శిశిరకు ఈమధ్య లేచిన దగ్గర నుండి అన్నీచావు వార్తలే వినిపిస్తున్నాయి.ఎప్పుడూ గలగల మాట్లాడుతూ మంచి అయినా,చెడు అయినా స్నేహితులు బంధువుల ఇళ్ళల్లో జరిగే ఏ ఒక్క కార్యక్రమనికి డుమ్మా కొట్టకుండా హాజరయ్యే పెదనాన్న కూతురు అక్కయ్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఆమెకు ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గింది జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు మూడేళ్ళ క్రితమే చెప్పారు.ఏ కొంచెం బాగోకపోయినా వైద్యుల దగ్గరకు వెంటనే పరుగెత్తుకు వెళుతుంది కానీ వాళ్ళిచ్చిన మందులు సరిగా వేసుకునేదికాదు.దానికి తోడు ఒకళ్ళకు నలుగురి వైద్యుల సలహాలు తీసుకునేది.ఏదీ పాటించకపోవడంతో ఊపిరి పీల్చుకోలేక కృత్రిమంగా గొట్టాల ద్వారా గాలి పీల్చుకుంటూ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.సమయానికి అన్న విదేశాల నుండి రావడంతో కొద్ది ఆలస్యంగా అయినా వైద్యం అందుబాటులోకి వచ్చింది.పిల్లలు విదేశాల నుండి పరుగెత్తుకుని తల్లి వద్దకు వచ్చారు.అన్న ఒదిన వైద్యులే అయినా సామాన్య మానవుల్లా ఆలోచిస్తున్నారు.చెల్లి అంటే ఉన్న అమితమైన ప్రేమ వల్ల వెంటిలేటర్ పై పెట్టొద్దని అనడంతో మీరు కాసేపు బయట కూర్చుంటే మా విధి మేము నిర్వర్తిస్తామని ఇక్కడి వైద్యులు అనడంతో చేసేది లేక మిన్నకున్నాడు.ముక్కుకు గొట్టాలు పెట్టి బోర్లేసి,తిప్పిపెడుతుంటే చూడలేక కళ్ళు,ముక్కు వాచిపోయి,ముఖం ఎర్రగా కందిపోయేలా ఏడ్చి ఏడ్చి,బుర్ర పని చెయ్యక ముక్కుకి గొట్టాలు తొలగించమంటాడు.అన్నకి అంత ప్రేమ ఉండడం చెల్లి అదృష్టమే కానీ వైద్యం జరగాలి కదా!అందరితో ఆప్యాయంగా మాట్లాడే ఆమె అకస్మాత్తుగా ఆ స్థితిలో ఉండేసరికి అందరికీ బాధగానే ఉంది.కోలుకోవచ్చు,కోలుకోకపోవచ్చు.ఎదురు చూడడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు.
No comments:
Post a Comment