Sunday, 30 November 2014

కనుబొమలు ఒత్తుగా రావాలంటే ......

                          ఆముదము (కాస్టర్ ఆయిల్ ) రాత్రిపూట  అప్లై చేస్తే కనుబొమలు ఒత్తుగా వస్తాయి .

ప్రచారకర్త

                            పంకజం అందరికన్నా తనకే ఎక్కువ భక్తి ఉందని దైవం గురించి తనకే ఎక్కువ తెలుసని పోజులు కొడుతుంది.ఎక్కడ పారాయణాలు ఉంటే అక్కడికి వెళ్ళి పారాయణ చేసి వస్తుంటుంది.అంతవరకు బానే ఉంది కానీ
అక్కడకు వెళ్ళి వాళ్ళగురించి వీళ్ళకు,వీళ్ళ గురించి వాళ్ళకు చాడీలు చెప్పడమే ఎక్కువ చేస్తుంటుంది.దైవం గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే పారాయణ చేసినందుకు కాలంతోపాటు పుస్తకసారాన్నిసద్వినియోగం             చేసుకున్నట్లవుతుంది.అంతేకానీ సమయాన్ని వృధా చేసుకోవటమే కాక,దైవాన్ని దిక్కరించి ఏపని చేయకూడదని పుస్తకాలలో చెప్తున్నారో అదేపని చేసి చాడీల ప్రచారకర్త లాగాతెలిసి కొన్ని,తెలియక కొన్నిఊహించుకుని ప్రచారం చేస్తుంటుంది.               

వ్యంగ్యోక్తులు

                                                 ఈరోజుల్లో మంచిగా మాట్లాడే వాళ్ళకన్నా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.ఫలానా వాళ్ళు మాస్నేహితులని అందరి దగ్గర గొప్పలు పోతుంటారు.ఎదుటికి వచ్చేసరికి ఈర్ష్య,అసూయ
అనుకోవాలో మరేమని అనుకోవాలో తెలియదు కానీ ఏదో ఒకటి వ్యంగ్యంగా కుంటి మాటలు మాట్లాడుతుంటారు.
అలా మాట్లాడటం వాళ్ళకు తప్పుగా అనిపించదేమో కానీ ఎదుటివారికి ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనే
ఉండదు.కొంతమందికి ఏదిపడితే అది ఎదుటివాళ్ళను మాట్లాడి,తిరిగి వాళ్ళతో అనిపించుకోవటం అలవాటు.అది
 అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.అది అర్ధం చేసుకోకుండా ఎదుటివారి మనోభావాలను పట్టించుకోకుండా వ్యంగ్యోక్తులు విసురుతుంటారు.మనం మాట్లాడినా ఎదుటివాళ్ళ నుండి సమాధానం రావటం లేదంటే ఆసంభాషణ అంతటితో వదిలేయాలని అర్ధం.కొంతమంది అర్ధం అయినా కానట్లుగా నటించి వాళ్ళకు తెలిసిందే వేదంలా అది ఒప్పైనా,తప్పైనా నోటికొచ్చింది మాట్లాడేస్తారు.ఎదుటి వాళ్ళ మనసు బాధపడితే వీళ్ళు మనసులో సంతోషపడుతుంటారు.
   

చెంపలపై చిన్నచిన్న వెంట్రుకలు ఉంటే.......

                         హార్మోన్ల పనితీరులో తేడా వలన కానీ,మరే ఇతర కారాణాల వలన కానీ చెంపలపై చిన్నచిన్న వెంట్రుకలు వస్తూ ఉంటాయి.అటువంటప్పుడు వారానికి రెండుసార్లు శనగ పిండి -  1 స్పూను,పసుపు - 1/2 స్పూను,పెరుగు - 1 స్పూను కలిపి ముఖానికి పట్టించాలి.ఆరిపోయిన తర్వాత నిదానంగా చెంపలు పైవైపుకు రుద్దుతుంటే అవి దానితోపాటు వచ్చేస్తాయి.పై పెదవి,నుదురు కూడా అలాగే చేయాలి.ఈవిధంగా చేస్తూ ఉంటే
క్రమంగా ఉన్నవి పోయి ఇక రాకుండా ఉంటాయి.

పెదవులు పొడిబారకుండా

                                 ఎర్రగులాబీ రేకలను పాలతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి పెదవులకు అప్లై చేసి అరగంట ఉంచితే పెదవులు పొడిబారవు.కనీసం వారానికి రెండుసార్లైనా ఈవిధంగా చేయాలి.రోజూ చేస్తే నెలలో పెదవులు ఎర్రగా మామూలుగా అవుతాయి. 

ముఖం అంతా ఒకే రంగులో ఉండాలంటే ......

                     ముఖం మీద ఏ మచ్చలు లేకుండా ఒకే రంగులో ఉండాలంటే బంగాళదుంపను సగానికి కట్ చేసి దానితో ముఖం మీద మసాజ్ చేయాలి.బంగాళదుంప రసం కంటి క్రింది నలుపును కూడా తగ్గిస్తుంది.ఈవిధంగా వారానికి మూడుసార్లు చొప్పున 15 ని.లు చేయాలి.తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.వీలయినప్పుడల్లా కలబంద రసం ముఖానికి రాసి 20 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుగుతూ ఉంటే ముఖం మీద ఏ మచ్చలు లేకుండా చర్మం నున్నగా  నిగనిగలాడుతూ అందంగా మెరిసి పోతుంటుంది. 

పిగ్మెంటేషన్ పోవాలంటే ........

                            ముఖం మీద వచ్చే లేత బ్రౌన్ మచ్చలు పోవటానికి కలబంద రసం రాయాలి.ముదురు రంగు
మచ్చలు పోవాలంటే కలబంద రసంలో నిమ్మరసం కలిపి రాయాలి.15 ని.లు ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.రోజు రాస్తూ ఉంటే మచ్చ తొలగిపోయి క్రమంగా చర్మం రంగులో కలిసిపోతుంది.

ఓవెన్ లో అప్పడం కరకరలాడాలంటే .......

                                        అప్పడం నీళ్ళతో తడిపి 1 ని. ఒకవైపు,1 ని. మరోవైపు పెట్టాలి.ప్లేటులో నాలుగు అప్పడాలు పెట్టవచ్చు.అప్పటికప్పుడు కరకరలాడుతూ నూనె లేకుండా,మాడిపోకుండా బాగుంటాయి.

Saturday, 29 November 2014

ఓవెన్ శుభ్రం చేసే విధానం

                           ఒక పెద్ద బొరోసిల్ బౌల్ లో సగానికి నీళ్ళుపోసి ఒక పెద్ద నిమ్మకాయ పిండి స్టీమ్ బటన్ ఉంటే నొక్కాలి.లేకపోతే 15 ని.లు స్టార్ట్ బటన్ నొక్కాలి.చల్లారి పోయిన తర్వాత మెత్తటి పొడిబట్టతో తుడవాలి.10 గం.లు
వాడకూడదు.అంటే రాత్రిపూట శుభ్రం చేసుకుంటే ఉదయం వాడుకోవచ్చు.రాత్రంతా ఓవెన్ తలుపు తెరిచి ఉంచాలి. ఓవెన్ లో మాంసాహారం ఎక్కువగా చేసుకునేవాళ్ళు 2,3 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి.  

ఏకచత్రాధిపత్యం

                                     శ్రీనాధుడు ఒక విచిత్రమైన వ్యక్తి.నేనే అందరికన్నా తెలివి కలవాడిని అందరూ శుంఠలు అని అతని అభిప్రాయం.అదే అభిప్రాయాన్నిఎదుటివాళ్ళ దగ్గర వ్యక్తపరుస్తుంటాడు.అందరూ వచ్చి తనను సలహాలు
అడిగి అవి పాటించటం వల్లే వృద్ధిలోకి వస్తున్నారని అందరి దగ్గర డబ్బాలు కొట్టుకుంటాడు.భార్య,పిల్లలు ఇతని మాట వినకపోయినా అది కప్పిపెట్టి అక్కచెల్లెళ్ళు.అన్నదమ్ములు,మేనమామ చివరకు అమ్మ,నాన్న కూడా తన మాటే వినాలని మొండి పట్టుదలకు పోతుంటాడు.నేనైతే మీ ఆస్తులు బాగా వృద్ధిలోకి తెచ్చేవాడిని మీకు చేతకాక అలాగే ఉన్నారు అంటాడు.అందరూ కష్టపడి సంపాదించి తనదగ్గర పెడితే తను కష్టపడకుండా కూర్చుని తిని అందరి ఆస్తులమీద పెత్తనం చలాయించుతూ ఏకచత్రాధిపత్యం వహించి ఆ డబ్బంతా తనదేఅని అది తన గొప్పతనమేనని అందరి దగ్గర పోకిళ్ళు పోతూ విర్రవీగొచ్చని కనిపిస్తే చాలు సతాయిస్తుంటాడు.ఇతని సతాయింపులు తట్టుకోలేక స్వంత అక్కచెల్లెళ్ళు కూడా వేరే దారిలో నుండి ఇతని కంట పడకుండా తప్పించుకుని వెళ్ళిపోతుంటారు. 

రాగి రొట్టె

రాగి పిండి - 1 కప్పు
ఉల్లి కాడ ముక్కలు - 4 టీ స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 4 టీ స్పూన్లు
పచ్చి మిర్చి  -2
కారట్ తురుము - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
నెయ్యి లేదా నూనె - రొట్టె కాల్చటానికి సరిపడా
                                           ఒకగిన్నెలో రాగిపిండి,వేసి ఉల్లి కాడల ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,కారట్ తురుము,పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పువేసి నీళ్ళుపోస్తూ చపాతీపిండిలాగా గట్టిగా కలపాలి.10 ని.లు నాననిచ్చి ఏదైనా పొడి పిండి  వేసి చపాతీలాగా చేసి నాన్ స్టిక్ పెనంపై రెండు వైపులా నెయ్యి కానీ,నూనె కానీ వేసి గోధుమ రంగు చుక్కలు వచ్చేవరకు కాల్చాలి.  

కొర్రబియ్యం దోశ

కొర్రబియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
శనగపప్పు - 2 టీ స్పూన్లు
మెంతులు - 1 టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - దోశకు సరిపడా
                     కొర్రబియ్యం 6 గం.లు నానబెట్టుకోవాలి.మినప్పప్పు,శనగపప్పు,మెంతులు 4 గం.లు నానబెట్టాలి.
మినప్పప్పు,శనగపప్పు,మెంతులు కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బిన తర్వాత కొర్రబియ్యం,ఉప్పు వేసి రుబ్బాలి.
అప్పటికప్పుడయినా దోస వేసుకోవచ్చులేదా ఒకపూట పులవనివ్వవచ్చు.ఈపిండి వారం రోజులైనా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటుంది.కొర్రపిండి అయినా 1కి 2 వేసుకోవాలి.
గమనిక :కొర్రబియ్యం ఏదోఒక రూపంలో తింటే బరువు తగ్గుతారు.

ఎండకు రంగు మారిన చర్మానికి చిట్కా

ఆపిల్ పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ - 4 టేబుల్ స్పూన్లు
ఓట్స్ పొడి - 1 స్పూను
                   వేసవి కాలంలో ఎండకు ముఖం,చేతులు,మెడ పైన చర్మం రంగు మారుతుంటుంది.అటువంటప్పుడు ఆపిల్ చెక్కు తీసి మెత్తగా ఉడికించాలి.మెత్తటి పేస్ట్,రోజ్ వాటర్ కలిపి ముఖం పైన,చేతులు,మెడ ఎక్కడ రంగు మారితే అక్కడ రాయాలి.15-20 ని.లు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చర్మం మాములు రంగులోకి వస్తుంది.ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.

తలలో పేలు బెడద వదలాలంటే ..........

                                                    మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎప్పుడో ఒకసారైనా పిల్లలకు తలలో పేలు పడుతూ ఉంటాయి.అటువంటప్పుడు ఈ క్రింది విధంగా వారానికి ఒకసారి చొప్పున ఒక నెల రోజులు చేస్తే తలలో పడిన పేలు బెడద వదిలిపోతుంది.

                         వేప పొడి - 2 టేబుల్ స్పూన్లు
                         తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
                                  ఈ రెండింటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ళకు(స్కాల్ప్ కి)పట్టించాలి.40 ని.ల తర్వాత ముందు నీళ్ళతో కడిగేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయించాలి.
కాకరకాయ చిప్స్

కాకరకాయలు - 1/4 కే.జి
పుదీనా ఆకులు - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
నిమ్మకాయ - 1
మిరియాలపొడి - కొంచెం
                                         కాకరకాయల్ని కడిగి చక్రాల్లా తరగాలి.ఒకగిన్నెలో నిమ్మరసం పిండి దానిలో ఉప్పు కలపాలి.కాకరకాయ ముక్కల్ని నిమ్మరసంలో ముంచి తీసి ఒకగంట ఎండలో ఎండనివ్వాలి.అలా ఎండిన ముక్కల్ని
కాగిన నూనెలో వేసి బాగా వేయించాలి.కరివేపాకు,పుదీనా ఆకుల్ని కరకరలాడేలావేయించాలి.వీటిని వేయించిన కాకరకాయ ముక్కలపై వేసి కొంచెం మిరియాలపొడిచల్లాలి.కావాలనుకుంటే కొంచెం ఉప్పు చల్లుకోవచ్చులేదా అంతకు ముందే వేశాము కనుక అలాగే తినవచ్చు.
చిట్కా :ఏడాదంతా నిల్వ ఉండాలంటే కాకరకాయముక్కలు బాగా ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత డబ్బాలో పోసి
ఎప్పుడంటే అప్పుడు వేయించుకోవచ్చు.
                               

Wednesday, 26 November 2014

ఈల వేయనిదే..........

                           మంగ తాయారు రాజీ వాళ్ళింట్లో బట్టలు ఉతకటానికి వస్తుంటుంది.పెద్దగా  ఈల వేస్తూ బట్టలు
ఉతుకుతూ ఉంటే వీధి మొత్తం వినిపిస్తుంది.మొదట్లో రాజీ విచిత్రంగా చూస్తుంటే మంగ తాయారు నేను ఈల వేయనిదే పని చేయలేనమ్మా! ఏమీ అనుకోవద్దు.చిన్నప్పటి నుండి అలవాటయిపోయింది అని సిగ్గుపడుతూ చెప్పింది.

ఆవకాయ పచ్చడి వృధా కాకుండా .......

