Saturday 24 October 2020

విజయదశమి శుభాకాంక్షలు

                                                        విజయ దశమి లోనే విజయం ఉంది.గత ఎనిమిది మాసాలుగా మనం అందరమూ కూడా భయాందోళనల మధ్య అశాంతితో ఎన్నో సమస్యలతో సతమతమైనా సాయిబాబా మరియు అమ్మవారి  దయ వలన వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగాము.ఇక ముందు కూడా అంతకన్నా ఎక్కువ ఆత్మస్థైర్యంతో,మానసిక,శారీరక ధృడత్వంతోపాటు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే బుద్ధి కుశలతను,మనశ్శాంతితోపాటు మనందరికీ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించమని అమ్మను,బాబాను మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన తెలుగువారందరికీ,నా తోటి బ్లాగర్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.సర్వేజనా సుఖినోభవంతు.

                                         


                             
                       
                                                     

                  

                    


                                                                 

Tuesday 20 October 2020

ప్రేయస్సు - శ్రేయస్సు

                                                             మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు నచ్చిన విధంగా భగవంతుడిని ఎన్నో రకరకాల కోరికలు కోరుకుని అవి తీర్చమని విసిగిస్తూ ఉంటాము.అందులో కొన్ని ధర్మబద్ధమైనవి,కొన్ని స్వార్ధపూరితమైనవి కూడా ఉంటాయి.ఏది ఏమైనా ఈ విధంగా ప్రియమైన వాటిని కావాలనుకోవడాన్నే ప్రేయస్సు అంటారు.కానీ భగవంతుడు ధర్మబద్ధమైనవి,మనకు ఏది అవసరమో, ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాడు.దీనినే శ్రేయస్సు అంటారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్న చందాన మనకు నచ్చినా నచ్చకపోయినా ఏది జరిగినా మన మంచికే అనుకుని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తూ మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడి ప్రశాంతంగా జీవించడం అలవరచుకోగలిగితే జీవితం ఆనందదాయకంగా  ఉంటుంది.

Monday 19 October 2020

నిర్మల తటాకం

                                                          పెద్దలకు నా నమస్కారం.పిన్నలకు నా శుభాశ్సీసులు.పండుగకు ఇల్లు శుభ్రం చేసుకోవడం అయిపోయిందా అండీ ?నవరాత్రి,విజయదశమి సందర్భంగా అమ్మవారి పూజలతో హడావిడిగా ఉన్నారా ? ప్రత్యక్షంగా పూజలు చేయలేని వారు మనసులో నైనా  ప్రార్ధించవచ్చు.దీనికి సమయ నియమం లేదు.మనకు ఎన్ని పనులున్నా ఆ పనులు చేసుకుంటూనే మనసులో అమ్మవారిని తలచుకోవచ్చు.దీనితో మానసిక ఒత్తిడులన్నీ తొలగిపోయి మనసులో ప్రశాంతత గూడు కట్టుకుంటుంది.ఎటువంటి మానసిక ఆందోళన లేకపోవడంతో మనసు నిర్మల తటాకం అవుతుంది.మనకోసం మాత్రమే  కాకుండా సమస్త మానవాళి కోసం  సర్వేజనా సుఖినోభవంతు అంటూ రాగద్వేషాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం ప్రార్ధించడం చాలా మంచిది.అప్పుడు మన మనసులు కూడా మంచితనంతో, ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి.  మనసారా ప్రార్ధిస్తే ఎలాంటి సమస్యలు అయినా ఇట్టే తొలగిపోతాయని,సమస్యకు సరైన పరిష్కార మార్గం లభిస్తుందని మన పెద్దల మాట.ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏవిధంగా పూజ చేసినా అమ్మవారి కృపాకరుణాకటాక్షవీక్షణాలు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రి ,విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

Friday 16 October 2020

అనుకోని అతిథి

                                                                            ఒకరోజు మధ్యాహ్నం యుతిక హాలులో సోఫాలో కూర్చుని ప్రక్కన  ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా స్నేహితురాలితో చరవాణి లో బాతాఖానీ కొడుతోంది.చిన్ననాటి కబుర్లతో పాటు పాత స్నేహితురాళ్ళు,కొత్త స్నేహితురాళ్ళ  గురించి గుక్క తిప్పుకోకుండా  రెండు గంటలపాటు సంభాషణ అలా అలా సాగిపోయింది.ఈ లోపు ప్రధాన ద్వారపు మెష్  తలుపు తీసి ఉండడంతో ఒక ఉడుత హడావిడిగా లోపలికి వచ్చి క్రింద పడిన గింజలు ఏరుకుని తిని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనే వెతుకులాటలో యుతిక కూర్చున్న సోఫా క్రిందికి వచ్చినప్పుడు అనుకోకుండా ఉడుత తోక యుతిక చీరకు తగలడంతో ఏమి వచ్చిందో ? అని కంగారుపడి యుతిక సంభాషణ ఆపి క్రిందకు చూసేసరికి ఉడుత తోక కనబడింది.మళ్ళీ ఫోను చేస్తాను అని స్నేహితురాలికి చెప్పి ఎటు వెళ్లిందో చూద్దామనుకుంటే కన్ను మూసి తెరిచే లోపే ప్రక్కింటి చెట్టు మీద పరుగెత్తుతూ కనిపించింది.ఇంతకీ అదెలా వెళ్ళింది అంటే వాకిలి ముందున్న  వేప చెట్టు కొమ్మలు యుతిక వరండాలోకి రావడంతో వాటి మీదుగా ప్రక్కింట్లో ఉన్నచెట్టుమీదికి దూకిందన్నమాట.రోజూ యుతిక తులసి మొక్కకు పూజ చేసి లోపలకు రావడం ఆలస్యం ప్రసాదం,అక్షింతలు తినడం ఉడుత దినచర్య.మొదట్లో యుతిక పిట్టలు తింటున్నాయేమో అని  అనుకుంది.ఒకరోజు యుతిక కాపలా కాసి మరీ ఈ విషయాన్ని కనిపెట్టింది.ఇంతకుముందు చరవాణి లో సంభాషణ ఆగిపోయింది కదా! మళ్ళీ చేసి స్నేహితురాలికి మా ఇంటికి ఈరోజు ఒక అనుకోని అతిథి వచ్చిందోచ్  అంటూ  కాసేపు ఉడుత కబుర్లు చెప్పింది. 

               

Saturday 10 October 2020

నేను ఏడుస్తా

                                                చిత్రాంజలి పేరుకు తగ్గట్లే చిత్ర విచిత్ర మనస్తత్వంతో ఎదుటి వారిని అయోమయంలోను,సంకట పరిస్థితిలోనూ పడేస్తుంటుంది.ఒక్కోసారి ఇంట్లో వాళ్ళతో  ప్రేమగా మాట్లాడుతుంది.ఒక్కొక్కసారి చిటపటలాడుతూ ఉంటుంది.ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు.మాములుగా మాట్లాడినా కూడా ఏదో తనను తిట్టేశారని కళ్ళు నులుముకుంటూ పెద్ద పెద్ద శోకాలు పెట్టి ఏడుస్తుంటుంది.చిత్రాంజలి పెళ్ళై అత్తవారింటికి వచ్చిన క్రొత్తలో ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉండేది.పాతిక ఏళ్ళు దాటినా చిన్న పిల్లల కన్నా కనాకష్టంగా మొండిగా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేది.పైగా ఎదుటి వారి మీద ఉన్నవి లేనివి కల్పించి నిజమనుకునేలాగ కథలు అల్లి చెప్పేది.అత్తారింట్లో వాళ్ళు సహనం కలవారు కనుక మన ఆడపిల్ల అయినా పరాయి ఆడపిల్ల అయినా ఒకటే అనుకుని ఎవరితో చెప్పకుండా  పోనీలే తల్లి లేని పిల్ల అని కడుపులో పెట్టుకుని చూచుకున్నారు.కాలక్రమంలో ఇద్దరు బిడ్డల తల్లయింది.అయినా ఆమెలో మార్పు రాలేదు.కూతురు పుట్టగానే ఆడపడుచు కొడుకు నాలుగేళ్ళ ఆస్కార్ కిచ్చి పెళ్ళి చేస్తానని ఆడపడుచుని మాట ఇవ్వమంది.పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో? అదీ కాక మేనరికాలు చేసుకోకూడదు కదా!అంది ఆడపడుచు సాకేతిక.దాంతో చిత్రాంజలికి కోపం వచ్చి ఆస్కార్ ని అన్నయ్య అని పిలిపించడం మొదలు పెట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్ళి వయసుకి వచ్చారు. చిత్రాంజలి మనసులో మాత్రం ఆస్కార్ కి ఎలాగైనా కూతుర్నిఇచ్చి చెయ్యాలనే పిచ్చి ఆలోచన ఉండడంతో తన కుటిల బుద్ధితో ఆస్కార్ కి వచ్చిన పెళ్ళి సంబంధాలను చెడగొట్టడం మొదలు పెట్టింది.ఇంతలో అనుకోకుండా ఆస్కార్ కి పెళ్ళి కుదిరింది.చిత్రాంజలి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక  అప్పుడే ఆస్కార్ పెళ్ళికి ఏమి తొందర?అంటూ నేలపై చతికిలపడి క్రింద కూర్చుని ఏడ్చి తిట్టుకుంది.ఇంట్లో వాళ్ళకు అలవాటైపోయింది కనుక ఎవరూ పట్టించుకోలేదు.పెళ్ళిలో కూడా  నేను ఏడుస్తా అని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం మొదలెట్టింది చిత్రాంజలి.నువ్వు ఎందుకు ఏడవడం?అని కూతురు అడిగితే ఏమో నేను ఏడుస్తా అంతే అంది.పాతిక ఏళ్ళ నుండి ఆమెతో ఇబ్బందులు పడి ఉండడంతో విగిపోయి ఏడ్చుకో తల్లీ !ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన  నీ ఏడుపు ఊరందరికీ తెలిసి నీ వీపుకు తాటాకులు కడతారు అనుకుని చిత్రాంజలి అజ్ఞానానికి,మూర్ఖత్వానికి ఆడపడుచు సాకేతిక మనసులోనే తిట్టుకుంది.

Friday 9 October 2020

ఆపద్భాందవి

                                                                   సాయి సౌమ్య పేరుకి తగ్గట్లుగానే సౌమ్యంగా ఉంటుంది.దీనికి తోడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ని.ల్లో నొప్పించక  తానొవ్వక అనట్లు తనదైన శైలిలో పరిష్కార మార్గం సూచిస్తూ ఉంటుంది.స్నేహితుల్లో,బంధువుల్లో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా,మనసుకు బాధ అనిపించినా చరవాణి ద్వారా వాళ్ళ బాధ తగ్గేవరకు గంటలు గంటలు సాయి సౌమ్య చెవి నొప్పి పుట్టేవరకు చెప్పి ఆ బాధ,ఆ ఇబ్బంది తొలగిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు.ఎక్కడైనా కనిపించినా పలకరు.మళ్ళీ ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం సాయి సౌమ్య మాత్రమే కనపడుతుంది.ఎందుకంటే ఈరోజుల్లో ఎవరి గొడవ వాళ్ళదే కదా!ఎవరూ ఎవరి గురించి పట్టించుకోరు.అది వారి బుద్ది లోపం అని సరిపెట్టుకుంటుంది సాయి సౌమ్య.ఇది ఇలా ఉండగా సాయి సౌమ్య పనివాళ్ళే కాక  ఇరుగుపొరుగు పనివాళ్ళు,కూరగాయలు,ఆకుకూరలు,పళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఏ అవసరం వచ్చినా,ఏ సమస్య వచ్చినా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మా!మీరే మాకు సహాయం  చేయాలి,సలహా చెప్పాలి అంటూ వస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది కలిగినా,ఎంతో సౌమ్యంగా ఉండే సాయి సౌమ్య కే విసుగు అనిపించినా పోనీలే ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా?అనుకుని తనకు సాధ్యమైనంత వరకు మాట సాయం కానీ,డబ్బు సాయం కానీ చేస్తూ ఉంటుంది.ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎటువంటి  ఇబ్బంది కలుగకుండా చూచుకుంటూనే ఎదుటివారికి సహాయం చేస్తుంటుంది.అందుకే సాయి సౌమ్యను కుటుంబ సభ్యులు 'ఆపద్భాందవి' అంటూ  ముద్దుగా పిలుచుకొంటారు.స్నేహితురాళ్ళు  మన ఆపద్భాందవి ఉండగా మన కేల చింత?అంటూ ఉంటారు.సాయి సౌమ్య ఎవరు ఏమనుకున్నా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది.                                     

