Sunday, 23 July 2017

ఒళ్ళు విరుచుకోవడం

                                                                ఒకప్పుడు ఎవరైనా ఒళ్ళు విరుచుకోవడం చూస్తే పెద్దవాళ్ళు ఒళ్ళు విరుచుకుంటే దరిద్రం అంటూ చివాట్లు పెట్టేవారు.లేదంటే వాడికి దిష్టి తగిలింది దిష్టి తీయండిరా అనేవాళ్ళు. ఎవరైనా ఏకబిగిన పనిచేసేకన్నా ప్రతి గంటకు ఒకసారి లేచి ఒళ్ళు విరుచుకుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చని ఇప్పుడు పెద్దలు చెబుతున్నారు.ఏది ఏమైనా ఇది మాత్రం నిజం.మీరూ ఒకసారి ప్రయత్నించండి.

Friday, 21 July 2017

వ్యాధుల నివారిణి - పొట్లకాయ

                                                              స్నిగ్ధ కొత్తగా పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెట్టింది.ఇంటి చుట్టూ ఖాళీ స్థలం.దానిలో పద్దతిగా పెంచిన పూలమొక్కలు,కూరగాయలు,ఆకుకూరలు,ఇంకా రకరకాల పండ్ల మొక్కలు చూడటానికి ముచ్చటగా ఉంది.ఇంట్లో అడుగు పెట్టగానే హాయిగా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.రసాయన రహిత కూరగాయలతో చేసిన వంట కనుక భోజనం ఎంతో రుచిగా ఉంది.స్నిగ్ధ అత్తగారు ఒకరోజు స్నిగ్ధను పిలిచి అమ్మాయ్ పెరట్లో ఉన్న పిచ్చిక పొట్లకాయ కోసి తీసుకురా! అంటూ పిలిచారు.ఆవిడ అలా పిలవగానే స్నిగ్ధకు గుండెల్లో రాయి పడినట్లయింది.ఎందుకంటే  చిన్నప్పటి నుండి స్నిగ్ధకు పొట్లకాయ వాసన పడదు.కూర కూడా తినదు.అసలు కాయను కూడా పట్టుకోదు.ఆ విషయం చెప్పలేక ముక్కు మూసుకుని పొట్లకాయ కోసి తెచ్చింది.కోడలు అవస్థ గమనించి నీకు ఇష్టం వుండదా!అని అడగ్గానే ముక్కు మూసుకునే తల అడ్డంగా తిప్పింది.ఆవిడ కోడల్నిప్రక్కన కూచోబెట్టుకుని ఓపిగ్గా అమ్మా!పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్త ప్రసరణ సాఫీగా జరగటమే కాక అనేక వ్యాధుల నివారిణి.వాంతులు,విరేచనాలు,జ్వరం వచ్చినప్పుడు,మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు,మూత్రాశయం పనితీరు మెరుగు పరుస్తుంది.గొంతులోని కఫం తగ్గించి శ్వాసకోశ పనితీరు బాగుండేలా చేస్తుందిఅని పొట్లకాయ గురించి కబుర్లు చెప్పి ఒకసారి రుచి చూడమని పొట్లకాయ,పెసరపప్పు కూర చేసి పెట్టారు.స్నిగ్ధ మొదట అయిష్టంగానే తిన్నాఎంతో రుచిగా వుండేసరికి మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుని తినేసింది.చెపితే తప్ప అది పొట్లకాయ కూర అని తెలియనంత రుచిగా ఉంది.దీనితో బరువు కూడా తగ్గటమే కాక వర్షాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధుల నివారిణి అని తెలియటంతో స్నిగ్ధకు పొట్లకాయ అంటే ఉన్న అయిష్టత తొలగిపోయింది.

Tuesday, 18 July 2017

పంటి నొప్పి

                                                                              ఏ నొప్పి అయినా భరించగలం కానీ పంటి నొప్పి భరించడం చాలా కష్టం.అర్ధరాత్రి,అపరాత్రి నొప్పి వస్తే కష్టం కదా!వైద్యుని దగ్గరకు వెళ్ళేవరకు తాత్కాలికంగా నొప్పి తగ్గాలంటే పచ్చి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ మెత్తగా చేసి నొప్పి ఉన్న పంటిపై కాసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది.

Tuesday, 11 July 2017

చిటికెడు ఉప్పు

          కోడిగుడ్లు,బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు వేసి ఉడికిస్తే పై పొట్టు తేలికగా వచ్చేస్తుంది.

