బంధాలకు విలువ ఇచ్ఛేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటున్నారు. ఎక్కవమంది డబ్బు కాంక్షతో బ్రతుకుతున్నారు.ఆ కోవకు చెందినవాడే శ్రీకర.వయసు అరవై ఏళ్ళు.కష్టపడి సంపాదించుకుంటే ఎవరికీ సమస్య ఉండదు. అందరికీ సంతోషం. చిన్నప్పటి నుండి చదువుకోకుండా పెద్దవాళ్ళ కష్టం అర్థం చేసుకోకుండా సైకిలు కొంటె పాఠశాలకు వెళ్తానని, మోటారు సైకీలు కొంటేనే కళాశాలకు వెళ్తానని, కారు కొంటేనే బ్రతుకు అని మొండిగా ప్రవర్తించేవాడు. పెళ్లి చేస్తేనన్నా సరిగ్గా ఉంటాడని అనుకుంటే వఛ్చిన అమ్మాయి బాధ్యత తెలియనిది.పునుగులు, బజ్జీలు రోడ్లమీద కొనుక్కుని తినేది. రోజూ ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని అమ్మానాన్న కారు కొనిస్తే ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్పి ఎక్కడో ఒకచోట తిని అర్ధరాత్రికి తిరిగి వఛ్చి ఇద్దరు బిడ్డలను కానీ వాళ్ళను కూడా బాధ్యత తెలియకుండా చదువు సరిగా అబ్బకుండా పెంచారు. బంధాలకు విలువలు తెలియదు.భార్య ముంగి లాగా చూస్తూ కూర్చుంటుంది.దొందు దొందే. పక్కవాళ్ళ ఆస్థి మేద్దామనే ఇద్దరి ఆలోచన.భర్త నోరు వేసుకుని గట్టిగట్టిగ అరిచి ఏదో సాధించానని భ్రమలో ఉంటాడు. సంపాదించుకోవడం చేతకాక మేనమామ ఆస్థి కొట్టేశాడు. అది చాలదని అక్కకు పసుపుకుంకుమల క్రింద ఇఛ్చిన ఆస్థిలో కొట్టేసి పొలాల కొలతల్లో మోసం చేసి నాకు పోరంబోకు కలిసిందని అబద్దం ఆడడమేకాక మీ ఆస్థి నాకు అక్కరలేదనిఅది నాదే అని పోట్లాడడం మొదలెట్టాడు. నగరం నడిమధ్యలో పోరంబోకు లేదన్నది జగము ఎరిగిన సత్యం.తాత్కాలికముగా బాగుపడినా అక్రమాస్థులు ఎన్నాళ్ళో నిలవవు ఆన్నది అందరికీ తెలిసినదే. ఆందరికీ పంచాయితీ చెప్పేవాడు తనవరకు వచ్ఛేసరికి బంధాలకన్నా డబ్బు కాంక్ష ఎక్కువై కళ్ళు మూసుకుపోయాయి.మేనమామ అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చోబెట్టాడు.అక్క, బావ పని చేయకపోయినా దర్జాగా ఉండడానికి ఎంతో చేశారు. బంధాల విలువలు తెలుసు కనుక కుటుంగా గౌరవం రోడ్డుకీడ్చడం ఎందుకు అని మేనమామ, అక్క వదిలేయడంతో బ్రతుకుతున్నాననే విషయాన్నీ విస్మరించి నా నోటి ధాటికి తట్టుకోలేక ఏమీ అనలేదని విర్రవీగుతున్నాడు.ఇంట్లో ఇంట్లోనే మోసం చేసి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకేనా? అనుకుంటే అన్నం కూడా తినలేడు. బంధాల కన్నా డబ్బు కాంక్ష ఎక్కువై పోయింది. ఎవరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు మోసగాడిగా ముద్ర వేసుకుని గొప్పగా బ్రతికి కుళ్ళికుళ్ళి చచ్ఛేకన్నా నిజాయితీగా సామాన్య జీవితం గడిపినా ప్రశాంతంగా చనిపోతారు.ఇదంతా సోది నాకు డబ్బే ముఖ్యం అంటాడు వెధవ.వెధవ అంటే వెయ్యేళ్ళు ధనవంతుడువై వర్ధిల్లు అని తోడబుట్టినది కదా చెడుచేసిన మంచే కోరుకుంటుంది.
