనే బియ్యప్పిండి,మైదావేసి దానిపై నెయ్యి పోసి మూతపెట్టి చల్లారిన తర్వాత బాగా కలిపి చిన్నచిన్నఉంగరాల లాగా చేసి నూనెలో వేయించాలి. 

కాలిఫ్లవర్ - 65

కాలిఫ్లవర్ - 1 మీడియం సైజుది
శనగ పిండి - 1 కప్పు
మైదా - 1/2 కప్పు
అల్లం,వెల్లుల్లి పేస్ట్  - 1 స్పూను
కారం - 1/2 స్పూను
చైనా సాల్ట్ - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
పచ్చి మిర్చి - 8
వెల్లుల్లి - 6
కరివేపాకు - గుప్పెడు
కార్న్ ఫ్లోర్ - 3 స్పూన్లు
                                                   కాలీఫ్లవర్ చిన్నచిన్న పువ్వులుగా తుంచి ఉప్పునీటిలో 10ని.లు వేసి,కడిగి  మరుగుతున్న నీటిలో వేసి 5 ని.లు ఉడికించి వడకట్టి చల్లార్చాలి.
                                          శనగపిండి,మైదా,కార్న్ ఫ్లోర్ అల్లంవెల్లుల్లి పేస్ట్ కారం,ఉప్పు కలిపి తగినన్ని నీళ్ళతో  బజ్జీల పిండి మాదిరిగాకలిపి దీనిలో కాలీఫ్లవర్ పువ్వుల్ని వేసి బజ్జీల లాగా నూనెలో వేయించాలి.పచ్చి మిర్చి,  వెల్లుల్లి ,కరివేపాకు వేసి తాలింపు వెయ్యాలి.

కూరగాయలతో ఆమ్లెట్

పచ్చి బఠాణీ - 50 గ్రా.
బంగాళదుంప - 1
కారట్ - 1
టొమాటో - 1
ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 1
కొత్తిమీర - 1 చిన్న కట్ట
కోడిగ్రుడ్లు - 2
                                     ముందుగా బంగాళదుంప,కారట్ పీల్ చేసి చిన్నచిన్న ముక్కలుగా చేసి బఠాణీలతో కలిపి మెత్తగా ఉడికించాలి.దీనిలో కోడిగ్రుడ్లను కొట్టి వేసి బాగా గిలకొట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమీర,పచ్చి మిర్చిముక్కలను కలిపాలి.పెనం మీద ఆమ్లెట్ వేసి నూనెగానీ,నెయ్యిగానీ మన ఇష్టం వచ్చినది వేసుకోవచ్చు.దీన్ని అన్నంతో కానీ,చపాతీతో కానీ,విడిగా కానీ తినవచ్చు. 

Saturday, 25 October 2014

ఆమ్లా ప్రిజర్వ్

   పెద్ద ఉసిరికాయలు -1/4 కే.జి
   పంచదార - 400గ్రా.
                                 ఉసిరికాయలను కడిగి పంచదార వేసి తగినన్ని నీళ్ళు పోసి మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చి గట్టిపడి తేనెలాగా జిగురుగా తయారయిన తర్వాత దించి చల్లారనిచ్చి సీసాలో భద్రపరుచుకోవాలి.
దీన్ని బ్రెడ్,చపాతీతో తింటే మంచి రుచిగా ఉంటుంది.విడిగా తినగలిగినవాళ్ళు రోజుకొక కాయ తింటే ఆరోగ్యానికి
 చాలా మంచిది.

మూలీ సాగ్

                            ముల్లంగి ఆకులను సన్నగా తరిగి బాగా కడిగి ప్రక్కన పెట్టాలి.బాండీలో నూనె వేసి ఆవాలు,
జీరా వేసి  ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.దానిలో కారం,ధనియాల పొడి,పసుపు ,ఆకు వేసి మూతపెట్టి ఉడికించాలి.ముందుగా ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు,టమోటా ఫ్రై మిశ్రమానికి చేర్చి పది ని.లు
 ఉడికించి తీసేయాలి.అన్నం లేదా చపాతీలతో తింటే చాలా బాగుంటుంది.

ముల్లంగి

                                                 మనం రోజూ వంటల్లో కారట్ వాడినంతగా ముల్లంగిని ఉపయోగించము.ముల్లంగి దుంపలు,ఆకులు కూడా వంటల్లో ఉపయోగించవచ్చు.ఎన్నో పోషకాలతోపాటు రుచిగా కూడా ఉంటుంది.వీటిని చాలా రకాలుగా వంటల్లో వాడొచ్చు.ముల్లంగి తురిమి రైతాలో వేస్తే చాలా రుచిగా ఉంటుంది.సాంబార్ లో ముక్కలు వేస్తే మంచి వాసనతోపాటు రుచిని పెంచుతుంది.ముల్లంగి తురుము గోధుమ పిండిలో కలిపి పరోటా చేయవచ్చు.జీరా,
పసుపు,మిరపకాయలు,కొత్తిమీర,ముల్లంగి తురుము వేసి కూరలా వేయించి పరోటాలు చేయవచ్చు.దీన్ని థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడకపోవడమే మంచిది.

చికెన్ పకోడా

 బోన్ లెస్ చికెన్ - 1/4 కే.జి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 1
లవంగాలు -2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - 1
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
ఉప్పు,కారం,పసుపు - తగినంత
నూనె -  వేయించడానికి సరిపడా
సెనగ పిండి - 1/4 కే.జి
                                     చికెన్ కడిగి మసాలా దినుసుల్ని మిక్సీలోవేసి,ఉప్పు,కారం,పసుపు వేసి కలిపి ముక్కలకు పట్టించి  పది ని.లు ప్రక్కన పెట్టాలి.స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నూనె వేసి చికెన్ ముక్కల్ని నీరు లేకుండా వేయించాలి.శనగ పిండిలో ఉప్పు సరిపడా వేసి బజ్జీల పిండిలాగా కొంచెం గట్టిగ కలిపి ఒక్కొక్కముక్క
వేసి నూనెలో వేయించి తీయాలి.వేడివేడి చికెన్ పకోడా రెడీ.వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.   

కాకులు మెట్లెక్కి ......

                                         మాన్విత ఇంటిప్రక్కన అందమైన డిజైనుతో పొందికగా చిన్నచిన్న మెట్లు స్పైరల్ గా మేడ పైకి వెళ్ళటానికి అమర్చుకున్నారు.మాన్విత ఒకరోజు హాల్లో కూర్చుని బంధువులతో మాట్లాడుతుండగా కిటికీలోనుండి కనిపించిన దృశ్యం వింతగా అనిపించింది.నాలుగైదు కాకులు వరుసగా మెట్లెక్కుతున్నాయి.ఒక్క క్షణం అవి ఎలా ఎక్కుతున్నాయో అర్ధం కాలేదు.పరీక్షగా చూస్తే అవి చకచకా ఒకమెట్టు మీద నుండిఇంకొక మెట్టు మీదకు గెంతుతూ ఎక్కుతుంటే తోక విచిత్రంగా కదులుతుంది.కాకులు ఎగరటమో,ఆహారం తినేటప్పుడు నడవటమో చేస్తాయి కానీ మెట్లెక్కి వెళ్ళటం మాన్వితకు,బంధువులకు కూడా వింతగా అనిపించింది.అవి ఒక్కరోజు కాకుండా ప్రతిరోజూ మెట్లెక్కి మధ్యాహ్నం,సాయంత్రము వెళ్తున్నాయి.బహుశా వాటికి అక్కడ తినడానికి ఏమైనా ఆహారం ఉండి ఉండొచ్చు.పిల్లలు ఆదృశ్యం చూచి కాకులకు ఎగరటం విసుగొచ్చి,సరదాగా మెట్లెక్కి వెళుతున్నాయని ఒకటే నవ్వులు.నిజం చెప్పాలంటే కాకులు ఒకదాని తర్వాత ఒకటి గెంతుతూ మెట్లెక్కి తోకత్రిప్పుకుంటూ ఒకే లైనులో వెళ్ళటం భలే విచిత్రంగా అనిపించింది. 

Thursday, 23 October 2014

దీపావళి శుభాకాంక్షలు

                సమృద్ధిగా పాడి,పంటలతో,ధన,కనక,వస్తు,వాహనాలతోఅందరి లోగిళ్ళు కళకళలాడాలని,పుష్కలంగా సిరిసంపదలనిస్తూ లక్ష్మీదేవి అందరి ఇంట కలకాలం కొలువుండాలని మనసారా కోరుకుంటూ తెలుగు వారందరికీ
దీపావళి శుభాకాంక్షలు .Monday, 20 October 2014