          ఆవకాయ పచ్చడిలో ముక్కలు అయిపోయిన తర్వాత పచ్చడి మిగిలి పోతే వృధాగా పారేస్తుంటాము కదా.
అలా వృధాగా పారేయకుండా దొండకాయ ముక్కలు వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది.అదెలాగంటే
దొండకాయలు కడిగి తుడిచి ఆరబెట్టి సన్నగా పొడవుగా తరిగి ఆవకాయ పచ్చడిలో కలపాలి.ఇది 15 రోజుల వరకూ
కరకరలాడుతూ బాగుంటుంది.
                                                 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి ఆవకాయ పచ్చడిలో కలపవచ్చు.ఇది మూడు రోజుల తర్వాత నుండి తినాలి. పచ్చిమిర్చికి ఉప్పు,కారం,పులుపు పట్టి రుచిగా ఉంటుంది.
                          ఇదేవిధంగా కారట్,చిలకడ దుంప కూడా కలపవచ్చు.ఇవి ఒక వారం రోజులు బాగుంటాయి.
గమనిక:ఏది కలిపినా కడిగి,తుడిచి ముక్కలు కోసి ఆరబెట్టిన తర్వాత మాత్రమే కలపాలి.

Tuesday, 25 November 2014

బిర్యానీ మంచి వాసన రావాలంటే......

బియ్యం - 1 కే.జి 
ధనియాల పొడి - 20 గ్రా.
గరం మసాలాపొడి - 10 గ్రా. 
జాజికాయ,జాపత్రి,అనాసపువ్వు - 15 గ్రా.
బిర్యానీ పువ్వు - 1
మరాఠీ మొగ్గ - 2
షాజీర - కొంచెం 
కొత్తిమీర - 2 కట్టలు 
పుదీనా - 2 కట్టలు 
పెరుగు - 1 కప్పు 
                                      1 కే.జి. బియ్యానికి పై విధంగా కొలతలు వేస్తే మంచి సువాసన వస్తుంది.
                       

కాకరకాయ నిల్వ పచ్చడి

కాకరకాయలు - 1/2 కే.జి
కళ్ళు ఉప్పు - 1 కప్పు
కారం - 1 కప్పు
పసుపు - 1/4 స్పూను
మెంతుపిండి - 1 స్పూను
నూనె - 1/4 కే.జి
చింతపండు -100 గ్రా.
వెల్లుల్లి పాయలు -2
                                         కాకరకాయలు కడిగి,పొడివస్త్రంతో తుడిచి కొంచెంసేపు ఆరబెట్టి గుండ్రని ముక్కలు కోయాలి.ముక్కలకు పసుపు,ఉప్పు పట్టించి ఒకగంట ఉంచితే నీరు వస్తుంది.ముక్కలు పిండి ప్రక్కన పెట్టాలి.ముక్కలు పిండగా వచ్చిన నీటిలో చింతపండు నానబెట్టాలి.ఒకగంట తర్వాత చింతపండు నలిగిన తర్వాత  కారం,మెంతు పిండి వేసి ఒకసారి త్రిప్పి తీసేయాలి.వెల్లుల్లి పాయలు మిక్సీలో వేసిమొత్తం పొడిగిన్నెలో వేసి కలిపి తాలింపు పెట్టాలి.ఇది 20 రోజుల వరకూ నిల్వ ఉంటుంది.  


Monday, 24 November 2014

పిల్లలకు చిన్నప్పటి నుండే......

                               పిల్లలకు చిన్నప్పటి నుండే మగపిల్లలైనా,ఆడపిల్లలైనా ఎవరిపై  ఆధారపడకుండా తమపనులు తాము చేసుకునేలా అలవాటు చేయాలి.ఈరోజుల్లో తల్లీ,తండ్రీ ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి.ఉదయం పాఠశాలకు వెళ్ళాలంటే పిల్లలున్న ఇంట్లో పెద్ద హంగామా.ఇంతకు ముందు రోజుల్లో నానమ్మ,తాతయ్య లేకపోతే అమ్మమ్మ ,తాతయ్య ఎవరో ఒకరు ఉండేవాళ్ళు.ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాలలో ఉండటం లేకపోతే అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడక పోవటం,ఏకారణమైనా అన్నిపనులు ఎవరికి వారే చేసుకోవాల్సిన పరిస్థితి.అందుకని పిల్లలకు వాళ్ళ పుస్తకాలు వాళ్ళే సర్దుకోవటం,బూట్లు వేసుకోవటం,బట్టలు వేసుకోవటం లాంటి చిన్నచిన్నపనులు చేసుకోవటం అలవాటు చేస్తే అమ్మ వచ్చిచేస్తుందనో,నాన్న వచ్చిచేస్తాడనో ఎదురు చూడకుండా ఉంటారు.తర్వాత నిదానంగావాళ్ళ పనులు చేసుకోవటమే కాక అమ్మకు,నాన్నకు చిన్నచిన్నపనుల్లో  సహాయపడటం అలవాటవుతుంది.మనమే మన పనులు మనం చేసుకోము. ఇక పిల్లలకు ఏమి నేర్పుతాము అనుకోకుండా ముందు మనపద్దతులు మార్చుకుని పిల్లలకు మంచి పద్దతులు నేర్చుకునేలా చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు మనకు కూడా మంచిది.కొంచెం పెద్దయిన దగ్గరనుండి హాస్టళ్ళలో ఉండక తప్పని పరిస్థితి.ఒకేసారి ఇబ్బందిపడకుండా ఉండటమేకాక  ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకోవటానికి అలవాటుపడతారు.

ఇళ్ళ మధ్యలో పులిపిల్లలు

                                                                   ప్రీతిక నివసించే ప్రాంతంలో ఒక వర్గానికి చెందినవారు ఎక్కువమంది ఉండేవారు.అక్కడ ఇళ్ళమధ్యలో పులిపిల్లలు తిరుగుతున్నాయా? అనిపించేలా బలంగా,చారలతో పులిపిల్లల ఆకారంలో కనిపించేవి.ప్రీతిక వెళ్ళిన మొదట్లో వరండాలోకి వెళ్లేసరికి పెద్ద కళ్ళతో చూస్తూ నిలబడి ఉంది.ఇదేమిటి పులిపిల్ల ఇంటిముందు నిలబడింది?అని పరీక్షగా చూడగా బెదురూ లేకుండా అలాగే చూస్తూ నిలబడింది.ఇంతకీ అదేమిటనుకున్నారు? పెద్ద పిల్లి.తర్వాత పనిమనిషి చెప్పినదేమిటంటే ఆప్రాంతంలో మాంసాహారము ఎక్కువగా తినేవాళ్ళు ఉండటం వలన  పిల్లులు కూడా అదే తిండి కష్టపడకుండా తినటం వల్ల తెగ బలిసి పులిపిల్లల్లా నిగనిగ లాడుతూ తయారయ్యాయని తన భాషలో చెప్పింది.పిల్లులు అరవటం కూడా పిల్లలు పెద్దగా ఏడ్చినట్లుగా అరిచేవి.


చుట్టం చూపుగా .....

                            వారిజ భర్త బదిలీ కారణంగా ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్లవలసి వచ్చింది.అక్కడ  పావురాలు తప్ప వేరే ఏ పక్షీ కనిపించేదికాదు.అక్కడ మూడు సంవత్సరాలు ఉంటే ఏడాదికి రెండుసార్లు చొప్పున మూడు సంవత్సరాలలో ఆరుసార్లు మాత్రమే చుట్టం చూపుగా ఒక కాకి కావుకావు మంటూనేను వచ్చానని అరుస్తూ  ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్ళేది.ఎక్కడా ఆగేది కాదు.ఇన్నాళ్ళకు కాకి కనిపించిది కదా అనుకునే లోపు మాయమై పోయేది.

Sunday, 23 November 2014

దోసకాయ నిల్వ పచ్చడి

గట్టి దోసకాయలు - 1/2 కే.జి
కారం - 1 కప్పు
నూనె - 1/4 కే.జి
కళ్ళు ఉప్పు - 1 కప్పు
 పసుపు - 1/4 స్పూను
చింతపండు - 100 గ్రా.
మెంతులు,ఆవాలు కలిపి 1/4 కప్పు కన్నా తక్కువ
వెల్లుల్లి - 1 పాయ
                                                 దోసకాయలు చెక్కు తీసి గింజలు తీసేయాలి.మధ్యరకం ముక్కలు కోసి ఉప్పు,పసుపు కలిపి కొంచెంసేపు ఉంచితే నీరు వస్తుంది.నీరు పిండి ముక్కలు ప్రక్కన పెట్టుకుని అదే నీటిలో చింతపండు నానబెట్టి మెత్తగా రుబ్బి కారం,మెంతుపిండి,ఆవపిండి( వేయించి పొడి చేయాలి) కలపాలి.వెల్లుల్లి మెత్తగా దంచి కలిపి తాలింపు పెట్టుకోవాలి.ఇది 20 రోజులవరకు తాజాగా ఉండి చాలా రుచిగా ఉంటుంది.ముక్క రుచిగా ఉండాలంటే మూడవరోజువరకు ఆగాల్సిందే.ఈ మూడు రోజులు రోజుకొకసారి మొత్తం కలిసేలాగా పొడిగరిటెతో త్రిప్పాలి.

కట్టు పొంగలి

బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 150 గ్రా.
నెయ్యి - 50 గ్రా.
జీరా - కొంచెం
ఎండు మిర్చి - 2
కరివేపాకు - కొంచెం
జీడిపప్పు - కొంచెం
నీళ్ళు - 1 కి 3
                                        గిన్నెలో నెయ్యివేసి కాగిన తర్వాత ఎండు మిర్చి,జీరా,కరివేపాకు,జీడిపప్పు వేసి వేయించాలి.బియ్యం పెసరపప్పు కడిగి నీళ్ళు వంచి తాలింపులో వేసి 2 ని.లు వేయించాలి.బియ్యం,పెసరపప్పు ముందే కొలిచి ఒకటికి  మూడు నీళ్ళు పోసిపొంగు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి ఉడికించాలి.ఇగిరిన తర్వాత దించేయాలి.  

Saturday, 22 November 2014

దోసెలు - రకరకాలు

1)   బియ్యం - 2 కప్పులు
   పెసరపప్పు - 3/4 కప్పు
   మినప్పప్పు - 1/4 కప్పు
   మెంతులు - కొంచెం
ఉప్పు - సరిపడా
                                                            వీటన్నింటినీ 5 గం లు నానబెట్టి గరిటె జారుగా,మెత్తగా పిండి రుబ్బి దోసె వెయ్యాలి.ముందుగా నూనె వెయ్యకుండా దోసె వేసి చివరలో నూనె చుట్టూ,మద్యలో అక్కడక్కడవెయ్యాలి.దోసె వెయ్యగానే ఉల్లి,పచ్చిమిర్చి,కొత్తిమీర,టొమాటో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైనవెయ్యాలి.ఆవిరికి పైన మూత పెట్టాలి.కాలిన తర్వాత దోసెను చుట్టలా మడవాలి.పచ్చి మిర్చి అల్లం చట్నీతో తింటే బాగుంటుంది.

2)      బియ్యం - 4 కప్పులు ,మినప్పప్పు - 1/2 కప్పు,పెసరపప్పు - 1/4 కప్పు,పచ్చి శనగపప్పు - 1/4 కప్పు,మెంతులు - 1 స్పూను అన్నీకలిపి నానబెట్టి మెత్తగా రుబ్బి6 గం.లు తర్వాత దోసె వేసుకుంటే దోసె బంగారు వర్ణంలో కంటికింపుగా ఉంటుంది.
    
3)బియ్యం -2 కప్పులు,మినప్పప్పు - 1 కప్పు,మెంతులు - 1 స్పూను,అన్నీ నానబెట్టి మెత్తగా రుబ్బి ఒకపూట పులవనిచ్చి పిండి పొంగిన తర్వాత దోసె వేసుకుంటే బాగుంటుంది.

4)బియ్యం -1 కప్పు,మినప్పప్పు - 1 కప్పు కలిపి నానబెట్టి మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బి ఉల్లి,పచ్చి మిర్చి ముక్కలు వేసి 5,6 గం.లు తర్వాత పెనంపై నూనె వేసి పిండిని చేతితో గుండ్రంగా,కొంచెం మందంగా దోసె వెయ్యాలి.పైన మూతపెట్టి కాలిన తర్వాత రెండోవైపు తిరగెయ్యాలి.
    
    5 ) బియ్యం - 3 కప్పులు
       మినప్పప్పు - 1 కప్పు
       మెంతులు - కొంచెం 
       టొమాటోలు - 2
       కొత్తిమీర - 1 కట్ట
      కరివేపాకు - కొంచెం
      ఉప్పు - సరిపడా
      జీరా - కొంచెం  
పప్పులు,బియ్యం,మెంతులు నానబెట్టి మెత్తగా రుబ్బి టొమాటో,పచ్చిమిర్చి,కొత్తమీర,కరివేపాకు,ఉప్పువేసి రుబ్బాలి.అప్పటికప్పుడు దోసె వేసుకోవచ్చు.

మసాలా దోసె

మినప్పప్పు - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1
ఉప్పుడు బియ్యప్పిండి - 1
మెంతులు - 1 స్పూను
ఉప్పు - సరిపడా
                                         మినప్పప్పు,మెంతులు 5 గం.లు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి దానిలో బియ్యప్పిండి,ఉప్పుడు బియ్యప్పిండి,ఉప్పు సరిపడా కలిపి దోసెలు పొయ్యాలి.బంగాళదుంప మసాలా కూర చేసి
దోసెపై పలుచగా పరిచి దోసెను ఒకసారి మడిచి,మరలా మడిచి ప్లేటులో పెట్టి కొబ్బరి,అల్లం లేదా పల్లీల చట్నీతో
తింటే బాగుంటుంది. 

ఆపాల దోసె

బియ్యం - 1
ఉప్పుడు బియ్యం - 1
మినప్పప్పు - 1/4
ఉప్పు -  సరిపడా
                                బియ్యం,ఉప్పుడు బియ్యం,మినప్పప్పు అన్నీ కలిపి 4 గం.లు నానబెట్టి,మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.దోసె పలుచగా పోసి,ఒక వైపునే మూతపెట్టి కాల్చాలి.

