Wednesday, 30 September 2015

మొక్కజొన్న పేలాల కారప్పొడి

మొక్కజొన్న పేలాలు -  2  కప్పులు
ఎండు మిరప కాయలు - మూడు
జీరా  - 1 టీ స్పూను
వెల్లుల్లి  రెబ్బలు  - మూడు
ఎండు కొబ్బరి తురుము - కొంచెం
ఉప్పు - తగినంత
                                                                        పేలాలు,జీరా,ఎండు కొబ్బరి తురుము,వెల్లుల్లి రెబ్బలు,తగినంత ఉప్పు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చెయ్యాలి.అంతే మొక్కజొన్న పేలాల కారప్పొడి తయరయినట్లే.ఇది వేడివేడి ఇడ్లీతో కానీ,అన్నంతో కానీ తింటే రుచిగా ఉంటుంది. 

Tuesday, 29 September 2015

బాల్యమే పునాది

                                                                  కొంతమంది పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు.బాల్యంలో ఒత్తిడికి గురయితే పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఆందోళన లేకుండా ఉండటానికి చిన్నప్పటి నుండి యోగా,ధ్యానం అలవాటు చేయాలి.మైదానంలో ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.చిన్నప్పటి నుండి చక్కటి ఆహార పద్ధతి అలవాటు చేయాలి.ఫాస్ట్ ఫుడ్ సాధ్యమైనంత దూరంగా ఉంచి పండ్లు,కూరగాయలు ఇష్టంగా తినేట్లు చూడాలి.పిల్లలు మైనపు ముద్దలు.మనం ఏరకంగా తయారు చేస్తే అదే రకంగా తయారవుతారు.చిన్నప్పటి నుండి పిల్లలను అతి గారాబం చేయకుండా మంచి పద్దతులు అలవాటు చేస్తే ఆరోగ్య పరంగానూ,చదువు పరంగాను అన్ని విధాలా మంచి పౌరులుగా ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు.అతి క్రమశిక్షణతో ఉన్నా మొండిగా తయారవుతారు.కనుక కౌమారంలో పిల్లల దగ్గర నొప్పింపక తానొవ్వక అన్న తీరులో పెద్దలు కూడా ఉండాలి.శారీరకంగా,మానసికంగా కూడా ఆరోగ్యవంతమైన బాల్యమే చక్కటి జీవితానికి పునాది. 

మహిళలు - ఆరోగ్యంపై శ్రద్ధ

                                                          మహిళలూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.సహజంగా మహిళలు ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం గురించి తీసుకున్నంత శ్రద్ధ తమ వ్యక్తిగత ఆరోగ్యం గురించి తీసుకోరు.అదీకాక పురుషుల కన్నా స్త్రీలలో గుండెపోటు లక్షణాలు అంతగా బయటకు తెలియవు.దాంతో గుర్తించడం కూడ కష్టమైపోయి మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి.పురుషుల్లో గుండెపోటు వస్తే ఛాతీలో నొప్పి,చెమటలు పట్టడం స్పష్టంగా తెలుస్తుంది.స్త్రీలలో ఒక్కొక్కసారి అసలు నొప్పి కూడా తెలియకపోవచ్చు.ఒకవేళ ఏదైనా నొప్పిగా అనిపించినా దానిదేముందిలే!అదే తగ్గిపోతుందని పెద్దగా పట్టించుకోరు.తేలిగ్గా కొట్టిపారేయకుండా వైద్యుని వద్దకు వెళ్ళాలి.మహిళలు ఎప్పుడూ బరువును,రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.ప్రతి సంవత్సరము కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయించుకుంటే పది సవత్సరాల ముందే ఏదైనా తేడా ఉంటే గుర్తించి వ్యాధిని అరికట్టవచ్చు.రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.ఎప్పటికప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరిగా చేయాలి.ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకునే కన్నా ముందే మేల్కొని వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అందరికీ శ్రేయస్కరం,ఇంటికి దీపం ఇల్లాలే కనుక ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే ఇంటికి వెలుగు.అప్పుడే  కుటుంబం మొత్తం బాగుంటుంది. 

మనసు బాగుంటే....

                                                           మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది.అందులోనూ గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనసు పాత్ర చాలా కీలకమైనది.మనసు ప్రశాంతంగా ఉండాలంటే యోగా,ధ్యానం తప్పనిసరి.ధ్యానం మనసును నియంత్రణలో ఉంచి రకరకాల ఆలోచనలకు పగ్గాలు వేస్తుంది.యోగా ప్రభావం శరీరం మీదే కాక మనసు పైన కూడా ఉంటుంది.అన్ని పనులు నెత్తిన వేసుకుని ఉక్కిరిబిక్కిరై పోకుండా పరిమితులు పెట్టు కోవాలి.మనసుకు నచ్చిన వ్యాపకాలు అంటే సంగీతం,చిత్రలేఖనం,నాట్యం,పుస్తకపఠనం,తోటపని ఎవరి ఇష్టమైనది వారు ఎంచుకుని వాటికోసం సమయాన్ని కేటాయించుకోవాలి.ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తూ అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళి వస్తుండాలి.నిరాశ,ఆత్మన్యూనత,ద్వేషం,ఒత్తిడి అహాలకు దూరంగా ఉండాలి.వీటిని అసలు దగ్గరికి రానీయకూడదు.ఎందుకంటే ఇవి ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కనుక మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పనులకు,వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.అప్పుడు మనసుతోపాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.


Monday, 28 September 2015

కడుపు నిండిన భావన

                                                               బరువు తగ్గాలనుకునే వారు ఒక గ్లాసు నీళ్ళల్లో 1 1/2 స్పూను  సబ్జా గింజలు నానబెట్టి ఆ నీటిని భోజనానికి ముందు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది.ఆహారం తక్కువగా
తీసుకోగలుగుతారు. 

ఫ్రైడ్ రైస్ రుచిగా....

                                                       బియ్యం ఒక అరగంట నానబెట్టుకుని నీళ్ళు లేకుండా ఒంపేసి నూనెతో పాటు కొంచెం నెయ్యి వేసి మసాలా దినుసులు అవసరమైనవన్నీ వేసి వేయించాక బియ్యం కూడా వేయించుకోవాలి.ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు,నీళ్ళు కలిపి కొలత ప్రకారం పోసుకుంటే అన్నం పొడిపొడిగా, రుచిగా బాగుంటుంది.

కనిపించని మురికి వదలాలంటే........

                                                                      మనం రోజూ సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినా సరే శరీరానికి ఎంతో కొంత మురికి ఉంటుంది.ఆ మురికి వదలాలంటే కొంచెం శనగ పిండి,సరిపడా పెరుగు,ఒక అర చెక్క నిమ్మ రసం పిండి చిటికెడు పసుపు వేసి బాగా కలిపి శరీరానికి పట్టించాలి.ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే మనకు కంటికి కనిపించని మురికి  వదిలి పోయి శరీరం తేటగా ఉండి నునుపుగా మెరుస్తూ ఉంటుంది.  

తలకట్టు అందంగా ఉండాలంటే........