తాతగారికి కోపమొచ్చింది

                             అనన్య తాతగారికి తొంభై రెండు సంవత్సరాలు.అయినా తనపని తను చేసుకుంటూ  ఆరోగ్యంగా,మనుమళ్ళు,మనుమరాళ్ళకు సలహాలిస్తూ హుందాగా ఉండేవారు.ఆయనకు కోపంఎక్కువ.
 అందుకని ఎవరూ ఎదురు చెప్పేవాళ్ళు కాదు.ఒకరోజు అల్లుడికి,ఈయనకు మాటామాటాపెరిగి పెద్దాయనకు
 బి.పి పెరిగిపోయి అల్లుడిమీద అరవటం వలన తలలో నరాలు తెగిపోయి కోమాలోకివెళ్ళి మూడు రోజులకు  చనిపోయారు.పదిరోజులు క్రమంతప్పక ఆయన ఫోటోదగ్గర దీపం పెట్టిమరీ భోజనం పెట్టేవాళ్ళు.చివరిరోజు    కార్యక్రమాలన్నీచక్కగా పూర్తిచేసి,భోజనాలకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఆహడావిడిలో
 భోజనం పెట్టడం మర్చిపోయారు.ఇంతలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై భోజన సమయానికి భారీగావర్షం పడింది.చుట్టుప్రక్కల పెద్దగా వర్షం లేదు.ఇక్కడే ఇంత పెద్దవర్షం పడింది.తాతగారి ఫోటోదగ్గర భోజనం పెట్టడం మర్చిపోయారట.మాతాతగారికి కోపమొచ్చింది అని ఇద్దరు మనుమరాళ్ళు హడావిడి పడిపోయి ఒక ప్లేటులో ఆయనకు ఇష్టమైన పదార్ధాలన్నీపెట్టి కొడుకుతో తాతగారిఫోటో వద్ద పెట్టించారు.    

మిక్స్డ్ వెజిటబుల్ విత్ సోయా గ్రాన్యూల్ కర్రీ

     పచ్చి బఠాణీ - 1/2 కప్పు
    కారట్ ముక్కలు  - 1/2 కప్పు
    బీన్స్ ముక్కలు - 1/4 కప్పు
    ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
    టొమాటో ముక్కలు -  1/2 కప్పు
    దాల్చిన చెక్క - చిన్నది
    యాలకులు - రెండు
    కారం - 1/4 స్పూను
    ఉప్పు - తగినంత
    గరం మసాలా - 1/2 స్పూను
    నూనె - 2 టేబుల్ స్పూన్లు
    సోయా గ్రాన్యూల్స్  - 1 కప్పు                                                                                                                           పచ్చి మిర్చి - 3                                                                                                                                                                               ముందుగా సోయా గ్రాన్యూల్స్ కడిగి మునిగేవరకు నీళ్ళుపోసి ఒకపొంగు వచ్చేవరకు ఉంచి రెండు నిమిషాల తర్వాత వేడినీళ్ళు పారబోసి చన్నీళ్ళు పొయ్యాలి.ఒక 5 ని.ల తర్వాత నీళ్ళువంచేసి పిండి ఒకస్పూను నూనెవేసి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.ఇలాచేస్తే సోయా గ్రాన్యూల్స్ విడిపోకుండా ఉంటాయి.పచ్చి బఠాణీ,కారట్,బీన్స్ ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి.నాన్ స్టిక్ పాన్ లోనూనెను వేడిచేసి దాల్చిన చెక్క,యాలకులు,
ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.టొమాటో ముక్కలు వేసి మ్రగ్గిన తర్వాత ఉప్పు,కారం వేసి సన్నని మంటపై ఉంచి సోయా గ్రాన్యూల్స్,గరం మసాలా వేసి 10ని.లతర్వాత ఉడికించిన పచ్చి బఠాణీ,కారట్,బీన్స్ వేసి కలిపి 2ని.లు స్టవ్ పై ఉంచి తీసేయాలి.ఇది చపాతీ,పూరీకి వెరైటీగా రుచిగా బాగుంటుంది.      

