భగవంతుడు మనకు నోరు ఇచ్చింది అతిగా తినడానికో,ఎదుటివారిని అతిగా విమర్శించడానికో కాదు.కఠినంగా,అతిగా మాట్లాడేవారంటే ఎవరికీ గౌరవం ఉండదు.సాధ్యమైనంతవరకూ మితంగా మాట్లాడుతూ హుందాగా ఉండటానికి ప్రయత్నించాలి.దీన్ని మించిన శక్తివంతమైన ఆయుధం మౌనం.మౌనాన్ని ధరించిన వ్యక్తిని ఎదుటివారి దుర్భాషలైనా,ఎంతటి బలవంతుడైనా ఏమీ చేయలేడు.కొంతమంది ఎదుటివాళ్ళకు ఏమీ తెలియదు మాకే అన్నీ తెలుసన్నట్లు ఎదుటివారిని ఈసడించి మాట్లాడతారు.వ్యర్ధమైన మాటలతో జీవితాన్ని వృధా చేసుకోకుండా ఎవరి విధులు వారు నిర్వర్తించుతూనే పవిత్రమైన ధ్యానంతో,భగవంతుని నోరారా కీర్తించుతూ,సాటి మనిషి పట్ల గౌరవభావంతో ఉండాలి.
Monday, 30 November 2015
రసం ఘుమఘుమలాడాలంటే.......
రసం ఘుమఘుమలాడాలంటే తాలింపు మొత్తం నెయ్యితోనో,నూనెతోనో వేసేకన్నానెయ్యి కొద్దిగా,నూనె కొద్దిగా వేసి తాలింపు దినుసులు,కరివేపాకుతోపాటు వెల్లుల్లి,చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించాలి.కొంచెం అల్లం,వెల్లుల్లి,రెండు పచ్చిమిర్చి దంచి వేస్తే మంచి రుచి వస్తుంది.రసం ఎక్కువ సమయం మరిగిస్తే పుల్లగా చిక్కగా తయారయి రుచి మారిపోతుంది.అందువల్ల ఎక్కువసేపు మరిగించకూడదు.చివరగా రసంలో కొంచెం కొబ్బరి వేస్తే రసానికి అదనపు రుచి వస్తుంది.
Sunday, 29 November 2015
రోజుకు రెండు చక్రాలు
అనాసపండు కొయ్యటం కష్టమని మనలో చాలామంది దాని జోలికి వెళ్ళం.కానీ దాన్ని తేలికగా కొయ్యటానికి ఇప్పుడు మార్కెట్ లో చాలా సాధనాలు వచ్చాయి.చక్కగా పక్వానికి వచ్చిన పండుని పై చెక్కు తీసి చక్రాలుగా కోసి రోజూ రెండు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఇది ఎన్నోరకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.రక్తంలో గ్లూకోజు శాతాన్ని నియంత్రిస్తుంది.వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల్ని నివారిస్తుంది.కొద్దిగా పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పండుని ఇంట్లో అందరూ రోజూ రెండు చక్రాలు తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇదే గద్దరిది
శ్రీహరిరావు కుటిల మనస్తత్వం కలవాడు.ఎదుటివాళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని చూచి ఓర్చుకోలేని మనస్తత్వం.అప్పటికప్పుడు కళ్ళల్లో జిల్లెడుపాలు పోసుకున్నట్లు పిచ్చి గంగిర్లెత్తి పోతాడు.పిల్లలను సరైన పెంపకం పెంచకుండా అత్తవారిళ్ళకు తోలి అత్తారింట్లో వాళ్ళమీద ఏడుస్తుంటాడు.ఒకసారి కూతురి ఆడపడుచు పిల్లలు విదేశాలనుండి వచ్చిన సందర్భంగా బంధుమిత్రులతో హార్ధిక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.ఆ సందర్భంగా వచ్చి మెదలకుండా కాసేపు కూర్చుని భోజనం చేసి వెళ్ళక విదేశాలనుండి వచ్చినవాళ్ళను చూచి యధావిధిగా తన బుద్ధి బయటపెట్టి కూతురితో ఆమె ఆడపడుచు కూతురి గురించి "ఇదే గద్దరిది" ఆయన మంచివాడే అన్నాడు.ఇంతలో ఈవిషయాన్ని ఆడపడుచు కూతురు విని ఏమిటి?అని గట్టిగా అడిగే సరికి ఏమీ లేదు.నాన్న ఈ అమ్మాయే గద్దరిది,ఆయన మంచివాడని అంటున్నాడు అని కప్పిపెట్టటానికి ప్రయత్నం చేసింది.ఇంటికి వెళ్ళాక ఏదైనా మాట్లాడుకున్నాఅదొక రకం.అప్పటికప్పుడు వాళ్ళు వినేటట్లుగా అనటం అంత అవసరమా?ఏదైనా ఆయన్ని అంటే అన్నాడని సరిపెట్టుకోవచ్చు.ఉట్టి పుణ్యానికి ఎదుటివాళ్ళను మాటలతో బాధపెట్టటం సమంజసమా?ఏంటో? కట్టెతో గానీ ఈ బుద్దులుపోవు అనుకుంది.
