Saturday 31 October 2015

తీరిక దొరికితే......

                                                 మనలో చాలా మందికి కాసేపు తీరిక దొరికితే చాలు టి.వి.చూడటమో లేదా పుస్తకం చేత్తో పట్టుకుని కుర్చోవటమో అలవాటు.రోజులో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవటం వల్ల శ్వాస,గుండె కొట్టుకునే వేగం తగ్గి రక్తప్రసరణ తగ్గుతుంది.ఈమార్పులు నిస్తేజాన్ని సూచిస్తాయి.మన శరీరానికి సరిగా ప్రాణవాయువు అందకపోయినా నిస్సత్తువ ఆవరిస్తుంది.దీనితో ఇతర సమస్యలు మొదలవుతాయి.అందుకే ఒకేప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి తిరుగుతూ అప్పుడప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి.తీరిక దొరికితే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచవచ్చు.దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.ఒత్తిడి తగ్గితే అసంకల్పితంగా  ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.దీనితో మనం దాదాపు సంపూర్ణ ఆరోగ్యం అంది పుచ్చుకొన్నట్లే.

Friday 30 October 2015

ఆర్ధిక పరిజ్ఞానం

                                                                       చిన్నప్పటి నుండి పిల్లలను సైన్సు,లెక్కల్లో రాణించేలా ప్రోత్సహిస్తే
పెద్దయ్యాక అమ్మాయిలకైనా,అబ్బాయిలకైనా ఆర్ధిక పరిజ్ఞానం వస్తుంది.ఆ దిశగా అడుగులు వేసేలా తల్లిదండ్రులు కూడా తర్ఫీదునివ్వాలి.చిన్న వయసు నుండే బాంకు ఖాతాలను నిర్వహించగలిగి ఉద్యోగం కోసమే ఎదురుచూడకుండా తమంతట తామే స్వంత సంస్థల్ని నిర్వహించి ఆర్ధికంగా ముందడుగు వేయగలుగుతారు.'0' పెట్టుబడితో కూడా వ్యాపారాలు ఎలా చేయవచ్చు?లాభం ఎంత?నష్టంఎంత?అని ఆలోచించడం మొదలుపెట్టి చదువుకోనేటప్పటి నుండే వ్యాపారదృక్పధం వైపుగా అడుగులు వేయగలుగుతారు.ఒకవేళ కొంచెం అటూఇటూగా ఉన్నావారు నష్టపోతారేమో అనే శంక తల్లిదండ్రుల్లో ఉన్నా ముందుగా ఒక అవకాశం ఇవ్వటం వలన ఒక ప్రయత్నంలో విఫలమైనా ధైర్యంగా ముందడుగు వేసి మరోసారి విజయం సాధించగలుగుతారు.దీని వలన ఆర్ధిక నిర్ణయాలు పక్కాగా తీసుకోగలుగుతారు.    

Thursday 29 October 2015

అర ఇస్తా ఒకటి ఇవ్వు

                                                    సుజిత స్నేహితురాలు ఆరణి అన్నీ గొప్పలు చెప్పుకుంటుంది.పైగా అత్యాశ.ఒక రోజు సుజిత ఇంటికి వచ్చి మాటల మధ్యలో తన కొడుకు ఉద్యోగం చేస్తూ తెగ సంపాదించుతున్నాడని గొప్పలు చెప్పింది.చెప్తూ ఇప్పుడు అర ఇస్తాగానీ నువ్వు సంవత్సరానికి ఒకటి ఇవ్వు అంది.అంటే సుజితకు మొదట అర్ధం కాలేదు.తర్వాత విడమరచి తన ఉద్దేశ్యం చెప్పింది.అదేమిటంటే మీ వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వమని నేరుగా అడక్కుండా నేను 50 లక్షలు నీకు ఇస్తానుగానీ ఒక సంవత్సరానికి నువ్వు తిరిగి నాకు కోటి రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇవ్వమంది.సుజిత ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి వెంటనే తేరుకుని కావాలంటే వ్యాపారంలో వాటా ఇవ్వమని అడుగు?అంతే కానీ ఏ లెక్కన నన్నుకోటి రూపాయలు ఇవ్వమని అడిగావు?వాటా ఇవ్వమంటే  ఎంతో కొంత వాటా ఇష్టమైతే ఇస్తారేమో?అంతే కానీ నా వ్యాపారానికి నీ డబ్బు అక్కరలేదు.ఎంత మంచి వ్యాపారమైనా మొదలుపెట్టగానే రెట్టింపు లాభం రాదు.అక్రమ వ్యాపారం మా వల్ల కాదు కానీ 10 రూ.ల వడ్డీ లెక్కన అయితే తప్ప రెట్టింపు అవ్వాలంటే కష్టం.అందుకని నేను ఆపని చేయలేను కానీ నువ్వే రెట్టింపు ఇచ్చేవాళ్ళను చూచి వడ్డీకి ఇచ్చుకో అని ఆరణికి సలహా ఇచ్చింది సుజిత.మళ్ళీ మారు మాట్లాడలేదు ఆరణి. 

ముందు జాగ్రత్త

                                                                      ఏపని చేసినా ముందు జాగ్రత్త తప్పనిసరి.అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముందుజాగ్రత్తతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.విటమిన్ -డి శరీరానికి చాలా చాలా అవసరం.సూర్య కిరణాల్లో విటమిన్ - డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజు కాసేపు నీరెండలో ఉంటే మంచిది.ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి.బరువుపెరగకుండా జాగ్రత్త పడాలి.వారంలో ఐదు రోజులు ఒక 1/2 గం. తప్పనిసరిగా వ్యాయామం క్రమం తప్పకుండా చేసే వారిలో గుండె జబ్బులు,కాన్సర్ ప్రమాదం తక్కువ.ప్రతి రోజు నడక చాలా మంచిది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.చిరు ధాన్యాలు,హోల్ గ్రైన్,వెన్నతీసిన పాలు,దంపుడు బియ్యం,బ్రకోలి,పుచ్చకాయ,కాబేజీ,బొప్పాయి,జామ వంటివి ముందునుండే అలవాటుగా తింటుంటే అనారోగ్యాలు దరిచేరవు.                                                

Wednesday 28 October 2015

ఆరుబయట........