                                                                    వెంట్రుకలు ఒత్తుగా ఉంటేనే తలకట్టు అందంగా ఉంటుంది.తలకట్టు అందంగా ఉండాలంటే జుట్టుకు పోషణ చేసుకోవటమే కాక ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి.అరటి పండ్లు, కందిపప్పు,బఠాణీలు,క్యాలీ ఫ్లవర్,చేపలు,గుడ్లు ఎక్కువగా తినాలి.అప్పుడు జుట్టు చక్కగా పెరుగుతుంది.దీనితో పాటు వారానికొకసారి గోరువెచ్చటి కొబ్బరి నూనె రాత్రిపూట తలకు మర్ధన చేసి ఉదయం తలస్నానం చేయాలి. అప్పుడప్పుడు మందార ఆకులు,కుంకుడు కాయలు కలిపి పిండి రసం తీసి ఆరసంతో తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,మెత్తగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.ఈవిధంగా చేస్తే తలకట్టు అందంగా,ఆకర్షణీయంగా ఉంటుంది.తలకట్టు అందంగా ఉంటే ముఖానికి కూడా అందం వస్తుంది.  

Sunday, 27 September 2015

ఫిల్టర్ కాఫీ

                                                    శమన్యకు ఫిల్టర్ కాఫీ అంటే ఎంతో ఇష్టం.కాఫీలో ఎన్నో రుచులున్నా ఫిల్టర్ కాఫీ రుచే వేరు.పాలు పొంగు రాగానే దానిలో చిక్కటి డికాషన్ పోసి కలిపి నురగతోపాటు వేడి వేడి కాఫీని కొంచెం కొంచెం కాఫీ రుచిని ఆస్వాదిస్తూ తాగుతుంటే అవి గొంతులో దిగుతుంటే ఆ సంతృప్తి మాటల్లో చెప్పనలవి కానిది.అది కాఫీ ప్రియులకు మాత్రమే తెలుస్తుంది.కాఫీ కలిపే విధానం కూడా ఎవరి పద్ధతి వారిది.వేరే ఎక్కడైనా కాఫీ తాగినా సరే ఇంటికి వచ్చి స్వయంగా తన చేత్తో తయారు చేసుకున్నకాఫీ తాగితే కానీ తృప్తిగా ఉండదు.ఎంత తలనొప్పిగా ఉన్నా ఇట్టే ఎగిరిపోతుంది.పంచదార లేకుండా రోజూ ఒక కప్పు కాఫీ తాగగలిగితే మధుమేహం ముప్పు లేకుండా ఉంటుంది.   

వేయించిన బియ్యంతో.......

                                                      వేయించిన బియ్యంతో పిండి చేసి పకోడీలు వేసేటప్పుడు శనగ పిండిలో కలిపి వేస్తే పకోడీలు కరకరలాడుతూ మంచి రంగు రుచితో బాగుంటాయి.

Saturday, 26 September 2015

ప్రతి గంటకు ఒకసారి.......

                                                                   పనిలో ఎంత తీరిక లేకుండా ఉన్నా కానీ  ప్రతి గంటకు ఒకసారి ఒక్క రెండు ని లైనా పనికి విరామం ఇవ్వాలి.ఆ రెండు నిల లోనే కుర్చీలో నుండి లేచి అటూ ఇటూ నడవాలి.నడవటం ఇబ్బంది అనుకుంటే కనీసం రెండుమూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి.ఈవిధంగా చేస్తుంటే అధిక రక్తపోటు అదుపులో ఉండి గుండె కొట్టుకునే వేగం  క్రమబద్దం అవుతుంది.

Thursday, 24 September 2015

వార్ధక్యపు ఛాయలు కనపడకుండా ..........

                                                          వయసు పెరుగుతున్నకొద్దీ కళ్ళకింద,నుదురుపై,నోటిచుట్టూ సన్నని ముడతలు కనిపిస్తాయి.త్వరగా ఇలాంటి వార్ధక్యపు ఛాయలు ముఖంపై కనపడకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొనలో,అరచెక్క నిమ్మరసం పిండి బాగా నురగ వచ్చేలా గిలకొట్టి ముఖానికి పూతలా వేయాలి.ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముడతలు రాకుండా ముఖం నునుపుగా తయారవుతుంది.

చుట్టం చూపుగా..........

                                                          వంట గదిని మనం ఎంత శుభ్రంగా ఉంచినా ఎప్పుడన్నా ఒకసారి బొద్దింక చుట్టంచూపుగా వస్తూ ఉంటుంది.ఇంటికి చుట్టాలు వస్తే బాగానే ఉంటుంది.కానీ బొద్దింకలు వస్తే చిరాకు వస్తుంది కదా!అందుకని బొద్దింకలు మన ఇంటికి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఒక కప్పువేడినీళ్ళు మరిగించి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వడకట్టి సింకుల్లో పోయాలి.అప్పుడు చుట్టం చూపుగా కూడా మన ఇంటి వైపుకు  రాకుండా ఉంటాయి.ఇంకొక విచిత్రమైన విషయమేమిటంటే బొద్దింకలు మనిషి తగిలితే చాలు ఒళ్లంతా మీసాలతో   శుభ్రం చేసుకుంటాయట.     

చిన్న వయసులోనే...........

                                                                 ఈ మధ్య చిన్న వయసులోనే మగవాళ్ళకు,ఆడవాళ్లకు కూడా జుట్టు రాలిపోయి పలుచబడటం,తెల్లబడుతుండటం కనిపిస్తుంది.చిన్న వయసులోనే ఆవిధంగా కాకుండా ఉండాలంటే ఒక కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు ఆకుల్ని,ఒక స్పూను మెంతుల్ని కలిపి పొయ్యి మీద పెట్టి బాగా వేగేవరకు కాచి,చల్లార్చి వడకట్టి ఒక సీసాలో పోసుకుని వారానికి రెండు సార్లు రాత్రిపూట తలకు ఇంకేలా రాసుకుని ఉదయమే తల స్నానం చేస్తుంటే జుట్టు రాలిపోయి పలుచబడకుండా,త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. 

Tuesday, 22 September 2015

ఎక్కిళ్ళు తగ్గాలంటే.........

                                                      ఎక్కిళ్ళు అదే పనిగా వస్తుంటే 1 1/2 కప్పు నీళ్ళల్లో 1 స్పూను యాలకుల పొడి వేసి మరిగించాలి.తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి.ఈ విధంగా చేస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.జీలకర్ర 1/4 స్పూను నోట్లో వేసుకుని నమిలి నీళ్ళు తాగినా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

వృధాగా....

                                                                      శశాంక్ ఇంట్లో అందరూ చాలా ఆలస్యంగా నిద్రపోతుంటారు.ఎంత ఆలస్యంగా అంటే రోజూ రాత్రి ఒంటిగంట అయిపోతుంది.బారెడు పొద్దు ఎక్కితేగానీ ఇంట్లో ఆడవాళ్లు కూడా నిద్ర లేవరు.శశాంక్ అయితే పదకొండు గంటలకు కానీ లేవడు.ఇంక పిల్లల సంగతి చెప్పనవసరం లేదు.పాఠశాలకు వెళ్తేతప్ప పగలు రెండు గంటలు కొట్టాల్సిందే.అప్పటివరకు ఫ్యాన్లు,ఏ.సి ఉండాల్సిందే.లైట్లు సాయంత్రం ఆరుగంటలు   నుండి బారెడు పొద్దేక్కేవరకు వృధాగా వెలగాల్సిందే.ఒకవేళ కరంటు పోయినా జనరేటరు వేసుకుని మరీ నిద్రపోతుంటారు.నీళ్ళు ట్యాంకులో నింపాలి అంటే మోటరు వేసి నీళ్ళుపోతున్నా కూడా ఇంట్లోవాళ్ళుకానీ,పనివాళ్ళు కానీ పట్టించుకోరు.శశాంక్ స్నానానికి వెళ్తే గంగాళా నీళ్ళతో స్నానం చేస్తాడు.పిల్లలు మొహం కడగాలంటే కడిగినంత సేపు పంపు వదిలి ఉంటుంది.గుక్కెడు నీళ్ళు తాగటానికి లేక,పిల్లలు చదువుకోవటానికి కరంటు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.వీళ్ళేమో వృధాగా నీళ్ళు పారబోయటం,కరంటు వృధా చేయటం చేస్తున్నారు.ఒక్క శశాంక్ మాత్రమే కాదు వీళ్ళ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.చూస్తున్న వాళ్ళకు ప్రాణం ఉసూరుమనిపిస్తుంది.వీళ్ళందరిలో మార్పు వచ్చినీళ్ళు,కరంటు వృధా చేయకుండా ఉంటే అందరికీ కరంటు,నీళ్ళ కష్టాలు తప్పుతాయి. 