రోషం లేనిదాన్ని కనుక .......
సీతమ్మ కొడుక్కి లేకలేక చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు.అందరి అతి గారాబంతో వాళ్ళు పెరిగే కొద్దీ మహా మొండిగా తయారయ్యారు.పెద్దాచిన్న లేకుండా ఏదిపడితే అది మాట్లాడటం అలవాటయింది.ఒకరోజు ఉదయం పిల్లలిద్దరినీ నిద్ర లేపుతుంటే లేవకుండా బండదానా!పొద్దున్నేలేపుతావెందుకు?నోరుముయ్యి అంటూ అరవటం మొదలెట్టారు.ఆవిధంగా పిల్లలతో అనిపించుకోవటం సీతమ్మకు నచ్చదు.కోపాన్ని తమాయించుకుని నోరుముయ్యి అంటూ మాట్లాడుతున్నారు. ప్రేమను చంపుకోలేక రోషం లేనిదాన్ని కనుక మీ ఇంటికి వస్తున్నాను అదే మీ అమ్మమ్మ అయితే ఇంట్లో అడుగు పెట్టేది కూడా కాదు అని గుణుసుకుంది.సీతమ్మ కొడుకు ఏటా అయ్యప్ప మాల వేసుకుంటాడు.పిల్లలకు కూడా మాల వేయించితేనన్నా క్రమశిక్షణ అలవాటవుతుందని అనుకుని వేయించారు.పూజ పెట్టుకుంటేనన్నా మార్పు వస్తుందని అనుకుంటే అది కూడా లేదు అంటూ మాల వేసుకున్నవాళ్ళను ఏమీ అనకూడదు కనుక తన బాధను వెళ్ళగక్కింది.
Friday, 27 November 2015
చలికాలంలో ఆహారం
చలికాలంలో ఆహరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.ఈకాలంలో జలుబు,దగ్గుతోపాటు అనేకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.వంటల్లో మిరియాలు,పసుపు,లవంగాలు,యాలకులు వంటివి వాడటంవల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.వేడివేడి ఆహారం తినాలి. సూపులు తయారుచేసేటప్పుడు కొద్దిగా మిరియాలపొడి వేసుకుని వేడిగా తాగితే గొంతు నొప్పి,గరగర లేకుండా బాగుంటుంది.పచ్చికూరగాయ ముక్కలు తినేకన్నా ఉడికించినవి తినడం మేలు.ఆలివ్ నూనె వాడటం వల్ల శరీరంలో కొవ్వు దరి చేరకుండా ఉంటుంది.
పెదవులు మృదువుగా
చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి పెదవులు పగిలి గరుకుగా
తయారవుతాయి.ఈ సమస్య నుండి తేలికగా బయటపడాలంటే కొన్ని చుక్కలు తేనె,పంచదార తీసుకుని పెదాలకు రాసి ఒక ఐదు ని.లు తర్వాత కడగాలి.రోజుకు రెండుసార్లు ఈవిధంగా చేస్తే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.
జీవితంలో సగం సమయం
లాలస వయసు నిండా పదహారేళ్ళు కూడా ఉండవు.ఎప్పుడు చూసినా అందంగా తయారవటానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది.పక్కింటికి వెళ్ళాలన్నా,స్కూలుకు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా మేకప్ వేసుకుంటే గానీ కదలదు.చదువు కన్నా ముందు ముఖారవిందానికి మెరుగులు దిద్దుకోవటమే ముఖ్యం అంటుంది.ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆరంగు కనురెప్పలపై,బుగ్గలపై వేసుకుంటుంది.చెప్పులుతో సహా అన్నీ ఒకే రంగులో ఉండాలంటుంది.ఒక రోజు అద్దం ముందు కూర్చుని బుగ్గలకు రంగు వేసుకుంటూ నానమ్మతో ఏంటో?నానమ్మా!నా జీవితంలో సగం సమయం అందంగా తయరవటానికే సరిపోతుంది అంది.అప్పుడు నానమ్మ ఇప్పుడు అది అంత అవసరమా తల్లీ?ఈవయసులో చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంత కన్నా ఎక్కువగా భవిష్యత్తులో సుఖపడవచ్చు.అందంగా తయారవటానికి తర్వాత చాలా సమయం ఉంటుంది.కనుక ముందు బాగా చదువుకో అంది నానమ్మ.బుద్ధిగా సరేనంది కానీ అద్దం ముందు నుండి మాత్రం కదలలేదు.
Thursday, 26 November 2015
మంచి ఆలోచన
దమయంతికి మొక్కలంటే చాలా ఇష్టం.కార్తీక మాసం సందర్భంగా దమయంతి కుటుంబం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు.ఆ సందర్భంగా ఏదోఒక బహుమతి లేక రవికెల ముక్కలు ఇచ్చే బదులు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొక్క ఇద్దామని నిర్ణయించుకున్నారు.ఆ విషయం దమయంతి మరదలు వాళ్ళ నాన్న దగ్గర చెప్పింది.వాళ్ళ నాన్నమొక్కలు ఇవ్వటమనేది మంచి ఆలోచన.నా దగ్గర కూడా కొన్ని రామాఫలం మొక్కలు ఉన్నాయి.మీరు ఇచ్చే మొక్కలతోపాటు అవి కూడా ఇవ్వమని పంపించారు.దమయంతి రంగురంగుల గులాబీ,చామంతి,మందార,కనకాంబరం మొక్కలు నర్సరీ నుండి తెప్పించింది.దమయంతి వాళ్ళు పూజాకార్యక్రమంలో ఉండగానే మొక్కలు కిందకు దించుతూ ఉన్నప్పుడే ఎవరికి దొరికినవి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అన్ని రకాల మొక్కలు మనిషికి 5-10 మొక్కలు చొప్పున కారులో సర్దుకున్నారు.చివరి వాళ్ళకు లేకుండా అయిపోయాయి.ఈ విషయం దమయంతికి తెలిసి మొదట కొంచెం బాధపడినా మళ్ళీ మొక్కలు తెప్పించే సమయం లేకపోవడం వలన ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొక్క ఇచ్చినా మొక్కలంటే ఆసక్తి లేనివాళ్ళు సరిగా వాటి ఆలనాపాలనా చూడకపోతే మొక్క ఎండిపోయే బదులు ఇష్టమైన వాళ్ళు సక్రమంగా పెంచుతారులే అని సరిపెట్టుకుంది.కానీ మనలాంటి వాళ్ళే అందరూ అందరికీ ఒక్కొక్కటి ఇవ్వాలన్న వాళ్ళ ఆలోచనకు భంగం కలిగించి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచన ఎప్పటికి కలుగుతుందో?అనుకుంది దమయంతి.ఇంతకీ రామాఫలం మొక్కలు మాత్రం మిగిలిపోయాయి.
Wednesday, 25 November 2015
వనభోజనాల సందడి
కార్తీకమాసం వచ్చిందంటే వనభోజనాల సందడే సందడి.ఈమాసంలో ఎంతో పవిత్రమన ఉసిరి చెట్టు కింద ఒక్క పూటయినా భోజనం చేయాలన్నది మన సంప్రదాయం.కార్తీక మాసంలో విష్ణుమూర్తి,లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని పురాణం కధనం.అందుకే ఎవరికి వారు తోటలో ఉసిరి చెట్లు నాటి ఆచెట్ల కింద విందు భోజనాలు ఏర్పాటు చేయటం అనాదిగా వస్తున్నఆచారం.ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో కనీసం ఐదు ఉసిరి మొక్కలు నాటాలని పెద్దలు చెబుతుంటారు.సంవత్సరానికి ఒకసారి బంధుమిత్రులతో ఉదయం తోటకు వెళ్ళి సాయంత్రం వరకు పిల్లలు,పెద్దలు సరదాగా ఆటపాటలతో,కబుర్లతో ఆనందంగా గడపటం ఒక గొప్ప అనుభూతి.
సర్వదోషహర
కార్తీక మాసం నుండి వచ్చే ఉసిరి కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరం,ఔషధ గని ఉసిరి.శీతాకాలం నుండి వేసవి వరకు వచ్చే కాయల్ని ఎండ బెట్టి పొడిచేసినా,పచ్చడి రూపంలో కానీ,మురబ్బాకానీ ,చిన్నముక్కలు చేసి ఎండ బెట్టి సంవత్సరమంతా నిల్వ చేసుకుని ఏ విధంగా వాడుకున్నాఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే ఉసిరిని "సర్వదోషహర" అంటారు.శరీరంలోని విష తుల్యాలను తొలగించి అన్ని అవయవాలు సమన్వయంతో పని చేసేలా చేస్తాయి.ఉసిరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ కనుక గుండె జబ్బులు,కాన్సర్,మధుమేహం,జీర్ణ సంబంధ సమస్యలు వంటివి సైతం దరిచేరవు.తాజా ఉసిరి గుజ్జును కుదుళ్ళకు పట్టించడం వల్ల జుట్టు బాగా పెరిగటమే కాక నల్లగా కూడా ఉంటుంది.అందుకే ఉసిరిని ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే.ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా కాపాడుతుంది.
