Showing posts with label స్వయంకృషి. Show all posts
Showing posts with label స్వయంకృషి. Show all posts

Wednesday, 15 February 2017

మధురానుభూతి

                                                             రాధమ్మ 26 సంవత్సరాల క్రితం ఆరుగురు కుట్టు పనివాళ్ళను పెట్టుకుని వస్త్ర వ్యాపారం మొదలు పెట్టింది.కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈనాటికి ఆరువందల మంది పనివాళ్ళతో ఒక పెద్ద సంస్థగా ఏర్పాటు చేసింది.ఇప్పుడు ఆమె భారదేశంలోనే నెం.1 గా పేరుపొంది చాలా రాష్ట్రాలకు తన వస్త్రాలను అందించగలుగుతుంది.ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్తగా ఎన్నో అవార్డులు అందుకుంది.అయినా కించిత్తు కూడా గర్వం లేదు.69 సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది.ముఖ్యంగా గో సంరక్షణ,రసాయన రహిత వ్యవసాయం చేస్తూ ధాన్యం,కూరగాయలు పండిస్తూ మహిళా వ్యవసాయవేత్తగా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజలను కాన్సర్ వంటి ఎన్నో రోగాల బారినుండి కాపాడాలని సమాజానికి తనవంతు కృషి చేస్తుంది.దీనంతటి వెనుక రాధమ్మ 26 సంవత్సరాల స్వయం కృషి ఉంది.కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిలువెత్తు ఉదాహరణ రాధమ్మ.చెదరని చిరునవ్వుతో,ఎంతో సంస్కారంతో చూడగానే చేతులెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉండే రాధమ్మ పరిచయం ఓ మధురానుభూతి.

Wednesday, 14 December 2016

కోపంతో ముందడుగు

                                                                   లతాశ్రీ తెలివైనదే కానీ చదువంటే మాత్రం మహా బద్ధకం.చిన్నప్పుడు పుస్తకాలు తీసి చదవమంటే ఆమడ దూరం పరుగెత్తేది.ఎలాగోలా వచ్చే పరీక్షకు,పోయే పరీక్షకు నాలుగుసార్లు రాసి పదవ తరగతి అత్తెసరు మార్కులతో గట్టెక్కింది.తర్వాత పెళ్ళి,పిల్లలు.అత్తింటి వారికి ఆస్తులున్నావ్యాపారానికి డబ్బు దండిగా ఇవ్వలేదని కోపం వచ్చి ఫాషన్ డిజైనింగ్ చేసి తన బంగారం అమ్మేసి మరీ కొంతమంది పనివాళ్ళను పెట్టుకుని మగ్గం వర్కు,డిజైనర్ జాకెట్లు కుట్టించడం మొదలు పెట్టింది.భాష రాకపోయినా నానా తంటాలు పడి వేరే రాష్ట్రం నుండి పనివాళ్ళను పిలిపించి జాకెట్లు అందంగా కుట్టించడంతో తెలిసిన వాళ్ళు,బంధువులు,స్నేహితులు వరుసగా కుట్టించుకోవడం మొదలు పెట్టారు.ఆదాయం పెరగటంతో భర్త కూడా తన ఉద్యోగం వదిలేసి భార్యకు చేదోడువాడుగా ఉండటంతో ఉప్పాడ,మంగళగిరి,ధర్మవరం,కంచి,కలకత్తా,పోచంపల్లి,సూరత్ నుండి ఎక్కడ ఏవి ప్రత్యేకంగా దొరికుతాయో అక్కడికి వెళ్ళి అవి తెచ్చి చీరల దుకాణం పెట్టేసింది.ఆనాడు కోపంతో ముందడుగు వేయడంతో అప్పుడు ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే ఇప్పుడు పొగడ్తల జల్లు కురిపించి లతాశ్రీ స్వశక్తితో పైకి వచ్చిందని,రెండు దుకాణాలు పెట్టిందని ఆకాశానికి ఎత్తుతున్నారు.