Saturday 29 October 2016

ఆనందంగా దీపావళి

అందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.


.











దీపావళి శుభాకాంక్షలు

                                                              నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు శుభప్రదమైన ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి మీ ఇంటికి శోభను,మీ జీవితాల్లో వెలుగులు నింపాలని,శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు. 

దివ్వె దివ్వె దీపావళి

                                                                               రూపావతి కొడుక్కి లేకలేక కూతురు పుట్టింది.పది నెలలు నిండాయి.ఇంతలో దీపావళి వచ్చింది.మొదటి దీపావళికి వాళ్ళ ఊరిలో చెరకు గడ పిలక కానీ గోంగూర మొక్క కానీ తెచ్చి ఆకులన్నీ తీసేసి చివరలో రెండు ఆకులు ఉంచి తెల్లటి నూతన వస్త్రము ముక్క తెచ్చి రెండు కొసలు కనిపించేలా చుట్టి నువ్వుల నూనెలో ముంచి రెండు కొసలను కలిపి వెలిగించి పసిపిల్లల చేతితో కలిపి పట్టుకుని "దివ్వె దివ్వె దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి"అంటూ మూడు సార్లు అటు ఇటు తిప్పించి వాకిట్లో గుమ్మం ముందు కొట్టి పిల్లను ఎత్తుకుని దాన్ని దాటి వెనక్కి తిరిగి చూడకుండా లోపలకు వెళ్ళి పిల్లకు కాళ్ళు చేతులు కడిగి తీపి నోట్లో పెట్టాలని పట్నం వచ్చినా ఆ సంప్రదాయం పాటించాలని ఒకటే హడావిడి.ఎలాగయితే అనుకున్న విధంగా చేయటానికి ఏర్పాట్లు చేసుకుని రేపటి దీపావళి కోసం ఎదురు చూస్తుంది.

Sunday 23 October 2016

ఒరేయ్ నర్సిగా ....

                                                                  నరేష్,నవ్య ఎదురెదురు ఇళ్ళల్లో ఉంటూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.పెద్దలకు అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలు ఇష్టపడ్డారు కదా అని పెళ్ళి చేశారు.ఇద్దరూ వేరే ఊరిలో కొత్త కాపురం పెట్టారు.మంచీచెడూ నేర్పిస్తుందని నరేష్ అమ్మమ్మను నాలుగు రోజులు తోడుగా ఉండమని పంపారు.అంతా  బాగానే వుంది కానీ నవ్య నరేష్ ను ఒరేయ్ నర్సిగా ఇటు రారా!అని పిలుస్తుంది.అది అమ్మమ్మకు నచ్చలేదు.ఎంతైనా భర్తను పట్టుకుని అలా పిలవటం ఏమి బాగుంటుంది అమ్మాయ్ అని అంది.ఒసేయ్ ముసలిదానా!నా మొగుడు నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను.మధ్యలో నీకు ఎందుకు?ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేసింది నవ్య.ఈ కాలం పిల్లల నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది.ఎంతమాట పడితే అంతమాట అనేస్తున్నారు.నాలుగు రోజులు ఉంటే నా పరువు పోయేటట్లుగా ఉంది.వెంటనే ఇంటికి వెళ్ళిపోవటం మంచిది అనుకుని అమ్మమ్మ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయింది.

Saturday 22 October 2016

నిద్ర లేవగానే ....

                                                                   నిద్ర లేవగానే దంతధావనంతోపాటు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల కాస్తోకూస్తో ఉన్న బద్ధకం వదిలిపోతుంది.కాసేపు ధ్యానం,ఇష్టమైతే పూజ,ప్రకృతిని చూస్తూ లేత సూర్య కిరణాలూ తగిలేలా నడవడం లేదా కూర్చుని ఇష్టమైన పుస్తకం చదవడం,మనసుకు నచ్చిన వారితో మాట్లాడటం వంటివి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.బాధ్యతలు ఉన్నవాళ్ళు ఒక అరగంట ముందు లేచి పై విధంగా చేస్తుంటే ఒత్తిడి లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు.  

