Thursday, 26 September 2019

నిత్య ఆరోగ్యవంతులు

                                                                           పూర్వం మన పెద్దలు ప్రతి రోజు పగలు,రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగు అన్నంతోపాటు  (పెరుగు వాతం కనుక కొద్దిగా నీళ్లు పోసుకుని తినాలి అని పెద్దల ఉవాచ) కానీ,మజ్జిగ అన్నంతోపాటు కానీ ఒక పచ్చి ఉల్లిపాయ తప్పనిసరిగా ఆరోగ్యానికి మంచిదని తినేవాళ్ళు.పిల్లలకు కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి పెరుగు అన్నం పెట్టేవాళ్ళు.ఇలా రోజూ రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ తినేవాళ్ళు త్వరగా రోగాలబారిన పడరని చెప్పేవాళ్ళు.ఇప్పటి పరిశోదకులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.అన్ని రకాల తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,గింజలు మనం తింటూ పిల్లలకు కూడా అలవాటు చెయ్యాలి.నిత్యం ఒక అరగంట పాటు నడక,కాస్త తేలికపాటి వ్యాయామం చేస్తూ,మనసారా హాయిగా నవ్వుతూ,నవ్విస్తూ ప్రశాంతంగా ఉండాలి.కంటి నిండా సరిపడా నిద్ర పోవాలి.మన పెద్దలు ఇంతకు ముందు పెందలాడే భోజనం చేసి,పెందలాడే నిద్ర పోయి తెల్లవారుఝమునే నిద్ర లేచేవాళ్ళు.అదే అప్పటి వాళ్ళ ఆరోగ్య రహస్యం.ఉప్పు తగ్గించి నియమిత ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకుంటే నలభైలో కూడా ముప్పైలా కనపడుతూ నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటారు.

Tuesday, 24 September 2019

ఇంటి చుట్టూ కంగారూలు

                                                             శైలజ కూతురు ఫ్రెయ ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నామని తల్లిదండ్రులను రమ్మని ఆహ్వానిస్తే వెళ్లారు.ఇల్లు నగరానికి దూరంగా ఒక పల్లెటూరిలో కొనుక్కోవడంతో ప్రశాంతంగా ఉంది.శైలజ ఉదయాన్నే నిద్ర లేచేటప్పటికి ఇంటి చుట్టూ కంగారూలు కూర్చుని ఉన్నాయి.శైలజకు అంత దగ్గరగా వాటిని చూడడంతో భలే ముచ్ఛేటేసింది.ఎంతో సంతోషంగా తలుపు తీసుకుని దగ్గరగా చూద్దామని వెళ్ళేసరికి పరుగెత్తి ఒక పది అడుగుల దూరంలో కూర్చున్నాయి.మళ్ళీ  రెండు అడుగులు వేసి చూద్దామని శైలజ ముందుకెళ్ళేసరికి మళ్ళీ అదే విధంగా కొద్దీ దూరం వెళ్ళి చూస్తూకూర్చున్నాయి.అమ్మా!కంగారూల పొట్ట దగ్గర ఉన్న సంచిలో పిల్లలు ఉంటే మాత్రం దగ్గరకు వెళ్ళకు.వాటి పిల్లలకు హాని తలపెడతారేమో అని తల్లి కంగారూలు కంగారుపడి ఎదురు తిరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త్తగా ఉండాలి అని చెప్పింది ఫ్రెయ.శైలజకు ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులు కంగారులతో కాలక్షేపం సరిపోయింది.