Tuesday, 5 May 2026
Monday, 4 May 2026
వేసవిలో చల్లచల్లగా బార్లీ
బార్లీ వలన అనేక ఉపయోగాలున్నా కూడా దీనిని వాడడానికి అందరూ ఇష్టపడరు. బార్లీ గింజలు ఉడికించి వడకట్టి ఆ నీటిని త్రాగడం వలన శరీర వేడి తగ్గి చలువ చేస్తుంది అని ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అమ్మ చెప్పింది..మూత్రపిండాలు,మూత్రనాళ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.బార్లీ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం రానివ్వదు. గర్భిణీ స్త్రీలకు కాళ్ళు వాపులు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిల్ని నియంత్రిస్తుంది.బరువు తగ్గాలనుకకునేవారు సైతం బార్లీ ఏదో ఒక రూపంలో వాడితే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గుతారు.చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. బార్లీ నీళ్లతో ముఖం కడిగితే మొటిమలు,మచ్చలు పోతాయి. బార్లీ గింజలు ఉడికించి నీళ్లు త్రాగి ఆ గింజలతో ఉప్మా, కిచిడీచేసుకోవచ్చు.ఉడికిన గింజలు మిక్సీలో వేసి కొద్దిగా బియ్యప్పిండి,ఉల్లి, పచ్చిమిర్చి,అల్లం, కరివేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి అన్నీ కలిపి వడలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. అమ్మ బార్లీ వడలు వేస్తుంది.పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.ఇంకెందుకు ఆలస్యం బార్లీని ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యం స్వంతం చేసుకుందాము.
Sunday, 3 May 2026
కంటి సమస్యలకు జేజి చిట్కా
ఈ రోజుల్లో కంటి సమస్యలు పిల్లల నుండి పెద్దల వరకు సర్వ సాధారణము అయిపోయింది.దీన్ని అధిగమించడానికి జేజి ఒక చిట్కా చెప్పింది. అది ఏమిటంటే చెట్టునుండి మునగాకు కోసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి.కొద్దిగా ఎండిన తర్వాత వేయించి పొడి చేసుకోవాలి. ఒక 90 గ్రా. పొడికి 10 గ్రా. వేయించిన కరక్కాయ పొడి కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఒక 1/4 చెంచా పొడి,ఒక కప్పు పాలల్లో తాటి బెల్లం కలిపి త్రాగాలి. క్రమంగా కంటి సమస్యలు తొలగిపోతాయి.దీనితోపాటు పొన్నగంటి ఆకుకూర తినండి. కంటి చూపు మెరుగు పడుతుంది.
Saturday, 2 May 2026
నవ్వుతూ బ్రతకాలి
ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని బిగ్గరగా నవ్వితే పిల్లల్ని కోప్పడేవాళ్ళు పెద్దవాళ్ళు.ఇప్పుడు నవ్వు నవ్వించు అని చెప్పడం అలవాటు చేసుకున్నారు.ఈమధ్య నవ్వడమే మర్చిపోతున్నాము.నవ్వడం వలన మనస్సు తేలికగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.నవ్వడం వలన మనలో సానుకూలత పెరుగుతుంది. నవ్వుకి భాషతో సంబంధం లేదు.ఒక చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించవచ్చు.నవ్వుతూ బ్రతకాలిరా అని సినీ రచయిత అన్నట్లు బ్రతికినన్నాళ్ళు నవ్వుతూ హాయిగా, ఆనందంగా బ్రతకాలి. ఎన్ని సమస్యలున్నా ముఖంపై నవ్వు చెదరనీయకూడదు.జీవితం అంటే పరుగు కాదు.జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడం.నవ్వు నలుగురిని నవ్వించు.ఈ రోజుల్లో ఎంత ఆస్తి ఉన్నదనో, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నదనో కాదు లెక్క ఎంత ఆనందంగా ఉన్నామనేదే లెక్క.చనిపోయేటప్పుడు కూడా నవ్వుతూ చనిపోయేవాళ్ళు అదృష్టవంతులు.అలాగే సానుకూలంగా ధృక్పదంతో ఉంటే తప్పకుండా సాధ్యపడుతుంది.ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక్కరోజే కాదు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