                                                     ఇంటి లోపల ఆడుకునే పిల్లలకన్నా ఆరుబయట నీరెండలో నలుగురితో కలిసి ఆడుకునే పిల్లలు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు.ఒంటరిగా ఆడుకొనే వాళ్ళ కన్నా అందరితో కలిసిమెలిసి ఆడుకోవటం వలనే కాక,నీరెండలో విటమిన్ డి ఉండి శరీరానికి తగినంత అందుబాటులో ఉండటం వలన కూడా ఉత్సాహంగా ఉంటారు. 

అవాంచిత రోమాలపై.......

                                               పసుపులో పాలు కలిపి చిక్కటి పేస్ట్ చేసి అవాంచిత రోమాలపై పట్టించాలి.20 ని.ల తర్వాత వేడినీటితో కడగాలి.ఇలా కొద్దిరోజులు చేస్తే అవాంచిత రోమాలన్నీ తొలగిపోతాయి.

Tuesday 27 October 2015

మునగాకు - శనగపప్పుకూర

మునగాకు - ఒక దోసెడు
పచ్చిశనగపప్పు- 1/2 కప్పు
నూనె  - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూను
వేపుడు కారం --1 టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 1
ఆవాలు- 1 స్పూను
మినప్పప్పు - 1 స్పూను
పసుపు -  1/4 స్పూను
జీరా - 1/2 స్పూను
                                                         ముందుగా పచ్చి శనగపప్పు రెండు గం.లు నానబెట్టి నీళ్ళు వంపేసి మెత్తగా
రుబ్బి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేడిచేసి ఎండుమిర్చి,ఆవాలు,మినప్పప్పువేసి వేగాక,జీరా,వెల్లుల్లి ముక్కలు వేయాలి.తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక మునగాకు వేసి పచ్చివాసన పోయాక శనగపప్పు ముద్ద, ఉప్పు,పసుపు వేసి వేయించాలి.కాసేపటికి ఇది  పొడిపొడిగా అవుతుండగా వేపుడు కారం వేసి రెండు  ని.లు వేయించి దించేయాలి.ఇది వేడివేడి అన్నం,చపాతీల్లోకి బాగుంటుంది. 


Monday 26 October 2015

మెరుగైన నిర్ణయాలు

                                                           తెల్లవారుఝామున ఏకాగ్రతతో చదవడంవల్ల త్వరగా చదివినది బుర్రకెక్కి గుర్తుండిపోతుంది.అందుకే పెద్దవాళ్ళు తెల్లవారుఝామున చదుకున్న చదువే చదువు అని చెప్పేవాళ్ళు.ఉదయానే
ఏ ఆహారం తీసుకోకముందు శరీరం,మనసు దేన్నైనా చురుగ్గా స్వీకరించి చక్కటి ఫలితాలిస్తాయి.పరగడుపున చేసిన వ్యాయామం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.తెల్లవారుఝామున అదీ పరగడుపున ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల కిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది.ఆ సమయంలో ఆలోచించడంవల్ల మెరుగైన నిర్ణయాలు తీసుకో గలుగుతారు.వ్యాపార దిగ్గజాలందరూ సూర్యోదయానికి ముందే తమ దినచర్యను మొదలెట్టటంవల్ల వ్యాపారంలో రాణించ గలుగుతున్నారు.పరగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.అందుకే ఏ పని చేసినా మెరుగైన ఫలితాలుంటాయి.

ఏమరుపాటు

                                                              ఆశ్రిత వృత్తిరీత్యా వైద్యురాలు.విద్యార్ధినిగా ఉన్నప్పుడు చదువుకు మాత్రమే  పెద్దపీట వేసేది.తరువాత వివాహమై గృహిణిగా,పిల్లలకు తల్లిగా కుటుంబానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి తరువాత వృత్తికి ప్రాధాన్యత ఇస్తుంది.ఈ రోజుల్లో కూడా పనివాళ్ళపై వదిలేయకుండా తనే స్వయంగా దగ్గరుండి పిల్లల పనులు అన్నీ చూస్తుంది.వాళ్ళ నానమ్మ అయితే ఆశ్రితను చూచి తెగ ముచ్చట పడుతుంది.పిల్లలు ఆటల్లో ఎక్కడ కింద పడి దెబ్బలు తగిలించుకుంటారోనని అతి జాగ్రత్తగా కాపలా కాసేది.అయినా సరే ఒకరోజు ఆశ్రిత ఇంటికి బంధువులు వస్తే మాట్లాడుతుండగా పిల్లలు వాళ్ళ గదిలో మంచం దగ్గరలో సోఫా ఉంటే మంచం మీదనుండి సోఫా మీదకు,సోఫా మీద నుండి మంచం మీదకు దూకుతూ ఒకరికొకరు పోటీపడి చిన్నవాడు కింద పడిపోయాడు.కింద పడినప్పుడు చేతి మణికట్టు దగ్గర చిట్లింది.దానికి పెద్ద కట్టు వేసి 21 రోజులు జాగ్రత్తగా చుడాలన్నారు.ఆశ్రిత వాళ్ళ నానమ్మ వెయ్యి కన్నులతో కాపలా కాసినట్లు అతి జాగ్రత్తగా పిల్లలను చూస్తుంటావు కదా!అంత దెబ్బ ఎలా తగిలింది?అని అడిగింది.ఎంత జాగ్రత్తగా ఉన్నా కాస్త ఏమరుపాటుతో ఉన్నందువల్ల ఇబ్బంది పడవలసి వచ్చిందని ఆశ్రిత నానమ్మకు విపులంగా చెప్పింది.   

Saturday 24 October 2015

జుట్టు పెరగాలంటే......

                                       ఒక గుప్పెడు మందార ఆకులు తీసుకుని దీనికి నాలుగు స్పూనుల  పెరుగుతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.దీన్ని చిన్నచిన్న ఉండలు చేసి జుట్టుకి సరిపడా  కొబ్బరి నూనెలో వేసి 5 ని.లు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,చక్కగా పెరుగుతుంది. 