Saturday, 14 September 2019

ఇవ్వాళ చస్తే రేపటికి రెండు

                                                                             శ్రీనిష్ పదవ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోవడంతో  తండ్రి ప్రభుత్వోద్యోగం శ్రీనిష్ కి వచ్చింది.చిన్న వయసులోనే చేతి నిండా  డబ్బు అందుబాటులో ఉండడంతో మద్యం అలవాటయింది.ఇంట్లో వాళ్ళు మానేయమని గొడవ చేసినప్పుడు మొదట్లో నాలుగు రోజులు మానేయడం మళ్ళీ మొదలు పెట్టడం చేస్తుండేవాడు.తర్వాత తర్వాత నాకు పదేపదే చెప్పొద్దు.నేను మానలేనుఇవ్వాళ చస్తే రేపటికి రెండు అంతే అనేవాడు.దానితో కాలేయం,అన్ని అవయవాలు చెడిపోయి అర్ధంతరంగా నలభై ఎనిమిదేళ్లకే చనిపోయాడు.చిన్న వయసులోనే పెళ్ళి చేయడంతో పిల్లలు పెద్దవాళ్ళయి సాంకేతిక విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఇల్లు కొనుక్కున్నారు.పిల్లలు పెళ్లి చేద్దామనుకునేలోపు ఇలా జరిగింది.మిగతా అన్ని విషయాల్లో పద్దతిగా వున్నా మద్యం విషయంలో చెవిలో జోరీగల్లా తల్లి,భార్య చెప్పినా వినకుండా చెడ్డ అలవాటుకు బానిసై చేతులారా జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా ఇంట్లో అందరికీ దుఃఖాన్ని మిగిల్చాడు.జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాల్సిన సమయంలో అకస్మాత్తుగా రెండు రోజుల్లో అన్నీ ముగిసిపోవడంతో బతికున్నన్నాళ్లు ఇవాళ చస్తే రేపటికి రెండు అనేవాడు.అదే విధంగా జరిగింది అంటూ ఇంట్లో అందరూ తల్లడిల్లిపోతున్నారు. 

Tuesday, 3 September 2019

ఈరోజునే ఆనందంగా ......

                                                                  నిన్నటి గడిచి పోయిన గతం కన్నా,రేపు ఏమి జరుగుతుందో తెలియని భవిష్యత్తు కన్నా, గడువుతున్న ఈరోజే ఎంతో విలువైనది.అందుకే ఎంతో విలువైన ఈరోజునే మంచి పనులు చేస్తూ మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచుతూ హాయిగా గడిపేద్దాం.

Sunday, 1 September 2019

చవితి తిథి

                                                                   మనలో చాలామందికి వినాయక చవితి నాడు తెల్లవారుఝామునే లేచి స్వామికి ఇష్టమైన పిండి వంటలు చేసుకుని పూజ ముగిసేవరకు ఏమీ తినకుండా భక్తితో ప్రశాంతంగా ఏడు గంటల నుండి తొమ్మిది  గంటల లోపే పూజ చేసుకునే అలవాటు.కానీ ఈసారి చవితి తిథి ఉదయం తొమ్మి ఇరవై రెండు నుండి వస్తుంది కనుక ఇంట్లో పూజ చేసుకునే వారు తొమ్మిది ఇరవై ఐదు నుండి పన్నెండు గంటల లోపు చేసుకోవడం మంచిదని పండితుల సలహా ఇస్తున్నారు.పెద్దల మాట వింటే సరేసరి.లేదంటే మన ఇష్టం.

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                విఘ్నాలకు అధిపతి వినాయకుడు.శ్రీరస్తు,శుభమస్తు,అవిఘ్నమస్తు అనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ అంటూ ఏపని మొదలుపెట్టినా ముందుగా వినాయకుని భక్తితో పూజించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాము.అంతటి మహిమాన్వితుడైనట్టి వినాయకుడు పెద్దలకు,పిన్నలకు,మీకు,మాకు,మనందరికీ ఎదుటివారినుండి నీలాపనిందలు కలుగకుండా చల్లగా కాపాడాలని,అందరికీ ఆయురారోగ్యాలను,మానసిక ప్రశాంతతను,అష్టైశ్వర్యాలను,విద్యార్థులందరికీ వారు కోరుకున్న విద్యను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,నా బ్లాగ్ వీక్షకులకు నాతోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్లలు తెలియచేస్తున్నాను.