రాజారావు గారికి పుస్తకాలన్నా,పుస్తకాలను చదవటంఅన్నా ఎంతో ఇష్టం.ఎక్కడకు వెళ్ళినా నచ్చిన పుస్తకాలను ధర ఎంతైనా కొని ఇంట్లో భద్రపరచటం,తీరిక సమయంలో వాటిని చదవటం అలవాటు.తన మనవడు,మనవరాలు చదవటం కోసం ఒక చిన్న గ్రంధాలయాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు.వాళ్ళకు తాతయ్య దగ్గరకు రావటం,తాతయ్య చెప్పే కథలు వినడం,చదవటం ఎంతో ఇష్టం.అంతగా పిల్లలకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలకు నచ్చేచక్కని బొమ్మలు,కార్టూన్లు,పజిళ్ళు,పిల్లలను ఆకట్టుకునే రంగుల్లో ఉండే నీతి కథల పుస్తకాలను తెచ్చి తన గ్రంధాలయంలో పెడుతూ ఉంటారు.వీటిల్లో బొమ్మలు వేసేవి,బొమ్మలకు రంగులు దిద్దేవి,పజిళ్ళు పూర్తి చేసేవి,బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు ఎక్కువ ఉంటాయి.దానికి తోడు రాజారావుగారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లలు రాగానే అవన్నీ పక్కన పెట్టి రకరకాల హావభావాలతో కథలు చదివి విడమరచి చెప్తూ,వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుతూ వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపటంతో పిల్లలకు తాతయ్యతో అనుబంధంతోపాటు,పుస్తకాలతో కూడా చక్కటి అనుబంధం ఏర్పడింది. అందుకని పిల్లలకు స్వంతంగా కథలు చెప్పడం,చదవటం,చదివింది అర్ధం చేసుకోవటం చిన్నతనం నుండే అలవాటయింది.ఎవరికయినా చిన్నప్పటినుండి తరగతి పుస్తకాలే కాక,విడి పుస్తకాలు కూడా చదవటం అలవాటు చేస్తే వారికి విజ్ఞానంతోపాటు,సామజిక అవగాహన,కష్టనష్టాలు ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం,పరిణతి ఉంటుంది.రకరకాల పుస్తకాలు చదవటం వల్ల భాషపై పట్టు వస్తుంది.
No comments:
Post a Comment