బియ్యం లేకుండా దోశ
ఉలవలు - 1 కప్పు
ఏదైనా ఒక చిరు ధాన్యం - 1 కప్పు
మినపగుళ్ళు - 1/2 కప్పు
మెంతులు - 1చిన్న చెంచా
వీటన్నింటిని శుభ్రంగా కడిగి విడివిడిగా 8 గం. నానబెట్టి మెత్తగా పిండి రుబ్బాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.5,6 గం.నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటాయి.మనకు ఏ రకంగా నచ్చితే ఆలా వేసుకోవచ్చు.ఈ పిండిలో మనకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవచ్చు.కొద్దిగా సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారట్ తురుము దోశపై వేసుకుంటే బాగుంటుంది.టమాటో, చట్నీ లేదా వేరుశెనగ చట్నీ, అల్లం పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దోశ చాలా బాగుంటుంది.
నిద్రలేమి,ఒత్తిడికి అమ్మ చిట్కా
ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అన్నది సర్వసాధారణమై పోయింది. రోజూ 6 నుండి 8 గంటలు నిద్ర పట్టినట్లయితే ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీనితోపాటు కొద్దిపాటి వ్యాయామం, అదే పనిగా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతోపాటు మతిమరుపు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈమధ్య జరిపిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.అందుకోసం అమ్మ ఒక చిట్కా చెప్పింది అదేంటంటే సోంపు -50 గ్రా., మిరియాలు - 5 గ్రా., జాజికాయ - 2 1/2 గ్రా., యాలకులు - 10 గ్రా., బాదాంపప్పు 40 గ్రా., గసగసాలు - 30 గ్రా., పటికబెల్లం 20 గ్రా., బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ఉ, సా. భోజనం తర్వాత 1 చెంచా చొప్పున నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 20 రోజులు చేస్తే మంచి నిద్ర పట్టి ఒత్తిడి దరిచేరదు.మంచి అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యంతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది.
Thursday, 23 April 2026
పుస్తకం
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం గురించి వ్రాయాలని అనిపించింది.పుస్తకం ఒక స్నేహితురాలు లేకపోతే స్నేహితుడు.కొంతమంది స్నేహితులతో అయినా మాట్లాడకుండా ఉండగలరేమో కానీ పుస్తకం చదవకుండా ఉండలేరు.నేను కూడా అంతే.బహుశా ఆ అలవాటు మా తాతగారి నుండి వచ్చింది. ఆయన ఒక పుస్తకం చదవడం మొదలు పెడితే అది అయిపోయేవరకు చుట్టుప్రక్కల ఏమీ జరుగుతుందో పట్టించుకోనంతగా పుస్తక పఠనంలో లీనమైపోయేవారు. ఇ - పుస్తకాలు రావడంతో ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గినా కూడా పుస్తక ప్రియులు ఉండబట్టే పుస్తక మహోత్సవాలు కళకళలాడుతున్నాయి.రోజు ఒకే పుస్తకం చదివినా ఒక్కోరోజు ఒక్కొక్క రకంగా అర్థం స్పురిస్తుంది. రోజూ పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.మన ఆలోచనల్లో మార్పుతోపాటు జ్ఞానం వస్తుంది. ఈరోజు నుండి పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.రోజులో కొద్దిసేపైనా చదవడానికి ప్రయత్నించండి.
