శారద,శ్రావణికి చరవాణి ద్వారా మధుర స్మృతులు అనే వీడియో పంపించింది.ఆ వీడియో చూడగానే శ్రావణికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక్కసారిగా తన మధురమైన బాల్యంలోకి వెళ్ళిపోయింది.కల్మషంలేని స్నేహం,ఆ ఆప్యాయతలు,అందరూ కలిసి కట్టుగా ఆటలు,అల్లరి పనులు,కోతి
కొమ్మచ్చి ఆటలు,తొక్కుడు బిళ్ళ,గోలీలాట,అందరూ బాదం చెట్ల దగ్గర చేరి పెద్ద కంకర రాయితో బాదం కాయలు కొట్టి పప్పులు తినటం,సీమ తుమ్మకాయలు కొయ్యటానికి పెద్ద వాసం తెచ్చి కొంకి కట్టి కష్టపడి కాయలు కోసి అందరూ పంచుకుని తినడం,తాటి కాయలు కోయించి ముంజెలు తినడం,రేగు కాయలు,ఇంట్లో నుండి ఎవరూ చూడకుండా కారం,ఉప్పు తెచ్చి పుల్లటి ఉసిరి కాయలు తినడం,చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగటం,చెట్లు ఎక్కగలవా?గుట్టలు ఎక్కగలవా?అంటూ పోటితో చెట్లు ఎక్కి చిటారు కొమ్మకు చేరడం,అరమగ్గిన,చిలక్కొట్టిన జామకాయలు ఎవరి దొడ్లో ఉంటే వాళ్ళింట్లో పిల్లలందరూ పొలోమంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కాయలు దులిపెయ్యడం,పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్లు నంగనాచి తుంగ బుర్రల్లా కూర్చోవడం,పుస్తకాలు పట్టుకుని తెగ చదివేస్తున్నట్లు నటించడం వాళ్లటు వెళ్ళగానే ఒకళ్ళను చూచి ఒకళ్ళు ముసిముసి నవ్వుకోవడం అన్నీఒకదాని వెనుక ఒకటి సినిమా రీలులా గిర్రున తిరిగాయి.ఒకటే బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి అంటూ స్నేహితురాలు శారద పంపిన వీడియో చూసి అవి ఎన్నటికీ మరిచిపోలేని మధుర స్మృతులు అని శ్రావణి సంతోషంగా ముఖం పెట్టి చరవాణి ద్వారా సమాచారం పంపింది.
No comments:
Post a Comment