ఒక రోజు ప్రణతి వంటపనిలో నిమగ్నమై ఉండగా ఏమండీ! ఒకసారి బయటకు వస్తారా? అంటూ ఒక పెద్దావిడ పిలిచింది.ప్రణతి బయటకు వచ్చేసరికి వీధి గుమ్మం ముందు ఒక పెద్ద ముత్తైదువ నుదుట పెద్ద బొట్టుతో,రెండు చేతులకు నిండుగా బంగారు,మట్టి గాజులతో పట్టుచీర ధరించి నిలబడి ఉంది.ప్రణతిని చూడగానే మేము ప్రక్క వీధిలో ఉంటాము.రంగనాథస్వామికి అఖండ దీపారాధన చేసి శ్రీరంగం దర్శనానికి వస్తామని మొక్కుకున్నాము.అందుకోసం పరిచయం లేని ముగ్గురి వద్దకు బిక్షకు వెళ్ళాలి.మీరు అఖండ దీపారాధన కోసం ఆవు నెయ్యి,ఒక రవికె ముక్క ఇవ్వగలరా?అని అడిగింది.ప్రణతి సరే ఇస్తానని చెప్పి లోపలికి రమ్మంది.ఇంతలో పెద్దావిడ నాలుగు మంచి మాటలు చెప్తూ అమ్మా!ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా పక్కింటావిడకో,తోటి కోడలికో చెప్పుకోకూడదు.తులసి కోట దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చుని తులశమ్మకు మనస్పూర్తిగా నీ మనసులో ఉన్న బాధను చెప్పుకో!కాసేపటికి మనసు తేలికై నీ మనసులోని బాధ దానంతట అదే తగ్గిపోతుంది అని మా అమ్మ చెప్పేది అని చెప్పింది.పెదవి దాటితే పేటలు దాటతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు.ఎంతో అనుభవపూర్వకంగా చెప్పినట్లే ఈమె కూడా ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోగా ప్రశాంతత ఉండదని కష్టమొస్తే తులశమ్మకు చెప్పుకోమని మంచిమాట చెప్పింది అనుకుంది ప్రణతి.
No comments:
Post a Comment