Monday, 20 April 2026
ఆరోగ్యానికి ఆరోప్రాణం
ఆరోగ్యానికి ఆరోప్రాణం పీచు పదార్ధం. మనము ఇంటిని శుభ్రం చేసుకున్నట్లగానే మన ఒంటిని శుభ్రం చేసే పోషక పదార్ధమే పీచు పదార్ధం. ప్రేగుల్ని, రక్తనాళాల్ని శుభ్రం చేస్తూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్ధాల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇదే కాకుండా మలబద్ధకం, క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరనివ్వదు. పీచు పదార్ధం తగినంత అందాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,తృణధాన్యాలు,ఓట్స్,బీన్స్,కందిపప్పు, చిక్కుడు గింజలు, శనగలు మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది.నిమ్మజాతి పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు,బార్లీ,గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, దోసకాయలు, చిలకడ దుంపల్లో ఉంటుంది. బాదం, వాల్నట్లు, పొద్దుతిరుగుడు, చియా గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది.రోజు పండ్లు, కూరగాయలు, గింజలు అన్నీ సమంగా ఉంటే పీచు బాగా అందుతుంది. వీటితోపాటు నీళ్లు బాగా తాగితే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుండి పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు,గింజలు, అన్నీ సమపాళ్ళల్లో అందిస్తూ రాగి జావ, పప్పులతో కిచిడీ వంటివి ఆహారంలో భాగం చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనంత పీచు లభిస్తుంది.జీవనశైలి మార్పులతో వచ్ఛే అనేక రోగాలకు అడ్డుకట్ట వేయగలము. ఈ చిన్నమార్పుతోనే ఎంతో లాభాన్ని పొందవచ్చు.ముందు పెద్దలు మారితే పిల్లలు మారతారు.
Wednesday, 8 April 2026
కలియుగ మంధర
చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఏ కాలంలో అయినా ఉంటారు వినేవాళ్ళు ఉంటే ఎన్నయినా చెప్తూ ఉంటారు. చాడీలు చెప్పి సంసారాలు అల్లకల్లోలం చేస్తూ ఉంటారు,ఇప్పుడు ఇంటికి ఓక మంధర ఉంటుంది.అందరూ కాదు కానీ ఎక్కువమంది ఇలాగే ఉంటున్నారు. పెద్దవాళ్ళ డబ్బు కావాలి.ఆ డబ్బు తీసుకునేవరకు ప్రేమ నటించడం తరువాత వేరే వాళ్ళ దగ్గర విమర్శించడం పరిపాటి అయిపోయింది.తల్లిదండ్రులు గురించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు గురించి, మేనమామలు గురించి ఉన్నవి లేనివి కల్పించి పొద్దస్తమానం ఉద్యోగం చేసి ఇంటికి వఛ్చిన భర్త మెదడు తినేసి అనందంతో హాయిగా భర్తకు తిండి కూడా సరిగా పెట్టకుండా తాను మాత్రమే తిని నిప్పుపెట్టాను కదా!అదే రాజకుంటుందిలే అని బొజ్జునే అమ్మలక్కలు కోకొల్లలు.సరైన బాధ్యత కల భర్తలు అయితే ఒక నిముషం విని తగువు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని అలోచించి తన పని తాను చూసుకుంటాడు. అదే భార్య ఏమి చెప్పినా గ్రుడ్డిగా నమ్మే అతి ప్రేమ గల భర్తలు అయితే కొంప కొల్లేరు అయిపోతుంది.ఒక నిముషం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఏమీ కాదు తనవాళ్ళ గురించి తనకు తెలియదా?పెద్దంతరం, చిన్నంతరం అని తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత భార్య చెప్పిందని మాట్లాడితే పెద్దవాళ్ళ మనసు భాధ పడి గుండె ముక్కలైతే అతకడం కష్టం. ఏముందిలే నేను నా భార్య ఎవరు అవసరం లేదు అనుకుంటే ఒకటే మాట.