ఒకానొక ఊరిలో ఒక భజన సంఘం ఉంది.అందులో అందరూ ఆడవాళ్లే.అందరికీ పెద్ద దిక్కులా ఒక పెద్దావిడ ఉంది.ఆవిడకు బహుశా ఎనభై ఐదు నుండి తొంభై సంవత్సరాలు మధ్యలో ఉండవచ్చు.మిగతా అందరికన్నా ఎంతో ఉత్సాహంగా పాటను బట్టి తాళాలతో ఎంత వేగంగా భజన చేస్తుందంటే ఆవిడనే చూస్తూ ఉండిపోయే అంత చూడముచ్చటగా ఉంది.అక్కా రేపు టెడ్డీ పుట్టినరోజు ఇంట్లో భజన కార్యక్రమము పెట్టుకున్నాము.మా ఊరి వాళ్ళు భజన చాలా బాగా చేస్తారు నువ్వు తప్పకుండా రావాలి అని లాలిత్య చెప్పింది.వేరేపని ఉన్నా అంతగా చెల్లెలు చెప్పేసరికి లావణ్యకు వెళ్ళక తప్పింది కాదు.వెళ్ళడం వలన ఒక అద్భుతం చూడగలిగాను అనుకొంది లావణ్య.పెద్దావిడ ఉత్సాహానికి తగినట్లే మనిషి కూడా దబ్బపండు ఛాయతో ముఖాన రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టుతో ముడి చుట్టూ పువ్వులతో,చేతుల నిండా గాజులతో పాదాల నిండుగా పచ్చటి పసుపుతో సాక్షాత్తు ఆ అమ్మవారే దివి నుండి భువికి దిగి వచ్చి అక్కడ కుర్చున్నారా?అన్నట్లుగా అనిపించింది.అంత వయసున్నా ఆవిడ నాలుగు గంటలు కదలకుండా బాసింపట్టు వేసుకుని చాప మీద కూర్చుంది.ఈరోజుల్లో పట్టుమని పది నిమిషాలు కూడా కుర్చోలేని పరిస్థితి.తం తననం తన తాళంలో అన్నట్లు ఆమె తాళాలతో చేసే విధానం చూస్తుంటే ఏమీ రాని వాళ్ళు కూడా చెయ్యాలన్నంత ఉత్సాహంగా అనిపించింది.నిజంగా అత్యద్భుతం.
Thursday, 30 June 2016
పెదవులు మృదుత్వాన్ని కోల్పోతే.....
, కాలం మారినప్పుడు,చలికాలంలో పెదవులు మృదుత్వాన్ని కోల్పోతాయి.అటువంటప్పుడు రాత్రి నిద్రపోయేముందు రెండు చుక్కల పిల్లల నూనెలో ఒక చుక్క నిమ్మరసం అర చిటికెడు పంచదార పొడి కలిపి పెదవులపై మర్దన చేయాలి.ఉదయం నిద్రలేవగానే కడిగేయాలి.ఇలా చేయటం వల్ల పెదవులపై మృతచర్మం తొలగిపోయి మృదువుగా తయారవుతాయి.
Wednesday, 29 June 2016
వేయి పున్నములు
భీమశంకరం మాస్టారు,తమ్ముడు,చెల్లెలు కుటుంబాలు వేర్వేరుగా ఉన్నా అందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంలా ఉంటారు.వీళ్ళ ముగ్గురి పిల్లలు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాలలో ఉంటారు.ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా సంవత్సరానికి ఒకసారి ఒక పది రోజులు అందరూ ఒకచోట కలుసుకుని అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్ళి సరదాగా గడిపి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు.ఈసారి పిల్లలందరూ పెద్దవాళ్ళు ఆరుగురు తమ జీవితంలో వేయి పున్నములు(నెలకు ఒకటి,సంవత్సరానికి పన్నెండు చొప్పున ఎనభై ఐదు సంవత్సరాలు దాటినాయి కనుక వేయిపున్నములు అన్నమాట)చూసిన సందర్భంగా బంధువులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేద్దామనుకున్నారు.ఈ విషయం పెద్దలకు తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.ముందే సిద్దం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక పెద్ద కళ్యాణమండపం తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆరోజు ఉదయం పెద్దలు అందరినీ తీసుకెళ్ళి ఆశ్చర్య పరుద్దామని బంధువుల అందరి సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు.బంధువులు అందరూ కూడా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిదని వచ్చారు.పెద్దవాళ్ళందరి ముఖాల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం వెల్లివిరిసింది.పెద్దల సంతోషం చూచి పిల్లలు సంతృప్తి చెందారు.వచ్చిన వాళ్ళందరూ ఈ ఆలోచన బాగుంది అని పిల్లలను అభినందించారు.