Sunday, 19 October 2014

దిక్కు తోచని పరిస్థితి

                              వశిష్ట తాతగారు ఊరిలో చనిపోతే పెద్ద ఖర్మరోజు భారీగా విందు ఏర్పాటు చేశారు.భోజన సమయానికి ఎక్కడెక్కడి బంధువులు,మిత్రులు,శ్రేయోభిలాషులు వచ్చారు.కొంతమంది భోజనం చేస్తున్నారు.
కొంతమంది భోజనం చేయడానికి అప్పుడే కూర్చున్నారు.అంతవరకూ వాతావరణం ఎండతో వేడిగా ఉండి అప్పటికప్పుడు మబ్బుపట్టి అకస్మాత్తుగా భారీవర్షం పడిపోయింది.పల్లెటూరులో పెద్దపెద్ద స్థలాలు ఉంటాయి కనుక ఇంటిదగ్గర భోజనాలు పెడితే బాగుంటుందని పైన షామియానావేశారు.వర్షం పడుతుందన్నఆలోచన లేకపోవటంవల్ల అలా చేశారు.ముందుచూపుతో టార్పాలిన్ వేస్తే బాగుండేది.అది వేరే విషయం.భోజనం చేయటానికి వచ్చినవాళ్లకు   కూర్చున్నవాళ్ళకు వర్షం ఎంతకీ తగ్గకపోవడంవల్ల ఉండాలో,వెళ్ళాలో తెలియని పరిస్థితి.క్రిందఅంతాబురద,పైన షామియానాలో నుండి నీళ్ళుపడుతున్నాయి.అందరూఒకేసారి రావటంవల్ల నిలబడటానికి,కూర్చోవటానికి ఇబ్బంది.  అరగంటతర్వాత వర్షం తగ్గింది అనుకునేసరికిమళ్ళీమొదలుపెట్టింది.భోజనం చేయకుండానే కొందరు వెళ్లిపోతుంటే విందుఏర్పాటు చేసినవాళ్ళకు,మిగిలినవాళ్లకు ఏమిచేయాలో దిక్కుతోచని పరిస్థితి.బోలెడంత ఖర్చుపెట్టి చేసిన పదార్ధాలన్నీ వృధా అవటమేకాక పిలిచి అనుకున్నట్లుగా అందరికీ మర్యాద చేయలేకపోయామన్న బాధతో వశిష్ట ఇంట్లోవాళ్ళ మొహాలు నెత్తురుచుక్కలేనట్లు పాలిపోయాయి.      

Saturday, 18 October 2014

గట్టి పకోడీలు (రిబ్బన్ పకోడీ)

            తడి బియ్యప్పిండి -  1 కే.జి
             వెన్న - 1/4 కే.జి
             అల్లం - 50 గ్రా.
             పచ్చి మిర్చి - 10
             నూనె  - వేయించటానికి సరిపడా
              ఉప్పు - సరిపడా
              జీరా -25 గ్రా.                                                                                                                                                                                                                  బియ్యం కడిగి ఒకపూట నానబెట్టాలి.మర పట్టించి జల్లించి దానిలో వెన్న,ఉప్పు,జీరా,అల్లం,పచ్చిమిర్చి రసం వడకట్టి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా కలపాలి.జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టి కాగిన నూనెలో మనకు కావాల్సిన పొడవు నొక్కుతూ,ఆపేస్తూ బంగారు వర్ణంలో వేయించి  తీసేయాలి.నోరూరించే,కరకరలాడే గట్టి పకోడీలు (రిబ్బన్ పకోడీ) రెడీ.వారం నుండి పది రోజులు నిల్వ ఉంటాయి.

Friday, 17 October 2014

మురిపెంగా....

                               సమర్ ఒక విచిత్రమైన మస్తత్వం ఉన్న వ్యక్తి.ఎదుటివాళ్ళ పిల్లల్లో ఏమి లోపాలున్నాయోనని
వెదుకుతూ లోపాలు ఉన్నా,లేకపోయినా విమర్శిస్తూ ఆనందపడుతుంటాడు.ఈలోపు సమయం వృధాచేసుకుంటూ
తన పిల్లల గురించి పట్టించుకోకుండా తలపొగరుగా,అందరినీ తిడుతున్నా నవ్వుకుంటూఉంటాడు.పిల్లలైనా తను
కనిపించగానే మాట్లాడకపోతే నేనంటే లెక్కలేదు అంటాడు.వాళ్ళపిల్లలు ఇంటికి వెళ్ళిన బంధువులను,స్నేహితులను  మాట్లాడించకపోయినాఏమీ మాట్లాడడు.పెద్ద అమ్మాయి ఏది చెయ్యాలంటే అది చెయ్యాల్సిందే .చిన్న అమ్మాయి లాప్ టాప్లో ఎంత చక్కగానో పేక ఆడుతుందిఅని హా హ్హా హ్హా అంటూ పెద్దగా నవ్వుతూ మురిపెంగా,అది గొప్పఅన్నట్లు  చెప్పుకుంటాడు.తన పిల్లలు చేస్తే గొప్ప ఎదుటివాళ్ళ పిల్లలు చేస్తి అల్లరపనులు,చెడిపోతారు అని చెప్తాడు. అందరికీ మురిపాలు ఉంటాయనుకుంటే ఏసమస్య ఉండదు.గొడవలు ఉండవు.ప్రశాంతంగా ఉంటుంది.విమర్శించటానికి మాత్రమే అందరి ఇంటికి వస్తాడేమో అనిపిస్తుంటుంది.ఎదుటివాళ్ళను విమర్శించే బదులు మనపిల్లలకు మంచి పద్దతులు నేర్పుకుంటే బాగుంటుందికదా అని ఎప్పటికి బుర్రకి తడుతుందో వేచి చూడాలి.