కల్లబొల్లి కబుర్లలో ఎంత నిజం ఉందో తెలిసినా కళ్ళకు మాయ అనే పొర కప్పేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి. తెలుసుకునేసరికి ఒంటరితనం తప్ప ఏమీ ఉండదు.ఆమె తన తల్లిదండ్రులతో అధిక ప్రేమ ఒలకబోస్తూ భర్త తల్లిదండ్రులను దూరం చేయడం ఈనాటి కలియుగ మంధర యొక్క లక్ష్యం. కుటుంబం అంటే విలువలు తెలిసిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే ఈ కలియుగ మంధరల బారిన పడుతున్నారు. మనము అందరము ఒకటి అనుకుని ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటే ఎంత గౌరవంగా ఉంటుంది.అందరి ప్రేమానురాగాలతో పిల్లలు ఎంత చక్కగా పెరుగుతారు.నేను నా పిల్ల ఒంటికాయ సొంటి కొమ్ము లాగా అనే పిచ్చి తల్లులు ఎక్కువైపోయారు..ఇటువంటి కలియుగ మంధరల మాటలు విని జీవితం నాశనం చేసుకోకూడదు అని అర్థం చేసుకుని ఎంత త్వరగా కళ్ళ మాయాపొర తొలగించుకుని అంత త్వరగా మంధరకి కూడా జ్ఞానోదయం కలిగిస్తే సంసారం పచ్చని సంసారంగా మారుతుంది.కుటుంబ విలువలు తెలియక అన్నీ నాకే తెలుసు అని అజ్ఞానంతో సంసారాలు చెడగొట్టుకునేవాళ్ళు నేటి సమాజంలో ఎంతోమంది ఉన్నారు.ఇప్పటికి అయినా కళ్ళు తెరుచుకుని నేను నుండి మనము అనుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది.జీవితం అంటే ఏదో బ్రతికేయడం కాదు. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆస్వాదిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటే ఆ సంసారం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.కొంతమంది పెద్దవాళ్ళు కూడా మా మాటే వినాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అందరిలోనూ మార్పు రావాలి.ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదు. నేటి సమాజంలో జరుగుతున్న వింత పోకడ.పూర్వ కాలంలో చిన్న వయసులో పెళ్లిళ్లు చేసినా పెద్దవాళ్లు అండగా ఉండి ఎవరితో ఎలా ఉండాలో అన్నీ చెప్పవాళ్లు కనుక పెద్దలు పిల్లలు బాగుండేవారు. ఇప్పుడు చెప్పేవారు లేరు వినేవారు లేరు. కలియుగ పెద్దలు కలియుగ యువతరం. ఇక్కడినుండి అయినా పెద్దలు యువతరం కళ్ళు తెరుకొని నేను నుండి మనము అనుకుని సరైన అవగాహనతో అనుబంధాలు ఆత్మీయతాలతో అందరు సంతోషంగా జీవించండి.ఇది చదివి కొంతమందిలో అయినా మార్పు రావాలి అని కోరుకుంటున్నాను.
Sunday, 5 April 2026
ఓటమి - విజయం
మనము జీవితంలో అనుకున్న పని సాధించలేనప్పుడు ఓడిపోయాము అని బాధపడుతూ ఉంటాము. కానీ జీవితము అనే ప్రయాణములో ఓటమి ముగింపు ఎప్పటికీ కాదు.ఇంకా ముందుముందు మరెన్నో నేర్చుకోవడానికి ఒక అవకాశం మాత్రమే. ఓటమి ఒక పాఠం అనుకుని ఇంకా పట్టుదలతో ముందుకు సాగాలి. ఇంకా ఎన్నో విజయాలను సాధించి అనుకున్న లక్ష్యం చేరుకోవాలి.అప్పుడు అంతులేని ఆనందం మన స్వంతం అవుతుంది.
పెన్సిలు - రబ్బరు
మనము ఒకరు సంతోషంగా ఉంటే వారి ఆనందాలను గురించి వ్రాయడానికి పెన్సిలు కాకపోవచ్చు కానీ మనము ఒకరు బాధ పడుతుంటే వారి దుఃఖాన్ని తొలగించడానికి రబ్బరు (ఎరేజరు ) లాగా ఉపయోగపడవచ్చు.మీరూ ఒకసారి ఆలోచించండి. ధన్యవాదములు.