Friday 23 October 2015

గెలిచేందుకు......

                                                             ఏదైనా లక్ష్యం సాధించాలని అనుకున్నప్పుడు మనం గెలుస్తామనిగానీ, ఓడిపోతామనిగాని మనకు ముందే  తెలిస్తే మనం మానసికంగా అందుకు అనుగుణంగా తయారవుతాము.అదే విధంగా ఒక్కొక్కసారి  తప్పకుండా గెలుపు మనదే అనుకుని చివరి క్షణంలో అనుకోకుండా ఓడిపోతే ఆ బాధ వర్ణనాతీతం.ఒక్కసారిగా ప్రాణం ఉసూరుమనిపిస్తుంది.ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మరలా ప్రయత్నించి చూడాలి.ఇలా దగ్గరదాకా వచ్చి తప్పిపోయిన గెలుపు మనలో తప్పకుండా సాధించి తీరాల్సిందే  అనే  పట్టుదలను పెంచి   గెలిచేందుకు దోహదపడుతుంది.అప్పుడు తప్పకుండా విజయం మన స్వంతమవుతుంది.                  

ముఖంపై ముడతలు రాకుండా......

                                                                             వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావటం సహజం.కానీ ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలావరకు ముఖంపై ముడతలు త్వరగా రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.దీన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి.అప్పుడు ముఖం మృదువుగా మారి ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.ఇలా తరచుగా చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.మెంతి కూర ప్రత్యేకంగా ఏమి తెచ్చుకుంటాములే!అనుకోకుండా రెండు కుండీల్లో  మట్టిపోసి పైపైన కదిలించి మెంతులు చల్లితే చక్కగా మొక్కలు వస్తాయి.ఒక దాంట్లో మొక్కలు అయిపోయేటప్పటికి రెండో దానిలో మొక్కలు వచ్చేలా చల్లుకుంటే కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజులు మెంతి కూర వాడుకోవచ్చు. 

Thursday 22 October 2015

విచిత్రమైన అలవాటు

                                                                           స్పూర్తి కి మొక్కలు పెంచే అభిరుచితోపాటు ఒక విచిత్రమైన అలవాటుంది.ధర ఎంత అనేది పట్టించుకోకుండా మొక్కలు కొని రకరకాల కుండీలలో పెంచుతుంది.కుండీలో మొక్క పైకి పెరిగి పువ్వులు పూస్తూ ఉంటుంది.స్ఫూర్తి కి కుండీలో మట్టి కనిపించటం అసలు  ఇష్టం ఉండదు.అందుకని మట్టి కనిపించకుండా తోటకూర,మెంతులు,ధనియాలు మొదలైనన గింజలు  చల్లుతుంది.ధనియాలు ఒక వారానికి మొలకలు వస్తాయి.మెంతులు చల్లిన  మూడోరోజు కల్లా మొలకలు వచ్చేస్తాయి.నీళ్ళు చిలకరించాలే  తప్ప ఎక్కువగా పొయ్య కూడదు. వారం రోజులకు మొక్కలు పెరిగి పచ్చగా,నిగనిగలాడుతూ పచ్చటి తివాచీ పరిచినట్లుగా అందంగా కుండీ చూడముచ్చటగా ఉంటుంది.నీడలో కూడా పచ్చి ఆకులే తినాలని అనిపించే లాగా చక్కగా  మొక్కలు వస్తాయి.తాజాగా ఉన్న ఆకుకూరలు తను వాడుకోవటమే కాక ఇంటికి ఎవరైనా తెలిసినవాళ్లు వచ్చినా  చిన్నచిన్నకట్టలు కట్టి ఇస్తుంది.వాళ్ళు కూడా ఆకుకూర  తాజాగా,మంచి సువాసనతో ఎంత బాగుందో  అంటూ తెగ ముచ్చట పడిపోతుంటారు.స్పూర్తి విచిత్రమైన అలవాటు తనకే కాక తనతోపాటు చాలామందికి చక్కగా ఉపయోగకరంగా ఉంది.

Wednesday 21 October 2015

విజయదశమి శుభాకాంక్షలు

                                                      అమ్మలు గన్నఅమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మమ్ము కరుణించి కాపాడమ్మా!అంటూ ఆ కనకదుర్గాదేవిని నిండు మనసుతో  ప్రార్ధిస్తూ ఆ అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని అందరి ఇంట సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,భోగభాగ్యాలతో కూడిన ఆనందం వెల్లివిరియాలని,ఈ విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,నా తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. 
         
     

                  

Tuesday 20 October 2015

జుంబా నృత్యం

                                                                     వేగంగా నడవడం,మామూలుగా నడవడం,పరుగెత్తడం,జిమ్ కి వెళ్ళడం సర్వ సాధారణంగా చేసే వ్యాయామాలు.ఇప్పుడు చాలామంది జుంబా నృత్యాన్ని వ్యాయామంగా ఎంచుకుంటున్నారు.అయితే ఇది చాలా నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకుంటే నేర్చుకోవటం చాలా సులువు.శరీరాన్ని వేగంగా కదిలిస్తూ చేసే నృత్యంతో కూడిన వ్యాయామం కనుక తరగతులకు వెళ్ళే ముందు అంతర్జాలంలో వీడియోలు చూసి సాధన మొదలు పెడితే అడుగులు వేయడం,చేతులు తిప్పడం,కాళ్ళ కదలికల వంటివి తెలుస్తాయి.తరగతులకు వెళ్ళినా అందరిలో చేయడానికి మొహమాటంగా అనిపించదు.అదీకాక తేలికగా కూడా నేర్చుకోవచ్చు.జుంబాలో తప్పటడుగులు సర్వ సాధారణం.మొదట్లో ఎవరైనా తప్పులు చేయటం సహజం. సంగీతాన్నిబట్టి మనం భంగిమను వెంటనే మార్చేయాల్సి ఉంటుంది.అమ్మో!మనం ఆవిధంగా చేయలేమేమో  అని భయపడనక్కరలేదు.భయాన్ని వీడి నృత్యం మీద దృష్టి పెట్టి చేస్తే అదే అలవాటయిపోతుంది.సంగీతం ఏకాగ్రతగా వింటూ నృత్యంతో కూడిన వ్యాయామం జుంబా ప్రత్యేకత.ఇది నేటి ట్రెండ్.