కూరగాయలు తరిగే బోర్డులను.........

                                                    మనం పచ్చి అరటికాయలు,బీట్ రూట్ ముక్కలు కోసినప్పుడు కూరగాయలు
తరిగే బోర్డులపై నల్లటి మరకలు పడుతుంటాయి.అవి మాములుగా సబ్బుతో కడిగితే ఒక పట్టాన వదలవు.అప్పుడు నిమ్మరసం కొద్దిగా సోడా ఉప్పు కలిపి బోర్డుకు పట్టించాలి.ఒక పావుగంట తర్వాత రుద్ది కడిగితే శుభ్రంగా ఉంటుంది.

Monday, 21 September 2015

సోయా గ్రాన్యూల్స్ తో .........

                                                                    సోయా గ్రాన్యూల్స్ కూరల్లో వేసుకోవటమే కాక రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.అందులో ఇది ఒక రకం.మీరు కూడా ప్రయత్నించండి.                                                                                                                                                                                                                        సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు
 ఉల్లి తరుగు - 1/2 కప్పు 
టొమాటో ముక్కలు 1/2 కప్పు 
చాట్ మసాలా- 1 స్పూను
గరం మసాలా - 1 స్పూను 
పచ్చిమిర్చి - 5
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత 
ఎండు మిర్చి - రెండు 
మినప్పప్పు - 1 స్పూను 
జీరా - 1 స్పూను
నూనె - 1 టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు - 2 స్పూనులు 
నిమ్మరసం - 2 టేబుల్ స్పూనులు
సన్న కారప్పూస - తగినంత (ఇష్టమైతే)

                                                              మినప్పప్పు,ఎండు మిర్చి,జీరా,1 టేబుల్ స్పూను సోయా గ్రాన్యూల్స్
నూనె లేకుండా బాండీలో వేయించుకోవాలి.చల్లారాక పొడి చేయాలి.మిగిలిన సోయా గ్రాన్యూల్స్ మునిగేవరకు నీళ్ళు పోసి 5 ని.లు ఉడికించి నీళ్ళు వంపేసి చల్లటినీళ్ళు పోసి గట్టిగా పిండి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలోనూనె వేడిచేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి,టొమాటో ముక్కలు,అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక సోయా గ్రాన్యూల్స్ వేసి సరిపడా ఉప్పు వేసి కలపాలి.తర్వాత గరం మసాలా,చాట్ మసాలా పొడి చేసిన సోయా పిండి వేసి మూతపెట్టాలి.కాసేపటికి అది పొడిపొడిగా తయారవుతుంది.కొత్తిమీర తరుగు,నిమ్మరసం వేసి ఒకసారి కలపాలి.సన్న కారప్పూస ఇష్టమైతే కలుపుకోవచ్చు. కరకరలాడుతూ బాగానే ఉంటుంది.సోయా గ్రాన్యూల్స్ తో  రుచికరమైన చాట్ తయరయినట్లే.  

Sunday, 20 September 2015

నా పరిస్థితి ఏమిటి?

                                                                    ఈశ్వరరావు వయసులో ఉండగా కష్టపడి వ్యవసాయం చేసేవాడు.
ఆ నేపధ్యంలో ఒకరోజు పొలం నుండి వరిగడ్డి ఇంటికి తోలుకొస్తుండగా ఎద్దులబండి పై నుండి పడిపోయి నడుముకు  దెబ్బ తగిలి కాళ్ళు చచ్చుబడి పోయాయి.అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇంట్లో ఉండే పనివాళ్ళకు పనులు పురమాయించేవాడు.తన పనులు తనే చక్రాల కుర్చీ తయారు చేయించుకుని చేసుకునేవాడు.భార్య కూడా సహనంతో భర్త పనులన్నీ తనే స్వయంగా పర్యవేక్షించేది.అలా పాతిక సంవత్సరాలు గడిచిపోయాయి.ఈమధ్య భార్యకు గుండెజబ్బు వచ్చింది.శస్త్ర చికిత్స చేయించుకుని ఆమె బాగానే ఉన్నాభార్య చనిపోతుందేమోనని బెంగ పట్టుకుంది.దానికి తోడు కోడలికి కూడా అనారోగ్యంగా ఉండటంతో మీరిద్దరూ చనిపోతే నా పరిస్థితి ఏమిటి?అని అప్పుడప్పుడు భార్య దగ్గర అనటం మొదలు పెట్టాడు.భార్య కూడా అన్నిపనులు చేయలేక పోతుంటే ఈశ్వరరావు పనులే కాక ఇంటి పనుల నిమిత్తం కూడా కొడుకు ఒక మనిషిని పెట్టాడు.వాడు మొక్కల్లో కలుపుమొక్కలు బాగా ఉన్నాయని మందు కొనుక్కొచ్చి గూట్లో పెట్టాడు.అది ఈశ్వరరావు కంటపడింది.ఎవరూలేని సమయం చూచి మనవడు అటుగా వెళ్తుంటే అరేయ్!ఆడబ్బా ఇటివ్వరా!అంటే వాడు తెలియక తెచ్చి ఇచ్చాడు.రాత్రి అందరూ నిద్ర పోయిన తర్వాత దాన్ని తాగేసి తెల్లారేసరికి చనిపోయిఉన్నాడు.భార్య వచ్చి పిలిస్తే పలకక పోయేసరికి వామ్మో!ఎంతపని చేశాడు?అనుకుని చనిపోయాడని నిర్ధారించుకుని ఏడుస్తూ అందరినీ పిలిచింది.కాళ్ళు పనిచేయకపోయినా పెద్దపులిలాగా వాకిట్లో కూర్చుని వచ్చేపోయే వారిని నోటారా పలకరించేవాడు.అకస్మాత్తుగా చనిపోయేసరికి నోటమాట రాక అందరి మనసులు భాదపడ్డాయి.

Saturday, 19 September 2015

సాకులు చెప్పి వాయిదా

                                                చాలామంది ఎంతైనా పనిచేస్తారు కానీ ప్రత్యేకించి వ్యాయామం చేయటానికి తీరిక లేదనో,ఉదయాన్నేలేవటానికి బద్ధకంవేసో ఏవో సాకులు చెప్పి వాయిదా వేస్తుంటారు.అలాంటి మన దగ్గరివారి కోసం వాళ్ళ ఆసక్తిని బట్టి వారి చుట్టుపక్కల బృందాలుగా ఏర్పడి చేసే కార్యక్రమాలు యోగాసనాలు,ఎక్కువ శ్రమ పడకుండా చేసే వ్యాయామాలు దగ్గరలో ఎక్కడ నేర్పిస్తారో కనుక్కుని ఒక నెలరోజులపాటు సభ్యత్వం తీసుకుంటే తప్పకుండా హాజరవుతారు.క్రమంగా దానికి వాళ్ళు అలవాటు పడతారు.ఈ విధంగా మన దగ్గర వారికి  ఆరోగ్యంగా ఉండటానికి దారి చూపినట్లు అవుతుంది.మనకు,వాళ్ళకు కూడా మనసుకు సంతోషంగా ఉంటుంది.

