Tuesday 23 April 2019

క్షణభంగురం

                                                      మనకన్నా పై మెట్టు మీద ఉన్న వాళ్ళను చూచి ఈర్ష్య పడడం  మన కన్నా క్రింది మెట్టుపై ఉన్నవాళ్ళను చూచి మేమే గొప్పగా పైన ఉన్నామని గర్వపడడం కొంతమంది మానవుల సహజ లక్షణం.రెండు లక్షణాలు కూడా ప్రమాదకరమే.ఈ రోజుల్లో కొంత మంది పై విధంగానే ప్రవర్తిస్తున్నారు.అందులో ఒకడు జీవన్. జీవితం క్షణభంగురం అని జీవన్ లాంటి వాళ్ళకు అర్ధం కాదు.జీవన్ అతనితోపాటు అతని భజనగాళ్ళు దీన్ని మర్చిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ దురుసుగా ప్రవర్తిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ,ప్రక్కవాళ్ళకు తగువులు పెట్టి వాటిని వాళ్ళే తీర్చడం చేస్తూ ఉంటారు.ఇవి చాలవన్నట్లు దీనికి తోడు ఈమధ్య కొంగ్రొత్త ధోరణి మొదలెట్టాడు.ఆడపిల్లలకు పసుపు కుంకుమల క్రింద తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్థి రేటు పెరిగేసరికి జీవన్ కి దుర్బుద్ధి పుట్టి తన భజనగాళ్ళను వేసుకుని  ఆ ఆస్తులు కాజేయాలని ఈ ఊరి వాళ్లందరూ ఆడపిల్లలకు ఆస్తులు దోచిపెడతారని,మగపిల్లలకు అన్యాయం చేస్తారని తల్లిదండ్రుల్ని,ఆస్తులు దోచుకుని వెళ్తారని ఆడపడుచుల్ని పిచ్చితిట్లు తిట్టడం మొదలెట్టాడు.డబ్బు పిచ్చి నషాళానికి అంటినట్లు పెళ్లిళ్లకు పేరంటాళ్ళకు వెళ్ళినా బంధువులు అందర్నీ సమావేశపరిచి ఒకటే పిచ్చిగోల.ఇతన్ని చూచి జీవన్ బాటలో మరి కొంతమంది ఆశపరులు తయారయ్యారు.ఇదే నేటి సరి కొత్త ధోరణి అనుకుంటున్నారు.అత్యాశతో తను చేస్తున్న పని,మాట్లాడే మాటలు చాలా తప్పని తెలుసుకునేటప్పటికి జీవితంలో ఏమీ మిగలదు.తన వాళ్ళందరి మనస్సుల్లోస్థానం కోల్పోవటం తప్ప.తర్వాత ఎంత కావాలనుకున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయిపోతుంది.తాత పళ్ళెం తలవైపే ఉంటుందని మనం ఏమి చేస్తే మన పిల్లలు కూడా అంతకన్నా ఎక్కువగా అదే తరహాలో ఉంటారని జీవన్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది.తల్లిదండ్రుల్ని,ఆడపడుచుల్ని తిట్టకూడదని తిడితే జీవితంలో పైకి ఎదగరని ఆయాచితంగా ఎదుటి వారి సొమ్ము కోసం ఆశించకుండా ఒళ్ళు వంచి ఉన్న కాస్త సమయాన్ని మంచిపనులకు ఉపయోగిస్తూ సత్ప్రవర్తనతో ఉంటే జీవన్,అతని చుట్టూ ఉన్నవాళ్ళకే కాక వినే వాళ్ళకు,ఇంట్లో వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.                                                                                                                                                          

Saturday 13 April 2019

శ్రీరామనవమి శుభాకాంక్షలు

                తెలుగు వారి బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,భారతీయులకు(ఏదో ఒక రూపంలో శ్రీ రామనవమి చేస్తుంటారు కదా)మన తెలుగువారందరికీ సీతారామ లక్ష్మణ అంజనేయస్వాముల కరుణ కటాక్ష వీక్షణాలు,వారి దీవెనలు ఎల్లవేళలా మన అందరియందు ఉండాలని శిరసు వంచి నమస్కరించి అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని  మనసారా కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.  