భవిష్యత్తు అంతా.........

                                                                               నిన్నటి కంటే ఈరోజు,ఈరోజు కంటే రేపు,రేపటి కంటే ఎల్లుండి బాగుండాలని సహజంగా అనుకుంటాము.అలాగే భవిష్యత్తు అంతా సంతోషంగా,సుఖంగా సాగిపోవాలని అందరమూ మనస్పూర్తిగా కోరుకుంటాము కదా!అలా సాగిపోవాలంటే భగవంతుని దయతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి.సానుకూల దృక్పధంతో అందుకు తగిన కృషి చేయాలి.నాలుగు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆయాచితంగా ఎదుటివాళ్ళ నుండి దోచుకుందామని దానితో జల్సాగా బ్రతుకుదామని అనుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటున్నారు.అది తాత్కాలికమే కానీ ఎల్లకాలమూ అదే విధంగా జరగదని,తమ  భవిష్యత్తు ముందు ముందు అగమ్యగోచరమని  తెలిసినా తమ కుటిల ప్రయత్నాలు మానుకోలేరు.ఎప్పుడైనా ఎవరికి వారు వాళ్ళ స్వయంకృషితో,సానుకూల ధృక్పదంతో ఆలోచించి తమ స్వశక్తిని నమ్ముకుని సంపాదించిన సొమ్ముతో సుఖంగా,సంతోషంగా ఉండగలరు.అటువంటి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన ఠీవి,దర్జా ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటుంది.అటువంటి వాళ్ళ భవిష్యత్తు అంతా సుఖంగా,సంతోషంగా సాగిపోతుంది.                   

Monday 19 October 2015

నిద్రలో గురక

                                                                    నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నిద్రలో గురక పెట్టడమనేది సహజమైపోయింది.ఇది అనారోగ్యానికి సూచన.దీనివల్ల పక్కవాళ్ళకు ఇబ్బందితోపాటు ఎవరికి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి శ్వాస ఆడక ఇబ్బంది కలుగుతుంది.ఎవరైనా బాగా గురక పెడుతుంటే ముందుగా వాళ్ళను తట్టి లేపాలి. అధిక బరువుతోపాటు,మెడ దగ్గర కొవ్వు ఎక్కువ పేరుకోవటం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి గురక వస్తుంది.ముఖ్యంగా బరువును అదుపులో ఉంచితే గురక సమస్య అనేది ఉండదు.లేదంటే నిద్రపోయేటప్పుడు వెల్లకిలా పడుకోకుండా ఒక పక్కకు ఒత్తిగిలి పడుకుంటే గురక అంతగా వినిపించదు.గురకను నివారించడానికి దిండ్లు,మౌత్ గార్డ్ లు ఎన్ని వచ్చినా నిపుణులను సంప్రదించడం మంచిది.   

ఆశ్చర్యానందం!

                                         పుట్టినరోజునాడు,పెళ్ళిరోజునాడు నాకు అసలు గుర్తుండదు.పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత నుండి వాళ్ళు శుభాకాంక్షలు తెలియచేస్తే అప్పుడు గుర్తువస్తుంది.ఈరోజు లాప్ టాప్,ఐపాడ్ తీసి గూగుల్ పేజి రాగానే స్వీట్లు,కేకు,కొవ్వొత్తులు,రవికలముక్క,పసుపు,కుంకుమ,గంధం,పువ్వు,పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ  పంపినట్లుగా వచ్చినాయి.అంతకుముందే పిల్లలు శుభాకాంక్షలు చెప్పారు కనుక నాకోసం కాదుకదా!అయినా నాకు ఎందుకు వస్తుందిలే?ఈరోజు ఎవరి పుట్టినరోజో చూద్దామని చూచేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చేసరికి ఆశ్చర్యం,ఆనందం రెండు ఒకేసారి ముప్పిరిగొనగా భలే!భలే!అని చిన్నపిల్లలా ఆశ్చర్యానందాలతో గెంతులు వేయాలనిపించింది.కాసేపటికి ఆశ్చర్యానందం నుండి తేరుకుని ఆనందోత్సహంతో దాన్ని ఫోటో తీసి గూగుల్ వాళ్ళు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టారొహో!అని అమ్మకు,పిల్లలకు పంపాను.తర్వాత ముఖపుస్తకం తెరవగానే గాలిబుడగలతో పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చింది.చాలా సంతోషం అనిపించింది.ఏదిఏమైనా గూగుల్,ముఖపుస్తకం శుభాకాంక్షలు తెలియచెప్పడం ఈరోజు నాకు గొప్ప మధురానుభూతిని మిగిల్చింది.అందుకే నాబ్లాగ్ ద్వారా ఈవిధంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.                              

Sunday 18 October 2015

ఉప్పు తక్కువ తినాలి

                                                సహజంగా ఆకుకూరలు,కూరగాయలు వండేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది.ప్రాసెస్ చేసిన ఆహరం,గుడ్లు,పాలు,సోయా వంటి వాటిల్లో సహజంగానే సోడియం ఉంటుంది.జంక్ ఫుడ్,చిప్స్ వంటి వాటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక తినకూడదు.ఉప్పు ఎక్కువగా తినడం వల్లఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.పెరుగు అన్నంలో ఉప్పు లేనిదే ముద్ద దిగదు చాలామందికి.త్వరగా రక్తపోటు రావటానికి ఇదొక సాధనం అన్నవిషయం అసలు పట్టించుకోరు.అందుకే పెరుగన్నంలో ఉప్పుసాధ్యమైనంతవరకు మానేయాలి.కూరల్లో కూడా ఉప్పు తక్కువ తినాలి.ఉప్పు వేసిన కొద్దీ కారం,పులుపు,మసాలాలు  అన్నీఒకదాని వెంట ఒకటి వేస్తుంటాము.దాంతో కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే   ఉప్పు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది.

మామిడికాయ కోడికూర

ఎముకల్లేని కోడిమాంసం - 1/2 కిలో 
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను 
మామిడికాయ - 1 చిన్నది
వెల్లుల్లి రెబ్బలు - 4 
పచ్చిమిర్చి - 3
పెరుగు - 1 టేబుల్ స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా 
ఉల్లిపాయలు - రెండు 
పసుపు - టీ స్పూను 
కారం - 2 టీ స్పూన్లు 
జీరాపొడి -1/2 టీ స్పూను  
ధనియాలపొడి - 1/2 టీ స్పూను 
జీలకర్ర - 1 టీ స్పూను 
పంచదార -1/4 టీ స్పూను 
నూనె - 4 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు 
                                   కోడిమాంసం కడిగి నిమ్మరసం,పెరుగు పట్టించి 1/2 గంట నాననివ్వాలి.ఉల్లిపాయలు ముద్దగా చేయాలి.మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసి,వెల్లుల్లి,పచ్చిమిర్చి వేసి మిక్సీలో మెత్తగా చేయాలి.బాండీలో 2 స్పూన్లు నూనె వేసి కాగాక కోడిమాంసం  వేసి మధ్యరకం మంటమీద నీరు ఇగిరేవరకు వేయించి పక్కన పెట్టాలి.మరో బాండీలో మిగిలిన నూనె వేసి జీలకర్ర,కరివేపాకు కొద్దిగా వేసి వేగాక ఉల్లిముద్దని వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ పేస్ట్,పసుపు,జీరాపొడి,ధనియాలపొడి,కారం,పంచదార వేసి 5 ని.లు వేయించాలి.అది వేగాక వేయించిన కోడిమాంసం ఉప్పు,వేసి బాగా కలపాలి.కొద్దిగా నీళ్ళు చిలకరించి మూతపెట్టి 20 ని.లు తక్కువ మంటమీద ఉడికించాలి.పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి.

Saturday 17 October 2015

పొట్టలో గ్యాస్ సమస్య లేకుండా......

                                                            మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకసారి పొట్టలో గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.ఈ సమస్య లేకుండా ఉండాలంటే రెండు స్పూనుల మెంతులను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి తర్వాత రోజు ఉదయం పరగడుపున తినాలి.ఈ విధంగా చేస్తే పొట్టలో గ్యాస్ సమస్యతో పాటు,నోటి దుర్వాసన కూడా  ఉండదు.రక్తంలోగడ్డలు కట్టకుండా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. 

ముద్ద మందారంలా ........

                                                                   ఒక స్పూను కలబంద గుజ్జు,అర స్పూను కీరా రసం,అర స్పూను పెరుగు,ఐదు చుక్కల గులాబీ నీళ్ళు కలిపి ముఖానికి రాయాలి.ఒక పావుగంట ఆరనిచ్చి తర్వాత చన్నీళ్ళతో కడిగితే ముఖం ముద్ద మందారంలా  అందంగా ఉంటుంది.

Friday 16 October 2015

తన దగ్గరే ఉన్న భావన

                                                                                 రామలక్ష్మి కొడుకు,కూతురు చదువు నిమిత్తం విదేశాలలో ఉంటున్నారు.కూతురు వెళ్ళినప్పుడు అంతగా అనిపించలేదు కానీ కొడుకు వెళ్ళినప్పుడు చాలా భాధ పడింది.ఎంత బాధ అంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా శూన్యంలోకి చూస్తున్నట్లు కూర్చునేది.ఒకరోజు స్నేహితురాలు ఫోనులో కూడా సరిగా మాట్లడటంలేదని రామలక్ష్మిని చూచి వెళ్దామని వచ్చింది.కొడుకు చిన్నప్పటి ముంజేతి కంకణం పెట్టుకుని చిక్కిశల్యమై పిలిచినా వినిపించుకోకుండా ఏటో చూస్తుంది.ఏమిటి అలా తయారయ్యావు?పిల్లలు వృద్ధిలోకి రావటమే కదా!మనకు కావలసింది.రోజూ  ఫోనులో మాట్లాడుతూనే ఉంటావు.ఇంత బేలగా తయరయ్యావేమిటి?హుషారుగా ఉండాలి కానీ అనేసరికి బావురుమని ఏడ్చింది.అమ్మాయి వెళ్ళినా అబ్బాయి దగ్గరే ఉన్నాడు కనుక అంత బెంగ అనిపించలేదు.పెద్దాడయినా రోజూ కాసేపు ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తే కానీ వాడికీ,నాకు నిద్ర పట్టేదికాదు.అందుకే వాడు నాదగ్గరే ఉన్నభావన కలగటానికి వాడి చిన్నప్పటి కంకణం వెతికి పెట్టుకున్నాను అని చెప్పింది. 

ఉసిరితో అదుపులో

                                                             రోజుకి ఒక స్పూను ఉసిరికాయ రసం,ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటే అధిక రక్తపోటు,అధిక కొలెస్టరాల్ అదుపులో ఉంటాయి. 

Tuesday 13 October 2015

రోజుకో గ్లాసు వేడినీళ్ళు

                                        ఉదయం లేవగానే చాలామందికి  కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు.అలాకాకుండా పరగడుపున ఒక గ్లాసు వేడినీళ్ళు తాగితే ఎన్నో లాభాలు మన సొంతం. రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది.బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఒక గ్లాసు వెచ్చటి నీళ్ళల్లో ఒక చెక్క నిమ్మరసం కలిపి తాగాలి.తలనొప్పి వస్తే వేడివేడి కాఫీ,టీ తాగితే తగ్గిపోతుంది అనుకుంటాము కానీ వేడినీళ్ళు తాగితే సరి వెంటనే తలనొప్పి మాయమై పోతుంది.రోజుకో గ్లాసు వేడినీళ్ళు తాగితే మొటిమలు మటుమాయం.జుట్టు కూడా ఒత్తుగా,మృదువుగా పెరుగుతుంది. 

