Thursday 28 September 2017

నేనంటే నేను

                                                         రాణి,వాణి చిన్ననాటి స్నేహితులు.పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు.ఇద్దరూ చదువుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళటం,తర్వాత పెళ్ళి,పిల్లలు ఎవరికి వారు పాతిక సంవత్సరాల వరకు కలుసుకోలేకపోయారు.అనుకోకుండా ఒక పెళ్ళిలో రాణికి వీళ్ళతోపాటు కలిసి చదువుకున్న ఇంకొక స్నేహితురాలు కలిసింది.వాణి ప్రస్తావన వచ్చి తనను చూచి చాలా రోజులైంది.ఇప్పుడు ఎలా ఉందో?చిన్నప్పుడు అందరినీ ఆట పట్టించేది అనగానే ఇప్పుడు కూడా అంతేనని వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉంటారని చరవాణి నంబరు ఇచ్చింది.రాణి ఫోను చేయగానే వాణి ఎంతో సంతోషంగా మాట్లాడి తన ఇంటికి రమ్మని చెప్పింది.రాణి వెళ్ళగానే ఇద్దరు ఆడవాళ్ళు ఎదురుగా వచ్చి రండి రండి  అంటూ ఆహ్వానించి నన్ను గుర్తుపట్టావా?నేనే వాణి అని నేనంటే నేను అంటూ మా ఇద్దరిలో వాణి ఎవరో చెప్పాలి అంటూ వెంటపడ్డారు.మధ్యలో వీళ్ళ గొడవ ఏమిటి?అనుకుంటూ మీ ఇద్దరూ కాదు అంటూ ముందుకు వెళ్ళింది రాణి. చిన్నప్పటిలానే వాణి ఆట పట్టించడానికి గోడ వెనుక నక్కి చూస్తుంది.ఇంతలో ఇంకొక ఆమె ఇదుగో వాణి అంటూ వాణిని తీసుకొచ్చింది.దీనికి చిన్నప్పటి చిలిపి చేష్టలు ఇంకా పోలేదు అనుకుంటూ ఉండగానే వాణి నేను ఎంతో కష్టపడి నిన్నటి నుండి వీళ్ళకు తర్ఫీదు ఇచ్చి కాసేపు నిన్ను ఆట పట్టించమంటే నువ్వు  మీరు ఇద్దరూ కాదు అంటూ నిమిషంలో తేల్చేశావు నువ్వు ఏమీ మారలేదు అంది.వయసు రీత్యా కాస్త బరువు పెరగడం తప్ప బుద్దులు ఏమీ మారలేదు అనుకున్నారు.అంతే కదా!పుట్టినప్పటి బుద్దులు పుడకతో పోవాల్సిందే!ఎక్కడో ఒకళ్ళు తప్ప అని ఒకరికొకరు నవ్వుకుంటూ చిన్ననాటి కబుర్లు ముచ్చట్లు చెప్పుకున్నారు.

Sunday 17 September 2017

వామాకు

                                                                                         చిన్నప్పటి నుండి చూడచక్కగా,అందంగా ఉండే వామాకు అంటే బజ్జీలు వేసుకుంటారని అవి తినటానికి ఎంతో రుచిగా ఉంటాయని మాత్రమే తెలుసు.వామాకు వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఈమధ్యనే పెదమ్మ కూతురు అక్క ద్వారా తెలిసింది.ఇంటికి రాగానే ఎదురుగా  కుండీలో నిండుగా వామాకు నిగనిగలాడుతూ పచ్చిదే తిలానని అనిపించేలా ఉంది.అక్క ఇంటికి వస్తూనే వామాకుని రోజూ వాడుకోవా ఏమిటి?అంది.రోజూ వామాకు బజ్జీలు ఏమి తింటాము?అనగానే అక్క భలేదానివే!దీన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంది.నేరుగా పచ్చి ఆకు తింటే పైత్యం ఉండదు. నేను ఆకుల్ని సన్నగా ముక్కలు కోసి,ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి దోసె పిండిలో కలిపి అట్లు వేస్తాను.ఎంత రుచిగా బాగుంటాయో!అంటూ మాట్లాడుతూనే ఒక ఆకు గిల్లి నోట్లో వేసుకుని పరపరా నమిలేస్తూ చెప్పింది.అంతే కాదు కారట్,వామాకు,కొద్దిగా నీళ్ళు కలిపి మిక్సీ లో వేసి రసం తీసి వడకట్టి తాగితే కంటి చూపు మెరుగు పడుతుందని,కారట్,పాలకూర,వామాకు,కొంచెం నీళ్ళు కలిపి రసం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని,కారట్,దానిమ్మ,వామాకు,కొద్దిగా నీరు  కలిపి రసం తీసుకుని తాగితే నరాల బలహీనత తగ్గుతుందని,ఇలా ఒక కూరగాయ,ఒక పండు,ఆకుకూర,వామాకు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చాంతాడంత చిట్టా చెప్పింది.అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది బరువు అదుపులో ఉండటంతో ఏ వ్యాధులు రాకుండా శారీరకంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని,శరీర సౌందర్యం కూడా పెరుగుతుందని అక్క చెప్పింది.కొమ్మ విరిచి గుచ్చినా వామాకు  మొక్క వస్తుంది.కుండీలో తేలికగా పెంచుకోవచ్చు.పైగా దీని వాసనకు దోమలు కూడా పారిపోతాయని అక్క చెప్పింది.

