బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని,దొండకాయ తింటే మందబుద్ది వస్తుందని ఒకప్పుడు ప్రచారం జరిగింది.ఏ కూరగాయ అయినా దేనికుండే ప్రయోజనం దానికి వుంటుంది.దొండ రెండు రకాలు.ఒకటి చేదు,ఒకటి తియ్యనిది.చేదు దొండని కాకి దొండ అంటారు.కానీ దీని ఆకులు కామెర్ల వ్యాధి నివారణకు వాడతారు.తియ్య దొండ మనం కూరగాయగా వాడతాము.దొండకాయలోను,ఆకుల్లోను ఉన్న ఔషధ విలువలు తెలియక,వేపుడు చాలా సమయం పడుతుంది కనుక చాలామంది ఉపయోగించరు.పులుసు కూరల్లో ఇది చాలా బాగుంటుంది.దొండకాయలో పీచు ఎక్కువ.జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది.ఇనుము శాతము ఎక్కువ.దొండకాయలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు వల్ల నాడీ సంబంధ వ్యాధులు,మతిమరుపు,శ్వాసకోశ వ్యాధులు,క్యాన్సర్లు రావని నిపుణులు అంటున్నారు.రోజుకి ఒక పెద్ద చెంచా దొండకాయల రసాన్నితాగినట్లయితే మధుమేహం అదుపులో ఉంటుందట.పచ్చి దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయట.దొండకాయలు ఎక్కువ తినేవాళ్లల్లో మూత్రపిండాల్లో రాళ్ళు కూడా ఏర్పడవట.ఇన్ని ప్రయోజనాలున్న దొండ మన ఆరోగ్యానికి ఎంతో అండగా ఉంటుంది.కనుక మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
Tuesday, 30 October 2018
Thursday, 25 October 2018
బద్దకంగా ....
పనీ పాటా లేకుండా బద్దకంగా పొద్దస్తమానము నిద్రపోయే వాళ్ళల్లోను,కాసేపటికొకసారి నిద్రపోతూ లేస్తూ ఉండే వాళ్ళల్లోను కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా మూడురెట్లు అధికంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.రాత్రివేళ ప్రశాంతంగా కంటి నిండా సరిపడా నిద్రపోయే వాళ్ళకి మతిమరుపు వచ్చే అవకాశం చాలా తక్కువని ఎన్నో ఏళ్ళు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.అందుకే సాధ్యమైనంత వరకు రాత్రిపూట ఎక్కువ సమయం మేలుకుని ఉండకుండా నిద్రపోవటం ఉత్తమం.
Tuesday, 23 October 2018
పుట్ట మట్టితో.....
నాగుల చవితికో,సుబ్రమణ్య షష్టికో పుట్టలో పాలు పోసి పుట్ట మట్టిని చెవులకి,కళ్ళపైన రాసుకుంటారని తెలుసు కానీ తలకు కూడా రాసుకుంటారని ఇప్పుడే తెలిసి రక్షిత ఆశ్చర్యపోయింది రక్షిత. రజని,రక్షిత మంచి స్నేహితులే కాక ఇరుగు పొరుగు. పక్కపక్క ఇళ్ళల్లో ఉండడంతో పనులు త్వరగా పూర్తి చేసుకుని గంటల తరబడి లోకాభిరామాయణం చెప్పుకుంటారు.ఒకరోజు మాటల సందర్భంలో రజని వాళ్ళమ్మ పుట్టమట్టి తెచ్చి తలక పోసుకునేదని,అందుకే ఆమె జుట్టు తెల్లబడలేదని చెప్పింది.మా అమ్మకు అరవై ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటికీ జుట్టు వత్తుగా నల్లగా నిగనిగ లాడుతుంది.మనకు ఇప్పటికే దాదాపు తలంతా తెల్ల వెంట్రుకలే కదా!అంది.ఆరోజుల్లో మా ఊరిలో ఎక్కువ మంది పుట్ట మట్టిలో సరిపడా నీళ్ళు కలిపి పలుచగా చేసి దానితో తల రుద్దుకునేవాళ్లట.అందుకే తెల్ల వెంట్రుకలు లేవని అమ్మ చెప్పింది అంది.