మెరిసే మేని
బంగాళ దుంప తురిమి దానిలో కొద్దిగా ఓట్స్,కొంచెం పాలు.కొద్దిగా తేనె,కొద్దిగా పసుపు,కొద్దిగా ఆలివ్ నూనె వేసి అన్నీ బాగా కలిపి శరీరానికి,ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.ఎవరికి తగినట్లు వాళ్ళు సరిపడా కలుపుకోవాలి.ఇది ఏరకం చర్మానికైనా సరిపడుతుంది.ఇలా వీలైనప్పుడు తరచూ చేస్తుంటే మెరిసే మేని మన స్వంతమవుతుంది.
Monday, 27 June 2016
వ్యంగ్య సలహా
రుచిక చదువు పూర్తి చేసుకుని ఏదైనా స్వంతంగా వ్యాపారం ప్రారంభించి కొంత మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ఉంది.ఒకరోజు కళాశాల నుండి ఇంటికి వచ్చేటప్పటికి వరుసకు మేనమామ,ఆయన భార్య ఇంట్లో ఉన్నారు.మాటల మధ్యలో ఆయన అమ్మాయ్ చదువు అయిపోగానే ఉద్యోగమా?వ్యాపారమా? ఏమి చేద్దామనుకుంటున్నావు?అని దీర్ఘం తీశాడు.వ్యాపారము చేద్దామనే ఆలోచన ఉంది అనగానే ఏమి వ్యాపారం చేస్తావు?వ్యాపారం అంటే మాటలా?పిల్ల కాకులకు ఏమి తెలుసు?ఉండేలు దెబ్బ అన్నట్లు నామాట వింటే ఎవరైనా బాగుపడతారు లేకపోతే మట్టి కొట్టుకుపోతారు అన్నాడు.మరే అమ్మాయ్ ఆరోగ్యానికి సంబంధించి పసుపు,వేప కలిపి మధుమేహము,కాన్సరు రాకుండా ఉండేలాగా ఒక పొడి తయారు చేసి నీ పేరు పెట్టుకో!అని ఒక వ్యంగ్య సలహా ఇచ్చాడు.ఆయనకు భార్య అంటే దైవం కన్నా ఎక్కువ.నాకన్నా నాభార్యకు ఎక్కువ చిట్కాలు తెలుసు.ఆమె నీకు ఎంతకు ఎంత కలపాలో వివరంగా చెబుతుంది విను అన్నాడు.పెద్దవాళ్ళు కదా!అందుకని రుచిక ఏమీ మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది.ఇస్తే ఇచ్చాడు కానీ భలే!వ్యంగ్య సలహా ఇచ్చాడులే అనుకుంది రుచిక.ఈరోజుల్లో ఇటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు.ఎవరి దారిన వాళ్ళు వెళుతుంటే అడ్డు తగిలి మరీ వ్యంగ్య బాణాలు విసరడం ఎక్కువైపోయింది.
Sunday, 26 June 2016
సౌందర్య ఆరోగ్య రహస్యం
పై పై మెరుగులు ఎన్ని చేసినా ఉన్న అందాన్ని కొద్దిగా పెంచగలం కానీ పూర్తి స్థాయిలో అందంగా ఉండలేము.కొంతమందికి ఎంత డబ్బు,సకల సౌకర్యాలు ఉన్నా తృప్తి లేనట్లుగా,ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో ఎప్పుడూ చిటపటలాడుతూ తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో ముఖం ముడుచుకుని నలుగురితో కలవకుండా ఒంటరిగా గిరి గీసుకుని ఉంటారు.కొంతమంది డబ్బుతో నిమిత్తం లేకుండా ఉన్నంతలో ఎదుటివారికి సహాయపడుతూ తృప్తిగా,ముఖంపై చిరునవ్వు చెదరనీయoకుండా,ఆనందంగా ఉంటారు. సహజంగా,చక్కటి చిరునవ్వు ముఖంతో,మనసు నిండా సంతృప్తితో హాయిగా నవ్వగలిగినప్పుడు సహజ సౌందర్యం సంపూర్ణ ఆరోగ్యం వాటంతట అవే వస్తాయి.వీటిని మించిన సౌందర్య సాధనాలు మరెక్కడా దొరకవు.ఇదే సహజ సౌందర్య ఆరోగ్య రహస్యం.
Thursday, 23 June 2016
పొరపాటున కూడా........
పొరపాటున కూడా పరగడుపున నేరేడు పండ్లు తినకూడదు.ఎంత ఇష్టమైనా సరే ఏదైనా ఆహారం తిన్న తర్వాత మాత్రమే తినాలి.అదేవిధంగా సీతాఫలం తిన్నతర్వాత పాల పదార్ధాలు కానీ,పాలు,మంచినీళ్ళు కానీ తీసుకోకూడదు.
Wednesday, 22 June 2016
శతాధికోత్సవం
రాజీవి తండ్రికి నూరు సంవత్సరాలు నిండి నూట ఒకటో సంవత్సరం వచ్చింది.అయినా సంపూర్ణ ఆరోగ్యంతో తనపని తానే చేసుకుంటూ మునిమనుమలతో హాయిగా ఆడుకుంటూ సంతోషంగా ఉంటాడు.ఆయన పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు.మందుల నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఎరుగడు.ఇప్పటికీ ఇంటికి వచ్చిన వాళ్ళతో నవ్వుతూ,ఆప్యాయంగా మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తుంటాడు.నూరేళ్ళు నిండిన శతాధికులు మనలో అరుదుగా ఉంటారు కనుక బంధువులను అందరినీ పిలిచి తండ్రికి పుట్టినరోజు వేడుక చేసి విందు భోజనాలు ఏర్పాటు చేసి శతాధికోత్సవం ఘనంగా నిర్వహించింది.
సింగినాదం - జీలకర్ర
లలిత మేనమామకు తొంభై సంవత్సరాలు.ఊహ తెలిసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా తలస్నానం చేసి ఎరుగడు.ఎప్పుడైనా తలపై నుండి మామూలు నీళ్ళు పోసుకోవడమే కానీ కుంకుడుకాయ రసమో,షాంపునో వేసి తల రుద్దుకోడు.ఆఖరికి భార్య చనిపోయినప్పుడు కూడా ఎంత మంది చెప్పినా వినలేదు. సింగినాదం - జీలకర్ర నాకు అటువంటి పట్టింపులు ఏమీ ఉండవు మీరు ఊరుకోండి నా పద్ధతి ఇంతే అనేశాడు.ఇంతకీ అసలు రహస్యం ఏమిటంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ తలక పోస్తుంటే కుంకుడు రసం కళ్ళల్లో పడి కళ్ళు మంట పుట్టినాయని అందుకే చేయనని ముని మనుమడు అడగ్గా అడగ్గా ముసిముసిగా బోసి నోటితో నవ్వుతూ చెప్పాడు.
Tuesday, 21 June 2016
సిరి సంపదలు ఎన్ని ఉన్నా ........
మనకు సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా ఉంటేనే కదా! ఆనందంగా ఉండగలము.ఆరోగ్యం,చురుకుదనాన్ని ప్రసాదించే సరళమైన యోగాసనాలు,ప్రాణాయామం,ధ్యానం వల్ల శారీరకంగా,మానసికంగా దృఢంగా తయారవుతాము.ఎవరికి తగినవి వారు చేయగలిగినంతవరకు రోజూ కొంత సమయము కేటాయించి యోగాభ్యాసం చేయగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి.