Friday 21 October 2016

దోమ ప్రతాపం

                                                     ఒక దోమ కామాక్షిని హఠాత్తుగా పది రోజులు ఆసుపత్రి మంచంపై పడేలా చేసింది. ఒకరోజు కామాక్షిని డెంగ్యు దోమ కుట్టింది కాబోలు రెండు వారాల తర్వాత దాని ప్రతాపంతో కామక్షికి విపరీతమైన తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,జ్వరం వచ్చింది.బంధువులు ఇంటికి రావటంతో నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బడలిక వలన ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయానుకుని ఒక మాత్ర వేసుకుని నిద్రపోయేది.కామాక్షికి పాదంపై ఒక చిన్న పుట్టుమచ్చ మాదిరిగా కనపడితే ఏదో కాలికి గట్టిగా గుచ్చుకుని ఉంటుందిలే అనుకుని పట్టించుకోలేదు.నాలుగు రోజులకు ఒళ్ళు నొప్పులు,జ్వరం తగ్గిపోయింది.మళ్ళీ ఒక ఇరవై రోజులకు బంధువులు వచ్చి వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే పని ఒత్తిడి వలన అనుకుంది.నాలుగు రోజులైనా తగ్గక పోయేసరికి వైద్యుని వద్దకు వెళ్ళింది.బి.పి. చాలా తక్కువగా ఉందని కళ్ళు తిరిగి క్రింద పడిపోయే అవకాశం ఉన్నందున అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఉండమన్నారు.అప్పటి నుండి ప్రత్యక్ష నరకం మొదలయింది.ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని రక్తం తీసుకోవడానికి సూదులతో పొడవడం,సెలైన్ తోపాటు ఇంజెక్షన్ లు పది రోజులకు కానీ ఇంటికి చేరలేదు.తెలిసి తెలిసి అద్దోయితం లాగ మొదటే వైద్యుని దగ్గరకు వెళ్తే ఈ తిప్పలు తప్పేవి.మొదట అశ్రద్ద చేయటం వలన వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళకపోవటంతో అన్ని లెవెల్స్ హెచ్చు స్థాయికి చేరాయి.అదృష్టం ఏమిటంటే ప్లేట్ లెట్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.ఆ పదిరోజులు నరకం తర్వాత సాధారణ స్థితికి రావటంతో కామాక్షి కొద్దిగా కుదుటపడింది.ఇంటికి వచ్చిన నెల రోజులకు కూడా  ఆ నీరసం వదలలేదు.అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళమని అందరికీ సలహాలిచ్చే కామాక్షికే ఊహించని పరిస్థితి ఎదురయింది.సాధ్యమైనంత వరకు పరిసరాలు శుభ్రంగా,నీరు నిల్వ లేకుండా చూడాలి.దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.కామాక్షి ఇంట్లో దోమలు ఒకటి,అరా తప్ప ఉండవు.కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు దోమ కుట్టిందో దాని ప్రతాపంతో కామాక్షిని ఒక ఊపు ఊపేసింది.దోమల కాలంలో శరీరం మొత్తం కప్పేలా దుస్తులు వేసుకోవడం మంచిది.ఏ దోమ వలన ఏ విష జ్వరం వచ్చి ఇబ్బంది పడాలో తెలియదు కదా!

దోమ కటాక్షం

                                                               శ్రావణ మాసంలో అందరినీ లక్ష్మీ దేవి కటాక్షిస్తే మీనాక్షిని
మాత్రం దోమ కటాక్షించింది.ఒకరోజు మీనాక్షిని డెంగ్యు దోమ కుట్టింది కాబోలు డెంగ్యు వైరస్ శరీరంలో ఉండటంతో రెండు వారాల తర్వాత దాని ప్రభావం బయటపడి విపరీతమైన తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,జ్వరం వచ్చింది.ఈలోగా కృష్ణా పుష్కరాలు రావటంతో ఒక పాతికమంది బంధువులు మూడురోజులు ఇంటికి రావటంతో నిమిషం కూడా తీరిక లేకుండా పోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బడలిక వలన ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయానుకుని ఒక మాత్ర వేసుకుని నిద్రపోయేది.డెంగ్యు జ్వరం వచ్చినప్పుడు చిన్న పుట్టుమచ్చ శరీరంపై ఎక్కడో ఒకచోట కనిపిస్తుందట.ఆవిషయం మీనాక్షికి తెలియదు.పాదంపై ఒక చిన్నమచ్చ కనపడితే ఏదో కాలికి గుచ్చుకుని ఉంటుందిలే అనుకుని పట్టించుకోలేదు.నాలుగు రోజులకు ఒళ్ళు నొప్పులు,జ్వరం తగ్గిపోయింది.మళ్ళీ ఒక ఇరవై రోజులకు ఆసుపత్రిలో ఉన్న బంధువులకు భోజనం పంపవలసి వచ్చింది.వాళ్ళ పని పూర్తయిన తర్వాత జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే పని ఒత్తిడి వలన అనుకుంది.నాలుగు రోజులైనా తగ్గక పోయేసరికి వైద్యుని వద్దకు వెళ్ళింది.వైద్యుని ఎదుటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయినంత పని అయింది.బి.పి. చాల తక్కువగా ఉందని క్రింద పడిపోయే అవకాశం ఉన్నందున అప్పటికప్పుడు ఆసుపత్రిలో ఉండమన్నారు.అప్పటి నుండి ప్రత్యక్ష నరకం మొదలయింది.ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని రక్తం తీసుకోవడానికి సూదులతో పొడవడం,సెలైన్ తోపాటు ఇంజెక్షన్ లు పది రోజులకు కానీ ఇంటికి చేరలేదు.తెలిసి తెలిసి అద్దోయితం లాగ మొదటే వైద్యుని దగ్గరకు వెళ్తే ఈ తిప్పలు తప్పేవి.మొదట అశ్రద్ద చేయటం వలన వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళకపోవటంతో అన్ని లెవెల్స్ హెచ్చు స్థాయికి చేరాయి.అదృష్టం ఏమిటంటే ప్లేట్ లెట్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.ఆ పదిరోజులు నరకం తర్వాత సాధారణ స్థితికి రావటంతో మీనాక్షి కొద్దిగా కుదుటపడింది.ఇంటికి వచ్చిన పదిహేను రోజులకు కూడా  ఆ నీరసం వదలలేదు.అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళమని అందరికీ సలహాలిచ్చే మీనాక్షి కే ఊహించని వింత అనుభవం ఎదురయింది.ఇదంతా దోమ కటాక్షం.

Wednesday 19 October 2016

మంచి నీళ్ళతో రోజుని.....

                                                       కనీసం రెండు గ్లాసుల నీళ్ళతో రోజుని ప్రారంభిస్తే రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు.భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగటం అలవాటు చేసుకుంటే త్వరగా పొట్ట నిండిన భావన కలిగి ఆహరం తక్కువ తీసుకోవటంతో బరువు అదుపులో ఉండటమే కాక క్రమంగా బరువు కూడా తగ్గుతారు.

Sunday 16 October 2016

గులాబ్ జామ్ పెట్టలేదని......

