అర్పిత వయసు సరిగ్గా ఆరేళ్ళు.ఆరింద లాగా ఎన్నో కబుర్లు అన్నీ తనకే తెలిసినట్లు చెబుతుంది.ఒకరోజు అమ్మమ్మలు,నానమ్మలు అందరూ కూర్చుని ఉండగా అర్పిత అమ్మ ఆశ్రిత కూడా వచ్చి కూర్చుంది.ఇంతలో పక్కింటి ఆమె రెండు ములక్కాయలు తెచ్చి ఆశ్రిత చేతిలో పెట్టింది.మాటల్లో అర్పితకు ములక్కాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది.బట్టలను అటు తిప్పి,ఇటు తిప్పి మెలేసి పిండినట్లుగా ములక్కాయ ముక్కను నోట్లోనే అటు తిప్పి ఇటు తిప్పి మెలేసి నమిలి నమిలి తింటుందని,కింద పడెయ్యవే! అని కోప్పడే వరకు నములుతూనే ఉంటుందని సరదాగా చెప్పింది.
Thursday, 28 March 2019
Tuesday, 26 March 2019
చిలకలేరు
ధన వత్సల ఇంట్లో పనిచేస్తుంది.ఏ విషయాన్నైనా సరదాగా అభినయిస్తూ నవ్వు తెప్పించే విధంగా చెబుతుంది.ధన కబుర్లు వత్సలకు మంచి కాలక్షేపం.ధన ఒకరోజు హడావిడిగా పనికి వస్తూనే అమ్మా!మా ఇంట్లో ఎలుకలు ఎవరినీ నిద్ర పోనీయటం లేదు.రాత్రి,పగలు అని కూడా తేడా లేకుండా వాటి ఇష్టం వచ్చినట్లు స్వైర విహారం చేస్తున్నాయి.మొన్న మధ్యాహ్నం నిద్రపోతుంటే మా అక్క బొటన వ్రేలు కొరికింది.నేను నిన్న రాత్రి నిద్రపోతుంటే నా చిలకలేరు కొరికేసింది అని చెప్పింది.ఏదో సలుపుతున్నట్లు ఉంది అని చూద్డును గందా!ఎలుక గీరింది అంది.చిలకలేరు కొరకటమేమిటి ధన?అంటే ఇదిగోనమ్మా! అంటూ చిటికెన వ్రేలు చూపించింది.ఓరి నీ దుంప తెగ!చిలకలేరు అంటే ఇంకా ఏంటో? అనుకున్నాను.చిటికెన వ్రేలుకు వచ్చిన తిప్పలు అన్న మాట అని వ్రేలును చూస్తే చిన్న చిన్నగా కొరికినట్లు గుర్తులు కనపడుతున్నాయి.వైద్యుని వద్దకు వెళ్లి ఒక ఇంజెక్షన్ చేయించుకో?అంటే అవసరం లేదమ్మా!పెసర్లు తింటే సరిపోద్ది అంది.ధన ఎవరు చెప్పినా వినే రకం కాదు.తనకు తోచింది చేసే రకం.అందుకే ఎవరి పద్దతులు వాళ్ళవి అనుకుని సరే! నీ ఇష్టం అంది వత్సల.
Sunday, 24 March 2019
ఈరకాడు,ఈరకట్టు
శిల్ప ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు వంట చేసి పెట్టడానికి నీలమ్మ వస్తుంటుంది.అనుకోకుండా ఒక రోజు స్నేహితులు రావడంతో శిల్ప నీలమ్మకు కబురుపెట్టింది.ఈరోజు మా ఈరకాడు.ఈరకట్టు వచ్చారమ్మా!వాళ్ళకు భోజనాలు పెడుతున్నాను.ఒక అరగంటలో వస్తాను అని చెప్పింది.వచ్చిన స్నేహితులకు కూడా అర్ధం కాలేదు.అందుకే నీలమ్మ రాగానే శిల్ప ఈరకాడు.ఈరకట్టు అంటే ఎవరు?అని అడిగింది.మా రవికి పిల్లనిచ్చిన తల్లిదండ్రులు.మేము వియ్యపురాలిని,వియ్యంకుడిని ఈరకట్టు,ఈరకాడు అంటాము అని చెప్పింది.మొదటిసారి వినడంతో ఎవరైనది అర్ధం కాలేదు అందుకే అడిగాను అని చెప్పింది శిల్ప.
