స్నిగ్ధ కొత్తగా పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెట్టింది.ఇంటి చుట్టూ ఖాళీ స్థలం.దానిలో పద్దతిగా పెంచిన పూలమొక్కలు,కూరగాయలు,ఆకుకూరలు,ఇంకా రకరకాల పండ్ల మొక్కలు చూడటానికి ముచ్చటగా ఉంది.ఇంట్లో అడుగు పెట్టగానే హాయిగా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.రసాయన రహిత కూరగాయలతో చేసిన వంట కనుక భోజనం ఎంతో రుచిగా ఉంది.స్నిగ్ధ అత్తగారు ఒకరోజు స్నిగ్ధను పిలిచి అమ్మాయ్ పెరట్లో ఉన్న పిచ్చిక పొట్లకాయ కోసి తీసుకురా! అంటూ పిలిచారు.ఆవిడ అలా పిలవగానే స్నిగ్ధకు గుండెల్లో రాయి పడినట్లయింది.ఎందుకంటే చిన్నప్పటి నుండి స్నిగ్ధకు పొట్లకాయ వాసన పడదు.కూర కూడా తినదు.అసలు కాయను కూడా పట్టుకోదు.ఆ విషయం చెప్పలేక ముక్కు మూసుకుని పొట్లకాయ కోసి తెచ్చింది.కోడలు అవస్థ గమనించి నీకు ఇష్టం వుండదా!అని అడగ్గానే ముక్కు మూసుకునే తల అడ్డంగా తిప్పింది.ఆవిడ కోడల్నిప్రక్కన కూచోబెట్టుకుని ఓపిగ్గా అమ్మా!పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్త ప్రసరణ సాఫీగా జరగటమే కాక అనేక వ్యాధుల నివారిణి.వాంతులు,విరేచనాలు,జ్వరం వచ్చినప్పుడు,మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు,మూత్రాశయం పనితీరు మెరుగు పరుస్తుంది.గొంతులోని కఫం తగ్గించి శ్వాసకోశ పనితీరు బాగుండేలా చేస్తుందిఅని పొట్లకాయ గురించి కబుర్లు చెప్పి ఒకసారి రుచి చూడమని పొట్లకాయ,పెసరపప్పు కూర చేసి పెట్టారు.స్నిగ్ధ మొదట అయిష్టంగానే తిన్నాఎంతో రుచిగా వుండేసరికి మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుని తినేసింది.చెపితే తప్ప అది పొట్లకాయ కూర అని తెలియనంత రుచిగా ఉంది.దీనితో బరువు కూడా తగ్గటమే కాక వర్షాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధుల నివారిణి అని తెలియటంతో స్నిగ్ధకు పొట్లకాయ అంటే ఉన్న అయిష్టత తొలగిపోయింది.
No comments:
Post a Comment