Friday, 6 October 2017

లక్ష్మమ్మ బుర్రకథ

                                                       లక్ష్మమ్మకు అరవై తొమ్మిది సంవత్సరాలు. భర్తకు ప్రభుత్వోద్యోగం.ఇంటా బయటా వంధిమాగదుల్లా క్రింది ఉద్యోగులు వుండేవారు.వయసులో ఉండగా భర్త ఉద్యోగ రీత్యా పలురకాల ఊళ్ళు తిరిగేవారు.ప్రభుత్వోద్యోగం కనుక కార్యాలయంలోని ఉద్యోగులు ఇంటికి వచ్చి వంటతో సహా అన్ని పనులు చేసి భోజనం పళ్ళెంలో పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు.హాయిగా సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకుని మహారాణిలా ఠీవిగా,దర్పంగా కుర్చీలో కూర్చుని అలలను చూస్తూ కాలక్షేపం చేసేది.భర్త ఉద్యోగ విరమణ అనంతరం వయసురీత్యా తోడబుట్టిన వాళ్ళు,బంధువులు గుర్తొచ్చారు.లక్ష్మమ్మకు నా భర్త,నేను గొప్ప అనే అహంకారంతో ఎవరితోను సరిగా సత్సంభంధాలు లేవు.ఇప్పుడు తన అవసరానికి అందరినీ కలుపుకుందామని చూస్తుంటే ఎవరికీ వారే అందరూ అంటీ ముట్టనట్లే ఉంటున్నారు.చివరికి తమ్ముడు,మేనకోడలు జాలిపడి మా అందరితో కలిసి పుట్టిన ఊరిలోనే ఉండమని చెప్పగా తనకు ప్రత్యేకంగా ఇల్లు కావాలంది.మేనకోడలు తన స్వంత స్థలంలో ఉండటానికి చిన్న ఇల్లు కట్టించి ఇచ్చింది.వంటమనిషిని,ఇంట్లో పై పనులకు ఒక మనిషిని మాట్లాడింది.మధ్యాహ్నం మూడు గంటలైనా వంట మనిషి వచ్చి పళ్ళెంలో భోజనం పెట్టేవరకు లక్ష్మమ్మ దర్జాగా కుర్చీలో కూర్చునే వుంటుంది.భర్తకు పెట్టదు.తను తినదు.పనిమనిషి రాకపోతే హోటలు నుండి తెప్పిస్తుంది లేదంటే మేనకోడలు పెట్టాలి అంతే కానీ ఆమె వండదు.లక్ష్మమ్మ ఊరికి వచ్చిందని ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం తన చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తన జీవితంలో ఎంత దర్జాగా బ్రతికిందో ఒక్క ముక్క వదలకుండా ఏకరువు పెట్టి ఎదుటి వారి బుర్ర తినేస్తుంది. బుర్రకథ చెప్పినట్లు అందంగా మధ్య మధ్యలో పిట్ట కథల్లా జోకులు వేస్తూ అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని విరామం లేకుండా తన కథ వినిపిస్తుంటుంది.

No comments:

Post a Comment