కుండ - నోరు

                                                             మోహనరావు కొడుకు అంతంత మాత్రం తెలివితేటలు కలవాడు.అందుకని వరుసకు మనవరాళ్ళు అయిన ఉమ,సుమ ఇద్దరిలో ఒకరిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు.అసలే మోహనరావుకు మహా డబ్బు పిచ్చి.అందువలన బుద్దిమంతురాలైన ఉమను వదిలేసి డబ్బుతోపాటు మొండితనం జాస్తిగా ఉన్నసుమను ఎంచుకున్నాడు.తన గొయ్యి తనే తవ్వుకున్నట్లు ఇంట్లో అడుగు పెట్టిన నాటినుండి పిచ్చివేషాలు వేయడం మొదలెట్టింది.రోజూ మోహనరావు వడిలో కూర్చున్నట్లు కూర్చుని కోతి గారాలు పోతూ ఖరీదు గల బట్టలు,నగలు,చరవాణి ఒకటేమిటి?బజారులో ఏది క్రొత్తగా వస్తే అది కావాలని కొనకపోతే అలిగి ఇల్లు పీకి పందిరి వేయడం మొదలు పెట్టింది.మోహనరావు కోడలు గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఎక్కడ కొడుకును వదిలేస్తానంటుందోనని కాళ్ళబేరానికి వచ్చి బ్రతిమలాడుతుండేసరికి నెత్తికెక్కి కూర్చుంది.చివరకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినా అలిగి మూతి ముడుచుకుంటుంది.చిన్న వయసు పోనీలే తనే తెలుసుకుంటుందని ఊరుకుంటే అర్ధం చేసుకోవటం లేదు.గోరంత దాన్ని కొండంత చేసి ఊరిలో అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం విన్న మోహనరావు అమ్మకు చిర్రెత్తుకొచ్చింది.కొడుకు దగ్గరకు వెళ్ళి కుండ ముయ్ మూత(మట్టి మూకుడు) ఉంటుంది కానీ నోరు ముయ్య మూత ఏమి ఉంటుంది?ఎవరి నోరు అని ముయ్యగలం?సుమ పిచ్చి వేషాలు వేస్తుంటే కట్టడి చేయాల్సింది పోయి నువ్వు కూడా తానంటే తందాన అని బ్రతిమిలాటలు,వెర్రి వేషాలు ఏమిటి?అంటూ కోప్పడింది.మనవరాలు వరుస కదా!కాస్త అతి చనువుతో అలా చేస్తుంది.అదే తెలుసుకుంటుందిలే!అన్నాడు మోహనరావు.

Thursday, 6 July 2017

కడుపు నొప్పి

                                                                మనం తినే ఆహారం సరిపడక ఒక్కొక్కసారి కడుపు నిండుగా ఉన్నట్లు (ఉబ్బరంగా)అనిపిస్తుంది.తీసుకున్నఆహారం సరిగా జీర్ణం కాక కడుపు నొప్పి వస్తుంది.అటువంటప్పుడు ఒక అర అంగుళం దాల్చిన చెక్క ముక్క,1/2 చెంచ వాము,చిటికెడు ఉప్పు ఒక కప్పు నీటిలో వేసి మరిగించి అ నీటిని వడకట్టి గోరువెచ్చగా త్రాగితే వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది.కడుపు నొప్పిగా ఉన్నప్పుడు(గ్యాస్ నొప్పి)పరగడుపున జీలకర్ర (జీరా)ఒక చెంచా నమిలి ఒక గ్లాసు త్రాగగలిగినంత వేడి నీరు త్రాగాలి.4,5 రోజులు ఈ విధంగా చేస్తే క్రమంగా తగ్గిపోతుంది.

మెంతు ఆకు,మెంతులు

                                                                       రోజువారీ ఆహారంలో మెంతు ఆకు,మెంతులు తీసుకోవడం వలన బరువు తగ్గటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.ప్రతిరోజూ మెంతులు రాత్రి నానబెట్టి పరగడుపున తింటే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు అదుపులో ఉండటమే కాక గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మెంతు ఆకు నూరి తలకు పెట్టుకుంటే వెంట్రుకలు నల్లగా మారడమే కాక రాలిపోకుండా ఉంటాయి.తాజా మెంతు ఆకు నూరి ముఖానికి పూత వేయడం వలన మొటిమలు,ముడతలు రాకుండా ఉంటాయి.బంగాళదుంప,టొమాటోతో కలిపి వండటం వలన రుచితో పాటు శరీరం ఎక్కువ ఇనుమును తీసుకుంటుంది.తేనే,నిమ్మరసం,మెంతు పొడి కలిపి తీసుకుంటే దగ్గు,జ్వరం,గొంతు నొప్పి వంటివి తగ్గుముఖం పడతాయి.ఆరోగ్యవంతులే కాక మధుమేహ వ్యాధి ఉన్నవారు మెంతులు,మెంతు ఆకు రోజూ ఏదోక రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది.ఇవే కాక ఇంక ఎన్నో ఉపయోగాలతో పాటు  చిరుచేదు ఉన్న మెంతు ఆకు,మెంతులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ఫలితాలు మన స్వంతం చేసుకోవచ్చు.ఇడ్లీ,దోసె,చపాతీల్లో,కూరల్లో లేత మెంతు ఆకు వేసుకుంటే వాటికి అదనపు రుచి వస్తుంది.ఎండబెట్టిన మెంతు ఆకు పెరుగు తాలింపు వేసేటప్పుడు వేసి తాలింపు పెడితే కమ్మని వాసనతోపాటు మంచి రుచిగా ఉంటుంది.

Wednesday, 5 July 2017

పప్పుచారు కన్నా కమ్మగా

                                                                 ఉలవలు,కందిపప్పు సమానంగా తీసుకుని దోరగా వేయించి మెత్తగా ఉడికించి ఇష్టమైన కూరగాయ ముక్కలు వేసి కాచిన చారు కమ్మగా మామూలు పప్పుచారు కన్నా ఎంతో  రుచిగా ఉంటుంది.             

Tuesday, 4 July 2017

నిజం నిష్టూరం

                                                                           నిత్య చిన్నప్పటి నుండి అబద్దాన్ని నిజం అనుకునేలా కథ అల్లి తన తోటి పిల్లలకు,స్నేహితులకు వినిపిస్తూ ఉండేది.కథలు అల్లడమే కాక ఇంట్లో వాళ్ళకు కూడా బాగోలేదని అందుకే బడికి రాలేదని చెప్పేది.నిజమే అనుకుని జాలిపడి నోటు పుస్తకాలు ఇంటికి ఇచ్చేవాళ్ళు.ఇప్పుడు మీ అమ్మకో,అమ్మమ్మకో బాగుందా?అని ఎవరైనా అడిగితే బడికి రావటం ఇష్టం లేక అలా ఊరికే చెప్పాను అనేది.ఓర్నీ!నిజమే అనుకుని నేను చదువుకోకుండా పుస్తకం నిత్య ఇంటికి తెసుకుని వెళ్తానంటే  అనవసరంగా ఇచ్చాను అని ఎవరికి వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకుని పుస్తకాలు ఇవ్వడం మానేశారు.అప్పటి నుండి బడిలోనే వ్రాసుకోవడం మొదలు పెట్టింది.నిత్య అబద్దాలకోరు అని తోటి పిల్లలు చెవులు కొరుక్కునే వాళ్ళు.ముప్పై సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉంటున్ననిత్య ఉన్నట్లుండి స్నేహితురాలి చిరునామా కనుక్కుని వచ్చింది.తనకు,కూతురికి ఆరోగ్యం బాగోలేదని,కొడుకు చెప్పినమాట వినటం లేదని తమ్ముళ్ళు తనతో మాట్లాడటం లేదు అంటూ ఏవేవో కబుర్లు చెప్పింది.చిన్నప్పుడు అసలే అబద్దాలకోరు ఇప్పుడు మారిందో లేదో? అలాగే నిజం చెబుతుందో,అబద్దం చెబుతుందో? నమ్మశక్యం కావటం లేదు అనుకుంది నిత్య స్నేహితురాలు.ఒకవేళ నిజమే అయినా పదిహేను ఏళ్ల వరకు నిత్య గురించి పూర్తిగా తెలుసు కనుక నమ్మలేని పరిస్థితి.తర్వాత ఇంకొక స్నేహితురాలి ద్వారా అది నిజమేనని తెలిసింది. స్నేహితురాలికి నిత్య పరిస్థితి తలచుకుంటే చాలా బాధ అనిపించింది.ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాళ్ళు నిజం చెప్పినా ఎవరూ నమ్మలేరు.అబద్దం చెప్పి తాత్కాలికంగా పబ్బం గడిచిపోయిందని సంతోషపడే కన్నా నిజం నిష్టూరంగా అనిపించినా వినటానికి కష్టంగా ఉన్నానిజమే మాట్లాడాలి.

Sunday, 2 July 2017

కోతి చేష్టలు

                                         సీతమ్మకు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు.కూతురికి అరవై సంవత్సరాలు.ఇప్పటికీ అంత వయసు వచ్చినా కూతుర్ని వెంట పెట్టుకుని కోతి - పిల్లను పొట్టకు వేలాడేసుకుని తిరిగినట్లు ఎక్కడకు వెళ్ళినా వెంటేసుకుని తిరుగుతుంది.కొడుకుల ఇళ్ళకు వెళ్ళి పదేసి రోజులుండి ఇద్దరూ ప్రక్కప్రక్కన కూర్చుని కోడళ్ళను అది తినబుద్ది అవుతుంది ఇది తినాలనిపిస్తుంది అంటూ పెత్తనం చెలాయించి ఒకదాని వెంట ఒకటి వండించుకుని తింటూ పది రోజులు వస్తే ఎవడి కోసం వండి పెడుతుంది అంటూ తిన్నది అరిగే వరకు తల్లీకూతుళ్ళు విమర్శిస్తూ ఉంటారు.కోడళ్ళు మర్యాద కోసం నాలుగు రోజులు చాకిరీ చేసి తర్వాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ చేసి పెడుతూ ఉంటారు.కోతి పిల్లను మోసుకుని వచ్చినట్లు తను వచ్చేది కాక కూతుర్ని తీసుకుని ఇళ్ళ ఈరమ్మ మాదిరిగా తిరగటం జబర్దస్తీగా చేయించుకుని తినడం ఎంత వరకు సమంజసం.ప్రేమతో అడిగితే ఇష్టంగా వండి పెడితే తిన్నది అరుగుతుంది అంతేకానీ కష్టంగా ఇష్టం లేకుండా చేసి పెడితే తిన్నది అరగక తల్లీకూతుళ్ళ మాదిరిగా కోతి చేష్టలు చేసి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటారు.