సత్యశ్రీ స్నేహితురాలు చిలుక తో చరవాణిలో మాట్లాడుతూ బుజ్జి మేక కొడుకు పెళ్ళికి పిలవటానికి వచ్చాడు కానీ నేను మళ్ళీ ఫోను చేస్తాను అంది.కాసేపటి తర్వాత బుజ్జి మేక ఇప్పుడే వెళ్ళాడు.అందుకే నీతో మాట్లాడదామని చేశాను అంటూ సత్యశ్రీ చిలుకకు ఫోను చేసింది.బుజ్జి మేక ఎవరే?అనగానే మనము అందరము కలిసి చిన్నప్పుడు పాఠశాలలో ఆడుకునేటప్పుడు సన్నగా,తెల్లగా,రివటలా చెంగు చెంగున ఎగురుతూ మనకు ఆటలో దొరక్కుండా పారిపోతుంటే వెంటబడేవాళ్ళం గుర్తుందా?అని అడిగింది.ఆ....ఆ గుర్తొచ్చింది అంటూ రొప్పుతూ రోజుతూ పరుగెత్తి చివరికి ఎలాగైతే పట్టుకునేవాళ్ళంగా!అంది చిలుక.అవును వాడు నాకు పిన్ని కొడుకు అని చెప్పింది సత్యశ్రీ.వాడు చిన్నప్పుడు మాములుగా నడవకుండా చెంగు చెంగున ఎగురుతూ ఉండేవాడు.వాడు మా అందరికన్నా చిన్నోడు.అందుకే మేము వాడిని బుజ్జి మేక అని ఆట పట్టించేవాళ్ళం.నువ్వు కూడా చిన్నప్పుడు చిలుక కొట్టినట్లు దోర జామకాయల్ని చెట్టెక్కి మరీ అన్నీ కొరికి రుచి చూచే దానివి కదా!అందుకే నీ అసలు పేరు వదిలేసి చిలుక అన్నట్లే వాడి పేరు బుజ్జి మేకగా స్థిరపడి పోయింది అని సత్యశ్రీ ఉత్సాహంగా చిన్నప్పటి కబుర్లు చెప్తుంటే ఇద్దరూ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చేలా పడీపడీ నవ్వుకున్నారు.ఎంతైనా చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు కదా!
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Monday, 1 October 2018
Friday, 7 April 2017
గుర్తుందా?
నిర్మల తమ్ముడు మన ఊరిలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నాము.మీరిద్దరూ తప్పకుండా రావాలి అని చెప్పగానే పుట్టిన ఊరు,చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కొంగొత్త ఉత్సాహంతో తయారయి భర్తతో కలిసి వెళ్ళింది.చిన్ననాటి స్నేహితులు,ఇరుగుపొరుగు,ఊరి వారందరు ఎంతో ఆప్యాయంగా పలుకరించారు.ఇంతలో ఒకతను వచ్చి నువ్వు నిమ్మీ కదూ!పోలికలను బట్టి నువ్వేనని పలుకరిద్దామని వచ్చాను.నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పి ముప్పై సంవత్సరాల క్రితం మనం ఒకే గొడుగులో వెళ్ళాము గుర్తుందా?అని అడిగాడు.అంత చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యం అనిపించినా ఒక ని. నిర్మల బిత్తరపోయి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టేసరికి నువ్వు అప్పుడు చిన్నపిల్లవి గుర్తుండక పోవచ్చులే అన్నాడు.కాసేపు కుశల పశ్నలు వేసి ఎంత హడావిడిగా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోయాడు.
Tuesday, 8 November 2016
మధుర స్మృతులు
శారద,శ్రావణికి చరవాణి ద్వారా మధుర స్మృతులు అనే వీడియో పంపించింది.ఆ వీడియో చూడగానే శ్రావణికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక్కసారిగా తన మధురమైన బాల్యంలోకి వెళ్ళిపోయింది.కల్మషంలేని స్నేహం,ఆ ఆప్యాయతలు,అందరూ కలిసి కట్టుగా ఆటలు,అల్లరి పనులు,కోతి
కొమ్మచ్చి ఆటలు,తొక్కుడు బిళ్ళ,గోలీలాట,అందరూ బాదం చెట్ల దగ్గర చేరి పెద్ద కంకర రాయితో బాదం కాయలు కొట్టి పప్పులు తినటం,సీమ తుమ్మకాయలు కొయ్యటానికి పెద్ద వాసం తెచ్చి కొంకి కట్టి కష్టపడి కాయలు కోసి అందరూ పంచుకుని తినడం,తాటి కాయలు కోయించి ముంజెలు తినడం,రేగు కాయలు,ఇంట్లో నుండి ఎవరూ చూడకుండా కారం,ఉప్పు తెచ్చి పుల్లటి ఉసిరి కాయలు తినడం,చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగటం,చెట్లు ఎక్కగలవా?గుట్టలు ఎక్కగలవా?అంటూ పోటితో చెట్లు ఎక్కి చిటారు కొమ్మకు చేరడం,అరమగ్గిన,చిలక్కొట్టిన జామకాయలు ఎవరి దొడ్లో ఉంటే వాళ్ళింట్లో పిల్లలందరూ పొలోమంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కాయలు దులిపెయ్యడం,పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్లు నంగనాచి తుంగ బుర్రల్లా కూర్చోవడం,పుస్తకాలు పట్టుకుని తెగ చదివేస్తున్నట్లు నటించడం వాళ్లటు వెళ్ళగానే ఒకళ్ళను చూచి ఒకళ్ళు ముసిముసి నవ్వుకోవడం అన్నీఒకదాని వెనుక ఒకటి సినిమా రీలులా గిర్రున తిరిగాయి.ఒకటే బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి అంటూ స్నేహితురాలు శారద పంపిన వీడియో చూసి అవి ఎన్నటికీ మరిచిపోలేని మధుర స్మృతులు అని శ్రావణి సంతోషంగా ముఖం పెట్టి చరవాణి ద్వారా సమాచారం పంపింది.
Monday, 21 March 2016
పోసగున్న
క్రిష్ మేనత్త కూతురికి ఒక కూతురు,ఒక కొడుకు.పిల్లలు చక్కగా అందంగా,ముద్దుగా,బొద్దుగా ఉంటారు.క్రిష్ కి అప్పుడు పన్నెండేళ్ళ వయసు.వేసవి కాలంలో చల్లదనం కోసం పిల్లలను పడుకోబెట్టటానికి అరిటాకులు తెమ్మని మేనత్త పురమాయిస్తే నిమిషాలలో తెచ్చేవాడు క్రిష్.ఇంకొక మేనత్తకొడుకు తాటిచెట్టు ఎక్కి తాటికాయలు కొస్తే క్రిష్ తాటికాయలు తెచ్చేవాడు.తాటి ముంజెలలో ఉన్న నీళ్ళు పిల్లల శరీరానికి రాస్తే చర్మం ఎండకు పేలకుండా,ఎర్రబడకుండా ఉంటుందని అలా చేసేవాళ్ళు.క్రిష్ చిన్నప్పుడు సన్నగా,రివటలాగా గాలి వస్తే పడిపోయేలా ఉండేవాడు.తను ఎత్తుకోలేకపోయినా పిల్లలు ముద్దొచ్చి ఎత్తుకోవటానికి ఇవ్వమని మేనత్తని అడిగేవాడు.పిల్లలకు ఎక్కడ దిష్టి తగులుతుందోనని నువ్వు ఎత్తుకోలేవు,పడేస్తావు అని చెప్పకుండా ఒక నవ్వు నవ్వేసేది.పిల్లలకు అవసరమైనవి అన్నీ తెస్తున్నాను అయినా ఎత్తుకోవటానికి ఇవ్వటంలేదు అంటూ మారం చేస్తే పోసగున్న అంటూ ముద్దుగా తిట్టి పెద్దగా నవ్వేది తప్ప ఎత్తుకోవటానికి ఎవరికీ ఇచ్చేది కాదు.మేనత్త లేకపోయినా మేనత్త జ్ఞాపకాలు తలుచుకుని పిల్లలను కూర్చోబెట్టి మిమ్మల్ని ఎత్తుకోవటానికి పిల్లలందరమూ పోటీ పడేవాళ్ళమని మీ అమ్మమ్మ,మా మేనత్త ఎవరికీ ఇచ్చేది కాదంటూ క్రిష్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు.
Friday, 4 March 2016
బిట్టుగాడు
నందిత చిన్ననాటి స్నేహితురాలు నందిని చాలా సంవత్సరాల తర్వాత విజయ రాజరాజేశ్వరి దేవి గుడిలో కనిపించింది.చాలాకాలం తర్వాత కనిపించారు కనుక అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఒక ప్రక్కన కూర్చున్నారు.కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఒక అరగంట చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే ఎంతవరకు మా బిట్టుగాడు అలా మా బిట్టుగాడు ఇలా అంటూ మా బిట్టుగాడు ఉన్నంతసేపు ఎవరినీ ఇంటికి రానివ్వడు అంటూ వసపిట్టలా చెప్తుంది.ఇక్కడకు తీసుకురాకపోయవా?అంటే గుడికి తీసుకుని రాకూడదు కదా!అంది.ఎందుకని?అని ఆశ్చర్యంగా అడిగింది నందిత.ఇంతకీ బిట్టుగాడు అంటే మా ప్రియాతి ప్రియమైన పెంపుడు కుక్క.మా అబ్బాయి వేరే రాష్ట్రంలో చదువుకుంటున్నాడు.ఇందాకటి నుండి బిట్టుగాడు అంటే మా అబ్బాయనుకున్నావా?మా అబ్బాయి కన్నా ఎక్కువే అనేసింది నందిని.