పిల్లిలా....

                             ఒకరోజు ప్రగ్య వంటగదిలో బిజీగా ఉంది.అకస్మాత్తుగా వెనుకనుండి అత్తా ఏమి చేస్తున్నావు?అంటూ వినిపించేసరికి వెనక్కు తిరిగింది.ప్రగ్య మేనల్లుడు నిలబడి ఉన్నాడు.ఇదేమిటి?ముందు తలుపు వేసి ఉందికదా తీసేటప్పుడు కొంచెమైనా శబ్దం రాలేదు అనుకుంది.పిల్లి ఎవరూ చూడకుండా దొంగతనంగా పాలు త్రాగటానికి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏశబ్దము లేకుండా వచ్చినట్లుగా పిల్లిలా వచ్చాడు.తలుపు కొట్టి రావటము లేకపోతే బెల్ నొక్కి రావటము సంస్కారం.అంతేకానీ అలా రావటం ఏమి పద్ధతి.సమయానికి పనిమనిషి ఉంది.ఆమెకూడా ఈయన బెల్ కొట్టకుండా నేరుగా ఇంటిలోపలకు వస్తున్నాడేమిటబ్బా?అనుకుని వెళ్ళేటప్పుడు అమ్మా! తలుపు లోపల బోల్ట్ వేసుకోండి ఎవరుపడితే వాళ్ళు వస్తే కష్టం కదా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దమ్మా రోజులు బాగాలేవు అందుకని పెద్దదానిగా చెప్తున్నాను అనిచెప్పి వెళ్ళింది.మాకూ అన్ని పద్దతులు తెలుసు అని చెప్తాడు.ఆమెకున్నపాటి సంస్కారం కూడా లేదు.చదువుకుని కూడా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. 

Thursday, 16 October 2014

కబుర్ల పుట్ట

                                        కిషన్ చిన్నప్పుడు నోట్లో నాలుక లేనట్లు ఎవరైనా మాట్లాడించినా మాట్లాడేవాడు కాదు.
ముంగిలాగా అడిగినదానికి కూడా సమాధానం చెప్పవేంటి?అని అందరూ అనేవాళ్ళు.అలాంటిది ఈమధ్య కనిపించి
వసపిట్ట లాగా చెప్పింది చెప్పకుండా చెప్తూనే ఉన్నాడు.చిన్నప్పుడు వీడు అసలు మాట్లాడేవాడు కాదు ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చాడు అని ఆశ్చర్యపోవటం అందరి వంతయింది.జీవిత భీమా ఉద్యోగిగా ఉన్నాడేమో ఉద్యోగంలో
భాగంగా రకరకాల వాళ్ళతో పాలసీలు కట్టించటానికి మాట్లాడాలి కనుక కబుర్ల పుట్ట అయ్యాడు.ఎక్కడికెళ్తే అక్కడ
ఒక పదిమందిని కూర్చోపెట్టి మాటల్లో పెట్టి ఎలాగైతే పాలసీలు కట్టిస్తుంటాడు.  

Wednesday, 15 October 2014

మిస్టర్ పర్ఫెక్ట్

                       ఆషా ఆడపడుచు కొడుకు రమేష్ పెద్ద కోతలరాయుడు.ప్రపంచంలో అన్నీ ఎక్కడ ఏముందీ నాకే   తెలుసు అని ఏపనైనా చిటికెలో చేయగలననీ కోతలు కోస్తుంటాడు.చెప్పేయన్నీ అబద్దాలు,చేసేవన్నీ తప్పుడు పనులు.ఒకరోజు ఆషా వాళ్ళింటికి వచ్చిమాటల సందర్భంలో నాఅంత మంచివాడు ఈప్రపంచంలోనే ఉండడు.నేను మిస్టర్ పర్ఫెక్ట్ నని చెప్పాడు.అమ్మ పుట్టింటి గురించి మేనమామకు తెలియదా అన్నట్లు ఆషా వాళ్ళనే మోసం చేశాడు.అదంతా మర్చిపోయుంటారనుకున్నాడేమో అలవాటు చొప్పున మాట్లాడేశాడు.అతను పర్ఫెక్ట్ అవునో కాదో
ఆషా కుటుంబానికి తెలుసు కదా!నేను ఎక్కడకు వెళ్ళినా నవ్వుతూ పలకరించి భోజనం పెడతారని చెప్పాడు.ఇంటికి వచ్చిన అతిధిని  నవ్వుతూ పలకరించి ,భోజనం పెట్టడం మన సాంప్రదాయం.ఇప్పుడవన్నీ అందరూ పాటించడం లేదనుకోండి.నవ్వుతూ మాట్లాడి భోజనం పెట్టినంత మాత్రాన మోసంచేసిన పనులను మర్చిపోలేరు కదా!ద్రోహం చేసి
వాళ్ళ దగ్గరకే వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్ నని చెప్పుకోవటానికి ఉండొద్దూ.ఎదుటివాళ్ళు నవ్వుకోవటానికి,కాలక్షేపానికి తప్ప తన స్వోత్కర్ష చెప్పుకున్నంత మాత్రాన మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎవరూ ఆకాశానికి ఎత్తి మెడవరుసలు వెయ్యరు.     