Friday 5 April 2019

ఉగాది శుభాకాంక్షలు

                                                          నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లార్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఎక్కడ  స్థిరపడినా కానీ మన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.మళ్ళీ ఉగాది వచ్చేవరకు అందరూ సంతోషంగా ఉంటూ మానసికంగా,శారీరకంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ధన కనక వస్తు వాహనాలను  సమకూర్చుకోవాలని,ఇలాంటి మరెన్నో ఉగాది పండుగలకు స్వాగతం పలకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

సంతోషాల సంవత్సరాది

                                                                              వసంత రుతువులో కొత్త చిగుళ్ళతో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ పాడ్యమి రోజు వచ్చేదే తెలుగు వారి సంవత్సరాది.మావి చిగుర్లు తిన్న కోయిల కుహు కుహులతో సమ్మోహనంగా ఆహ్వానం పలగ్గానే ఉరుకులు పరుగులుతో సంతోషాలను మోసుకొచ్చేదే ఉగాది.అభ్యంగన స్నానానంతరం దేవతార్చనతో శ్రీవికారి నామ సంవత్సరాన్ని స్వాగతించి షడ్రుచుల ఉగాది పచ్చడి నివేదించాలి.గుమ్మాలకు మామిడి తోరణాలు,కొత్త బట్టలు,పిండి వంటలు సరే సరి.మనం తలపెట్టిన కార్యక్రమాలకు శుభ ఫలితాలు కలగాలని కోరుకుని ఉగాది పచ్చడి స్వీకరించాలి.వేప పూవుతో చేసిన ఈ పచ్చడి తినడం వలన సర్వారిష్టాలు తొలుగుతాయి.ముఖ్యంగా కష్టం సుఖం అనే తేడా లేకుండా అన్నీ సమ దృష్టితో చూడాలన్నదే సంకేతం.పంచాంగ శ్రవణం వింటూ బంధు మిత్రులతో రాశి ఫలాలు చర్చిస్తూ సరదాగా సంతోషంగా గడిపేయాలి.సంవత్సరాది నాడు ఎంత సంతోషంగా గడిపితే అంత సంతోషంగా మళ్ళీ సంవత్సరాది వచ్చే వరకు జీవితం హాయిగా సాగిపోతుందని పెద్దల ఉవాచ.అంతే కాదు అది అందరి నమ్మకం. 

Monday 1 April 2019

మరువం మధురం

                                                                      చిన్నప్పుడు వారిజ ఇంటి చుట్టూరా నలువైపులా అన్ని రకాల మొక్కలు ఉండేవి.మల్లె పందిరి ప్రక్కనే ఒక పెద్ద మడిలో మరువం,చిన్న మడిలో ధవనం ఉండేవి.ఆ రోజుల్లో మరువం,ధవనం మొక్కలు అందరి ఇళ్ళల్లో ఉండేవి కాదు.వారిజకు ధవనం కన్నా మరువం వాసన బాగుంటుంది.మరువం కొమ్మలు పెరిగి క్రిందికి వాలగానే ఆ కొమ్మలపై కొద్దిగా మట్టి పెడితే ఇంకో మొక్క అయ్యేది.అలా చెయ్యడం వారిజకు ఎంతో ఇష్టంగా  సరదాగా ఉండేది.ఇంటికి వాటిని చూడడానికి స్నేహితురాళ్ళు,ఇరుగుపొరుగు పిల్లలు వచ్చేవాళ్ళు.తన ఇంట్లో మాత్రమే మరువం ఉన్నందుకు వారిజకు ఒకింత గర్వంగా కూడా ఉండేది.అప్పట్లో వేసవి వచ్చిందంటే చాలు ఊరిలో ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా మేము ముందంటే మేము ముందనిమరువం,పువ్వుల కోసం పోటిపడి మరీ పూలజడ వేసుకునేవారు.పూలజడకు ప్రత్యేకంగా పొడుగు కదా ఉండే దొంతర మల్లెపువ్వులు,మరువం,కనకాంబరాలు వారిజ ఇంటి నుండే అందరూ తీసుకెళ్ళి వేసుకునేవాళ్ళు.వారిజకు మరువం గురించి చదవగానే ఆనాటి మధురస్మృతులు గుర్తొచ్చాయి.ఎటువంటి తలనొప్పి అయినా మరువం ఆకులు వాసన చూడగానే యిట్టె తగ్గిపోతుందని,తలలో పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దవాళ్ళు అనుకునేవారు.ఇది ఒక ఔషధ మొక్క అని, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ మధ్యనే ఒక పుస్తకంలో వారిజ చదివి ఆశ్చర్యపోయింది.ఇప్పుడు వారిజ ఎన్నిసార్లు తెచ్చి పెట్టినా మరువం మొక్కని బ్రతికించలేకపోతుంది.ఆకు వాసనతో నిద్ర బాగా పడుతుందని ఒక కప్పు నీళ్ళల్లో కొద్దిగా మరువం ఆకులు వేసి మరిగించి త్రాగితే ఆడవాళ్ళ నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయని, మధుమేహం,గుండె జబ్బులు వంటివి దరిచేరవని,రక్త ప్రసరణ వేగం అదుపులో ఉంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు.వెంకటేశ్వరస్వామికి కూడా తులసిమాల,దళాలతో  పూజ చేసినట్లే మరువంతో కూడా  చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని పెద్దలు తెలియ చేస్తున్నారు.ఏదేమైనా తనకు ఎంతో ఇష్టమైన మరువం మధురం అంటుంది వారిజ.