అచ్చం అక్కడి అమ్మాయే
ప్రదీప్తి కూతురు,అల్లుడు విదేశాలనుండి ఐదు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చారు.ఆ సందర్భంగా ప్రదీప్తి కుటుంబం బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు.విందుకు వచ్చిన ఒక పెద్దావిడ వెళ్తూ వెళ్తూ ప్రదీప్తి దగ్గరకు వచ్చి నీ కూతురు అచ్చం అక్కడి అమ్మాయే అనిపిస్తుంది.మనిషే కాదు జుట్టు కూడా మారిపోయింది అంది.మనిషీ మారలేదు జుట్టు కూడా మారలేదు.ఇప్పుడు పిల్లలు సరదాగా జుట్టుకు రంగులు వేయించుకుంటున్నారు కదా!అందులో అమ్మాయి బంగారు వర్ణం అక్కడక్కడా వేయించుకుంది.అందుకని నీకు అలా అనిపించింది అంతే.అంతకు మించి మార్పు ఏమీ లేదు అంది ప్రదీప్తి.
Monday, 23 November 2015
పులిహోర రుచిగా........
బియ్యం - 2 కప్పులు
నిమ్మకాయ - 1
పెద్ద ఉసిరికాయలు - 2
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి - 5
కారట్ తురుము - గుప్పెడు
నిమ్మకాయ - 1
పెద్ద ఉసిరికాయలు - 2
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి - 5
కారట్ తురుము - గుప్పెడు
బియ్యం శుభ్రంగా కడిగి మరీ బిరుసుగా,మెత్తగా కాకుండా మధ్యస్థంగా అన్నం వండాలి.తర్వాత వెడల్పాటి ప్లేటులో ఆరబెట్టాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనెవేసి కాగిన తర్వాత 2 లేక 3 ఎండుమిర్చి వేసి వేగాక దినుసులు వేసి వేగనివ్వాలి.కరివేపాకు వేసి వేగాక పసుపు,నిలువుగా కోసిన పచ్చిమిర్చి ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి.దీన్ని ఆరబెట్టిన అన్నంపై వేసి,సన్నగా తరిగిన కొత్తిమీర,కారట్ తురుము నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఇష్టమైతే వేరుశనగ గుళ్ళు,జీడిపప్పు వేసి వేయించి కలపాలి.ఉసిరికాయ తురుము వేయడంవల్ల పులిహోరకు అదనపు రుచి వస్తుంది.
నాజూగ్గా తయారవ్వాలంటే........
రోజూ ఒక తమలపాకు ఈనెలు తీసేసి దానిపై చిటికెడు మిరియాల పొడి వేసుకుని తిని వెంటనే చల్లటి మంచినీళ్ళు తాగితే నాజూగ్గా తయారవుతారు.ఈవిధంగా రెండు నెలల పాటు చేయాలి.
Tuesday, 10 November 2015
Monday, 9 November 2015
పచ్చటి మొక్కల మధ్య......
ఉదయం సూర్య కిరణాలు రాగానే లేలేత ఎండలో పచ్చటి మొక్కల మధ్య వారానికి ఒకసారైనా స్వచ్చమైన గాలి పీల్చుతూ నడవడం వల్ల వారమంతా ఉత్సాహంగా ఉండటమే కాక ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు.ఉరుకుల పరుగుల జీవితంలో పనిగట్టుకుని వెళ్ళాలంటే కష్టం అనుకునేవాళ్లు ఉన్నంతలో కిటికీల్లో,బాల్కనీల్లో చిన్నచిన్న కుండీలు పెట్టుకోవచ్చు.ఉదయం లేవగానే పచ్చటి మొక్కలు చూడటం వల్ల మనసుపై సానుకూల ప్రభావం పడుతుంది.మొక్కల మధ్య ఎక్కువ సమయం గడపటం వల్ల ఒత్తిడి దరిచేరదు.
