Tuesday, 25 August 2020

హడావిడిగత్తె

                                                       మాన్సి ఏ పని చేసినా త్వరత్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో హడావిడి పడుతూ ఉంటుంది.ఎప్పుడూ సక్రమంగానే చేస్తుంది.ఒక్కొక్కసారి ఆ హడావిడిలో వంట చేసేటప్పుడు ఒకటి చెయ్యబోతే ఇంకొకటి అవుతుంది.మళ్ళీ దాన్ని వృధా కాకుండా ఏదో ఒకటి చేసి ఆ పదార్ధాన్ని రుచిగా తయారు చేస్తుంది.అది వేరే విషయం అనుకోండి.ఈరోజు కూడా అలాగే చేసింది.ముడి గోధుమ రవ్వ ఉప్మా  చేద్దామని మొదలు పెట్టింది.అన్నీ సిద్దం చేసుకుని పొయ్యి మీద బాండీ పెట్టి తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చి మిర్చి,అల్లం ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి మూతపెట్టి రవ్వ తీసుకునే  లోపు ఎవరో పిలిస్తే వెళ్ళింది.మళ్ళీ వచ్చి నీళ్ళు పోసి మూతపెట్టింది.నీళ్ళు మరుగుతుండగా గ్యాస్ బండ వచ్చింది.ఈ క్రమంలో సరుకుల సంచిలో నుండి ఒక పొట్లం తీసి ఒక కప్పు నీళ్ళల్లో పోసి వేరే పనిమీద వెళ్ళింది వచ్చేసరికి మెత్తగా ఉడక వలసింది  పోయి ఎలా పోసినది అలాగే  నీళ్ళల్లో మరుగుతుంది.హడావిడిలో నీళ్ళు ఎక్కువ పోశానేమో అనుకుని బొంబాయి రవ్వ కాస్త పోసింది.అయినా గట్టిపడలేదు.అప్పుడు రెండు గుప్పెళ్ళు అటుకులు కడిగి పోసింది.ఇంకా పలుచగానే ఉండడంతో మంట పెద్దది చేసి కాస్త దగ్గరపడిన తర్వాత పొయ్యి కట్టేసింది. భర్తకు పెట్టింది.అయన నోట్లో పెట్టుకుని ఇదేమిటి గట్టిగా నమలవలసి వస్తుంది.నువ్వుల రుచిగా ఉంది.నువ్వుల ఉప్మా చేసావా ఏమిటి ? అనగానే మాన్సి తెల్లబోయి గోధుమ రవ్వ వేసాను కదా! అని రుచి చూసింది.అది నిజంగానే నువ్వుల ఉప్మా.రుచిగానే ఉంది కానీ నువ్వులు వేడి అని ఎవరూ ఉప్మా చేసుకోరు.సరేలే వేరే పదార్ధం చేసే  సమయం లేదు కనుక ఈరోజుకి తినండి మజ్జిగ తాగితే వేడి తగ్గిపోతుందని ఇంట్లో వాళ్ళకు సర్ది చెప్పింది మాన్సి.రుచి బాగుందంటూ ఒకరు,మనసులో తిట్టుకుంటూ ఒకరు తిన్నారు.పని మనిషి అయితే మీరు ఏమి చేసినా బాగుంటుంది అమ్మా అంటూ  లొట్టలేస్తూ తినేసింది.ఏ మాటకామాటే కానీ నిజంగానే రుచిగా ఉంది.అనుకున్నదొకటి అయినది ఒకటి అన్నట్లు గోధుమ రవ్వ ఉప్మా బదులు నువ్వుల ఉప్మా అయింది.మాన్సి  కూడా నువ్వుల లడ్డు చెయ్యడమే కానీ  ఉప్మా ఎప్పుడూ చెయ్యలేదు.అందుకే చిన్నప్పుడు మాన్సి  ని స్నేహితులు హడావిడిగత్తె అని ఆట పట్టించే వాళ్ళు.  పై సంఘటన తలచుకుని మాన్సి తను చేసిన పనికి తనే గుర్తొచ్చినప్పుడల్లా  రోజంతా నవ్వుకుంటూనే ఉంది.                                    

No comments:

Post a Comment