Friday 23 June 2017

బొచ్చెలో బొమ్మరాయి

                                                                               అరవై సంవత్సరాల నాగమణి ఒక్కగానొక్క కోడలు పరమ గయ్యాళి.ఒక్క రోజు కూడా ఆరోగ్యం బాగుండకపోయినా పళ్ళెంలో అన్నం పెట్టి ఎరుగదు సరికదా!ఇంటెడు పని అంటే బట్టలు ఉతికి,గిన్నెలు తోమి ఇల్లు తుడిచి,వంట చేయడంతోసహా నాగమణి చెయ్యాల్సిందే.నాగమణి కోడలు మాత్రం ఊరు మీద బలాదూరుగా ఇంటింటికి తిరిగి కబుర్లు చెప్తూ ఉంటుంది.అయినా ఎవరితో చెప్పుకోకుండా నా కోడలు బంగారం అని చెప్పుకుంటుంది.ఇంటెడు చాకిరీ చేసి పెట్టినా కోడలు ఒకసారి నాగమణిపై కోపం వచ్చి అన్నం సరిగా పెట్టకుండా ఇంటి పైనున్న గదిలో నిర్బందించింది.దానితో ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మకు,తమ్ముళ్ళకు సమాచారం అందించి ఇక్కడే వుంటే మీ ఇంటి ఆడపడుచు ఎక్కువ రోజులు బ్రతకకపోవచ్చు.చిక్కి శల్యమైపోయింది.మీ ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో వెళ్ళి తీసుకుని వచ్చారు.ఒక పదిరోజులు గడిచేసరికి కాస్త ఓపిక వచ్చి అమ్మతో కలిసి మరదళ్ళపై పెత్తనం చేయడం మొదలు పెట్టింది.ఒక్కో తమ్ముడి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉంటే ఏమి మాట్లాడినా,ఏమి చేసినా మర్యాద కోసం ఓపిక పట్టారు.తర్వాత చిన్న మరదలు మీవంట చాలా రుచిగా ఉంటుంది అంటూ ఇద్దర్నీ వంటగదికి పరిమితం చేసింది.పెద్ద మరదలుకు సంస్కారం అడ్డువచ్చి తానే అన్నీవేళకు అందించడంతో పైత్యం ప్రకోపించి భోజనం చేసి తిన్న పళ్ళేలు కడగమని తెచ్చి చేతిలో పెట్టడం మొదలు పెట్టారు.ఒకరోజు పెద్ద కోడలు చెల్లెలు అక్క దగ్గరికి వచ్చింది.ఈ తతంగం అంత చూచి ఈరోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు వున్నారా?అని ఆశ్చర్యపోయి ఆమె కోడలు పళ్ళెం కడగడం మాట దేముడెరుగు కనీసం ఒక్క రోజైనా బొచ్చెలో బొమ్మరాయి కొట్టలేదు కానీ ఇక్కడ పళ్ళేలు కడగమనడం ఎంత వరకు సమంజసం?ఎవరి పళ్ళెం వాళ్ళు కడుక్కొనే రోజుల్లో నువ్వే వాళ్ళను కూర్చోబెట్టి అనవసరంగా నెత్తికెత్తుకుని నువ్వు హైరానా పడుతున్నావు?నువ్వు అనుకున్నట్లు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు.వాళ్ళల్లో మార్పు రాదు నువ్వే మారాలి అని నువ్వు ఒక వారం రోజులు ఎటైనా వెళితే నేను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా సరైన మార్గంలో పెడతాను టూ  అక్కకు జ్ఞానబోధ చేసింది.