Thursday, 17 December 2015
తిక్క దానికో లెక్క
ఎప్పుడూ ఎవరికి వారు హడావిడి జీవనయానంలో పడి కొట్టుమిట్టాడటమే కదా అని రావు గారి కుటుంబం మొత్తం ఒక నెల రోజులు కలిసి సరదాగా,సంతోషంగా ఉందామన్నఉద్దేశ్యంతో అందర్నీతన ఇంటికి ఆహ్వానించారు.అప్పుడు అందరూ ఒకచోట కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలు,మధురస్మృతులు తమ అనుభవాలు నేమరవేసుకుంటూ,అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండగా రావుగారు మా కుటుంబానికో తిక్క దానికో లెక్క ఉంది అన్నారు.అందరూ అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో త్వరగా చెప్పమని అడిగారు.మా తాతల నాటినుండి ఇప్పటివరకు కూడా బాగా కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళమీద పెద్దగా అరిచేస్తామని చెప్పారు.ఎక్కువ కోపంతో తిక్క వచ్చినప్పుడు ఆ సమయంలో ఎదుటివాళ్ళ తప్పు ఏమీ లేదని తెలిసినా,అంతకు ముందు ఎప్పటిదో కోపం మనసులో ఉంచుకుని అరుస్తున్నాడని ఎదుటివాళ్ళు అర్ధం చేసుకోవాలన్నమాట అని చెప్పారు.విచిత్రంగా చూస్తున్న పిల్లలను చాలా అరుదుగా కోపం వస్తుందిలే కంగారుపడకండి అన్నారు.
Wednesday, 18 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా ......(పదకొండవ భాగం)
ఆశకు హద్దు లేదు.ఆశపడటంలో తప్పులేదు కానీ అత్యాశ పడటం మంచిది కాదు.అది మనకు ఎదుటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.ఇప్పుడు వాళ్ళ స్వార్ధం తప్ప ఎదుటివారి ఇబ్బంది గురించి చాలామంది ఆలోచించటంలేదు.ఆమె ఎవరో తెలియక రాణీ మాలినీ దేవిని పెళ్ళి చేసుకుందామని అనుకున్న ప్లీడరు ఆమె ఎవరో తెలిసి అది సాధ్యపడదని అర్ధం చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు.గతం గతః అని వదిలేయకుండా తగుదునమ్మా!అంటూ రాణీ మాలినీ దేవి దంపతులను చూడటానికి వచ్చాడు.వచ్చినవాడు చూచి వెళ్ళిపోతే ఈకథ రాయాల్సిన అవసరమూ ఉండేది కాదు.అతని విచిత్రమైన ప్రవర్తనకు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితీ ఉండేది కాదు.విపరీతమైన కోపంతో,ఈర్ష్యతో దవడ కండరం బిగించి మింగేసేలా చూడటం అతని సంస్కార రాహిత్యనికి చిహ్నం.ఇంటికి వచ్చిన తర్వాత రోజూ అలవాటు ప్రకారం అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఈవిషయం చర్చకు వచ్చింది.అక్కడే నాతో చెపితే సరిపోయేది కదా అన్నారు ఆమె భర్త.గోటితో పోయేది గొడ్డలి వరకూ ఎందుకు?అని చెప్పలేదు అంది రాణీ మాలినీ దేవి.జమిందారు గారి కోరిక మేరకు రాణీ మాలినీ దేవి పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు కనుక వాళ్ళు అతనికి జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్ల మానసికంగా తేడా ఉండి అలా ప్రవర్తించి ఉంటాడు అని తీర్మానించారు.అయ్యో!పాపం అని జాలిపడి ఈవిషయాన్ని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి రాణీ మాలినీ దేవిది.ఎందుకంటే మానసిక రోగి అయినాసరే 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుని ఆమెపై,ఆమె భర్తపై కోపంతో రగిలిపోతున్నాడంటే అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కనుక తగుజాగ్రత్తలో ఉండాలని రాణీ మాలినీ దేవి కుటుంబం నిర్ణయించుకుంది.
(సమాప్తం)
Monday, 16 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా ........(పదవ భాగం)
రాణీ మాలినీ దేవి ఇతన్ని ఎక్కడో చూచినట్లుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది.ఇతనితో మనకు శత్రుత్వం ఏమీ లేదే అలా చూడాల్సిన అవసరం ఏముంది?అనుకుని అంతకుముందే
రాణీ విజయలక్ష్మీ దేవి గారు ప్లీడరు గురించి చెప్పి అతని తమ్ముడిని చూపించడం అకస్మాత్తుగా గుర్తొచ్చింది.ఓహో
రాణీ విజయలక్ష్మీ దేవి గారు ప్లీడరు గురించి చెప్పి అతని తమ్ముడిని చూపించడం అకస్మాత్తుగా గుర్తొచ్చింది.ఓహో
ఇతను ప్లీడరు అయ్యుంటాడు అనుకుంది.35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కనిపించాడు.ఈసారి కోపంగా దవడ కండరం బిగించి మింగేసేలా రాణీ మాలినీ దేవి భర్త వైపు చూస్తున్నాడు.ఇదంతా తెలియని ఆయన ప్రక్కనేకూర్చున్న తెలిసినాయన మాట్లాడుతుంటే వింటూ భోజనం చేస్తున్నారు.రాణీ మాలినీ దేవి భోజనం చేయడం ఆపేసి మరీ అతన్ని కోపంగా చూస్తుండేసరికి అతని తమ్ముడు ఆవిడ చూస్తుంది అని చెప్పేసరికి తల వంచుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.చదువుకునే రోజుల్లో కూడా ఎవరైనా తన వైపు చూస్తుంటే రాణీ మాలినీ దేవి అలాగే కోపంగా మొహం చిట్లించి చూస్తే తల దించుకుని వెళ్ళిపోయేవారు.ఆ చూపుల్లో సూటిదనం నోటితో మాట్లాడకుండానే ఎదుటివాళ్ళ తప్పుని సరిదిద్దుకునేలా చేసేది.
