Sunday 31 December 2017

నూతన అంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

                                                      నా బ్లాగ్ వీక్షకులకు,తోటిబ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.2018 వ సంవత్సరంలో అందరూ ఆనందంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
 

Saturday 23 December 2017

క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం

                                                                        క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు అనే సామెతను గుర్తు చేసుకోవడానికి అన్నట్లు త్రిపుర ఒక్క క్షణం కూడా ఖాళీగా లేకుండా ఎదో ఒక పని చేస్తూనే ఉండేది.అమ్మా త్రిపురా!ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నువ్వు గుర్తొచ్చి చూచి పోదామని వచ్చాము అంటూ బంధువులు ఒక కుటుంబం తర్వాత ఇంకొక కుటుంబం ఉదయం నుండి రాత్రి వరకు వస్తూనే ఉంటే వారికి వండి వార్చి పెట్టడమే సరిపోయేది.వయసులో ఉన్నప్పుడు సరదాగా బొంగరంలా తిరుగుతూ హడావిడిగా పనులు చేస్తూ,పనివాళ్ళతో చేయిస్తూ సంతోషంగానే ఉండేది.వయసు పెరుగుతున్న కొద్దీ విసుగ్గా గానుగెద్దు జీవితంలా అనిపించడం మొదలు పెట్టింది.అనిపించగానే త్రిపుర వెనక్కు తిరిగి చూస్తే ఏముంది?ఖర్చు,చాకిరీ తప్ప క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం లేని జీవితం వెక్కిరిస్తున్నట్లు తోచింది.తిని వెళ్ళిన వాళ్ళే గుర్తు లేనట్లు నటిస్తుంటే తనంటే ప్రేమతో కాదు స్వార్ధంతో ఇంటికి వచ్చేవారని తెలుసుకునేసరికి సగం జీవితం కరిగిపోయింది.వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో వచ్చినా ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాదగా భోజనం పెట్టడం మన సంప్రదాయం,సంస్కారం కనుక త్రిపురకు ఇంటి ఇల్లాలిగా తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చానన్న సంతృప్తి మిగిలింది. 

రోజుకొకసారి.....

                                               చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం నునుపుదనం కోల్పోయి పొడిబారుతూ ఉంటుంది.ఈ విధంగా చర్మం పొడిబారకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా చలి బాగా పెరగక ముందే ఒక గిన్నెలో ఒక అర కప్పు లేత కలబంద గుజ్జు,ఒక కప్పు నీళ్ళు,ఒక చెంచా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె బాగా కలిపి ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి.దీన్నికొంచెం చేతిలో వేసుకుని రోజుకొకసారి ముఖానికి,మెడకు చేతులకు,పాదాలకు పలుచగా రాసుకుని ఒక పది ని.ల తర్వాత రుద్ది కడగాలి.రోజుకొకసారి ఇలా చేయడం వలన చర్మం గరుకుగా లేకుండా నునుపుగా తయారవుతుంది.