Friday, 28 February 2020

వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే

                                                            వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక ....... నీతిపరుడు మహిలో సుమతీ అని చిన్నప్పుడు సుమతీ శతకంలో నేర్చుకున్నాము కదా ! ఈ రోజుల్లో  చాలామంది  అడిగినా అడగకపోయినా అనేక రకాల మాటలు నిజమైనా అబద్దమైనా నిజమే అన్నట్లు మాట్లాడుతుంటారు.అవన్నీ విన్న వెంటనే ఆవేశపడి నిర్ణయాలు  తీసుకోవటం లేదా నీ సోది ఆపు అన్నట్లుగా ప్రవర్తించకూడదు.అది మంచి పద్ధతి కాదు.దానివల్ల  ఒక్కొక్కసారి కొన్ని లేనిపోని  సమస్యలు రావచ్చు. అటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా సాలోచనగా అన్నీ విని అందులో నిజమెంత ? అబద్దమెంత ? అందులో మనకు పనికి వచ్చేది ఎంత ?ఒకవేళ ఏమైనా ఉంటే మనకు తోచిన విధంగా దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే నిజమైన తెలివితేటలు కలవాళ్ళు.ఇంకా కొంత మంది పెద్దవాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.అందులో కొన్ని మనకు ఉపయోగపడే విధంగా కూడా ఉండొచ్చు.అందుకే ఎవరు చెప్పినా మనకు ఇబ్బంది కలగనంత వరకు వినడంలో తప్పు లేదు.ముఖ్యంగా మన మంచి కోరే పెద్దవాళ్ళు చెప్పినవి చాదస్తం అనుకోకుండా ఓపికగా కొద్దిసేపు వినడం వలన  లాభమే కానీ నష్టం వాటిల్లదు.

Thursday, 20 February 2020

మహా శివరాత్రి

                                                                        మహా శివరాత్రి రోజు చేసే అభిషేకాలకు,పూజలకు విశేష ఫలితం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.శివుడు భక్త సులభుడు కనుక అవేమీ చేయకపోయినా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా లేదా ఒక మారేడు దళము పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసినా  కోరిన కోర్కెలు వెంటనే తీర్చేస్వామి.అసలు భక్తి ఉన్నా లేకపోయినా సంవత్సరమంతా పూజలు చేయకపోయినా ఈరోజు ఏ విధంగా పూజించినా అప్రయత్నంగా ఉపవాసము,జాగరణ చేసినా కోటి జన్మల పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణేతిహాసాలు తెలియచేస్తున్నాయి.కనుక ఎవరి వీలును బట్టి వాళ్ళు ఈ పర్వదినాన్ని సంతోషంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని,పార్వతీ పరమేశ్వరుల దయవల్ల అందరూఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగ్ వీక్షకులకు ,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మరియు మీ కుటుంబసభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.