Thursday, 17 December 2020

ఇడ్నీ లో రాళ్ళు

                                                                        ధనమ్మ కొన్ని కొన్ని మాటలు స్పష్టంగా పలుకదు.నత్తి ఏమీ లేదు కానీ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఎవరైనా అలా కాదు ఇలా అని సరిచేద్దామని ప్రయత్నించినా నేను అంతే మాట్లాడుతాను అంటుంది.అందుకని ఎదుటివారే ఆమె మాట్లాడేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.కొంతమంది నవ్వుకుంటారు.ధాత్రి ఆమె ఏమి చెప్పినా  ఓపికగా వింటుంది.ఒకరోజు ధాత్రి టమోటాలు కూర వండడానికి ముక్కలు కోసుకుంటుండగా  ధనమ్మ  వచ్చింది.ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మాటల మధ్యలో మా అక్క కూతురు టమోటాలు తింటే ' ఇడ్నీ లో రాళ్ళు ' ఏర్పడతాయని ఎప్పుడన్నా టమోటా కూర వండితే నన్ను చంపెయ్యండే ! పోయేది నేనేగా మీకేంటి?టమోటాలు  వండ వద్దు అని అంటే వినరు అని గొడవ పెట్టుకుంటుందని  చెప్పింది.ఆమె చెప్పింది విని ధాత్రి ఆశ్చర్యపోయింది.తర్వాత నెమ్మదిగా తేరుకుని ఏమిటి ? మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ అదే చెప్పింది.కిడ్నీ లో రాళ్ళు పడతాయని చెప్పింది కాబోలు అని అర్ధం చేసుకుంది ధాత్రి.ఓసి నీ దుంప తెగ ( ఒకప్పటి ఊత పదం ) కిడ్నీ ని ఇడ్నీ చేసేశావన్న మాట అని ధాత్రి మనసులో నవ్వుకుంది.పైకి అందరిలా నవ్వితే బాధ పడుతుంది కదా!  తెలిసో తెలియకో ఎదుటి వారిని సాధ్యమైనంతవరకు బాధ పెట్టకూడదు అని ధాత్రి ఉద్దేశ్యం.