ఒక కిలో తాజా కాకరకాయలు తీసుకుని ఉప్పు,పసుపు వేసి శుభ్రంగా కడిగి చక్రాల్లా ముక్కలు కోసి గల గలలాడేలా ఎండలో పెట్టాలి.నేను ఒక 8 గంటలు డీహైడ్రేటర్(పండ్లు,ఆకుకూరలు,కూరగాయల లోని తేమ లాగేసి ఎండి పోయేలా చేసే పరికరం) లో పెట్టాను.ఏ కూరగాయ పెట్టినా ఒక కిలోకి 200 గ్రా. లు వస్తాయి.
తయారీ విధానం :
ఎండిన కాకరకాయ ముక్కలు - 200 గ్రా.
ఎండు మిర్చి - 15
నువ్వులు - 1 పెద్ద చెంచా
మినప గుళ్ళు - 1 పెద్ద చెంచా
పచ్చి శనగ పప్పు - 1 పెద్ద చెంచా
ధనియాలు - ఒక పెద్ద చెంచా
జీరా - ఒక పెద్ద చెంచా
మెంతులు - ఒక 1/4 చెంచా
వెల్లుల్లి - 1 పెద్దది
ఉప్పు - రుచికి సరిపడా
పొయ్యి వెలిగించి మందపాటి బాణాలి పెట్టి వెల్లుల్లి తప్ప అన్నీ నూనె లేకుండా తక్కువ మంటపై రంగు వచ్చే వరకు విడివిడిగా వేయించుకోవాలి.కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పప్పులు,ధనియాలు,జీరా,మెంతులు వేసి పొడి చేసిన తర్వాత ఎండు మిర్చి వేసి పొడి చేసిన తర్వాత నువ్వులు వెయ్యాలి.ఈ పొడిని ఒక పళ్ళెంలో వేసి ప్రక్కన పెట్టుకోవాలి.కాకరకాయ ముక్కలు,ఉప్పు వేసి పొడి చేసి వెల్లుల్లి రెబ్బలు వెయ్యాలి.దీనిలోప్రక్కన పెట్టుకున్న పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ వెయ్యాలి.అంతే మంచి సువాసనతో నోరూరించే నూనె,తీపి లేకుండా చేసే కాకరకాయ పొడి తయారయినట్లే.దీనిని వేడి వేడి అన్నంలో కానీ,ఇడ్లి,దోసె పై కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.అసలు చేదు ఉండదు.ఇది నేను తయారు చేసే పద్ధతి.నువ్వుల బదులు పల్లీలు లేదా రెండు కూడా వేసుకోవచ్చు.ఎవరికి నచ్చిన రీతిలో వారు చేసుకోవచ్చు.ఒకసారి ప్రయత్నించి చూడండి.
గమనిక :చింత పండు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.నేను వెయ్యలేదు.అయినా చేదు లేకుండా చాలా బాగుంది.కాకరకాయ కారం రుచికి రుచి ఆరోగ్యానికి ఎంతో మంచిది.రోజూ ఒక చెంచా అయినా తినడం మంచిది.
No comments:
Post a Comment