Sunday, 11 February 2018

ఓరుగత్తె

                                సుజన చిన్ననాటి స్నేహితురాలు సంజన విదేశాలలో స్థిరపడింది.స్వదేశానికి వచ్చి 40 సంవత్సరాల తర్వాత ఎలాగో సుజన చిరునామా తెలుసుకుని నేరుగా సుజన ఇంటికి వచ్చింది.ఆ సమయంలో సుజన తోటలో మొక్కలకు పాదులు చేయిస్తుంది.సుజనా,సుజనా అంటూ తోటలోకి వచ్చేసరికి ఆశ్చర్యపోయిన సుజన ఒక్క నిమిషం తర్వాత తేరుకుని సంజనను సాదరంగా ఆహ్వానించింది.వయసు పెరగటం తప్ప ఇద్దరూ చిన్నప్పటి మాదిరిగానే నువ్వు ఉన్నావు ఏమీ మారలేదు అని ఒకరికొకరు అనుకుని నవ్వుకున్నారు.సుజన ఇంటి లోపలకు వెళదామని అనుకుంటే సంజన తోటలో చల్లగా,హాయిగా ఉంది.ఇక్కడే కాసేపు కుర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది.అక్కడే ఇద్దరూ గడ్డి మీద చతికిలపడి చిన్ననాటి ముచ్చట్లు పాఠశాల,కళాశాలలోని స్నేహితుల కబుర్లు,చేసిన అల్లరి పనులు,ఆడిన ఆటలు అన్నీగుర్తుకు తెచ్చుకుని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేంత వరకు,పొట్ట చెక్కలయ్యేలాగా పడీ పడీ నవ్వుకున్నారు.ఈలోగా సమయం గంటలు నిమిషాల్లా గడిచి పోయింది.చీకటి పడేసరికి ఇంట్లోకి వెళ్లి కాస్త ఫలహారాదులు తీసుకున్న తర్వాత సంజనకు  ఇంట్లో ఎక్కడ చూసినా మొక్కలు అందంగా కనబడేసరికి ఇల్లంతా కలియతిరిగి మిద్దెతోటకు వెళ్ళింది.అక్కడ రకరాల,పువ్వులు,పండ్లు,కూరగాయలు చూచి ఆశ్చర్యపోయింది.సంజన ఎంతో సంతోషంగా చాలా బాగుంది అని మెచ్చుకుంటూనే చిన్నప్పుడు ఎక్కడ కొత్త మొక్క కనబడితే అక్కడ నుండి తెచ్చేదానివి అంటూ గుర్తుచేసుకుంది.ఆ అలవాటుని ఇప్పటివరకు కొనసాగించి నీ అభిరుచికి తగ్గట్లు తోటను తీర్చిదిద్ధావు అంటూ అభినందించింది.చిన్నప్పటి నుండి నువ్వు మా అందరికన్నా ఓరుగత్తెవి కదా!అంది.సుజనకు అర్ధం కానట్లు ముఖం పెట్టేసరికి ఓరుగత్తె అంటే వివరగత్తె.చిన్నప్పటి నుండి ఏ పనైనా వివరంగా చేసే వాళ్ళను ఆ విధంగా అంటారు అని చెప్పింది.నువ్వేమో కనిపించిన వాళ్ళకు పేర్లు పెట్టేదానివిగా!అంటూ ఒకరికొకరు గుర్తుచేసుని హాయిగా నవ్వుకున్నారు. 

1 comment: