మహాలక్ష్మమ్మ గారి ఇంటి నిండా ఎప్పుడూ ఖాళీ లేకుండా వచ్చేపోయే జనాలు.ఇంట్లో కొడుకు,కోడలు,పిల్లలు తోపాటు పనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు.మహాలక్ష్మమ్మ గారే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అరవై ఐదేళ్ళ వయసులో కూడా కాఫీ,టీ,అల్పాహారం,భోజనం ఏర్పాట్లు చూస్తుంటారు.ఈమధ్య కాస్త నలతగా ఉండడంతో ఇంతకు ముందు మాదిరిగా హుషారుగా తిరగలేక పోవడంతో పరామర్శించడానికి వచ్చేపోయే బంధువులు,స్నేహితులు నీకేమమ్మా!కాలు క్రింద పెట్టనవసరం లేదు.నోట్లో నుండి మాట బయటికి రావడం ఆలస్యం ఏది కావాలంటే అది మంచం దగ్గరకే తెచ్చి అందించటానికి అందరూ ఉన్నారు అనడం మొదలెట్టారు.ఎంత మంది ఉన్నా ఏమి లాభం? చుట్టూ సముద్రం నీరు ఉన్నా త్రాగడానికి గుక్కెడు నీరు కూడా పనికిరానట్లు అవసరానికి ఎవరూ అందుబాటులో ఉండరు.మహాలక్ష్మమ్మగారి కోసమే ఒక ఆమెను ప్రత్యేకించి పెట్టారు.ఆమె ఎప్పుడు చూసినా చరవాణి చేతపట్టుకుని వదలదు.పిలిచిన గంటకు వచ్చి పిలిచారా మామ్మగారూ?అంటూ వస్తుంది.ఈలోపు శోష వచ్చేస్తుంది.ఎవరి గొడవ వారిదే.కాలు చెయ్యి బాగుండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారి పని కూడా మనమే చేసిపెడితే అందరికీ సంతోషం మనకు కూడా సంతోషం.ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎదురింటి వాళ్ళు,పక్కింటి వాళ్ళు,వెనకింటి వాళ్ళు అందరూ వంతులవారీగా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు.ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత వెదికినా మచ్చుకైనా కనబడటం లేదు.ఈరోజుల్లో అయితే పలకరింపుకు వెళ్ళాలన్నావెళ్తే ఎక్కడ వారి అనారోగ్యం తమకు చుట్టుకుంటుందో అని బెరుకుగా వెళ్ళి మొక్కుబడిగా ఒక 5 ని.లు కనిపించి వెళ్ళిపోతున్నారు.ఏదేమైనా కానీ మునుపటి రోజులు పోయాయి.మళ్ళీ అలనాటి అభిమానం,ఆప్యాయత,ప్రేమ ఈనాడు కూడా అందరిలో ఉంటే ఎంత బాగుంటుందో?!అని మహాలక్ష్మమ్మగారు అనగానే అవునవును అంటూ వంతపాడారు స్నేహితురాళ్ళు.వాళ్ళతోపాటు మనము కూడా ఎదురు చూడడమే కాక తప్పకుండా రావాలని కోరుకుందాము.
Wednesday, 22 May 2019
Wednesday, 15 May 2019
అప్పటికీ ఇప్పటికీ
చదువుకునే రోజుల్లో రోహిణి,బ్రహ్మాజీ ప్రక్కప్రక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళు.బ్రహ్మాజీ చిన్నవాడు అవడంతో అక్కా,అక్కా అంటూ రోహిణి చుట్టూ తిరుగుతుండేవాడు.దానికి తోడు బ్రహ్మజీకి ఇద్దరూ అన్నలే కనుక రోహిణి అంటే వాడికి చాలా ఇష్టం.రోహిణి పైచదువుల కోసం వెళ్ళడం తర్వాత పెళ్ళి,పిల్లలు ఎవరి గోల వాళ్ళదే.అనుకోకుండా ఒక రోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో బ్రహ్మాజీ కనిపించి మీరు రోహిణి అక్కేనా? అని తనను తను పరిచయం చేసుకున్నాడు.మాటల మధ్యలో అక్కా చిన్నప్పుడు పాఠశాలకు,ప్రైవేటుకు తిరగడం వల్ల నీ చెప్పులు త్వరగా అరిగిపోయేవి కదా!అని చిన్ననాటి కబుర్లు చెప్తూ ఇప్పుడు కూడా చెప్పులు అంతే అరిగిపోతున్నాయా?అని అడిగాడు.లేదయ్యా!ఇప్పుడు వచ్చేపోయే బంధువులకు వంటావార్పు చేసి మర్యాదలు చేయడంతో చెప్పుల బదులు కాళ్ళు అరిగిపోతున్నాయి.అప్పటికీ ఇప్పటికీ అదే తేడా అని చెప్పింది రోహిణి.బ్రహ్మాజీ పకపక నవ్వుతూ అక్కా ఏది ఏమైనా కానీ అప్పటికీ ఇప్పటికీ నువ్వు,నీ మాట తీరు ఏమాత్రం మారలేదు అని చెప్పాడు.కాసేపు చిన్నప్పటి కబుర్లు చెప్పి వెళ్తూ వెళ్తూ తన ఇంటికి రమ్మని ఆహ్వానించి రోహిణి వద్ద శెలవు తీసుకున్నాడు.
Sunday, 12 May 2019
అమృతమూర్తి
సంబంధ బాంధవ్యాల్లో ఎక్కువ శాతం స్వార్ధపూరితాలే కానీ అమ్మ ప్రేమ ఒక్కటే అందుకు మినహాయింపు.నిష్కల్మషమైన ప్రేమ అమ్మ స్వంతం.అందరికన్నా ముందు లేచి ఆఖరికి పడుకుంటూ ఆరోగ్యం బాగా లేకున్నా పనిచేస్తూ మనసు నొచ్చుకున్నా నవ్వేస్తూ అందరికీ అన్నీ అమర్చడం అమ్మకే సాధ్యం.అత్మీయతకు చిరునామా అమ్మ.ముమ్మాటికీ అమ్మకి అమ్మే సాటి.అమ్మ తన పిల్లలకే కాక పిల్లల పిల్లలకు కూడా సేవ చేసే అమృతమూర్తి.నిస్వార్ధంగా పిల్లల కోసం చేసే త్యాగాలు చాకిరీలకు అంతూదరీ ఉండదు.ఇంటి పనులకు విరామం విశ్రాంతి అనేది ఉండదు కదా!అమ్మ బాధ్యత మహా కష్టమైనది,క్లిష్టమైనది.అమ్మ ఓర్పుకి,నేర్పుకీ,నైపుణ్యానికి,ప్రేమకు ఏమి అవార్డు ఇవ్వగలం?అమ్మ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.అమ్మకోసం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు.అలసిసొలసిన వయసులో అమ్మను ప్రేమతో చూసుకోవడం మన బాధ్యత.అమ్మ సంతోషమే మనకు ఎంతో సంతృప్తి.కాసేపు అమ్మతో గడిపితే కొండంత ప్రేమ మన స్వంతమవుతుంది.స్వేచ్చగా ,సంతోషంగా మనసులోని భావాలన్నీ పంచుకోగలిగేది ఒక్క అమ్మతో మాత్రమే.అమ్మతో మాట్లాడితే ఎక్కడ లేని నిశ్చింత.మనసుకి ప్రశాంతత.తరాల అంతరంతో ఎవరైనా అమ్మా నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడకు అని కసిరితే వాళ్ళ పిల్లలతో తిరిగి కసిరించుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకుంటే మంచిది.పెద్దయ్యాక పిల్లలు ఆర్ధికంగా ఎదిగితే కుళ్ళు కుతంత్రాలు లేకుండా సంతోషపడేది ఒక్క అమ్మ మాత్రమే.దేశానికి రాజు అయినా అమ్మకు కొడుకే అన్నట్లు ఎవరు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అమ్మకు కొడుకు,కూతురు మాత్రమే.ఆ అమృతమూర్తికి సంతోషంగా,ప్రేమతో సేవ చేసే భాగ్యాన్ని,సమయాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని ఈరోజే కాకుండా ప్రతిరోజు మాతృదినోత్సవం అనుకోవాలని కోరుకుంటూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Monday, 6 May 2019
వేసంగి నేస్తం
వేసవి వచ్చిందంటే ఏమి తిన్నా తినకపోయినా చల్లటి మంచినీళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది.ఇంటికి వచ్చిన అతిధులకు రాగానే చల్లటి మంచి నీళ్ళు ఇస్తే ఎంతో సంతోషపడతారు.కుండ నీరు అయితే మరీ సంతోషం.ఇంతకీ వేసంగి నేస్తం ఏమిటంటే మంచి నీటి మట్టి కుండ.కుండలో ఒక రాగి పాత్ర కూడా వేస్తే నీళ్ళు శుభ్రం అవుతాయి.వేసవిలో ఈ నీరు త్రాగడం ఉత్తమం.దప్పిగొన్నవారికి గుక్కెడు నీళ్ళు ఇస్తే అన్ని బాధలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి.వీలయితే పక్షులకు,జంతువులకు కూడా వేసవిలో తాగడానికి మట్టి పాత్రల్లో నీళ్ళు పెట్టడం ఎంతో మంచిది.ఇప్పుడు చాలామంది వెనుకటి రోజుల్లో మాదిరిగా మట్టి పాత్రలో వండి వడ్డించడానికి,వాటిల్లో తినడానికి ఇష్టపడుతున్నారు.మట్టి కుండలో నీరు,మట్టి పాత్రలో వండిన పదార్ధాలు రుచితో పాటు ఆరోగ్యదాయకం.వీలయితే ప్రయత్నించండి.
రారమ్మని ....
అక్షయ తృతీయ నాడు రవ్వంత మంచి చేసినా కొండంత పుణ్యం దక్కుతుంది.అలాగే చెడ్డ పనులు చేసినా అంతే ఎప్పటికీ తరగని పాపం దక్కుతుంది.ఈరోజు కొంచెమైనా,ఎక్కువైనా అవసరమున్న వారికి దానం ఇవ్వడం వలన వందరెట్లు అధిక ఫలం ఉంటుంది.ఈరోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూజ,దర్శనం ఎంతో మంచిది.అలాగే ఈరోజు బంగారం కొనడం సంప్రదాయంగా మారింది.బంగారమే కొనాలని ఏమీ లేదు.రాగి కొంటే రారమ్మని బంగారాన్ని,వెండిని తన వెంట తెస్తుందని మనకు తెలియని విషయం.ఈమధ్యనే ఒక అమ్మ ద్వారా తెలియడంతో ఈ రోజు రాగి ఇంటికి కొని తెచ్చుకోవడం ఉత్తమం అనిపించింది.
Wednesday, 1 May 2019
నామ్మా!డబ్బాలు పట్టుకెళ్ళు
ద్వివేద్ ఆరు సంవత్సరాల అల్లరి పిడుగు.దీనికి తోడు కబుర్ల పుట్ట.అమ్మానాన్నలు విదేశాలలో ఉండడంతో ద్వివేద్ కొన్ని రోజులు నానమ్మ తాతయ్యల వద్ద పెరిగాడు.దీనితో వాడికి వాళ్ళంటే చాలాచాలా ఇష్టం.ద్వివేద్ నానమ్మను నామ్మా!అని పిలిచేవాడు.ద్వివేద్ కి తమ్ముడు పుట్టడంతో ఇద్దరి మనవళ్ళతో కోడలికి కష్టం అని నానమ్మ ద్వివేద్ ని చూచుకోవడానికి వెళ్ళింది.కొన్ని నెలల తర్వాత నానమ్మ తిరుగు ప్రయాణం అవుతుంటే ద్వివేద్ నామ్మా!నువ్వు వెళ్లొద్దు ఇక్కడే ఉండిపో అని ఒకటే ఏడుపు.ఏడవకు నాన్నా!మనకు మన ఊరిలో పొలాలు,ఇళ్ళు ఉన్నాయి కదా!అక్కడ తాతయ్యకు కూడా ఇబ్బంది. అందుకే మళ్ళీ పనులు చూచుకుని తాతయ్య,నేను వస్తాము అని చెప్పింది.అప్పుడు ద్వివేద్ కళ్ళు తుడుచుకుని నామ్మా!నేను పెద్దపెద్ద డబ్బాలు ఇస్తాను.వాటిని పట్టుకెళ్ళి పొలాలు,ఇళ్ళు వాటిల్లో పెట్టుకుని ఇక్కడకు తీసుకుని రా!ఇక్కడే అందరం ఉండిపోవచ్చు అన్నాడు.ఒక్క క్షణం నోట మాట రాక నానమ్మ వాడి మద్దుముద్దు మాటలకు నవ్వుకుంటూ పొలాలు,ఇళ్ళు డబ్బాల్లో తేవడానికి కుదరదు నాన్నా!వాటిని అక్కడే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పింది.అలాగయితే పనులు అయిపోగానే త్వరగా వచ్చేయండి నామ్మా!మీకోసం ఎదురుచూస్తాను అని సంతోషంగా వీడ్కోలు చెప్పాడు.
Subscribe to:
Posts (Atom)