Wednesday 21 June 2017

వృధా కాలక్షేపం

                                                                  వ్యర్ధమైన మాటలతో వృధా కాలక్షేపం చేయకుండా మౌనంగా ధ్యానం చేసుకోవడం అలవరుచుకుంటే మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాక మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Sunday 18 June 2017

బంగారం,బంగారం

                                                     సరళ పల్లెలో సరిగా పంటలు  పండకపోవడంతో తనకు వచ్చిన పిండి వంటలు వండి వాటిని అమ్మి డబ్బు సంపాదిద్దామనే ఉద్దేశ్యంతో కుటుంబంతో సహా పట్నం వచ్చింది.సరళ పిండి వంటలు చేయడంలో దిట్ట.ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కొద్ది పెట్టుబడితో కొంచెం కొంచెం వండి చుట్టుప్రక్కల వాళ్ళకు రుచి చూపించింది.శుచిగా,రుచిగా చేయడంతో అందరూ మెచ్చి ఎవరికి అవసరమైనవి వాళ్ళు చేసిపెట్టమని అడగడం మొదలు పెట్టారు.దానితో సరళ వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్దిలోకి వచ్చింది.దీనితో ఒక ప్రక్కన రకరకాల పచ్చళ్ళు తయారుచేసి అమ్మడం ప్రారంభించింది.అత్త,మామ,భర్త,సరళ అందరూ కష్టపడటంతో వ్యాపారం బాగా సాగుతుంది.ఫలానా చిరునామాలో పిండి వంటలు రుచిగా వున్నాయని తెలిసి రాకేశ్ వెళ్ళాడు.అక్కడ చాలామంది ఉండటంతో ఒక 5 ని.లు కూర్చున్నాడు.ఈలోగా ఒక్కతే అందరికీ ప్యాక్ చేసి ఇవ్వడం కష్టంగా వుండి సరళ బంగారం,బంగారం ఒకసారి వచ్చి నాకు కాస్త సాయం చెయ్యమని ఎవరినో పిలిచింది.చిన్న పిల్లాడు వస్తాడేమో అనుకుంటే సన్నగా రివటలా గాలికి పడిపోయేలా ఉన్నతను హడావిడిగా వచ్చాడు.కూర్చుంటే లేవడానికి ఇబ్బంది పడే సరళ నాభర్త అనగానే అందరూ సరళ భర్తను చూచి ఆశ్చర్యపోవడంతోపాటు భలే ముద్దుగా పిలుచుకుంటుందని అనుకున్నారు.అందరితోపాటు రాకేశ్ కూడా ఆశ్చర్యపోయాడు.  

Saturday 10 June 2017

పిలవని పేరంటం

                                                                                        ఏపనైనా రోజు ఒకే విధంగా చేస్తుంటే విసుగు పిలవని పేరంటంలా  వస్తుంది.అదే పనిని రోజుకో విధంగా కొద్ది మార్పులతో విభిన్నంగా చేయటానికి ప్రయత్నిస్తుంటే కొత్త పని చేస్తున్నామన్న భావనతో విసుగు మన దరి చేరకుండా ఉంటుంది.

Tuesday 6 June 2017

నామోషీ

                                                      ఎప్పుడూ ఎంతో సంతోషంగా అందరినీ పలుకరిస్తూ   గలగల మాట్లాడే రాజమ్మ అకస్మాత్తుగా,దిగులుగా,నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటుంది.విజయ్ అమ్మమ్మను చూడాలనిపించి ఊరు వెళ్ళాడు.అమ్మమ్మ హుషారుగా లేదేంటి?అని అమ్మను అడిగాడు.అమ్మమ్మకు ఈమధ్య వినిపించడం లేదు.వైద్యుని వద్దకు తీసుకెళ్ళి వినికిడి యంత్రం పెట్టిద్దామంటే నామోషీ అనుకుంటుంది.నాకు బాగానే వినపడుతుంది.మీకేమైనా చెవుడు వచ్చిందేమో!అని గట్టి గట్టిగా పోట్లాడుతుంది అని చెప్పింది.విజయ్ దగ్గరకు వెళ్ళి ఎన్నిసార్లు పలకరించినా ఊ,ఆ అని అనటంలేదు.ఏమిటి?అమ్మమ్మా ఎన్నిసార్లు  పిలిచినా మాట్లాడకుండా కూర్చున్నావేంటి?అంటే గయ్యిమంటూ కుర్చోక గంతులు వెయ్యమంటావా? అని అరిచింది.తనకు వినిపించటం లేదు అని ఒప్పుకోవటానికి నామోషీగా అనిపించి ఆ బాధను అరవటం ద్వారా వ్యక్తపరుస్తుందిలే అనుకున్నాడు విజయ్.నాలుగు రోజులకు సర్దుకుని వినపడక ఇబ్బందిగా అనిపించి వైద్యుని వద్దకు వెళ్ళి వినికిడి యంత్రం పెట్టుకుని మునుపటిలా సరదాగా ఉంటే బాగుంటుందని తనంతట తానే నిర్ణయించుకుంటే ఏ సమస్య ఉండదు.ప్రస్తుతం నిరాశలో కొట్టుమిట్టాడుతుంది.అమ్మమ్మను ఇప్పుడు కదిలించకపోవడమే మంచిది అనుకున్నాడు విజయ్.