వాము పొడి - కారప్పూస

శనగ పిండి  - 1 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
వాము  - సరిపడా
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
                                                        శనగపిండి,బియ్యప్పిండి జల్లించుకుని వాము నలిగీ నలగకుండా దంచి నూనె కాచి దానిలో పోసి ఉప్పుఅన్నీ కలిపి పిండిలో వేసి సరిపడా నీళ్ళతో కలిపి కారప్పూస గిద్దలతో కాగిన నూనెలో చుట్లుగా వత్తి ఇటు అటు త్రిప్పి బంగారు వర్ణంలోకి రాగానే తీసి పేపరు మీద పెట్టాలి.కొంచెం ఆరిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి.వాము వాసనతో కారప్పూస కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

శనగ పప్పు రొట్టె

బియ్యప్పిండి - 1 గ్లాసు
 పచ్చి శనగ పప్పు - 1 గ్లాసు
పచ్చి మిర్చి - 4
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం - చిన్న ముక్క
నూనె - 1/4 కే.జి
                              పచ్చి శనగపప్పు 2 గం.లు నానబెట్టాలి.2 గ్లాసుల నీళ్ళు పోసి,ఉప్పు వేసి మరగనిచ్చి దించాలి. శనగ పప్పు వడకట్టి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు,బియ్యప్పిండి వేసి వేడినీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ చపాతీ పిండి లాగా ముద్దగా కలుపుకోవాలి.ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి దానిపై ఈముద్దను రొట్టె మాదిరిగా తట్టాలి.పెనంపై కొంచెం నూనె పోసి రొట్టెను వేసి మూత పెట్టి  కాసేపయ్యాక తిరగవేసి మరికాస్త నూనె వెయ్యాలి.ఎర్రగా కాలిన తర్వాత తియ్యాలి.

చక్రాలు - రకాలు


పుట్నాల పప్పు(చట్నీ పప్పు) - 1 డబ్బా
బియ్యప్పిండి  - 4 డబ్బాలు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
                                            బియ్యం,పుట్నాలపప్పు మరపట్టించి జల్లించి,ఉప్పు,కారం,తగినన్ని నీళ్ళు పోసి కలిపి చక్రాల గిద్దలకు నూనె రాసి నూనె సరిపడా పోసి కాగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో వత్తి బంగారు రంగులో కరకరలాడేలా వేయించుకోవాలి.

బియ్యప్పిండి - 1 డబ్బా
మజ్జిగ - కలపటానికి సరిపడా
ఉప్పు - కొంచెం
కారం - కొంచెం
వాము - కొంచెం
                                  బియ్యప్పిండిలో మజ్జిగ పోసి సరిపడా ఉప్పు,కారం,వాము అన్నీ కలిపి కాగుతున్న నూనెలో గిద్దలతో వత్తాలి.మంచి రంగువచ్చినప్పుడు తీసి ఒక పేపర్ మీద  వేయాలి.

Friday, 21 November 2014

అభినందనీయం

                                                      శశాంక్,శర్మిష్ట భార్యాభర్తలు.ఇద్దరూ వైద్యులు.ఇద్దరూ వేరువేరు ప్రాంతాలలో చదువుకున్నారు.శశాంక్ వివాహానికి ముందే విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు.శర్మిష్ట వేరే దేశంలో చదువుకుంటుండగా ఇరువైపుల పెద్దలు వీరిఇద్దరికి ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేశారు.శర్మిష్ట తన
చదువు పూర్తవగానే శశాంక్ పనిచేసే దేశానికి వెళ్ళింది.శర్మిష్ట వెళ్ళినతర్వాత ఒక సంవత్సరంవరకు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు.అనుకోకుండా చాలారోజుల తర్వాత శశాంక్ పనిచేసే ఆసుపత్రి నుండి పిలుపు వచ్చింది.కానీ అక్కడి సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో శశాంక్ భార్య శర్మిష్ట అన్నవిషయం తెలిసి ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో  పనిచేయకూదడనే నిబంధన కారణంగా శర్మిష్టకు ఉద్యోగం ఇవ్వలేమని తేల్చిచెప్పారు.బయటకు రాగానే శశాంక్ తో
పాటు పనిచేసే వైద్యురాలితో ఇంతముందే శశాంక్ ఇక్కడ పనిచేస్తున్నాడు కనుక తనకు ఉద్యోగం ఇవ్వమన్నారని బాధపడుతూ చెప్పింది.ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య బాధపడటంతో శశాంక్ భార్య మీదఉన్న అమితమైన  ప్రేమతో తను ఉద్యోగానికి రాజీనామా చేసి ఆఉద్యోగాన్నితన భార్య శర్మిష్టకు ఇవ్వమని యాజమాన్యాన్ని కోరాడు.భార్యకన్నా భర్త పైమెట్టు మీద  ఉండాలని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నఈరోజుల్లో భార్యకోసం ఉద్యోగాలు దొరకని రోజుల్లో చేస్తున్న ఉద్యోగాన్నివదిలేయటం నిజంగా అభినందించదగ్గ విషయం.
  

ఉల్లిపాయల రొట్టె

 కటిక బియ్యప్పిండి (కడిగకుండా పట్టించినది) - 1 కప్పు 
ఉప్పు - తగినంత 
వేరుసెనగ పప్పు(పల్లీలు ) - కొంచెం 
చట్నీ పప్పు (పుట్నాలు లేదా వేయించిన శనగ పప్పు) - కొంచెం
ఉల్లిపాయ - 1
కొత్తిమీర - కొంచెం 
 నూనె - కొంచెం 
  పచ్చి మిర్చి - 2

                                   పచ్చి మిర్చి ఉప్పు కలిపి మెత్తగా మిక్సీలో వెయ్యాలి.పప్పులు బరకగా ఉండేలా మిక్సీలో వెయ్యాలి.ఉల్లిపాయ,కొత్తిమీర సన్నగా తరగాలి.ఇవన్నీ పిండిలో కలిపి పచ్చి నూనె కొంచెం వేసి కలపాలి.నీళ్ళు పోసి 
మరీ గట్టిగ కాకుండా కలుపుకోవాలి.పెనం మీద నూనె వేసి తర్వాత పిండిని వేసి చేతితో తట్టాలి.(సరిచేయాలి)చివర్లో నూనె వేసి మూత పెట్టాలి.ఇది అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే రుచిగా ఉంటుంది.అప్పుడుకప్పుడు కలిపి వేసుకోవచ్చు.

ఇడ్లీ పొడి

మినప్పప్పు  - 1 కప్పు
పచ్చి శనగపప్పు  - 1 కప్పు
ధనియాలు - 1 కప్పు
నువ్వులు - 1 స్పూను
ఎండు మిర్చి - 10
ఉప్పు - తగినంత
నూనె - 1 స్పూను
                                            ఒకస్పూను నూనె వేసి పప్పులు వేయించాలి.నువ్వులు,ధనియాలు విడివిడిగా వేయించాలి.ఎండు మిర్చి కూడా వేయించాలి.పప్పులు మిక్సీలో వేసి మెత్తగా పొడి చెయ్యాలి.ధనియాలు మెత్తగా పొడి చెయ్యాలి.ఎండుమిర్చి,నువ్వులు కలిపి మెత్తగా పొడి చేసుకుని,ఉప్పు సరిపడా వేసి మొత్తం కలిపి ఒకసారి మిక్సీలో వేసుకోవాలి.ఇది ఇడ్లీతో తింటే బాగుంటుంది.ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు.లేకపోతే వేసుకోకపోయినా తినవచ్చు.

Thursday, 20 November 2014

రాములోరిని దర్శించే విధానంబెట్టిదనిన....

                                 జ్వాల గుళ్ళో సమారాధనకు మేనత్త కబురుచేస్తే వెళ్ళింది.అక్కడ శివాలయంతో పాటు రామాలయనికి తీసుకెళ్ళారు.ఎప్పుడైనా రామాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా రాములవారిని దర్శనం చేసుకోకూడదని చెప్పారు.ముందుగాఎదురుగా ఉన్నఅంజనేయస్వామిని దర్శనం చేసుకుని తర్వాత అమ్మ సీతమ్మను,ఆతర్వాత తమ్ముడైన లక్ష్మణుడిని,చివరగా రాములవారిని దర్శనం చేసుకోవాలని చెప్పారు.ఎక్కడైనా రాములోరిని దర్శించే విధానం ఇదేనని,దర్శనం చేసుకోవాలంటే వీరందరి అనుమతి తీసుకోవాలని అప్పుడే ఫలితం ఉంటుందని చెప్పారు.జ్వాలకు ఇదంతా తెలియదు కనుక చెంపలు వేసుకుని  ఇక ముందు రామాలయంకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఇదే విధంగా దర్శనం చేసుకోవాలని అనుకుంది. 

నిమ్మ పూరీలు

మైదా - 1 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - వేయించడానికి సరిపడా
వెన్న - కొంచెం
ఉప్పు - కొంచెం
నిమ్మకాయ - 1
                                                     మైదాలో వెన్న,ఉప్పు,నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకుని ఒక గంట నాననివ్వాలి.పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకంరానివ్వాలి.తర్వాత నిమ్మరసం పోయాలి.పూరీలు వండిన తర్వాత పంచదార పాకంలో వెయ్యాలి.చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.

కొబ్బరి,రవ్వ,శనగ పిండితో బర్ఫీ

కొబ్బరి తురుము - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
శనగ పిండి - 1 కప్పు
 పంచదార - 3 1/2 కప్పులు
నెయ్యి - తగినంత
                                                      కొబ్బరి,రవ్వ,శనగ పిండి వేరు వేరుగా నేతితో వేయించుకోవాలి.పంచదారలో నీళ్ళుపోసి స్టవ్ పై పెట్టి పాకం నీళ్ళల్లో వేసి దగ్గరకు చేర్చితే ఉండ అవ్వగానే అన్నీ రెడీగా పెట్టుకుని ముందుగా కొబ్బరి,రవ్వ,శనగ పిండి వరుసగా వేసి బాగా త్రిప్పాలి.పాకం బుడగలుగా పైకి పొంగు వచ్చినిలబడినప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో వెంటనే పోసి మనకు నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.  

బొంబాయి రవ్వ ఇడ్లీ

బొంబాయి రవ్వ - 1 పెద్ద కప్పు
సేమ్య - 100 గ్రా.
జీడిపప్పు - 50 గ్రా.
పచ్చి కొబ్బరి - 1 చిప్ప
పచ్చిమిరపకాయలు - 10
నెయ్యి - తగినంత
 ఉప్పు - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
కరివేపాకు - కొంచెం
                                              రవ్వ,జీడిపప్పు,సేమ్యా,పచ్చిమిరపకాయ ముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,కొబ్బరి తురుము, అన్నీ వేరువేరుగా కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి.ఇడ్లీ పెట్టేముందు అన్నీవేసి తగినంత ఉప్పు,నీరు పోసి
కలుపుకోవాలి.ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి పెడితే ఇడ్లీ తేలికగా వస్తుంది.ఇష్టమైన వాళ్ళు నీరు బదులు తగినంత
గిలకొట్టిన పెరుగు కలుపుకోవచ్చు.

పాల పూరీలు

పాలు - 1/2 లీ
మైదా - 1/4 కే.జి
 యాలకులు - 3
నెయ్యి - 1/4 కే.జి
వెన్న - 1/2 కప్పు
 పంచదార - 1/2 కప్పు
                               మైదాలో వెన్న వేసి పూరీల పిండిలాగా కలుపుకోవాలి.పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.పంచదార,యాలకులపొడి వేసి త్రిప్పాలి.పిండిని చిన్నచిన్న పూరీల మాదిరి వత్తి నేతిలో వేయించి
మరుగుతున్న పాలల్లో వెయ్యాలి.పూరీలు అన్నీ వేసిన తర్వాత గిన్నెను దించాలి.ఇది కృష్ణుడికి ఇష్టమైన స్వీటు.

Wednesday, 19 November 2014

పాదంపై నిలబడి ఎత్తుకోమని ....

                                  ప్రమీల,రెండేళ్ళ కూతురు యోగ్యతను తీసుకుని విదేశం నుండి అమ్మను చూడటానికి స్వదేశానికి వచ్చింది.దగ్గరి బంధువులైన సురేంద్ర,భార్య శృతిని తీసుకుని యోగ్యత,ప్రమీలను చూడటానికి వాళ్ళింటికి వెళ్ళాడు.క్రొత్త కనుక వీళ్ళను చూడగానే ప్రమీల చంకనెక్కి యోగ్యత ఏడుపుమొదలెట్టింది.కొంచెంసేపటితర్వాత
సురేంద్ర నిలబడి ఫోను మాట్లాడుతుండగా యోగ్యత వెళ్ళి సురేంద్ర పాదంపై రెండు కాళ్ళు పెట్టి నిలబడి కాలు పట్టుకుని వదలటంలేదు.సురేంద్రకు అర్ధంకాక నిదానంగా విడిపించుకున్నాడు.మళ్ళీ రెండవసారి కూడా అలాగే చేసేసరికి ఏమి చేయాలో తెలియక నిదానంగా రెండడుగులు వేస్తే తను అలాగే పాదంపై నిలబడి కాలు పట్టుకునే ఉంది.ఎత్తుకోమంటుందని అర్ధమై యోగ్యతను ఎత్తుకున్నాడు.అప్పుడు నవ్వుతూ సంతోషంగా వచ్చీరాని భాషతో,సైగలు చేస్తూ అంకూ,అంకూ
 అంటూ ముద్దుముద్దుగా కబుర్లు చెప్పటం మొదలెట్టింది.అంతకు ముందెప్పుడు చూడకపోయినా ఒడిలో కూర్చుని పండు తినమని ఇవ్వటం,మంచినీళ్ళు త్రాగమని సైగ చెయ్యటం చేసింది.సురేంద్రకు చిన్నపిల్లలను సరిగా ఎత్తుకోవటం అలవాటు లేదు.అయినా కాసేపు ఎలాగో ఎత్తుకున్నాడు.సురేంద్ర ఇంటికి వెళ్ళటానికి లేస్తే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది.ప్రమీల బుజ్జగించి సురేంద్ర దగ్గరనుండి తీసుకుంది.ఎవ్వరి దగ్గరకు వెళ్ళటంలేదు.మీదగ్గరే ఇంత సమయం కూర్చుని కబుర్లు చెప్పింది అని ప్రమీల చెప్పింది.          
   

