Wednesday, 22 May 2019

అలనాడు - ఈనాడు

                                                                   మహాలక్ష్మమ్మ గారి ఇంటి నిండా ఎప్పుడూ ఖాళీ లేకుండా వచ్చేపోయే జనాలు.ఇంట్లో కొడుకు,కోడలు,పిల్లలు తోపాటు పనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు.మహాలక్ష్మమ్మ గారే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అరవై ఐదేళ్ళ వయసులో కూడా కాఫీ,టీ,అల్పాహారం,భోజనం ఏర్పాట్లు చూస్తుంటారు.ఈమధ్య కాస్త నలతగా ఉండడంతో ఇంతకు ముందు మాదిరిగా హుషారుగా  తిరగలేక పోవడంతో పరామర్శించడానికి వచ్చేపోయే  బంధువులు,స్నేహితులు నీకేమమ్మా!కాలు క్రింద పెట్టనవసరం లేదు.నోట్లో నుండి మాట బయటికి రావడం ఆలస్యం ఏది కావాలంటే అది మంచం దగ్గరకే తెచ్చి అందించటానికి అందరూ ఉన్నారు అనడం మొదలెట్టారు.ఎంత మంది ఉన్నా ఏమి లాభం? చుట్టూ సముద్రం నీరు ఉన్నా త్రాగడానికి గుక్కెడు నీరు కూడా పనికిరానట్లు అవసరానికి ఎవరూ అందుబాటులో ఉండరు.మహాలక్ష్మమ్మగారి కోసమే ఒక ఆమెను ప్రత్యేకించి పెట్టారు.ఆమె ఎప్పుడు చూసినా చరవాణి చేతపట్టుకుని వదలదు.పిలిచిన గంటకు వచ్చి పిలిచారా మామ్మగారూ?అంటూ వస్తుంది.ఈలోపు శోష వచ్చేస్తుంది.ఎవరి గొడవ వారిదే.కాలు చెయ్యి బాగుండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారి పని కూడా మనమే చేసిపెడితే అందరికీ సంతోషం మనకు కూడా సంతోషం.ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎదురింటి వాళ్ళు,పక్కింటి వాళ్ళు,వెనకింటి వాళ్ళు అందరూ వంతులవారీగా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు.ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత వెదికినా మచ్చుకైనా కనబడటం లేదు.ఈరోజుల్లో అయితే పలకరింపుకు వెళ్ళాలన్నావెళ్తే ఎక్కడ వారి అనారోగ్యం తమకు చుట్టుకుంటుందో అని బెరుకుగా వెళ్ళి మొక్కుబడిగా ఒక 5 ని.లు కనిపించి వెళ్ళిపోతున్నారు.ఏదేమైనా కానీ మునుపటి రోజులు పోయాయి.మళ్ళీ అలనాటి  అభిమానం,ఆప్యాయత,ప్రేమ ఈనాడు కూడా అందరిలో ఉంటే ఎంత బాగుంటుందో?!అని మహాలక్ష్మమ్మగారు అనగానే అవునవును అంటూ వంతపాడారు స్నేహితురాళ్ళు.వాళ్ళతోపాటు మనము కూడా ఎదురు చూడడమే కాక తప్పకుండా రావాలని కోరుకుందాము.

No comments:

Post a Comment