Saturday 3 June 2017

అప్పిచ్చువాడు

                                                             అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది ఒకప్పటి మాట.యశ్వంత్ ఆపదలో ఉన్నాను.అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు సర్దితే రెండు రోజుల్లో తెచ్చి ఇస్తానని వరుసకు బాబాయి రాఘవయ్య గారి వద్దకు వచ్చాడు.రెండు రోజుల్లో ఇస్తానన్నాడని ఎరువుల కోసం దాచిపెట్టిన డబ్బు తెచ్చి ఇచ్చారు.పది రోజులైనా యశ్వంత్ డబ్బు తెచ్చి ఇవ్వలేదు సరికదా అసలు మనిషే కనిపించడం మానేశాడు.ఎప్పుడు కబురు చసినా ఇంట్లో లేడనే సమాధానం వస్తుంది.అప్పటికే దొరికినచోటల్లా మాయమాటలు చెప్పి డబ్బు తీసుకుని ఊరి నిండా అప్పులే చేశాడని తెలిసింది.డబ్బు చేజారింది కనుక చేసేదిలేక రాఘవయ్యగారు ఒకతన్ని ఇంటివద్ద కాపలా పెట్టి వెళ్ళి అడగ్గా 
ఇప్పుడే ఇంటికి తెచ్చి ఇస్తానని నమ్మబలికాడు.నిజమేననుకుంటే మళ్ళీ పత్తా లేకుండా పోయాడు.కష్టంలో ఉన్నానంటే ఎరువుల కోసం దాచిన డబ్బు ఇస్తే మాట తప్పడమే కాక బ్రతిమాలవలసి వస్తుంది అని రాఘవయ్య గారు బాధపడ్డారు.చివరకు ఎలాగోలా పట్టుకుంటే బాబాయ్ అడగగానే ఆలోచించకుండా డబ్బు ఇచ్చేయ్యడమేనా?ఎప్పుడో ఒకసారి నాకు డబ్బు వచ్చినప్పుడు ఇస్తాలే అప్పుడు తీసుకో అని దబాయింపు.ఆపదలో వున్నానని అన్నావు కదరా?అంటే నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు.ఈరోజుల్లో డబ్బు అప్పిచ్చువాడు పిచ్చివాడు అన్నమాట.అన్నమాటేముంది ఉన్నమాటే.వడ్డీకి ఆశపడకపోయినా చేబదులు అంటే ఇచ్చిన రాఘవయ్యగారు లాగా అనేక మంది యశ్వంత్ లాంటి వాళ్ళ మాటలకు మోసపోయి ఇబ్బందులపాలు అవుతున్నారు.కనుక యశ్వంత్ లాంటి వాళ్ళతో జాగ్రత్త. 

భగభగలకు తగినట్లు

                                                                         ఎండ భగభగలాడుతోంది.శరీరంలోని నీరు చెమట రూపంలో వెళ్ళిపోతుంది కనుక అందుకు తగినట్లు మనం కూడా నీరు అధికంగా ఉండే పండ్లు,కూరగాయలు,బార్లీ,నీళ్ళు,సబ్జా నీళ్ళు,మజ్జిగ,కొబ్బరి నీళ్ళు,చెరకు రసం,పంచదార లేని పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.దాహంగా ఉన్నా లేకున్నామంచి నీళ్ళు తాగుతూ ఉండాలి.మసాలాలు తగ్గించటమే కాకుండా బయటి ఆహార పదార్ధాలు తినకపోవడం మంచిది.ఎండా కాలంలో వడదెబ్బ బారినుండి తప్పించుకోవచ్చు. 