Tuesday, 18 November 2014

అమ్మమ్మ కరివేపాకు కారం

పచ్చి శనగపప్పు  - 2 కప్పులు
మినప్పప్పు  - 1 కప్పు
జీలకర్ర  - చారెడు
కళ్ళు ఉప్పు (క్రిస్టల్ సాల్ట్ )  - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
ఎండు మిర్చి - గుప్పెడు
చింతపండు - నిమ్మకాయంత  
కరివేపాకు - 4 గుప్పెళ్ళు
నెయ్యి - 4 స్పూనులు
                                            ముందుగా మినప్పప్పు,శనగపప్పు కడిగి ఒక వస్త్రంలో ఆరబోయాలి.వేరువేరుగా నేతిలో అన్నీ వేయించుకోవాలి.శనగపప్పు మిక్సీలో వేసి తీసి జల్లించాలి.మినప్పప్పు కూడా మిక్సీలో వేసిన తర్వాత జల్లించాలి.నేతితో వేయించిన ఎండు మిర్చిమిక్సీలో వేసి నలిగిన తర్వాత జల్లించగా మిగిలిన నూక కూడావేసి మెత్తగా  చెయ్యాలి.వెల్లుల్లి,చింతపండుఉప్పు,జీలకర్ర కూడా మిక్సీలో వెయ్యాలి.కరివేపాకు ఎక్కువ నూనె వేసి నాన్ స్టిక్ పాన్ లో వేయించాలి.కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా నలిగిన తర్వాత అన్నీ ఒకగిన్నెలో వేసి కలిపి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్సీలో వెయ్యాలి.ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కొంచెం వెయ్యాలి.అంతే ఘుమఘుమలాడే
అమ్మమ్మ చెప్పిన కరివేపాకు కారం రెడీ.ఇది ఇడ్లీ,దోసె,వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది.ఒకసారి కష్టపడితే నెల,నెలాపదిహేను రోజులవరకు నిల్వ ఉంటుంది.గాలి చొరబడని సీసాలో అయితే వాసనపోకుండా అయిపోయే వరకూ మంచి వాసన వస్తుంటుంది.

నల్లగా(కా)రం

ధనియాలు - 1 కప్పు
మినప్పప్పు - 1/2 కప్పు
జీరా - 1/2 కప్పు కన్నా తక్కువ
వెల్లుల్లి పాయలు - 4
ఉప్పు - 1 కప్పు
కరివేపాకు - గుప్పెడు
చింతపండు - నారింజకాయంత
ఎండు మిర్చి - గుప్పెడు
                                                    ధనియాలు,మినప్పప్పు నెయ్యితో వేయించాలి.ఎండు మిర్చి నూనె లేకుండా వేయించాలి.కరివేపాకు కొద్దిగా నూనెతో  వేయించుకోవాలి.ధనియాలు,మినప్పప్పు విడివిడిగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.ఎండు మిర్చి,జీరా మిక్సీలో మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లికూడా వెయ్యాలి. కరివేపాకు విడిగా,మెత్తగా పొడి చేసుకోవాలి.చింతపండు,ఉప్పు కూడా వేసి నలిగిన తర్వాత అన్నీ వేసి కలపాలి.అంతే నల్లగారం రెడీ.ఇది వేడి అన్నంలో,ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. 

ఆణీ - అతుకులు

                          రాజీ అప్పుడప్పుడు పని ఉండి బయటకు వెళ్తూ తన రెండున్నరేళ్ళ కొడుకును స్నేహితురాలు
వందన ఇంట్లో వదిలి వెళ్తుంది.అందుకని వందన,ఆమె భర్తను ఆణీ,అంకూ(ఆంటీ,అంకుల్) అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.వీళ్ళంటే వాడికి చాలా ఇష్టం.వీళ్ళు కూడా వాడు ఎంత అల్లరి చేసినా ఏమీ అనకుండా ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు.ఒకరోజు వీళ్ళింటికి వచ్చినప్పుడు వందన అటుకులు పెట్టింది.రెండు రోజుల తర్వాత వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్ళటం ఇష్టంలేక "ఆణీ అతుకులు" ఇవ్వమని పేచీ పెట్టుకుని కూర్చున్నాడు.సమయానికి అవి ఇంట్లో లేవు.రేపు తెప్పిస్తాను అని చెప్పినా వినకుండా మొండిగా ఇంటికి వెళ్లనని మారాం చేస్తూ ఏడవటం మొదలు పెట్టాడు.చేసేదేముంది?కొట్టుకి పంపించి అటుకులు తెప్పించి ఇచ్చేవరకూ కదలలేదు,ఏడుపు ఆపలేదు.వాళ్ళమ్మ బలవంతాన ఎత్తుకుని తీసుకెళదామంటే ఎత్తుకుంటే సాగుతున్నాడు.అటుకులు తిన్న తర్వాత కానీ ఇంటికి వెళ్ళలేదు.  

ఒక్కరోజులో అన్నవరం

                                             కాంచనమాలకు దైవ భక్తి ఎక్కువ. ప్రతి సంవత్సరం భర్త,కొడుకుతో కలిసి అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకుంటానని మ్రొక్కుకుంది.ఆమె భర్త బహు జాగరూకుడు.ముందురోజు వెళ్తే వసతి,భోజనం ఖర్చులు దండగ అని ఒక్క రోజులో వెళ్ళి వచ్చేద్దామంటాడు.ఉదయం ఊరిలో మొదటి బస్సు 5 గం.లకు ఎక్కించి  రైల్వే స్టేషనుకు తీసుకెళ్ళి హడావిడిగా రైలెక్కిస్తాడు. అన్నవరం స్టేషనులో దిగి అక్కడినుండి ఆటో ఎక్కితే డబ్బులు ఖర్చు అని బస్సెక్కించి కొండకు చేరుకొని,అక్కడ సత్యన్నారాయణ వ్రతం చేసుకుని,దర్శనం అయ్యాక,భోజనం చేసి మళ్ళీ హడావిడిగా ఎక్కడా ఒక్క నిమిషం నిలబడనీయకుండా మరల బస్సులో కొండదింపి రైలేక్కిస్తాడు.మరల రైలు దిగగానే బస్సు ఎక్కించి ఊరికి తీసుకెళ్తాడు.ముందే రిజర్వేషను చేస్తాడు కనుక కూర్చుని రావటంవల్ల బడలిక తెలియదు కానీ లేకపోతే 600కి.మీ ఒక్కరోజులో ప్రయాణించటం చాలా కష్టం.మా ఆయన హడావిడి ప్రయాణం అయినా భగవంతుని దయవల్ల 60 ఏళ్ల వయసులో కూడా వెళ్ళి రాగలుగుతున్నాము అని కాంచనమాల తన మనసులోని మాటను  స్నేహితులతో,బంధువులతో ముచ్చటగా చెప్తూ ఉంటుంది.  

Monday, 17 November 2014

పెసర మొలకలతో సలాడ్

           పెసలు - 100 గ్రా.
           కారట్ - 1
           కొత్తిమీర - కొంచెం
           మిరియాల పొడి -1/4 స్పూను
           నిమ్మరసం - కొంచెం
           ఉప్పు  - సరిపడా
           చక్కర - 1/2 స్పూను
                                              పెసలు 5 గం.లు నానబెట్టి పలుచటి వస్త్రంలోమూటకట్టాలి.24గం.లు ఉంచితే మొలకలు వస్తాయి.వీటిని ఒక గిన్నెలో వేసి తురిమిన కారట్,కొత్తిమీర మిరియాలపొడి నిమ్మరసం,ఉప్పు,చక్కర కలిపితే చక్కటి సలాడ్ తయారవుతుంది.
                                               ఇష్టమైన వాళ్ళు పైన చెప్పిన వాటితో పాటుఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ,రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు.కొంచెం నూనెతో తాలింపు వేసుకోవచ్చు.ఇది కూడా బానే వుంటుంది.

Sunday, 16 November 2014

ఐదు నిమిషాలు

                                                   వ్యాయామం చేయటం ఆరోగ్యానికి మంచిది.అందులో ఎక్కువ మంది నడకకు ప్రాముఖ్యత ఇస్తారు.నిదానంగా నడిచినకన్నా వేగంగా నడవటం(బ్రిస్క్ వాక్) వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
రోజూ నడక,ఇంకేదైనా వ్యాయామం చేసినా దానితోపాటు రోజుకొక ఐదు నిముషాలు పరురుగెత్తలిగితే ఎక్కువ ఫలితం ఉంటుంది.మోకాళ్ళ పనితీరు మెరుగై కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి.జీవితకాలం ఐదేళ్ళు పెరుగుతుంది.పరుగు వల్ల ఊబకాయం,మధుమేహం,గుండె జబ్బులు,రక్తపోటు,పక్షవాతం,కాన్సర్ వ్యాధులు రాకుండాఉంటాయి.ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు ఐదు నిముషాలు కేటాయించి పరుగెత్తగలిగితే ఎంతో మేలు .


రోజుకో పండు

                               రోజుకో పండు తింటే  వైద్యునితో పనిలేదని అంటారు.దీనిలో ఉన్న పోషకాల వల్ల అనారోగ్యం దరిచేరదు.ఎన్నో రకాల వ్యాధుల్ని నివారించవచ్చని నానుడి.మధుమేహం దరిచేరదు.దీన్ని తొక్కతో తినటంవల్ల
కాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల అల్జీమర్స్ ని నిరోధించవచ్చు.
ఇంతకీ ఈపండు ఏమిటంటే "ఆపిల్".

Friday, 14 November 2014

కందిపప్పు పచ్చడి

కందిపప్పు - 1 కప్పు
ఎండు మిర్చి - 10
చింతపండు - కొంచెం
ఉప్పు - సరిపడా
వెల్లుల్లి పాయ - 1
నూనె - తగినంత
                            బాండీలో కొంచెం నూనె వేసి ఎండు మిర్చి,వేయించి,ప్రక్కన పెట్టుకోవాలి.తర్వాత కందిపప్పు వేయించాలి.చింతపండు నీళ్ళల్లో నానబెట్టాలి.కందిపప్పు,మిర్చి మిక్సీలో పొడి చేశాక చింతపండు,ఉప్పు,వేసి
చివరలో వెల్లుల్లి వేయాలి.ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం నూనెతోతాలింపుపెట్టాలి.కరివేపాకు,కొత్తిమీర  కూడా వేసుకుంటే మంచి సువాసనతో రుచిగా వుంటుంది.                                 

సొజ్జ

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 1/2 కప్పు
ఎండు మిర్చి - 3
ఆవాలు,జీరా - 1 స్పూను చొప్పున
నీళ్ళు  - 7 1/2 కప్పులు(1 కి 3 నీళ్ళు)
నూనె - 1/ 2 కప్పు
ఉప్పు - తగినంత
                                 బియ్యం,పెసరపప్పు నూనె లేకుండా వేయించుకోవాలి.ఒక గిన్నెలో నూనె వేసి స్టవ్ మీద పెట్టి కాగాక ఆవాలు,జీరా వేసి తాలింపు పెట్టి,నీళ్ళు పోసి మరిగాక  మొదట పెసరపప్పు వేసి కొద్దిగా ఉడికాక
ఉప్పు,బియ్యం వేసి మూత పెట్టాలి.ఉడికాక చివర్లో కొంచెం కరివేపాకు వేసి కలపాలి.దీన్ని రసంతో తింటే బాగుంటుంది.

లక్ష బిల్వార్చన

                                       బిల్వం అంటే మారేడు దళం.శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.భక్తితోఒక్క మారేడు దళం సమర్పించినా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు.శివుడు భక్తసులభుడు.కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజ
చేయటం ఎంతో మంచిది.శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఎంత ప్రత్యేకమో బిల్వార్చన అంటే మారేడు దళాలతోఅర్చన చేయటం కూడాఅంతే ప్రత్యేకం.లక్ష బిల్వదళాలు సమకూర్చటం ఎంత కష్టమో,మరల ఒక్కొక్క దళం అంటే మూడు ఆకులు కలిసి ఉన్నవి,మంచిగాఉన్నవాటిని మాత్రమే ఏరటం కూడా అంతే కష్టం.ఎంతోమంది భక్తులు భక్తి భావంతో శ్రమపడి ఇవన్నీసమకుర్చుతారు.అమృత ఊరిలో పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది.ఈగుడిలో నాగేంద్రుడు రాత్రిపూట శివలింగాన్ని చుట్టుకుని ఉంటాడు.కోరిన కోర్కెలు తప్పక నెరవేర్చే ఈస్వామి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. పాతిక సంవత్సరాల క్రితం నుండే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం స్వామికి లక్షబిల్వార్చన,అమ్మవారికి లక్ష కుంకుమార్చన  కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఎంతోమంది బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య లక్ష బిల్వార్చన కార్యక్రమం తెల్లవారుఝామున 3గం.ల నుండి సాయంత్రం వరకూ దిగ్విజయంగా కన్నులపండువగా జరుగుతుంది.భక్తజన సందోహంతో ఆప్రాంతం కిటకిటలాడిపోతుంది.శివనామ స్మరణతో ఆప్రాంతమంతా మార్మోగిపోతుంది.101జంటలు(దంపతులు)పూజలో పాల్గొంటారు.చుట్టుప్రక్కల నుండి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు.ఈ గుడిలోకార్తీకమాసంలో ప్రతిరోజూ తెల్లవారుఝామున 3 గం.లనుండే రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి.భక్తులు తెల్లవారుఝాము నుండే వచ్చి నిత్యాదీపారాధన చేస్తుంటారు.   లక్షఒత్తులు,కోటి ఒత్తులు వెలిగించడానికి చుట్టుప్రక్కలవాళ్ళు వస్తుంటారు.కార్తీకమాసం చివరివారంలో ఒకరోజు అన్నసమారాధన విందు భోజనాల కన్నా ఘనంగా నిర్వహిస్తారు.ఈకార్యక్రమానికి కూడా చుట్టుప్రక్కల ఊళ్ళనుండి స్వామి ప్రసాదం తీసుకోవటం అదృష్టంగా భావించి స్వీకరిస్తారు.    

Thursday, 13 November 2014

మెడ చుట్టూ నలుపు పోవటానికి.....

ఒకస్పూను శనగ పిండి,2 స్పూనుల పాలు,చిటికెడు పసుపు,కొద్దిగా నిమ్మరసం కలిపి మెడ చుట్టూ పలుచగా రాసి ఒక 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.ఇలా వారానికి 2,3 సార్లు చేస్తుంటే క్రమంగా  మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గిపోయి శరీరఛాయతో సమంగా ఉండి నునుపుగా,అందంగా మెరిసిపోతూ ఉంటుంది.

