Thursday, 28 November 2019

ముఖంపై మచ్చలు

                                                                        ముఖంపై మచ్చలు,కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోవాలంటే వారానికొకసారి ఒక చెంచా శనగ పిండిలో కొద్దిగా నిమ్మరసం,చిటికెడు పసుపు,కొద్దిగా రామ ములగ అంటే టొమాటో రసం కలిపి ముఖంపై,కంటి చుట్టూ రాయాలి.ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం పైపైన గుండ్రంగా రుద్దుతూ కడగాలి.ఈవిధంగా చేస్తుంటే ముఖానికి,కళ్ళ చుట్టూ రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మచ్చలు లేకుండా తాజాగా ఉంటుంది.

Wednesday, 27 November 2019

పనికో ప్రణాళిక

                                                                  ముందు పని వెనుక,వెనుక పని ముందు చేసుకోకుండా మన దినచర్య మొదలుకాక ముందే ఆరోజు ఏమేమి పనులు చేయాలో తాపీగా ఆలోచించుకుని పనికో ప్రణాళిక పెట్టుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి.ఎంత కష్టపడినా కానీ పనులు తరగనప్పుడు ఒత్తిడికి గురి కాకుండా రెండు గంటలకోసారి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుంటే పనిలో పొరపాట్లు దొర్లకుండా ప్రశాంతంగా పనులు పూర్తిచేయవచ్చు.ఈ విశ్రాంతి సమయంలో సంగీతం వింటూ ఒక పండు తింటూ పచ్చటి ప్రకృతిని చూస్తూ ఉంటే ఒత్తిడి మాయమై మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.దీనితో చకచకా పనులు పూర్తి అవుతాయి.

వేళకు ఓ పండు

                                                               మనలో చాలామంది మహిళలు ఉదయం,సాయంత్రం  పని హడావిడిలో  అల్పాహారం తీసుకోకుండా అశ్రద్ద చేసి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగేసి ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటారు.అలా చేయడం వలన క్రమేపీ మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.కనుక అటువంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం తగిన సమయం లేకపోతే అల్పాహారం బదులు ఒక అరటి పండు,యాపిల్,జామ,బొప్పాయి,అనాస ముక్కలు లేదా వేళకు ఏదో ఒక పండు అందుబాటులో వున్నవి తిన్నా సరిపోతుంది.శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.అలాగే ఒక కప్పు పాలు తాగితే ఎముకలు కూడా ధృడంగా తయారౌతాయి.పని ఒత్తిడిగా అనిపించినప్పుడుఒక పావుగంట ఎండలో కూర్చుంటే ఒత్తిడి మటుమాయమౌతుంది.సాయంకాలం లేదా పని మధ్యలో ఆకలిగా  అనిపించినప్పుడు ఏ పకోడీలో,బజ్జీలో తినకుండా క్యారట్,కీరా ముక్కలు,దానిమ్మ,గుమ్మడి,పుచ్చ గింజలు,నానబెట్టిన బాదం,ఎండు ద్రాక్ష వంటివి తింటే పొట్ట నిండడంతోపాటు పోషకాలు అందుతాయి.దీనితో బరువు అదుపులో ఉండి అందంగా,ఆరోగ్యంగా,చర్మం కాంతులీనుతూ ఉన్న వయసు కన్నా తక్కువగా  కనిపిస్తారు.