ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట.ఇప్పుడు కొంత మందికి పెళ్ళంటే బొమ్మలాట అనడానికి ఇదొక ఉదాహరణ.బొమ్మలపెళ్ళి అనుకోవడానికి ఏమైనా చిన్న పిల్లలకి చేశారా?అంటే అదీ లేదు.ఇద్దరికీ పాతిక సంవత్సరాలు దాటి రెండు మూడేళ్ళు.ఇద్దరూ సాంకేతిక రంగంలో పట్టభద్రులు.నగరంలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.ఇద్దరి తల్లిదండ్రులు ఆకాశం అంత పందిరి,భూదేవి అంత అరుగు వేసి అన్నట్లు ఒకరికొకరు పోటాపోటీగా డబ్బు ఖర్చుపెట్టి ఘనంగాపెళ్ళి చేశారు.పెళ్ళయిన మూడోరోజే అమ్మాయి,అబ్బాయి మేము ఇద్దరమూ విడిపోతామని ఖరాఖండీగా చెప్పేశారు.పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా?కారణం ఏమిటి?అంటే కారణం వాళ్ళకే తెలియదు.కలిసి బ్రతకలేము అంతే.మరో మాటకు ఆస్కారము లేదు.పెళ్ళి కుదిరి మూడు నెలలు అయింది.ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా?అంటే దానికి సమాధానం లేదు.వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకో జంటకు పెళ్ళయి పదేళ్ళయింది.ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు.ఇద్దరికీ పిల్లలు కావాలి.కానీ వాళ్ళు కలిసి బ్రతలేమని తేలికగా తేల్చి చెప్పేశారు.వీళ్ళు బిడ్డల మానసిక పరిస్థితి,తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించటం లేదు.వాళ్ళు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవటం లేదు.విడిపోవడం కూడా బొమ్మలాటలో బొమ్మల పెళ్ళి చేసినంత తేలిగ్గా అయిపోయింది.
No comments:
Post a Comment