Sunday, 21 October 2018
కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఎలుకల పాలు
ధన,అరవై సంవత్సరాల వాళ్ళ అమ్మ కూడా పొద్దస్తమానము కష్టపడి చుట్టుపక్కల ఇళ్ళల్లో గిన్నెలు తోమి,ఇంట్లోపనులు చేస్తుంటారు.చీటీలు కట్టగా మిగిలిన డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని సజ్జ మీదున్న వాడని పెద్ద గిన్నెల్లో వేసేది.ఒకరోజు పక్కింటామె పిండి వంటకు పెద్ద గిన్నె కావాలని అడిగింది.అంత పెద్ద గిన్నె దింపడం కష్టం కనుక నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి గిన్నె తీద్దామని చూసేసరికి దానిలో ఎలుకలు కొట్టేసి ముక్కలు చేసిన 2000,500,100,200 రూపాయల నోట్లు ఉన్నాయి.గిన్నె కిందికి దించేటప్పుడు ధన అక్క కూడా అక్కడే వుంది.అదేమిటి ధన?నేను అవసరానికి డబ్బులు అడిగితే లేవు అన్నావు.ఇప్పుడేమో ఆరుగాలము కష్టపడి కూడబెట్టిన సొమ్ము అంతా ఎలుకల పాలుచేశావు.నీదే కాకుండా పెద్దమ్మ కష్టార్జితం కూడా పాడు చేశావు అంది.ధన కుక్కిన పేనులా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అమ్మకు అవసరమైతే ఉపయోగపడతాయని దాచాను.నేను కూడా పట్టీలు కొనుక్కుందామని అనుకున్నాను.దానిలో ఎప్పుడు వేశానో కూడా గుర్తులేదు. ఎలుకలు కొట్టేస్తాయని అనుకోలేదు అని నసిగింది.లెక్కపెడితే మొత్తం పదివేల రూపాయలు ఉన్నాయి.2000 రూ.నోటు ఎలుకలు చాలా చోట్ల కోరికటంతో అసలు పనికి రాలేదు.ఎలుకలు మిగతావి కొంచెం కొంచెం కొట్టేసినాయి.వాటిని ధన అక్క బ్యాంకులో మార్పించింది.పాపం ధన!అందరూ తలొక మాట అంటుంటే ముఖం చిన్నబుచ్చుకుంది.మనసులో బాధపడటం తప్ప పైకి ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి.ధన అమ్మ మాత్రం పోతేపోయినయిలే మనకు అంతవరకే ప్రాప్తి.ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది?అంది.మాట అయితే అన్నది కానీ తన డబ్బు మాత్రం దాచి పెట్టమని ధనకు ఇవ్వకుండా పనిచేసే ఆమె దగ్గరే దాచుకోవడం మొదలు పెట్టింది.
Saturday, 20 October 2018
మికిరీ
శుభశ్రీ ఇంట్లో పనిమనిషి శ్రీలక్ష్మి అమ్మా నేను సాయంత్రం పనికి రావటంలేదు అని చెప్పి మావాళ్ళది ఒక మికిరీ ఉంది.అక్కడికి వెళ్ళాలని చెప్పింది.మికిరీ అనే పదం శుభశ్రీ మొదటగా వినడంతో అంటే ఏమిటి?అని అడిగింది.మికిరీ అంటే ఒక తగువు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అందరినీ పిలిచి పంచాయితీ పెడతారు.అప్పుడు అక్కడికి గొడవ పడిన ఇరుపక్షాల వాళ్ళు పంచాయితీకి వస్తారు.వాళ్ళు ఇద్దరూ చెప్పింది విని నిజానిజాలు తెలుసుకుని ఆ సమస్యకు సరైన తీర్పు చెప్పి తగువు తీర్చడాన్నే మేము మికిరీ అంటాము అని చెప్పింది.మికిరీ అన్న చిన్న పదానికి ఇంత అర్ధం ఉందన్నమాట అని శుభశ్రీ ఆశ్చర్యపోయింది.
