Tuesday 31 December 2019

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

                                     నా బ్లాగ్ వీక్షకులకు, తోటి బ్లాగర్లకు,మిత్రులకు,  శ్రేయోభిలాషులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.ఇంకొద్ది నిమిషాలలో మనందరికీ ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను వదిలిపెట్టి,మరెన్నో పాఠాలను నేర్పి వెళ్తున్న పాత  సంవత్సరానికి  వీడ్కోలు పలుకుతూ మరింత ఆనందోత్సాహలతో,పిల్లలు,పెద్దలు కేరింతలతో నూతన  సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా కొంగ్రొత్త ఆశలు,ఆశయాలు అనుకున్నవన్నీ నెరవేరాలని,అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు,సకల భోగభాగ్యాలు,ధన కనక వస్తు వాహనాలు అమరాలని మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను. 





Sunday 22 December 2019

ఏమాంచి

                                                             శివ కు పెళ్ళయిన చాలా సంవత్సరాలకు అమ్మాయి పుట్టింది.ఎంతో ముచ్చటపడి శివ,భార్య,చెల్లెలు ఆ పాపకు హేమాన్షి అని పేరు పెట్టారు.ఒక రోజు శివ బాబాయి మనవరాలిని చూడడానికి ఊరు నుండి వచ్చాడు.పాప ముద్దుగా ఉందని ఎత్తుకుని మురిసిపోతూ పేరు ఏమి పెట్టారు అని అడిగాడు.హేమాన్షి అని చెప్పగానే మంచి పేరు బాగుంది అంటూనే ఏమాంచి,ఏమాంచి అంటూ బిగ్గరగా పిలిచాడు.అక్కడే ఉన్న శివ చెల్లెలు,భార్య తెల్లబోయారు.ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూచుకుని శివ చెల్లెలు ఏడుపు ముఖంతో అదేంటి బాబాయ్? అంత మంచి పేరుని అలా ఖూనీ చేసేశావు అన్నది.సరిగా నేర్చుకుందామని అనుకోకుండా మొండిగా మరి ఏమి చెయ్యమంటావు? నాకు అసలు నోరు తిరగకుండా మీరు పేరు పెట్టారు.అందుకే నేను ఏమాంచి అనే పిలుత్తాను అన్నాడు.పెద్దాయన కదా!ఇంక ఎవరూ ఏమీ మాట్లాడలేదు.అదండీ సంగతి.కామంచి అన్నట్లు హేమాన్షి పేరు  సరిగా పలకడం రాక అలా రూపాంతరం చెంది ఏమాంచి అని స్థిరపడిపోయింది.