(ముగింపు తదుపరి పోస్టులో)
(ముగింపు తదుపరి పోస్టులో)
Friday, 13 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా..........(తొమ్మిదో భాగం)
మాఘమాసంలో వెంకటేశ్వరస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరిగాయి.జమిందారుగారి కుటుంబాన్ని బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.మిగిలిన అన్ని రోజులు వీలుపడకపోయినా మహామాఘి రోజున జరిగే కళ్యాణమహోత్సవంలో తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పటం వలన రాణీ మాలినీ దేవి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.స్వామి,అమ్మవార్ల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది.ఇసుక వేస్తే రాలదేమో అన్నట్లుగా భక్తులు కల్యాణానికి హాజరయ్యారు.ఆసందర్భంగా భక్తులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.
కల్యాణంలో పాల్గొన్నదంపతులు తప్పనిసరిగా భోజనం చేయాలి కనుక రాణీ మాలినీ దేవి దంపతులు భోజనం చేయటానికి వెళ్లారు.కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.స్వామివారిసేవ చేయటానికి అంటే భోజన ఏర్పాట్లు పర్యవేక్షించటానికి,వడ్డన కార్యక్రమాలు లాంటివి ఎవరైనా చేయవచ్చు కనుక ప్లీడరు తమ్ముడు అంతకు ముందే రాణీ మాలినీ దేవిని చూచి ఉండటంవల్ల తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తారని అన్నకు చెప్పి తీసుకువచ్చాడు కాబోలు.రాణీ మాలినీ దేవి దంపతులు ప్రక్కప్రక్కనే కూర్చుని భోజనం చేస్తున్నారు.మధ్యలో తలపైకెత్తేసరికి కొంచెం దూరంలో వీళ్ళిద్దరినీ మార్చిమార్చి చూస్తూ ఇద్దరు కనిపించారు. అందులో ఒకతను చాలాకోపంగా చూస్తూ కనిపించాడు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
Wednesday, 11 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా.........(ఎనిమిదవ భాగం)
రాణీ మాలినీ దేవి అని తెలియక తమ ఇంటి కోడలిని చేసుకుందామని వచ్చిన తల్లిదండ్రులు కానీ,పెళ్ళి చేసుకుందామని కబురు పెట్టిన అబ్బాయిలు కానీ ఎక్కడైనా ఎదురుపడినా పెద్దలైతే మాట్లాడించడంకానీ,వాళ్ళ అబ్బాయిలైతే తల దించుకుని ప్రక్కకు వెళ్ళిపోతుంటారు.అలాంటిది పొట్టివాళ్ళకు పుట్టెడు బుద్దులని ప్లీడరు తమ్ముడు రాణీ మాలినీ దేవి కనిపించిన విషయం తీసుకెళ్ళి వాళ్ళ అన్నకు ఊదినట్లున్నాడు. ఈ ప్లీడరు అందరికన్నా నిదానం, నోట్లో నాలుకలేదని మొదట అనుకున్నారు.ఇతడు మాత్రం తక్కువ ఏముంది?
(తరువాయి భాగం రేపటి పోస్టులో) Tuesday, 10 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా............(ఏడవ భాగం)
జమిందారు గారు ఉన్నప్పుడు జీర్ణోద్ధారణలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మించేటప్పుడు,క్రొత్తగా కట్టే ఆలయాలకు ధన రూపేణా,వస్తు రూపేణా ఇచ్చేవారు.ఆయనకు దైవభక్తి ఎక్కువ.రాణీ మాలినీ దేవి కుటుంబం చాలాసంవత్సరాల తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చారు కనుక దైవదర్శనం చేసుకోవటానికి ఆలయాలకు వెళ్ళారు.ఆక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు.ఆలయంలో ఏ పూజ జరిగినా వీళ్ళ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనేది కనుక మీరు ఇక్కడలేని వెలితి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని కార్తీక మాసంలో ఫలానా రోజు సత్యన్నారాయణ స్వామి వ్రతంలో తప్పనిసరిగా పాల్గొనాలని పట్టుబట్టారు.సరేనని రాణీ మాలినీ దేవి దంపతులు వ్రతంలో పాల్గొన్నారు.వ్రతంలో పాల్గొన్న వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు.భోజనం చేయకుండా రాకూడదు కనుక రాణీ మాలినీ దేవి కుటుంబం భోజనానికి కూర్చున్నారు.ఇంతలో అక్కడ ప్లీడరు తమ్ముడు రాణీ మాలినీ దేవి కనిపించేసరికి ఆమె అవునో కాదో సరిగా గుర్తుపట్టక నాలుగైదు సార్లు కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగి రాణీ విజయలక్ష్మి గారితో మాట్లాడుతుండగా చూచి ఆమేనని నిర్ధారణకు వచ్చి మొహం వేలాడేసుకుని ఒకప్రక్కన కూర్చున్నాడు.ఎందుకో అంత బాధ?
(తరువాయి భాగం రేపటి పోస్టులో) Monday, 9 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా ............(ఆరవ భాగం)
సంతోషంగా కాలం గడిచిపోతున్న సమయంలో జమిందారు గారికి అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చి ఆసుపత్రికి వెళ్ళే సమయం కూడా లేకపోవడంతో పరమపదించారు.ఈ హఠాత్పరిణామనికి అందరూ నివ్వెరపోయారు.అందరి మధ్య సంతోషంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయన ఇక లేరు అనుకునేసరికి బాధతో అందరి హృదయాలు బరువెక్కాయి.రాణీ విజయలక్ష్మీ దేవిగారి సంగతి చెప్పనవసరం లేదు.ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సతమతమై చిక్కిశల్యమయ్యారు.రాణీ మాలినీ దేవికి బాధగా ఉన్నా తల్లిని కూడా ఆబాధ నుండి బయట పడెయ్యాలి కనుక గుండె దిటవు చేసుకుని అమ్మ గారికి స్వాంతన వచనాలతో ధైర్యం చెప్పటం మొదలు పెట్టింది.మనుమడు,మనుమరాలు వైద్య వృత్తి చేపట్టి ప్రత్యేకంగా పేదప్రజలకు కూడా సేవచేయాలని జమిందారుగారి సత్సంకల్పం.అందుకని ఆయన కోరిక మేరకు వైద్య వృత్తిని స్వీకరించి జమిందారుగారి సంకల్పం నెరవేర్చాలనే ప్రయత్నంలో ఉన్నారు.జమిందారు గారి జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో స్థల మార్పిడి కోసం రాణీ విజయలక్ష్మీ దేవిగారిని తీసుకుని అందరూ విదేశాలకు వెళ్లారు. మరల ఒక పది సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చారు.జమిందారుగారు లేని లోటు తీర్చలేక పోయినా తిరిగి ఆ ఇంట పూర్వపు వైభవం చోటుచేసు కున్నందుకు అందరూ సంతోషించారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
Saturday, 7 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా.........(ఐదవ భాగం)
రాణీ మాలినీ దేవి చదువు పూర్తయ్యేటప్పటికి జమిందారుగారు పెళ్ళి సంబంధాల వేటలో పడ్డారు.ఆయన ఎంత అపురూపంగా పెంచుకున్నారో అదే విధంగా వచ్చే అల్లుడు కూడా చూచుకోవాలనే ఉద్దేశ్యంతో చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టి గాలించిన విధంగా వెదికి,ఎన్నోరకాలుగా పరీక్షించి ఎట్టకేలకు ఒక సంబంధం కుదుర్చుకున్నారు.ఎలాగైతేనేం ఆయన అనుకున్న విధంగానే మంచి వరుడు దొరికాడు.జమిందారుగారు రంగరంగ వైభవంగా రాణీ మాలినీ దేవి వివాహం జరిపించారు.ఏ తల్లిదండ్రులైనా తామెంత అపురూపంగా పెంచామో అంతకన్నా బాగా చూచుకోగలిగే భర్త కూతురికి లభించాలని కోరుకుంటారు.అలాగే జమిందారుగారు ముందుగా అనుకున్నట్లుగానే రాణీ మాలినీదేవికి మంచి భర్త లభించాడు.అనతికాలంలో ఆఇంట బుల్లి రాణీ,బుల్లి రాజావచ్చి వాళ్ళ ముద్దుమురిపాలతో,ఆటపాటలతో ఇల్లంతా సందడి చేస్తుండగా అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో )Friday, 6 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా.........(నాలుగవ భాగం)
వీళ్ళే కాక జమిందారుగారి దగ్గరకు 4,5 గురు మగపిల్లల తల్లిదండ్రులు వచ్చి అడిగితే మొదటివాళ్ళకు చెప్పిన సమాధానమే మిగతావాళ్ళకు చెప్పారు.నొప్పించక తానొవ్వక అన్నట్లుగా వచ్చిన అందరికీ
బాధ కలుగకుండా ఉండే విధంగా చక్కగా వివరించి చెప్పారు.
బాధ కలుగకుండా ఉండే విధంగా చక్కగా వివరించి చెప్పారు.