Friday, 18 September 2015

ఎదురుచూపు

                                                              చాలామంది పని ఒత్తిడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా వేరే ప్రదేశానికి వెళ్ళాల్సివచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు ఫలానా చోటకు వెళ్తున్నానని సమాచారం ఇవ్వకుండానే వెళ్తుంటారు.నిర్లక్ష్యము అని కాకపోయినా వచ్చేస్తాము కదా!ఇంతలో చెప్పేదేముందిలే అనుకుంటారు.కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు.అదీకాక ఇంట్లో నుండి బయటకు వెళ్ళినవాళ్ళు ఇంటికి వచ్చేవరకు ఆందోళన చెందే రోజులాయె.ఇంట్లో వాళ్ళు రోజూ వచ్చే సమయానికి ఎదురుచూస్తూ ఉంటారు కదా!అందువల్ల ఎంత పని వత్తిడిలో ఉన్నా ఫోను చేసి చెప్పాలి.ఒకవేళ మాట్లాడటానికి కుదరకపోతే చరవాణిలో సందేశం అయినా పంపాలి.అప్పుడు ఇంట్లో వాళ్ళకు కొంతవరకు నిశ్చింత.ఎదురు చూస్తూ ఇంట్లోకి బయటికి తిరగాల్సిన పరిస్థితి ఉండదు. 

Wednesday, 16 September 2015

మోదక్

బియ్యప్పిండి - కప్పు 
కొబ్బరి తురుము  - కప్పు 
బెల్లం తురుము - 3/4 కప్పు
 పంచదార - 1/4 కప్పు 
నెయ్యి - 2  స్పూనులు  
యాలకుల పొడి - 1/2 స్పూను 
ఉప్పు - చిటికెడు 
నీళ్ళు - 1 కప్పు 
                                                 ఒక గిన్నెలో  నీళ్ళు,ఉప్పు,1 స్పూను నెయ్యి వేసి స్టవ్ పై పెట్టాలి.నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకుని దగ్గరకొచ్చాక దింపేయాలి.మరో గిన్నెలో బెల్లం,పంచదార,కొబ్బరి తురుము కలిపి పొయ్యి మీద పెట్టాలి.దగ్గర పడుతుండగా యాలకుల పొడి వేసి దింపేయాలి. మోదక్ తయారీకి అచ్చులు దొరుకుతాయి.ఒకదాన్ని తీసుకుని లోపలి వైపు నెయ్యి రాసుకుని బియ్యప్పిండి మిశ్రమం తీసుకుని అచ్చులోపెట్టి మధ్యలో కొబ్బరి మిశ్రమం పెట్టి అచ్చును మూసేయాలి.ఇలా తయారు చేసుకున్నమోదక్ లను ఆవిరిపై 10 ని.లు ఉడికించాలి.అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ తయారైనట్లే.
గమనిక :ఇదే విధంగా ఒక కప్పు వేయించిన తెల్ల నువ్వుల. పొడి ఒకకప్పు బెల్లం తురుము ఒక కప్పు వేసి  తయారుచేసుకోవచ్చు. .

వినాయక చవితి శుభాకాంక్షలు

                నాబ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు విఘ్నేశ్వరుని దయ వలన అన్నింటా విజయం చేకూరాలని,ఆయన కృప,కరుణ,కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.


                              


Tuesday, 15 September 2015

కనిపెట్టేశానోచ్

                                                                  శ్రీహర్ష ఐషర్ అనే కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు.శ్రీహర్ష ఇల్లంతా దాని సామ్రాజ్యమేనని అనుకుంటుంది.అందుకని ప్రహరీ లోపలకు ఏజీవిని రానివ్వదు.ఒక రోజు ఉదయం తలుపు తెరిచేటప్పటికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఊర కుక్కపిల్ల ఒకటి వరండాలోకొచ్చి పడుకుంది.దాన్ని చూచి ఐషర్ ఒకటే అరవటం మొదలెట్టింది.పాపం దాని కాలికి దెబ్బ తగలటం వలన అది కదలలేక   పోయింది.కొంచెసేపు అరిచిన తర్వాత ఆ విషయం ఐషర్ అర్ధం చేసుకుంది.అప్పటి నుండి కుక్కపిల్ల మీద జాలిపడి ,దానికి పెట్టిన ఆహారం,పాలు పెట్టిన గిన్నెలను మూతితో తోసుకువచ్చి దాన్నితినమని మూతి దగ్గరకు నెట్టటం మొదలెట్టింది. దెబ్బ తగిలిన ఊర కుక్కపిల్ల మనదగ్గర ఎందుకని శ్రీహర్ష దూరంగా వదిలి పెట్టించాడు.ఆ రోజంత  ఐషర్ ఇంటి చుట్టూ తిరిగి కుక్కపిల్ల కనిపించలేదని దిగులుగా కూర్చుంది.ఇంతలో సాయంత్రం శ్రీహర్ష  ఉద్యోగం నుండి ఇంటికి వచ్చాడు.వచ్చీ రాగానే శ్రీహర్షను గుమ్మం దగ్గరే నిలబెట్టి ఐషర్ అరవటం మొదలెట్టింది.మొదట శ్రీహర్షకు అర్ధం కాలేదు.తర్వాత అర్ధమైంది.నువ్వే కుక్కపిల్లను తీసుకెళ్ళి వదిలేశావు నేను ఆ విషయం కనిపెట్టాశానోచ్ !అన్నట్లుగా పోట్లాడటం మొదలెట్టింది.దాన్నిదాని తల్లిదగ్గరకి పంపేశాను అని బుజ్జగించిన తర్వాత కానీ అది అరవటం మానలేదు.

Monday, 14 September 2015

పరామర్శించటానికి వెళ్ళి ......అనుకూల ఆలోచన

                                                                  ఎదుటివాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినా,ఏదైనా ప్రమాదం జరిగినా పరామర్శించటానికి వెళ్ళి దాదాపుగా ఎక్కువమంది అయ్యో!ఇది నీకు రావాల్సిన కష్టం కాదు అనో,నీకు తీరని కష్టం వచ్చిందే అని జాలిపడటమో,నువ్వసలు కోలుకుంటావో లేదో అంటూ సానుభూతి ప్రకటిస్తూనే వంకర మాటలతో భయపెట్టేవాళ్ళు,బాధపెట్టేవాళ్ళే ఉంటున్నారు.ఇంకొంత మంది ఇంకేముంది?ఫలానా వాళ్ళ పని అయిపోయినట్లే అని పై పంచ భుజాన వేసుకున్నట్లు ప్రచారం చేస్తుంటారు.వెళ్ళిన వాళ్ళు కాస్త ధైర్యవచనాలు పలికి ఆబాధ నుండి త్వరగా కోలుకునేలా చేయాలి కానీ ఎదుటివాళ్ళ మనసు కష్టపెట్టకూడదు కదా!ఈ విధంగా వంకర టింకర మాటలు మాట్లాడే వాళ్ళను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.ఇదిలా ఉంటే వీళ్ళ మాటలు ఎంతో కొంత బాధిస్తాయి కనుక మనసు కష్టపెట్టుకుని కృంగిపోకుండా అనుకూల ఆలోచనతో వచ్చిన ఇబ్బంది నుండి బయటపడటానికి పట్టుదలతో ప్రయత్నించాలి.