రవ్వ దోసె

బియ్యప్పిండి - 2
మైదా పిండి - 1
బొంబాయి రవ్వ - 1
ఉప్పు - తగినంత
అల్లం - చిన్నముక్క
 పచ్చిమిర్చి- 3
జీడిపప్పు - కొద్దిగా
కారట్ తురుము - ఇష్టమైతే
                                               అల్లం,పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి.పై పిండిలన్నీ కలిపి అల్లం,పచ్చిమిర్చి పేస్ట్,జీడిపప్పు ముక్కలు అన్నీ కలిపి అప్పటికప్పుడు వేసుకోవచ్చు.పిండి పలుచగా కలిపితే దోసె పలుచగా వస్తుంది.నూనె బ్రష్ తో రాస్తే సరిపోతుంది.

బుడ్డిగాడు

                               సురేంద్ర,నాగేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు.బాబు,పాప.భార్యభార్తలిద్దరూ కష్టపడే తత్వం కలవాళ్ళు.ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నారు.వాళ్ళు కష్టపడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి గురించి కలలుకంటూ మంచిస్కూల్లో చేర్పించారు.వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు.
వీళ్ళ కుటుంబాన్ని చూచి అందరూ ముచ్చటపడేవారు.పాప హైస్కూల్లో చదువుతుండగా స్కూల్లో ఏదో గొడవ జరిగిందని తెలిసీ తెలియనితనంతో ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.ఆబాధ తట్టుకోలేక,ఆఅమ్మాయి జ్ఞాపకాలు మర్చిపోలేక ఆఇంటిని వదిలి సిటీకి మకాం మార్చారు.ఎక్కడికి వెళ్ళినా ఎలా మరచిపోగలరు?నాగేశ్వరి మానసికంగా కృంగిపోయి నాపిల్లను తెచ్చివ్వండి అంటూ ఏడవటం లేదా తెచ్చివ్వలేకపోతే ఎలాగైనా నేను మళ్ళీ ఆడపిల్లను కనవలసిందేనని పట్టుబట్టి ఎవరు చెప్పినా వినకుండా 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరల రీకెనలైజేషన్(పిల్లలు పుట్టకుండా చేయిచుకుని తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవటం అన్నమాట) చేయించుకుని అదే ఆడపిల్ల మళ్ళీ తన కడుపున పుడుతుందనే పిచ్చి నమ్మకంతో చివరకు మళ్ళీ మగబిడ్డకు జన్మనిచ్చింది.పిల్ల బ్రతికుండగా నేను మపిల్లాడినయితే బాగుండేది అనేది కనుక మగబిడ్డ రూపంలో పుట్టిందని సరిపెట్టుకుని అపురూపంగా పెంచుకుంటూ పాత జ్ఞాపకాలను కొంతవరకు తరిమి కొట్టింది.వాడిని బుడ్డిగాడు అని ముద్దుగా పిలిచేది.వాడు పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నా,పెళ్లీడు కొచ్చినాబుడ్డిగాడు అని పిలుస్తుంది. కొద్దిసేపు కనిపించకపోయినా మా బుడ్డిగాడు ఏమి చేస్తున్నాడో?అంటూ మితిమీరిన ప్రేమతో బుడ్డిగాడి గురించి తెగ  బాధపడిపోతుంటుంది.ఈ ఉదంతం గురించి తెలిసు కనుక బుడ్డిగాడు అంటూ ఎప్పుడూ కలవరిచినా,వాడి ముచ్చట్లు చెప్పినా ఎవరూ విసుక్కోరు.   

Wednesday, 12 November 2014

బచ్చలికూర పచ్చడి

బచ్చలి కూర - 5 కట్టలు
ఎండు మిర్చి - 15
చింతపండు - చిన్న నిమ్మకాయంత
పసుపు - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె - 1 గరిటెడు
తాలింపు దినుసులు - 1 స్పూను
కరివేపాకు - కొంచెం
కొత్తిమీర - కొంచెం
వెల్లుల్లి పాయ - 1
                              బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు దోరగా వేయించుకుని వెల్లుల్లి,కరివేపాకు,కొత్తిమీర వేసి వేగాక ఒకగిన్నెలోకి తీసి కొంచెం నూనెలో ఎండు మిర్చివేయించుకోవాలి.అవి కూడాతీసి ప్రక్కనపెట్టుకుని,తరిగిన బచ్చలికూర వేసి నీరు ఇగిరే వరకూ వేయించాలి.ఎండు మిర్చి,మిక్సీలో వేసి కొద్దిగా నలిగిన తర్వాత వెల్లుల్లి,జీరా వేసి నలిగిన తర్వాత బచ్చలికూర,నానబెట్టిన చింతపండు వేసి కొంచెం నలగనివ్వాలి.పోపు వేసినా గిన్నెలో ఇది కూడా వేసి కలపాలి.ఇక రుచికరమైన బచ్చలికూర పచ్చడి సిద్దమైనట్లే.ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది.

చుక్కకూర పచ్చడి

చుక్కకూర  - 5 కట్టలు
ఎండు మిర్చి - 15
ఉప్పు - తగినంత
వెల్లుల్లి పాయ  - 1
జీరా - 1/2 స్పూను
తాలింపు దినుసులు - 1 స్పూను
 నూనె - 1 గరిటెడు
కరివేపాకు - కొంచెం
కొత్తిమీర - కొంచెం
పసుపు - 1/4 టీ స్పూను
                                    బాండీలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులు వేసి దోరగా వేయించి వెల్లుల్లి ముక్కలు కొంచెం వేసి,కరివేపాకు,కొత్తిమీర వేసి వేగాక ప్రక్కన పెట్టుకోవాలి.అదే నూనెలో ఎండు మిర్చిదోరగా వేయించుకుని
తీసి ఒక ప్లేటులో పెట్టాలి.తరిగిన చుక్కకూర,ఉప్పు,పసుపువేసి నీరు ఇగరనివ్వాలి.ముందుగా వెల్లుల్లి,జీరా,          
 ఎండుమిర్చి, మిక్సీలో వేసి మెత్తగా నలిగిన తర్వాత చుక్కకూర వేసి అది కూడా నలిగిన తర్వాత తాలింపు వేసిన గిన్నెలో వేసి కలుపుకోవాలి.పుల్లపుల్లగా నోరూరించే చుక్కకూర పచ్చడి రెడీ.  

కాలీఫ్లవర్ పచ్చడి

కాలీఫ్లవర్ ముక్కలు  - 3 కప్పులు
ఉప్పు - 1/2 కప్పు కన్నా తక్కువ (1/4 కప్పు కన్నా ఎక్కువ)
పసుపు - 1 స్పూను
కారం - 1/2 కప్పు
ఆవపిండి - 1/4 కప్పులో సగం
మెంతుపిండి - 1/4 కప్పు
వెల్లుల్లి - 2 పాయలు
నూనె - 1 కప్పు
నిమ్మకాయ - 2 చిన్నవి లేదా 1 పెద్దది(లేదా) ఒక నిమ్మకాయంత చింతపండు

                                          కాలీఫ్లవర్ మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసి,ఉప్పు వేసి కడిగి,తడి లేకుండా నీడలో ఆరబెట్టాలి.ఒకప్లేటులో ఈపొడులన్నీ వేసి,వెల్లుల్లి పేస్ట్ చేసి అన్నీ బాగాకలిపి ప్రక్కన పెట్టుకోవాలి.ఒకగిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి నూనె ముక్కలకు పట్టించి,పై పొడులన్నిటితోపాటు నిమ్మరసం లేదా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ముక్కలకు పట్టించి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి.రెండు రోజులు రోజుకొకసారి చొప్పున పొడిగా ఉన్నగరిటెతో పూర్తిగా కలిసేలాగా కలిపాలి.మూడవరోజు నుండి పచ్చడి వాడుకోవచ్చు.ఇది 20 రోజులవరకు రుచిగా ఉంటుంది. 

Tuesday, 11 November 2014

అటుకుల బోండా

 అటుకులు - 1/4 కే.జి
 సెనగ పిండి - 1/2 కే.జి
 ఉల్లిపాయ - 1
 పచ్చి మిర్చి - 3
 కారం - 1 స్పూను
 ధనియాల పొడి - 1 స్పూను
 నిమ్మకాయ - 1    
 నూనె - తగినంత
 ఉప్పు - తగినంత
  కొత్తిమీర,పుదీనా - కొంచెం
   పసుపు - కొద్దిగా
                                 అటుకులను ఒకగిన్నెలో వేసి అటుకులు మెత్తబడే వరకూ నీళ్ళు చల్లి ఉంచాలి.దీనిలో పసుపు,ఉప్పు,కారం.ధనియాలపొడి,నిమ్మరసం,కొత్తిమీర,పుదీనా,ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలువేసి కలిపి,నిమ్మకాయ సైజులో గుండ్రని ఆకారంలోచేసి ప్రక్కన పెట్టుకోవాలి.
                                   శనగపిండిలో కారం,ఉప్పు,పసుపు,ధనియాలపొడి వేసి బజ్జీలపిండి మాదిరిగా కలిపి నూనె
కాగిన తర్వాత అటుకుల లడ్డూలను దీనిలో ముంచి ఎర్రగా వేయించి తీయాలి,  

ఉసిరి ఆవకాయ

                                ఇప్పుడు పెద్ద ఉసిరికాయలు మార్కెట్టులో ఎక్కువగా వస్తున్నాయి.రోజుకొకటి చొప్పున ఏదోఒక రూపంలో తినటం మంచిది.ఉసిరి ఆవకాయపచ్చడి మాదిరిగా తయారుచేయడం చాలా సులభం.ఇది చాల రుచిగా కూడా ఉంటుంది.
                                    ఉసిరికాయలు - 1 డబ్బా
                                    ఉప్పు - 3/4 కప్పు
                                    వెల్లుల్లి - 4 పాయలు
                                    కారం - కప్పుకు సమానంగా
                                    ఆవపిండి - 1/4 కప్పు
                                    మెంతుపిండి - 1/2కప్పు(దోరగా వేయించి పొడి చేయాలి)
                                    నూనె - 1/4 కే.జి
                                 ఉసిరికాయలు కడిగి,తుడిచి నూనెలో దోరగా వేయించాలి.ఉప్పు,కారం.మెంతుపిండి, ఆవపిండి,వెల్లుల్లి అన్నీ ఒక ప్లేటులో వేసి కలిపి వేయించిన ఉసిరికాయలకు పట్టించి వేయించగా మిగిలిన నూనెను
కలుపుకోవాలి.దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి రెండు రోజులు గరిటెతో కలిపి,మూడోరోజు మరల 1/4 కే.జి లో సగం నూనె కలుపుకుంటే రుచిగా ఉంటుంది. 

Saturday, 8 November 2014

మేడిపండు

                               మేడిపండు పైన చూడటానికి బాగుండి లోపల పురుగులున్నట్లుగా లావణ్య పైకి తెలివితేటలు ఉన్నట్లుగా అనిపించినా తన వృత్తికి సంబంధించి ఏమాత్రము పరిజ్ఞానము లేదు.ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడు ఏమి ప్రశ్నలు వేస్తారనేది అంచనావేసి ముందుగానే సిద్ధపడి రావటంవలన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది కనుక అత్యవసర సిబ్బంది కావాల్సి తాత్కాలిక ఉద్యోగిగా తీసుకోవటం జరిగింది.వచ్చాక గానీ ఆమెకు తగిన పరిజ్ఞానం లేదని తేలింది.తను పని చేయాల్సినప్పుడు రకరకాల కారణాలతో తప్పించుకోవటం,నాకు రాదని చెప్పటం చేస్తుంది.
పోనీ నేర్పిద్దామంటే కూడా నేర్చుకోదు.ఈమె పనిని చూసి యాజమాన్యం ఇలాంటి అమ్మాయిని ఎలా ఎంపిక చేసారని,తాత్కాలిక ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చి మరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదనీ,తర్ఫీదు ఇచ్చినా నేర్చుకోలేని వాళ్ళను ఇకనుండి తీసుకోవద్దని అందరినీ సమావేశపరిచి చివాట్లు పెట్టింది.మేడిపండు చందంగా ఉంది ఈమె పరిస్థితి.కనీస పరిజ్ఞానం(పునాది)లేదు.ఈమెని ఎంపిక చేసి పెద్ద పొరపాటు చేశామని ఈమె వల్ల మనం మాట పడాల్సివచ్చిందని ఎంపిక చేసిన వాళ్ళు తలలు పట్టుకున్నారు.  

మోచేతుల నలుపు పోవాలంటే.....

                                                 మోచేతుల దగ్గర నలుపుదనం పోవాలంటే నిమ్మరసం రాసి అదే నిమ్మచెక్కతో ఒక 5 ని.లు రుద్దాలి.అలా చేస్తుంటే క్రమేపీ నలుపుదనం తగ్గుతుంది.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే  నలుపుదనం కొన్నిరోజులకు పూర్తిగా తగ్గిపోతుంది.
                                                మోచేతుల చుట్టూ గరుకుదనం కూడా ఉంటే నిమ్మరసం రాసి,పంచదార నిమ్మచెక్కపై వేసి 5 ని.లు రుద్దాలి.ఇలా చేస్తే గరుకుదనం క్రమేపీ తగ్గుతుంది. 

Friday, 7 November 2014

గుమ్మడికాయ వేపుడు

గుమ్మడికాయ - 1/4
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి -5
అల్లం,వెల్లుల్లి పేస్ట్ -1 స్పూను
ఉప్పు - తగినంత
వేపుడు కారం - 1 టేబుల్ స్పూను
మసాలా పొడి - 1/4 స్పూను
 నూనె -  వేయించడానికి సరిపడా
 బెల్లం - కొంచెం
                                                       గుమ్మడికాయ ముక్కను చెక్కు తీసి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేయాలి.బాండీలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులన్నీ వేసి,
కరివేపాకు వేసిన తర్వాత ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి అల్లం,వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి.గుమ్మడికాయ ముక్కలు వేసి ఉప్పు సరిపడా వేసి కొంచెం సేపు మూతపెట్టి మ్రగ్గనివ్వాలి.కొంచెం వేయించి వేపుడు కారం,మసాలాపొడి,బెల్లం వేసి అటు,ఇటు త్రిప్పి దించేయాలి.ఇది చాలా రుచిగా ఉంటుంది.మనం సాధారణంగా పులుసు మాత్రమే చేసుకుంటాము గానీ గుమ్మడికాయ వేపుడు అన్నంలోకి బాగుంటుంది.     

