Tuesday, 1 March 2022

హర హర మహాదేవ

                                                                     భగవంతుని దయవల్ల భక్తులు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుని మహా శివరాత్రి సందర్భంగా తగు జాగ్రత్తలతో తెల్లవారుఝాము నుండే అభిషేకాలు చేయించుకోవడానికి బారులు తీరడంతో శివాలయాలన్నీ 'హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శంకర' అంటూ మారుమ్రోగిపోతున్నాయి.చుట్టుప్రక్కల వారికి శివ నామస్మరణ వీనుల విందుగా ఉంది.మనస్విని,స్నేహితురాళ్ళ ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండడంతో తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి అందరూ ఒకచోట చేరి కబుర్లు మొదలెట్టారు.ఉదయాన్నే లేచి అందరూ కలిసి ఏటికి (కృష్ణా  నదికి) స్నానానికి వెళ్లి ఒకరికొకరు పోటీపడి 108 మునకలు మునిగి ఒడ్డుకు చేరి ఇసుకతో గౌరీదేవిని చేసి పూజించి నీళ్ళల్లో వదిలిపెట్టి అందరినీ చల్లగా కాపాడమని నదీమతల్లికి నమస్కరించి ప్రసాదం తీసుకుని  గట్టెక్కి మెట్టెక్కి అంటూ గట్టు మీదున్న గడ్డి పీకి కొద్ధిగా గోవులకు మేత వేసి  పెద్దవాళ్ళు చెప్పిన మంత్రం చెప్పి దారిలో కనిపించిన రేగుపండ్లు కోసుకుంటూ మధ్యలో శివాలయానికి  వెళ్ళి ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత క్రొత్త దుస్తులు ధరించి ఇరుగుపొరుగు పెద్దవాళ్ళతో కలిసి అందరూ ప్రక్క ఊరిలో రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళకు ఎడ్ల బండ్లు ఎక్కి వెళ్ళి ప్రోద్దుపోయేదాకా సరదాగా అటుఇటు తిరిగి రకరకాల ఆట వస్తువులు కొనుక్కోవడం,హరికథలు,బుర్రకథలు,పిట్టకథలు  వింటూ ఏ తెల్లవారుఝాముకో ఇంటికి రావడం ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవో కదా!అని మురిసిపోతూ ఒకరికి ఒకరు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అలాగే నేను కూడా నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ మున్ముందు అందరూ సంతోషంగా,సుఖంగా,ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యఅష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment