Tuesday, 1 August 2017

నాన్న స్పర్శ

                                                                               ద్విజ ఇద్దరు పిల్లల తల్లి.ద్విజ,భర్త ఇద్దరూ యంత్ర శాస్త్రంలో పట్టభద్రులు.ద్విజ ఉద్యోగ రీత్యా మొదటి స్థానంలో ఉంటుంది.ఒక బిడ్డకు తల్లి అయ్యే వరకు బాగానే ఉంది.భర్త రెండవ బిడ్డ కావాలంటే తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరేనంది.ఒక పాప ఒక బాబు చీకు చింత లేని సంసారం.భర్త ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలెట్టి అదనపు డబ్బు సంపాదించడంతో సంతోషంగా రకరకాల వజ్రాలు,వైడూర్యాలు కొనుక్కునేది.రోజులు ఒకే విధంగా వుండవు కదా!భర్తకు వ్యాపారంలో నష్టం వచ్చేసరికి ద్విజ మానసికంగా కుంగిపోయి నన్ను,పిల్లలను నట్టేట ముంచావు అంటూ పెద్ద పెద్దగా ఏడవడం,అరవడం చేస్తుండేది.అమెరికాలో ఉండడంతో భర్త ఎంతో ఓర్పుతో ద్విజకు వైద్యం చేయించి చిన్న పిల్లలను బాధ్యతగా పెంచుతూ ఉద్యోగం చేసేవాడు.వ్యాపారంలో నష్టం వచ్చింది కనుక బిడ్డలకు,నాకు అన్యాయం చేశావు.అందుకే నీకు,నాకు సంబంధం లేదు అంటూ పిల్లలను కూడా తండ్రి దగ్గరకు రానీయకుండా పిచ్చి పనులు చేయడం మొదలెట్టింది.తండ్రి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ కనుక పిల్లలు తండ్రి దగ్గరకు వస్తే బలవంతంగా తీసుకెళ్ళి వేరే గదిలో పెట్టేది.పిల్లల ఏడుపు వినలేక భార్య మానసిక స్థితి సరిగా లేదు కనుక వైద్యుని సలహాతో వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్ళాడు.పిల్లను బాగానే చూస్తుంది కనుక మధ్య మధ్యలో ఇంటికి వచ్చినా ద్విజలో మార్పు రాలేదు. ద్విజ చిన్నప్పటి నుండి తన వైపు నుండే ఆలోచించి తప్పు అయినా ఒప్పు అయినా తనదే ఒప్పు అనేది.వ్యాపారంలో లాభాలు,నష్టాలు సర్వ సాధారణం.లాభాలు వచ్చినన్నాళ్ళు బాగానే ఉంది.నష్టం వచ్చేసరికి నువ్వు నాకొద్దు అంటూ పిల్లల గురించి ఆలోచించకుండా పిల్లలకు నాన్న స్పర్శ తెలియకుండా తనొక్కతే పెంచుదామనే నిర్ణయం తీసుకుంది.పిల్లలు,తండ్రి ఒకళ్ళను ఒక్కళ్ళు వదిలి ఉండలేని పరిస్థితి.తల్లి,తండ్రి అనురాగంతో,ఆనందంగా పెరగాల్సిన పిల్లలు దిగులుగా ఉంటే నాన్నమ్మ కడుపు తరుక్కుపోతోంది.ఏమీ చేయలేని పరిస్థితి.మేము చదువుకున్నాం కనుక మాకు అన్నీ తెలుసు ఎవరూ చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఒకటి.దాంతో బంగారం లాంటి సంసారం చెడగొట్టుకుని విడిపోయే పరిస్థితి దాపురించింది.

No comments:

Post a Comment