Tuesday 29 September 2020

నలకువ

                                      కౌముది ఇంట్లో సత్యవతి పని చేస్తుంటుంది.వయసు రీత్యా పెద్దది కావడంతో సత్యవతి మంచి చెడు సలహాలు ఇస్తూ ఉంటుంది.ఒక రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా రేపు త్వరగా వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళు.నేను బంధువుల ఇంటికి పలకరించడానికి వెళ్ళాలి.మొన్న ఒకాయన కాలం చేశారు కదా అనగానే అమ్మా! రేపు ఆదివారం,ఎల్లుండి సోమవారం,ఆ తర్వాత మంగళ వారం కనుక అటువంటి చోటుకు వెళ్ళకూడదు అని ఖరా ఖండిగా చెప్పి బుధ వారం వెళ్లి రండి  అని సలహా చెప్పింది.అవునా!మంగళ వారం,శుక్ర వారం వెళ్ళకూడదు అంటారు అని తెలుసు కానీ మిగతా రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు? అంది కౌముది.మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళకూడదు.అలా వెళ్తే ' నలకువ ' అని చెప్పారు అంది.నలకువ అంటే అర్ధం ఏమిటి? అంటే ఏమో అమ్మా! నాకూ తెలియదు.వెళ్ళడం మంచిది కాదు అని అనుకుంటున్నాను అంతే అంది.సత్యవతికి అంతకు మించి ఏమీ తెలియదు కనుక ఒక్క మాట కూడా మాట్లాడదు.నలకువ అంటే అర్ధం ఏమిటో ? అని సందేహం మనసుని తొలిచేస్తున్నా మెళుకువ కి వ్యతిరేకార్ధం నలకువ అనేమో అని ఊహించుకుని కౌముది అంతటితో ఆ చర్చా కార్యక్రమం ముగించింది.  

Monday 28 September 2020

కారపు వెన్న ఉండలు

 కొద్ధిగా కరిగించిన వెన్న  - 4 చెంచాలు 

పొడి బియ్యపు పిండి - 1 కప్పు 

మినప గుళ్ళు  - 2 చెంచాలు

కొబ్బరి తురుము - 1 పెద్ద చెంచా 

నువ్వులు - 1 పెద్ద చెంచా 

ఉప్పు - రుచికి సరిపడా 

పచ్చి కారం - 1/2 చెంచా 

నూనె - వేయించడానికి సరిపడా 

                                                   పొయ్యి వెలిగించి మందపాటి బాండీలో బియ్యప్పిండి వేసి వేయించుకోవాలి.మినప గుళ్ళు వేయించి పొడి చేసుకుని ఈ రెండు కలిపి ఒకసారి జల్లించుకోవాలి.నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి అన్నిటిని కలిపి అవసరమైనన్ని నీళ్ళు పోసి గట్టిగా ముద్ద చేయాలి.దీనిని పది ని.లు నాననిచ్చి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి.బాండీలో నూనె పోసి వేడెక్కాక కొన్ని కొన్ని వేసుకుని బంగారు గోధుమ వర్ణం లో వేయించి తీయాలి.కరకలాడే రుచికరమైన కారపు వెన్న ఉండలు తయారైనట్లే.

 చిట్టి చిట్కా : వెన్న పూస కొద్దిగా కరిగించి పిండిలో కలపాలి.లేదంటే ఒక్కొక్కసారి వెన్న ఉండలు నూనెలో పగిలిపోతాయి.నాకు ఒకసారి అలాగే జరిగింది.అప్పటి నుండి వెన్న కొద్దిగా కరిగించి కలపడం వలన వెన్న ఉండలు చక్కగా పగలకుండా వస్తున్నాయి.

నూనె,తీపి లేని కాకరకాయ కారం

                                                         ఒక కిలో తాజా కాకరకాయలు తీసుకుని ఉప్పు,పసుపు వేసి శుభ్రంగా కడిగి చక్రాల్లా ముక్కలు కోసి గల గలలాడేలా ఎండలో పెట్టాలి.నేను ఒక 8 గంటలు డీహైడ్రేటర్(పండ్లు,ఆకుకూరలు,కూరగాయల లోని తేమ లాగేసి ఎండి పోయేలా  చేసే పరికరం) లో పెట్టాను.ఏ కూరగాయ పెట్టినా ఒక కిలోకి 200 గ్రా. లు వస్తాయి. 

తయారీ విధానం :

ఎండిన కాకరకాయ ముక్కలు - 200 గ్రా. 

ఎండు మిర్చి - 15 

నువ్వులు - 1 పెద్ద చెంచా 

మినప గుళ్ళు - 1 పెద్ద చెంచా 

పచ్చి శనగ పప్పు - 1 పెద్ద చెంచా 

ధనియాలు - ఒక పెద్ద చెంచా

జీరా - ఒక పెద్ద చెంచా 

మెంతులు  - ఒక 1/4 చెంచా 

వెల్లుల్లి - 1 పెద్దది

ఉప్పు - రుచికి సరిపడా 

                                                          పొయ్యి వెలిగించి మందపాటి బాణాలి పెట్టి వెల్లుల్లి తప్ప అన్నీ నూనె లేకుండా తక్కువ మంటపై రంగు వచ్చే వరకు విడివిడిగా వేయించుకోవాలి.కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పప్పులు,ధనియాలు,జీరా,మెంతులు వేసి పొడి చేసిన తర్వాత ఎండు మిర్చి వేసి పొడి చేసిన తర్వాత నువ్వులు వెయ్యాలి.ఈ పొడిని ఒక పళ్ళెంలో వేసి ప్రక్కన పెట్టుకోవాలి.కాకరకాయ ముక్కలు,ఉప్పు వేసి  పొడి  చేసి వెల్లుల్లి రెబ్బలు వెయ్యాలి.దీనిలోప్రక్కన పెట్టుకున్న పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వెయ్యాలి.అంతే మంచి సువాసనతో నోరూరించే నూనె,తీపి లేకుండా చేసే కాకరకాయ పొడి తయారయినట్లే.దీనిని వేడి వేడి అన్నంలో కానీ,ఇడ్లి,దోసె పై కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.అసలు చేదు ఉండదు.ఇది నేను తయారు చేసే పద్ధతి.నువ్వుల బదులు పల్లీలు లేదా రెండు కూడా వేసుకోవచ్చు.ఎవరికి నచ్చిన రీతిలో వారు చేసుకోవచ్చు.ఒకసారి ప్రయత్నించి చూడండి. 

గమనిక :చింత పండు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.నేను వెయ్యలేదు.అయినా చేదు లేకుండా  చాలా బాగుంది.కాకరకాయ కారం రుచికి రుచి ఆరోగ్యానికి ఎంతో మంచిది.రోజూ ఒక చెంచా అయినా తినడం మంచిది.

Thursday 10 September 2020

తగిన గుణపాఠం

                                                     మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఒకరోజు హిమ పని వత్తిడిలో ఉండగా పొరుగింటి నుండి పెద్ద పెద్ద కేకలు వినిపించగా ఏమి జరిగిందోనని అటు చూడగా అక్కడ ఒక పెద్దావిడ నిలబడి కంగారుగా ఏదో చెప్తుంది.ఇంటావిడ అదేమీ వినిపించుకోకుండా అసలు  నువ్వు మెట్లు ఎక్కి పైకి రావడమేమిటి ? వెళ్ళిపొమ్మని కేకలు వేయడం మొదలెట్టింది.తర్వాత పది ని.లకు హిమ ఇంటి గంట మ్రోగింది.హిమ భర్త వెళ్ళగా ఒక పెద్దావిడ వాళ్ళాయన కళ్ళు తిరిగి పడిపోయాడని ఆసుపత్రిలో కూతుర్ని ఉంచి వచ్చానని ఏదైనా సహాయం చెయ్యమని అడిగింది.ఒక వంద రూపాయలు ఇచ్చి పంపించు అని చెప్తే హిమ ఇచ్చి వచ్చింది.హిమ ఇంటి పై అంతస్తుల్లో ఉన్న ఇళ్ళకు వెళ్ళవద్దు.పైకి వెళ్ళకూడదు అని చెప్పినా వినకుండా డబ్బు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అడిగితే పోయేదేముంది అంటూ  వాళ్ళను కూడా అడుగుతాను అంటూ ఆయాసపడుతూ పైకి వెళ్ళింది.హిమ పనిమనిషి రోజాకు రోజూ వేడివేడిగా అన్నం కూరలు ఇచ్చే అలవాటు.ఆరోజు కూరలు ఇచ్చింది కానీ అన్నం పెట్టి ఇద్దామనుకునేలోపు ఏదో చిరునామా కోసం చరవాణికి భర్త ఫోను చెయ్యడంతో ఆ విషయం మర్చిపోయింది.రోజా వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పింది కానీ హిమకు గుర్తులేదు.భర్త ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేద్దామని చూచినప్పుడు అయ్యో రోజాకి ఈరోజు అన్నం పెట్టడం మర్చిపోయాను అని నొచ్చుకుని కొడుకును పంపమని ఫోను చేస్తే ఫోను కలవలేదు.సరే సమయానికి పెద్దావిడ వచ్చింది కదా!అని భోజనం ఇవ్వనా?అని అడిగితే సంతోషంగా తీసుకెళ్ళి ముసలాయనకు పెడతానని చెప్పడంతో అన్నీ  చక్కగా డబ్బాలో సర్ది ఇంట్లో రెండు రకాల పండ్లు ఉంటే అవి కూడా ఒక సంచిలో సర్ది ఇచ్చింది.మీ ఋణం ఎలా తీర్చుకోవాలి ? అంటూనే అద్దె ఇల్లా ?స్వంత ఇల్లా ?అద్దె ఎంత ? ప్రశ్న,సమాధానం కూడా తనే చెప్పుకుని 10,20,30 వేలా తనలో తనే అమ్మో అంత డబ్బు కట్టగల్గుతున్నారా? ?అని  ఆరాలు మొదలెట్టింది.ఆపదలో ఉన్నానంటే తలా ఒక వంద ఇచ్చిన డబ్బులు,ఒక పూట భోజనము చేతిలో కనపడేసరికి ఉబ్బితబ్బిబ్బై ఎవరితో ఏమి మాట్లాడుతుందో కూడా తెలియకుండా మాట్లాడేసరికి అంతకు ముందు ఆమె తీరుకు ఇప్పటి మాట తీరుకు హిమ ఆశ్చర్యపోయింది.ఇంతలోనే ఎంత మార్పు అని మదిలో అనుకుని హిమ ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం పెట్టి వెళ్ళమని సైగ చేసి తలుపు వేసి లోపలకు వచ్చింది.చిన్నబోయిన మోముతో లోపలకు వచ్చిన హిమను ఏమి జరిగిందని భర్త అడిగితే విషయం చెప్పగానే కనపడిన వాళ్ళందరిని చూచి జాలిపడితే ఇలాగే ఉంటుంది.ఏదో డబ్బు సహాయం చేశావు.ఊరుకోకుండా పిలిచి వేడివేడిగా భోజనం ఇచ్చినందుకు తగిన గుణపాఠం చెప్పింది.భవిష్యత్తులో ఇటువంటి పనులు చెయ్యకూడదని గుర్తుపెట్టుకోదగిన అనుభవం ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి అన్నారు. 

Saturday 5 September 2020

నమస్సుమాంజలి

                                                  గురువు అంటే జ్ఞానాన్ని పంచేవారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారే కాకుండా మానవతా విలువలు,లోకం పోకడ,మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పే ప్రతి ఒక్కరూ గురువులే.పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లి.తర్వాత తండ్రి.తర్వాత పెద్దలు,మిగిలినవారు.పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు వచ్చేటప్పటికి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులది.మంచి పౌరులుగా తయారవడానికి మన వెనుక ఇంతమంది కృషి ఉండబట్టే మనం సమాజంలో మనగలుగుతున్నాము.అది గుర్తు పెట్టుకుని మనం ఈ ఒక్కరోజే అని కాకుండా ప్రతి రోజు జీవితంలో వీళ్ళందరినీ మరువకూడదు.గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్  పర బ్రహ్మ తస్త్మై శ్రీ గురవే నమః అంటూ గురు పూజోత్సవం సందర్భంగా నాకు మంచి బుద్ధులు నేర్పించిన నా తల్లిదండ్రులకు,పెద్దలకు, విద్యను నేర్పిన ఉపాద్యాయులకు,ఆధ్యాత్మిక విలువలను నేర్పే  గురువులకు నమస్సుమాంజలి.నా బ్లాగ్ వీక్షకుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.