దూదిపింజలా....

                                                          రోజూ ఒక పావుగంట సంగీతం వినటానికి కేటాయిస్తే కొద్ది నిమిషాల్లోనే ఒత్తిడి మాయమై మనసు దూదిపింజలా మారి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.మంచి సంగీతం వింటుంటే  మనసుకు హాయిగా ఉంటుంది.ఒత్తిడి ఎన్నో అనారోగ్యాలకు మూలం.ఆ ఒత్తిడి అనేది లేకుండా ఉంటే రక్తపోటు వంటివి దరిచేరకుండా ఉంటాయి.

Sunday, 13 September 2015

మొక్కల తెగుళ్ళు నివారణకు.........

                                                                 మనం ఎంత జాగ్రత్తగా పెంచినా మొక్కలకు తెల్లపేను,పేనుబంక వంటి
తెగుళ్ళు వస్తూ ఉంటాయి.అందుకని మొక్కలకు తెగుళ్ళు రాకుండా నివారించాలంటే అప్పుడప్పుడు వేప ద్రావణము,వేప నూనె,పసుపు మొ.వి నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయాలి.వేప ఆకులు రెండు గుప్పెళ్ళు తీసుకుని  ఒక లీటరు నీటిలో వేసి మరిగించి,ఆనీటిని చల్లార్చి వడకట్టగా వచ్చినదే వేప ద్రావణం.ఇవి సహజ సిద్దమైనవి కనుక ఆవాసనలు పీల్చినా మనకు ఇబ్బంది ఉండదు.మొక్కలు ఆరోగ్యంగా తెగుళ్ళు రాకుండా ఉంటాయి.

ఇనుము లోపించడం వల్ల..........

                                                                   శరీరంలో ఇనుము లోపించడం వల్ల రక్తహీనత వస్తుంది.దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత వల్ల రక్తం గడ్డ కట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్రాణానికే ప్రమాదం వస్తుంది.మామూలు వాళ్ళల్లో కూడా రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంవల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందువల్ల ప్రతి ఒక్కరు రక్తహీనత లేకుండా ముందే జాగ్రత్త వహించాలి.ఇనుము ఎక్కువగా ఉండే తోటకూర,గోంగూర,మునగాకు,పాలకూర తదితర ఆకుకూరలు రోజూవారీ ఆహారంలో భాగంగా  ఏదోఒక రూపంలో తింటూ ఉండాలి.పళ్ళు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.ఈ విధంగా చేయటం వల్ల రక్తహీనత దరిచేరకుండా ఉంటుంది.దీనికి తోడు ఎప్పటికప్పుడు రక్తపరీక్ష చేయించుకుని సరిపడా రక్తం ఉందో లేదో చూచుకుంటూ ఉండాలి.

గవ్వలు చేసేటప్పుడు.......

                                           మైదాతో గవ్వలు చేసి పంచదారతో కానీ,బెల్లంతో కానీ లేదా రెండు కలిపి కానీ పాకం పడుతుంటాము.అప్పుడు గవ్వలు మెత్తగా రాకుండా కరకరలాడాలంటే పిండి కలిపేటప్పుడు మైదాలో కొంచెం బొంబాయి రవ్వ,కరిగిన వెన్న వేసి కలిపిన తర్వాత కలిపిన పిండిపై తడిబట్ట కప్పాలి.ఇలా చేయటం వల్ల గవ్వలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

Saturday, 12 September 2015

డబ్బులోనే కూర్చుంటుంది

                                                   నిమీలిత వయసు రెండున్నర ఏళ్ళు.అమ్మానాన్న విదేశాలలో ఉద్యోగం చేసుకుంటూ నానమ్మ దగ్గర ఒక సంవత్సరం వదిలేశారు.నానమ్మ బ్యాంకులో డబ్బులు ఇవ్వటం తీసుకోవటం చేస్తుంటుంది.రోజూ నిమీలిత నానమ్మతోపాటు వెళ్ళి మధ్యాహ్నం వరకు కూర్చుంటుంది.నానమ్మ అసలే కబుర్ల పుట్ట.ఆమె దగ్గర ఉండి నిమీలిత వసపిట్టలా మాట్లాడుతుండేది.కొన్నాళ్ళ తర్వాత అమ్మ నిమీలితను తనతో తీసుకుని వెళ్ళింది.ఒకరోజు ఖరీదైన బొమ్మ కొనిపెట్టమని నిమీలిత అమ్మను అడిగింది.అది చాలా ఖరీదు అందువల్ల ఇంకొకసారి కొనుక్కుందామని చెప్పింది.నిమీలిత నానమ్మను అమ్మ అంటుంది.మా అమ్మ దగ్గర చాలా డబ్బులున్నాయి.అమ్మ ఎప్పుడూ డబ్బులోనే కూర్చుంటుంది పద మనం అక్కడకు వెళితే అమ్మ కొనిపెడుతుంది అని చెప్పింది. 

అనారోగ్యం దరిచేరకుండా......

నీళ్ళు - 1/2 లీ 
దాల్చిన  చెక్క పొడి - 1/2 టేబుల్ స్పూను 
అల్లం తురుము - 1/2 టేబుల్ స్పూను 
పసుపు - 1/4 స్పూను కన్నా తక్కువ 
యాలకుల పొడి - చిటికెడు 
పాలు - 1/2 కప్పు 
తేనె - ఇష్టమైతే 
                                         వీటన్నింటిని మరిగించి వడపోసి రోజంతా తాగాలి.దీనిలో పంచదార వేయకూడదు.ఈ నీళ్ళను రోజూ తాగటం వలన చిన్న చిన్న వాటినుండి కాన్సర్ వంటి అనారోగ్యాలు కూడా దరిచేరకుండా ఉంటాయి.

దోమలు ఎక్కువగా ఉంటే......

                                             దోమలు ఎక్కువగా ఉంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే దోమలు పారిపోతాయి.సాంబ్రాణి
పొగ వల్ల క్రిమి,కీటకాలు నాశనమవ్వటమే కాక ఆవాసనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Friday, 11 September 2015

మట్టి మరకలు పోవాలంటే......

                                                       వర్షాకాలంలో పిల్లలకైనా,పెద్దలకైనా ఎప్పుడో ఒకసారి బట్టలపై మట్టి మరకలు పడటం సహజం.పిల్లలకైతే మైదానంలో ఆటలాడేటప్పుడు ఎర్రమట్టి మరకలు పడతుంటాయి.అటువంటప్పుడు ముందుగా మరకలున్నచోట బంగాళదుంపలు ఉడికించిన నీళ్ళు పోసి రుద్ది కొంచెం సేపు నాననిచ్చి ఆతర్వాత మాములుగా ఉతకాలి.ఇలా చేయటం వల్ల మట్టిమరకలు మటుమాయమౌతాయి.                    

