Monday, 31 December 2018

రైతుకు చేయూత

                                           నూతన సంవత్సరం వచ్చిందంటే అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకోవడంతోపాటు పెద్దలను కలిసేటప్పుడు ఎక్కువగా మిఠాయిలు,ఆపిల్ పండ్లు తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తుంది.మిఠాయిలు ఆరోగ్యానికి చేటు.ఆపిల్ పండ్లు విదేశీ పండ్లు.వీటిని దిగుమతి చేసుకోవడంతో డబ్బు విదేశాలకు చేరుతుంది.కనుక వీలైనంతవరకు ఈసారి మనదేశంలో,మన రైతులు పండించిన అరటి,చక్రకేళి,దానిమ్మ,బొప్పాయి,జామ వంటి రకరకాల పండ్లు శుభాకాంక్షల నిమిత్తం ఉపయోగించినట్లయితే మన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.స్వదేశీ పండ్లను ఉపయోగించి రైతులకు చేయూత ఇచ్చినట్లయితే వ్యవసాయ కుటుంబాలు ఆర్ధికంగా మెరుగుపడడానికి సహాయపడినట్లు అవుతుంది.మిఠాయిలు,విదేశీ పండ్ల కన్నా స్వదేశీ పండ్లే ముద్దు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019

                                                                            గత స్మృతులు నెమరవేసుకుంటూ,గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ,నూతనోత్సాహంతో,సరి కొత్త లక్ష్యాలతో, విజయపధంలో నడుస్తూ, అష్టైశ్వర్యాలను,భోగభాగ్యాలను చవిచుస్తూ,మీ జీవన ప్రయాణంలో మీరు,మీ కుటుంబసభ్యులు  సుఖసంతోషాలతో,ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా అనుకున్న విధంగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ  నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అతి ప్రేమ

                                                                       అతి ప్రేమ వల్ల కొన్ని కొన్ని సార్లు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.ఈమధ్య విప్రకు అటువంటి పరిస్థితే ఎదురైంది.విప్ర స్నేహితురాళ్ళతో కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.వాళ్ళింట్లో ఎప్పటి నుండో నిమ్మీ అనే కుక్క ఉంది.విప్ర కారు వెళ్ళి ఇంటి ముందు ఆగగానే నిమ్మీ పరుగెత్తుకుంటూ వచ్చింది.దానికి మాములుగా కారు తలుపు తీయగానే విప్ర మీద కాళ్ళు పెట్టేసే అలవాటు ఉంది.ముందుగా విప్ర స్నేహితురాళ్ళు దిగుతూ ఉండేసరికి కొత్తవాళ్ళను చూసి మీదపడి వాళ్ళని కరిచేలా పెద్దపెద్దగా అరిచింది.ఇంతలో విప్ర దిగేసరికి నిమ్మీ ఎంతో సంతోషంగా ఎగిరి విప్ర మెడ వరకు కాళ్ళు వేసింది.ఏయ్!ఏయ్! అంటూ విప్ర ఒక అడుగు వెనక్కి వేసేసరికి నిమ్మీ కూడా వెనక కాళ్ళపై నడిచి నాకడానికి ప్రయత్నించింది.అక్కడ పూల కుండీలు ఉండడంతో దభీమంటూ విప్ర మొక్కల్లో పడిపోయింది.వెంటనే తేరుకుని లేచింది విప్ర.నిమ్మీ అతి ప్రేమ వల్ల వేగంగా పడడంతో మెడ నరాలు అదిరి వాంతులు అయిపోయి ఒక రోజంతా పడుకునే ఉండవలసి వచ్చింది.ఇంకా నయం ఎక్కడా ఎముకలు విరగలేదు అని విప్ర సంతోషపడింది. 

Sunday, 23 December 2018

మాటిమాటికి నొప్పులా?

                                                            కొంతమందిని మాటిమాటికీ కాళ్ళ నొప్పులు,మెడనొప్పి,ఒళ్ళు నొప్పులు ఏదో ఒకటి వేధిస్తుంటాయి.నలభై దాటిన మహిళల్లో,సరైన ఆహారం తీసుకోని వాళ్ళల్లో కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి.ఇటువంటప్పుడు ఒకసారి కాల్షియం పరీక్ష చేయించుకుని వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.కాల్షియం సరిపడా ఉంటే ఎముకలు,దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.కండరాల పనితీరు మెరుగుపడుతుంది.ఎన్నో ఉపయోగాలున్న కాల్షియం పుష్కలంగా లభించే ఆహారం రోజువారీ వీలైనంత ఎక్కువగా ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.మునగ కాయలు పాలకూర,తోటకూర,గోంగూర,మునగాకు,చేమఆకు,పొన్నగంటి వంటి ఆకుకూరలు,క్యాబేజ్,ముల్లంగి,కాలీఫ్లవర్,సోయాబీన్స్,సెనగలు,పెసలు,రాజ్మ,బాదం,ఖర్జూరం,ఎండుద్రాక్ష,నువ్వులు,అవిసెలు,క్వినోవా,అంజీర్,చేపలు,గుడ్లు,పాలు,నువ్వులలడ్డు,తాటి బెల్లం వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.కాల్షియం తగ్గితే ఎముకలు బోలుగా తయారై ఊరికే విరిగిపోయే ప్రమాదం ఉంది.కనుక కాల్షియం మందు రూపంలో వేసుకునేకన్నా ఆహారం రూపంలో తీసుకోవడం ఉత్తమం.

Friday, 21 December 2018

బిర్యానీ పిచ్చికుక్క

                                                                      శర్మిష్ట ఒకరోజు కోడి కూర,కోడి బిర్యానీ చేసి పనిమనిషి శారద పిల్లల కోసం గిన్నెలో పెట్టి ఇచ్చింది.అది చూడగానే శారద సంతోషంగా నా కొడుక్కి బిర్యానీ అంటే పిచ్చి.బిర్యానీ చూస్తే చాలు పిచ్చికుక్క మాదిరి ఎగబడిపోతాడు.నా కొడుకుని ముద్దుగా బిర్యానీ పిచ్చికుక్క అంటాను అని చెప్పింది.అదేమి ప్రేమే తల్లీ?బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్తే వినడానికి బాగుంటుంది కానీ బిర్యానీ పిచ్చికుక్క అంటే ఏమి బాగుంటుంది?ఎంత పిల్లాడైనా అంది శర్మిష్ట.వాడు కిలకిలా నవ్వుకుంటాడు అమ్మా!నేను ఆమాట అనగానే అంది శారద.ఎవరి అలవాట్లు వాళ్ళవి.ఎవరి మాటతీరు వాళ్ళది.ఇది చిన్న విషయమే కావచ్చు.అయినా ఈమె అనే కాదు కొంతమంది తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు.నాలుగు అని చెప్పినా అదే నిజమైనా వాళ్ళ పద్ధతి మార్చుకోరు.మనకు నచ్చినట్లు మనం ఉండడం అంతే కానీ ఈ రోజుల్లో ఎదుటివారిని మార్చాలని అనుకోవడం అంత తెలివి తక్కువ తనం ఇంకొకటి లేదు అనుకుంది శర్మిష్ట.

ముప్పు తిప్పలు పెట్టిన చిట్టెలుక

                                                               భవ్య ఇంటి చుట్టూ బోలెడంత అంటే చాలా ఖాళీ స్థలం ఉంది.దానిలో రకరకాల పువ్వుల మొక్కలతోపాటు కూరగాయలు,ఆకుకూరలు పెట్టింది.భవ్య వరుసకు చెల్లెలు గవ్య డాబాపై కూరగాయలు పెంచుకోవటం ఎలా?అని ఉద్యానవన శాఖవారు పెట్టిన తరగతులకు హాజరైతే వాళ్ళు రకరకాల నమునా కూరగాయలు,ఆకుకూరల విత్తనాలు ఇచ్చారు.వాటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో చాలా స్థలం ఉంది కదా! పెట్టమని భవ్యకు ఇచ్చింది.గవ్య వేరే ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా వాళ్ళు మొక్కలను కాపాడలేకపోయారు.భవ్య గింజలు భూమిలో పెట్టి మొక్కలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కాపాడింది.ఎలాగైతే కొన్ని రోజులు కాయలు బాగానే వచ్చాయి.చుట్టుపక్కల అందరికీ ఇచ్చింది.రుచి చాలా బాగుంది అని అందరు మెచ్చుకున్నారు కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.ఈమధ్య తెల్లారేసరికి పందిరికి వేళ్ళాడే కాయలు,క్రింద ఉన్న పిందలన్నీ కొరికి ముక్కలు చేసి ఉంటున్నాయి.ఉదయం తోటలోకి వెళ్తే అప్పుడే కొరికినట్లుగా తెల్లగా ముక్కలు క్రింద పడి ఉంటున్నాయి.రాత్రిపూట ఏ పందికొక్కులు,ఎలుకలు తింటున్నాయో లేదా తెల్లవారుఝామున ఉడుతలు కొరికేస్తున్నాయో తెలియక భవ్య బుర్ర బద్దలుకొట్టుకునేది కాక గవ్య బుర్ర అదేపనిగా తినడం మొదలెట్టింది.పైన వాటికి కవర్లు చుట్టి,క్రింద ఉన్న వాటిపై గమేళాలు,బక్కెట్లు బోర్లించి నానా తిప్పలు పడితే గాలి తగలక పిందెలు కుళ్ళిపోతున్నాయి.భవ్యకు ఏడుపు వచ్చినంత పనై దొంగ మొహంది ఏది వచ్చి తింటుందో కానీ నాకైతే ప్రాణం ఉసూరుమంటుంది.ఎన్ని విధాలుగా కాయల్ని కాపాడదామని ప్రయత్నించినా కాపాడలేక,తినేవాటిని నియంత్రించలేక విసుగొచ్చి మందు పెట్టి చంపెయ్యాలన్నంత కచ్చి పుడుతుంది. నాకు నిద్రలో కూడా అదే ధ్యాసగా ఉంటుంది అంటూ కంఠ శోషగా చెప్పింది..ఒకటి,అర అయితే ఊరుకోవచ్చు కానీ ఈరోజు ఒకటి కొంచెం కొరికి మళ్ళీ తర్వాతి రోజు పక్కది కొరుకుతుంది అని చెప్పింది.భవ్య.ఎలుక అయ్యుంటుంది బోను పెట్టు అని సలహా ఇచ్చింది గవ్య.ఒక చిన్న పకోడీ పెట్టి బోను పెడితే చిట్టెలుక పడింది అంటూ తెల్లారేపాటికి ఉత్సాహంగా గజదొంగను పట్టుకున్నానని చెప్పింది.చిన్న ప్రాణే కానీ పాపం భవ్యను  ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.

Tuesday, 18 December 2018

కేడి పెయ్య

                                                                           హైమ ఒకరోజు ఇంట్లోకి వస్తూనే చాటంత మొహంతో ఎంతో సంతోషంగా అమ్మా!ఊరిలో ఉన్న మా ఆవుకు కేడి పెయ్య పుట్టిందని మా అత్త చరవాణిలో  చెప్పింది అంది.కేడి పెయ్య అనే పదం మొదటిసారి వినడంతో అంటే ఏమిటి?అంది శ్రుతి.మగ దూడను కేడి పెయ్య అంటామని చెప్పింది హైమ.ఎవరైనా ఆవుకి కానీ,గేదేకి కానీ పెయ్య దూడ పుడితే సంతోషపడతారు కానీ విచిత్రంగా నువ్వు మాత్రం కేడి పెయ్య పుడితే సంతోషపడతావేంటి?అంది శ్రుతి.మా ఊరిలో అందరూ కేడి పెయ్య పుడితే సింహాద్రి అప్పన్న స్వామికి ఇస్తామని మొక్కుకుంటారు.మేము కూడా సింహాద్రి అప్పన్న స్వామికి కేడి పెయ్యను ఇస్తామని మొక్కుకున్నాము అని చెప్పింది హైమ.కేడి పెయ్య కొంచెం పెద్దయ్యాక స్వామికి మొక్కుబడి తీర్చేటప్పుడు కుటుంబం మొత్తం ఏ ఊరిలో ఉన్నా అందరము మా ఊరికి వెళ్ళిపెద్ద సంబరం చేసుకుంటాము.ఆరోజు కేడి పెయ్యతోసహా అందరము శుద్ధి స్నానాలు చేసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ కేడి పెయ్యను కూడా తిప్పి అక్కడ ఇచ్చేస్తే దేవస్థానం వాళ్ళు పెంచి పోషిస్తారని హైమ ఎంతో సంబరంగా శ్రుతికి చెప్పింది. 

Monday, 10 December 2018

కసకస

                                                                          ఆదిత్య రామ్ ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు.ఒకసారి నగరం నుండి ఊరికి వచ్చినప్పుడు పిన్నిని,బాబాయిని చూడడానికి వాళ్ళింటికి వెళ్ళాడు.భోజనానంతరం మాటల మధ్యలో ఏరా నాన్నా!నీ ఉద్యోగం ఎలా ఉంది?అని అడిగింది పిన్ని.బాగానే ఉంది అని చెప్పి మా మానేజరు మంచివాడే కానీ అప్పుడప్పుడు కాస్త తిక్క వస్తుంటుంది.అప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళను సతాయించుతూ ఉంటాడు.అప్పుడు అతన్ని ఏమీ అనలేము కదా!అందుకే ఎప్పుడైనా మా మానేజరుపై కోపం వస్తే రైతుబజారు నుండి కారట్,క్యాబేజ్ కొనుక్కొచ్చి ఆ కోపం తగ్గేవరకు కసకస వాటిని కోసి కూర వండుకుని స్నేహితులందరము కలిసి తింటాము.అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు పిన్ని అని ఆదిత్య రామ్ చెప్పాడు.అక్కడ ఉన్న వాళ్ళందరు ఒకటే నవ్వులు.ఇదేదో బాగానే ఉందే అంది పిన్ని.ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిపై కోపంతో విరుచుకు పడడం,వాళ్ళు బాధపడటం ఇవేమీ లేకుండా ఆ అసహనాన్ని కారట్,క్యాబేజ్ పై చూపించడం కాసేపటికి మామూలైపోవడం అన్న ఆదిత్య ఆలోచన నిజంగా బాగుంది.ఎవరికీ కష్టం,నష్టం లేని పని అని అక్కడ వింటున్న వారందరూ అనుకున్నారు.  

Thursday, 6 December 2018

అరటి ఆకులో భోజనం

                                                          ఇంతకు ముందు రోజుల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు తప్పనిసరిగా నదీస్నానానికి వెళ్ళి అటునుండి అటే శివాలయానికి వెళ్ళి వత్తులు వెలిగించుకుని శివదర్శనం అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి సాయంత్రం మరల స్నానం చేసి శుచిగా వంట చేసుకుని పూజానంతరం నక్షత్ర,చంద్ర దర్శనం చేసుకుని తర్వాత తప్పనిసరిగా అరటి ఆకులో భోజనం చేసేవారు.రోజువారీ తినే పళ్ళేలలో రకరకాల ఆహారపదార్ధాలు తింటూ ఉంటారు కనుక ఉపవాసం ఉన్నప్పుడు అరటి ఆకులో భోజనం చేయడం మంచిదని పెద్దలు చెప్పేవారు.మాములుగా కూడా అరటి ఆకులో భోజనం చేయడం వలన ఆహారపదార్ధాల వేడికి ఆకులోని ఔషధ గుణాలు పదార్ధాలలో కలిసి ఆహారం మరింత రుచిగా ఉండడమే కాక జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని,ఆకలి కూడా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతుంది.అంతేకాక ప్రేగులలో ఉన్న చెడు క్రిములు నశిస్తాయని తద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమని పెద్దల ఉవాచ.