ఈలోపు మొదటగా కబురు పంపించిన ప్లీడరు తల్లిదండ్రులు కొడుకుకు నచ్చచెప్పి చుట్టాల్లో అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు.దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల తర్వాత అనారోగ్యంతో ప్లీడరు భార్య చనిపోయింది.వీళ్ళకు పిల్లలు కూడా కలగలేదు.కూతురు చనిపోయిన దుఖంలో నుండి బయటపడటం కష్టంగా ఉండి అల్లుడిని వాళ్ళదగ్గరే ఉండాలని కోరటం వల్ల అత్తారింట్లో ఉండిపోయాడు.అత్త చెల్లెలి కూతుర్నిమాట్లాడి అల్లుడికి రెండవ పెళ్ళి చేశారు.కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కలిగి బాగానే ఉన్నారు.చెల్లెలి కూతుర్లో తన కూతుర్ని చూచుకుని ఆపిల్లల ఆలనా పాలనా చూస్తూ అందరూ కలిసిమెలిసి ఉన్నారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
Thursday, 5 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా.......(మూడవ భాగం)
జమిందారుగారికి విపరీతమైన కోపంవచ్చి ఆవేశంతో ఊగిపోతూ మా అమ్మాయిని
ఇవ్వమని అడగటానికి ఎంత ధైర్యం?అంటూ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు.మధ్యలో వచ్చిన పెద్ద మనిషి ఆయన్ను శాంతపరచే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది.మీరు అన్యధా భావించకండి.విషయం చెప్పి మీకు అభ్యంతరం లేకపోతే ఆలోచించి మీ అభిప్రాయం చెప్పమన్నారని చెప్పారు.ఆలోచించనవసరం లేదు.రాణీ మాలినీ దేవికి చదువు పూర్తయ్యే వరకూ వివాహం జరిపించే యోచనలేదని చెప్పండి.మీరు ఇక దయచేయవచ్చుఅని జమిందారుగారు నిర్మొహమాటంగా,నిక్కచ్చిగా చెప్పారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
Wednesday, 4 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా.......(రెండవ భాగం)
రాణీ మాలినీ దేవి జమిందారుగారి అమ్మాయని తెలియగానే మనబ్బాయికి ఇవ్వమని అడగటం బాగుండదని చెప్పినా ఒకసారి వెళ్ళి మాట్లాడండి.మనం ఏవేవో ఉహాగానాలు చేసేకన్నా వాళ్ళింటికి వెళ్ళి మేము కబురు పంపినట్లుగా చెప్పమని చెప్పారు.ఏ సమాధానము వచ్చినా ఫరవాలేదు అని చెప్పారు.సరేనని భయపడుతూనే పెద్దాయన స్నేహితులను తీసుకుని వెళ్ళాడు.నసుగుతూనే ఉన్న విషయం చెప్పారు.అనుకున్నట్లుగానే చుక్కెదురైంది.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
Tuesday, 3 February 2015
దవడ కండరం బిగించి మింగేసేలా......(మొదటి భాగం)
ఇది నిజంగా 35సంవత్సరాల క్రితం జరిగిన యదార్ధ గాథ మరియు ప్రస్తుత సంఘటన.
రాణీ మాలినీదేవి పేరుకు తగినట్లుగానే అందమైన,జమిందారీ వంశానికి చెందిన ఏకైక గారాబు బిడ్డ.కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా తల్లిదండ్రులు,వాళ్ళ తల్లిదండ్రులు,పరివారము కూడా క్రింద దించే వాళ్ళు కాదు.రాణీ మాలినీ దేవి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ అందంతో పాటు తెలివికలది కనుక చదువులో కూడా రాణించటం మొదలెట్టింది.ఆమెను ఇంట్లోవాళ్ళేకాక ఊరివారందరు కూడాఎంతో ఇష్టపడేవాళ్ళు.కళాశాలకు చాలా నిరాడంబరంగా
ఫలానా అని తెలిసినవాళ్ళెవరయినా చెబితే తప్ప తెలియనంత సాదాసీదాగా వెళ్ళి వస్తుండేది.ఎందుకంటే రాణీమాలినీ దేవి తల్లి రాణీ విజయలక్ష్మీ దేవికి తన అందమైన కూతుర్నిఎవరైనా మోహిస్తారేమోనని భయం.
రాణీ మాలినీదేవి పేరుకు తగినట్లుగానే అందమైన,జమిందారీ వంశానికి చెందిన ఏకైక గారాబు బిడ్డ.కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా తల్లిదండ్రులు,వాళ్ళ తల్లిదండ్రులు,పరివారము కూడా క్రింద దించే వాళ్ళు కాదు.రాణీ మాలినీ దేవి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ అందంతో పాటు తెలివికలది కనుక చదువులో కూడా రాణించటం మొదలెట్టింది.ఆమెను ఇంట్లోవాళ్ళేకాక ఊరివారందరు కూడాఎంతో ఇష్టపడేవాళ్ళు.కళాశాలకు చాలా నిరాడంబరంగా
ఫలానా అని తెలిసినవాళ్ళెవరయినా చెబితే తప్ప తెలియనంత సాదాసీదాగా వెళ్ళి వస్తుండేది.ఎందుకంటే రాణీమాలినీ దేవి తల్లి రాణీ విజయలక్ష్మీ దేవికి తన అందమైన కూతుర్నిఎవరైనా మోహిస్తారేమోనని భయం.
అనుకున్నట్లుగానే ఒకసారి ప్రక్క ఊరి ప్రెసిడెంటుగారబ్బాయి ప్లీడరు చూచి మామూలు అమ్మాయనుకుని ఇష్టపడి ఫలానా ఊరిలో అమ్మాయి నచ్చింది.మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం జరిపించమని అమ్మానాన్నలకు చెప్పాడు.మా అబ్బాయికి ఇన్నాళ్ళకు నచ్చినమ్మాయి దొరికింది కదా అనుకుని సంబరపడి వీళ్ళఊరివాళ్ళు కనిపిస్తే మీఊరిలో అందమైన అమ్మాయి చదువుకోవటానికి రోజు కళాశాలకు వెళ్తుందట.కొంచెం ఎవరో కనుక్కుని మా అబ్బాయికి పెళ్ళి సంబంధం కుదర్చమని చెప్పారట.మొదట వాళ్ళకు అర్ధంకాలేదు.అందరినీ అడగ్గా అడగ్గా చివరికి ఫలానా జమిందారుగారమ్మాయని తెలిసింది.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)Thursday, 13 November 2014
బుడ్డిగాడు
సురేంద్ర,నాగేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు.బాబు,పాప.భార్యభార్తలిద్దరూ కష్టపడే తత్వం కలవాళ్ళు.ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నారు.వాళ్ళు కష్టపడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి గురించి కలలుకంటూ మంచిస్కూల్లో చేర్పించారు.వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు.