Tuesday, 14 October 2014

జ్వరం

                                                              యశోధరకు కొద్దిగా ముఖ పరిచయమున్న ఒకామె అనుకోకుండా పదిసంవత్సరాల తర్వాత  రోడ్డుకి అవతల ఉన్న ఎదురింట్లో కనిపించి ఏమండోయ్ అని పిలిచి మరీ నన్నుమీరు
గుర్తుపట్టారా?అని అడిగింది.రెండు నిమిషాల తర్వాత ఆమె పేరు విజయఅనీ,తిక్కమనిషనీ,ఎప్పుడూ గొప్పలు చెప్తూ ఉంటుందనీ గుర్తొచ్చింది.ఇప్పుడు కూడా వదలకుండా తన ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆరునెలల తేడాతో చేశామని గొప్పగా చెప్పింది.చెప్పింది ఊరుకోకుండా తన తిక్కతనం నిరూపించుకోవటానికన్నట్లుగా పదిసంవత్సరాల క్రితం మీకు జ్వరం వచ్చిందంటకదా!ఆరోగ్యం బాగుందా?అని అడిగింది. యశోధరకు ఏమి చెప్పాలో తెలియక ఆమె అడిగినదానికి తగినట్లుగానే తలాడించింది.ఏంటో?ఈరోజుల్లో కూడా ఇలాంటి తిక్క ప్రశ్నలు వెయ్యటం మానుకోరు.
                పదిసంవత్సరాల క్రితంవచ్చిన  జ్వరం గుర్తుపెట్టుకుని ఇప్పుడు అడగటం హాస్యాస్పదంగా ఉంటుందనే ఆలోచనే లేదు.ఏమి మనుషులో ఏంటో?విచిత్ర మనస్తత్వం.అనవసర విషయాలు వదిలేసి అవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనిపించింది.అదీకాక అధికప్రసంగం చేసినా ఎదుటివారికి విసుగొస్తుంది.

కృతఘ్నత

                             విజ్ఞిత భర్తకు ఉద్యోగరీత్యా ఒక ఊరినుండి ఇంకొక ఊరికి బదిలీ అయింది.ఆ నేపధ్యంలోఖాళీ
చేసే ఇంటిని మేము క్లీన్ చేయించి ఇస్తామని చెప్పటం వలన పనిమనిషితో చేయించి నెల జీతం కాక అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చింది.రెండు చీరలు,జాకెట్లు కొనిపెట్టింది.పిల్లలకు అవసరమైనవన్నీ కొని పెట్టింది.అయినా తృప్తి లేక చేతులు కడిగే ఖరీదైన హాండ్ వాష్ లు,బాత్రూమ్ లు కడిగే లిక్విడ్లు,రాగి బిందెలు,మూతలు అన్నీ చెప్పకుండా తీసుకుంది.బయట రాగిబిందెలు పెట్టుకుంది కాబోలు పొరపాటున ఎవరో బయట పెట్టారనుకునివిజ్ఞిత భర్త లోపల పెట్టించారు.అయిన పాకింగు చేసేవాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తీసుకుని దాచేసింది.క్రొత్త ఇంటికి వచ్చినతర్వాత చూస్తే కంపించలేదు.అంతబాగా చూసిఎన్నో కానుకలు ఇచ్చినా కృతఘ్నత లేక దొంగచాటుగా  దాచుకుని ఇంటికి పట్టుకెళ్ళింది.

