Friday 20 November 2020

అనుభూతుల సమ్మేళనం

                                                                    మొన్నామధ్య ఒక పెద్దాయన కలిసినప్పుడు మాటల సందర్భంలో ఏమిటర్రా!ఇలా యంత్రాల్లా తయారయిపోతున్నారు.ఎంతసేపూ ప్రక్కన మనిషి ఉన్నా పట్టించుకోకుండా చరవాణి చూడడమో,బుల్లి తెర లో వచ్చే ధారావాహిక చూస్తూ దానిలో నటించే వాళ్ళు నవ్వితే  నవ్వడం,ఏడిస్తే మీరు ఏడవడం తప్ప నిజంగా ఏడుపు వస్తే ఏడవలేరు.నవ్వు వస్తే నవ్వలేరు.ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయం.యాంత్రికంగా జీవితం గడిపేస్తున్నార్రా! మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా.జీవితం అంటే మనకోసం మనం సంతోషంగా బ్రతకాలి.ఇరుగు పొరుగుతోనూ,నలుగురితో కలిసి మెలసి ఉండాలి.ఎవరికి ఏ ఆపద వచ్చినా సాధ్యమైనంత వరకు మాటసాయం కానీ ఆర్ధికంగా కానీ  సహాయం చేయాలి.చేయలేకపోతే చేసేవాళ్ళకు సమాచారం చెప్పాలి.ఇంతెందుకు?ఇంట్లో సభ్యులు అందరూ ఒకచోట కూర్చుని ఏనాడైనా  కబుర్లు చెప్పుకున్నారా ? అందరూ ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కదరా! మనసు విప్పి కబుర్లు చెప్పుకుని హాయిగా నవ్వుకుంటుంటే బంధాలు బలపడడమేకాక మానసికంగా మాటల్లో  చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది.ఆ అనుభూతి కలగాలంటే మీకు కొంచెం సమయం పడుతుందిలే .ప్రయత్నిస్తే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు.ఇప్పటి నుండి అయినా ఈ యాంత్రిక జీవనానికి స్వస్తి పలికి ప్రకృతికి దగ్గరగా ఉండండి.జీవితం అంటే యాంత్రికం కాదు.అది ఒక అనుభూతుల సమ్మేళనం అని గుర్తించండి.ప్రతి చిన్న విషయాన్నీ మనసుతో ఆస్వాదిస్తూ,మమతతో ఉంటూ చిన్ననాడు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏ  అనారోగ్యాలు దరిచేరవు.ఇప్పటి నుండి మనకెందుకులే అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనండి.మానసికంగా శారీరకంగా చక్కటి ఆరోగ్యం స్వంతమవుతుంది.   

Saturday 14 November 2020

దివ్య కాంతుల దీపావళి

                                                పిల్లలు,పెద్దలు ఎంతగానో ఎదురు చూస్తున్న దివ్య కాంతుల దీపావళి రానే వచ్చేసింది. నేటి నుండి అయినా ఇప్పటి వరకు ఉన్న చీకట్లు అన్నీ పూర్తిగా తొలగిపోయి అందరి జీవితాల్లో శ్రీ మహాలక్ష్మి వెలుగులు నింపాలని,అందరూ సుఖ సంతోషాలతో,సకల  సిరిసంపదలతో,శారీరకంగా మానసికంగా ఉరుకులు పరుగులు లేని    ప్రశాంత జీవన విధానంతో ,  సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ  నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ఏదేశంలో స్థిరపడినా మన మూలాలు మర్చిపోకుండా వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా సంప్రదాయాలు పాటిస్తూ పండుగలు జరుపుకుంటున్న మన వారందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.



  

Thursday 5 November 2020

లక్షల చెట్లు

                                                                          ఒక చిన్న ప్రాణి ఉడుత వలన సంవత్సరానికి కొన్ని లక్షల  చెట్లు పెరుగుతాయన్న విషయం మనం కలలోనైనా ఊహించగలమా ? నిజానికి నేను కూడా మొదట ఈ విషయం వినగానే చాలా ఆశ్చర్యపోయాను.ఉడుత మనకు చేసే మేలు దాని  మతిమరుపు వలన చెట్లు పెరుగుతాయన్న విషయం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వలన తెలుసు.కానీ కొన్ని లక్షల చెట్లు పెరగడానికి ఉడుత దోహదపడుతుందన్న విషయం ఒక టి.వి లో వచ్చే కార్యక్రమం ద్వారా తెలిసింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఉడుత ఆహారం సేకరించే సమయంలో తర్వాత తినొచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్ని గింజలను భూమిలో చిన్న చిన్న గుంటలు తవ్వి దాచిపెడుతుంటుంది.తర్వాత వాటిని ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది.వర్షం వచ్చినప్పుడు ఆ గింజలు మొలకెత్తుతాయి. ఈ క్రమంలో ఉడుతలన్నీ 365 రోజులు రోజూ అదే పని చేయడంతో సంవత్సరం తిరిగేటప్పటికి  కొన్ని లక్షల చెట్లు పెరుగుతాయట.ఎంత ఆశ్చర్యం.నిజంగా పర్యావరణానికి ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వాటి ద్వారా మొలకెత్తి ఎవరూ పెంచి పెద్ద చేయక పోయినా భగవంతుని దయ వలన వట వృక్షాలై మనకు ఎంతో మేలు చేసే చెట్లకు,మనకు ప్రత్యక్షంగా కనిపించకుండా వీటన్నింటినీ పరోక్షంగా చేస్తూ మనల్ని కాపాడుతున్న భగవంతునికి  మనందరం ఎంతో రుణపడి ఉన్నాము.ఎవరైనా మనకు ఏ చిన్న సహాయం చేసినా ,మేలు చేసినా ధన్యవాదాలు తెలియచెయడం మన పెద్దలు నేర్పిన సంస్కారం.అలాగే మనందరికీ ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వృక్షాలకు,మనందరినీ చల్లగా కాపాడే భగవంతునికి మీ మా తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 

మతిమరుపు

                                                                      ఈ రోజుల్లో చాలామందికి మతిమరుపు అనేది పెద్ద సమస్య అయిపోయింది.రంజిత కూడా అదే కోవలోకి వస్తుంది.ఏ వస్తువు అయినా అవసరమైనప్పుడు  ఉపయోగపడుతుందని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది.కానీ అవసరమైనప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మర్చిపోవడంతో అది కనిపించకుండా పోయిన సందర్భాలెన్నో.మళ్ళీ క్రొత్త వస్తువు కొనుక్కోవడం కొన్నాళ్ళ  తర్వాత పాతది కనిపించినప్పుడు అయ్యో !ఎదురుగానే పెట్టి ఊరంతా వెతుక్కున్నాను అని బాధ పడిపోవడం పరిపాటి అయిపోయింది.ఒకసారి కళ్ళజోడు కనిపించలేదని ఇల్లంతా వెదికి ఉసూరుమంటూ కూర్చుంది. భర్త  కార్యాలయం నుండి వచ్చిన తర్వాత కళ్ళజోడు విషయం చెప్పింది.అదేంటి?నీ ముఖానే ఉందిగా !అనేసరికి అవాక్కయ్యింది.అప్పటివరకు పడిన శ్రమ అంతా మర్చిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుని పడీపడీ నవ్వేసింది.వెనుకటికి చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది నా పరిస్థితి అనుకుంది రంజిత.

                                                 ఎవరికైనా ఇలా మతిమరుపు వస్తుంది అని సందేహం వచ్చినప్పుడు చిన్నప్పటినుండి మన జీవితంలో జరిగిన మంచి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ,మనసారా నవ్వుకుంటూ,నవ్వు తెప్పించే సంఘటనలను నలుగురితో పంచుకుంటూ మనసును ఉల్లాసంగా ఉంచేందుకు  ప్రయత్నిస్తే మతిమరుపు అనేది మనజోలికి రాకుండా ఉంటుంది.

కోపం

                                                                        విహిత  బహు కోపిష్టి.ముక్కు మీద కోపం ఉంటుంది.ప్రతి చిన్నదానికి అందరి మీద అరుస్తూ ఉంటుంది.ఏ చిన్న తప్పు చేసినా ఎదుటివారిని చీల్చి చెండాడినంత పని చేస్తుంది.దానితో ఎదుటివారు బిక్క చచ్చిపోవల్సిందే.అయితే మిగతా విషయాల్లో విహిత చాలా మంచిది.ఎదుటి వారి కష్టం,బాధ చూచి అసలు తట్టుకోలేదు.వెంటనే ఇదిగో నేనున్నానంటూ ఆగమేఘాలమీద వారికి  సహాయం చేస్తుంది.ఎంత మంచితనం ఉన్నా కోపం ఎక్కువ ఉండడంతో అందరికీ విహిత అంటే భయం.చనువుగా మాట్లాడలేరు.ఒకసారి విహిత ఇంటికి మనవరాలిని చూచి పోదామని అమ్మమ్మ వచ్చింది.రెండు రోజులు విహితను గమనించిన తర్వాత మనవరాలిలో ఉన్న కోపం అనే దుర్గుణాన్ని ఎలాగయినా పోగొట్టాలని ఖాళీగా ఉన్నప్పుడు ఆ కబురు ఈ కబురు చెబుతూ ఈ రోజు కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది అమ్మా!తినలేకపోయాను.కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము.అలాగని కాస్త తక్కువైనా తినలేము కదా! అలాగే మనకున్న కోపం కూడా ఉప్పులాంటిదే.ఎక్కువ అయితే ఎంత మంచితనం ఉన్నా విలువ ఉండదు.తక్కువ అయితే మర్యాద ఉండదు.కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ఉప్పులా అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలని సున్నితంగా తెలియచేసింది అమ్మమ్మ.అమ్మమ్మ చెప్పిన విధానానికి విహిత మారు మాట్లాడలేకపోయింది.ఇది విన్న విహిత కొద్దిసేపు నిశ్శబ్ధంగా కూర్చుని తర్వాత నెమ్మదిగా నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అమ్మమ్మా అని చెప్పింది.చెప్పే రీతిలో నచ్చే విధంగా చెప్తే ఎంతటి  మొండివారైనా తప్పకుండా మాట వింటారు.