ఉత్తమ మార్గం

                                                          మనం రెండు,మూడు పనులు కలిపి ఒకసారి చేస్తే త్వరగా పనులు పూర్తి చేయొచ్చు అనుకుని మొదలుపెడుతుంటాము.దానివల్ల సమయం వృధా తప్ప అనుకున్న సమయంలో పూర్తి చేయగలమో,లేదో అనే ఆందోళనతో అసలు చేయలేము.అందుకని ఉత్తమ మార్గం ఏమిటంటే ఒక పని వేగంగా చేసి దాని తర్వాత ఇంకొక పని చేయటం వల్ల త్వరగా పని పూర్తవుతుంది.

Monday 12 October 2015

భగవంతుని సన్నిధిలో ..........

                                                           రంగారావు గారికి భగవంతుని సన్నిధిలో చనిపోవాలనే ఒక విచిత్రమైన కోరిక ఉండేది.భగవంతుని సంకల్పంతో ఆయన కోరిక తీరింది.అదెలాగంటే భార్యాభర్తలిద్దరూ ఈమధ్య మనుమరాలి మొదటి పుట్టినరోజుకి అమెరికా వెళ్ళి వచ్చారు.వచ్చిన తర్వాత బాబా జీవిత చరిత్ర పారాయణం చేసుకుని ఆఖరి రోజు బాబాని దర్శనం చేసుకుని ఇద్దరూ తిరుపతి వేంకటేశ్వరుని దర్శనార్ధం ఉదయమే బయలుదేరి వెళ్లారు.వెళ్ళిన తర్వాత రంగారావు గారికి తిరుపతి వెళ్ళిన ప్రతిసారి మెట్లెక్కి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుని కొండమీదికి వెళ్ళటం అలవాటు.ఈసారి కూడా అలాగే వెళ్దామంటే భార్య నడవలేనంది.సరే నువ్వు బస్సులో వెళ్ళమని తిరుమలకు బస్సు ఎక్కించి తాను మాత్రం నడిచే వస్తానని చెప్పారు.ఆమె రెండుసార్లు ఫోను చేస్తే మాట్లాడారు కానీ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోను రింగు అవుతుంది కానీ భర్త మాట్లాడక పోయేసరికి కంగారు పడింది.చెయ్యగా చెయ్యగా మెట్లదారిలో కొండపైకి నడిచి వెళ్ళేవాళ్ళు చూచి ఎవరో మెట్ల మీద పడిపోయున్నారు ఫోను అదేపనిగా రింగవుతుందని చూచేసరికే ప్రాణం పోయింది.అదే విషయం ఫోనులో భార్యకు చెప్పారు.ఆమె ఏడ్చుకుంటూ అంత బాధలో ఉండి కూడా ధైర్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని భర్త శవాన్ని తిరుపతి నుండి స్వగ్రామానికి తీసుకొచ్చింది.ఉదయం సంతోషంగా భార్యాభర్తలిద్దరూ వెళ్ళి అర్ధరాత్రికి ఆవిధంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇరుగుపొరుగువారు,బంధువులు కూడా మ్రాన్పడిపోయారు.భగవంతుని సన్నిధిలో చనిపోవాలనే రంగారావుగారి చిరకాల వాంఛ తీరిందనుకోవాలో లేక ఆవిధంగా జరిగినందుకు బాధపడాలో అకస్మాత్తుగా నిద్రలో మేల్కొన్న వాళ్ళకు ఒక్క క్షణం అర్ధంకాలేదు.  

Sunday 11 October 2015

శ్వాసకు ప్రాధాన్యం

                                                                   ఒకసారి గట్టిగా ఛాతీ నిండా గాలి పీల్చుకుంటే వెనువెంటనే మనకు తెలియకుండానే బోలెడంత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.ఎందుకంటే శ్వాస ద్వారా వెళ్ళే ఆక్సిజన్ రక్తంలో కలవటమే
ఇందుకు కారణం.అందుకే శ్వాసకు అంత ప్రాధాన్యం.మనం పనుల హడావిడిలో శ్వాస ఎలా తీసుకుంటున్నామో అసలు పట్టించుకోము.మెడ,భుజం నొప్పి,తరచుగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటే అమ్మో!ఇంకేముంది?మనకు ఏదో జబ్బు వచ్చిందని భయపడుతూ ఉంటాము.కానీ శ్వాస సరిగా తీసుకోక ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల తలెత్తే ఇబ్బందులన్నమాట ఇవి.ఊపిరితిత్తుల్లో గాలి నిండాలంటే వీపు,భుజం,మెడకండరాలు కూడా పనిచేయాల్సి రావటం వల్ల అవి బిగుసుకుపోయి నొప్పులు వస్తుంటాయి.అందుకని ఉదయం లేవగానే,పడుకునే  ముందు,వీలయినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస ఉంచి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటే పై సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. 

Saturday 10 October 2015

భోజనానికి వేళాయెరా

                                                               బాగా ఆకలి వేసిన తర్వాత ఏదో ఒకటి హడావిడిగా భోజనం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి.అజీర్ణం,త్రేన్పులువంటి సమస్యలు వస్తాయి.అలాగే వేళ కాని వేళ మధ్యాహ్నం రెండుగంటలు దాటిన తర్వాత తీరిగ్గా ఒక గంటసేపు తినడం వల్ల మగతగా నిద్ర వస్తున్నట్లు,హుషారుగా లేకుండా బద్దకంగా అనిపిస్తుంది.ఆలస్యంగా ఎక్కువసేపు తినడంవల్ల శక్తి లేనట్లు నీరసంగా ఉండటమే కాక,ఏకాగ్రత లోపించి కుదురుగా ఒకచోట కూర్చోలేనట్లుగా ఉంటుంది.ఏ పని చేయాలని అనిపించదు.మధ్యాహ్నం ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సరైన సమయానికి భోజనం చేయాలి.భోజనానికి వేళాయెరా అన్నట్లు పగలు 12 గం.ల నుండి ఒంటి గంట లోపల భోజనం చేయాలి.రాత్రి 7.30నుండి 8 గం.ల మధ్యలో భోజనం చేయాలన్నమాట.ఒక అరగంట ముందే భోజనం చేసినా ఫరవాలేదు కానీ అరగంట ఆలస్యంగా భోజనంచేయకూడదు. ఒకేసారి ఎక్కువగా తినకూడదు.పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కొద్ది కొద్దిగా మధ్యమధ్యలో పండ్లు,కూరగాయలతో సలాడ్లు తినడంవల్ల బరువు పెరగకుండా ఉంటారు.ఆరోగ్యానికి కూడా మంచిది.ఎన్నిఒత్తిడి పనులన్నా వేళకు భోజనం చేయాలి.కనీసం నిద్రపోవటానికి మూడు గంటల ముందే తినడం మంచిది.భోజనం చేసిన తర్వాత ఇంట్లోనైనా కొద్ది సేపు నడవాలి.