Monday, 13 October 2014

గొడుగు పిల్ల

                       సునందిని వర్షం పడేలాగా ఉందని తలుపులన్నీ వేసి లోపలికి వచ్చింది.సన్నటి జల్లులతో మొదలైన వర్షం భారీగా ఒక గంటపాటు ఆగకుండా కురుస్తూనేఉంది.వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని తలుపు
తీసి వరండాలోకి వచ్చేటప్పటికి ఒక పదమూడేళ్ళ అమ్మాయి వరండాలో బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉంది.ఆంటీ
మా ఇల్లు ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.వర్షం పడుతుందని వచ్చాను.మీఇంట్లో గొడుగు ఉంటే ఇవ్వండి.రేపు తెచ్చిస్తాను
అని అడిగింది.సరేనని రేపు తెస్తుంది కదా అనుకుని తనకు ఎంతో ఇష్టమైన గొడుగు ఇచ్చింది.ఇరవై రోజులైనా గొడుగు తీసుకురాలేదు.తర్వాత పనిమనిషితో పిల్ల తడుస్తుందని గొడుగు ఇస్తేతిరిగి ఇవ్వలేదని, పిల్ల ఎలాఉందీ గుర్తులుచెప్పగానే వాళ్లకు నేను పనిచేస్తానని,గొడుగు తెచ్చి ఇవ్వమని చెప్తానని చెప్పింది.తల్లి కూడా ఏమీ ఎరగనట్లుగా ఊరుకుంది.పిల్లలు ఏదైనా వస్తువు తెస్తే ఎక్కడిదీ?ఎందుకు తెచ్చారో కనుక్కుని తిరిగిఇచ్చి పంపాల్సిన బాధ్యత పెద్దలది.కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎదుటివాళ్ళ వస్తువులు తీసుకుని సక్రమంగా తిరిగి ఇవ్వరు.ఇది చాలా చెడ్డ అలవాటు.ఒక నెలరోజులకు గొడుగు విరగ్గొట్టి సునందినికి ఇచ్చి సారీ ఆంటీ వెంటనే ఇవ్వటం మర్చిపోయాను.మాచెల్లి విరిచేసింది అని చెప్పింది.
                             తనకు ఎంతో ఇష్టమైన గొడుగును అలాచూచేసరికి సునందినికి నోటమాట రాలేదు.కాసేపటికి తేరుకుని ఏఫీలింగ్ లేకుండా ఆఅమ్మాయి చెప్పిన విధానానికి ఆశ్చర్యపోయి ఇకనుండి నీవస్తువులు  నువ్వే మర్చిపోకుండా తీసుకెళ్ళు.ఎప్పుడైనా తీసుకున్నా ఎలాతీసుకున్నవో అలాగే తిరిగి ఇవ్వటం నేర్చుకోఅని చెప్పింది.ఇక అప్పటినుండి ఆఅమ్మాయి ఎక్కడ కనిపించినా సునందిని పిల్లలు"గొడుగు పిల్ల"అదుగో అని అంటూ ఉంటారు.


Saturday, 4 October 2014

ఇటుకరాళ్ళ వ్యాపారం

                                 ప్రతి మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందంటారు.ఒక్కొక్కసారి అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది.జీవిత ఇంటిప్రక్కన ఒక పెద్దాయన ఉంటాడు.ఆయన ఏమి మాట్లాడతాడో ఆయనకే అర్ధం కాదు.ఇంకా
ఎదుటివాళ్లకు ఏమి అర్థమవుతుంది?ఒకసారి జీవిత ఇంటికి స్నేహితురాలు దీప్తి వచ్చింది.పెద్దాయన భార్య జీవితను పలకరించింది.జీవిత ప్రక్కనఉన్నదీప్తిని పరిచయం చేసింది.ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే తగుదునమ్మా అంటూ
పెద్దాయన వచ్చి మాటలు కలిపాడు.అలా రావటం జీవితకు అసలు నచ్చదు.వచ్చినవాడు ఊరుకోకుండా ఆరాలు మొదలుపెట్టాడు.దీప్తిని మీఆయన ఏమి చేస్తారు?అని అడిగాడు.ఇంజినీరు విల్లాలు,బహుళ అంతస్తులు కట్టి అమ్మే వ్యాపారం చేస్తారని చెప్పింది.మరి మీరేం చేస్తుంటారు?ఇటుకరాళ్ళ వ్యాపారం చేస్తుంటారా?ఇంతకుముందు చేయకపోతే మొదలు పెట్ట్టండి.బాగా లాభాలు వస్తాయని అన్నాడు.వీడికేమన్నా స్క్రూ లూజా?పెద్దవాడని ఏమీ అనకుండా ఊరుకున్నాను.మనలో మగవాళ్ళు కూడా ఇటుకరాళ్ళ బట్టీలు తీసి ఇటుకరాళ్ళు అమ్మే వ్యాపారం
చేయరు.నన్ను చెయ్యమంటాడా?ఎలా కనపడుతున్నాము?వీడి సలహా మనమడిగామా?పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు.అసలు ఆడవాళ్ళు మాట్లడుకుంటుంటే మధ్యలో వచ్చి కల్పించుకున్నది కాక వెధవ జోకులూ,మళ్ళీ వాటికి వాడే నవ్వుకోవటం చిల్లరవ్యవహారం మనిషిలో హుందాతనం మచ్చుకైనా లేదు అనేసింది. అనవసర విషయాల్లో కల్పించుకుని మాట్లాడకపోవటమే మంచిది.దీప్తి కనుక తిట్టలేదు.వేరే ఎవరైనా మొహమ్మీదే
తిట్టేవాళ్ళు.ఒకసారి తిడితే ఇటువంటి వాళ్లకు బుద్ది వస్తుంది.

