Tuesday, 26 April 2022

ఆపత్కాలంలో ........

                                                              ఎవరికైనా అవసరమైనప్పుడు ధన రూపేణా సహాయం చేస్తేనే  సహాయం చేసినట్లు కాదు.ఆపత్కాలంలో మంచి మనసుతో నాలుగు మంచి మాటలు చెప్పి ఎదుటి వారి మనసులో ఉన్న బాధను తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.ఒక్కొక్క సారి ఈ విధంగా చెప్పే వారు కూడా లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది వారితోపాటు కుటుంబాలని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు.కనుక ఆపత్కాలంలో ఏ చిన్న మాట సాయం చేసినా అది వారికి  ఎంతో ఉపయోగపడుతుంది.

Thursday, 21 April 2022

గులాబీ పొడి

                                                                   నాటు గులాబీ పువ్వులు రేకలు తీసి శుభ్రంగా కడిగి నీడలో ఒక పలుచటి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి.రెండు రోజులకు అవి బాగా ఎండిపోతాయి.ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి జల్లించి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఈ పొడితో మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.గులాబీ పొడిని సర్వ రోగ నివారిణిగా చెప్పవచ్చు. 

                                                                ఒక కప్పు మరిగించిన నీళ్ళల్లో ఒక 1/4 చెంచా గులాబీ రేకుల పొడి వేసి ఒక ని.ఆగి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపితే గులాబీ టీ తయారయినట్లే.దీన్ని రోజుకి ఒకసారి తీసుకుంటే ముఖ వర్చస్సు పెరగడమే కాక శరీరాన్ని కూడా శుద్ది చేస్తుంది.

                                                             కొద్దిగా చల్లారిన పాలల్లో సరిపడా గులాబీ పొడి కలిపి పెదవులపై రాస్తే పెదవులు పొడిబారటం తగ్గుతుంది.కొద్దిగా పాలు, మంచి గంధం పొడి,గులాబీ పొడి కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక 20 ని. తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మృదువుగా,మెత్తగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది.రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గులాబీ పొడి వేసుకుని  స్నానం  చేస్తే  చర్మం నిగనిగలాడడమే కాక చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా  ఉంటాయి.

                                                   

   



Monday, 18 April 2022

ఓ బుల్లి పరిష్కారం

                                                                 ఈ రోజుల్లో పెద్ద,చిన్న అనే తేడా లేకుండా తల వెంట్రుకలు ఎక్కువగా  రోజూ రాలిపోతున్నాయి.దీనికి సహజ సిద్ధమైన ఓ బుల్లి పరిష్కారమే ఉల్లినూనె.ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసి రసం తీసి ఒక కప్పు కొబ్బరి నూనె,గుప్పెడు కరివేపాకు,కొద్దిగా మెంతులు  వేసి కరివేపాకు నల్లబడే వరకు వేడిచేసి చల్లార్చి వడకట్టి ఒక సీసాలో పోసుకోవాలి.దీన్ని వారానికి రెండుసార్లు తలకు నూనె ఇంకేలా మర్దన చేయాలి.ఒక అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి.ఈ విధంగా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి తల వెంట్రుకలు ఊడడం ఆగిపోవడంతోపాటు చుండ్రు ఉంటే కూడా తగ్గిపోతుంది.దీనితో వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.  

Wednesday, 13 April 2022

కీరా పుదీనా అల్లం తో చల్లగా

 కీర దోస ముక్కలు  - గుప్పెడు 

పుదీనా ఆకులు - గుప్పెడు 

అల్లం  - చిన్న ముక్క 

నిమ్మరసం  - 2 పెద్ద చెంచాలు 

ఉప్పు - చిటికెడు 

 మిరియాల పొడి  - 1/4 చెంచా 

ఐస్ గడ్డలు  - 4 మన ఇష్టం 

చల్లటి నీళ్ళు  - 1 గ్లాసు  

                                                 ముందుగ కీర,అల్లం ముక్కలు మిక్సీ లో వేసి మెత్తగా అయిన తర్వాత పుదీనా ఆకులు వేసి మెత్తగా చేసి వడకట్టి నిమ్మరసం,ఉప్పు,మిరియాలపొడి వేసి చల్లటి నీళ్ళు (కుండ లేదా కూజా నీళ్ళు వంటే శ్రేష్టం) కలిపి  గ్లాసు అంచున  ఒక నిమ్మ కాయ ముక్క గుండ్రంగా కోసి పెట్టి గ్లాసులో రెండు పుదీనా ఆకులు వేస్తే చల్లటి  కీర పుదీనాతో చల్లగా రుచికరమైన పానీయం తయారైనట్లే.ఇది వేసవిలో పిల్లలకు,పెద్దలకు కూడా చలువ చేస్తుంది.పిల్లలు కీర,పుదీనా అంతగా ఇష్టపడరు కనుక కొద్దిగా తేనె కలిపి ఇలా తయారు చేసి ఇవ్వొచ్చు.దీనిలో ఒక చెంచా నానిన సబ్జా గింజలు కూడా కలుపుకోవచ్చు.ఒక గ్లాసు నీళ్ళకి ఒక గరిటె చొప్పున పెరుగు వేసి కవ్వంతో గిలకొట్టి మజ్జిగ చేసి పైవన్నీ కలిపి చల్లగా వేసవిలో త్రాగవచ్చు. 

Friday, 8 April 2022

సబ్జా గింజలు

                                                  సబ్జా గింజలు రుద్ర జడ అనే మొక్క నుండి తీస్తారు.ఈ మొక్కలు ఇంతకు ముందు రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఉండేవి.వీటి  కంకులు ఎండిన తర్వాత గింజలు సేకరించి నిల్వ చేసుకునేవారు.ఇవే సబ్జా గింజలు.వేసవి రాగానే ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం ఇంట్లో అందరికీ అమ్మ,అమ్మమ్మ,నానమ్మలు రోజుకొక రకంగా నిమ్మరసంలో కానీ,సేమ్యా ,సగ్గుబియ్యం పాయసంలో కానీ,ఏదేని పండ్ల రసంలో కానీ ,పాల ఐస్ తయారీలో కానీ నానిన   సబ్జా గింజలు ఒక చెంచా వేసి కలిపి ఇచ్చేవారు.ఇప్పుడు ఇంకా చాలా రకాల వాటిల్లో ఉపయోగిస్తున్నారు.ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాక వేసవిలో దేనిలో కలిపి తీసుకున్నా కూడా రుచితోపాటు చలువ చేస్తుంది.కొద్దిగా ఉప్పు,పటిక బెల్లం పొడి,ఒక చెంచా నానబెట్టిన సబ్జా గింజలు ఒక గ్లాసు చల్లటి నీటిలో కలిపి తీసుకున్నా రుచికరంగా ఉంటుంది.ఇది పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైన పానీయం.వేసవిలో తాటి ముంజెలు,మామిడి కాయలు,సీమ తుమ్మకాయల కోసం పిల్లలు,పెద్దలు  ఎదురు చూచినట్లే చాలామంది ఈ పానీయం కోసం ఎదురు చూస్తుంటారు.

సహజంగా బరువు తగ్గటానికి చిట్కా

                                                       ఒక చెంచా తాజా ధనియాలు ఒక కప్పు నీటిలో వేసి ముప్పావు కప్పు  అయ్యేవరకు మరిగించి వాటంతట అవే చల్లబడే వరకు ఉంచి వడకట్టి  పటిక బెల్లం పొడి సరిపడా కలుపుకుని రోజు ఒకసారి త్రాగాలి.ఇలా ఒక నెల రోజులు చేస్తే సహజంగా బరువు తగ్గుతారు.దీని కోసం ధనియాలు పొడి కానీ నిల్వ ఉన్న ధనియాలు కానీ వాడకూడదు.ధనియాలు పొడి చేసి నిల్వ పెట్టుకుంటే దానిలో ఉన్న సహజ గుణాలు కోల్పోతాయి కనుక తాజా ధనియాలతో మాత్రమే తాయారు చేసుకోవాలి.

Friday, 1 April 2022

శుభకృత్ శుభాకాంక్షలు

                               శుభకృత్ నామ సంవత్సరంలో అందరూ సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సకల సిరిసంపదలతో భోగభాగ్యాలతో,పిల్లాపాపలతో,పాడిపంటలతో సరదాసరాదాగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు.



  

కాలేయంలో అదనపు కొవ్వు

                                                                సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్న వారందరికి కాలేయంలో అదనపు కొవ్వు ఉంటుంది.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా,ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.దీనితో కాలేయంలో అదనపు కొవ్వు ఏర్పడుతుంది.ఆహారంలోని విషతుల్యాలను,హానికరమైన రసాయనాలను తొలగించడమే కాక శరీరంలోని కొవ్వులు,రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.జీర్ణ వ్యవస్థ సక్రమమగా పనిచేయలన్నా కాలేయమే కీలక పాత్ర వహిస్తుంది.ఒకప్పుడు కామెర్లు వస్తే కాలేయ సమస్యలు వచ్చేవి.ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సమస్యలు వస్తున్నాయి.  నిమ్మకాయలు కోసినప్పుడు నిమ్మరసం వాడుకుని గింజలు పడేస్తుంటాము.ఇక నుండి నిమ్మ గింజలను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది.చిటికెడు పొడిని తేనెతో కలిపి ఉదయం,సాయంత్రం తినడం వలన కాలేయంలో ఉన్నఅదనపు కొవ్వు కరగడంతోపాటు  కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందని దీనితో కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది.నిమ్మ గింజల పొడి తేనెతో తింటే సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయట.వీటితోపాటు దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు,నారింజ,అనాస వంటి పండ్లు,బొప్పాయి,అవకాడో,బ్రకోలి,టమోటాలు,కాప్సికంలో అన్ని  రకాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.మధుమేహం ఉన్నవారిలో కూడా కాలేయం లో అదనపు కొవ్వు చేరుతుంది.కనుక ఆహార నియమాలు పాటిస్తూ మంచి  నీళ్ళు ఎక్కువగా త్రాగటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.