Saturday, 30 May 2015

గోకమోలె

                                                           అవకాడో తింటే చాలా రకాల ఉపయోగాలున్నాయని విన్నాను.కానీ దాన్ని ఎలా తినాలో,అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు.ఒకరిద్దరిని అడిగినా సరైన సమాధానం లభించలేదు.తర్వాత విదేశాలలో విరివిగా దొరుకుతాయని చెప్పారు.ఇటీవల విదేశాలకు వెళ్ళినప్పుడు మేనమామ కూతురు అవకాడో డిప్ పెట్టింది.చాలా బాగుంది.ఇది ఎలాచేశావు?పేరుఎమిటి?అని అడిగితే అన్నీ వివరంగా చెప్పింది.హమ్మయ్య!ఇన్ని రోజులకు తగిన సమాచారం లభించిందని ఆనందపడ్డాను.మన దేశంలో కూడా రేటు ఎక్కువయినా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి కనుక ప్రయత్నించవచ్చని తయారీ విధానం రాయాలనిపించింది.
                  అవకాడోలు (కొంచెం మెత్తనివి)  - 3
                  నిమ్మకాయ - 1 చిన్నది (లైమ్ దొరికితే -1 పెద్దది)
                  ఎర్ర ఉల్లిపాయ - 1/4 కప్పు తరిగినది
                  మిరియాలపొడి - 1/4 స్పూను
                   కారం - 3/4 స్పూను (నలిగీ నలగని ఎండు మిర్చి పొడి )
                   ఉప్పు - 1/2 స్పూను
                   టొమాటో - 1 సన్నగా తరిగినది
                                                  అవకాడో మధ్యకు కోసి దానిలోని గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసి,మిగతా వన్నీ కూడావేసి అన్నీ బాగా కలపాలి.విదేశాలలో అయితే దీన్ని తినటానికి చిన్న గిన్నె ఆకారంలో ఉన్నవి దొరుకుతాయి.మనకు అవి దొరకవు కనుక ఒక బౌల్ లో వేసి ఉప్పు,కారం వెయ్యని చిప్స్ ఒక ప్లేటులో పెడితే దానితో అవకాడోతో చేసినది తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.దీన్నే అక్కడ గోకమోలె అంటారు. 

Thursday, 28 May 2015

ఎర్రబస్సు

                                           తేజస్విని మేనత్త కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేశారు.ఇద్దరికీ విదేశాలలో ఉద్యోగాలు.తేజస్విని మేనత్తను కొన్ని రోజులు తన దగ్గర ఉంటుందనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చింది.అత్తా!మొదటిసారి విమానం ఎక్కావు కదా!నీకు ఎలా అనిపించింది అని అడిగింది.అచ్చం ఎర్రబస్సులో వచ్చినట్లుంది అంది.అదేమిటి అలా అనేశావు?అంటే అవును ఒక విమానం అచ్చు అలాగే అనిపించింది.ఆసీట్లు,కూర్చునేవిధానం ఇరుకుగా ఉంది.అందుకే ఎర్రబస్సులాగే ఉందన్నాను అంది.హతవిధీ!ఇంతా ఖర్చు పెట్టి తీసుకొస్తే తన అభిప్రాయాన్ని ఎంత విశదంగా వ్యక్తపరిచింది అని తల పట్టుకుంది తేజస్విని.    

మామిడికాయ రసం ఎప్పుడంటే అప్పుడు.............

                                              మామిడికాయల కాలంలో రసం తీసి వెంటనే జిప్ లాక్ కవర్లలో పోసి ఫ్రీజర్ లో ఉంచి అవసరమైనప్పుడల్లా తీసి కావలసినంత ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చు.ఇలా చేస్తే రసం తాజాగా,రుచిగా ఉంటుంది.అయ్యో!మామిడికాయలు తినలేక పోయానే,రసం తాగలేక పోయానే అని బాధ పడాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది.