Sunday, 19 June 2016
అభ్యంగన స్నానం
మన శరీరం ఇక్కడే ఉన్నా మన మనసు మాత్రం ఎక్కడికో వెళ్ళి పోతుంటుంది.చూపు ఒకచోట,ఆలోచన మరోచోట,కళ్ళ ముందు కనిపించేది ఒకటి,మనసులో ఉండేది ఇంకొకటి. దీనంతటికీ కారణం మన మనసే.అందుకే శరీరానికే కాదు మనసుకు కూడా అభ్యంగన స్నానం చేయాలి అంటే ధ్యానం తప్పని సరిగా చేయాలి. ధ్యానంతో వచ్చే మనోశక్తి మహా శక్తివంతమైనది.ధ్యానంలో ఏ ఆలోచనలు వచ్చినా మనసుకు పట్టించుకోకుండా గమనిస్తూ ఉంటే కాసేపటికి వాటంతట అవే పోతుంటాయి.ధ్యానం వల్ల ఏకాగ్రత పెరిగి క్రమశిక్షణతో కూడిన సానుకూల ధృక్పధం ఏర్పడి ఎటువంటి సమయంలోనైనా ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలము.దీనితో ప్రశాంతమైన జీవితంతో పాటు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకోగలము.
Saturday, 18 June 2016
లార్డ్ లపక్ దాస్
మన్వేష్ కుటుంబం మొత్తంలో అంటే అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళ కుటుంబాల కన్నాఎవరు అవునన్నా,కాదన్నాతను,తన కుటుంబం మాత్రమే గొప్ప అనుకుంటాడు.అలా అనుకుని సరిపెట్టుకోడు.మిగతావాళ్ళు నోరు మెదిపినా,ఇంట్లో నుండి కాలు కదిపినా తనకు మాట మాత్రం చెప్పలేదని,తనను వెంట పెట్టుకుని వెళ్లలేదని సతాయించుతాడు.తను మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండా తన కుటుంబంతో ఊళ్ళు తిరిగి వస్తుంటాడు.తనకో న్యాయం ఎదుటి వారికొక న్యాయం.తను చెప్పకుండా వెళ్ళినందుకు ఏ మాత్రం సిగ్గుపడకుండా వెన్ను విరుచుకుని మరీ గొప్పలు చెప్పుకుంటాడు.మన్వేష్ అన్న పిల్లలు,అక్క పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ ఇతని పద్ధతి నచ్చక ఈయన గారు ఏమైనా లార్డ్ లపక్ దాస్ అనుకుంటున్నాడా?ప్రతిదీ నాకు చెప్పాలి అంటాడు.ఆయన ఎవరికి చెప్పి చేస్తున్నాడని అలా మాట్లాడతాడు అని చిర్రుబుర్రులాడటం మొదలు పెట్టారు.కలికాలం బుద్దులంటే ఇవే మరి అని పెద్దవాళ్ళు విసుక్కుంటారు.అదండీ సంగతి.
Wednesday, 15 June 2016
హృదయాకారంతో మెరుపు
హృదయాకారంతో ఎర్రగా ఉన్న స్ట్రాబెర్రీలు చూడగానే భగవంతుడు సృష్టించిన ఆకృతి మనల్నిఆశ్చర్యపరిచినా వెంటనే కొనుక్కుని రుచి చూద్దామన్నంతగా అందరినీ ఆకర్షించదు.కానీ వింతగా కోమలి మాత్రం చిన్నప్పటినుండి ఇష్టంగా తినేది.సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అది కావాలి,ఇది కావాలి అంటూ ఎంత అల్లరి చేసేదయినా స్ట్రాబెర్రీలు ఒక పెట్టె కొనిస్తే బుద్ధిగా ఒకచోట కూర్చుని మొత్తం తినేసేది.పెద్దయిన కొద్దీ ఆ ఇష్టం పెరిగింది కానీ తగ్గలేదు.ఒకరోజు అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నీ పళ్ళు మా అందరికన్నా తెల్లగా తళతళ మెరుస్తున్నాయి ఏమిటి రహస్యం?అని అడిగింది మేనత్త.నేను చిన్నప్పటినుండి ఇష్టంగా తినే స్ట్రాబెర్రీలు అని చెప్పింది.అదెలాగంటే పండిన స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పళ్ళకు మెరుపు ఇస్తాయని చెప్పింది.