శత్రువు కాని శత్రువు

                                 లిఖిత,నిఖిత ఒకే రోడ్డులో ఉంటున్నా ఒకరితో ఒకరికి పరిచయంలేదు.లిఖిత ఎవరి గురించి
పట్టించుకోదు.నిఖిత ఎవరో,ఎలాఉంటుందోకూడా లిఖితకు తెలియదు. కానీ నిఖితకు ఊరందరి విషయాలు కావాలి. పరిచయం ఉన్నాలేకున్నావాళ్ళింట్లో అలాగంట,వీళ్ళింట్లో ఇలాగంట అంటూ చెప్పనిదే నిద్రపట్టదు.ఉదయం లేచింది మొదలు ఇంటింటికి తిరుగుతూనే ఉంటుంది.ఒకసారి లిఖిత కూతురు లేఖిని స్నేహితురాలు నమిత, లిఖిత  ఇంటికి వచ్చింది.పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు హరిత ఇల్లు ఇదేరోడ్డులో ఉంది.నేను ఒకసారి వాళ్ళింటికి వచ్చాను అని చెప్పింది.హరిత నిఖిత కూతురని తెలిసింది.నమిత హరిత ఇంటికి వెళ్ళింది.కొంచెంసేపటి  తర్వాత నువ్వు లేఖిని ఇంటికి వచ్చావా? అని నిఖిత హరితను అడిగింది.అవును ఆంటీ,నేను,లేఖిని స్నేహితురాళ్ళము అనగానే ఏంటి
లేఖినిని పెద్ద చదువుకోసం చాలా డబ్బుఖర్చుపెట్టి పంపుతున్నారంటగా?నాకూ డబ్బున్న మొగుడొస్తే నేనూ నా కూతుర్ని చదివించుకునేదాన్నిఅని నమితతో అంటే నమితకు అర్ధంకాక వచ్చిఆఆంటీ ఇలా అన్నారు అని లేఖినికి చెప్పింది.లేఖిని వాళ్ళ అమ్మ లిఖితకు చెప్పింది.అదేంటి?ఆమె ఎవరో?నాకు ముక్కు,మొహం కూడాతెలియదు.
ఆమెను ఎప్పుడూ చూడలేదు.ఆమె మాట్లాడింది నన్ను ఉద్దేశించేనని లిఖిత చెప్పింది.ఆమెకు డబ్బులేదు కనుక
లిఖితకు డబ్బుందని ఈర్ష్య కాబోలు.ఇలాగే తర్వాత కూడా వీళ్ళ గురించి చెడుగా కాకపోయినా ఏదోఒకటి తెలిసికొన్ని తెలియక కొన్ని మాట్లాడుతుందని తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పటం మొదలు పెట్టారు.ఇప్పుడు ఇలాంటి వాళ్ళే ఎక్కువమంది ఉంటున్నారు.ఈమె మనకు శత్రువు కాని శత్రువు అన్నమాట అని లిఖిత,లేఖిని అనుకున్నారు.                     

Thursday, 6 November 2014

పచ్చిఅరటికాయతో రకరకాలు

అరటికాయ ఆవడలు
 
పచ్చిఅరటికాయలు - 4
అల్లం - 10 గ్రా.
పెరుగు - 1 1/2 కప్పు
ఆవాలు - 1 స్పూను
కరివేపాకు - కొంచెం
ఎండు మిర్చి - 4  
నూనె - వేయించటానికి సరిపడా
ఉప్పు - తగినంత
               అరటికాయలు కడిగి రెండు చివరలు తీసేసి కుక్కర్ లో ఉడికించి పై చెక్కు వలిచి మెత్తగా చిదిపి ఉప్పు కలిపి గారెల ఆకారంలో కాగిన నూనెలో దొరగా వేయించి తీయాలి.పెరుగును బాగా గిలకొట్టి దానిలో తురిమిన అల్లం ముక్కలు,ఉప్పుకలపాలి.కొద్దిగా నూనెలో పోపు,మిర్చివేసి పెరుగులో కొంచెం జీరాపొడి,సన్నగా తరిగిన కొత్తిమీర
పెరుగులో కలిపి వడలపై పోయాలి.చాలా రుచిగా ఉంటాయి.

పైచెక్కుతో పచ్చడి
ఉడికించిన అరటికాయ పై చెక్కుపడేయకుండా పచ్చడి చేసుకోవచ్చు.లోపల మెత్తటి పదార్ధంతో వేపుడు కొంచెం నూనె వేసి ఉప్పు,వేపుడు కారం,వెల్లుల్లి వేసి నిమిషాలలో చేయవచ్చు.చింతపండు పులుసు పిండి ఉడికించిన అరటికాయ పెద్దముక్కలుగా కోసి,ఉల్లిపాయ,పచ్చిమిర్చి,ఉప్పు,సంబారు కారం,అల్లంవెల్లుల్లిపేస్ట్,మసాలాపొడి వేసి పులుసు రుచిగా  చేయవచ్చు.పెరుగు,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,గరం మసాలా వేసి కొంచెం నూనెతో కుర్మా చేయవచ్చు.
పచ్చడి :
ఉడికించి ఒలిచిన చెక్కు - 2 కాయలది
పచ్చి మిర్చి - 8
వెల్లుల్లి - 5 రెబ్బలు
జీరా 2 స్పూనులు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
            కొంచెం నూనెలో పచ్చిమిర్చి వేయించి,నానబెట్టిన చింతపండు వేసి మిక్సీలో మెత్తగా చేసి పై చెక్కు,జీరా వేసి వెల్లుల్లి వేసి,గడ్డపెరుగు కూడా వేసి కొంచెం నూనెతో కొత్తిమీర,కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.పై చెక్కు వృధా కాకుండా ఉంటుంది.చాలా రుచిగా ఉంటుంది.

Wednesday, 5 November 2014

ఆరోగ్యకరమైన అలవాటు

                                     ప్రతిరోజూ ఏదైనా తాజా పండ్లు,కూరగాయలతో జ్యూస్ చేసుకుని త్రాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఏ రసం తీసుకుంటే ఏ ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాము.

బత్తాయి రసం:దీన్నిరోజూ త్రాగటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

యాపిల్ రసం:శరీరంలోని చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది.గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
 
బొప్పాయి రసం:చర్మానికి ఎంతో మంచిది.అజీర్ణ సమస్యలు తలెత్తవు.గాయాలు మానడానికి కూడా ఉపయోగపడుతుంది.

నిమ్మరసం:నిమ్మరసం రోజూ తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు.నీరసం తగ్గుతుంది.

ద్రాక్ష రసం:రక్తపోటు అదుపులో ఉంచుతుంది.కొవ్వుని తగ్గిస్తుంది.గుండెకు మేలు చేస్తుంది.
   
ఉసిరికాయ రసం:విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.రక్తాన్ని శుద్ధిచేస్తుంది.రక్తంలో చక్కర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

టొమాటో రసం:గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.ఈరసానికి చిటికెడు మిరియాలపొడి చేరిస్తే రుచిగా ఉంటుంది.

కారట్ రసం:కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.బరువు తగ్గిస్తుంది.కంటి చూపును మెరుగుపరుస్తుంది. అల్సర్లు,కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.

దానిమ్మ రసం:యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కాన్సర్ రాకుండా కాపాడుతుంది.

నడుము నొప్పితో బాధపడుతున్నారా?

                             ప్రతిరోజూ నడుమునొప్పితో బాధపడుతూ నిద్రలేస్తుంటే మాత్రం దానికి మీరు వాడే పరుపు
 కూడాకారణం కావచ్చు.పరుపు ఏమాత్రం గుంత పడినట్లనిపించినా కూర్చున్నప్పుడైనా,పడుకున్నప్పుడైనా జాగ్రత్తగా గమనించి దాన్ని మార్చేయాలి.లేకపోతే అది నడుము నొప్పికి కారణమవుతుంది.ఒకపరుపు ఆరునుండి పది సంవత్సరాలు మాత్రమే బాగా పనిచేస్తుంది.ఆతర్వాత గట్టిదనం కోల్పోయి నడుము నొప్పికి కారణమవుతుంది.
                           నడుము నొప్పి ఏ కారణంతో వచ్చినా దానికీ ఒక చిట్కా ఉంది.అదేమిటంటే కుడిచేతి గుప్పెట మూసి అంటే  మిగతా నాలుగు వ్రేళ్ళు ముడిచి బొటన వ్రేలు మాత్రం పొడవుగా పెట్టి ముంజేతి(మణి కట్టు)నుండి బొటన వ్రేలు గోరు చివరి వరకూ ఎముక పై ఎడమ చేతి బొటన వ్రేలుతో నొక్కాలి.మళ్ళీ ఎడమ చేతి గుప్పెట మూసి బొటన వ్రేలు ఎముకపై గోరు చివరి వరకు పై విధంగానే కుడిచేతి బొటన వ్రేలితో నొక్కాలి. ఇలా 5,6 సార్లు రెండుచేతుల వ్రేళ్ళు నొక్కాలి.నడుము నొప్పి ఉంటే ఎముకపై నొక్కినప్పుడు నొప్పి వస్తుంది.కానీ నిమిషాలలో నడుము నొప్పి మటుమాయమౌతుంది.
గమనిక:చేతి పైవైపున పైన చెప్పిన విధంగా ఎముకపై గోరుపైన కూడా మరోచేతి బొటన వ్రేలితో మాత్రమే నొక్కాలి.
కొంచెం నడుము నొప్పి అయితే వెంటనే తగ్గిపోతుంది.ఎక్కువ కాలం నుండి ఉన్న నొప్పి అయితే కొంత సమయం పడుతుంది. 

Tuesday, 4 November 2014

సౌందర్య చిట్కాలు

1) మెరిసే చర్మం కోసం 5 స్పూనుల తేనెకు 2 స్పూనుల నిమ్మరసం,2 స్పూనుల పాల మీగడ చొప్పున బాగా కలిపి
  చర్మానికి పట్టించాలి.అరగంట తర్వాత తొలగించాలి.
2) పొడి చర్మ తత్వం కలవారు 2 స్పూనుల తేనెకు కొద్దిగా నిమ్మరసం,నాలుగైదు చుక్కల వెజిటబుల్ నూనె కానీ, ఆలివ్ నూనె కానీ కలపాలి.ఇది చక్కని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
3) పాలమీగడ,శనగపిండి సరిపడా కలిపి శరీరానికి పట్టించి కొంచెం సేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం చలికాలంలో
చక్కగా మెరుస్తూ పొడిబారకుండా ఉంటుంది.ఇది ఏ చర్మతత్వం కలవారికైనా బాగుంటుంది.
4 ) కారట్ ఒకటి మిక్సీలో వేసి రసం త్రాగి,వచ్చిన పిప్పిలో తేనే,పాలు కలిపి ముఖానికి,శరీరానికి పట్టించాలి,20 ని.ల తర్వాత కడిగేయాలి.   

నేతిబీరకాయ పచ్చడి

లేత నేతిబీరకాయ - 1
పచ్చి మిర్చి -10
వెల్లుల్లి  -  6 గర్భాలు
టొమాటో - 2
చింతపండు - నిమ్మకాయంత
తాలింపు కోసం :
ఎండు మిర్చి -1
దినుసులు
వెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.
కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం
 ఉప్పు - సరిపడా
                                                          కార్తీకమాసం వచ్చిందంటే చాలు నేతిబీరకాయ తింటే మంచిదని ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు.ఊరులో అయితే ఒకళ్ళకి ఉంటే బంధువులకు,స్నేహితులకు,ఇరుగుపొరుగు అందరికీ పంపిస్తారు.కొన్ని చోట్ల కురగాయలతోపాటు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు.కూర కన్నా పచ్చడి బాగుంటుంది.ఎక్కువగా పచ్చడి మాత్రమే చేస్తారు.ఉపవాసం ఉండి ఈ పచ్చడి తింటే మంచిదని పెద్దలు తప్పకుండా తినాలని చెప్తుంటారు.
                                                                                                                                                                                                                 ముందుగా నేతిబీరకాయ కడిగి ముక్కలు కోసి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించి తీసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.తర్వాత నేతిబీరకాయ ముక్కలు  ఉప్పు వేసి మ్రగ్గనివ్వాలి.నీరు ఇగిరిపోయిన తర్వాత తీసేయ్యాలి.టొమాటో ముక్కలు కూడా వేయించి,వెల్లుల్లి  అన్నీకలిపి రోట్లో కానీ,మెత్తగా కావాలంటే మిక్సీలో కానీ వెయ్యాలి.దీన్ని బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు  పెట్టాలి.కరివేపాకు,కొత్తిమీర వేసి,పచ్చడి కూడా వేసి ఒకసారి త్రిప్పితే ఘుమఘుమ లాడుతూ మంచి వాసన వస్తుంటుంది.అంతే నోరూరించే నేతిబీరకాయ పచ్చడి రెడీ.ఉపవాసం ఉండి గుడినుండి వచ్చిన తర్వాత ఎన్నిపదార్ధలతో భోజనం చేసినా వేడివేడి అన్నంలో నేతిబీరకాయ పచ్చడితో తింటే ఆ రుచే వేరు.  

ఆనప(సొర)కాయ మసాలాకూర

  నూగుతోఉన్న లేలేత సొరకాయ - 1 చిన్నది
  ఉల్లిపాయలు - 2
  పచ్చి మిర్చి - 4
  అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
  ఉప్పు - తగినంత
  కారం - 1 స్పూను
  గరం మసాలా పొడి - 1/4 స్పూను
  చింతపండు - నిమ్మకాయంత
  నూనె - 1 గరిటెడు
  తాలింపుదినుసులు,కరివేపాకు,కొత్తమీర -  కొద్దిగా
   పసుపు  - 1/4 లో సగం
                                                                              నూగునూగుగా ఉన్నలేలేత ఆనప(సొర)కాయను ఎంపిక చేసుకోవాలి.దాన్ని కడిగి పైచెక్కుతో సహా పెద్ద ముక్కలు కోసుకోవాలి.ఆముక్కలను పైచెక్కు ఉన్నవైపు  పిన్నుతో
దగ్గరదగ్గరగా పొడవాలి.కుక్కర్ లో కొంచెం నూనె వేసి తాలింపు వేసి,కరివేపాకు,కొత్తిమీర వేయాలి.దానిలో ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,పసుపు వేసి.సొరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయించి అల్లం,వెల్లుల్లి పేస్ట్ ఉప్పు,కారం వేసి,చింతపండు చిక్కగా పులుసు పిండాలి.మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.కుక్కర్ ప్రక్కన పెట్టి మూత వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి నీరు ఇగరనిచ్చిమసాలాపొడి చల్లి రెండు ని.లు తర్వాత దించేయాలి.నోరూరించే సొరకాయ మసాలా కూర రెడీ.ఇది చాలా రుచిగా ఉంటుంది.   