Friday 9 October 2015

రోజులో ఒక్క 10 ని.లు

                                                       మనం నిద్ర పోయేటప్పుడు తప్ప రోజంతా ఫోనులోనో,మామూలుగానో ఎవరో ఒకరితో గలగలా మాట్లాడుతూనే ఉంటాము.అందుకే రోజులో కనీసం ఒక్క 10 ని.లన్నామౌనంగా,ఒంటరిగా కూర్చుని మనల్ని మనం తరచి చూచుకోవటం అలవాటు చేసుకుంటే మన వ్యక్తిత్వం ఏమిటో మనకు తెలుస్తుంది.చేసే పనిలో ఏది మంచి,ఏది చెడు అనేది అర్ధమవుతుంది.తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినే స్వభావం అలవరచుకుంటే సహనం దానంతటదే వస్తుంది.ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

యోగా చేస్తుంటే......

                                                                         యోగా ఎక్కువ సమయం చేసే వాళ్ళు ఓట్స్,అరటి పండు రోజుకొకటి తినడం వల్ల కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి.యోగా చేసే ముందు నానబెట్టిన బాదం పప్పులు, ఎండు ద్రాక్ష ఐదారు చొప్పున తింటే అలసటగా అనిపించదు.

ఒత్తిడిని జయించాలంటే.........

                                                     ఒక్కొక్కసారి పనిభారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికిలోనై విసుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంటుంది.ఒంటరిగా ఉన్నా నిరాశ,నిస్పృహలతో ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది.అటువంటప్పుడు ఒత్తిడిని జయించాలంటే కాసేపు  సరదాగా స్నేహితులతో మాట్లాడాలి.హాయిగా నవ్వుకునే సినిమాలు చూస్తూ నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.కాసేపు పిల్లలతో ఆడుకుంటే వాళ్ళ అల్లరి చేష్టలతో,ఆటపాటలతో మనసు ప్రశాంతంగా అవుతుంది. నచ్చిన పాటలు వింటూ ఒత్తిడిని జయించవచ్చు.ఒక గాజు గిన్నెలో గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి మధ్యలో మనకు నచ్చిన గులాబీలు వేసి  ఒకచోట పెడితే ఆపరిమళం ఇల్లంతా వ్యాపించి ఒత్తిడిని దూరం చేస్తుంది.

Thursday 8 October 2015

ఇంట్లోనే మెరిసేలా.......

                                                                    ఒక రోజు సాకల్య స్నేహితురాలి పుట్టినరోజుకు వెళ్తూ అందరిలో తనే అందంగా కనిపించాలని దారిలో ఉన్న బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది.అప్పటికప్పుడు మెరవాలని సాకల్య బ్లీచ్ చెయ్యమంది.అసలే సుకుమారమైన చర్మం.అక్కడున్న ఆమె ముఖంపై ఏదో రాసి పది ని.ల తర్వాత తుడవగానే బుగ్గలు ఎర్రగా కందిపోయాయి.సాకల్యతోపాటు ఆమె కూడా కంగారు పడిపోయి ఐస్ తెచ్చి గబగబా రుద్దేసరికి కాసేపటికి తగ్గింది.సాకల్యకు కోపం వచ్చి గట్టిగా ఆమెపై అరిచేసరికి సారీ చెప్పి అలా అవుతుందని అనుకోలేదని సంజాయిషీ ఇచ్చింది.డబ్బు ఎదురు ఇచ్చి ఇబ్బందులు పడటం ఎందుకని అప్పటి నుండి సాకల్య ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అమ్మ,అమ్మమ్మ సలహాలతో తనే స్వయంగా ఇంట్లోనే చేసుకోవటం మొదలుపెట్టింది.ఖాళీ సమయంలో వారానికొకసారి టొమాటో ముక్కని ముఖంపై మృదువుగా రుద్ది తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే ముఖం తేటగా,అందంగా మెరుస్తుందని సాకల్య అమ్మమ్మ చెప్పింది.ఒకస్పూను తేనె,ఒకస్పూను నిమ్మరసం తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసి ఒక పది ని.ల తర్వాత కడిగేస్తే అప్పటికప్పుడు ముఖానికి మెరుపు వస్తుందని అమ్మ చెప్పింది.బియ్యప్పిండి,పాలు సరిపడా కలిపి ముఖానికి రాసి 10 ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే ముఖం మృదువుగా,అందంగా తయారవుతుంది.ఇలా సహజంగా ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటే చర్మంపై దద్దుర్లు రాకుండా ఉంటాయి.

Wednesday 7 October 2015

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.......

                                                           ఉదయం ఎనిమిది లోపు అల్పాహారం తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.ఏ పనిమీద ఏకాగ్రత లేనట్లుగా,మగతగా నిద్ర వస్తున్నట్లు ఉంటే ఒక 5 ని.లు ఎండలో తిరిగితే మెదడు  చురుగ్గా పనిచేస్తుంది.              

వీలైనంతవరకూ.......

                                                            మనలో చాలామంది ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చోవటం లేదా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం చేస్తుంటారు.దీనివల్ల కాళ్ళపై ఒత్తిడి పెరుగటమే కాక  ఆ విధంగా కూర్చోవటం వల్ల కాళ్ళల్లో రక్తప్రసరణ తగ్గి ముందుముందు కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడం లేదా పాదాలు వాపు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి.అలా రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కాళ్ళను సాగదీస్తుండాలి.వీలైనంతవరకు పాదాలను నేలకు ఆనించి నిటారుగా కూర్చోవాలి.నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది.రోజూ ఒక ఇరవై నిమిషాలన్నా నడక మంచిది.దీనివల్ల కాళ్ళ కండరాలు,మడమలు ఆరోగ్యంగా ఉంటాయి.