Monday, 13 June 2016
అందంగా కంటికి ఇంపుగా
మనకు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఒకటైన ఆల్బుకారా పండ్లు రోజూ 5.6 చొప్పున తినడం మంచిది.ఇవి సహజంగా దొరికే సమయంలో పండువి,మిగతా సమయంలో ఎండువి తింటే కీళ్లనొప్పుల సమస్య చాలావరకు తగ్గుతుంది.ఎముక సాంద్రత కూడా పెరుగుతుంది.ఇవి చూడటానికి ఎర్రగా అందంగా కంటికి ఇంపుగా ఉన్నా తినడానికి పుల్లగా,కొద్దిపాటి తియ్యదనంతో అంతగా రుచిగా ఉండవు కనుక అందరూ ఇష్టపడరు కానీ వీటివల్ల ఎన్నో లాభాలు.కంటి సమస్యలకు,గుండెకు కూడా ఎంతో మంచిది.వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి.జీర్ణశక్తి మెరుగుపడుతుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఇలా చెప్పుకుంటూపోతే మొత్తం మీద ఎన్నో ప్రయోజనాలు.అందుకే ఈపండ్లు తినడం వల్ల ఎముక పుష్టి పెరగటమే కాక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
Sunday, 12 June 2016
పేగులకు అతుక్కుని .....
చిత్తరంజన్ పేరుకు తగ్గట్లే చిత్రంగా మాట్లాడతాడు.ఒకరోజు ఉదయం అల్పాహారంలో దోసె,కొబ్బరి పచ్చడి తిని పక్క ఊరికి వెళ్ళి పని పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కడుపునొప్పి మొదలయిందట.వెళ్ళింది మొదలు ఉదయం నుండి సాయంత్రం వరకు తీరిక లేక మంచి నీళ్ళు సైతం తాగలేదట.కడుపునొప్పి ఎక్కువయ్యేసరికి ఆసుపత్రికి వెళ్తే మామూలు కడుపునొప్పి అనిచెప్పి సెలైన్ పెట్టి మందులు ఇచ్చి పంపించారట.ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం తిన్న కొబ్బరి పచ్చడిలో నీరు ఇంకిపోయి కొబ్బరి పేగులకు అతుక్కుని కడుపునొప్పి వచ్చిందని అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు.అసలే నోరెక్కువ ఎదురుగా నవ్వితే తిడతాడని విచిత్రం కాకపోతే కొబ్బరి పేగులకు అతుక్కోవడం ఏమిటి?కడుపునొప్పి రావడం ఏమిటి?అని చాటుకు వెళ్ళి ఒకరికొకరు చెప్పుకుని నవ్వుకోవడం మొదలుపెట్టారు.
ఏనుగు తలకాయంత
అనసూయ సునయనకు దూరపు బంధువు.ఇంటికి వచ్చిందంటే మాట్లాడింది మాట్లాడకుండా లొడలొడా మాట్లాడుతూనే ఉంటుంది.ఇంతే కాకుండా అప్పుడప్పుడు డబ్బాలో గులకరాళ్ళు వేసి గబగబా తిప్పితే వచ్చే శబ్దం లాగా పళ్ళుఅన్నీ బయట పెట్టి నవ్వుతూ ఉంటుంది.పాపం ఏమిటో?ఎదుటివాళ్ళు విన్నావినకపోయినా ఆపకుండా ఎన్ని గంటలైనా మాట్లాడుతుంది.ఆ వాగ్దాటికి అడ్డు వచ్చినా,ఎవరైనా చిన్న మాట ఎదురు మాట్లాడినా వెంటనే వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి బొటబొటా కన్నీళ్లు పెట్టేస్తుంది.తన ధోరణి తనది.మధ్యమధ్యలో అమ్మాయ్ మాట్లాడి మాట్లాడి తలకాయ బద్దలవుతుంది కానీ వేడివేడి కాఫీ పట్టుకురా!చల్లరితే నాకు అసలే నచ్చదు అంటూ హుకుం జారీ చేస్తూ ఉంటుంది.ఒక్కొక్కసారి విసుగు అనిపించినా అప్పుడప్పుడు ఆమె సుత్తి భరించక తప్పదు.మొన్నొకసారి బజారుకు వెళ్లిందట.ఎక్కడ చూసినా నిగనిగలాడుతూ నోరూరిస్తూ నేరేడుపళ్ళు కనిపిస్తే ఒక 1/4 కేజి 70 రూ.పెట్టి కొంటే 20 కాయలే వచ్చినాయని చెప్పింది.నేరేడు కాయలు కూడా అంత ఖరీదు పెట్టి కొనబుద్ది కాలేదు కానీ మనం మనకి తెలియకుండానే సంవత్సరానికి ఏనుగు తలకాయంత క్రిముల్నితింటామట.అందుకని తప్పనిసరిగా ఏడాదికి ఒకసారైనా నేరేడు పళ్ళు తినాలని అమ్మమ్మ చెప్పేది.అందుకే కొద్దిపాటి వగరుగా ఉన్నానచ్చకపోయినా చచ్చినట్లు తినాల్సిందే ఎవరైనా మీరు కూడా తెచ్చుకోండి అని వెళ్తూ వెళ్తూ ముక్తాయింపుగా చెప్పి వెళ్ళింది.
Thursday, 9 June 2016
మహోపకారి
ఈ రోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా తయారైంది.ఆలస్యంగా నిద్రపోవడం,ఆలస్యంగా నిద్ర లేవడం,చిరుతిళ్ళు ఎక్కువగా తినడం,కూరగాయల వాడకం తగ్గించి మాంసాహారం తినడం,వ్యాయామం సరిగా చేయకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల బరువు పెరగడం మొదలవుతుంది.పెరిగిన బరువును వదిలించుకోవడానికి ఎన్నోరకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.అసలు తిండి తినకపోవడము,అధికంగా తినడము రెండు తప్పే.ఆహారంలో మార్పులు చేస్తూ తేలికపాటి వ్యాయామంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ మహోపకారి.రోజు బార్లీ ఏదోఒక రూపంలో తీసుకుంటే బరువు తగ్గటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం,గుండె,ఊపిరితిత్తులు,మూత్రనాళ సమస్యలు రాకుండా ఉంటాయి.కొలెస్టరాల్ ని అదుపులో ఉంచుతుంది.మూడు వంతులు జొన్నలు,ఒక వంతు బార్లీ కలిపి పిండి పట్టించి దానితో రొట్టె చేసుకుని తింటే రెండు నెలల్లో ఎనిమిది కేజీల బరువు తగ్గటమే కాక మదుమేహం,కొలెస్టరాల్ సాధారణ స్థాయికి వచ్చిందని స్నేహితురాలి స్వీయ అనుభవం.ఓట్స్ కన్నా కూడా బార్లీ మిన్న.బార్లీ నీళ్ళు తాగటం ఒక్కటే కాక ఉడికించిన గింజలతో సలాడ్లు,రవ్వతో ఉప్మా,కిచిడీ,వడలు రకరకాలుగా చేసుకుని తినవచ్చు.
Tuesday, 7 June 2016
ప్రత్యామ్నాయం లేనిది
ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేనిది ఏదైనా ఉందంటే అది నిద్ర.నిద్ర విలాసం కాదు.మన అవసరాలన్నింటిలో అత్యవసరమైనది.నిద్రకు కేటాయించాల్సిన సమయాన్ని నిద్రకే కేటాయించాలి.దాన్నిఅధిగమించాలని ప్రయత్నిస్తే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని ఎన్నోఅనారోగ్యాల బారిన పడవలసి వస్తుంది.నిద్రలేమి ఎంతో ప్రాణాంతకమైనది.ఊబకాయం,మధుమేహం,పక్షవాతం,గుండెజబ్బులు,మనోరుగ్మతలు జ్ఞాపకశక్తి లోపించడం ఇంకా మరెన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అకాల వార్ధక్యం సూచించే ముడతలు కూడా నిద్రలేమితో వచ్చేవే.పని తర్వాతే నిద్ర అయినా అనుకోకుండా ఎవరి వయసుకు తగినట్లు వాళ్ళు నిద్రపోవాలి.నిద్ర సుఖమెరుగదు అన్నట్లు నిద్ర వచ్చినప్పుడు నిద్ర పోవాలి.జీవితం చాలా చిన్నది.నిద్రను త్యాగం చేసి సంపాదించి అనారోగ్యాల పాలైతే ఏమి ఉపయోగం?స్వార్ధం,ఈర్ష్య,అసూయ,ద్వేషాలకు తావివ్వకుండా బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా నలుగురికి చేతనైన సాయం చేస్తూ ఆనందంగా ఉండగలిగితే మంచి నిద్ర పడుతుంది.
