Sunday, 16 October 2016

గులాబ్ జామ్ పెట్టలేదని......

                                                    సావిత్రమ్మ అక్క తెల్లగా,అందంగా,ఒళ్లంతా జుట్టుతో ముద్దుగా ఉన్న కుక్కపిల్లను తెచ్చి పెంచుకోమని చెల్లికి ఇచ్చింది.చిన్నప్పటి నుండి సావిత్రమ్మ అతి గారాబంగా పెంచడంతో ఒక పిల్ల మాదిరిగా అన్నీ అర్ధం చేసుకుని తిరిగి సైగలతో,అరుపులతో దాని భావాలను వ్యక్తపరుస్తుంటుంది.సావిత్రమ్మ రోజూ ఉద్యోగరీత్యా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటుంది.ఒకరోజు కోడలు సావిత్రమ్మ వెళ్ళిన తర్వాత గులాబ్ జామ్ చేసి దానికి పెట్టకుండా భర్తకు పెట్టి తను తినేసి కొన్ని వంటగదిలో వదిలేసింది.సాయంత్రం సావిత్రమ్మ రాగానే కుక్కపిల్ల చీర చెంగు పట్టుకుని వంటగదికి తీసుకెళ్ళి అరవటం మొదలు పెట్టింది.సావిత్రమ్మ కోడలుతో దానికి పెట్టకుండా ఏమి చేసుకుని తిన్నారు అమ్మాయ్?అని అడిగింది.మీ అబ్బాయి గులాబ్ జామ్ చెయ్యమని అడిగితే చేశాను అత్తయ్యా!అని నట్లు కొడుతూ చెప్పింది.చేసుకుంటే చేసుకున్నారు దానికి కూడా పెడితే తంటా ఉండేది కాదు కదా!ఇప్పుడు చూడు దొంగను పట్టించినట్లు నన్ను వంటగదికి తీసుకెళ్ళి మరీ గులాబ్ జామ్ పెట్టలేదని చెపుతుంది అంటూ మురిపెంగా సావిత్రమ్మ కుక్కపిల్లను భుజాన వేసుకుంది.

No comments:

Post a Comment