పేదోళ్ళని తెలిసి.......మళ్ళీ రాలేను

                                                 ఐశ్వర్య తండ్రి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కాలం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాడు.ఐశ్వర్య పెళ్ళి వయసు వచ్చేటప్పటికి చదువు,అందం అంతంతమాత్రంగా ఉన్నా గర్వం మాత్రం నిలువెల్లా ఉంది.అందుకని తండ్రి డబ్బులేకపోయినా చదువుకున్నవాడికి,నెమ్మదస్తుడికి పిల్లనిస్తే కూతురు ఆడింది ఆట,పాడింది పాట అన్నట్లుగా జీవితం సాగిపోతుందని అనుకున్నాడు.అనుకున్నట్లుగానే దూరపు బంధువులలో వైద్యవిద్య అభ్యసించిన కుర్రాడు ఉన్నాడని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి ఖర్చుల నిమిత్తం భారీగా వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చాడు.పిల్లాడికి,తండ్రికి అక్కడి నుండి కష్టాలు మొదలు అయ్యాయి.వీళ్ళంటే లేక్కలేనట్లు ప్రవర్తించటం మొదలెట్టారు.పిల్లాడు మొదట్లో పూర్తిగా వినకపోయినా తర్వాత అతనికి వాళ్ళ మాటే వేదం అయింది.కొన్నేళ్ళ తర్వాత ఒక నెల రోజులు మాదగ్గర ఉండమని తీసుకెళ్ళారు.ఈ నెలరోజుల్లో కోడలు మాటలతో మామగారి మెదడు తినేసింది.మీరు పేదోళ్ళని తెలిసి కూడా మీ కొడుకుతోపాటు,మీరు మా చెప్పుచేతల్లో ఉంటారని అంత డబ్బిచ్చి కొనుక్కున్నాము అనేసరికి వింటున్న పెద్దాయన తల తిరిగిపోయింది.అయ్యో!ఇన్నాళ్ళు కొడుక్కి పెద్దింటి పిల్లతో పెళ్ళి చేశాననుకున్నాను కానీ కొడుకును అమ్మేసుకున్నానని అనుకోలేదు అనుకున్నాడు.ఏమీ ఎరగనట్లు మళ్ళీ ఎప్పుడు వస్తారు మామయ్యా? అని దీర్ఘం తీసింది..మనసులో నీకో దండం అనుకుని అమ్మా!నేనిక్కడ చలికి తట్టుకోలేను అందుకని మళ్ళీ రాలేను అని చెప్పాడు.

Thursday, 10 September 2015

ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు ............

                                                 
                                                                 వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ఉంటాయి.అటువంటప్పుడు కర్పూరం  పొడికొట్టి ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చల్లాలి.అలా చల్లగానే ఈగలు ఆ ప్రదేశానికి రాకుండా ఉంటాయి.

మునగ అద్భుతం

                                             సాంబారులో మునగ కాయ వేయనిదే మంచి వాసన,రుచి రాదు.ఒక్క సాంబారులో అనే కాదు ఏకూరలో వేసినా ఆకూరకు అదనపు రుచి వస్తుంది.వీటిని ఎక్కువగా తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.తాజా మునగాకుతో కూరలు చేసుకుని తింటే పోషకాహార లేమి,రక్తహీనత అనేది ఉండదు.మునగాకులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.మధు మేహం,రక్తపోటు,కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది.కాళ్ళు,చేతులు బెణికి వాపు వచ్చినా మునగాకు వేడిచేసి కట్టు కడితే త్వరగా తగ్గిపోతుంది.పొరపాటున ఏదైనా తగిలి లేక తెగి రక్తం వస్తుంటే ఆకు నూరి కట్టు కడితే ఆగిపోతుంది.మునగాకు నీడలో ఆరబెట్టి పొడిచేసి రోజూ కూరల్లో చిటికెడు వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది.మునగ పువ్వులతో చేసిన టీ తాగితే జలుబు తగ్గుతుంది.గింజల నుండి తీసిన నూనె,ఎండ బెట్టి చేసిన పొడి,బెరడు,వేళ్ళు,అన్నీఉపయోగమే.మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడే మునగ మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వృక్షం.

Wednesday, 9 September 2015

జొన్న,రాగి,సజ్జ రస్క్

మల్టీ మిల్లెట్ ఆటా - 250 గ్రా. (రాగి,సజ్జ,జొన్నమొ .వి)
పంచదార - 75 గ్రా.
బేకింగ్ పౌడర్ - 3 గ్రా.
నూనె - 15 గ్రా .
వేరుశనగ -  15 గ్రా.(చిన్న పలుకులు)
ఉప్పు - 2 గ్రా.
వెన్న - 75 గ్రా.
కోడి గుడ్డు - 1 (ఇష్టమైతే)
                                                          పిండిలో బేకింగ్ పౌడర్ కలిపి ప్రక్కన పెట్టాలి.వెన్నని బాగా (క్రీమ్ లాగా)  గిలకొట్టాలి.దానిలో కోడిగుడ్డు(ఇష్టం లేకపోతే ఒక 10 గ్రా.నూనె ఎక్కువ వెయ్యాలి),పంచదార,ఉప్పు,వేయించిన వేరుశనగ పలుకులు కలుపుకోవాలి.ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి.వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసికొంచెం బిళ్లలుగా నొక్కి ఓ టీ జి లో 180 డిగ్రీలలో 40 ని .లు బేక్ చెయ్యాలి.వాటిని బయటకు తీసి రెండు ముక్కలుగా కట్ చెయ్యాలి.మళ్ళీ వీటిని 70 డిగ్రీలలో 10 ని .లు బేక్ చెయ్యాలి.వీటిని 2 గం.లు ఆరబెట్టి సర్దుకోవాలి.అంతే రుచికరమైన మల్టీ మిల్లెట్ రస్క్ లు సిద్ధం.
గమనిక:వెన్నను ఎంత బాగా క్రీమ్ చెయ్యగలిగితే అంత రుచిగాఉంటాయి.వీటిని విడివిడిగా జొన్న,రాగి,సజ్జ ఏ పిండితో అయినా చేసుకోవచ్చు.

Tuesday, 8 September 2015

బుద్ధిగా మనసు మాట

                                             మనకు ఒక్కొక్కసారి ఏదైనా పని చెయ్యాలని మనసులో ఉన్నాశరీరం మన మాట వినదు.బద్దకంగా చేద్దాంలే,చూద్దాంలే అన్నట్లు ఉంటుంది.ఈ బద్ధకం వదలాలంటే వ్యాయామం తప్పనిసరి.పుస్తకం చదువుదామన్నాధ్యానం చేద్దామని కూర్చున్నాకుదురుగా కూర్చోవటం ఇబ్బందికరంగా ఉండి ఎప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోదామా!అనిపిస్తుంటుంది.అలా అనిపించకుండా శరీరం బుద్ధిగా మనసు మాట వినాలంటే రోజుకొక అరగంటైనా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.వ్యాయామం చేద్దామన్నా చేయలేకపోతే ఇష్టమైన సంగీతం వింటూ టి.వి చూస్తూ అయినా ఇంట్లోనే సైకిల్ తొక్కవచ్చు. వ్యాయామం చేయటం వల్ల శారీరక శ్రమ చేసినట్లయి త్వరగా నిద్ర పడుతుంది.

ఎలాంటి చిరాకు లేకుండా.......

                                                        ఉదయాన్నే ఎక్కడికయినా వెళ్ళాలంటే ముందు రోజే ఏ దుస్తులు వేసుకోవాలి,ఏం తిని వెళ్ళాలి అనేది నిర్ణయించుకుంటే ఉరుకులు,పరుగులు లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకుని వెళ్ళవచ్చు.దీనితో ఎలాంటి చిరాకు లేకుండా హాయిగా ఉంటుంది. 

వెంట్రుకలు రాలకుండా ..................

                                                                         మనం జుట్టుకు ఎంత పోషణ చేసినా ఏదో ఒక కారణంగా వెంట్రుకలు పొడిబారి రాలిపోతుంటాయి.అలా వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే రెండు గ్లాసుల నీళ్ళల్లో ఒక అరకప్పు మెంతులు రాత్రంతా నానబెట్టాలి.ఉదయం ఆ నీటితో జుట్టును కడగాలి.ఆ మెంతులు మొలకలు రానివ్వాలి.ఒక అర అంగుళం మొలకలొచ్చిన తర్వాత వాటిని తినాలి.రెండు వారాలకొకసారి ఈ విధంగా చేస్తుంటే వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. 

జుట్టుకు అదనపు మెరుపు

                                                                 మూడు కప్పుల నీళ్ళు మరిగించి దానిలో ఒక గుప్పెడు బంతి పువ్వు రేకలను వేయాలి.ఒక గంట తర్వాత ఆనీటిని వడకట్టాలి. తలస్నానం చేసిన తర్వాత ఆ వడకట్టిన నీటితో చివరగా జుట్టును కడగాలి.ఈవిధంగా చేస్తే జుట్టుకు అదనపు మెరుపు వస్తుంది.                                                                

Sunday, 6 September 2015

తుంబంక

                                                             అంజలి అమెరికాలో పుట్టింది.వాళ్ళ అమ్మ ఉద్యోగభాద్యతల నిర్వర్తిస్తూ చిన్నపిల్లను పెంచటం కష్టమని అత్తగారి దగ్గర కొన్నాళ్ళు వదిలి వెళ్ళింది.అప్పుడు అంజలిని చూచుకోవటానికి ఒక పని మనిషిని పెట్టారు.ఆ పనిమనిషి కూతురు గాలిపటాలు తయారు చెయ్యటానికి తుంబంక తెచ్చుకునేది.అంజలికి అప్పటి నుండి తుంబంక అనే పదం  అలవాటయింది. తుంబంక అంటే తుమ్మ చెట్టు నుండి వచ్చే జిగురు.ఒకప్పుడు దీన్నికాగితాలు అతికించటానికి ఉపయోగించేవాళ్ళు.పిల్లలు తుమ్మ చెట్టు నుండి వచ్చిన జిగురుని ఒక కొబ్బరి చిప్పలో సేకరించే వాళ్ళు.కొద్దిగా నీళ్ళు పోస్తే అప్పటికప్పుడు అతికించటానికి వీలుగా తయారౌతుంది.అంజలిని కొన్నాళ్ళకు వాళ్ళ అమ్మ అమెరికా తీసుకుని వెళ్ళింది.అయినా ఆ పదం మర్చిపోకుండా పాఠశాలలో ఏమైనా పేపర్లు అతికించడానికి వాడేదాన్ని గ్లూ అనో గమ్ అనో అనమన్నా అనకుండా తుంబంక అనే అనేది.ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళ అమ్మకు విసుగొచ్చి చెప్పడం తన  వల్లకాక వదిలేసింది. 

నేరుగా ఫ్యాన్ క్రింద ............

                                                              ఎప్పుడైనా,ఎవరైనా నేరుగా ఫ్యాన్ క్రింద పడుకోకూడదు.కొంచెం పక్కకు పడుకోవాలి.పలుచటి దుప్పటి కప్పుకోవాలి.ఎందుకంటే నేరుగా ఫ్యాన్ క్రింద పడుకోవటం వల్ల  గాలి చెవుల్లోకి వెళ్ళి ఉదయం లేచేటప్పటికి శరీరం అంతా బిగదీసినట్లవుతుంది.ఒళ్ళు అంతా నొప్పులుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. గాలి చెవుల్లోకి నేరుగా వెళ్ళటం వలన థైరాయిడ్ సమస్య కూడా వస్తుంది,అందుకని గాలి వేగంగా వచ్చేలా కాకుండా మధ్యస్థంగా ఉండేలా పెట్టుకోవాలి. 

పార్శ్వపు నొప్పి

                                                             శ్రీవల్లి విపరీతమైన తలనొప్పితో బాధపడుతుండేది.వెలుతురు చూడలేక 
పోయేది.తలుపులన్నీ వేసేసి చీకటి గదిలో పడుకునేది.విపరీతమైన వాంతులు,ఏపనీ చేయగలిగేది కాదు.ఎందరు వైద్యులను సంప్రదించినా,ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది.శ్రీవల్లి బాధ చూడలేక ఆమె స్నేహితురాలు ఒక ఆయుర్వేద వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళింది.తలకు ఏదో ఒక వైపు మాత్రమే విపరీతమైన నొప్పి వస్తుందని తను పడుతున్నఇబ్బందులన్నీఏకరువు పెట్టింది శ్రీవల్లి. దేశవాళీ ఆవు పెరుగు తోడుపెట్టి,కవ్వంతో చిలికి,చేతితో వెన్న తీసి కరిగించిన స్వచ్చమైన నెయ్యి రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కులలో కొద్ది రోజులు వేసుకుంటే తప్పకుండా తగ్గిపోతుందని చెప్పారు.ఎంత తలనొప్పి ఉన్నా ఆవునేతి చుక్కలు వేసుకున్న గంటలో తగ్గిపోతుందని చెప్పారు.శ్రీవల్లి ఆయన చెప్పిన విధానాన్ని తు.చ తప్పకుండా పాటించి పార్శ్వపు నొప్పి నుండి విముక్తి పొందింది. 

Saturday, 5 September 2015

పెత్తనగాడు

                                                                    ఉమేష్ 12 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్ళమంటే తలనొప్పి వచ్చిందని మెలికలు తిరిగి శోకాలు పెట్టేవాడు.ఇంకేముంది నిజంగానే తలనొప్పి వచ్చిందనుకుని అమ్మమ్మ,అమ్మ ఉమేష్ ని చంక నేసుకునే వాళ్ళు.అప్పటికే ఉమేష్ పొడవుగా ఉండేవాడు.ఎత్తుకుంటే కాళ్ళు నేలకు తగులుతుండేయి.అయినా పాపం పిల్లాడు నొప్పితో విలవిలలాడిపోతున్నాడని ఎత్తుకునేవాళ్ళు.ఏ వైద్యుని దగ్గరకు తీసికెళ్లినా అన్ని పరీక్షలు చేసి ఏ అనారోగ్యం లేదని తేల్చారు.అయినా తలనొప్పి తగ్గలేదనేవాడు.ఉమేష్ కు వరుసకు పెదనాన్నఅమెరికాలో పిల్లల వైద్యుడు.ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు  ఉమేష్ ని తీసుకొచ్చి చూపించారు.ఆయన ఉమేష్ ని పరీక్ష చేసి వీడికి తలనొప్పి ఏమీ లేదు వేషాలు వేస్తున్నాడని,పాఠశాలకు వెళ్ళాల్సిందేనని,లేకపోతే ఊరుకోవద్దని తల్లిదండ్రులకు చెప్పారు.ఉమేష్ కి కూడా అదే విషయం గట్టిగా చెప్పారు.అప్పటినుండి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకుని ఇంజనీరయ్యాడు.చిన్నప్పుడు ఎన్ని వేషాలు వేసినా ఇప్పుడు కుటుంబం మొత్తంలో పెద్ద పెత్తనగాడు అయ్యాడు.ఇంటాబయటా అందరికీ తలలో నాలుకలా సలహాలిస్తూ పనులు చక్కబెడుతుంటాడు. 