వీళ్ళ కుటుంబాన్ని చూచి అందరూ ముచ్చటపడేవారు.పాప హైస్కూల్లో చదువుతుండగా స్కూల్లో ఏదో గొడవ జరిగిందని తెలిసీ తెలియనితనంతో ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.ఆబాధ తట్టుకోలేక,ఆఅమ్మాయి జ్ఞాపకాలు మర్చిపోలేక ఆఇంటిని వదిలి సిటీకి మకాం మార్చారు.ఎక్కడికి వెళ్ళినా ఎలా మరచిపోగలరు?నాగేశ్వరి మానసికంగా కృంగిపోయి నాపిల్లను తెచ్చివ్వండి అంటూ ఏడవటం లేదా తెచ్చివ్వలేకపోతే ఎలాగైనా నేను మళ్ళీ ఆడపిల్లను కనవలసిందేనని పట్టుబట్టి ఎవరు చెప్పినా వినకుండా 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరల రీకెనలైజేషన్(పిల్లలు పుట్టకుండా చేయిచుకుని తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవటం అన్నమాట) చేయించుకుని అదే ఆడపిల్ల మళ్ళీ తన కడుపున పుడుతుందనే పిచ్చి నమ్మకంతో చివరకు మళ్ళీ మగబిడ్డకు జన్మనిచ్చింది.పిల్ల బ్రతికుండగా నేను మపిల్లాడినయితే బాగుండేది అనేది కనుక మగబిడ్డ రూపంలో పుట్టిందని సరిపెట్టుకుని అపురూపంగా పెంచుకుంటూ పాత జ్ఞాపకాలను కొంతవరకు తరిమి కొట్టింది.వాడిని బుడ్డిగాడు అని ముద్దుగా పిలిచేది.వాడు పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నా,పెళ్లీడు కొచ్చినాబుడ్డిగాడు అని పిలుస్తుంది. కొద్దిసేపు కనిపించకపోయినా మా బుడ్డిగాడు ఏమి చేస్తున్నాడో?అంటూ మితిమీరిన ప్రేమతో బుడ్డిగాడి గురించి తెగ బాధపడిపోతుంటుంది.ఈ ఉదంతం గురించి తెలిసు కనుక బుడ్డిగాడు అంటూ ఎప్పుడూ కలవరిచినా,వాడి ముచ్చట్లు చెప్పినా ఎవరూ విసుక్కోరు.
Labels:
జ్ఞాపకాలు
Friday, 25 April 2014
పల్లెకుపోదాం చలోచలో
శర్వాణి నగరం నుండి వీలయినప్పుడల్లా ఇప్పటికీ నెలకి ఒకసారైనా పల్లె అందాలు ఆస్వాదించడం కోసం వాటిని పిల్లలకు చూపించి పల్లెల గొప్పతనం పిల్లలకు తెలియచెప్పడానికి కుటుంబంతో కలిసి పల్లెకు హుషారుగా వెళ్తూ ఉంటుంది.శర్వాణికి తను పుట్టి పెరిగిన పల్లెలన్నా,ఆవాతావరణమన్నా ఎంతో ఇష్టం.ఆవాతావరణం,కొండలు,కోనలు,నదులు,కాలువలు,పంట కాలువలు,పొలాలు అవన్నీ చూస్తుంటే చిన్నప్పటి ఆటలు,కాలువ దాటటానికి బోదెలపై నిదానంగా ఒకరి భుజంపై ఒకరు చెయ్యేసుకుని జాగ్రత్తగా దాటటానికి,చెట్లెక్కి కాయలు కోయటానికి చేసిన ప్రయత్నాలు జ్ఞప్తికి వచ్చి నగరంలో రణగొణధ్వనుల మధ్య పడ్డ మానసిక ఆందోళన పోయి మనసు ప్రశాంతంగా హాయిగాఉంటుంది.ఎడ్లబళ్ళు,ఆవులు,గేదెలు,మేకలు,గొర్రెలు,ఊరపిచ్చుకలు,రకరకాలపక్షులు,గిన్నెకోళ్ళు,జెముడు కాకులు,కోయిలలు,జామచెట్ల మీద దోర జామ కాయలను తినటానికి వచ్చే చిలుకలు,ఒకటేమిటి అవన్నీ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి."పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు".లేత మొక్కజొన్నపొత్తులు,వేరుశనగ కాయలు,లేత తాటి ముంజలు,కంది కాయలు,సీమతుమ్మ కాయలు,మామిడి కాయలు,చెరుకు గడలు,తంపటి వేసిన వేరుశనక్కాయలు,తేగలు,బాదం కాయలు,పండు తాటికాయలు నగరంలో తినాలన్నా,ఎంత డబ్బు పెట్టినా దొరకనివి పల్లెల్లో ఎన్నో.శార్వాణి చిన్నతనంలో వీధి మొత్తం బంధువులే ఉండేవారు.పొలాల్లో పండిన పంటలను ఇళ్ళ ముందు రాసులుగా పోసేవారు.పిల్లలు ఆ రాసులమీద ఎక్కి పైనుండి క్రిందికి జారుతూ ఆటలాడేవారు.ఇళ్ళముందు పెద్దపెద్ద పురులు కట్టి వడ్లు పోసి నిల్వ చేసేవాళ్ళు.