Tuesday 6 October 2015

కాబూలీ కట్లెట్

కాబూలీ శనగలు - 200 గ్రా.
బంగాళదుంపలు - 100 గ్రా.
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - నాలుగు
పన్నీర్ తురుము - కొంచెం
కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - కట్ట
గరం మసాలా - 1 టీ స్పూను
జీరా పొడి - 1 టీ స్పూను
ఉప్పు - సరిపడా
                                               శనగలు నానబెట్టి రుబ్బుకోవాలి.బంగాళదుంపలు ఉడికించి పై పొట్టు తీసి మెత్తగా 
చేయాలి.సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,పన్నీర్ తురుము,కొత్తిమీర,పుదీనా,ఉప్పు అన్నీ బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పల్చని వడల్లాగా చేసి పెనం మీద కొంచెం కొంచెం నూనె వేస్తూ రెండు వైపులా కాల్చాలి.వీటిని ఇష్టమైన సాస్ తో కానీ,పుదీనా చట్నీతో కానీ,పచ్చిమిర్చి అల్లం చట్నీతో కానీ తింటే బాగుంటాయి. 
                                     

Monday 5 October 2015

పాలమీగడ మహత్యం

                                                                           ఇంతకు ముందు రోజుల్లో,ఇప్పుడు కూడా పాలు మీగడ కట్టేలా కాచి పాలు తోడుపెట్టి పెరుగు పైన మీగడ తీసి మజ్జిగ చిలికి వెన్న తీస్తుంటారు.ఇప్పుడు చాలామంది వెన్న,నెయ్యి తినకూడదని పాలపైన మీగడ కట్టని పాలు కొనుక్కుంటున్నారు.ఒకవేళ మీగడ వచ్చినా పడేస్తున్నారు.అలా బయట
పడేయకుండా ముఖానికి,మెడకు,చేతులకు రాసుకుని ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకుని చల్లటి నీళ్ళతో కలిపి మరల ఒకసారి ముఖానికి.మెడకు చేతులకు రాసి గోరువెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.ఈ విధంగా చేస్తే చర్మానికి అదనపు మెరుపుతోపాటు,చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.

పరువు పోతుంది

                                                                                రాహుల్ వయసు నిండా పదేళ్ళు కూడా ఉండవు.పెద్దపెద్ద మాటలు మాట్లడుతుంటాడు.అమ్మ,నానమ్మ వాడికి ఇష్టమైన పదార్ధాలు వండి వేడివేడిగా భోజన సమయానికి ప్రత్యేకించి ఒక అతనితో పాఠశాలకు ఇచ్చి పంపుతుంటారు.వాడేమో స్కూలులో తినకుండా ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం అదే తింటానంటున్నాడు.అదేమిటిరా?ఆ విధంగా తినకూడదు.సాయంత్రం పండ్లు తినాలి.లేదంటే నీకు ఏది ఇష్టమైతే అది తిను అంతే కానీ స్కూలులో తినకుండా ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు?అదీకాక ఎటూ కాని సమయంలో చల్లారిపోయినది తినటం ఏమిటి?అని వాళ్ళ అమ్మ అడిగితే వృధాగా పారేయటం ఎందుకని తింటున్నాను.అయినా  నువ్వుగట్టి గట్టిగా మాట్లాడుతున్నావు.పక్కింటి వాళ్ళకు   వినపడుతుంది.పరువు పోతుంది అన్నాడు రాహుల్.పరువు అంటే ఏమిటో వాడికి అర్ధం తెలిసినట్లు పెద్ద ఆరింద లాగా మాట్లాడుతున్నాడు.          

Saturday 3 October 2015

ఉడుతా ఉడుతా ఊచ్

                                                          చిన్నప్పుడు వార్షిక స్నేహితురాళ్ళతో కలిసి తోటలోకి ఆటలాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఉడుతలు కనిపించగానే పిల్లలందరూ ఉడుతా ఉడుతా ఊచ్!ఎక్కడికెళతా ఊచ్?అంటూ వెంటబడి తరుముతూ పరుగులు పెట్టేవాళ్ళు.మొన్నామధ్య వార్షిక విదేశాలకు వెళ్ళినప్పుడు వరుసకు అన్నయ్య వాళ్ళింటికి ఆహ్వానిస్తే కుటుంబంతో కలిసి వెళ్ళింది.వాళ్ళ తోటలో రకరకాల పండ్ల చెట్లు,పువ్వుల మొక్కలు ఉన్నాయి.వాటికోసం రంగురంగుల పిట్టలు,పక్షులు,ఉడుతలు,నక్కలు అన్నీ వస్తుంటాయి.ఒకరోజు ఉదయం తోటలోకి వెళ్ళినప్పుడు రంగురంగుల పక్షుల కిలకిలారావాలతోపాటు నల్ల ఉడుత,ఎరుపు ఉడుత ఆహారం తింటూ కనిపించినాయి.నల్ల ఉడుత చూడ ముచ్చటగా భలే అందంగా ముద్దుగా చూడటానికి చాలా బాగుంది.వార్షికకు తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి వాటి వెంట కాసేపు సరదాగా పరుగెత్తింది.   

Friday 2 October 2015

బార్లీ నీళ్ళు

                                                  రోజూ రెండు కప్పులు బార్లీ నీళ్ళు తాగితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.చర్మం కాంతివంతంగా ఉంటుంది.గుండె ఆరోగ్యంగా ఉంటుంది.కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది.బరువు తగ్గుతారు.కాకపోతే
ఇక్కడ ఒక చిక్కు ఉంది.అదేమిటంటే గ్లూటెన్ పడని వాళ్ళు బార్లీ నీళ్ళు తాగకూడదు.ఎందుకంటే బార్లీలో గ్లూటెన్ ఉంటుంది.రోజూ ఆరు గ్లాసులకన్నా ఎక్కువ తాగకూడదు.