Friday, 4 September 2015

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

                                                        శ్రీ కృష్ణ జన్మాష్టమి  అనగానే మోమితకు చిన్నప్పటి నుండి వాళ్ళింట్లో ఉన్న
వటపత్రసాయి గుర్తొస్తుంటాడు.రావి ఆకు పై అందంగా చిన్ని కృష్ణుడిని మంచి రంగుల మేళవింపుతో తీర్చిదిద్దారు.చాలారోజుల వరకు జాగ్రత్తగా భద్రపరిచింది.తర్వాత కనిపించకుండా పోయింది.ఇప్పటికీ ఎక్కడైనా అటువంటిది  దొరుకుందేమో అని కొందామన్నా దొరకలేదు.ఎట్టకేలకు కొంచెం అటూ ఇటుగా దొరగాగానే మీ ముందుకు తెచ్చింది. బ్లాగ్ వీక్షకులు,తోటి బ్లాగర్లు కృష్ణాష్టమి వేడుకలు చక్కగాజరుపుకోవాలని చిన్ని కృష్ణుని కృప,కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


                             ఉపాధ్యాయ వృత్తిలోఉన్న తోటి బ్లాగర్లకు,బ్లాగ్ వీక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.విద్యార్ధి జీవితంలో గురువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ,ఈరోజుల్లో చదువు ఒక్కటే కాదు ముఖ్యం.సంస్కారం, లోకజ్ఞానాన్నికూడా నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంది గురువును మించిన శిష్యుడిగా తయారు చెయ్యటంలోనే ఉంది గొప్పతనం.
                                                                                                                                                                                        

కొత్తిమీర రసం

                                                                     కొంచెం కొత్తిమీర మిక్సీలో వేసి 1/2 గ్లాసు నీళ్ళు పోసి వడకట్టి పరగడుపున తాగితే థైరాయిడ్ ఉన్నవాళ్ళకు మంచిది.ధనియాలు ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకొక స్పూను నీళ్ళల్లో కలుపుకుని తాగాలి.ఇలా చేస్తే థైరాయిడ్ అదుపులో ఉంటుంది.

రేచీకటి వచ్చిందేమోనని...........

                                                                   జితేందర్ వయసు అప్పటికి రెండు సంవత్సరాలు.అక్కకు మూడు సంవత్సరాలు.జితేందర్ అమ్మ ఇద్దరు చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతుందని అమ్మమ్మ జితేందర్ ని  కొన్ని రోజులు తనదగ్గర ఉంచి పెంచుతానంటే సరేనని ఊరు వెళ్ళింది.జితేందర్ అమ్మమ్మ దగ్గర ఒక వారం రోజులు బాగా సంతోషంగానే ఆడుకున్నాడు.తర్వాత నుండి కళ్ళు కనిపించనట్లు మంచం పై నుండి కిందకు దిగకుండా చేతులతో తడుముకుంటూ అమ్మమ్మ చంకనెక్కి విసిగించడం మొదలు పెట్టాడు.జితేందర్ అమ్మమ్మకు అసలే భయం.4,5 రోజులు చూచి అమ్మమ్మ అమ్మో!పిల్లాడికి కళ్ళు కనిపించటం లేదో ఏమో,రేచీకటి వచ్చిందో ఏంటో?వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఆ దారి వేరు.అక్కడికే తీసికెళ్ళి పంపిద్దాము అని వెళ్ళింది.అక్కడకు వెళ్ళిన దగ్గర నుండి మాములుగా ఆడుకోవటం మొదలు పెట్టాడు.జితేందర్ అంత చిన్న వయసులో వేషాలు వేస్తాడని ఎవరు ఊహించలేదు.వైద్యుని వద్దకు తీసుకెళ్తే కంటి చూపు బాగానే ఉంది అన్నారు.బహుశా తల్లిదండ్రుల దగ్గర ఉందామని వేషాలు వేస్తున్నాడని చెప్పారు.ఇదేమిటి?ఇంత చిన్నాడు ఇన్ని వేషాలు వేస్తున్నాడు నమ్మశక్యం కావట్లేదు అనుకుని పోనీలే ముందు కళ్ళు బాగానే ఉన్నాయి.రేచీకటి వచ్చిందేమోనని భయపడ్డాము అని పెద్దవాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే...........

                                                             కారట్,యాపిల్ తురిమి ఈ రెండింటిని సమానంగా తీసుకుని బాగా కలపాలి.దీన్ని ఉదయం తినాలి.3 నెలలు రోజూ క్రమం తప్పకుండా తినాలి.ఆతర్వాత 3 నెలలు ఉసిరి మురబ్బా కానీ,కాయలుగా కానీ ఏదో ఒక రూపంలో తినాలి.మళ్ళీ 3 నెలలు సొరకాయ + ఆపిల్ తురుము తినాలి.ఈ విధంగా చేస్తే బరువు ఎక్కువ ఉన్నవారు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.

Thursday, 3 September 2015

మధుమేహం తగ్గాలంటే............

                                                     ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు రావటం వల్ల,శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం వల్ల చిన్నవయసులోనే మధుమేహం బారినపడుతున్నారు.వినడానికే బాధగా ఉన్నా కొన్ని జాగ్రతలు తీసుకోవటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు.మధుమేహం తగ్గాలంటే మెంతులు - 1 స్పూను,1 స్పూను త్రిఫల చూర్ణం(1 భాగం - కరక్కాయ,2 భాగాలు -తానికాయ, 3 భాగాలు -పెద్ద ఉసిరికాయ కలిపి పొడి చేసుకోవాలి)వేడి నీటిలో నానబెట్టాలి.ఉదయాన్నే పరగడుపున నీళ్ళు తాగేసి మెంతులు,మిగతా పదార్ధాన్ని బాగా నమిలితినాలి.ఈ విధంగా 3-4 నెలలు చేస్తే మధుమేహం చాలావరకు తగ్గుతుంది.చక్కెర అసలు తినగూడదు.

Wednesday, 2 September 2015

బరువు తగ్గాలనుకుంటే .............

                                                          బరువు తగ్గాలనుకుంటే రోజూ ఒక గ్లాసు పాలకూర రసం తాగితే బరువు తగ్గుతారు.వెంటనే పొట్ట నిండిన భావం కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు.దీనితో బరువు తగ్గటం జరుగుతుంది.                           

ఏదో తినే బదులు.........

                                                           మనం రోజూ ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకుని మనకు నచ్చినట్లు ఏదో ఒక ఆహారం తింటూ ఉంటాము.అలా ఏదో ఒకటి తినే బదులు ఆరోగ్యాన్ని మెరుగుపరచే వాటిని ఆహారంలో భాగం చేసుకుని వాటిని మనకు నచ్చిన విధంగా  చేసుకోవటం మేలు.అవేంటంటే కాబేజీ,టొమాటో,కాలీ ఫ్లవర్,పసుపు, వెల్లుల్లి,ఎర్ర ముల్లంగి (టర్నిప్),బ్రకోలి,అరుగులా,కేల్ ఆకులు,ఒమేగా-3,ఒమేగా-6 ఆమ్లాలు,ద్రాక్ష, తప్పనిసరిగా కొన్ని అయినా రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం మన స్వంతమవటమే కాక వీటిలో ఉండే అనామ్లజనకాలు (యాంటీ ఆక్సిడెంట్లు) కాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

Tuesday, 1 September 2015

వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా ఉండాలంటే.............

                                                          మెంతులు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని రోజూ పరగడుపున తినాలి.మెంతులు నానబెట్టిన నీటిని పారబోయకుండా తాగాలి.అప్పుడప్పుడు మెంతులు నానబెట్టి మెత్తగా మిక్సీలో వేసి ఆ పేస్ట్ తలకు పట్టించి తర్వాత తలస్నానం చేయాలి.ఇది శక్తివంతమైన,ఉపయోగకరమైన చిట్కా.