Sunday, 8 November 2015
పచ్చి బఠాణీ - మెంతి కూర
మెంతి కూర తరిగినది - 2 కప్పులు
జీరా - 1 స్పూను
ఉల్లిపాయ -1
టొమాటోలు - 2
పచ్చి బఠాణీ - 1 కప్పు
గరం మసాలా - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత
కారం - తగినంత
క్రీం - 2 స్పూనులు (ఇష్టమైతే)
నూనె - 1/4 కప్పు
గ్రేవీ కోసం:పచ్చిమిర్చి - 5,జీడిపప్పు - 10,గసాలు - 2 స్పూనులు,అల్లం వెల్లుల్లు పేస్ట్- టేబుల్ స్పూను
జీరా - 1 స్పూను
ఉల్లిపాయ -1
టొమాటోలు - 2
పచ్చి బఠాణీ - 1 కప్పు
గరం మసాలా - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత
కారం - తగినంత
క్రీం - 2 స్పూనులు (ఇష్టమైతే)
నూనె - 1/4 కప్పు
గ్రేవీ కోసం:పచ్చిమిర్చి - 5,జీడిపప్పు - 10,గసాలు - 2 స్పూనులు,అల్లం వెల్లుల్లు పేస్ట్- టేబుల్ స్పూను
గ్రేవీ కోసం తీసున్నవాటిని మెత్తని పేస్ట్ చేయాలి.బాండీలో నూనె వేసి కాగాక అందులో జీరా,ఉల్లిపాయ ముక్కలు,వేసి వేయించి 2 ని.ల తర్వాత టొమాటో గుజ్జు వేసి సిమ్ లో పెట్టి వేగాక,గసాల పేస్ట్,గరం మసాలా,కారం,తగినంత ఉప్పు వేయాలి.2 ని.ల తర్వాత మెంతికూర,బఠాణీలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టాలి.బఠాణీలు ఉడికిన తర్వాత క్రీమ్ వేసి దించేయాలి.
చురుగ్గా ఆహ్లాదంగా....
రోజూ ఒక పావుగంట తప్పనిసరిగా వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితికి సంబంధించిన హార్మోన్లు పనితీరు మెరుగుపడుతుంది.దాంతో మెదడుపై సానుకూల ప్రభావం అధికంగా ఉంటుంది.దీనివల్ల మనసు చురుగ్గా,ఆహ్లాదంగా ఉంటుంది.మనం సహజంగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని కానీ,నాజుగ్గా తయారవుతామని కానీ అనుకుంటాము.కానీ చలాకీగా,ప్రశాంతంగా ఒత్తిడి అనేది దరిచేరకుండా ఉండాలంటే శరీరం మొత్తం కదిలేలా వ్యాయామం చేయడం వల్ల అది సాధ్యమవుతుందని అనుభవజ్ఞుల సలహా,సూచన.
Saturday, 7 November 2015
కూరగాయలు కొద్దికొద్దిగా ఉంటే......
కూరగాయలు కొద్దికొద్దిగా ఉంటే వాటిని వృధాగా పడేయకుండా అన్నీ కలిపి పులుసు,పచ్చడి,కూర చేయవచ్చు.రుచిగా ఉంటుంది.సలాడ్లు చేయవచ్చు.అన్నం వండేటప్పుడు అన్ని కూరగాయలు వేసి వండుకోవచ్చు.దీన్ని రసంతో కానీ,పులుతో కానీ,పెరుగుతో కానీ తినవచ్చు.ఆకుకూరలు ఉంటే కూడా అన్నీ కలిపి ఉల్లిపాయ,పచ్చి మిర్చి వేసి వండితే బాగుంటుంది.విభిన్న రుచిలో ఉండటమే కాక అన్నిరకాల పోషకాలు అందుతాయి.
ఆహారం వృధా కాకుండా ........
ఎవరికైనా భోజనం వడ్డించేటప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టి తినమని బలవంత పెట్టకూడదు.పాపం!ఎదుటివాళ్ళు మొహమాటానికో,పడేయకూడదనో తినలేక,పారేయలేక నానా ఇబ్బంది పడుతుంటారు."అన్నం పరబ్రహ్మ స్వరూపం"అని అన్నారు పెద్దలు.తక్కువ మొత్తంలో ముందు వడ్డించితే కావాలంటే మళ్ళీ వడ్డించవచ్చు.ముందుగానే ఎక్కువ పెట్టేస్తే తినలేక పారేసే అవకాశం ఉంది.అన్నం వృధాగా పడేయకూడదు.మనం ఏది పెడితే అదే తినాలి అనుకోకుండా పిల్లల విషయంలో కూడా వాళ్ళేమి తింటారో అడిగి అది చేసి పెడితే ఆహారాన్ని వృధా చేయరు.రోజూ కుటుంబసభ్యులు ఎంత తింటారో అంచనా వేసుకుని దానికి తగినట్లుగా వండితే ఆహారం వృధా కాకుండా ఉంటుంది.రోజు ఒకే పద్దతిలో వంట చేసేకన్నావివిధ రకాల పద్దతుల్లో చేస్తే అందరూ ఇష్టంగా వృధా చేయకుండా తింటారు.
Friday, 6 November 2015
అలసిన చర్మానికి........