Monday, 16 February 2026
అవసరవాదులు
మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటూ మనతో అధిక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మనకు ఏదైనా అవసరం అనుకుంటే ఒక్కరు కూడా మన దరిదాపుల్లో ఉండరు.మన నుండి ఎంతో సహాయం పొందిన వాళ్ళు కూడా తన,పర అనే బేధం లేకుండా ముఖం చాటేస్తూ ఉంటారు.మనం ఎవరో తెలియకపోయినా సహాయం చేయడానికి వచ్ఛే వాళ్ళు కొంత మంది ఉంటారు.ఈరోజుల్లో ఎక్కువగా అవసరవాదులే ఉంటున్నారు. వాళ్లకు అవసరం అయినప్పుడు తియ్యగా మాట్లాడుతారు. అవసరం తీరిపోయాక మనం ఎవరో తెలియనట్లు నటిస్తుంటారు.ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నేర్చుకోవాలి.అందరిని గుడ్డిగా నమ్మేసి మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే ధన పరంగా నష్టపోకుండా ఉండడంతోపాటు, మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ఉంటాము. అవసరవాదులతో తస్మాత్ జాగ్రత్త.
Saturday, 7 February 2026
ఆత్మ సంతృప్తి
జీవితం అంటే వడ్డీంచిన విస్తరి కాదు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ చిన్నదో, పెద్దదో ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఉంటూనే ఉంటుంది.గతంలో మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు కూడా ఉంటాయి.అది ఏవిధంగా ఉన్నా మనం గతంలో జీవించకూడదు.జీవించలేము కూడా.గతం గతః అన్నట్లు గతాన్ని ఒక పాఠంగా తీసుకుని వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తు గురించి చక్కగా ప్రణాళికాబద్ధంగా ఎవరికి వారే బంగారు బాట వేసుకోవాలి..అప్పుడు ఎవరి భవిష్యత్తు వారిచేతిలోనే ఉంటుంది.అంతే కాకుండా మనకి మనమే మన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకున్నామనే ఆత్మ సంతృప్తి ఉంటుంది.
Wednesday, 4 February 2026
స్వామికార్యం స్వకార్యం
పని చిన్నది అయినా పెద్దది అయినా పనే. పనిని మించిన దైవం మరొకటి లేదు.పని చేస్తూ ఉంటేనే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దీనితోపాటు సంతోషం, సంపద, పేరుప్రతిష్టలు వస్తాయి. మనం చేసే పనిలో భాగంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలిగితే మనసుకి ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పనులు చేసుకుంటూనే సమాజానికి ఉపయోగపడే విధంగా తమకు చేతనైనంత వరకు సహాయం చేస్తుంటే మానసిక తృప్తితోపాటు ఆరోగ్యం, ఆనందం మన స్వంతం చేసుకోవచ్చు.అప్పుడు స్వామి కార్యం,స్వకార్యం రెండు మన స్వంతం అవుతాయి.
Monday, 2 February 2026
జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే
మనము ఎల్లప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏమిటంటే 1) చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుని ఎక్కువగా అలోచించి మనసు పాడుచేసుకోకూడదు. 2) జీవితంలో వచ్ఛే మార్పులకు భయపడకూడదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. 3) గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించకూడదు. వాటిని సాధ్యమైనంత వరకు మనసు నుండి తుడిచి వెయ్యాలి.4)మనల్ని మనమే తక్కువ చేసి చూచుకోకూడదు.ఆ విధంగా చేస్తే ప్రక్కవాళ్లకు మన గురించి మాట్లాడే అవకాశం ఇఛ్చినట్లు అవుతుంది. 5) ఎప్పుడూ కూడా ఎదుటివారి దగ్గర సహాయం కోసం చేతులు చాచకూడదు.మన పని మనమే చేసుకోవాలి.ఎవరో వఛ్చి ఏదో మనల్ని ఉద్దరిస్తారని ఆశించకూడదు.ఎదుటి వారికి లోకువగా ఉంటుంది. 6) డబ్బు ఉన్నప్పుడు అధిక ఖర్చులు చేయకూడదు. డబ్బును అవసరమైనంత వరకు వాడుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ డబ్బును గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు డబ్బుకు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు.పైన చెప్పినవి పాటిస్తూ హుందాగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ప్రశాంతంగా ఉంటాము.