Friday, 22 March 2019
అసలు విషయం
సత్యకు తానంటే అన్నకు చాలా ప్రేమ అని విపరీతమైన నమ్మకం.ఆ విషయంలో ఒకింత గర్వంగా ఉండేది.అన్నను ఎవరైనా ఒక మాట అంటే గయ్యాళి గంపలా పోట్లడేది.చెల్లి సంసారం తన సంసారంలా అనుకుని భాద్యతగా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశాడు.అనుకోకుండా సత్యకు ఉన్నట్లుండి జ్వరం వచ్చి ఆసుపత్రి పాలయింది.వైద్యులు ఒక పది రోజులు ఓపిక పడితే నయమవవచ్చు అని చెప్పారు.కానీ అన్న ఇప్పుడు చెల్లి కోలుకున్నా కానీ మునుపటిలా ఉండకపోవచ్చు.ఎప్పుడైనా పోవచ్చు కనుక ఇప్పుడే వైద్యం చెయ్యకుండా అలాగే ఉంచితే ఉన్నన్ని రోజులు ఉంటుంది అన్నాడట.వైద్యం చేసి ఉపయోగం లేకపోతే వదిలెయ్యవచ్చు.అంతేకానీ వైద్యం చెయ్యకుండా ప్రాణం ఎలా పోగొడతామన్నారు వైద్యులు.మా ఇష్టప్రకారం మేమే ఇంటికి తీసుకుని వెళ్తున్నామని సంతకం పెట్టి ఇంటికి తేచ్చేశాడు.చెల్లికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది.డబ్బు కూడా అన్న పెట్టక్కరలేదు.అయినా అన్న ఇలా చేశాడన్న విషయం చెల్లికి తెలియదు.అసలు విషయం తెలిస్తే చెల్లి మనసు ఎంత బాధ పడేదో?మామూలు రోజుల్లో ఎంత ప్రేమగా ఉన్నా చివరికి శాయశక్తులా బ్రతికించడానికి తాపత్రయ పడాలి.అంతేకానీ ఈ అన్న విచిత్ర ప్రవర్తన వైద్యులకు మింగుడు పడలేదు.బంధువులు తలోక మాట అంటారని బంధువులను ఎవరినీ రావొద్దని ఒక దండం పెట్టి అవసరమైనప్పుడు నేను కబురు పెడతానని చెప్పాడు.చెల్లి నన్ను అన్న ప్రేమగా దగ్గరే ఉండి చూచుకుంటున్నాడని అమాయకంగా తుది శ్వాస విడిచింది.
Thursday, 21 March 2019
చావు బ్రతుకుల మధ్య
శిశిరకు ఈమధ్య లేచిన దగ్గర నుండి అన్నీచావు వార్తలే వినిపిస్తున్నాయి.ఎప్పుడూ గలగల మాట్లాడుతూ మంచి అయినా,చెడు అయినా స్నేహితులు బంధువుల ఇళ్ళల్లో జరిగే ఏ ఒక్క కార్యక్రమనికి డుమ్మా కొట్టకుండా హాజరయ్యే పెదనాన్న కూతురు అక్కయ్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఆమెకు ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గింది జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు మూడేళ్ళ క్రితమే చెప్పారు.ఏ కొంచెం బాగోకపోయినా వైద్యుల దగ్గరకు వెంటనే పరుగెత్తుకు వెళుతుంది కానీ వాళ్ళిచ్చిన మందులు సరిగా వేసుకునేదికాదు.దానికి తోడు ఒకళ్ళకు నలుగురి వైద్యుల సలహాలు తీసుకునేది.ఏదీ పాటించకపోవడంతో ఊపిరి పీల్చుకోలేక కృత్రిమంగా గొట్టాల ద్వారా గాలి పీల్చుకుంటూ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.సమయానికి అన్న విదేశాల నుండి రావడంతో కొద్ది ఆలస్యంగా అయినా వైద్యం అందుబాటులోకి వచ్చింది.పిల్లలు విదేశాల నుండి పరుగెత్తుకుని తల్లి వద్దకు వచ్చారు.అన్న ఒదిన వైద్యులే అయినా సామాన్య మానవుల్లా ఆలోచిస్తున్నారు.చెల్లి అంటే ఉన్న అమితమైన ప్రేమ వల్ల వెంటిలేటర్ పై పెట్టొద్దని అనడంతో మీరు కాసేపు బయట కూర్చుంటే మా విధి మేము నిర్వర్తిస్తామని ఇక్కడి వైద్యులు అనడంతో చేసేది లేక మిన్నకున్నాడు.ముక్కుకు గొట్టాలు పెట్టి బోర్లేసి,తిప్పిపెడుతుంటే చూడలేక కళ్ళు,ముక్కు వాచిపోయి,ముఖం ఎర్రగా కందిపోయేలా ఏడ్చి ఏడ్చి,బుర్ర పని చెయ్యక ముక్కుకి గొట్టాలు తొలగించమంటాడు.అన్నకి అంత ప్రేమ ఉండడం చెల్లి అదృష్టమే కానీ వైద్యం జరగాలి కదా!అందరితో ఆప్యాయంగా మాట్లాడే ఆమె అకస్మాత్తుగా ఆ స్థితిలో ఉండేసరికి అందరికీ బాధగానే ఉంది.కోలుకోవచ్చు,కోలుకోకపోవచ్చు.ఎదురు చూడడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు.
