Tuesday, 4 July 2017

నిజం నిష్టూరం

                                                                           నిత్య చిన్నప్పటి నుండి అబద్దాన్ని నిజం అనుకునేలా కథ అల్లి తన తోటి పిల్లలకు,స్నేహితులకు వినిపిస్తూ ఉండేది.కథలు అల్లడమే కాక ఇంట్లో వాళ్ళకు కూడా బాగోలేదని అందుకే బడికి రాలేదని చెప్పేది.నిజమే అనుకుని జాలిపడి నోటు పుస్తకాలు ఇంటికి ఇచ్చేవాళ్ళు.ఇప్పుడు మీ అమ్మకో,అమ్మమ్మకో బాగుందా?అని ఎవరైనా అడిగితే బడికి రావటం ఇష్టం లేక అలా ఊరికే చెప్పాను అనేది.ఓర్నీ!నిజమే అనుకుని నేను చదువుకోకుండా పుస్తకం నిత్య ఇంటికి తెసుకుని వెళ్తానంటే  అనవసరంగా ఇచ్చాను అని ఎవరికి వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకుని పుస్తకాలు ఇవ్వడం మానేశారు.అప్పటి నుండి బడిలోనే వ్రాసుకోవడం మొదలు పెట్టింది.నిత్య అబద్దాలకోరు అని తోటి పిల్లలు చెవులు కొరుక్కునే వాళ్ళు.ముప్పై సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉంటున్ననిత్య ఉన్నట్లుండి స్నేహితురాలి చిరునామా కనుక్కుని వచ్చింది.తనకు,కూతురికి ఆరోగ్యం బాగోలేదని,కొడుకు చెప్పినమాట వినటం లేదని తమ్ముళ్ళు తనతో మాట్లాడటం లేదు అంటూ ఏవేవో కబుర్లు చెప్పింది.చిన్నప్పుడు అసలే అబద్దాలకోరు ఇప్పుడు మారిందో లేదో? అలాగే నిజం చెబుతుందో,అబద్దం చెబుతుందో? నమ్మశక్యం కావటం లేదు అనుకుంది నిత్య స్నేహితురాలు.ఒకవేళ నిజమే అయినా పదిహేను ఏళ్ల వరకు నిత్య గురించి పూర్తిగా తెలుసు కనుక నమ్మలేని పరిస్థితి.తర్వాత ఇంకొక స్నేహితురాలి ద్వారా అది నిజమేనని తెలిసింది. స్నేహితురాలికి నిత్య పరిస్థితి తలచుకుంటే చాలా బాధ అనిపించింది.ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాళ్ళు నిజం చెప్పినా ఎవరూ నమ్మలేరు.అబద్దం చెప్పి తాత్కాలికంగా పబ్బం గడిచిపోయిందని సంతోషపడే కన్నా నిజం నిష్టూరంగా అనిపించినా వినటానికి కష్టంగా ఉన్నానిజమే మాట్లాడాలి.

No comments:

Post a Comment