మంచి పనివాడు

                                              కావ్యశ్రీ అక్క ఇంటికి అత్తగారు,బంధువులు వచ్చారు.వారందరినీ కావ్యశ్రీ విందుకు ఆహ్వానించింది.కావ్యశ్రీ కాయగూరలతోపాటు మాంసాహారం కూడా చాల రకాలు తయారుచేసింది.భోజనాలయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు.మాటల మధ్యలో వంటలు చాలా బాగున్నాయి ఒక్కదానివే శ్రమపడి చాలారకాలు చేశావు అన్నారు అక్క అత్తగారు.కావ్యశ్రీ కి మంచిపనివాడు ఉన్నాడు లెండి ఇబ్బందేమీ లేదు అన్నాడు ఆమె భర్త. ఇవ్వాళ ఏమిటి ?నాకు పాతిక సంవత్సరాల క్రితమే దొరికాడు అని మురిపెంగా అంది కావ్యశ్రీ.ఇంతకీ ఆ మంచి పనివాడు ఆమె భర్తే.భార్య ఒక్కటే కష్టపడటం ఎందుకని ప్రతి పనిలో ఆమెకు సహాయపడి ప్రేమను వ్యక్తపరచడం అతనికి సరదా.   

Wednesday, 27 May 2015

దుస్తులపై మరకలు పడితే.........

                           పెళ్ళిళ్ళకు,ఇతరత్రా ఫంక్షన్లకు తయారయ్యేటప్పుడు హడావిడిలో దుస్తులపై మేకప్ కు సంబంధించిన వాటి తాలూకు మరకలు ఎంత జాగ్రత్తగా ఉన్నాఎక్కడో ఒకచోట పడుతుంటాయి.వాటిని తొలగించాలంటే గోళ్ళరంగు తొలగించటానికి ఉపయోగించే ద్రావణంలో దూది ముంచి వెంటనే తుడిచేస్తే తేలికగా మరకలు పోతాయి.

టురకలు

                                                అసలే వేసవి కాలం.దానికి తోడు కరెంటు కష్టాలు.బయట గాలి లేక చెట్లఆకులు 
కదలడంలేదు.చెట్లు నీడనివ్వటమే కాక ప్రాణవాయువుతో పాటు చల్లటి గాలిని ఇస్తాయని నాటితే కరెంటు తీగలకు,
టెలిఫోను తీగలకు అడ్డు వచ్చాయని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు నరికివేస్తుంటే గాలి ఏమి వస్తుంది?అయినా ఆఖరిసారి ప్రయత్నిద్దామని జయంతి ఇంటిలోపల గాలి లేకపోవడంతో పాటు వేడిగా ఉండటంతో ఆరుబయట మంచం వేసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించింది..తెల్లవారుఝామున ఎప్పుడో జయంతికి నిద్రపట్టి బారెడు పొద్ధుఎక్కితే కానీ మెలుకువ రాలేదు.ఇంతలో స్నేహితురాలు వచ్చి ఏంటి ఇంత పొద్దెక్కేవరకు పడుకున్నావు?అంది.రాత్రంతా కరెంటు లేక ఆరుబయట మంచాలు వేసుకుంటే ప్రక్కనే ఉన్నబామ్మగారి టురకలతో నిద్ర పట్టలేదు అంది.తురకలు అంటే ఏమిటి.?కొత్త భాష మాట్లాడుతున్నావు అనగానే పాత భాషే టురకలు అంటే గురకలు అని చెప్పింది.  

Tuesday, 26 May 2015

ఇడ్లీలు తెల్లగా,మెత్తగా రావాలంటే.......

                                    మినపగుళ్ళు కానీ,పప్పు కానీ నానబెట్టేటప్పుడు శుభ్రంగా 5,6 సార్లు కడగాలి.అందులోనే ఒక గుప్పెడు అటుకులు కూడా వేసి నానబెట్టాలి.రవ్వ కూడా పిండి రుబ్బేముందు శుభ్రంగా కడిగి 2 గం.లు నానబెట్టాలి.ఇలాచేస్తే ఇడ్లీలు తెల్లగా,మెత్తగా వస్తాయి. 

Monday, 25 May 2015

పప్పుకు అదనపు రుచి రావాలంటే......

                                   పప్పు ఎలా చేసినా,ఎవరు చేసినా రుచిగానే ఉంటుంది కానీ పప్పు చిక్కగా,ఎక్కువ రుచిగా
ఉండాలంటే ధనియాలు 3 టీ స్పూనులు,జీరా 1/2 స్పూను,మెంతులు 1/2 స్పూను కొంచెం నూనెలో వేయించి మెత్తగా పొడి చేసి 1 స్పూను నెయ్యి తో పాటు పప్పులో వెయ్యాలి.తర్వాత తాలింపు వేయాలి.ఈవిధంగా చేస్తే పప్పుకు అదనపు రుచి వస్తుంది.