Wednesday, 20 March 2019
ఇరుగు చల్లన,పొరుగు చల్లన
శ్రేయ మొన్నామధ్య తిరుపతి వెళ్ళినప్పుడు ఒక తెలిసినావిడ చాలారోజుల తర్వాత కనిపించి నన్ను గుర్తుపట్టారా?నాపేరు జ్ఞాని అని చెప్పింది.మాటల సందర్భంలో సంప్రదయాలు,పద్దతులు గురించి మాట్లాడుతూ మన అమ్మ,అమ్మమ్మలు మనకు నేర్పడంతో మనం పాటిస్తున్నాము.మనం మన పిల్లలకు చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తాయి అంది.మా అమ్మమ్మ చిన్నప్పుడు లైటు వేసేటప్పుడు ఇరుగు,చల్లన,పొరుగు చల్లన,అందరూ చల్లన,తర్వాత మనం చల్లన అనుకోవాలని చెప్పేది.ఇప్పటికీ నేను అదే పాటిస్తాను అని చెప్పింది.మీరు గమనించారా?ఎప్పుడూ కూడా మనం ఒక్కళ్ళమే బాగుండాలి అనే స్వార్ధం ఉన్న వాళ్ళ కన్నా మనం,మనతోపాటు అందరూ బాగుండాలి అనుకునే వాళ్ల జీవితం ఆనందమయంగా ఉంటుంది.నేను,నావాళ్ళు మాత్రమే అనుకున్నదానికి మనమందరమూ అనుకున్నదానికి చాలా తేడా ఉంటుంది.పూర్వం కష్టమైనా సంతోషమైనా అందరూ కలిసి పంచుకునే వాళ్ళు.ఈరోజుల్లో నేను అనే స్వార్ధం ఎక్కువగా కనిపిస్తున్నా మళ్ళీ పాతరోజులు రావాలని తప్పకుండా వస్తాయని అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆశిద్దాం అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.శ్రేయకి కూడా ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు.మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా!ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండొచ్చు అనుకుంది శ్రేయ.
ఏమని?
అమూల్యకు ఐదున్నర సంవత్సరాలు.చురుకైన పిల్ల.విదేశాలలో స్థిరపడినా అమూల్య తల్లి మాతృభాష పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో అమూల్యకు తెలుగు మాట్లాడడం చక్కగా నేర్పింది.దానితో అమూల్య ఎవరేమి అడిగినా తడుముకోకుండా తెలివిగా సమాధానం చెబుతుంటుంది.ఒక పెద్దావిడ అమూల్యతో కాసేపు ముచ్చట్లు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్తూ మీ నాన్నను అడిగానని చెప్పు అమ్మా!అంది.ఏమని అడిగావని చెప్పను?అని గుప్పెట మూసి బొటనవేలు పైకి పెట్టి చెయ్యి పైకి కిందికి ఊపుతూ అడుగుతుంటే చిన్నపిల్ల అభినయంతో అడిగేతీరుకు ముచ్చటపడి పెద్దావిడ పకపక నవ్వుతూ మీ పెద్దమ్మ నిన్ను అడిగింది నాన్నా!అని చెప్పు అంది.మళ్ళీ అదే ఏమని అడిగావని చెప్పాలో చెప్పు అంటూ వెంటపడితే ఎలా చెప్పాలో తెలియక తికమకపడి చేతిపై ఒక ముద్దు పెట్టి వెళ్లిపోయింది.
Wednesday, 13 March 2019
లడ్డూ పాప
అహల్య ఆరేళ్ళ పాప.విదేశాల నుండి శెలవులకు తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది.అనుకోకుండా చిన్న తాతయ్య మరణించాడు.రోజూ కాసేపు అహల్యను తీసుకుని వాళ్ళమ్మ బాబాయి ఇంటికి వెళ్లి పిన్నిదిగులు పడకుండా కబుర్లు చెప్పి వస్తుంది.ఒకరోజు అహల్యకు చిన్న అమ్మమ్మ లడ్డు ఇచ్చింది.అది నచ్చి రోజూ వాళ్ళింటికి వెళ్ళగానే లడ్డూ కావాలి,లడ్డు కావాలి అని మారాం చెయ్యడం మొదలెట్టింది.అలా అడగకూడదు అని అమ్మ ఎంత చెప్పినా వినడం లేదు.దీనికి ఎంత చెప్పినా వినడం లేదు.ఇంట్లో నుండి వచ్చేటప్పుడు అడగనని చెప్పి వస్తుంది.ఇక్కడకు రాగానే మొదలు పెడుతుంది.నాకే సిగ్గుగా ఉంటుంది అని అహల్య అమ్మ తల పట్టుకుంది.చిన్నపిల్ల కనుక అడిగింది.పెద్ద వాళ్ళు అడగరు కదా! అని లడ్డు పాప వచ్చింది రామ్మా!అంటూ రోజూ వెళ్ళగానే తాజా లడ్డూ తెచ్చి అహల్యకు ఇవ్వడం మొదలెట్టారు.
Friday, 8 March 2019
Sunday, 3 March 2019
మహా శివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీఈ అర్థరాత్రి నుండి రేపు తెల్లవారుఝాము వరకు కూడా భక్తులతో కిటకిట లాడిపోతాయి.దేవాలయ కమిటీలు కూడా జాగరణ చేసే భక్తుల కోసం వివిధ హోమాలు,లింగోద్భవ కాలంలో అభిషేకాలు,హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఉపవాసం,జాగరణ,అభిషేకాలు చేయలేకపోయినా ప్రశాంతంగా ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా,భక్తితో ఒక మారేడు దళం శివలింగంపై పెట్టి చెంబుడు నీళ్ళు పోసినా భక్తశులభుడైన ఆ శివ శంకరుని కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు ఆ భోళాశంకరుడు చల్లని దీవెనలు అందించాలని మనసారా కోరుకుంటూ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Friday, 1 March 2019
కష్టమొస్తే ..........
ఒక రోజు ప్రణతి వంటపనిలో నిమగ్నమై ఉండగా ఏమండీ! ఒకసారి బయటకు వస్తారా? అంటూ ఒక పెద్దావిడ పిలిచింది.ప్రణతి బయటకు వచ్చేసరికి వీధి గుమ్మం ముందు ఒక పెద్ద ముత్తైదువ నుదుట పెద్ద బొట్టుతో,రెండు చేతులకు నిండుగా బంగారు,మట్టి గాజులతో పట్టుచీర ధరించి నిలబడి ఉంది.ప్రణతిని చూడగానే మేము ప్రక్క వీధిలో ఉంటాము.రంగనాథస్వామికి అఖండ దీపారాధన చేసి శ్రీరంగం దర్శనానికి వస్తామని మొక్కుకున్నాము.అందుకోసం పరిచయం లేని ముగ్గురి వద్దకు బిక్షకు వెళ్ళాలి.మీరు అఖండ దీపారాధన కోసం ఆవు నెయ్యి,ఒక రవికె ముక్క ఇవ్వగలరా?అని అడిగింది.ప్రణతి సరే ఇస్తానని చెప్పి లోపలికి రమ్మంది.ఇంతలో పెద్దావిడ నాలుగు మంచి మాటలు చెప్తూ అమ్మా!ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా పక్కింటావిడకో,తోటి కోడలికో చెప్పుకోకూడదు.తులసి కోట దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చుని తులశమ్మకు మనస్పూర్తిగా నీ మనసులో ఉన్న బాధను చెప్పుకో!కాసేపటికి మనసు తేలికై నీ మనసులోని బాధ దానంతట అదే తగ్గిపోతుంది అని మా అమ్మ చెప్పేది అని చెప్పింది.పెదవి దాటితే పేటలు దాటతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు.ఎంతో అనుభవపూర్వకంగా చెప్పినట్లే ఈమె కూడా ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోగా ప్రశాంతత ఉండదని కష్టమొస్తే తులశమ్మకు చెప్పుకోమని మంచిమాట చెప్పింది అనుకుంది ప్రణతి.
Subscribe to:
Posts (Atom)