Monday, 3 November 2014

టొమాటో సాస్ (ఇంట్లో తయారీ)

టొమాటోలు - 1 కే.జి
ఉప్పు - 1/2 స్పూను
కారం - 1/2 స్పూను
పంచదార - 2 స్పూనులు
మిరియాలు - 1 స్పూను
ధనియాలు - 1 టేబుల్ స్పూను
జీరా - 1 టేబుల్ స్పూను
లవంగాలు - కొంచెం
దాల్చిన చెక్క - కొంచెం
సిట్రిక్ యాసిడ్ - 1 స్పూను                                  
సోడియం మెటా బై సల్ఫేట్ - 1 స్పూను
                     

                            టొమాటోలు రసం తీసి వడకట్టాలి.మిరియాలు,లవంగాలు,ధనియాలు,జీరా,దాల్చిన చెక్క అన్నీ నలిగీనలగకుండా పొడి కొట్టాలి.ఈపొడి,ఉప్పు,కారం,పంచదార కలిపి మూట కట్టాలి.టొమాటో రసం పొయ్యి మీద పెట్టి మరుగుతుండగా ఈ మూట వెయ్యాలి.చిక్కబడుతుండగా ఈమూట తీసేయ్యాలి.చిక్కబడిన తర్వాత ఒక ప్లేటులో కొంచెం వేస్తే నీరు ప్రక్కకు రాకుండా ఉంటే సాస్ తయరయినట్లు లెక్క.చల్లారిన తర్వాత సిట్రిక్ యాసిడ్, సోడియం మెటా బై సల్ఫేట్ కలిపి సీసాలలో భద్రపరచాలి.  

ఉసిరికాయలతోజామ్

                     కార్తీక మాసంలో ఉసిరికాయలు కాసే కాలం.ఇళ్ళల్లో కాస్తాయి.మార్కెట్టులో కూడా దొరుకుతాయి. చిన్న(రాతి)ఉసిరికాయలతో అయినా,పెద్ద ఉసిరికాయలతో అయినా ఒక్కటే కొలతలు.
                         
                             ఉసిరికాయలు - 1
                             పంచదార - 2 1/2
                             సిట్రిక్ యాసిడ్  - 1/2 స్పూను
                             సోడియం మెటా బై సల్ఫేట్ - 1 స్పూను
                                        ఉసిరికాయలలో కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.గింజలు విడిపోతాయి.అప్పుడు గింజలు ఏరి గరిటెతో కానీ,పప్పుగుత్తితో కానీ మెత్తగా చేస్తే గుజ్జు వస్తుంది.గుజ్జు,పంచదార కలిపి మందపాటి గిన్నెలో వేసి త్రిప్పుతూ చిక్కబడ్డాక దించి చల్లారిన తర్వాత సిట్రిక్ యాసిడ్,సోడియం మెటా బై సల్ఫేట్ కలిపి పొడిగా ఉన్న సీసాలలో భద్రపరచాలి.  

దగ్గరికొస్తే కేసు పెడతా

                      మనదేశంలో అయితే ఆసుపత్రుల్లో ఇంజెక్షను చేసేటప్పుడు నొప్పి అనిపించినా బాధను భరిస్తాం
 కానీ ఏమీ అనము.పరీక్ష చేయటానికి రక్తం తీయాలన్నాఈమధ్య రెండు,మూడుసార్లు పొడవందే తీయటంలేదు.
అన్నిసార్లు ఎందుకు పొడుస్తున్నావు? అని గట్టిగా తిట్టము.సరైనవాళ్ళను పెట్టుకుంటే అలా జరగదన్న మాట వాస్తవం.అదే విదేశాలలో అయితే ప్రతి చిన్నదానికి కేసు పెడతారు.ఒకసారి విదేశీయురాలు జ్వరం రావటంవల్ల
రక్తపరీక్ష చేయించుకోవటానికి ఆసుపత్రికి వచ్చింది.అలవాటుగా రక్తం తీసేటప్పుడు ఒకటికి,రెండుసార్లు
 పొడిచేసరికి నువ్వు మళ్ళీ రక్తం తీయటానికి దగ్గరికొస్తే కేసు పెడతా అని అరిచేసరికి రక్తం తీసేవాడు ఒక్కసారి బిత్తరపోయాడు.చూసేవాళ్ళకు మొదట అర్ధం కాలేదు కానీ తర్వాత ఇలా అయితేనే ఇలాంటి వాళ్ళు దారికొస్తారు.ఇకముందైనా ఒకసారి తీయటం అలవాటు చేసుకుంటాడని అనుకున్నారు.  

చేపల మార్కెట్టు

                                   ఏ మార్కెట్టయినా అమ్మేవాళ్ళ కేకలతో,కొనేవాళ్ళ బేరసారాలతో గందరగోళంగా ఉంటుంది.
 చేపల మార్కెట్టు సంగతయితే  చెప్పనవసరం లేదు.కొంతమంది ఏ దేశంలో ఉన్నావాళ్ళ అలవాట్లు,పద్దతులు మార్చుకోరు.హిమజ ఒక పేరున్నఆసుపత్రిలో వైద్యురాలిగా తాత్కాలిక ఉద్యోగినిగా చేరింది.వైద్యురాలే అయినా డిగ్రీ తీసుకునేముందు నేర్చుకునే వాళ్ళలాగా కూడా ఆమెకు వైద్యంచేయడం రాదు.విదేశాలలో వైద్యులుగా ఆసుపత్రిలో చేయాలంటే కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి.ఆమె ఉత్తీర్ణురాలవలేక 10 సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా ఉండి ఈలోపు పిల్లలకు జన్మనిచ్చింది.అంతవరకు బానేఉంది.ఇక్కడే అసలు సమస్య మొదలైంది.ఖర్చులు పెరుగుతాయి కనుక భర్త పరపతితో ఎలాగో తాత్కాలికంగా ఉద్యోగంలో చేరింది.అంతా క్రొత్తగా ఉండి ఏమీ తెలియకపోవటంవల్ల ఆమెకు నేర్పించే బాధ్యత కొందరికి అప్పగించారు.ఆమె అసలు నేర్చుకోకపోగా విధుల్లో ఉండగా ఇంటికి వెళ్ళటం,నీరసంగా ఉందనటం,ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవటం చేస్తుంది.ఒకటి,రెండు రోజులయితే ఎలాగోలా తోటి ఉద్యోగులు సంభాళించగలరు కానీ నెలరోజులు ఆమె ఇంట్లో నిద్రపోతే ఆమె విధులను వీళ్ళు నిర్వర్తించలేరు కదా!నెల తిరిగేసరికి సరిగా విధులు నిర్వర్తించ లేకపోయినందున డబ్బుతోటివారిలాగా రాకపోవటం వల్ల రక్తప్రసరణ పెరిగిపోయి తోటివారి మీద ఈర్ష్యతో నేను డబ్బుకోసం రాలేదు అయినా మీరు సహాయం చేయకపోవటం వలన ఇలా జరిగిందని పెద్ద గొంతుతో పైవాళ్ళ మీదకూడా అరవటం మొదలెట్టింది.రోగులు,ఆసుపత్రిలో వాళ్ళు విచిత్రంగా చూస్తున్నాపట్టించుకోకుండా అరుస్తూనే ఉంది.అక్కడ  అసలే నిశ్శబ్దంగా ఉంటారు.ఈమె అక్కడి వాతావరణాన్నిచేపల మార్కెట్టుని తలపించేలా చేసింది.చూస్తూ ఊరుకోరు కదా.తోటివారు సహాయపడినా,నేర్చుకుని హుందాగా ఉండకపోవటం వల్ల చివరికి తన ఉద్యోగాన్ని కోల్పోయింది.

పుట్నాలతో కారంపొడి

పుట్నాలు - 3 కప్పులు
ఎండు మిర్చి - గుప్పెడు
ఎండు కొబ్బరి - 2 చిప్పలు
 ఉప్పు - సరిపడా
వెల్లుల్లి - 1 పాయ
                               ఎండు కొబ్బరి ముక్కలు చేసి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి.ఎండుమిర్చి కూడా విడిగా పొడి చెయ్యాలి.పుట్నాలు మెత్తగా పొడి చేసి జల్లించాలి.దీనిలో పై రెండు పొడులు,ఉప్పు కలపాలి.చివరగా వెల్లుల్లి దంచి కలపాలి.

Sunday, 2 November 2014

పప్పుల కారంపొడి

ఎండు మిర్చి - 1/4 కే.జి
పచ్చి శనగపప్పు - 1/4 కే.జి
ఛాయ మినప్పప్పు - 1/4 కే.జి
ధనియాలు -1/4 కే.జి
మెంతులు - 100 గ్రా.
వెల్లుల్లి - 300 గ్రా.
ఉప్పు - 1/4 కే.జి (కళ్ళు ఉప్పు)
ఆముదం - 100 గ్రా.ఇష్టమైతే
                                                  అన్ని దినుసులు నూనె లేకుండా,మాడకుండా విడివిడిగా వేయించి,విడివిడిగానే  పొడి చేసుకోవాలి.ఉప్పు కూడా వేయించాలి.అన్నీ కలిపి మిక్సీలో పొడి చేయాలి.చివర్లో వెల్లుల్లి వేయాలి.ఆముదం వేసేట్లయితే చివర్లో వెయ్యాలి.

కరివేపాకు కారం

మినప్పప్పు - 1/2 కప్పు
పచ్చి శనగ పప్పు - 1/2 కప్పు
ఎండు మిరపకాయలు  - గుప్పెడు
ధనియాలు - 1/2 కప్పు
కరివేపాకు  - రెండు గుప్పెళ్ళు
ఉప్పు -  తగినంత
చింతపండు - నిమ్మకాయంత
                                                 కొంచెం నూనెలో ధనియాలు వేగాక,మినప్పప్పు,శనగపప్పు కూడావిడి విడిగా  వేయించి తీసేసి,మిరపకాయలు వేయించుకోవాలి.తర్వాత కరివేపాకు వేయించాలి.అన్నీ వేగాక ఉప్పు,తడిలేకుండా చింతపండు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. 

కూరగాయలతో మెకరోనీ

 మెకరోనీ - 1/2 కప్పు
లవంగాలు - 3
దాల్చిన చెక్క - 2
కారట్ - 2
పాలు - 1 కప్పు
బంగాళదుంపలు - 2
పచ్చి బఠాణీ - 1/2 కప్పు
బీన్స్ - 10
ఉప్పు - తగినంత
నీళ్ళు - 3 కప్పులు
ఉల్లిపాయలు - 2
పంచదార - 1 స్పూను
వెన్న - 4 స్పూనులు
మిరియాల పొడి - 1/2 స్పూను
పచ్చి మిర్చి - 3
కార్న్ ఫ్లోర్  - 1 స్పూను                                                                                                                                                             ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరగాలి.కాలీఫ్లవర్,కారట్,బీన్స్,బంగాళదుంప  చిన్నముక్కలుగా కోసి,ఉప్పు వేసి,నీళ్ళుపోసి ఉడకబెట్టాలి.బాండీలో వెన్నవేసి కరిగాక లవంగాలు,చెక్క,ఉల్లి పచ్చి మిర్చి వేసి వేగాక కూరగాయ ముక్కలు,ఉడికించి ,వార్చిన మెకరోనీ వేసి,కార్న్ ఫ్లోర్ ఒకస్పూను, పాలల్లో కలిపి,బాండీలో పొయ్యాలి. మిరియాలపొడి,పంచదార కలిపి ఉడికాక కొత్తిమీర చల్లాలి. 

కొబ్బరి మిరప్పొడి

 ఎండు మిర్చి - గుప్పెడు
ఎండు కొబ్బరి - 1 చిప్ప
ఉప్పు  -  సరిపడా
వెల్లుల్లి పాయ - 1
                                    ఎండు మిర్చి పొడి చేసి,ఎండు కొబ్బరి ముక్కలు చేసి మిక్సీలో వెయ్యాలి.ఈరెండింటిలో   ఉప్పు సరిపడా వేసి చివరలో వెల్లుల్లి విడదీసి దంచి అన్నీ కలపాలి.ఇది ఇడ్లీ,దోసెకు బాగుంటుంది.ఇది చెయ్యడం చాలా సులభం. 

షాక్

                                                           చిట్టెమ్మ,చిట్టియ్య గారు బాగా వృద్ధదంపతులు.ఒకరికి తొంభై,ఒకరికి ఎనభైసంవత్సరాలు.ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.పదిమంది సంతానంలో ఆరుగురు ఉన్నారు.ఉద్యోగరీత్యా అందరూ దూరంగా ఉంటారు.ఈమధ్యనే చిట్టెమ్మ గారికి బాగోకపోతే పిల్లలకు కూడా చెప్పకుండా ఆయనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారు.మనిమనిషి పనులు చేసి వెళ్ళిన తర్వాత ఇద్దరూ పిల్లల ముచ్చట్లుచెప్పుకుంటూ,ఒకరికి
ఒకరు చేదోడువాదోడుగా ఉంటూ కాలక్షేపం చేసేవాళ్ళు.సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చేవారు.అనుకోకుండా ఒకరోజు పెద్దల్లుడు వచ్చి పొలం గురించి గొడవ పెట్టుకునేసరికి పెద్దాయనకు రక్తప్రసరణ వేగం పెరిగి క్రిందపడిపోయి   కోమాలోకి వెళ్ళి మూడు రోజులకు చనిపోయేసరికి చిట్టెమ్మగారు తట్టుకోలేకపోయింది.ఒకరికొకరు తోడునీడగా ఉండే వాళ్ళల్లా అకస్మాత్తుగా చిట్టెయ్యగారిని కోల్పోయేసరికి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది.నేనుపోయి ఆయన ఉన్నా బాగుండేది అంటూ కాసేపటికి ఒకసారి ఏడవడం మొదలుపెట్టింది.ఒకకోడలికి ఆమె అంటే అంతగా
పడదు కనుక మాఅత్త కొత్తగా పెళ్ళైనదానిలాగా ఏడుస్తుంది అని స్నేహితురాలికిచెప్పింది.ఈవయసులోమానసికంగా దగ్గరితనం ఏర్పడుతుంది కనుక అకస్మాత్తుగా అలా జరిగేసరికిషాక్ లో అలాప్రవర్తిస్తుంది.కొద్దిరోజులకు ఆమెలో మార్పురావచ్చు.మీ అందరూ ఆమెతో ప్రేమగా ఉండి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు మీఇళ్ళకు తీసుకురండి అంది.  ఇక చిట్టెమ్మ గారి కోడలు మారు మాట్లడలేకపోయింది.     

Saturday, 1 November 2014

వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు

                       శ్యామసుందరరావు గారు,రాజేశ్వరమ్మ గారు దంపతులు.ఒకరికి ఎనభై సంవత్సరాలు.ఒకరికి డెభై సంవత్సరాలు.ఎంతో ప్రేమ,ఆప్యాయతలతో ఒకరికొకరు తోడుగా ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తుంటారు.ఏపని చేసినా ఇద్దరూ కలిసే చేస్తుంటారు.ఎప్పుడైనా అర్ధరాత్రప్పుడు భార్య ఎక్కడైనా నొప్పిగా ఉంది అంటే భర్త నొప్పిగా ఉందా?నేను మందు రాస్తానుండు అనటం,భర్త కాళ్ళు నొప్పంటే నేను కాళ్ళు పడతానుండు అనటం వీళ్ళ మాటలు విన్పించి తల్లి,తండ్రికి ఏమైందో అని హడావిడిగా నిద్ర లేచి వచ్చిన కొడుకు ,కోడలికి వీళ్ళను చూచి ముచ్చటేసేది.
వయసులో ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నాబాధ్యతలతో ఇంతగా పరితపించటానికి సమయం కూడా ఉండదు కనుక అసలైన ప్రేమ హృదయంలోనుండి బయటపడేది,మానసికంగా ఒకరికి ఒకరు దగ్గరయ్యేది కూడా ఈవయసులోనే.
వీళ్ళకంటే కొడుకు,కోడలు దగ్గరున్నారు.పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఎంత పనివాళ్ళు చేసినా కొన్ని పనులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వృద్దాప్యంలో కూడాఎంతో సంతోషంగా గడపడం అదృష్టంగా భావించాలి.

మనసులో లేనిది

                                       మనసులో లేని ప్రేమ ఆప్యాయతలు పైకి ప్రదర్శించినంత మాత్రాన ఎదుటి వారికి అర్ధం కాకుండా పోదు కదా.సరిగ్గా ఇదే విధంగా ప్రదర్శిస్తూ ఉంటుంది మాధవీలత.స్వంత అక్క,బావ ఒక్కరోజు అంటే రెండు పూటలు ముఖ్యమైన పని ఉండి ఊరునుండి మాధవీలత ఇంటికి వచ్చారు.వాళ్ళు రావటం ఇష్టం లేనట్లుగా ప్రవర్తించి బయటనుండి టిఫిన్లు, కూరలు తెప్పించి వేళగానివేళకు పెట్టి వీళ్ళ పనులకు అడ్డుతగిలేది.బయటకువెళ్ళి భోజనం చేస్తే మిగతావాళ్ళు బాధ పడతారని ఎలాగో ఆఒక్కరొజు ఉండి వచ్చేశారు.చెల్లెలు ఉండగాహోటలులోఉండడంఏమిటి? అనుకుంటారని వాళ్ళింటికి వెళ్ళటం జరిగింది.తనకు మాత్రం అక్కఇల్లంటే ఎక్కడలేని  స్వతంత్రం.పిల్లలకు శెలవులు ఇవ్వగానే ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి మేము మీఇంటికి వస్తున్నామని ఫోన్లు మీద ఫోన్లు గంటగంటకుచేస్తుంటుంది. బావకు బదిలీ అవటంవల్ల మాధవీలత ఊరు వస్తున్నారని తెలిసి ఇక శెలవులకుఎక్కడకూ వెళ్ళలేము అనుకుందో ఏమో? అసలే స్వార్ధపరురాలు.ఆఒక్క రోజు మర్యాద దక్కించుకుంటే బాగుండేది కదా!మళ్ళీ అక్క,బావ స్వంత ఊరు వచ్చేసరికి వారానికి ఒకసారి భోజనానికి రమ్మని బలవంత పెడుతుంది.రావటానికి కుదరదు అని చెప్తే మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు?మీపనులు చూసుకుని భోజనం సమయానికి రావాల్సిందే అంటూ ఒకటే ఫోన్లు.ఈ చచ్చు తెలివితేటలు ఆరోజే ఉంటే అందరికీ బాగుండేది.అక్కమనసు బాధపడేది కాదు.అక్కకు చెల్లి ప్రవర్తనకు విరక్తి పుట్టి మనసులో బాధపడినట్లుగా కూడా బయటపడకుండా మర్యాదగా ఏమీ అనుకోవద్దు మాధవీలతా!మీకూ,మాకూ కూడా ఇబ్బంది వీలైనప్పుడు కొంచెంసేపు వచ్చి వెళ్తాము భోజనం చేయాల్సిందే అనుకోవద్దు అని చెప్పింది.బావకు నేను చెప్తాను ఫోను ఇవ్వు అంటుంది.బావ కూడా అదే చెప్పేసరికి ఏమి మాట్లాడాలో తెలియక సరే అనేసింది.పైకి
ప్రేమ ఒలకబోసినంత మాత్రాన చేసింది మర్చిపోయి భోజనానికి మొహం వాచిపోయినట్లు ఎవరూ వెళ్ళలేరు కదా!  

కుక్క తోక వంకర

                                                     నిషిత తెలివిగలదీ కాదు.తెలివి తక్కువదీ కాదు.అటు ఇటు కానీ తెలివితేటలు కలది.ఆతెలివి తేటలతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.అదృష్టం మంచిదయి చిన్నఇంట్లో పుట్టినా పెద్దింటి కోడలయింది.ఆ అదృష్టాన్ని నిలుపుకోవటం చేతకాక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది.నాకు,నాభర్తకు ఏకాంతం కావాలి కనుక ఇంటికి ఆడపడుచుతో సహా ఎవరూ రాకూడదు.అతమామలు కూడా ఒక ప్రక్కన కూర్చోవాలి అనేది.భర్త ఎవరితో మాట్లాడకూడదు అనేది.చివరకు విడిపోయే పరిస్థితి వస్తే అత్తమామలు,ఆడపడుచు  జాలిపడి సర్దిచెప్పి కాపురాన్నినిలబెట్టారు.అయినా ఆమెకు ఏమాత్రం కృతజ్ఞత ఉండేది కాదు.కొద్దిరోజులు బాగానే ఉన్నట్లు నటించి
యధావిధిగా ప్రవర్తించటం మొదలుపెట్టింది.పెద్దవాళ్ళు కూడా విసిగిపోయి వేరే కాపురం పెట్టిద్దామంటే ఆస్తిలో సగమే తీసుకుని వెళ్ళాల్సొస్తుందని నిషిత భర్త ఇంట్లో నుండి కదిలేవాడు కాదు.పదహారు సంవత్సరాల నుండి పెద్దవాళ్ళు
ఇబ్బందిపడుతూనే ఉన్నారు.మొదటినుండి ఆమెకు వేరే కాపురం పెట్టి ఉందామని కోరిక.పిల్లలకు చదువు వంకతో    ఎలాగైతే తన కోరిక ఇన్ని సంవత్సరాలకు నెరవేర్చుకుంది.కొత్తకాపురం పెట్టినది ఏమైనా సరిగ్గా తెచ్చుకన్నదా?
అంటే అదీలేదు.అన్నీఅత్తవారింటి నుండే తెచ్చుకోవాలి కనుక కొంచెం సామాన్లు తెచ్చుకుని పడుకోవటానికి మంచాలు కూడా తెచ్చుకోకుండా క్రింద పడుకోవటం ఆరోగ్యానికి మంచిదిఅని చెప్తుండేది.ఒకరోజు ఆడపడుచు వేరే సిటీ నుండి వచ్చింది.నిషిత వాళ్ళు ఊరువెళ్తామంటే మీరు వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే క్రింద పడుకోండి అంటూ
పేచీపెట్టుకున్నది.వాళ్లకు క్రింద పడుకోవటం అలవాటు లేదు.అందుకని ఊరు వెళ్తూ నిషిత అత్తగార్ని కూడా వెంట
తీసుకెళ్ళారు.రెండవరోజు ఊరినుండి వస్తే ఆడపడుచు,అత్తగారితో మాట్లాడకుండా బిగదీసుకుంది.కుక్క తోక వంకర అన్నట్లుగా ఎంతగా ప్రయత్నించినా తోక వంకర తీయలేనట్లుగా ఈమె ప్రవర్తనలో మార్పుతీసుకు రావటం అసాధ్యం
అన్నట్లుగా ప్రవర్తిస్తుంది.పెళ్ళయి 20 సంవత్సరాలయినా ఆమెలో వీసమెత్తు మార్పు లేదు.అప్పుడు ఎలావుందో ఇప్పటికీ అలాగే ఉంది,        

నిమ్మపండు చారు

                                     కందిపప్పు 2 స్పూనులు,పసుపుకొంచెం,నూనె కొంచెం వేసి మెత్తగా ఉడికించి,మెదిపి నీళ్ళు పోసి ఒక టొమాటో సన్నగా తరిగివేసి సరిపడా ఉప్పుబెల్లం వేయాలి.కొతిమీర,కరివేపాకు వేసి మరిగేటప్పుడు
మిరియాలు,ధనియాలు,జీరా ఒక్కొక్కటి 1/2 స్పూను చొప్పున వేసి మెత్తగా పొడిచేసి కలపాలి.నెయ్యితో తాలింపు పెట్టి ఒక పెద్ద నిమ్మపండు రసం పిండి కలపాలి.

తక్కాళి చారు (టొమాటో)

టొమాటోలు - 1/4 కే.జి
మిరియాలు - 1/2 స్పూను
ధనియాలు - 1 స్పూను
జీరా - 1/2 స్పూను
చింతపండు - ఉసిరికాయంత
బెల్లం - కొంచెం
ఉప్పు - తగినంత
 కొత్తిమీర - కొంచెం
 కరివేపాకు - కొంచెం
 ఆవాలు  - కొంచెం
                                       టొమాటోలు మిక్సీలో వేసి రసం తీసి వడకట్టి దానిలో మిరియాలు,ధనియాలు,జీరా మెత్తగా పొడి చేసి వేయాలి.దానిలో చింతపండు,ఉప్పు,బెల్లం,నీళ్ళు పోసి మరిగించాలి.కొత్తిమీర,కరివేపాకు వేసి
నెయ్యితో ఆవాలు తాలింపు పెట్టాలి.

నూరు పెట్టిన చారు

నీళ్ళు - 2 గ్లాసులు
పసుపు - చిటికెడు
చింతపండు - ఉసిరికాయంత
టొమాటో - 1
బెల్లం  - కొంచెం
                                మెత్తగా నూరాల్సినవి
      1/2స్పూను - కందిపప్పు,1/2స్పూను  - ధనియాలు,ఎండు మిర్చి - 2,1/2స్పూను - పచ్చి శనగపప్పు,1/2 స్పూను - జీరా,నెయ్యి వేసి వేయించి,చింతపండుకూడా వేసి మెత్తగా నూరాలి.
                                       
                                                         వీటన్నింటినీ కలిపినూరిన తర్వాత నీళ్ళుపోసి టొమాటో,బెల్లం వేసి బాగా మరిగించాలి.కొత్తిమీర,కరివేపాకు వేసి నెయ్యితో ఆవాలు,వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాలి. 

టొమాటో చారు(రసం)

టొమాటోలు - 1/4 కే.జి
 చింతపండు - ఉసిరికాయంత
బెల్లం - కొంచెం
పసుపు - 1/4లో సగం స్పూను
ఉప్పు - తగినంత
 కొత్తిమీర - చిన్న కట్ట
కరివేపాకు  - కొంచెం
 చారుపొడి - 1 పెద్ద స్పూను
                                    ఇంట్లో తయారుచేసుకునే (రసం) చారుపొడి తయారీకి
2 ఎండుమిర్చి,ధనియాలు,కందిపప్పు,పచ్చిశనగపప్పు,మిరియాలు,జీరా1/4స్పూను చొప్పున ,చిటికెడు ఆవాలు,చిటికెడు మెంతులు
                                                                    టొమాటోలు సన్నగా తరగి నీళ్ళల్లో బాగా ఉడికించాలి.తర్వాత మిక్సీలో వేసి దానిలో 1 పెద్దస్పూను చారుపొడి వేసి,చింతపండు,బెల్లం,పసుపు,ఉప్పు,పచ్చి కరివేపాకు వేసి బాగా మరిగించాలి.తర్వాత కొత్తిమీర,కరివేపాకు వేసి నెయ్యితో తాలింపు పెట్టాలి.

రాజ్ మా తో రుచిగా....

రాజ్ మా  - 1/4 కే.జి
 ఉల్లిపాయలు - 2 పెద్దవి
వెల్లుల్లి - 2 రెబ్బలు
నూనె - 4 స్పూనులు
కారం - 1 స్పూను
ధనియాలపొడి - 2 స్పూనులు
పసుపు - 1/4 స్పూను
ఉప్పు - తగినంత
టొమాటోలు - 5 లేక6
 గరం మసాలా - 1/2 స్పూను
                           రాజ్ మా 10 గం.లు నానబెట్టాలి.20 ని.లు కుక్కర్లో ఉడికించాలి.ఉల్లి,వెల్లుల్లిని ముద్దగా,మెత్తగా చేయాలి.నూనెతోపాటు కొంచెం నెయ్యి వేసి బాగా వేయించి పసుపు,ధనియాల పొడి,కారం,ఉప్పువేసివేగనివ్వాలి.
టమోటా ముక్కలు వేసి అరకప్పు నీళ్ళుపోసి సన్నని మంటపై ఉడికించాలి.రాజ్ మా వేసి 10 ని.లు ఉడికించాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర,గరం మసాలా చల్లి త్రిప్పి 2 ని.లు ఉంచి దించేయాలి.ఇది చపాతీ,అన్నంలోకి రుచిగా
ఉంటుంది.