Thursday 8 October 2020

కోడలు వస్తోందోచ్

                                              ఇంద్ర నీల ఉన్నట్లుండి  ఒకరోజు స్నేహితురాళ్ళను,దగ్గర బంధువులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది.ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంత అకస్మాత్తుగా ఇంద్ర నీల అందరినీ ఎందుకు పిలిచి ఉంటుందబ్బా ! అని రకరకాల ఉహాగానాలు చెయ్యడం మొదలెట్టారు.వచ్చిన అతిధులందరికీ అల్పాహారం,పండ్ల రసాలు ఇచ్చిన తర్వాత కాసేపటికి ఇంద్ర నీల మాకు కోడలు వస్తోందోచ్ అని ప్రకటించింది.అంతకు ముందు వరకు గలగల మాట్లాడుతున్న వారందరూ ఒక్కసారిగా మాటలు ఆపేశారు.కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.ఈ వార్త వినగానే కొంతమంది ముఖాలు నల్లగా అట్టు మాడినట్లు మాడిపోయాయి.స్నేహితుల్లో,బంధువుల్లో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని  ఇంద్ర నీల ఇంటికి కోడలిగా పంపితే బాగుంటుంది అనే  ఆలోచనతో ఉండడంతో ఎవరికీ నోట మాట రాలేదు.కాసేపటికి కొంత మంది తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభినందనలు తెలిపారు.కొంత మంది మూతి మూడు వంకరలు త్రిప్పుతూ కోడలు వస్తుందని సంబరపడడం కాదు.కోడలు వచ్చిన తర్వాత కానీ తెలియదు.ముక్కు ముఖం తెలియనిదాన్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుందనేది? అని ఇంద్ర నీలకు వినిపించేలా చిన్నగా  గుసగుసలాడడం  మొదలు పెట్టారు.ఇవన్నీ విన్న ఇంద్ర నీల మనం మన పిల్లలతో పాటు వచ్చే కోడలితో కూడా అంతే ప్రేమగా ఉంటే కోడలు కూడా మనతో అంతకన్నా ఎక్కువ ప్రేమతో కూడిన గౌరవంతో ఉంటుంది.ఈ తర్కం తెలిసిన అత్తాకోడళ్ళ అనుబంధం అపురూపంగా ఉంటుంది.అత్త ఒక రాక్షసి,కోడలు ఒక గడసరి అనే అపోహలు తొలగించుకుని అందరూ ఒకరికొకరు ప్రేమభావంతో మెలగడం అందరికీ శ్రేయోదాయకం.అప్పుడు అందరి ఇళ్ళు ప్రశాంత నిలయాలే అవుతాయి అని చెప్పింది ఇంద్ర నీల.అవును ఇంద్ర నీల చెప్పిన తర్కం చాలా బాగుంది అంటూ చాలామంది తమ మద్దతు తెలిపారు.అందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉంటే  మమతానురాగాలు పెరిగి అనుబంధాలు బలపడతాయి అనుకున్నారు.మొదటే ఈ విధంగా అనుకుని ఉంటే ఇంద్ర నీలకు ఇంతసేపు  చెప్పాల్సిన పని ఉండేది కాదు.పోనీలే ఇప్పటికయినా అర్ధం అయినందుకు సంతోషం అనుకుంది మనసులో ఇంద్రనీల.