నిద్ర సరిపోకపోయినా,పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ముఖంలో అలసటతో పాటు చర్మం నిర్జీవంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటుంది.అటువంటప్పుడు ఐస్ ముక్కలు పలుచటి వస్త్రంలో వేసి ముఖంపై,కళ్ళపై ఒక 5 ని.లు రుద్దాలి.తర్వాత అరటి పండు తొక్క లోపలి భాగంతో ముఖంపై మృదువుగా మర్దన చెయ్యాలి.ఒక 10 ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి.ఈ విధంగా చేస్తే ముఖంలో అలసట తగ్గి చర్మానికి కొత్త కళ వస్తుంది.
మోకాళ్ళు నొప్పులు,శబ్దాలు తగ్గాలంటే.............
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమందికి కాళ్ళ నొప్పులు,కీళ్ళ నొప్పులు,మోకాలి నొప్పులు వస్తున్నాయి.కింద కుర్చోవాలంటే కష్టం.కూర్చుంటే లేవడం కష్టం.పరిణయ కింద కూర్చుని లేవగలదు కానీ మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళ నుండి కిర్రు,కిర్రు అంటూ శబ్దాలు వస్తున్నాయి.పరిణయ భర్త వృత్తిరీత్యా ఇంజినీరు.వృత్తిలో భాగంగా పెద్దపెద్ద భవనాలు నిర్మించేటప్పుడు ఇరవై అంతస్తులు నిర్మాణదశలో ఉండగా పైకి క్రిందకు చాలాసార్లు ఎక్కి దిగటం వలన మోకాళ్ళు నొప్పి రావడం మొదలయింది.అందుకని పరిణయ,ఆమె భర్త ఇద్దరూ కలిసి వైద్యుని దగ్గరకు వెళ్ళారు.పరిణయకు మోకాలి చిప్పల దగ్గరుండే జిగురు పదార్ధం తగ్గుతుందని,భర్తకు మోకాళ్ళు లోపల ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వల్ల నొప్పి వస్తుందని రోజు క్రమం తప్పకుండా ఈ కింది విధంగా చేయమని చెప్పారు.అదెలాగంటే ....
1)కాళ్ళు ముందుకు చాపి కూర్చుని రెండు మోకాళ్ళ కింద చిన్నచిన్న దిండ్లు పెట్టుకోవాలి.చేతులు పక్కన పెట్టుకోవాలి.మోకాళ్లను నేలవైపు నొక్కుతూ కొద్దిగా ఒత్తిడి తెచ్చి కొన్ని సెకన్ల తరువాత కాళ్ళను వదులు చేయాలి.ఇలా10 - 20 సార్లు చేయాలి.శ్వాస మాములుగా తీసుకుని వెన్నెముక నిటారుగా ఉంచాలి.2)కాళ్ళు రెండు చాపి కూర్చుని కుడికాలు కొద్దిగా మడిచి మోకాలి కింద చిన్న దిండు పెట్టుకుని,రెండు చేతులతో పొట్టవైపుకు మోకాలిని దిండుతోసహా మడిచి దగ్గరకు తీసుకోవాలి.ఎక్కువ ఒత్తిడి పనికి రాదు.వెన్నెముక,ఎడమకాలు నిటారుగా ఉండాలి.ఇలా ఒక 10 సెకన్లు ఉంచాలి.5 - 10 సార్లు చేయాలి.ఎడమ కాలితో కూడా ఇదే విధంగా చేయాలి.ఇలా చేయడం వల్ల మోకాలి కండరాలు శక్తివంతంగా తయారయి నొప్పి,వాపు శబ్దాలు తగ్గిపోతాయి.కింద కూర్చుంటే తేలిగ్గా కూడా లేవగలుగుతారు.
Thursday, 5 November 2015
ప్లాస్టిక్ సీసాలు వాసన రాకుండా.........
కొద్దిరోజులు వాడకపోతే ప్లాస్టిక్ సీసాలనుండి అదొకరకమైన వాసన వస్తుంటుంది.అటువంటప్పుడు ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం పిండి కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.ఈనీళ్ళను సీసాల్లో నింపి కాసేపయ్యాక కడిగితే ప్లాస్టిక్ సీసాలనుండి వాసన రాకుండా శుభ్రంగా ఉంటాయి.
Wednesday, 4 November 2015
దోమలకు ఇష్టం
ఇంతకుముందు బాగా దోమలుంటే తప్పరమణి దగ్గరకు దోమలు వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు తెగ కుట్టేస్తున్నాయి.అదేంటి?ఇంతకు ముందు కుట్టేవి కాదుకదా!అనుకుంది రమణి.ఒకరోజు "ఓ"గ్రూపు రక్తం దోమలను బాగా ఆకర్షిస్తుందని పేపరులో చదివింది.రమణి ఇంట్లో అందరిదీ ఓ +.రమణిది మాత్రం ఓ - .అందుకని కుట్టేవి కాదు అనుకునేది.కానీ ఇప్పుడు రమణిని కూడా కుట్టటం వలన ఈమధ్య దోమలకు ఓ గ్రూపు అయితే చాలు ఇష్టం అని అర్ధం చేసుకుంది.