Friday 8 September 2017

మిడి మిడి జ్ఞానం

                                                              ఈరోజుల్లో చాలామంది ఎవరికి వారే మాకే అంతా తెలుసు. మేమే గొప్ప.మమ్మల్ని మించిన వారు ఈప్రపంచంలోనే ఎవరూ లేరు అనే అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.స్వార్ధం,అహం పాళ్ళు కూడా ఎక్కువై తమకు తామే బరువుగా తయారు అవుతామని తెలుసుకోవటం లేదు.ముందుగా ఎదుటివాళ్ళు నన్నే పలకరించాలనే అహం.ఒకవేళ తెలిసినవాళ్ళో,బంధువులో మాట్లాడాలని చూచినా చూడనట్లు నటించడం ఎవరైనా అవసరంలోనో,ఆపదలోనో ఉంటే ఇంతకు ముందు వారి సహాయం పొందిఉన్నా కూడా తప్పించుకోవడం ఇలా ఎదుటివారి నుండి ఏదైనా అందుకోవడమే తప్ప అందించడం చేతకాని వారు చివరకు ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎదురవుతుందని ఊహించరు.వీళ్ళు బయట మాత్రమే ఇలా ఉంటారనుకోవడానికి లేదు.అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ దగ్గర కూడా స్వార్ధం.తోడబుట్టిన వాళ్ళను కూడా ఏమార్చి వాళ్ళ ఆస్తులు అన్యాయంగా కొట్టేసి తన భార్య,తన పిల్లలు తాను మాత్రమే పైకి రావాలనే విపరీత మనస్తత్వం.పోనీ ఇన్ని అక్రమాలు చేసినా ప్రశాంతంగా తనవాళ్ళతో బ్రతుకుతున్నారా!అంటే అదీ లేదు.వాళ్ళతోనే ఛీ కొట్టించుకోవడం మామూలే.శాశ్వతంగా ఈ భూమి మీద బ్రతుకుతారా!అంటే అది సాధ్యం కాదు.దీనివల్ల ఎదుటివాళ్ళు కొంత నష్టపోతారేమో?అంతేకానీ చివరకు వాళ్ళే ఎక్కువ నష్టపోతామని అనుకోరు. మనసులోను,చివరకు తమ చుట్టూ కూడా ఎవరూ లేని ఒంటరి బ్రతుకు బ్రతకాల్సి వస్తుందని కలలో కూడా ఊహించరు.వాళ్ళు సంతోషంగా ఉండరు.ఎదుటివాళ్ళు సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు.మనం సంతోషంగా ఉండాలి.మన చుట్టూ ఉన్నవాళ్ళను సంతోషంగా ఉండేలా చేయాలి.అప్పుడే మనకు మనశ్శాంతి అని జ్ఞానోదయం చేద్దామని ఎవరైనా అనుకున్నా నువ్వు చెప్పేదేమిటి?నాకు తెలుసు అనే అహం.ఇన్ని తెలిసినా స్వార్ధం,అహం,భేషజాలు వదులుకోలేకపోవడం దురదృష్టకరం.ఈ అహం,స్వార్ధం,భేషజం అనే  అజ్ఞానం నుండి బయటపడి ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు వాళ్ళతోపాటు అందరికీ సంతోషం.

Saturday 2 September 2017

విజయం మనదే

                                                                           మనల్ని మనం నమ్మి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే
అనుకున్నది సాధించగలం.ఏపని అయినా పూర్తి సామర్థ్యంతో ఇష్టంగా కష్టపడి పని చేయాలి.కాస్త పైకి రాగానే ఏదో సాధించామని తోటి మనుషులను లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మన విలువను కోల్పోకూడదు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలన్నట్లు  మన చుట్టూ ఉన్నవాళ్ళతో ప్రేమగా ఉంటూనే ఎదుటివాళ్ళను ఎవరి పరిధిలో వాళ్ళను ఉంచాలి. కుట్రలు,కుతంత్రాలు చేయకుండా సరికొత్త సాంకేతికతతో నీతి,నిజాయితీతో కష్టించి పనిచేసే ప్రతిభావంతులను మాత్రమే ఎంచుకోవాలి.ఎప్పుడూ కూడా బంధుప్రీతికి లేశమైనా చోటివ్వకూడదు.ఖచ్చితమైన నియమ నిబంధనలు,సమయపాలన పాటిస్తూనే నొప్పింపక తానొవ్వక అన్న చందాన ఒక క్రమ పద్దతిలో మనం ఎదురుగా ఉన్నాలేకపోయినా క్రమశిక్షణతో చకచకా  పనులు జరిగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.ఈవిధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు అడుగు వేస్తే విజయం మనదే.