Friday, 19 October 2018
త్వరగా స్పందించే గుణం
ఎవరైనా ఎక్కడైనా ఎదుటివారి సమస్యలకి త్వరగా స్పందించి సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచగలరని నిపుణులు కూడా అంటున్నారు.ప్రేమగా పెంచడం అంటే అడిగిందల్లా కొని ఇచ్చి అతి గారాబంతో చెడగొట్టడం కాదు.పిల్లలతో ప్రేమగా ఉంటూనే ఎదుటివారితో ఎవరిదగ్గర ఎలా మాట్లాడాలో,ఎలా ప్రవర్తించాలో,ఎవరితో ఎలా ఒక పద్దతి ప్రకారం మెలగాలో,ఆపద వచ్చినప్పుడు వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోవాలో,అవసరమైనవారికి ఎలా సహాయపడాలో చెప్పీ చెప్పకనే తెలియచెప్పి సంస్కారవంతంగా పెంచితే విద్య దానంతట అదే వస్తుంది.పదే పదే చదవమని చెప్పనవసరం లేకుండా వాళ్ళే చదువుకుంటారు.అందరికీ సహాయం చేసే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు.వాళ్ళకు మంచి అమ్మానాన్నలు మళ్ళీ వాళ్ళు మంచి అమ్మనాన్నలుగా ఉంటారన్నది జీవితసత్యం.
Thursday, 18 October 2018
దొరకని వస్తువంటూ......
ఇంటర్ నెట్ పుణ్యమా అని ఆన్ లైన్ లో దొరకని వస్తువంటూ లేదు.ఈరోజుల్లో దేనికీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు.కొత్త పోకడ వస్తువులే కాకుండా పూజలు,హోమాలకు అవసరమైన సామాగ్రితోపాటు ఆశ్చర్యంగా పిడకలు,పేడ కూడా అందుబాటులోకి వచ్చేశాయి.ఆర్డర్ పెట్టగానే ఇంట్లో నుండి కాలు కదపనవసరం లేకుండా నిత్యావసర వస్తువులతోపాటు మందులు,పళ్ళు,కూరగాయలతో సహా అన్నీ తాజాగా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు.దీనితో డబ్బుకి డబ్బు,సమయం కూడా ఆదా అవుతుంది.ఎవరికి వాళ్ళు హడావిడి పడి ప్రతి చిన్నదానికి కొట్టుకు పరుగెత్తకుండా ఇంటికే అందుబాటులోకి రావడం నిజంగా సంతోషించదగ్గ పరిణామమే.భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో సతమతమయ్యే ఈరోజుల్లో అలసిసొలసి ఇంటికొచ్చాక అదిలేదు ఇదిలేదు అనుకోకుండా ఏది తినాలంటే అది తినడానికి కూడా ఆర్డరు చేసిన నిమిషాల్లో తెచ్చి వేడిగా ఇవ్వడంతో సామాన్య ప్రజలు కూడా ఆన్ లైన్ లో కొనడానికే మొగ్గు చూపుతున్నారు.
Wednesday, 17 October 2018
దసరా శుభాకాంక్షలు
దశహర అనే సంస్కృత పదమే క్రమంగా దసరా పండుగగా మారింది.మనలోని పది అవగుణాలను హరించేదే దసరా పండుగ.ఆ పది ఏమిటి?అంటే కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్య,అహంకార,అమానవత్వ,స్వార్ధం,అన్యాయం అనేవాటిని పారద్రోలి వాటిపై విజయాన్ని సాధించే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుడ్ని వేడుకుంటే అమ్మ దయతో ప్రసాదించడంతో దసరా పండుగే విజయదశమి అయింది.విజయదశమి అంటేనే విజయాన్ని చేకూర్చేది.కనుక ఈ పది అవ లక్షణాలను విజయవంతంగా జయించి నిండు నూరేళ్ళు అందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
శతాబ్దపు సూపరు పండు
ఒకప్పుడు కొండల్లో,గుట్టల్లో పెరిగి కాయలు కాసి రోడ్డు పక్క బుట్టల్లో మాత్రమే కనిపించే ఆకుపచ్చని కొండ ఫలం అంటే సీతాఫలం నేడు ఎన్నో వర్ణాల్లో సూపర్ మార్కెట్లలో కనువిందు చేస్తుంది.వేసవిలో మామిడి పండు కోసం ఎదురు చూచినట్లు శీతాకాలంలో సీతాఫలం కోసం ఎదురు చూచేవాళ్ళు నాలాగా ఎంతోమంది ఉన్నారు.సీతాఫలం రుచితోపాటు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో ఒత్తిడి,ఆందోళన మాయమవటమే కాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.రామా,లక్ష్మణ,హనుమాన్ ఫలాల్లో గుజ్జుతోపాటు కాన్సర్ ని నివారించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో వీటిని ఇప్పుడిప్పుడు తినటానికి అలవాటు పడుతున్నారు.ఇవి మార్కెట్లో అందుబాటులో ఉండవు కనుక పెరటిలోనే మొక్కలు తెచ్చి పెంచుకుంటున్నారు.ఏది ఏమైనా సీతాఫలం రుచి అమోఘం.అందుకే ఈ శతాబ్దపు సూపరు పండుగా ఎంపిక అయింది.దీనితో రైతులు దానిమ్మ,బొప్పాయి,జామ తోటలు సాగు చేసినట్లే సీతాఫలాలు కూడా రకరాల రంగుల్లో పండిస్తున్నారు.
Thursday, 11 October 2018
నెత్తినెక్కి పిండి కొట్టి .....
ఈరోజుల్లో దాదాపుగా పరిచయాలు,బంధాలు అనేవి అవసరం ఉన్నంతవరకే కానీ తర్వాత ఎవరికీ ఎవరూ ఏమీ కారు.అసలు అన్నీ అవసరాల ప్రేమలే కానీ అసలు నిజమైన ప్రేమలు,ఆప్యాయతలు ఎక్కడా కనబడడం లేదు.ఒకప్పటి ప్రేమలు, ఆప్యాయతలు,అనురాగాలు చూద్దామన్నా కనుచూపు మేరలో మచ్చుకైనా కనిపించడం లేదు.ఒకవేళ అతి కొద్దిమంది ఆప్యాయంగా ఉన్నా వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద జమకట్టి వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టి రొట్టె చేసుకుందామన్నట్లుగా ఉంటుంది ఇప్పటి పరిస్థితి.దానివల్ల జమకట్టిన వాళ్ళకి ఒరిగేది,వీళ్ళకు పోయేది ఏమీ లేకపోయినా అదో రకం పైత్యం.
Tuesday, 9 October 2018
జాంపండు
స్నిగ్ద కళాశాలలో డిగ్రీ చదువుకునే రోజుల్లో మొదటి సంవత్సరం సెలవుల అనంతరం కళాశాల తెరిచిన మొదటి రోజు అది.రెండవ సంవత్సరంలో ఒకళ్ళు ఇద్దరు కొత్త మొహాలు తప్ప అందరూ పాతవాళ్ళే.చాలా రోజుల విరామం తర్వాత అందరూ ఎవరి స్నేహితులతో వాళ్ళు సంబరంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా తెల్లగా,గుండ్రంగా,అందంగా అప్పుడే చెట్టు నుండి తెంపిన నిగనిగలాడే మగ్గిన జాంపండు లాగా ఉన్నఅమ్మాయి బెరుకుగా తరగతి గదిలోనికి ప్రవేశించింది.అందరూ ఒక్కసారిగా కబుర్లు ఆపి ఆశ్చర్యంగా ఆమెవైపు ఒకసారి చూసి మళ్ళీ ఎవరి మచ్చట్లలో వాళ్ళు మునిగిపోయారు.ఎవరితో కూర్చోవాలో,ఎక్కడ కూర్చోవాలో తెలియక ఆమె బెదురు చూపులు చూస్తుంది.ఇంతలో స్నిగ్ధ ఆమెను తన స్నేహబృందం లోనికి ఆహ్వానించింది.ఒకరికొకరు పరిచయాల అనంతరం తన పేరు అరుణ అని తనకు ఒక నెల రోజుల క్రితమే పెళ్ళి అయిందని,అత్తగారిల్లు కళాశాలకు దగ్గరలోనే కనుక ఇక్కడ చేరానని చెప్పింది.తనకు చదువు అంటే ఎంతో ఇష్టం అని చెప్పటంతో భర్త,అత్తమామలు చదువుకోమని ప్రోత్సహించారని ఆనందంగా చెప్పింది.పెళ్ళైపోయింది కనుక ఇంట్లోనే కూర్చో అంటారేమోనని తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని మొదట భయపడ్డానని కానీ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళని సంతోషంగా చెప్పింది.అలా జాంపండు స్నిగ్దకి ప్రాణ స్నేహితురాలయింది.
హృదయపూర్వకంగా
మనలో కొంతమంది మన తోటివారు విజయం సాధించినప్పుడు అంత త్వరగా జీర్ణించుకోలేరు.వారిని మనస్పూర్తిగా అభినందించనూలేరు.ఈర్ష్యతోనో మరే ఇతర కారణం వల్ల కానీ కనీసం సంతోషాన్ని కూడా వ్యక్తం చేయరు.మనం బాగుండాలని అనుకోవడం సహజం.మనం ఒక్కళ్ళం మాత్రమే బాగుండాలని అనుకోవడం స్వార్ధం.అదే మనతోపాటు ఎదుటివాళ్ళు కూడా బాగుండాలని అనుకోవడం సంస్కారంతో కూడిన మంచితనం.అలాగే మనం ఓడిపోయినా కూడా ఎదుటివారు విజయం సాధించినప్పుడు హృదయపూర్వకంగా అభినందించేవారు ధన్యులు.అతి కొద్దిమంది మాత్రమే అలా అభినందించగలరు.ఆవిధంగా చేయగలిగినప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది.
Saturday, 6 October 2018
దారిలో ముళ్ళు
నడిచే దారిలో ముళ్ళు ఉన్నాయని నడవడం ఆపితే మనం చేరుకోవలసిన గమ్యం చేరుకోలేము.అలాగే వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే అనుకున్నది సాధించలేము.మనం ఏ విధంగా ఉన్నామో అని ముందుకు,వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదుటివారిని అవహేళన చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వాళ్ళ విమర్శలనే మనం ఆశీర్వాదాలుగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలము.విజయం మన స్వంతమైనప్పుడు వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతిని నోట మాట రాక తల వేళ్ళాడేసి మన కళ్ళల్లోకి నేరుగా చూడలేక నేల చూపులు చూస్తారు.
Thursday, 4 October 2018
ప్రచారాలు
నువ్వు విన్నది త్వరగా నమ్మకు.ఎప్పుడైనా నిజం కన్నా అబద్దానికే ప్రచారం ఎక్కువ.నమ్మితే అపార్ధాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.కొన్ని సార్లు బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.అసలు నిజం తెలియకుండా కొంతమంది అబద్దాన్ని తమ భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తూ ఉంటారు.ఇంకొంతమంది ఆ అబద్దాన్నే నిజమని నమ్మి అసలు నిజం చెప్పినా నమ్మే స్థితిలో ఉండరు.అబద్దపు ప్రచారం వల్ల ఎదుటి వారిని మానసికంగా బలహీనుల్ని చేశామని సంతోషపడుతుంటారు.కానీ ప్రచారకర్తలే అసలు మానసిక బలహీనులమని తెలుసుకోరు.అబద్దమయినా,నిజమే అయినా ఒకరిమీద ఇంకొకరికి చెప్పకపోవటం తెలివిగల లక్షణం.ఇంకొంతమంది ఎదుటివారికి వినటం ఇష్టం లేకపోయినా చెవిలో జోరీగ లాగా మోత చేస్తుంటారు.ఆపు మహాప్రభో! అన్నా వాళ్ళ ధోరణికి అడ్డుకట్ట ఉండదు.అడ్డుకట్ట వేద్దామని ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాస.అసలు పుకార్లు,ప్రచారాలు వినకపోవటం ఉత్తమ లక్షణం.కాలక్షేపానికి వినడం మధ్యమ లక్షణం.విని ప్రచారం చెయ్యడం అధమ లక్షణం.మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటివాటికి దూరంగా ఉండడం మంచిది.
Wednesday, 3 October 2018
స్వాంతన
మనకు ఒక పని చేస్తున్నప్పుడు విసుగు అనిపిస్తే వేరొక పని మొదలుపెట్టి హుషారుగా రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తాము.ఆ విధంగా చెయ్యకపోతే జీవితమే నిస్సారంగా ఉన్నట్లు అనిపిస్తుంది.ఎప్పటికప్పుడు కొత్తకొత్త పనులు చేస్తుంటే మనసుకు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటుంది.జీవితంలో మార్పు అనేది మనిషికి మానసికంగా స్వాంతన చేకూరుస్తుంది.మానసికంగా సంతోషంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.జీవితమనే ఇరుసులో ఇదంతా ఒకదాని వెనుక ఒకటి వరుసగా తిరుగుతూ ఉంటాయి.అదే జీవితచక్రంలో ఇమిడివున్న రహస్యం.ఒకే పని చేస్తూ బద్దకంగా,హుషారు అనేది లేకుండా గడుపుతుంటే మనిషికి సోమరితనం అబ్బుతుంది.ఏ పని చెయ్యబుద్ది కాదు.ఇటువంటివాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండరు.ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేరు.అంతెందుకు?అసలు సోమరితనం మనిషి లక్షణం కాదు.జీవితంలో సోమరితనం లేనివాళ్ళ జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది.కొంతమంది బద్దకంగా ఉండటంతో ఇరవైల్లోనే ఎనభైల్లా కనపడుతున్నారు.ఎనభైల్లో కూడా ఎవరి పని వారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న బామ్మలు,తాతయ్యలు ఎంతమందో?నిజంగా వాళ్ళను చూస్తుంటే ఎంత ముచ్చట వేస్తుందో?వాళ్ళతో పరిచయం ఉన్నా లేకపోయినా చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది.
Monday, 1 October 2018
బుజ్జి మేక
సత్యశ్రీ స్నేహితురాలు చిలుక తో చరవాణిలో మాట్లాడుతూ బుజ్జి మేక కొడుకు పెళ్ళికి పిలవటానికి వచ్చాడు కానీ నేను మళ్ళీ ఫోను చేస్తాను అంది.కాసేపటి తర్వాత బుజ్జి మేక ఇప్పుడే వెళ్ళాడు.అందుకే నీతో మాట్లాడదామని చేశాను అంటూ సత్యశ్రీ చిలుకకు ఫోను చేసింది.బుజ్జి మేక ఎవరే?అనగానే మనము అందరము కలిసి చిన్నప్పుడు పాఠశాలలో ఆడుకునేటప్పుడు సన్నగా,తెల్లగా,రివటలా చెంగు చెంగున ఎగురుతూ మనకు ఆటలో దొరక్కుండా పారిపోతుంటే వెంటబడేవాళ్ళం గుర్తుందా?అని అడిగింది.ఆ....ఆ గుర్తొచ్చింది అంటూ రొప్పుతూ రోజుతూ పరుగెత్తి చివరికి ఎలాగైతే పట్టుకునేవాళ్ళంగా!అంది చిలుక.అవును వాడు నాకు పిన్ని కొడుకు అని చెప్పింది సత్యశ్రీ.వాడు చిన్నప్పుడు మాములుగా నడవకుండా చెంగు చెంగున ఎగురుతూ ఉండేవాడు.వాడు మా అందరికన్నా చిన్నోడు.అందుకే మేము వాడిని బుజ్జి మేక అని ఆట పట్టించేవాళ్ళం.నువ్వు కూడా చిన్నప్పుడు చిలుక కొట్టినట్లు దోర జామకాయల్ని చెట్టెక్కి మరీ అన్నీ కొరికి రుచి చూచే దానివి కదా!అందుకే నీ అసలు పేరు వదిలేసి చిలుక అన్నట్లే వాడి పేరు బుజ్జి మేకగా స్థిరపడి పోయింది అని సత్యశ్రీ ఉత్సాహంగా చిన్నప్పటి కబుర్లు చెప్తుంటే ఇద్దరూ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చేలా పడీపడీ నవ్వుకున్నారు.ఎంతైనా చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు కదా!
Subscribe to:
Posts (Atom)