ఒకానొకప్పుడు అందమే ఆనందం అనేది నానుడి.ఇప్పుడు ఆనందమే అందం అనేది నానుడి.అందంతోపాటు అందమైన మనసు కూడా ఉంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి.అంతటి అదృష్టం బహు కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది.వాళ్ళతోపాటు ఇంట్లో వాళ్ళు,స్నేహితులు,చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అదృష్టవంతులు. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుండి ముఖంపై నవ్వు లేకుండా చిటచిటలాడుతూ అవసరం అయినదానికి,కానిదానికి అందరిపై ఎగిరెగిరి పడుతూ ఉంటారు.ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే అందరూ ఆమడ దూరం పరుగెత్తుతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ముఖంపై ఎల్లప్పుడు చెరగని చిరునవ్వుతో ఉంటూ మంచి మనసుతో నలుగురికి చేతనైన సహాయం చేస్తూ ఆనందంగా ఉంటే అందరూ ఇష్టపడతారు.దానితో ఒత్తిడికి గురికాకుండా మానసికంగా,శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.ఆనందంగా ఉంటే అందం దానంతట అదే రెట్టింపు అవుతుంది అనేది అక్షరాల నిజం.