                                                    సావిత్రమ్మ అక్క తెల్లగా,అందంగా,ఒళ్లంతా జుట్టుతో ముద్దుగా ఉన్న కుక్కపిల్లను తెచ్చి పెంచుకోమని చెల్లికి ఇచ్చింది.చిన్నప్పటి నుండి సావిత్రమ్మ అతి గారాబంగా పెంచడంతో ఒక పిల్ల మాదిరిగా అన్నీ అర్ధం చేసుకుని తిరిగి సైగలతో,అరుపులతో దాని భావాలను వ్యక్తపరుస్తుంటుంది.సావిత్రమ్మ రోజూ ఉద్యోగరీత్యా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటుంది.ఒకరోజు కోడలు సావిత్రమ్మ వెళ్ళిన తర్వాత గులాబ్ జామ్ చేసి దానికి పెట్టకుండా భర్తకు పెట్టి తను తినేసి కొన్ని వంటగదిలో వదిలేసింది.సాయంత్రం సావిత్రమ్మ రాగానే కుక్కపిల్ల చీర చెంగు పట్టుకుని వంటగదికి తీసుకెళ్ళి అరవటం మొదలు పెట్టింది.సావిత్రమ్మ కోడలుతో దానికి పెట్టకుండా ఏమి చేసుకుని తిన్నారు అమ్మాయ్?అని అడిగింది.మీ అబ్బాయి గులాబ్ జామ్ చెయ్యమని అడిగితే చేశాను అత్తయ్యా!అని నట్లు కొడుతూ చెప్పింది.చేసుకుంటే చేసుకున్నారు దానికి కూడా పెడితే తంటా ఉండేది కాదు కదా!ఇప్పుడు చూడు దొంగను పట్టించినట్లు నన్ను వంటగదికి తీసుకెళ్ళి మరీ గులాబ్ జామ్ పెట్టలేదని చెపుతుంది అంటూ మురిపెంగా సావిత్రమ్మ కుక్కపిల్లను భుజాన వేసుకుంది.

Saturday 15 October 2016

మాక్స్

                                                     మాక్స్ ఒక కుక్క పేరు.కుక్క అని ఎవరైనా అంటే దాన్ని పెంచే అమ్మ అసలు ఊరుకోదు.లోలిత,ఆమె భర్త పెళ్ళయిన కొత్తలో ఇప్పటి నుండి పిల్లలు ఎందుకులే?అని ఈలోగా కాలక్షేపానికి ఒక కుక్కను తెచ్చుకుని స్వంత కొడుకు కన్నా ప్రేమగా పెంచుకోవడం మొదలెట్టారు.లోలిత ఉద్యోగరీత్యా అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.లోలిత ఉన్నప్పుడు మాక్స్ సోఫా పైన,తివాచీల పైన పడుకోకుండా దానికి తర్ఫీదు ఇచ్చింది.లోలిత భర్త ఇంట్లో ఒక్కడే ఉండటంతో మరీ గారాబం చేసి టి.వి రిమోట్ నోటితో తీసుకుని సోఫా పైన కూర్చుని కాలితో నొక్కి దానికి నచ్చిన ఛానల్ పెట్టుకునేలా తర్ఫీదు ఇచ్చాడు.లోలిత ఇంటికి వెళ్ళినప్పుడు చూచి లబలబలాడుతూ సోఫాపై కూర్చోబెట్టి టి.వి చూడనివ్వడం ఏమిటి?అంటూ పైకి భర్తతో అన్నా స్నేహితుల దగ్గర మాత్రం కొడుకు అంటే మాక్స్ చక్కగా రిమోట్ తో టి.వి పెట్టుకుని చూస్తున్నాడని తెగ మురిసిపోతూ ముచ్చట్లు చెబుతుంది.హతవిధీ!

Wednesday 12 October 2016

మూడురోజులు దాటితే....

                                               జ్వరాల కాలం కనుక ఎవరికైనా జ్వరం వచ్చి మాత్ర వేసుకున్నా సరే మూడురోజుల వరకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి రక్తపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.వైద్యుని సలహా,సూచనల ప్రకారం మాత్రలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా బయట పడవచ్చు.అదే తగ్గిపోతుంది.ఈ జ్వరం నన్నేమి చేస్తుంది?అని అశ్రద్ధ చేయకుండా మూడురోజులు దాటితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్యం తీసుకోవాలి.కొన్ని జ్వరాలు కుటుంబంలో మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ముందే జాగ్రత్త పడటం అవసరం.

Monday 10 October 2016

దసరా శుభాకాంక్షలు

                                           బ్లాగ్ వీక్షకులకు,బ్లాగర్లకు,అందరికీ దసరా శుభాకాంక్షలు.