Thursday, 28 July 2022

చేతనైనంత సహాయం

                                                              గురువారం అమావాస్య రావడంతో ఆషాడ అమావాస్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు వీలయినంతవరకు భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది.పారాయణ చేసుకోవడం కుదరకపోతే చరవాణి లో వింటూ ఎవరి పని వారు చేసుకోవచ్చు.ఈ రోజు దైవ సంబంధమైన శ్లోకాలు విన్నా చదివినా మామూలు రోజుల్లో కన్నా ఎన్నో రెట్లు ఫలితం ఉంటుందని పెద్దలు,పండితుల ఉవాచ.అమ్మవాస్య రోజు పెద్దలను తలుచుకుని ఒక కిలో బియ్యం,అర కిలో చొప్పున రెండు రకాల కూరగాయలు గుడిలో పూజారి గారికి ఇవ్వడం మంచిది.పూజారి గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా భోజనానికి  ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు ఇవ్వగలిగినంత మందికి ఇవ్వవచ్చు.ఈవిధంగా చేసినట్లు అయితే పితృదేవతలు సంతోషపడి మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఉంటారట.అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో రోజులుగా వాయిదా పడిన పనులతో పాటు పిల్లల పెళ్ళిళ్ళు కూడా త్వరగా పూర్తి అవుతాయట.పెద్దలు అనుభవంతో చెప్పడంతో  చాల మందికి తెలిసిన విషయమే అయినా దీన్ని ఆచరించడం వలన మంచి జరుగడమే  కాకుండా కొంతమందికి చేతనైనంత సహాయపడిన వాళ్ళము అవుతాము కదా! మనం ఎదుటివారికి ఎంత సహాయపడితే మనకు అంతకన్నా ఎక్కువ మానసిక ప్రశాంతత లభిస్తుంది.నెలలో ఒకరోజు మనకు వచ్చే ఆదాయంలో కొంచెం ఖర్చుపెట్టి ఈ పద్దతిని ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆచరిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు. 

Saturday, 16 July 2022

పిత్తకాయలు

                                                      పూర్వం రోజుల్లో బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరికి ఒకరు ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఇంటి ఆవరణలో కానీ ,చేలల్లో కానీ కాసిన పండ్లు ,కూరగాయలు తీసుకుని వెళ్ళేవారు.సూర్య ప్రకాష్,శేఖర్ మనస్తత్వాలు వేరయినా ఇద్దరూ మంచి స్నేహితులు.స్నేహితుని ఊరిలో పెళ్ళికి వెళ్తూ శేఖర్ కి ఒక గంప నిండా తన ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కాయలు పక్వానికి వచ్చిన వాటిని కోసి వరిగడ్డిలో పెట్టి మగ్గిన పండ్లను ఎంతో కష్టపడి స్నేహితుని కోసం ప్రేమగా  తీసుకుని వచ్చాడు.మా దొడ్లో మామిడి కాయలు చాలా తియ్యగా ఉండి రుచి బాగుంటుంది అని చెప్పాడు.శేఖర్ ఎవరికీ ఏమీ ఇవ్వడు.ఇచ్చిన వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటాడు.మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు?మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు?అనే మనస్తత్వం.సూర్య ప్రకాష్ వెళ్ళగానే పెట్టె మూత తీసి చూచి కాయలు చిన్నగా ఉన్నాయని భార్యాభర్తలు ఇద్దరూ ఇవి పిత్తకాయలు హిహి హి అన్నారు.అక్కడ  ఉన్న వారికి విషయం అర్ధం కాలేదు.అదేమిటి?మామిడి కాయలు కాదా? అని అడిగారు.మామిడి కాయలే కానీ చిన్న కాయలు వాటిని అలాగే అంటాము అన్నారు.చిన్న కాయలో,పెద్ద కాయలో ఎంతో ప్రేమతో తెచ్చాడు.అందుకు మనం సంతోషపడాలి కానీ విమర్శించకూడదు.ప్రేమ విలువ,మనుషుల విలువ తెలియని వాళ్ళకు ఏదైనా ఇవ్వకపోవడమే మంచిది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పిత్తకాయలు శేఖర్ వాళ్ళు తినరంట.తినకపోతే ఎవరో ఒకరికి తినేవాళ్ళకు ఇవ్వవచ్చు.కానీ గంపను అలా వదిలేస్తే ఎలుక  ఒకటి వచ్చి గంప నుండి రోజుకొక మామిడి కాయ తిని వెళ్తుందట.ఈ విషయాన్ని  ఇద్దరూ  అందరికీ గొప్పగా డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నారు.అందులో స్నేహితుని ప్రేమ,ఆప్యాయత చూడగలిగితే ఆ పని చేసేవాళ్ళు కాదు.తెలిసో తెలియకో దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చెయ్యకండి.చిన్న,పెద్ద అని  కాకుండా ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ముఖ్యం.అది అర్ధం చేసుకుంటే అందరికీ సంతోషం.