Tuesday 6 October 2020

పంచ కళ్యాణి

                                                            శ్రీర్జిత్ కి రకరకాల జంతువులను,పక్షులను పెంచడం అంటే మహా సరదా.చిన్నప్పటినుండి కుక్క పిల్లల్ని పెంచుకుందామని ఏడ్చేవాడు.15 సంవత్సరాలు వచ్చేటప్పటికి స్నేహితుని ఇంట్లో కుక్క పిల్లల్ని పెట్టిందని తెలిసి ఒకదాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు.అది ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉండేసరికి పెద్దవాళ్ళు కూడా ఏమి మాట్లాడలేక పోయారు.అలా శ్రీర్జిత్ వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల కుక్కలు,కోళ్ళు,ఆవులు,ఎద్దులు, కుందేళ్ళు పెంచడం  మొదలు పెట్టాడు.తాజాగా ఇంటిలో ఎవరికీ చెప్పకుండా 'పంచ కళ్యాణి ' అని ఒక గుర్రం కొని ఇంటికి తెచ్చాడు.దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పిల్లలందరు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు.మొదటి రోజు పోనీలే అని కాసేపు గుర్రంపై  ఎక్కించి రహదారిలో అటునుండి ఇటు చివరకు ఒకసారి తిప్పారు.దానితో ఊరిలో పిల్లలు అందరూ శ్రీర్జిత్ ఇంటి ముందు వరుస కట్టారు. వీటన్నింటి బాగోగులు చూడడానికి ఐదారుగురు పనివాళ్ళు,గిత్తలు,ఎద్దులు అంటే ఉన్న మోజుతో  వచ్చి కొంతమంది ఉచిత సేవలు చేసి వెళ్ళేవాళ్ళు.మాములుగానే  వాకిలి నిండా ఎప్పుడూ జనంతో  కిటకిటలాడుతూ ఉంటుంది.ఇప్పుడు పంచ కళ్యాణి పుణ్యమా అని  దాన్ని చూడడం కోసం పిల్లలు,వాళ్ళని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్ళడానికి పెద్దలు రావడంతో వాకిలితోపాటు రహదారి కూడా నిండి పోతుంది.ఎవరైనా పెద్దవాళ్ళు వీటన్నింటినీ పెంచడం,ఇంటి నిండా ఎప్పుడూ జనాలు ఈ తలనొప్పులు ఎందుకు శ్రీర్జిత్ ? అంటే నాకు మూగజీవాలను పెంచడం ఎంతో ఇష్టం.నా ఈ అభిరుచి నాకు ఎంతో సంతృప్తితోపాటు ఆనందాన్నిస్తుంది అని చెప్తూ ఉంటాడు శ్రీర్జిత్.                

Monday 5 October 2020

బుజ్జమ్మ

                                                                 చారుహ్య అమ్మతో కాసేపు కబుర్లు చెప్పి వద్దామని పుట్టింటికి వెళ్ళింది.ఇంతలో ఆడపడుచు రావటం చూచి తోటలో పువ్వులు కోస్తున్న మరదలు అనూహ్య బుజ్జమ్మా ఒకసారి ఇలారా ఎవరొచ్చారో చూడు అంటూ మురిపెంగా పిలిచింది.నాకు తెలియకుండా ఈ బుజ్జిమ్మ ఎవరా?అని చారుహ్య ఆసక్తితో చూస్తుంది.పరుగెత్తుకుంటూ సగం ఈకలు లేని కోడిపిల్ల వచ్చింది.దాన్ని ఎంతో అపురూపంగా ఎత్తుకుని పది పిల్లలకి ఇదొక్కటే బ్రతికింది ఒదినా! ఇది కూడా మొదట బాగుంది.తర్వాత ఒకరోజు పిల్లి నోట కరుచుకుంది.వెంటనే చూచి వదిలించాము.పాపం చచ్చి బ్రతికినంత పనయింది.అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం అని చెప్పింది.నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనుకే తిరుగుతుంది అని ఒడిలో కూర్చోబెట్టుకుని గింజలు అరచేతిలో పోసుకుని దాని ముందు పెట్టింది.ఒక్కో గింజ ఏరుకుని బుజ్జమ్మ తింటుంటే అనూహ్య ఆనందానికి అవధులు లేవు.ముఖం పున్నమి చంద్రుని వలే వెలిగిపోతోంది.ఇంటికి ఎవరు వచ్చినా కూడా  సరిగా పలకరించకుండా,ఎవరైనా చిన్న పిల్లలు కనిపించినా ముద్దు చేయని  అనూహ్య ఈకలు లేని ఒక కోడిపిల్లని చంకనెత్తుకుని మురిసిపోవడం చూచి చారుహ్య విస్తుపోయింది.