అంతకు ముందు రోజుల్లో పాతర అంటే చాలా పెద్దగుంట బాదంకాయ ఆకారంలోకానీ,గుండ్రంగాకానీ తీసి మందంగా వరిగడ్డి పరిచి చాపలు వేసి వడ్లు,పసుపు నిల్వ చేసేవాళ్ళు.వేరుశనగ మొక్కలు,మొక్కజొన్న కండెలు రాసులుగా పోసేవాళ్ళు.ఆడవాళ్ళందరూ భోజనాలు చేసి మధ్యాహ్నం పూట పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ వేరుశనగ కాయలు,మొక్కజొన్న కండెలు వలిచేవాళ్ళు.పిండివంటలు కూడా బంధువులు అందరూ కలిసి ఒకచోట వండుకునేవాళ్ళు.ఎప్పుడూ ఆ వీధి వీధి సందడి సందడిగా ఉండేది.ఇప్పటికీ అలాగే సందడిగా ఉంటుంది.శర్వాణికి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి.ప్రశాంతంగా ఉండాలన్నా,ప్రకృతిని ఆస్వాదించాలన్నా పల్లెకు వీలయినప్పుడల్లా పిల్లలను కూడా తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్లకు కూడా ప్రకృతి అందాలను తిలకించటం అలవాటవుతుంది.నగరంలో తినే ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా పల్లెటూరి రుచులు అలవాటు చేస్తే సెలవులు వచ్చినప్పుడు పిల్లలు కూడా పల్లెకు పోదాం చలోచలో అంటారు.
Saturday, 30 November 2013
నాటీ బాయ్
సంయుక్త వాళ్ళ బాబు పేరు షానోజ్. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు.ఐదు నెలలకే అత్త,తాత అంటూ చిన్నచిన్నమాటలు చెప్పేవాడు.కూర్చోవటం వచ్చినప్పటి నుండి అందరూ భోజనం చేసేటప్పుడు బాబుని భోజనాల బల్ల మీద కూర్చోపెట్టి తినటం అలవాటు అవుతుందని చిన్న వెండి పళ్ళెంలో కొంచెం పెట్టి ఇచ్చేవాళ్ళు.అన్నప్రాశన అయిన దగ్గర నుండి కూడా టొమాటోచారు కొత్తిమీరతో ఘుమఘుమలాడితేనే తినేవాడు.పెరుగు ప్రక్కన ఎవరైనా తింటున్నా వాంతి చేసుకునేవాడు.ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా పెరుగు అన్నం తినేవాడు కాదు.నడకవచ్చిన దగ్గరనుండి కుర్చీలకు ఉన్ననట్టులు,బోల్టులు ఎక్కడ కనపడితే అక్కడ చేత్తోనే ఊడతీసి ఎక్కడో ఒకచోట పడేసేవాడు.సంయుక్త వాళ్ళు మొదటి అంతస్తులో ఉండేవాళ్ళు.ఇంటితాళాలు క్రింద మొక్కల్లో పైనుండి క్రిందికి పడేస్తుండేవాడు.ఒకసారి రెండురోజులు వెతుక్కుంటే కానీ ఆవిషయం అర్ధంకాలేదు.ఒకరోజు సంయుక్త లోపల ఉండగా మెట్లుదిగి రోడ్డు మీదకు వెళ్ళాడు.బంగారు మొలత్రాడు, చేతులకు వత్తులు,గొలుసులు ఉండేవి.వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల వాళ్ళు ఎవరి బాబో నగలు ఉన్నాయి అని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేశారు.లేకపోతే మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోయేవాడు.అప్పుడు ఎవరోఒకరు బాబును చంకన వేసుకుని ఎత్తుకెళ్ళిపోయేవారు.ఎక్కడ పంపు కనిపిస్తే అక్కడ పంపు వదిలేసి నీళ్ళతో ఆటలాడి బట్టలు తడుపుకోనేవాడు.కొంచెం పెద్దయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి అల్లరి చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని అందరూ మనింట్లోనే ఆడుకోండి అని సంయుక్త చెప్పటంతో పొలోమంటూ ఆ వీధిలో ఉన్న పిల్లలు,ప్రక్క వీధిలో పిల్లలు అందరూ వచ్చి ఆటలాడి బాగా అల్లరి చేసేవాళ్ళు.పిల్లలు అందరూ బాట్ లతో ఆటలు ఆడి పిల్లర్లు,పువ్వుల కుండీలు అన్నింటిని పగలకొట్టేవాళ్ళు.ఏడవ తరగతికి వచ్చేటప్పటికి అల్లరి తగ్గింది.చిన్నప్పుడు పిల్లలు చేసిన అల్లరి పిల్లలకు,పెద్దలకు కూడా మధుర జ్ఞాపకాలుగా ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి.తలచుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)