మామిడికాయ హల్వా

తియ్యని మామిడికాయ గుజ్జు  - 1 కప్పు
బొంబాయి రవ్వ  - 1 కప్పు
పంచదార  - 1 1/2 కప్పు
పాలు  - 1 1/2 కప్పు
నీళ్ళు - 1 1/2 కప్పు
యాలకుల పొడి  - 1/4 స్పూను
జీడిపప్పు - 5
కిస్ మిస్  - 5
నెయ్యి  - కొద్దిగా
                                                                      మామిడికాయను కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ లో ఉడికించి మిక్సీలో మెత్తటి గుజ్జులాగా చేయాలి.ఒక బాణాలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు,కిస్ మిస్ వేసి వేయించి ఒక ప్రక్కన పెట్టాలి.తర్వాత బొంబాయి రవ్వ వేయించుకోవాలి.ఒక గిన్నెలో పాలు,నీళ్ళు కలిపి మరిగించి పంచదార వేసి కరిగిన తర్వాత రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ కట్టకుండా కలియ తిప్పాలి.చివరలో యాలకుల పొడి వేసి కలిపాలి.హల్వా కొద్దిగా దగ్గర పడుతుండగా పొయ్యి కట్టేయాలి.ఇది చల్లారిన తర్వాత దానిలో మామిడికాయ గుజ్జు,జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలిసేలా తిప్పాలి.అంతే రుచికరమైన మామిడికాయ హల్వా తయారయినట్లే. 

Friday 2 June 2017

ఆ నవ్వు

                                                                            అక్కా!ఇంతకు ముందు డబ్బుఅప్పుగా తీసుకుని కనపడితే ఎక్కడ అడుగుతారోనని వాళ్ళకు సమాధానం చెప్పాల్సివస్తుందని ముఖం చాటేసేవాళ్ళు.ఈమధ్య కొంతమంది మాట్లాడితే మనకు ఏమి వస్తుంది,సమయం దండుగ కాకపోతే అన్నట్లు వింతగా ప్రవర్తిస్తున్నారు.బాగా తెలిసినవాళ్లు కదా!అని నవ్వు ముఖం పెట్టి ఆప్యాయంగా ఒక మాట మాట్లాడదామని అనుకుంటే చూచీ చూడనట్లు చూచి ముఖం చాటుచేసి వెళ్ళిపోతున్నారు.ఒకవేళ గుర్తు పట్టకపోతే గుర్తు చేస్తాం కదా!లేకపోతే ఆ విధంగా ప్రవర్తించడం నవ నాగరికత అనుకుంటున్నారో ఏమో?తెలియదు కానీ ఎరగనట్లు దూరంగా వెళ్ళిపోతున్నారు.నవ్వితే వాళ్ళ సొమ్మంతా ఏదో పోతుంది అన్నట్లు నాకయితే చూడటానికి విచిత్రంగా ఉంటుంది అని చెప్పింది రోష్న.నవ్వితే డబ్బు ఖర్చు అయిపోతుంది అనుకోవటానికి నవ్వు డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా!నవ్వితే భోగం,నవ్వకపోతే రోగం అన్నట్లు ఒకరికి ఒకరు పరిచయాలున్నప్పుడు మాట్లాడే సమయం లేకపోతే మనసారా ఒక నవ్వు నవ్వండి. అంతే కానీ ఇదేమిటి?పరిచయం ఉండి కూడా ముఖం చాటేస్తున్నారు అనుకోకుండా మనసారా ఒక నవ్వు నవ్వితే ఆ నవ్వు ఎదుటివారికి మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంకొంతమంది మనతో ఏదైనా అవసరం ఉంటే మాత్రం ముఖం చింకి చేట అంత చేసుకుని  ముఖం అంతా నవ్వు పులుముకుని హి హి హి అంటూ పరుగెత్తుకుని వస్తారు.ఉదయం పని చేసి పెడితే సాయంత్రానికి షరా మాములే.దయచేసి అవసరానికి నవ్వు పులుముకోకుండా మనసారా నవ్వితే బంధాలు బలపడటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.