విత్తు - చెట్టు

                             విత్తు ఒకటి వేస్తే చెట్టు ఇంకొకటి అవనట్లు తల్లిని బట్టి పిల్లల పద్దతులు ఉంటాయి.శ్రుతి,ధృతి
దసరాసెలవలు సందర్భంగా మేనత్త ఇంటికి వెళ్ళారు.ఎక్కడికయినా బయటకు తీసుకెళ్ళి ఏదైనా విహారస్థలం
చూపెడదామంటే త్వరగా తయారవరు.పదిగంటలకు లేవటం,పన్నెండు గంటలకు అల్పాహారం,మూడుగంటలకు భోజనం.పనితెమలక విసుగొచ్చేది.ఒకరోజు మేనత్తకు తలనొప్పిగా ఉండి పడుకుంటే ధృతి ఫాను కట్టేసింది.ఎందుకు కట్టేశావంటే కరెంటు పోయింది అంది.లైటు ఎందుకు తీయలేదంటే  తను రాసుకుంటుంది కనుక తీయలేదని చెప్పింది.లైటు,ఫాను రెండూ వేయవచ్చు వేయమంటే తప్పనిసరి పరిస్థితిలో వేసింది.మేనత్త ఇంటికి వచ్చి మేనత్త బాగుండక పడుకుంటే నిద్రపోతుందని లేకుండా లైట్ ఉంచి ఫాను కట్టేసింది అంటే చిన్నపిల్లకే ఎంత స్వార్ధమో?
వాళ్ళమ్మ కూడా ఎవరూ ఎలా పోయినా  ఫర్వాలేదు తనపనే ముఖ్యం అనుకునే తత్వం.అదే పిల్లలకూ వచ్చింది.  

వినాయకుడు - కుక్కపిల్ల

                                                                                                                                                                                                   అన్విత ఇంటిముందున్నతులసికోటలో  చిన్న వంగపువ్వు రంగు వినాయకుడి            విగ్రహంఉంటుంది.ఈ మధ్య ఉదయం ప్రధాన ద్వారం తలుపులు తెరిచేసరికి గడప దగ్గర వినాయకుడు        ఉంటున్నాడు.రెండుగేట్లు తాళాలు వేసేసి ఉండగా ఇక్కడ ఎవరు పెట్టి ఉంటారు?అనుకుని అన్విత                    తులసికోటలో పెట్టి వచ్చింది.మళ్ళీసాయంత్రం తలుపు తెరిచేసరికి"యధా రాజా తధా ప్రజా" అన్నట్లుగా            వినాయకుడు గడప దగ్గరే ఉన్నాడు.ఇలా నాలుగు రోజులు జరిగిన తర్వాత మాటల సందర్భంలో
వినాయకవిగ్రహ ప్రస్తావన వచ్చింది.అంతకుముందు నాలుగు రోజులనుండి అలాగే ఉంటుంటే అన్విత భర్త యధాస్థానంలో పెడుతున్నానని చెప్పారు.ఇంకొక రోజు చెప్పులు కొరికి ఉన్నవి కనుక అది కుక్కపిల్ల పని అయిఉండొచ్చని  అనుకున్నారు.అనుకున్నట్లుగానే గేటుకి ఉన్నచిన్నఖాళీలోనుండి కష్టపడి  కుక్కపిల్ల
 బయటకు వెళ్ళటం కనిపించింది.రోజూ తలుపులు వేసి ఉన్నప్పుడు పనిగట్టుకుని గేటు లోపలికి కుక్కపిల్ల
వచ్చి తులసికోటలోని వినాయకుడ్నితెచ్చి గడపముందు పెడుతుందని అర్ధమయింది. పాపం చిన్నిదానికి అంత కష్టం దేనికో?