Monday, 6 June 2016
చాదస్తం
సుప్రజ ఇల్లు మూడు అంతస్తుల భవనం.ఒకదానిలో ఇంటి యజమాని ఉంటూ మిగతా రెండు అద్దెకు ఇచ్చారు.ఒకదానిలో సుప్రజ కుటుంబం ఉంటుంది.కొత్తగా కట్టుకున్నారు కదా!అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలనే తాపత్రయంతో ఎప్పుడంటే అప్పుడు ఆయన ట్యూబు పెట్టి నీళ్ళు కొడుతుంటే ఆవిడ స్పాంజి పెట్టి గోడలు రుద్దుతుంది.ఇంటి లోపల,బయట,మెట్లు కూడా కడుగుతుంటారు.ఈ కార్యక్రమంలో భాగంగా బయట గోడలు కడుగుతుంటే కిటికీలో నుండి ఇంట్లోకి నీళ్ళు మెట్లు కడుగుతుంటే వరండాలోకి,చుట్టూ బాల్కనీల్లోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి.పనివాళ్ళు వచ్చేదాకా ఉంటే ఈలోపు ఎవరో ఒకళ్ళు జారి కింద పడటం ఖాయం.ఈరోజుల్లో పనివాళ్ళు మాత్రం ఎవరు చేస్తున్నారు?అందుకే చూస్తూ ఊరుకోలేక సుప్రజ తుడవటం మొదలుపెడితే రెండు గంటలు సమయం వృధా.ఒకపక్క తాగేందుకు గుక్కెడు నీళ్ళు లేక జనం ఇబ్బంది పడుతుంటే నీళ్ళు వృధా చెయ్యడమే కాక ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడుతున్నామనే ఆలోచనే లేదు.ఇద్దరికీ విపరీతమై చాదస్తం.భగవంతుడు ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళనే ఒనగూరుస్తాడు.లేకపోతే కలిసి ఉండలేరు కదా!వీళ్ళ చాదస్తానికి ఎదుటి వాళ్ళు బలి అవ్వాల్సిందే.అద్దె చూస్తే పాతిక వేలు.వీళ్ళ బాధ పడలేక ఆరునెలలకి,సంవత్సరానికి ఒక్కొక్కసారి నాలుగు నెలలకు ఇల్లు ఖాళీ చేస్తుంటారు.అయినా వీళ్ళ చాదస్తపు పనులు మానరు.
Sunday, 5 June 2016
మన వంతుగా......
వచ్చే పర్యావరణ దినోత్సవం నాటి కన్నా మన వంతుగా ప్రతి ఒక్కరు తలా రెండు మొక్కలు నాటి అవి పెరిగి పెద్దయి చెట్టుగా ఎదిగేదాకా బాధ్యత తీసుకుంటే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినట్లు అవుతుంది.పుట్టినరోజులు,పెళ్ళిళ్ళు,ప్రత్యేక సందర్భాలలో ఆత్మీయులకు స్టీలుడబ్బాలు,ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే బదులు ఒక మొక్కను ఇవ్వగలిగితే వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచి పెద్దచేస్తే మనం ఇచ్చిన మొక్క చెట్టుగా ఎదిగి తిరిగి మనకు ప్రాణవాయువును అందిస్తుంటే మనకు ఎంత సంతోషమో కదా!
Saturday, 4 June 2016
గాలిలో సైకిల్ తొక్కడం
కీళ్ళ నొప్పులు,ఎముకలు అరుగుదల,బరువు ఎక్కువగా ఉన్నవారు నడవడం వల్ల ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఎదుర్కోవలసి రావొచ్చు.అరిగిపోయిన,కీళ్ళు,ఎముకలు ఇంకా అరిగిపోయే ప్రమాదం ఉంది.బరువు ఎక్కువగా ఉన్నవారు నడవడం వల్ల మోకాళ్ళపై బరువు పడి మోకాళ్ళ నొప్పులు రావొచ్చు.వాతావరణ కాలుష్యంలో నడవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.అందుకే ఈమధ్య గాలిలో సైకిల్ తొక్కడం అనే అద్భుతమైన వ్యాయామాన్ని చేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు.అది ఎలా చెయ్యాలంటే వెల్లకిలా పడుకుని రెండు చేతుల్ని నడుము పక్కగా ఉంచి తర్వాత రెండు కాళ్ళు మడవాలి.ఆ తర్వాత సైకిల్ తొక్కుతున్నట్లుగా గాలిలో రెండు కాళ్ళు తిప్పాలి.మొదట్లో ఒక పదిసార్లు చేసి పోనుపోను 50 రౌండ్లు చేయొచ్చు.ఇది నడుము క్రింది భాగానికి మంచి వ్యాయామం.తర్వాత నిటారుగా నిలబడి రెండు చేతుల్ని భుజాలు కదిలేలా క్రమంగా 10 - 50 సార్లు గుండ్రంగా తిప్పితే శరీర పైభాగానికి వ్యాయామం అందుతుంది.అధిక బరువు, రక్తపోటు,మధుమేహం,కండరాల సమస్యలు ఉన్నవారికి ఇది చక్కటి వ్యాయామం.రోజూ ఒక్క పది ని.లలో పూర్తయ్యే ఈ వ్యాయామం చేయడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్నిపొందవచ్చు.
చిక్కదు దొరకదు
మీనాక్షి పిల్లల కోడి.చిన్నప్పటి నుండి పిల్లలను అసలు వదిలి ఉండేది కాదు.అన్నింటికీ పనివాళ్ళు ఉన్నాసరే తనే స్వయంగా వాళ్లకు ఇష్టమైనవి చేసి పెట్టి తనే స్వయంగా స్కూలుకు తీసుకెళ్ళి తిరిగి ఇంటికి తీసుకొచ్చేది.పాఠశాల నుండి వచ్చేటప్పటికి వాళ్లకు ఇష్టమైన చిరుతిళ్ళు చేసిపెట్టి వాళ్ళను కూర్చోపెట్టి చదివించేది.దానికి తగ్గట్లే పిల్లలు కూడా చక్కటి క్రమశిక్షణతో బాగా చదువుకునేవాళ్ళు.పిల్లల ఆటల సమయంలో కానీ,వాళ్ళు స్కూలుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరితోనైనా మాట్లాడేది.మీనాక్షికి ఇచ్చికాల బుచ్చమ్మ కబుర్లంటే అసలు ఇష్టం ఉండదు.పుస్తక పఠనం,సంగీతం ఇష్టం.ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి ఇష్టపడేది.పై చదువులకోసం పిల్లలు వేరే ప్రదేశానికి వెళ్ళక తప్పింది కాదు.వాళ్ళు శెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మీనాక్షి ఎవరికీ కనపడదు,మాట్లాడదు.అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళనీ,ఇష్టమైనవి చేసి పెట్టనీ,కబుర్లు చెప్పనీ ఏదైనా కానీ వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయించేది.దానికి తోడు మీనాక్షి భర్త కూడా తనకున్నఖాళీ సమయాన్ని కుటుంబంతో గడపడానికే ఇష్టపడేవాడు.అందుకే మీనాక్షి బంధువులు,స్నేహితులు పిల్లలు వచ్చారంటే మీనాక్షి ఎవరికీ చిక్కదు,దొరకదు అని ఆట పట్టిస్తుంటారు.ఎవరు ఏమనుకున్నా మీనాక్షి అసలు పట్టించుకోదు.తన పద్ధతి మార్చుకోదు.అదే మీనాక్షి ప్రత్యేకత.
Wednesday, 1 June 2016
కలత లేని గాఢ నిద్ర
ప్రతి మనిషికి ఏడు నుండి ఎనిమిది గంటల గాఢ నిద్ర తప్పనిసరి.కలత లేని గాఢ నిద్ర మిగతా పదహారు గంటలు చురుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.గాఢ నిద్ర తర్వాత ఎంతో ఉత్సాహంగా శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది.ఇంతే కాకుండా కళ్ళల్లో కాంతి,చర్మంలో నిగారింపు,ముఖంలో ప్రశాంతత కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది.నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం,చక్కటి సంగీతం,పుస్తక పఠనం,పావుగంట ధ్యానం,ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడటం వంటివి ఎవరి వీలుని బట్టి వాళ్ళ చేస్తుంటే చక్కటి నిద్ర మన వశం అవుతుంది.రోజూ ఒక అరగంట వ్యాయామం తప్పనిసరి.పడక గది లోపలకు వెళ్ళే ముందే ఏ సమస్యలు,ఆలోచనలు,భయాలు ఉన్నా వాటన్నింటినీ గుమ్మం బయటే వదిలేసి వెళ్ళాలి.ప్రశాంతమైన నిద్రతో మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)