దిబ్బరొట్టె మీద దిబ్బరొట్టె
సత్తెమ్మ కూతురు చదువుకుని ప్రయోజకురాలై కొద్ది రోజులు విదేశాలలో ఉండి డబ్బులు సంపాదించుకుని తిరిగి స్వదేశానికి వచ్చి అమ్మానాన్నలను పెద్దవయసులో తనే దగ్గరుండి జాగ్రత్తగా చూచుకోవచ్చని వెళ్ళింది.ఏ వయసు ముచ్చట ఆ వయసుకని అమ్మానాన్నలు పెళ్ళి చేశారు.ఆమెకు కూతురు పుట్టింది.తను ఉద్యోగానికి వెళ్ళటం కోసం మనవరాలిని పెంచటానికి అమ్మానాన్నలను తన దగ్గరకు తీసుకెళ్ళింది.ఒక ఆరునెలల తర్వాత సత్తెమ్మ ఇంటికి తిరిగి వచ్చింది.సంబరంగా విదేశంలో ఉన్న కూతురి కబుర్లు అందరికీ చెబుతూ మధ్యలో అక్కడ దిబ్బరొట్టె మీద దిబ్బరొట్టె పెట్టి దాని మధ్యలో కూరగాయలు పెడతారని అది తిన్నానని చెప్పింది.మొదట వింటున్న వాళ్ళకు అర్ధం కాలేదు కానీ తర్వాత బర్గర్ అని అర్దమయింది.సత్తెమ్మ తనకు తెలిసిన భాషలో భలే వివరించిందని,ఆ చెప్పే విధానానికి వింటున్న అందరికీ నవ్వు వచ్చింది.
Tuesday, 3 November 2015
స్వతంత్రంగా.......
జీవితం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటే నిరాసక్తంగా అనిపిస్తుంటుంది.నిరాసక్తత ఎక్కువైతే ఆత్మన్యూనత ఏర్పడుతుంది.దీనిలో నుండి ఎంత త్వరగా బయటపడాలంటే అంత త్వరగా మార్పుకోసం ప్రయత్నించాలి.ముందుగా మన మనసుకు నచ్చిన పని చేస్తే ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేయాలి.ప్రతి పనినీ అందరికీ నచ్చేలా చేయడం చాలా కష్టం.ఇది ఎదుటివారికి కూడా వర్తిస్తుంది.ఈ చిన్న ప్రాధమిక సూత్రం గుర్తుంచుకుంటే దేన్నైనా స్వతంత్రంగా చేయగలుగుతారు.వ్యాపారమైనా,ఉద్యోగమైనా ఎవరి అబిరుచికి తగినట్లుగా వాళ్ళు చేస్తే ఉత్సాహంగా చేయగలిగి బాగా రాణిస్తారు.
ఆభరణాలు సరికొత్తగా.......
బంగారు,వెండి ఆభరణాలు కొన్నాళ్ళకు పాతవాటిలా కనిపిస్తుంటాయి.
అలాంటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం,నీళ్ళు సమపాళ్ళల్లో తీసుకుని దానిలో ఆభరణాలను ఒక అరగంటపాటు నానబెట్టి తర్వాత తీసి మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగి మెత్తటి వస్త్రంతో తుడిస్తే సరికొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి.
