45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఎండలు బాబోయ్ ఎండలు వీటిని తట్టుకుని ఎలా నిలబడాలి?వేడిని హాంఫట్ చేసి శరీరానికి వెంటనే శక్తినిచ్చే పానీయాలు ఏమేమి ఉన్నాయో అని ఆలోచిస్తుంటే చిన్నప్పుడు జేజమ్మ,అమ్మమ్మ,నానమ్మ,అమ్మ వేసవి కాలంలో ప్రత్యేకంగా ఇచ్చే పానీయాలు వరుసగా గుర్తొచ్చాయి.అప్పట్లో ఎంతో ఓపికగా పిల్లలందరికీ సమయానికి అన్నీ తయారు చేసి వట్టి వేళ్ళ చాపలు వేలాడేసిన తాటాకు పందిళ్ళ క్రింద కూర్చోబెట్టి అందరూ అన్ని రకాల పానీయాలు తాగేవరకు కబుర్లు,కథలు చెప్తూ వడదెబ్బ తగలకుండా కాపాడేవాళ్ళు.అవేంటంటే లేవగానే అందరికీ తాగగలిగినన్ని చల్లటి కుండలో మంచి నీళ్ళు తాగించి తర్వాత రాత్రి పాలుపోసి దానిలో అన్నం వేసి తోడుబెట్టిన పెరుగు అన్నంలో ఉల్లిపాయ వేసి ఇష్టమైన వాళ్ళకు పెట్టడం లేదా ఇడ్లీ మాత్రమే అల్పాహారం పెట్టి తక్కువ నూనెతో తయారుచేసిన కూరలతో శాకాహార భోజనం పెట్టి మధ్య మధ్యలో చల్లటి మంచి నీళ్ళు అందిస్తూ,4 నుండి 5 గం.లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్ళు (సబ్జాగింజలు 4-5 గం.లు నానబెట్టాలి).తేనెతో కానీ,బెల్లంతో కానీ నిమ్మరసం,పంచదార కలిపి కానీ,ఏదైనా పండ్లరసంలో(సపోటా,మామిడి,అనాస,బత్తాయి)కానీ కలిపి ఇచ్చేవాళ్ళు.ఏ రకమైన రుచి వుండదు కనుక నానబెట్టిన సబ్జా గింజలు దేనిలో అయినా ఇట్టే కలిసిపోతాయి.తాటి ముంజెలు,ఈత, సీమతుమ్మకాయలు,నేరేడుపండ్లు,కీరదోస,దోస,జామ,పుచ్చకాయ,కర్భూజాముక్కలు,రాగిజావ,మజ్జిగ(నిమ్మకాయ మజ్జిగ,మసాలా మజ్జిగ,పుదీనా మజ్జిగ,ఉప్పు పంచదార మజ్జిగ ఇలా ఎన్నెన్నో రకాలు),జల్ జీరా,చింత పండు రసం,పచ్చి,పండు మామిడి కాయల రసం,పుదీనా రసం ఒక్కొక్కటి ఒక్కోసారి ఇస్తూ వడదెబ్బకు వచ్చే జలుబు,దగ్గు,జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడేవాళ్ళు.ఆరోజుల్లో ఈరోజుల్లోలాగా చల్లటి గాలి తగలడానికి యంత్రాలు కూడా లేవు కదా!తాటిఆకులు,వట్టివేళ్ళతో చేసిన విసనకర్రలతో విసురుకుంటూ హాయిగా అందరూ కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు.అన్నీ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు.మనం కూడా మన పిల్లలకి తాజా పండ్ల రసాలతోపాటు పై విధంగా సాధ్యమైనంత వరకు ఇవ్వగలిగితే వేసవిని జయించినట్లే.మనకు ఇవన్నీ తెలియజేసినందుకు మనం మన పెద్దవాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ వేసవిని జయిద్దాం.
No comments:
Post a Comment