Monday, 2 November 2015
చక్కటి అనుబంధం
రాజారావు గారికి పుస్తకాలన్నా,పుస్తకాలను చదవటంఅన్నా ఎంతో ఇష్టం.ఎక్కడకు వెళ్ళినా నచ్చిన పుస్తకాలను ధర ఎంతైనా కొని ఇంట్లో భద్రపరచటం,తీరిక సమయంలో వాటిని చదవటం అలవాటు.తన మనవడు,మనవరాలు చదవటం కోసం ఒక చిన్న గ్రంధాలయాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు.వాళ్ళకు తాతయ్య దగ్గరకు రావటం,తాతయ్య చెప్పే కథలు వినడం,చదవటం ఎంతో ఇష్టం.అంతగా పిల్లలకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలకు నచ్చేచక్కని బొమ్మలు,కార్టూన్లు,పజిళ్ళు,పిల్లలను ఆకట్టుకునే రంగుల్లో ఉండే నీతి కథల పుస్తకాలను తెచ్చి తన గ్రంధాలయంలో పెడుతూ ఉంటారు.వీటిల్లో బొమ్మలు వేసేవి,బొమ్మలకు రంగులు దిద్దేవి,పజిళ్ళు పూర్తి చేసేవి,బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు ఎక్కువ ఉంటాయి.దానికి తోడు రాజారావుగారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లలు రాగానే అవన్నీ పక్కన పెట్టి రకరకాల హావభావాలతో కథలు చదివి విడమరచి చెప్తూ,వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుతూ వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపటంతో పిల్లలకు తాతయ్యతో అనుబంధంతోపాటు,పుస్తకాలతో కూడా చక్కటి అనుబంధం ఏర్పడింది. అందుకని పిల్లలకు స్వంతంగా కథలు చెప్పడం,చదవటం,చదివింది అర్ధం చేసుకోవటం చిన్నతనం నుండే అలవాటయింది.ఎవరికయినా చిన్నప్పటినుండి తరగతి పుస్తకాలే కాక,విడి పుస్తకాలు కూడా చదవటం అలవాటు చేస్తే వారికి విజ్ఞానంతోపాటు,సామజిక అవగాహన,కష్టనష్టాలు ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం,పరిణతి ఉంటుంది.రకరకాల పుస్తకాలు చదవటం వల్ల భాషపై పట్టు వస్తుంది.
అమ్ముకునేవాళ్ళ కన్నా.....
స్పందన కొడుకు శ్రీహర్ష ఉన్నత విద్యను అభ్యసిస్తూ హాస్టల్ లో ఉంటున్నాడు.సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చాడు.కొడుకు ఇబ్బంది పడకుండా అవసరమైన వస్తువులు సర్ది ఉంచితే అన్నీ ఉన్నాయి.ఏమీ వద్దంటూ తీసి పక్కన పెట్టాడు.స్పందన తీసుకెళ్ళు నాన్నా!అవసరమైతే ఉంటాయి కదా!అని ఒక్కొక్కటి మళ్ళీమళ్ళీ తీసి ఇస్తుంటే ఏంటమ్మా?సామాన్లు అమ్ముకునే వాళ్ళు కొనండి అంటూ వెంటబడి విసిగించినట్లుగా నువ్వు వస్తువులు తీసుకెళ్ళు నాన్నా!అంటూ అమ్ముకునే వాళ్ళ కన్నా కనాకష్టంగా హింస పెట్టేస్తున్నావు? దయచేసి నన్నువదిలేయ్ అమ్మా!అన్నాడు.ఇదేమిటి?ఎంతో ప్రేమతో ఇస్తుంటే హింస పెడుతున్నట్లుగా ఉంది కాబోలు.ఏమి పిల్లలో ఏమిటో?అనుకుంది స్పందన.
సన్నటి మేకప్ బ్రష్ తో.........
కంప్యూటర్ కీబోర్డ్ పై దుమ్ము,ధూళి పేరుకుపోయినప్పుడు సన్నటి,మెత్తటి మేకప్ బ్రష్ తో దులిపితే తేలికగా శుభ్రపడుతుంది.
Sunday, 1 November 2015
సోయా గ్రాన్యూల్స్ వడ
సోయా ఆకు,పాలు,సోయా గ్రాన్యూల్స్ ఏరూపంలో తీసుకున్నాఆరోగ్యానికి చాలా మంచిది.ఎప్పుడూ ఒకే రకంగా గ్రాన్యూల్స్ టొమాటోతో కలిపి కూర మాత్రమే వండుకునే కన్నావడల్లా వేస్తే బాగుంటుంది.
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు(పొట్టు లాంటిది)
బ్రెడ్ పొడి - 1 కప్పు
బంగాళ దుంప - 1 పెద్దది
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
టొమాటో కెచప్ - 1 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు(పొట్టు లాంటిది)
బ్రెడ్ పొడి - 1 కప్పు
బంగాళ దుంప - 1 పెద్దది
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
టొమాటో కెచప్ - 1 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
సోయా గ్రాన్యూల్స్ పొట్టు వేడినీటిలో వేసి 5 ని.ల తర్వాత నీళ్ళు వంపేసి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసి గట్టిగా పిండి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.బంగాళదుంప ఉడికించి ముద్దలా చేయాలి. ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు సన్నగా కోసి పెట్టుకోవాలి.కొత్తిమీర సన్నగా తరగాలి.వీటన్నింటిని,మిగిలిన పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.దీన్ని చిన్నచిన్న వడల్లాగా చేసి కాగుతున్న నూనెలో వేయించి తీయాలి.వీటిని రెడ్ చిల్లీ సాస్ తో కానీ.టొమాటో సాస్ తో కానీ తింటే రుచిగా ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)